Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జర్నలిస్ట్ కథలు-6: మూర్తి (రిటైర్డ్ జర్నలిస్ట్)

[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్ధా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

ఉదయం లేవగానే సెల్ ఫోన్‌కు అతుక్కు పోవడం, కొంచం సేపు అయ్యాక కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో ఒకటి చదవడం, రాయడం మూర్తి దినచర్య. ఆ మధ్య రిటైర్ అయిన ఉన్నతాధికారి ఒకరు తన ఆత్మకథలో ఓ మంచి మాట రాశారు. పదవిలో ఉన్నప్పుడు సింహంలా గర్జించేవాళ్ళు రిటైర్ అయ్యాక పలకరించేవాడు లేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారట. పక్కింటి కాలింగ్ బెల్ మోగినా తమ ఇంటి బెల్ అనుకోని బయటకు వెళ్లి చూస్తాడట. సరైన ప్లాన్ లేక పోతే రిటైర్మెంట్ జీవితం నిజంగా నరకమే. అప్పటి వరకు మనం లేకపోతే ప్రపంచం నడవదు అన్నంత బిజీగా గడిపిన వాళ్ళు. రిటైర్ కాగానే పలకరించేవాళ్ళు లేక తీవ్ర నిరాశలో పడిపోతారు. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఇలాంటి వారిని ఎందరినో చూసిన మూర్తికి అలాంటి ఇబ్బందేమీ లేదు. ఉద్యోగం నుంచి రిటైర్ ఆలోచనల నుంచి, పని నుంచి రిటైర్ కాలేదు. ఉద్యోగంలో ఉన్నంత కాలం అధికారిగా అధికారం చెలాయించినట్టు రిటైర్ కాగానే ఇంట్లో వాళ్ళ మీద అధికారం చలాయిస్తే, తాను చెప్పినట్టే జరగాలని అందరి పనుల్లో జోక్యం చేసుకుంటే ఏమవుతుందో మూర్తికి బాగా తెలుసు. అందుకే ముందుగానే తన ప్రపంచం తాను సృష్టించుకున్నాడు. అడిగితే సలహా ఇస్తాడు. అది కూడా ఇలా చేస్తే ఇలా కావచ్చు అని దానిలో మంచి చెడు విశ్లేషించి చెప్పి మీ ఇష్టం అని వాళ్ళకే వదిలేస్తాడు. నాలుగు దశాబ్దాలు జర్నలిస్ట్‌గా పని చేసిన మూర్తి కోట్లు సంపాదించలేదు. కానీ బోలెడు లోకజ్ఞానం కూడగట్టుకున్నాడు. లోకం పోకడలు బాగా తెలుసు. ‘ఈ వృత్తిలో కోట్లు సంపాదించలేదు కానీ ఈ లోకంలో ఎలా బతకాలో పిల్లలకు నేర్పించే జ్ఞానాన్ని సంపాదించాను. వారికి ఆ జ్ఞానాన్ని కలిగించాను అనే తృప్తి ఉంది’ అని గర్వంగా చెబుతాడు ప్రయోజకులైన తన పిల్లలను చూపిస్తూ.. రిటైర్‌మెంట్ తరువాత ఆరోగ్యం కాపాడుకోవడం, డబ్బు కాపాడుకోవడం గురించి అందరూ చెబుతారు కానీ రిటైర్ అయిన తరువాత కూడా డబ్బు సంపాదించాలి దీని వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. మనకు చేయడానికి ఓ పని ఉంటుంది. సంపాదిస్తున్నాం కాబట్టి ఇంట్లో గౌరవం ఉంటుంది. మంచి కాలక్షేపం. వీటన్నింటికంటే రిటైర్ అయ్యాను ఎవరూ పట్టించుకోవడం లేదు అనే దిగులు ఉండదు.

ఎప్పటిలానే మూర్తి తన ప్రపంచంలో తాను మునిగిపోయాడు. ఫేస్‌బుక్ తెరిచి చూస్తే కొత్తగా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు కనిపించాయి. కల్పనా రెడ్డి హీరోయిన్ అంత అందంగా ఉంది ఫోటో. మిగిలిన వారి వివరాలు తరువాత చూడవచ్చు అని కల్పన ఫ్రొఫైల్ చెక్ చేస్తుంటే.. వెనక నుంచి మూర్తి భార్యా పిల్లలు, కల్పనా రెడ్డి ఫ్రొఫైల్‌ను చూస్తూ చిలిపిగా నవ్వుతూ భుజం తట్టి వెళ్ళిపోయారు.

వయసు పాతిక, ఐటీ కంపెనీలో ఉద్యోగం. ఆమె పోస్ట్‌లు చూస్తే అందమైన రకరకాల ఫోటోలు తప్ప ఏ విషయం పై పోస్ట్‌లు లేవు. ఆమె ఫ్రెండ్‌షిప్‌ను అంగీకరిస్తున్నట్టు క్లిక్ చేయగానే కొద్ది సేపటికే మెసెంజర్‌లో కల్పనా రెడ్డి నుంచి సందేశం. పలకరింపులు అయిపోయిన తరువాత కల్పనా రెడ్డి నుంచి మెసేజ్ ఏం చేస్తుంటారు అని. రిటైర్ అయ్యాను అంటే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారా? అని మళ్ళీ ప్రశ్న.. రిటైర్ అయినా తన ప్రధానమైన పనే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం అని మూర్తి ఉత్సాహంగా సమాధానం ఇచ్చాడు. కుటుంబం గురించి, ఉద్యోగం, హాబీలు ఇలా కొంతసేపు మాట్లాడిన తరువాత “మీకు ఇన్వెస్ట్‌మెంట్ గురించి మంచి ఐడియా ఇవ్వాలా?” అని కల్పనా రెడ్డి అడిగింది. “ఏమిటా ఐడియా?” అని మూర్తి అడగగానే. “మీ రిటైర్‌మెంట్ డబ్బులతో మీకు ఎంత శాతం లాభం వస్తోంది” అని కల్పన అడిగితే “నా ఖర్చులకు సరిపోయేంత” అని సమాధానం చెప్పాడు మూర్తి. “60 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు నెలకు 50 వేల లోపే ఆదాయం వస్తుంది అంటే చాలా తక్కువ ఆదాయం. 60 లక్షలు ఆరు నెలల్లో రెట్టింపు అయితే మీకు ఎలా ఉంటుంది?” అని కల్పన అడిగ్గానే.. మూర్తి ఆసక్తిగా సంభాషణ కొనసాగించాడు. “అంటే నెలకు 10 లక్షలు ఆదాయం అన్నమాట. ఏళ్లపాటు కష్టపడి, లక్షల మందితో పోటీ పడి ఐఏఎస్ అయినా అంత జీతం ఉండదు. నెలకు పది లక్షలు అంటే వింటేనే ప్రపంచాన్ని జయించినట్టు ఉంది” అన్నాడు. “మీకు ఆసక్తి ఉంటే ఒక యాప్ పంపిస్తాను. ఎంతో మంది ప్రముఖులు దీనిలో చేరారు. మీరూ చేరవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మనం ఫోన్ లో మాట్లాడుకుందాం” అని కల్పన పలికింది.

“చూడు కల్పన నాకు ఒకరి మీద ఆధారపడి బతకడం ఇష్టం ఉండదు. ఇప్పటికీ నా సంపాదనతోనే బతుకుతున్నాను. సొంత ఇల్లు, జీవిత కాలపు పొదుపు, గ్రాట్యుటీ అన్నీ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశా. స్టాక్స్ పెరిగితే మురిసిపోను, తగ్గితే క్రుంగిపోను. నా ఖర్చు ఎంతో ఆ మేరకు డివిడెండ్ వచ్చే స్టాక్స్ కొన్నాను. నా నిర్ణయం తప్పు అంటావా?” అని మూర్తి అడిగాడు.

“ఎంత గొప్ప కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినా ఏటా సగటున అర శాతం డివిడెండ్ వస్తుంది. నెలకు 20 శాతం వచ్చే మార్గం నేను చూపిస్తా. కాల్ చేస్తాను. ఫోన్ నెంబర్ ఇవ్వండి” అని అడిగింది.

“ఫోన్ నంబర్ వద్దులే. మీ మీద నమ్మకం లేక కాదు. సొంత ఇంటిలో నెలకో 30 వేలకు మించి ఖర్చు లేదు. ఆ 30 వేల కన్నా ఎంతో కొంత ఎక్కువే వడ్డినో, డివిడెండ్ రూపం లోనో వచ్చేస్తున్నాయి. జీవితం హాయిగా గడిచి పోతుంది. నువ్వు చెప్పినట్టు మీ యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు పది లక్షలు వస్తాయి నిజమే. ఆ పది లక్షలు నేను ఏం చేసుకోవాలి?, వాటిని ఎలా మేనేజ్ చేయాలి? 30 వేల ఖర్చు ఉన్నవాడికి 10 లక్షలు వస్తే ఎంత సమస్యనో నీకేం తెలుసు. ఇలాంటి సమస్యను ఎన్టీఆర్, రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఎదుర్కోలేక సతమతమయ్యారు నేనేంత? వద్దంటే డబ్బు అని ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ కాలంలో సినిమా, రజనీకాంత్‌ది కలర్ సినిమా కథ ఒకటే. మాములు జీవితం గడిపే వారి జీవితంలోకి భారీ డబ్బు వస్తే జీవితం నరకంగా మారుతుంది. ఎప్పటిలా ప్రశాంతంగా బతకాలా? నువ్వు చెప్పినట్టు ఇన్వెస్ట్ చేసి నెలకు పది లక్షల ఆదాయం పొంది జీవితాన్ని సమస్యల మయంగా చేసుకోవాలా నువ్వే చెప్పు” అని సలహా అడిగితే కల్పన కాసేపు మౌనంగా ఉండి.. కొద్ది సేపటి తరువాత ‘చాలా తెలివైన వాళ్ళు’ అని మెసేజ్ చేసింది. కల్పనా రెడ్డిది నకిలీ అకౌంట్ అని మూర్తికి ముందే తెలుసు. ఈ పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని, ఇన్వెస్ట్‌మెంట్ యాప్ పేరుతో కొందరిని మోసం చేసిన వార్తలు చదివిన విషయం మూర్తికి గుర్తుంది.

ఒకటా రెండా 40 ఏళ్ళ జర్నలిజం జీవితంలో ఎంతమంది మహానుభావులను చూసి రాటుదేలిపోయాను అని మూర్తి తనను తానూ మెచ్చుకున్నాడు.

***

సెల్ ఫోన్ స్క్రీన్ మీద నంబర్ చూడగానే మూర్తి ఉత్సాహంగా ఫోన్ ఎత్తాడు. అటు వైపు ఉత్తరప్రదేశ్ నుంచి అమ్మాయి హిందీలో మాట్లాడుతోంది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ అని ఏదో చెప్పింది. కాసేపు వివరాలు మాట్లాడిన తరువాత “మీరు స్టాక్ మార్కెట్‌లో ఉన్నారు కదా? మీలాంటి వారి కోసమే మా కంపెనీ పని చేస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ లో ఏడాదికి 15 శాతం లాభం వస్తే గొప్ప అనుకుంటారు కానీ మేం చెప్పినట్టు ట్రేడింగ్ చేస్తే కేవలం మూడు నాలుగు రోజుల్లో రెట్టింపు అయ్యే అవకాశం ఉంది” అంటూ అమ్మాయి హిందీలో చెప్పుకుంటూ పోతుంది. మూర్తి కూడా చాలా ఆసక్తిగా అమ్మాయిని ప్రశ్నలు అడుగుతున్నాడు. కనీసం రోజుకు ఐదు శాతం లాభం గ్యారంటీ అని. “ఒక్కో సారి మూడు నాలుగు రోజులకే పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఒక నెలలో స్టాక్ మార్కెట్ కనీసం 20 రోజులు పని చేస్తుంది. 20 రోజులకు మీ డబ్బు రెట్టింపు కావడం గ్యారంటీ” అని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. మూర్తిలో ఆసక్తి పెరిగిపోయింది. “ఈ రోజుల్లో రిటైర్ అయిన పెద్దవారు అంటే అందరికీ చిన్నచూపే. పట్టించుకోని సలహాలు ఇచ్చే మీలాంటివారు చాలా తక్కువ మంది” అని మెచ్చుకున్నాడు.

“అమ్మాయి అందరినీ సంపన్నులను చేసే ఈ సంస్థ మీదేనా? లేక మీరు ఉద్యోగా?” అని అడిగాడు.

“నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను” అని చెప్పింది.

“నెలకు జీతం ఎంతో?”

“నెలకో 40 వేలు ఇస్తారు అంకుల్” అని కూల్‌గా చెప్పింది.

“ఎంతో పెద్ద మనసుతో బోలెడు సంపాదించుకోవడానికి నాకు మంచి సలహా ఇచ్చావు. నాకు ఉపకారం చేసినప్పుడు నేను కూడా నీకు ఉపకారం చేయడం కనీస ధర్మం. ముక్కు మొఖం తెలియని వారికి ఇలా రోజూ వందల మందికి ఫోన్ చేసి మీ కంపెనీ గురించి చెబితే నీకు నెలకు వచ్చేది 40 వేల జీతం. ఏ మాత్రం కష్టపడకుండా ఈ 40 వేలు వచ్చే ఉపాయం నేను చెబుతాను. ఈ నెల పూర్తి కాగానే జీతం ఇంటికి తీసుకు వెళ్ళకు. ఆ 40 వేలు మీ కంపెనీ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ లోనే పెట్టు. హీనపక్షం నెలలో రెట్టింపు అవుతాయి అని నువ్వే చెప్పావు కదా? రెట్టింపు కాగానే 40 వేలు తీసుకో, నీ 40 వేలు కంపెనీ లోనే ఉంటాయి. నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పటిలా నెలకు 40 వేలు వస్తాయి. ఎలా ఉంది ఐడియా” అని మూర్తి అడగ్గానే అటు నుంచి ఎలాంటి సమాధానం లేదు.. “ఏమ్మా వినపడుతుందా?” అని మూర్తి పదే పదే అడుగుతున్నా ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేసింది.

ఈ సంభాషణ అంతా వింటున్న మూర్తి శ్రీమతి అన్నపూర్ణ “ఈ వయసులో ఈ చమత్కారాలు అవసరమా? ఆ కల్పనా రెడ్డి, ఇప్పుడు ఫోన్ చేసిన హిందీ అమ్మాయి ఏదో మోసం చేయడానికి అని మీకు ముందే తెలుసు. తెలిసినా అంత సేపు మాట్లాడడం అవసరమా?” అని అడిగింది.

“చూడోయ్ పూర్ణా, ఒకసారి జర్నలిస్ట్ అయినవాడు జీవితమంతా జర్నలిస్ట్ గానే ఉంటాడు. రిటైర్ అయినా, ఉద్యోగం మానేసినా, వృత్తి మారినా వాడిలోని జర్నలిస్ట్ బతికే ఉంటాడు. వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలుసు. పదవ తరగతి చదివిన మోసగాళ్లు కూడా డాక్టర్ లను, ఐటీ నిపుణులను బోల్తా కొట్టిస్తున్నారంటే మోసగాళ్లు ఎంత తెలివి మీరిపోయారో అర్థం అవుతుంది. వాళ్ళతో అలా కాసేపు మాట్లాడింది సరదా కోసం కాదు. ఎలాంటి ఎత్తులు వేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌కు ఇన్వెస్ట్‌మెంట్‌కు తేడా చాలా మంది జర్నలిస్ట్ లకు కూడా తెలియదు. ఇన్వెస్ట్‌మెంట్‌లో మోసం ఉండదు. ట్రేడింగ్ జూదం కన్నా ప్రమాదం. నిజంగా ఏ రోజు స్టాక్ మార్కెట్ గమనం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. తెలుసు సలహాలు ఇస్తామని ఫోన్ చేసే వారికి నిజంగా తెలిస్తే ఫోన్ చేసి దేబిరించాల్సిన అవసరం లేదు. ఒక్క రోజులో ఇంట్లో కూర్చొని ట్రేడింగ్‌లో వేల కోట్లు సంపాదించుకోవచ్చు. ఇలా మార్కెట్ గమనాన్ని చెప్పగలం, ట్రేడింగ్‌లో బోలెడు సంపాదించాం అని ఎవరైనా చెబితే – అలా చెప్పిన వాళ్ళు దేవుడైనా కావాలి, లేదా అబద్ధం అయినా బెబుతుండాలి అంటారు. ఈ మోసగాళ్ల ఎత్తులు తెలుసుకొని ఒక జర్నలిస్ట్‌గా స్పందించడం, ఏదో విధంగా మోసాల గురించి చెప్పడం జర్నలిస్ట్గా నా బాధ్యత అనుకుంటాను. నేను ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాను కానీ నా బుర్ర ఇంకా చురుగ్గానే ఉంది” అని నవ్వాడు.

భర్తను మెచ్చుకోలుగా చూస్తూ “నెలకు 15 వేలు వడ్డీ ఇస్తా అంటే తన పొదుపు, పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బు అంతా కలిపి లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఒక్క నెల 15 వేల వడ్డీ బాగానే ఇచ్చి ఇప్పుడు పారిపోయాడట, లబోదిబో మంటోంది. అత్యాశ కాక పోతే మరేంటి?” అంది.

“చూడు పూర్ణా, ఇలాంటి మోసాలు జరిగినప్పుడు మనకేమీ కాలేదు. మనం మోసపోలేదు. మనం తెలివైన వాళ్ళం అని కించిత్ గర్వం కలుగుతుంది. ఆ వెంటనే మోసపోయిన వారిది అత్యాశ అనే భావన కలుగుతుంది. ఇది అత్యాశ కాదు ఆర్థిక అంశాలపై అవగాహన లేకపోవడం. ఇలా ఎందుకు మోసపోతారో తెలుసా? నువ్వు నమ్మక పోవచ్చు కానీ కుటుంబం పై ప్రేమ వల్ల, కుటుంబ బాధ్యత వల్ల పోతారు. నెలకు 15 శాతం వడ్డీ ఇస్తామనగానే బోలెడు సంపాదించవచ్చు అని అత్యాశతో ఇవ్వరు. పని మనిషి ఇంటి ఖర్చు నెలకో 15 వేలు ఉండొచ్చు. ఎలాగోలా కష్టపడి లక్ష రూపాయలు వాడి వద్ద డిపాజిట్ చేస్తే నెల నెల 15 వేలు ఇస్తాడు. ఇంటి ఖర్చు వెళ్లి పోతుంది. ఈ నెల ఎలా అనే సమస్య ఉండదు అనే ఆలోచనతో డిపాజిట్ చేస్తారు. లక్ష డిపాజిట్ చేసే వారి ఆలోచన ఇలానే ఉంటుంది. లక్షలు, కోటి డిపాజిట్ చేసి మోసపోయే వారి ఆలోచన కూడా ఇలానే ఉంటుంది. ఇంటి ఖర్చు సమస్య తీరిపోతే చాలు అని తమ కోణం నుంచే ఆలోచిస్తారు కానీ. వాడు నెలకు 15 శాతం వడ్డీ ఇస్తాను అంటే అది ఎలా సాధ్యం? మన డిపాజిట్లు తీసుకోని వాళ్ళు చేసే వ్యాపారం ఏమిటీ అని మరో కోణం నుంచి ఆలోచనే రాదు. ఇలా మోసపోయే వారి ఆలోచన మొత్తం తమ ఇంటి నెల ఖర్చు కోణం లోనే సాగుతుంది. మోసం చేసేవారికి కావలసిందే ఇది. అది అత్యాశ కాదు కేవలం కుటుంబం మీద ప్రేమ, అభిమానం మాత్రమే. మన కోణం నుంచే కాకుండా వారి కోణం నుంచి కూడా ఆలోచిస్తే ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉంటాం” అని మూర్తి భార్యకు వివరంగా చెప్పాడు. ఈ చర్చలు పిల్లలు కూడా వింటున్నారని, వినాలి అనే మూర్తి ఉద్దేశం. ఇలాంటి మోసాల గురించి కుటుంబంలో చర్చ జరిగితే మనం మోసపోకుండా ఉండడంతో పాటు ఇతరులు జాగ్రత్త గా ఉండేందుకు మనవంతు సహాయం చేసినట్టు అవుతుంది అని మూర్తి ఆలోచన.

“సరే కానీ మంచి టీ తీసుకు రా” అని పూర్ణను ఆదేశించాడు. ఇలా ఉపయోగ పడే నాలుగు విషయాలు వారితో ముచ్చటించినపుడు టీ అడిగితే కాదనరు అనే సంగతి మూర్తికి బాగా తెలుసు.

రిటైర్ అయినవాళ్ళు ఇంట్లో కూర్చొని అందరినీ చికాకు పెడుతుంటారని చాలా ఇళ్లల్లో వినిపించే మాట. మూర్తి అలా కాకుండా తన ప్రపంచంలో తాను ఉండడమే కాకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా ఇలాంటి మోసాల గురించి అప్రమత్తం చేయడం తో పాటు ఎవరి మీద ఆధారపడకుండా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి నాలుగు డబ్బులు సంపాదించడం అన్నపూర్ణకు సంతోషంగానే ఉంది. రిటైర్ అయ్యాను అని మూర్తి నిరాశతో క్రుంగిపోకుండా తన మెదడు మరింత చురుగ్గా ఉండేందుకు మోసగాళ్ళతో ఆటాడుకుంటున్నాడు.

“ఏమండీ ఒక మాట అడుగుతాను చెప్పండి.. రిటైర్‌మెంట్ జీవితం మనిషికి వరమా? శాపమా?” అని అన్నపూర్ణ ప్రేమగా అడిగింది.

“వరం అనుకుంటే వరం, శాపం అనుకుంటే శాపం. ఆ రెండూ మన చేతుల్లో, మన చేతల్లో ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, అనువుగాని చోట పెద్దరికం చేయకుండా, అడిగితేనే సలహాలు ఇస్తూ మన పరిధిలో మనం ఉంటూ, మనకు వచ్చిన విద్యతో శరీరం సహకరించినంత వరకు సంపాదిస్తూ, ఇతరులపై ఆధారపడకుండా ఉంటే రిటైర్‌మెంట్ జీవితం వరం. దీనికి భిన్నంగా నడుచుకొంటూ, ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతికితే శాపం. సరే స్టాక్ మార్కెట్ క్లోజింగ్ బెల్ మ్రోగింది. నాకు గ్రంథాలయానికి వెళ్లే టైం అవుతుంది నువ్వు వేడి వేడి టీ ఇస్తే తాగి వెళతాను.. లేదంటే బయట తాగుతాను” అని మూర్తి అన్నపూర్ణను పంపించాడు.

Exit mobile version