Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జర్నలిస్ట్ కథలు-4: విజేత – పరాజిత

[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్ధా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

“హాయ్ మమ్మీ ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పుకో” అంటూ నర్సు ఉత్సాహంగా, గట్టిగా మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్‌లో గదిలో అచేతనంగా మంచంపై పడుకుని ఉన్న విశ్వంను చూపించింది. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతుందో వినబడడం లేదు. కానీ నర్స్ గొంతులో మాత్రం ఉత్సాహం. నర్స్ తల తిప్పి గదిలోకి ఎవరూ రావడం లేదు కదా? అని నిర్ధారించుకొని తల్లితో కబుర్లు చెబుతూనే ఉంది. నర్స్ ఉత్సాహానికి కారణం ఒకప్పుడు తెలుగునాడును శాసించిన విశ్వం బెడ్ మీద అచేతనంగా ఉన్నాడు.. ఆలోచనల్లో మునిగిపోయాడు. ఆయన పేరు చెబితేనే పాలకులకు వెన్నులో వణుకు అలాంటి విశ్వం గది నుంచి, విశ్వం ముందే తాను ఫోన్‌లో మాట్లాడుతోంది అందుకే ఆ ఉత్సాహం. విశ్వం పేరు వింటేనే వణికిపోయేవాళ్లు. రారాజులా తాను నడుస్తుంటే.. తన రాక తనకన్నా ముందే గాలి అందరినీ హెచ్చరించేది. తాను ఒక్క మాట అనకపోయినా తన పేరే వెన్నులో వణుకు పుట్టించేది. ఇప్పుడు తన స్థితి చూసి తానే జాలి పడుతున్నాడు. తాను అందరినీ ఓడించాడు. లోకాన్ని ఓడించినా మరణం ముందు తలవంచాల్సిందే.

విశాలమైన రాజభవనం. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. ఏసీ చల్లగాలి తప్ప మరో సవ్వడి లేదు. తాను పలకరించలేడు, తనను పలకరించేవారు లేరు. తన గురించి ఎవరిని అడిగినా – అతను పట్టిందల్లా బంగారం.. అడుగు పెట్టిన చోటల్లా విజయమే అంటారు కానీ తనతో తాను మాట్లాడుకుంటే నిజంగా నేను విజేతనా? పరాజితుడినా అని అడిగితే విజేతను అని చెప్పుకోవడానికి లెక్క లేనన్ని కారణాలు ఉన్నాయి, కానీ పరాజితుడిని అని చెప్పుకోవడానికి నా మనస్సుకు మాత్రమే తెలుసు. మీడియాలో తాను పట్టిందల్లా బంగారం అయింది. తాను చెప్పింది వేదవాక్కుగా మారింది.

ఆ నర్స్ అలా మాట్లాడుతూనే ఉంది. ఎందుకంటే విశ్వం వినలేడు అనే ధైర్యంతో. తన శరీరం అచేతనంగా ఉంది కానీ తనకు ఎదుటి వారు మాట్లాడేది అర్థం అవుతోంది. అడగక ముందే ఎన్నో ఇచ్చిన దేవుడు తనకు ఈ స్థితి కల్పించకుండా, హఠాత్తుగా మరణించే అదృష్టం కూడా కల్పిస్తే బాగుండేది అని మొదటిసారి అనిపించింది. ఆరు నెలల నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. జీవిత కాలం అంతా కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వ్యవస్థ తన పని తాను చేసుకుపోతోంది.

విశ్వంకు కళ్ళు మూతలు పడుతున్నాయి. మూసుకున్న కళ్ళు తిరిగి తెరుచుకుంటాయో లేదో తెలియదు. అపస్మారక స్థితిలో ఉన్నా మంచాన పడ్డ మొదట్లో కుటుంబ సభ్యులు అందరూ తన మంచం పక్కనే ఉండేవారు. రోజులు గడుస్తున్నా కొద్ది అంతా తమ పనుల్లో లీనమయ్యారు. ఓ ఇద్దరు నర్సులు, అప్పుడప్పుడు డాక్టర్‌లు వచ్చి రొటీన్‌గా చూసి వెళతారు. వాళ్ళు ఎప్పుడో పెదవి విరిచారు.

ప్రాణం ఉంది. కానీ జీవం లేదు. తన పరిస్థితి తనకే వింతగా అనిపిస్తోంది. త్రిశంకు స్వర్గం కాదు. త్రిశంకు నరకం కాదు. తన పరిస్థితి అటూ ఇటూ కాకుండా ఉంది.

అప్పటి వరకు వాళ్ళ అమ్మతో మాట్లాడిన నర్స్, ఇప్పుడు ఎవరితోనో ప్రేమగా మాట్లాడుతూ మెలికలు తిరిగిపోతోంది. “అనుకుంటాం కానీ ముళ్ల కిరీటాలు ధరించేవారి కన్నా సామాన్యుల జీవితాల్లో జీవం ఉంటుంది” అని విశ్వం తనకు తానే చెప్పుకున్నాడు. “కోట్లమందిని తన గానామృతంతో ఓలలాడించిన లతా మంగేష్కర్ తన జీవిత చరమాంకంలో ఓ ఇంటర్వ్యూ లో వచ్చే జన్మలో తనను లతా మంగేష్కర్‌గా కాకుండా ఒక సామాన్య గృహిణిగా పుట్టించమని దేవుడిని కోరుకుంటున్నాను అన్నారు. ఫోర్డ్ కార్ల కంపెనీ యజమాని హెన్రీ ఫోర్డ్ వచ్చే జన్మలో తనను యజమానిగా కాకుండా ఫోర్డ్ కంపెనీ అటెండర్‌గా పుట్టించమని దేవుడిని కోరుకున్నట్టు చెప్పారు. “కనీసం వీళ్ళు తమ మనసులోని మాటను బహిరంగ పరిచారు. ముళ్ల కిరీటం ఎంత బయంకరమైనదో చెప్పకనే చెప్పారు. నాకు కనీసం అలా చెప్పుకొనే అవకాశం కూడా లేదు కదా?” అని తనకు తానే చెప్పుకున్నాడు.

నర్స్ దగ్గరకు వచ్చి ఓ వైపు చేతిలో సెల్ పట్టుకొని మాట్లాడుతూనే పల్స్ చూసి, తిరిగి తన ప్రపంచంలో తాను మునిగి పోయింది. డాక్టర్‌కు ఫోన్ చేసి ఏదో చెప్పింది. ‘పెద్దగా ఆశలు లేవు అని నాకూ తెలుసు, కుటుంబ సభ్యులకు తెలుసు, డాక్టర్‌కు, నర్స్‌కు తెలుసు. అందరికీ తెలిసినా ఎవరి నటన వాళ్ళు నటిస్తుంటారు. లోకం ఇంతే’ అనుకున్నాడు.

తనను ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఆ నర్స్ ఎవరితోనో అలా ప్రేమ కబుర్లు చెప్పడం విశ్వంకు కొత్తగా ఉంది. వింతగా ఉంది. తాను ఆఫీస్‌లో ఉన్నాను అని తెలిస్తేనే సిబ్బంది వణికిపోయేవారు. తన ఛాంబర్‌కు ఎవరినైనా పిలిస్తే వారికి పై ప్రాణాలు పైనే పోయేవి. అలాంటిది ఆ పిల్ల ఎలాంటి భయం లేకుండా ప్రేమ కబుర్లు చెబుతోంది. కాల మహిమ అంటే ఇదేనేమో అనుకున్నాడు. విశ్వంకు తన జీవితం మొత్తం కళ్ళ ముందు కదలాడుతోంది. ఖాళీ జేబు, బోలెడు ఆశలతో పల్లె నుంచి మహానగరంలో అడుగుపెట్టి చిన్న ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాల నుంచి మీడియా సామ్రాజ్యం వరకు ఎదిగిన తన జీవితం తనకే ఆశ్చర్యం. తాను జర్నలిస్ట్ కాదు. కానీ వేలమంది జర్నలిస్ట్‌లకు ఉద్యోగాలు ఇచ్చాడు. తాను రాయలేడు. కానీ తన పత్రికలోని రాతలతో ఎంతో మంది నాయకుల జీవితాలను తలక్రిందులు చేశాడు. తన చూపు సోకింది అంటే నచ్చనివారు ఎంత శక్తివంతుడైన భస్మం కావలసిందే. తన కరుణామయ చూపు పడితే అనామకుడు కూడా అపర చాణుక్యుడిలా వెలిగిపోవలసిందే. తన కార్యాలయంలో సి.ఇ.ఓ. ఎలానో సీఎంలు కూడా అలా తన కరుణ కోసం కార్యాలయంలో పడిగాపులు కాయడం అందరికీ తెలిసిందే. టివిలో, సామాజిక మాధ్యమాలు వచ్చిన వచ్చిన తరువాత తన ప్రభావం కొంత తగ్గింది కానీ తాను నంది అంటే నంది, పంది అంటే పంది. నాలుగు దశాబ్దాలు తెలుగునాట అధికారంలో ఎవరున్నా అధికారం చెలాయించింది నేనే. ఏ వ్యాపారంలో అడుగు పెడితే అక్కడ విజయమే. మీడియానే కాదు సినిమాలు తీస్తే అక్కడా ఎదురు లేదు. వెనకటికి ఒకడు తాను ఏది పట్టుకుంటే అది బంగారం కావాలి అని వరం కోరుకుంటే నిజంగానే బంగారం అయిందట. నీళ్లు తాగుదామని గ్లాస్ ముట్టుకుంటే నీళ్లు బంగారం అయ్యాయి. తిందామని తల్లె ముందు కూర్చుంటే అన్నం బంగారం అయింది. ఇది వరం కాదు శాపం అని వరం వెనక్కి తీసుకోమని ఏడ్చాడట. విశ్వంకు తన పరిస్థితి చూసి చిన్నప్పటి కథ గుర్తుకు వచ్చింది. తన పరిస్థితి కూడా అంతే కదా? “జీవితం అన్నాక అన్నీ ఉండాలి. పట్టుకున్నదల్లా బంగారం అయితే ఇక జీవితం ఎక్కడ?” అని తనను తానే ప్రశ్నించుకున్నాడు విశ్వం.

విశ్వం పెదవులపై సన్నగా నవ్వు.. తన చిన్ననాటి మిత్రుడితో జరిపిన ఓ సంభాషణ గుర్తుకు వచ్చింది. మిత్రుడు ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక తన కంపెనీలోనే తనకు సహాయంగా పని చేశాడు. ఓ రోజు మిత్రుడు మందు పార్టీ గురించి కబుర్లు చెబుతుంటే.. “మీరంతా అదృష్టవంతులు ఇరానీ హోటల్‌కు వెళ్లి హాయిగా టీ తాగుతారు. బార్‌కు వెళ్లి కబుర్లు చెప్పుకొంటూ మందు తాగుతూ జీవితాన్ని అనుభవించారు. నేను ఈ సింహాసనాన్ని వీడి రాలేను. కిరీటం తీయలేను. ఒక రకంగా బంగారు పంజరంలో బందీ అయిన జీవితం నాది” అంటూ నేను చెబితే మిత్రుడు చనువుతో “నీకేంటి సినిమాలు కూడా తీస్తున్నావు. అందమైన హీరోయిన్‌లు ఎప్పుడూ నీ చుట్టే ఉంటారు. స్వర్గంలో ఉంటూ ఇరానీ హోటల్‌లో కంపు వాతావరణంలో టీ తాగే మమ్ములను చూసి అదృష్టవంతులు అంటున్నావు” అని చమత్కరించాడు.

బయటి నుంచి చూసే వారికి నిజంగా అలానే అనిపిస్తుంది. ఓ సినిమాలో హీరోయిన్‌ను బాగా నటించావ్ అని మెచ్చుకుంటే మరుసటి రోజే ఛాంబర్‌కు వచ్చేసింది. అద్దాల మేడలో జీవితం, చిన్న రాయి కూడా తగలకుండా చూసుకోవాలి. ఆ రోజే అనిపించింది మెచ్చుకోవడం కూడా ప్రమాదం రా బాబూ అని.. నేనేమీ ప్రవరాఖ్యుడిని కాదు. కానీ ఓ మహా సామ్రాజ్యానికి అధిపతిని. లక్షల కళ్ళు అనుక్షణం చూస్తుంటాయి. ఏ మాత్రం అవకాశం ఇచ్చినా సామ్రాజ్యం కూలిపోతుంది. పైకి నన్ను చూసి అధికార పక్షం, విపక్షం, సిబ్బంది అంతా భయపడుతున్నా.. నిజానికి నేను నిరంతరం వాళ్ళ అందరి కన్నా ఎక్కువ భయపడుతుంటాను. ఇప్పుడు రాసే పెన్నులోనూ కెమెరాలు ఉంటున్న రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలి అని ఎప్పుడో అనుకున్నాను. అలానే ఉన్నాను.

నేను ఇలా ఆలోచిస్తుండగానే నర్స్ పరిగెత్తుకొచ్చి ఏదో చూసి మళ్ళీ అంతే వేగంగా బయటకు పరిగెత్తింది.

ఇంత మందిని భయపెట్టి, నచ్చని వారిని అధికారం నుంచి దించేసి, నచ్చిన వారిని అధికారంలోకి తీసుకు వచ్చి నేను సాధించింది ఏమిటీ? జీవితాన్ని అస్సలు అనుభవించకుండానే జీవితం ముగిసిపోతుందా? ఇంతకూ నేను విజేతనా? పరాజితుడినా? నా ప్రశ్నకు సమాధానం దొరకక ముందే కండ్లు మూతలు పడుతున్నాయి.

అక్కడ జరుగుతున్నదేదీ విశ్వంకు తెలియదు అతని కళ్ళు శాశ్వతంగా మూత పడ్డాయి.

నర్స్ విశ్వం చేయి పట్టుకొని నాడి చూసి భయంతో డాక్టర్ కు ఫోన్ చేసింది.

Exit mobile version