[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్ధా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
“గుగ్గుగ్గుగ్గు గుడిసుంది. మమ్మమ్మమ్మం మంచముంది.” అంటూ హుషారుగా పాట పాడుకుంటూ ఆఫీస్ లోకి అడుగు పెట్టిన సత్యం అక్కడి దృశ్యం చూసి కంగుతిన్నాడు. ‘నిద్రలో ఉన్నానా? కల కంటున్నానా?’ అని గిచ్చుకొని ఆఫీస్ లోనే ఉన్నాను అని నిర్ధారించుకున్నాడు. మూడు రోజుల సెలవు తరువాత ఆఫీస్‌కు వచ్చిన సత్యంకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు.
‘ఆంధ్ర దివిటి’ పత్రికలో సత్యం జర్నలిస్ట్. ఆ రోజు ఆఫీస్ వాతావరణం ఆంధ్ర దివిటి కార్యాలయంలా కాకుండా ఒక మఠంలా ఉంది.
సత్యం ఆఫీస్ లోకి అడుగు పెట్టగానే అద్దాల క్యాబిన్ నుంచి ఎడిటర్ ఏం చేస్తున్నాడో చూడడం అలవాటు. ఎడిటర్ దీక్షిత్ నేలపై కూర్చుని కనిపించారు. అందరినీ వేపుకు తినే దీక్షిత్ అలా నేలపై కూర్చొని ఉండడం సత్యంకు తెగ నచ్చేసింది. “ఇంతకాలం సంస్థను దోచుకొని తిన్నాం” అని పశ్చాత్తాపంతో దీక్షిత్ యాజమాన్యం ముందు అలా నేలపై కూర్చుని క్షమా భిక్ష కోరడం ఎంత బాగుందో అని ఒక్క క్షణం అనిపించింది.
ఎదురుగా వినోద్ కనిపిస్తే “ఏం జరుగుతుంది?” అని సత్యం ప్రశ్నిస్తుండగానే వినోద్ నోటికి అడ్డంగా చెయ్యి పెట్టి మౌనంగా ఉండాలి అని సైగలతో చెప్పాడు.
ఎడిటర్ ఛాంబర్‌ను పూలతో అలంకరించి, అగరవత్తులు వెలిగించారు. ఎడిటర్ చీవాట్లతో నెగిటివ్ ఎనర్జీతో ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు అగరవత్తులు సువాసనతో గుబాళిస్తోంది. యాజమాన్యం మద్రాస్, దాంతో ఎడిటర్ మంగళూరు మఠం స్వామికి వీర భక్తుడిగా మారి ఆఫీస్‌ను అనుబంధ మఠంగా మార్చేశారు. మంగళూరు మఠం స్వామి ఆఫీస్‌ను పావనం చేశారు. ఎడిటర్ స్వామికి పాదపూజ చేస్తున్నారు. ఆఫీస్‌లో హడావుడికి అదే కారణం. రెండు రోజుల నుంచి ఆఫీస్‌లో దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సత్యం సెలవులో ఉండడం వల్ల ఇవి తెలియవు. ఎడిటర్ స్వామి వారికి పాద పూజ చేయడానికి ముహూర్తం సమీపిస్తుండడంతో ఆఫీస్‌లో అందరూ హడావుడిగా ఉన్నారు.
సత్యం లోనికి వెళ్లి చూస్తే ఆఫీస్‌లో అందరూ బిజీగా ఉన్నారు. ఒకరు ఇత్తడి పళ్ళెం తీసుకుని ఎడిటర్ వద్దకు వేగంగా వెళుతున్నాడు. చివరకు ఆఫీస్ బాయ్ కూడా పని చేయడం కనిపించింది. ‘టీవీ ఛానల్ వాళ్ళు ఎప్పటి నుంచో చెబుతున్న యుగాంతం దగ్గరకు వచ్చినట్లు ఉంది’ అనుకున్నాడు సత్యం.
దాహం వేస్తుంది, మంచి నీళ్లు తెమ్మన్నా ఆఫీస్ బాయ్ వినిపించనట్టు వెళ్ళేవాడు. ఈ రోజు ఆఫీస్ బాయ్ కూడా అందరితో పాటు పని చేస్తూ పూలు తీసుకు వెళుతున్నాడు, సబ్ ఎడిటర్ పంకజాక్షి కొబ్బరికాయలు తీసుకువెళుతున్నారు.
“ఏం జరుగుతుందో మీరైనా చెప్పండి” అని సత్యం వేడుకుంటే,
“అలా బెల్లం కొట్టిన రాయిలా పనిచేస్తున్న వారికి అడ్డంగా నిలబడక పోతే కాళ్లు కడగడానికి బిందెలతో నీళ్లు తేవచ్చు కదా?” అని సత్యంకు పంకజాక్షి పని అప్పగించి, కొబ్బరికాయలు పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళింది. మద్రాస్‌లో ఉండే యాజమాన్యం ‘ఆంధ్ర దివిటి’ ని ఎడిటర్‌కు, మేనేజర్‌కు వదిలేసింది. వారిద్దరు కలిసి పత్రికను సొంతానికి వాడుకోవడం మొదలు పెట్టారు.
***
‘ఆంధ్ర దివిటి’ పత్రిక నగరం నడిబొడ్డులో మూడెకరాల విశాల మైన స్థలంలో ఉంటుంది. సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళంతా క్యాంటిన్‌కు దగ్గరగా ఉన్న ఖాళీ స్థలానికి వెళతారు. అక్కడ సమస్త రహస్య సమాచారం తెలుస్తుంది. మూగవాణ్ణి పలికించు బృందావనం అని పాడినట్టు ఆఫీస్‌లో నోరువిప్పని వారు కూడా నోరు తెరిచి తమకు తెలిసిన సమాచారాన్ని పంచుకుంటారు. సత్యం అక్కడికి వెళ్ళగానే పవన్‌తో పాటు ఇంకో ముగ్గురు దమ్ములాగుతూ కనిపించారు. “విషయం ఏమిటీ?” అని సత్యం మధును అడిగితే,
“మన ఎడిటర్ మంగళూరు స్వామికి పరమ భక్తుడు తెలుసు కదా?” అని పవన్ అంటే,
“నాకు తెలియకపోవడం ఏమిటీ? మన ఆఫీస్‌లో ఇద్దరు సబ్ ఎడిటర్లు స్వామి రికమండేషన్‌తో ఉద్యోగంలో చేరిన విషయం కూడా తెలుసు.” అని సత్యం బదులిచ్చాడు.
“మంగళూరు స్వామి మన ఎడిటర్‌కు అనుగ్రహ భాషణం ఇవ్వడానికి స్వయంగా ఆఫీస్‌కు వచ్చారు. దీనితో తన జీవితం పావనం అయింది అని ఎడిటర్ ఆకాశంలో తేలిపోతున్నాడు. స్వామి పాదపూజకు పాతిక వేలు తీసుకుంటారు. అలాంటిది ఆఫీస్‌కే వచ్చి ఎడిటర్ కు ఉచితంగానే పాద పూజ వరం ప్రసాదించారు. సీనియర్లు ఉచితంగానే స్వామి కాళ్ళు మొక్కే ఛాన్స్ కల్పించారు. అనుగ్రహ భాషణం పూర్తి కాగానే కాళ్లు మొక్కే కార్యక్రమం ఉంటుంది పదా” అని మధు తొందర పెట్టారు.
“నాకు గుర్తున్నంత వరకు నీకు ఇలా కాళ్ళు మొక్కడం అలవాటు లేదు కదా? స్వాములకు ఎప్పుడు భక్తుడివి అయ్యావు?” అని సత్యం మధును అడిగాడు. ఆ ప్రశ్నతో ఒక్కసారిగా మధు గుంటూరు జిల్లాలో తానూ పని చేస్తున్న కాలం నాటి ప్లాష్‌బ్యాక్ లోకి వెళ్ళాడు.
***
ఎడిటర్ దీక్షిత్ గుంటూరు జిల్లా పర్యటనకు వస్తున్నాడు అని తెలిసి మధు పేలిపోయే వార్త సేకరించాడు. ఈ కుంభకోణం బయటపెట్టడంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు మంత్రి వణికిపోతాడు, అధికారులు బెదిరిపోతారు. ఎడిటర్ దృష్టిలో పడతాను అనుకున్నాడు.
ఎడిటర్ జిల్లా ఆఫీసుకు రాగానే ఈ రోజు ‘ఆంధ్ర దివిటి’లో వచ్చిన తాను రాసిన వార్త ఎడిటర్ కు కనిపించేట్టు పెట్టాడు.
ఎడిటర్ వస్తూనే, “బ్రదర్! మీరు ఈ జిల్లా రిపోర్టర్ కదా? జిల్లాలో మీకు ఎవరు తెలుసు?” అని అడిగాడు.
“జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి మనమంటే హడల్ సార్” అని ఇంకా చెబుతుంటే, ఎడిటర్ మధ్యలోనే అడ్డుకొని, “అది కాదు బ్రదర్ ఇంకెవరు తెలుసు?” అని అడిగితే మధు జిల్లా ప్రముఖులందరి పేర్లు చెప్పాడు. ఎడిటర్ అసహనంగా, “బ్రదర్! పానకాల స్వామి ఆలయం ప్రధాన పూజారి పేరు తెలుసా?” అని అడిగారు. మధు అయోమయంగా ముఖం పెట్టి “తెలియదు” అని బదులిచ్చాడు.
“పోనీ పూజారుల పేర్లు తెలుసా?” అని అడిగాడు.
“తెలియదు” అని మధు బదులిచ్చాడు.
“ప్రధాన పూజారి పేరు తెలియదు. ఒక్క పూజారి పేరు తెలియదు. మీరు స్టాఫ్ రిపోర్టర్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? బ్రదర్” అని ఎడిటర్ గద్దిస్తే, మధుకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
“ఈ సారి గుడికి వెళ్లి అందరి పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకుంటా సార్” అని మధు వినయంగా పలికాడు.
“బ్రదర్ నేను ఆల్ రెడీ ఇక్కడకు వచ్చాను. మీ కోసం మళ్ళీ రావాలా?” అని ఎడిటర్ హోటల్‌కు వెళ్ళిపోయాడు. తన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని మధులో ఆందోళన మొదలైంది. ఆ దెబ్బతో గుంటురు నుంచి హైదరాబాద్ వచ్చి పడ్డాడు. తన ఫ్లాష్‌బ్యాక్‌ను మధు చెబితే సత్యం నవ్వి “నాది మరింత చిత్రమైన కథ” అంటే.. “ఎడిటర్ పాద పూజలో ఉన్నాడు పరవాలేదు చెప్పు” అని మధు అడిగాడు.
“నేను విశాఖలో పని చేసేవాడిని. అది ల్యాండ్‌లైన్ ఫోన్ల కాలం. ఓ రోజు ఫోన్ రింగ్ అయింది. లోకల్ కాల్ అయితే ఒక రకంగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కాల్ రింగ్ అయిన శబ్దం వేరుగా ఉండేది. ఓ రోజు అలా ఫోన్ రింగ్ అయితే హైదరాబాద్ నుంచి కాల్ కావచ్చు అని వెంటనే కాల్ అటెండ్ చేశా. అటు నుంచి ఎడిటర్ దీక్షిత్ ‘బ్రదర్ ఫోన్ దగ్గరే కూర్చొని ఉంటావా? ఎప్పుడు కాల్ చేస్తానా? అని చూస్తావా? నువ్వు రిపోర్టర్‌వి బ్రదర్. ఎప్పుడూ ఆఫీస్ లోనే ఉంటే బయట ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది బ్రదర్. రిపోర్టర్ అన్నవాడు బయట తిరగలి’ అని చెప్పి ఎడిటర్ కాల్ కట్ చేశాడు. ఎందుకు కాల్ చేశారో తెలియక భయంతో చచ్చిపోయా.
అప్పటి నుంచి ఫోన్ రింగ్ అయితే టెలిప్రింటర్ ఆపరేటర్ ఫోన్ ఎత్తేవాడు. ఓ రెండు వారాలు గడిచాక అలానే బయటి నుంచి కాల్ వచ్చినట్టు రింగ్ అయింది. అటు వైపు నుంచి ఎడిటర్. నేను ఆఫీస్ లోనే ఉన్నాను. ‘ఎడిటర్ ఫోన్ చేస్తే రిపోర్టర్ కలక్టరేట్ కు వెళ్ళాడు’ అని చెప్పు అని ముందుగానే చెప్పడం వల్ల ఆపరేటర్ అదే చెప్పాడు.
‘రాగానే నాకు కాల్ చేయమని చెప్పు’ అని ఎడిటర్ ఆదేశించాడు.
కొద్దిసేపటి తరువాత నేను ఎడిటర్ తో మాట్లాడేందుకు ట్రంక్ కాల్ బుక్ చేశా. ఎడిటర్ లైన్ లోకి వస్తూనే ‘బ్రదర్ ఇక్కడ ఎడిటర్ అంటూ ఒకరు ఉన్నారు అని తెలుసా? ఎడిటర్‌కు లక్షల రూపాయల జీతం ఇస్తారు. దానికి పని చేయాలి. మీకు ఫోన్ చేస్తే ఆ సమయంలో మీరు ఆఫీసులో ఉండకపోతే ఎలా బ్రదర్. మీకు టైం చెబితే అప్పుడు ఫోన్ చేస్తాం బ్రదర్’ అని ఎడిటర్ అసహనంగా మాట్లాడి ఫోన్ కట్ చేశారు. నేను విశాఖ నుంచి హైదరాబాద్‌లో వచ్చి పడ్డాను. ఇదీ నాకు జరిగింది. పిల్లలు హైదరాబాద్‌లో చదవాల్సిన కాలానికి హైదరాబాద్ వచ్చాను. తెలిస్తే కుళ్ళుకుని చేస్తాడని ఎప్పుడూ వాడి ముందు బాధ నటిస్తా” అని సత్యం నవ్వాడు.
***
దీక్షిత్‌కు స్వామి ప్రత్యేక అనుగ్రహ భాషణం పూర్తి కావడంతో ఎడిటర్ ఆదేశంతో జర్నలిస్ట్‌లు అందరూ క్యూలో నిలబడి స్వామి ఆశీస్సులు తీసుకుంటున్నారు. మధు, సత్యం స్వామి ఆశీస్సులు తీసుకోని ఎడిటర్ వద్దకు వెళ్లి “మీ దయతో మా జీవితం ధన్యమైంది సార్! మంగళూరు వెళితే స్వామిని దూరం నుంచి చూడడమే కష్టం. అలాంటిది మీ వల్ల స్వామిని అంత దగ్గర నుంచి చూడగలిగాం” అని భక్తి భావంతో పలికారు. ఎడిటర్ ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. బయటకు వెళ్లి “మనం కూడా స్వామి భక్తులం అని చెప్పకనే చెప్పాము. ఇక మన ఉద్యోగాలకు డోకా లేదు” అని నవ్వుకున్నారు.
“సత్యం ఓ మాట చెప్పనా? మన అందరం మహానటులం. మద్రాస్‌లో ఉండే ఓనర్ ముందు ఎడిటర్ నటిస్తాడు. ఎడిటర్ ముందు మనం నటిస్తాం. ప్రజల ముందు స్వామి నటిస్తాడు. నటించక పోతే జీవించలేం. మధ్యతరగతి వేతన జీవుల జీవితం ఇంతే” అని మధు పని మొదలు పెట్టేందుకు కంప్యూటర్ వైపు అడుగులు వేశాడు.
నాలుగు దశాబ్దాల జర్నలిజం జీవితం. ఉదయంలో అక్షరాభ్యాసం. అనంతరం నాలుగు దశాబ్దాలు ఆంధ్రభూమిలో అక్షర సేద్యం. 1987లో ఆంధ్రభూమిలో జర్నలిస్ట్‌గా ఉద్యోగంలో చేరక ముందు నుంచే భూమిలో బోలెడు వ్యాసాలు. 2017లో ఆంధ్రభూమి నుంచి వెళ్లిపోయిన తరువాత కూడా రాయడం ఆపలేదు. ఆంధ్రభూమి ఎడిట్ పేజీలో 20 ఏళ్ళ పాటు ‘జనాంతికం’ పేరుతో వారం వారం రాజకీయ పోకడలపై సెటైర్ కాలం. ఈ కాలంకు తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం లభించింది. ఆంధ్రభూమి మాసపత్రికలో ఐదేళ్ల పాటు ‘వర్తమానం’ కాలం. విద్యార్థిగా ఉన్నపుడు ఆంధ్రభూమితో ఏర్పడిన అనుబంధం కరోనా ఆంధ్రభూమిని మింగేయక ముందు వరకు కొనసాగింది. రిపోర్టర్‌గా ఉంటూ కాలం రాసిన వాళ్ళు అరుదు. 87లో ఆంధ్రభూమి విశాఖపట్నం ఎడిషన్‌లో కాళీపట్నం ఆధ్వర్యంలో ‘నేటి కథ’ అని రోజుకో కథ వచ్చేది. అక్కడే కథలు రాయడం మొదలు పెట్టి, అక్కడే ఆపేశాను. చాలా ఏళ్ళ తరువాత తిరిగి కథలు రాయాలి అని ఆసక్తి కలిగింది. 2017లో తెలంగాణ తొలి సమాచార హక్కు కమిషనర్ పదవి చేపట్టాను. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలోని ఈ పదవివి ఐదేళ్ల పాటు విజయవంతంగా పూర్తి చేశాను. తిరిగి పూర్తి స్థాయి రాత పనిలో పడిపోయాను. రాసుకొని బతకడంలో ఓ తృప్తి ఉంటుంది.
పుట్టింది భువనగిరి జిల్లా మన్నెవారి తుర్కపల్లి. కనులు తెరిచింది, జీవిత కాలం మొత్తం గడిపింది/గడిపేది హైదరాబాద్ లోనే.. ఇద్దరు పిల్లలు, భార్య.. ఇదీ జీవితం.
