[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్ధా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
సోఫాలో కూర్చొని కునికిపాట్లు పడుతున్న సంపత్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. పక్కన ఉన్న వారు “ఏమైంది?” అని అడిగారు. సంపత్ సమాధానం చెప్పక ముందే ఏం జరిగి ఉంటుందో ఊహించారు. తాము పని చేస్తున్న మీడియా సంస్థకు రోజులు దగ్గరపడ్డాయి. అప్పటివరకు ఈ సంస్థలో పని చేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగం అన్నంత ధీమాగా ఉండేవారు. ఒనిడా టీవీ ప్రకటన యజమానులకు గర్వకారణం, పొరుగింటి వారికి ఈర్ష కలిగించే టివి అన్నట్టు ఇక్కడ పని చేసే ఉద్యోగులు అంటే నిజంగానే ఇతర సంస్థల వారికి ఈర్ష కలిగించేదిగా ఉండేది. పొరుగువారికి ఈర్ష కలిగించిన ఒనిడా మూతపడ్డట్టే ఈ సంస్థ పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. యాజమాన్యం ఏదో ఆర్థిక కుంభకోణంలో ఇరుక్కుంది. పత్రికలో జర్నలిస్ట్ ఉద్యోగం అంటే ఎప్పుడు ఊడుతుందో తెలియదు.. స్థిరత్వం లేని జీవితం కానీ ఇక్కడ మాత్రం ఉద్యోగానికి ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్నంత ధీమా ఉండేది. అదంతా నిన్నటి మాట. ఇప్పుడు ఎప్పుడు మూసివేస్తారో?, జీవితం ఏమవుతుందో తెలియని అయోమయ స్థితి. అలా ఆలోచిస్తూ సోఫా మీదే కునికిపాట్లు పడుతున్న సంపత్ ఒక్కసారిగా ఉలిక్కి పడడంతో – ఏమీ కాదు దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు అని మిత్రులు అనునయించారు. సంపత్ మెల్లగా కోలుకొని
“మీరనుకుంటున్నట్టు నేనేమి అధైర్య పడడం లేదు. నాలుగు అక్షరాలు వస్తాయి, ఎక్కడో ఒక చోట బతికేస్తాను. ఇదే ఉద్యోగం కావాలి అని లేదు. తప్పదు అనుకుంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి హోటల్‌లో అయినా పని చేసేందుకు వెనుకాడేది లేదు” అని ధీమాగా పలికాడు.
తన ఉలికిపాటుకు కారణం తనకు మాత్రమే తెలుసు. ఇతరులకు చెప్పలేడు.. తనను తాను కూడా క్షమించుకోలేడు. ఆ మాట తాను బతికి ఉన్నంత వరకు తనను వెంటాడుతుంది అనిపించింది..
“మీ జర్నలిస్ట్‌ల జాతే అంత. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే జాతి” అంటూ ఫాతిమా ఆ రోజు పలికిన మాట, చీదరింపు చూపు ఇప్పటికీ మరచిపోలేక పోతున్నాడు. పదిహేనేళ్ల క్రితం నాటి మాట.. ఇంకా తనను వెంటాడుతూనే ఉంది. తానేమీ బ్లాక్‌మెయిల్ చేసి సంపాదించిన వాడు కాదు. తప్పుడు వార్తలు రాసినవాడు కాదు. జర్నలిస్ట్‌గా వృత్తి నిబద్ధతకు కట్టుబడినవాడు. తన వృత్తి ద్వారా నలుగురికి సహాయం చేసినవాడే కానీ ఒకరి పొట్ట కొట్టినవాడు కాదు.. జర్నలిస్ట్‌గా ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, అధికారులతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఓ కేంద్ర మంత్రి పట్టుపట్టి ఓ ఇంటివాడిని చేయాలని ప్రయత్నిస్తే నాకు మంచి జీతం ఉంది. మిత్రులు కొందరి ఆర్థిక పరిస్థితి బాగా లేదు.. వాడికి ఇవ్వండి అని తనకు దక్కాల్సిన జర్నలిస్ట్ కోటా ఇంటిని తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో మరో మిత్రుడికి ఇప్పించిన ఉదాత్తుడు. సహాయం అడగక ముందే వాలిపోయి సహాయం చేసే గుణం తనది. అలాంటి తనను ఆమె ఆ రోజు అన్న మాట జీవితాంతం వెంటాడుతుంది. తిండి పెట్టే సంస్థ మూతపడబోతుంది అనే ఆలోచనలతో కనులు మూసుకున్న తనకు ఆమె ఉసురు తగిలిందా అనిపించింది. ఆ ఆలోచనతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు..
ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు..
సొంత ఊరిలో పార్ట్ టైం జర్నలిస్ట్ ఉద్యోగం నుంచి పెద్ద నగరంలో పత్రిక ఎడిషన్ సెంటర్‌లో సబ్ ఎడిటర్‌గా ఉద్యోగం. అప్పటివరకు సొంత ఊరిలో తానే హీరో. పత్రికా ప్రచురణ కేంద్రం అంటే తన లాంటి ఓ వంద మంది హీరోలు పని చేసే కేంద్రం. ఒకరికి సినిమాలపై మంచి పట్టు ఉంటే, ఇంకొకరికి స్పోర్ట్స్ అంటే ప్రాణం. కవిత్వం అంటే చెవి కోసుకునేవారు కొందరు. ప్రతి రోజు , ప్రతి క్షణం జీవితాన్ని అనుభవించడమే. ఆఫీస్‌లో ఉద్యోగం అనడం కన్నా కాలేజీకి వెళ్లి మిత్రులతో కబుర్లు చెప్పుకొని వచ్చినట్టు ఉండేది. పెళ్లి కాలేదు ఒంటరి జీవితం. ఒక రోజు ఆఫీస్‌లో నిద్రపోతే ఇంకో రోజు మిత్రుడి ఇంట్లో నిద్ర. ఒక్కో రోజు ఒక్కో చోట తిండి. కవి భార్య ఫాతిమా అక్క చేతి వంట తినని రోజు లేదు. అక్క అంటే ఏ జన్మలో బంధమో అన్నంత ఆప్యాయత చూపేది. తన సహోద్యోగి ఇంట్లో ఉన్నా లేకున్నా వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కా ఆకలేస్తుంది అని అడిగేంత చనువు ఉండేది. అక్క కూడా అంతే ఆప్యాయంగా రొట్టెలు చేసి పెట్టేది.
***
కుర్ర వయసు.. చుట్టూ ప్రతిభావంతులు.. డెస్క్‌లో పని చేస్తుంటే కాలేజీ లో ఉన్నట్టు ఉండేది. ఒకరు జోక్ కట్ చేస్తే , ఇంకొకరు కవిత్వం వినిపించేవారు. డెస్క్‌లో కుర్ర కవి మహా హుషారుగా ఉండేవాడు. చక్కని ప్రేమ కవిత్వం వినిపించేవాడు. మొదట ఆ కవిత్వం తమ కోసం వినిపిస్తున్నాడు అనుకున్నారు కానీ డెస్క్‌లో ఉన్న మరో మహిళ కోసం అని తెలియలేదు. అతను కవిత్వం వినిపించేవాడు, ఆమె ముసిముసిగా నవ్వులు కురిపించేది. అతనికి పెళ్లయింది, ఆమెకు కూడా పెళ్లయింది. వారిద్దరికీ పెళ్లయింది కానీ ఇద్దరికీ వేరు వేరుగా పెళ్లయింది. వీరి ప్రేమ కవిత్వం, ముసి ముసి నవ్వులు చుట్టూ ఉన్నవారికి ముచ్చటేసింది. సీతాకోకచిలుకలో హీరో మురళి, ముచ్చర్ల అరుణ ప్రేమకు పిల్లకాయలు అండగా నిలిచినట్లు వీరి ప్రేమకు ట్రెయినీ సబ్ ఎడిటర్‌లు చేదోడు వాదోడుగా నిలిచేవారు. అంటే పని చేసుకునేప్పుడు ఎడిటర్, న్యూస్ ఎడిటర్ దగ్గరలో ఉంటే వారి కంట కనపడకుండా వీరి ప్రేమను కాపాడేవారు. గుండ్రంగా ఉండే డెస్క్‌లో ఒకే సారి డజను మంది పని చేసుకోవచ్చు. కుర్ర కవి తెల్ల కాగితం మీద రాసిన ప్రేమ కవిత్వాన్ని సంపత్‌కు అందిస్తే, సంపత్ అమ్మాయికి అందించేవాడు. ఎవరైనా చూస్తే అది వృత్తిలో భాగం అన్నట్టుగా కనిపించేది. సబ్ ఎడిటర్ వార్తను దిద్ది మంచి హెడ్డింగ్ పెట్టి ఎలా ఉంది? అని తోటి వారికి చూపిస్తే వాళ్ళు బాగుంది అని మరొకరికి చూపించడం రోజూ జరిగేదే. బాస్‌లు ఎవరన్నా చూస్తే ఎంత శ్రద్ధగా పని చేసుకుంటున్నారు అనిపిస్తుంది. స్కూల్‌లో చదివేప్పుడు టీచర్ మాట్లాడవద్దు అంటే ఇలానే కాగితాల మీద రాసుకోవడంతో మాట్లాడుకునేవాళ్ళం. ఇక్కడా అలానే ఉందని సంపత్ మురిసిపోయాడు. కుర్ర కవి రాసిన తాజా ప్రేమ కవిత ఆమెకు అందించి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అని, అటు నుంచి ఆటే బయటకు పరిగెత్తి ఆఫీస్‌కు దగ్గరలోనే ఉన్న కుర్ర కవి ఇంటికి వెళ్లి “అక్కా బాగా ఆకలిగా ఉంది. రొట్టెలు ఉంటే పెట్టు” అని ఇంట్లో అమ్మను అడిగినట్టుగానే అడిగాడు. కుర్రకవి భార్యకు ఇది కొత్తేమీ కాదు. కుర్రాడు, కొత్తగా ఉద్యోగంలో చేరాడు. పెళ్లి కాలేదు పాపం తిండికి వాచి పోతాడు అని ఎప్పుడు ఆకలి వేసినా వచ్చేయ్.. ఈ అక్క ఉందని గుర్తుంచుకో అని అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతుంది. సుష్టుగా తిని మళ్ళీ ఆఫీస్‌కు వెళ్ళిపోయాడు. ఆఫీస్‌లో కుర్ర కవి, ఆమె ఒకరినొకరు కళ్ళతోనే చూసుకుంటూ మెలికలు తిరుగుతున్నారు. చూసింది చాలు. పని చేయండి. ఫస్ట్ ఎడిషన్‌కు టైం అవుతుంది అని షిఫ్ట్ ఇంచార్జ్ గట్టిగానే అన్నాడు. వీడికి ఎప్పుడూ పనే వీడిలో కళాపోషణ అస్సలు లేదు అని మిగిలిన వారు విసుక్కున్నారు.
***
ఎప్పటిలాగానే ఆఫీస్‌లో అడుగు పెట్టిన సంపత్ కు ఏదో తేడాగా ఉంది అనిపించింది. ఎడిటర్ పిలిచి “ఏం రాయబారి వాళ్ళను ఎక్కడికి పంపించావ్?” అని అడిగాడు. ఏం జరిగిందో సంపత్‌కు తెలియదు. అయోమయంగా చూస్తుంటే “ఆ ప్రేమ పక్షులకు రాయబారివి నువ్వే కదా? ప్రేమలేఖలు అందించి ప్రేమకు అండగా నిలిచి ఏమీ తెలియనట్టు నిలబడ్డావు. కొద్ది సేపట్లో పోలీసులు వస్తారు. వాళ్ళు రావడానికి ముందే నీకు తెలిసిన విషయం చెప్పేస్తే నీకూ మంచిది.. ఆఫీస్ కు మంచిది” అని ఎడిటర్ వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడాడు.
కుర్ర కవి, కవయిత్రి అదృశ్యం అయ్యారని అర్థమైంది. ఆఫీస్‌లో ఏదో సరదాగా వాళ్ళు ముచ్చట పడుతున్నారని ప్రేమ కవిత్వం ఒకరిదొకరికి ఇవ్వడం తప్ప తనకు అంతకు మించి తెలియదని సంపత్ తెలిసింది చెప్పి ఆలోచనలో పడిపోయాడు. “సరే మీ మీ డెస్క్ లకు వెళ్లి ముందు పని చేసుకోండి” అని ఎడిటర్ అందరినీ పంపించేశాడు.
కొద్ది సేపటి తరువాత కుర్రకవి భార్య ఫాతిమా పోలీసులతో కలిసి ఆఫీస్‌కు వచ్చింది. సంపత్ ముందులా ఆమె ముఖంలోకి చూడలేక పోయాడు. సంపత్ దగ్గరకు వచ్చి “ఏరా ప్రాంతం, కులం, మతం ఒకటి కాకపోయినా అక్కా అని వచ్చేవాడివి. ఆకలవుతుంది అని తల్లిని అడిగినట్టు అడిగి తిని వెళ్ళేవాడివి. అక్క జీవితం నాశనం అవుతుంటే చెప్పాలి అనిపించలేదా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టినా సహించవచ్చు కానీ.. అక్క కాపురం కూలుతుంటే ఒక్క మాటైనా చెప్పలేదు. పైగా కాపురం కూలడంతో నువ్వూ ఓ చేయి వేశావు. మీ జర్నలిస్ట్ జాతే అంతరా? కృతజ్ఞత ఉండదు” అని చీదరింపుగా చూస్తూ వెళ్ళిపోయింది.
***
ఆమె చెంప మీద కొట్టి వెళ్ళిపోయినా ఏమీ అనిపించేది కాదు కానీ ఛీత్కారంగా చూసిన ఆ చూపు, ‘మీ జర్నలిస్ట్ జాతే అంత కృతఘ్నులు’ అంటూ తిట్టిన తిట్టు తనను జీవితాంతం వెంటాడుతుంది అనిపిస్తోంది. సంస్థ మూతపడితే ఎలా అనే ఆలోచనలో సోఫాలో అలానే కళ్ళు మూసుకున్న సంపత్‌కు ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం నాటి ఆ సంఘటన ఇంకా తనను వెంటాడుతోంది. ఆమె ఉసురు తగిలిందేమో అనిపించింది.
ఆనాటి నుంచి ఇప్పటి వరకు సంపత్ ఆ పెళ్లయిన ప్రేమికులతో మాట్లాడలేదు. కుర్ర కవి మధ్య వయస్కుడు అయ్యాడు, కొత్త భార్య కూడా అంతే. వాళ్ళు మాట్లాడేందుకు ప్రయత్నించినా మాట్లాడాలి అనిపించలేదు.
తాను చేసిన తప్పేమిటో సంపత్ ఇప్పటికీ సమీక్షించుకుంటూనే ఉంటాడు. ఆప్త మిత్రుడు విక్రమ్ పక్కనే ఉండడంతో మిత్రుడికి ఈ విషయం చెప్పి “నా తప్పు ఏమిటో నేనే చెబుతాను” అన్నాడు. “నేనో జర్నలిస్ట్‌ను. ప్రతి విషయంలో జర్నలిస్ట్ గానే వ్యవహరించాను. ఆ పెళ్లయిన ప్రేమ జంట విషయం లోనూ ఒక జర్నలిస్ట్‌గా ఆలోచించాను. కానీ ఒక మనిషిగా ఆలోచించలేదు. ఇదే నా తప్పు” అన్నాడు సంపత్.
“నన్ను నేను సమర్ధించుకుంటున్నాను, ఫ్రొఫెషనలిజంతో వ్యవహరించాను అని నన్ను నేను మెచ్చుకుంటున్నాను అనుకోకు. జర్నలిస్ట్‌గా వ్యవహరించాను – ఒక మనిషిగా వ్యవహరించలేదు అంటే నేను మనిషిగా పతనం అయ్యాను అని అర్థం. నేను నా వృత్తి అని కాదు ఏ వృత్తిలో ఉన్నా మనం మనుషులం అని మరిచిపోతున్నాం అనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య కీచులాటలు, అక్రమ సంబంధాలు, ఆస్తుల గొడవలు సర్వ సాధారణం. గతంలో ఉన్నాయి, భవిష్యత్తులోనూ ఉంటాయి. ఈ సమస్యలకు పేద, మధ్య తరగతి, సంపన్నులు అనే తేడా ఉండదు. కానీ టీవీల్లో బతుకు జట్కా బండి అని పేద కుటుంబాల జంటనే స్టూడియోలో కూర్చోబెట్టి వారి అక్రమ సంబంధం గురించి టివిలో చర్చించి అక్కడే తీర్పులు చెబుతారు. వారి అక్రమ సంబంధాలు అప్పటి వరకు ఆ రెండు కుటుంబాలకు మాత్రమే తెలిసిన రహస్యం. టివిలో వచ్చాక లక్షల మందికి తెలుస్తుంది. ఆ టివి వాళ్ళ ఉద్దేశం వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలి అని కాదు. అక్రమ సంబంధాల కథలు ఎప్పుడూ ఆసక్తికరం గానే ఉంటాయి. వాటిని రోడ్డు మీదకు తెచ్చి రచ్చ చేసి లాభం చేసుకోవాలి అనే కక్కుర్తి తప్ప వారి కుటుంబాలను నిలబెట్టాలి అని ఛానల్స్‌కు ఉండదు. విడాకుల కోసం వచ్చిన ప్రేమ జంటకు నాలుగు మంచి మాటలు చెప్పి విడిపోకుండా కలిపి ఉంచితే న్యాయవాదికి గడవదు. జంట కలిసి ఉండడం కన్నా విడిపోవడం లోనే న్యాయవాదికి ఉపాధి. పోలీస్ స్టేషన్‌లో ఆటోలు మూలకు పడేసి ఉంటాయి. పోలీసుల దృష్టిలో ఆటోలు ఒక సంఖ్య మాత్రమే. కానీ ఒక్కో ఆటో వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ఆటో మూలాన పడితే ఒక కుటుంబం రోడ్డున పడుతుంది. ఇంట్లో వాళ్లకు తిండి, పిల్లల చదువు ఆ దేవుడికే తెలియాలి. పోలీసు ఇలా మనిషిలా ఆలోచిస్తే ఉద్యోగం చేయలేడు.. ఉద్యోగం చేస్తే మనిషిగా ఆలోచించలేడు. ఏ వృత్తిలో ఉన్నా మనుషులం అని మరిచిపోయి, వృత్తికి , సంపాదనకే పరిమితం అవుతున్నాం.”
“సంపత్, సంస్థ మూతపడుతుంది అనే ఆలోచనతో నువ్వు అతిగా ఆలోచిస్తున్నావ్. ఈ సంస్థలో ఉద్యోగం కోసమే పుట్టామా? ఇది కాకపోతే మరోటి పద టీ తాగి వద్దాం” అని విక్రమ్ అనునయించాడు.
“లేదు విక్రమ్, ఎంతో కాలం నుంచి నన్ను తొలిచేస్తున్న ఆలోచనలనే నీతో పంచుకున్నాను. మనం ఎన్నో సినిమాలను చూశాం కదా? పెళ్లి జరుగుతుంటే హీరో తన ఫ్రెండ్ కోసం వెళ్లి పెళ్లి పీటల మీది నుంచి అమ్మాయిని లేపుకెళ్లి తన మిత్రుడితో పెళ్లి చేయిస్తాడు. మనం ఆ సీన్‌లో హీరో గారి హీరోయిజానికి, స్నేహానికి అతను ఇచ్చే విలువకు ఫిదా అవుతాం. మరి పెళ్లి పీటల మీద కూర్చున్న ఆ పెళ్లి కొడుకు పరిస్థితి, వారి బంధువుల పరిస్థితి ఏమిటీ? అని మనం ఒక్క క్షణం కూడా ఆలోచించం. అతనూ మనిషే కదా? అతని కోణంలో మనం అస్సలు ఆలోచించం? ఎందుకు అంటే దర్శకుడు రెండు గంటల పాటు మనం ఎలా ఆలోచించాలో మనల్ని ట్యూన్ చేస్తాడు. మన మెదడును తన ఆధీనంలోకి తీసుకుంటాడు. దర్శకుడు చెప్పినట్టే ఆలోచిస్తాం. ఈ సమాజం కూడా అంతే మన ఉద్యోగం, మన వృత్తి మనకు తెలియకుండానే మనం ఎలా ఆలోచించాలో చెబుతుంది. మనం అలా ఆలోచిస్తేనే ఉద్యోగం నిలబడుతుంది.
అప్పటికే పెళ్లయిన భార్య భర్త తమ భాగస్వామిని మోసం చేస్తూ ఆఫీస్‌లో ప్రేమించుకుంటుంటే ఆ వ్యవహారంలో ఒక జర్నలిస్ట్‌గా ఆసక్తి కలిగించే అంశాన్నే చూశాను కానీ. ఈ సంగతి బయట పడ్డాక ఆమె భర్త పరిస్థితి ఏమిటీ? అతని భార్య దీనిని తట్టుకుంటుందా? తన తల్లి ఇంకొకరిని ప్రేమిస్తూ తండ్రిని మోసం చేసిందని తెలిశాక ఆ పిల్లాడి మానసిక పరిస్థితి ఏమిటీ? జీవితాంతం దీనిని ఎలా తట్టుకుంటాడు? అని నేను మనిషిలా ఒక్క క్షణం కూడా ఆలోచించలేక పోయాను. పెళ్లయిన వారిద్దరూ ఆఫీస్‍లో ప్రేమ కథ సాగించడం సాహసోపేతమా? అక్రమమా? వారేమనుకుంటున్నారు అమర ప్రేమికులం అనుకున్నారా? ఏమనుకున్నారో నాకు తెలియదు. కానీ నేను ఆ రెండు కుటుంబాల్లో బాధితుల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయాను. ప్రతి సంఘటనలో పాఠకులను ఆకట్టుకునే విషయం ఏముందా? అని చూసే ఒక సగటు జర్నలిస్ట్ గానే ఆ పెళ్లయిన వారి ప్రేమను చూశాను. ఎదుటి వారి జీవితాల్లో మసాలా ఏముంది? అని చూశా కానీ ఆ మసాలా వెనుక ఎందరి జీవితాలు తట్టుకోలేని బాధను అనుభవించబోతున్నాయో ఆలోచించ లేదు.. ఏ వృత్తి లోనూ మనిషిగా ఉండే అవకాశం లేదా?” సంపత్ అడిగిన ప్రశ్నకు విక్రమ్ నుంచి మౌనమే సమాధానం.
నాలుగు దశాబ్దాల జర్నలిజం జీవితం. ఉదయంలో అక్షరాభ్యాసం. అనంతరం నాలుగు దశాబ్దాలు ఆంధ్రభూమిలో అక్షర సేద్యం. 1987లో ఆంధ్రభూమిలో జర్నలిస్ట్‌గా ఉద్యోగంలో చేరక ముందు నుంచే భూమిలో బోలెడు వ్యాసాలు. 2017లో ఆంధ్రభూమి నుంచి వెళ్లిపోయిన తరువాత కూడా రాయడం ఆపలేదు. ఆంధ్రభూమి ఎడిట్ పేజీలో 20 ఏళ్ళ పాటు ‘జనాంతికం’ పేరుతో వారం వారం రాజకీయ పోకడలపై సెటైర్ కాలం. ఈ కాలంకు తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం లభించింది. ఆంధ్రభూమి మాసపత్రికలో ఐదేళ్ల పాటు ‘వర్తమానం’ కాలం. విద్యార్థిగా ఉన్నపుడు ఆంధ్రభూమితో ఏర్పడిన అనుబంధం కరోనా ఆంధ్రభూమిని మింగేయక ముందు వరకు కొనసాగింది. రిపోర్టర్‌గా ఉంటూ కాలం రాసిన వాళ్ళు అరుదు. 87లో ఆంధ్రభూమి విశాఖపట్నం ఎడిషన్‌లో కాళీపట్నం ఆధ్వర్యంలో ‘నేటి కథ’ అని రోజుకో కథ వచ్చేది. అక్కడే కథలు రాయడం మొదలు పెట్టి, అక్కడే ఆపేశాను. చాలా ఏళ్ళ తరువాత తిరిగి కథలు రాయాలి అని ఆసక్తి కలిగింది. 2017లో తెలంగాణ తొలి సమాచార హక్కు కమిషనర్ పదవి చేపట్టాను. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలోని ఈ పదవివి ఐదేళ్ల పాటు విజయవంతంగా పూర్తి చేశాను. తిరిగి పూర్తి స్థాయి రాత పనిలో పడిపోయాను. రాసుకొని బతకడంలో ఓ తృప్తి ఉంటుంది.
పుట్టింది భువనగిరి జిల్లా మన్నెవారి తుర్కపల్లి. కనులు తెరిచింది, జీవిత కాలం మొత్తం గడిపింది/గడిపేది హైదరాబాద్ లోనే.. ఇద్దరు పిల్లలు, భార్య.. ఇదీ జీవితం.
