[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్ధా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
సినిమా నిర్మాత నరేష్ ఆఫీస్ లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా నిశ్శబ్దం. ఈ రోజు కొత్త సినిమా కోసం కథ మీద చర్చించాలి. దర్శకుడు, కథా రచయిత చెప్పిన సమయం కన్నా గంట ముందే ఆఫీస్‌లో ఉన్నారు. నరేష్ కథ ఒకే చేశాడు అంటే సినిమా సూపర్ హిట్ అన్నట్టే. ముందు డబ్బింగ్ సినిమాలతో మొదలు పెట్టి విజయం సాధించాక, తరువాత కథా బలం ఉన్న లోబడ్జెట్ సినిమాలతో విజయ యాత్ర సాగించాడు. సినిమా ప్రపంచం ఓ వైకుంఠ పాళి అనే విషయం నరేష్‌కు బాగా తెలుసు. గండపెండేరాలు తొడిగించుకున్న మహానటులు చివరి దశలో తిండికి కటకటలాడడం, విజయవంతమైన సినిమాలు నిర్మించి ఒక్క సినిమా ప్లాప్ కాగానే రోడ్డున పడ్డ నిర్మాతల కథలు విన్నాడు. స్వయంగా చూశాడు. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఎవరి జీవితానికి ఇక్కడ భరోసా లేదు. కథనే సినిమాకు ప్రాణం అని బలంగా నమ్మినవాడు. ఆలస్యం అయినా పరవాలేదు. పెట్టుబడికి డోకా ఉండకూడదు అనేది నరేష్ సినిమా పాలసీ. కొంత సేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్న తరువాత విషయం లోకి వచ్చారు. “రచయిత గారు! మీ కథ వినిపించే ముందు సినిమా ప్రేక్షకులు ఎలాంటి కథలను ఇష్టపడుతున్నారని మీరు అనుకుంటున్నారు?” అని నిర్మాత నరేష్ అడిగాడు. నరేష్ ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం అని కథా రచయిత ఏకాంబరానికి తెలుసు. కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా “నిర్మాత గారు మీకు తెలియని విషయమా? మీలాంటి వారి చేతిలో పడితే ఎలాంటి కథ అయినా సూపర్ హిట్ కావలసిందే. మీ ఇంటి పేరే సూపర్ హిట్” అంటూ పొగడ్తల మంత్రం వేశాడు. నిర్మాత మనసులోనే నవ్వుకుని ‘హనుమంతుని ముందు కుప్పిగంతులా వీడెవడో నా గురించి తెలియనట్టుంది. పొగడ్తలతోనే ఇక్కడి దాకా వచ్చాను. నన్నే పొగడ్తలతో పడేయాలి అనుకుంటున్నాడు. ఇక్కడ ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పాతాళంలో పడేసి తొక్కేస్తారు. కళ్ళ ముందే ఎందరి జీవితాలు పాతాళంలో పడిపోయింది చూడలేదు’ అని మనసులోనే అనుకోని “మీరు కథ చెప్పండి” అన్నాడు.
ఏకాంబరం కథ చెప్పడం మొదలు పెట్టిన ఐదు నిమిషాలకే నరేష్‌కు కథలో పస లేదు అనిపించింది. “మీ కథ నాకు అంతగా నచ్చలేదు. ఒక కొత్త రచయిత నాకో కథ పంపాడు. కథ చెబుతాను. ఇది సినిమాకు పనికి వస్తుందా? లేదా చెప్పండి. కథను సినిమాకు అనుగుణంగా మార్చుకోవచ్చా చూడండి” అంటూ కథలో లీనం అయినట్టుగా కళ్ళు మూసుకుంటే కనుల ముందు కథ గుర్తు చేసుకున్నాడు. ఎక్కడి గోదావరి జిల్లా పల్లెటూరు, ఎక్కడి మహానగరం.. నరేష్ కథలో లీనమయ్యాడు. “మన కథలో హీరో పేరు విజయ్. అమితాబ్ సూపర్ హిట్ సినిమాలన్నింటిలో హీరో పేరు విజయ్.. పేరులో ఏముంది అంటారు కానీ విజయ్ పేరు కలిసి వస్తుంది అనుకుంటున్నాను. సరేనా” అని అందరి వైపు చూసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే నరేష్ కథ చెప్పడం మొదలు పెట్టాడు.
***
‘నాన్నా నేను హైదరాబాద్‌లో బాగానే ఉన్నాను. ఇక్కడి లోకల్ పత్రికలో జర్నలిస్ట్‌గా చేరాను. జీతం తక్కువే కానీ ఎలాగోలా సరిపోతుంది. ఆఫీస్ లోనే వసతి కూడా ఉంది. నా గురించి కంగారు పడకండి. శ్రద్ధగా పని చేస్తే జీతం అదే పెరుగుతుంది” విజయ్ ఇంటికి ఫోన్ చేసి తండ్రికి ధైర్యం చెప్పాడు. ఇంట్లో పరిస్థితి అంతంత మాత్రమే. విజయ్‌ది వానాకాలం చదువు. ఇంట్లో అర్ధాకలితో గడపడం కన్నా హైదరాబాద్ వెళ్లి ఏ కూలి పనైనా చేసుకొని బతుకుతా అని చెప్పి వెళ్ళాడు. విజయ్ చేస్తున్న పనేమిటో తండ్రికి అర్థం కాలేదు కానీ ఊరిలో కన్నా అక్కడ బాగానే ఉన్నాడు అనుకున్నాడు.
అది బయట ప్రపంచానికి తెలియని పత్రిక. నాలుగైదు దిన పత్రికలు మాత్రమే నలుగురు జనం చదివేవి. చాలా మందికి తెలియంది, చివరకు జర్నలిస్ట్‌లకు కూడా తెలియంది కొన్ని వేల దినపత్రికలు రికార్డ్ ఉంటాయి. బయటికి రావు. పాఠకుల కోసం కాదు ప్రభుత్వ ప్రకటనల కోసమే ముద్రించే పత్రికలు ఇవి. రికార్డులు సమర్పించడం లేదు అని 80 వేల పత్రికల రిజిస్ట్రేషన్‌లను సస్పెండ్ చేశారు అంటే ఈ పత్రికల సంఖ్య అర్థం అవుతుంది. ఇలా వెలుగులోకి రాని వందల, వేల పత్రికల్లో ఒక దానిలో విజయ్‌కు ఆశ్రయం దొరికింది. అక్కడ విజయ్ అటెండర్, నైట్ వాచ్‌మన్, స్వీపర్, సబ్ ఎడిటర్, రిపోర్టర్ అన్నీను. అశోక్ నగర్ లోని గవర్నమెంట్ షాపింగ్ కాంప్లెక్స్‌లో పేపర్ ఓనర్ ఓ రెండు షాప్స్ సంపాదించాడు. వాళ్ళ పత్రిక ఇక్కడి నుంచే వస్తుంది. వీరికి కేటాయించిన షాప్స్ పక్కనే ఒక చికెన్ సెంటర్ ఉంది. చికిన్ సెంటర్ వెనుక ఉన్న చిన్న గది నరేష్‌కు రాత్రి పడుకునే చోటు. హైదరాబాద్ మహానగరంలో ఇంత చోటు దొరకడమే కష్టం. ఓనర్ ఇచ్చే జీతం కన్నా రాత్రి అక్కడ పడుకోవడానికి ఆశ్రయం దొరకడం విజయ్‌కు ఎక్కువ సంతోషం కలిగించింది. అక్కడ పని చేసేవాళ్ళు జీతం ఇవ్వక పోయినా ఎందుకు పని చేస్తారో విజయ్‌కు అర్థం అయ్యేది కాదు. జీతం కూడా అడగకుండా విజయ్ ఎందుకు పని చేస్తున్నారో మిగిలిన వారికి అర్థం అయ్యేది కాదు. జీతంలా కాకుండా అప్పుడో ఐదు వందలు, ఇప్పుడో వెయ్యి అన్నట్టు యజమాని అందరికీ ఇచ్చేవాడు.
మిగిలిన అందరి కన్నా విజయ్‌కు స్పష్టమైన లక్ష్యం ఉంది. తన లక్ష్యం ఈ పత్రికలో జర్నలిస్ట్‌గా పని చేయడం కాదు. ముందు హైదరాబాద్‌లో కాలు పెట్టాలి, పడుకోవడానికి ఇంత చోటు సంపాదించాలి. సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్‌లు చూసేందుకు వెళ్ళేవాడు. స్టూడియోల చుట్టూ తిరిగేవాడు. ఆల్‌రౌండర్‌గా అప్పటికే ఆఫీస్ లో కుండలో నీళ్లు నింపడం మొదలుకొని, వాచ్‌మన్‌గా, జర్నలిస్ట్‌గా అన్ని పనులు చేస్తున్న విజయ్ ఓ రోజు యజమానికి చెప్పి సినిమా వార్తలు రాసేందుకు అనుమతి సంపాదించాడు. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్‌ల చీదరింపులు వినాల్సిన అవసరం లేదు. నేరుగా స్టూడియోలకు వెళ్ళవచ్చు. మెల్లగా మిగిలిన సినిమా జర్నలిస్ట్‌లతో, సినిమా వారితో వారితో పరిచయాలు పెరిగాయి. ఇప్పటి వరకు ఎవరూ చదవని పత్రికలో పని చేస్తూ ఇక్కడి వరకు చేరుకున్న విజయ్ పరిచయం ఉన్న సినిమా జర్నలిస్ట్ ద్వారా నలుగురు చదివే ప్రముఖ దిన పత్రికలో సినిమా వార్తల రిపోర్టర్ పోస్ట్ ఖాళీ అయింది అని తెలియగానే అక్కడ వాలిపోయాడు. ఇప్పుడు తాను పలానా పత్రిక రిపోర్టర్‌ను అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. తనలోని తెలివైన జర్నలిస్ట్ మేల్కొనడమే కాకుండా పురివిప్పాడు. కులం, జిల్లా ఏది అవసరం అనుకుంటే దాన్ని ఊతంగా మార్చుకొని ఒక్కో మెట్టు ఎక్కసాగాడు. కొంత పలుకుబడి, కొంత డబ్బు, కొన్ని పరిచయాలను ఒక చోట చేర్చి తమిళ సినిమా రైట్స్ కొని తెలుగులో డబ్బింగ్ చేశారు. చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లిన అనుభవం ఇక్కడ ఉపయోగ పడింది. మాస్‌కు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో నాడి దొరికింది. కాలం కూడా కలిసొచ్చింది. డబ్బింగ్ సినిమా హిట్టయింది. సినిమా రంగం కాదు చిత్రమైనది కోటీశ్వరుడు సినిమా తీసిన నిర్మాతను బిక్షగాన్ని చేసింది. చాలా తక్కువ మొత్తంతో బిచ్చగాడు అని డబ్బింగ్ సినిమాను విడుదల చేసిన నిర్మాతకు కనక వర్షం కురిసి కోటీశ్వరుడు అయ్యాడు. విజయ్ డబ్బింగ్ సినిమా బాగానే లాభాలు తెచ్చిపెట్టింది. ఆ ఉత్సాహంతో మరిన్ని డబ్బింగ్ సినిమాలు విడుదల చేశాడు. బాగానే సంపాదించాడు. తరువాత డైరెక్ట్ తెలుగు సినిమాలు తీశాడు అక్కడా పట్టిందల్లా బంగారం అయింది. కేవలం హైదరాబాద్ మహానగరంలో ఆశ్రయం కోసం వాచ్‌మన్ మొదలుకొని జర్నలిస్ట్ వరకు అన్ని పనులు చేసిన విజయ్‌కు ఇప్పుడు పట్టిందల్లా బంగారం ఇంటిపేరు సూపర్ హిట్ విజయ్‌గా మారింది. వందల కోట్ల ఆస్తులు, విలాసవంతమైన భవనంలో నివాసం. ఒకప్పుడు స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే చీదరించుకునే వాచ్‌మన్‌లు ఇప్పుడు దండాలు పెడుతున్నారు. సినిమాలలో అవకాశాల కోసం దర్శకులు, నటులతో తన ఆఫీస్ సందడిగా ఉంటుంది.’ ఇదీ మన హీరో విజయ్ కథ. దీనిలో కొంత మసాలా, సెంటిమెంట్ కలిపి, అందమైన ఇద్దరు హీరోయిన్‌లు, నాలుగు డబుల్ మీనింగ్ పాటలు కలిపి సినిమా తీస్తే ఎలా ఉంటుంది?” అని నరేష్ అడగగానే అక్కడ ఉన్నవాళ్లు మౌనంగా ఉన్నారు. “మీకు కథ నచ్చలేదా” అని నరేష్ అడిగాడు.
“నచ్చక పోవడం కాదు, బాషా మొదలుకొని ఎన్నో ఫ్యాక్షన్ సినిమాల మూల కథ ఇంతే కదా? ప్రేక్షకులకు కథ కనెక్ట్ కాదేమో” అని కథా రచయిత ఏకాంబరం తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. “ఇలాంటి కథలతో తెలుగులోనూ చాలా సినిమాలే వచ్చాయి” అని దర్శకుడు తన అభిప్రాయం చెప్పారు.
“ఈ రోజుల్లో ప్రేక్షకులు వాస్తవ కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఇలాంటి ఆచరణకు సాధ్యం కానీ కథలను తిప్పి కొడుతున్నారు” అని ఏకాంబరం నిర్మోహమాటంగా అభిప్రాయం చెప్పారు.
“అందుకే మీరంటే నాకు చాలా గౌరవం. వాస్తవ విరుద్ధమైన కథ అని నిర్మొహమాటంగా చెప్పారు. మీరు వెళ్ళవచ్చు. ఏడాది విరామం తరువాత కథా చర్చలు మొదలు పెట్టాను. మనం తీసే సినిమా సూపర్ హిట్ కావాలి. మంచి కథల కోసం మీరూ ప్రయత్నించండి. నేనూ ప్రయత్నిస్తాను. భారీ సినిమా కాబట్టి నేను ఒక్కడినే కాకుండా ఇతరులతో కలిసి తీస్తాను” అని చెప్పి నరేష్ ఇక వెళ్ళండి అన్నట్టు లేచాడు.
***
నరేష్ తన గదిలోకి వెళ్లి గట్టిగా నవ్వుకున్నాడు. ‘వాస్తవ జీవితంలో సినిమా కథలను మించిన మిస్టరీ ఉంటుంది. విజయ్ ఎవరో కాదు నేనే. చికెన్ సెంటర్‌లో పడుకోవడానికి ఆఫీసులో ఊడవడానికి, వాచ్‌మన్‌గా ఉండడానికి నేనేమీ సిగ్గుపడలేదు. నా లక్ష్యం ఏమిటో నాకు స్పష్టత ఉంది. ప్రతి పనిని లక్ష్యానికి చేరుకోవడానికి ఒక మెట్టుగా భావించాను. లక్ష్యం చేరుకున్నాను. నేను అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి జర్నలిస్ట్ ఉద్యోగం నాకు ఉపయోగ పడింది. ఈ రోజుకు ఎవరో ఒకరు మందు తాగిస్తే చాలు, ఖర్చుకు ఎవరో ఒకరు ఇస్తే చాలు అనుకొనే లక్ష్యం ఉన్న జర్నలిస్ట్ లకు వారి లక్ష్యం నెరవేరుతుంది. కొంచం ముందో వెనకో అందరి లక్ష్యం నెరవేరుతుంది. నా లక్ష్యం పెద్దది. నా లక్ష్యాన్ని నేను చేరుకున్నాను. ఏ రంగంలో ఉన్నా నీ లక్ష్యం ఏమిటీ? అనే స్పష్టత ఉండాలి. నాకా స్పష్టత ఉంది. లోకం గురించి అవగాహనా ఉంది’ అని నరేష్ తనను తాను అభినందించుకున్నాడు. ‘నా జీవిత కథ అయినా నా డబ్బుతో సినిమా తీసేంత పిచ్చి పని చేయను. ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ అక్కడికే వెళ్లే పని చేయను. నా పలుకుబడి, పరిచయాలు ఉపయోగించి ఎవరైనా నిర్మాతను పట్టుకుంటాను’ అని బయలుదేరాడు బతక నేర్చిన నరేష్.
నాలుగు దశాబ్దాల జర్నలిజం జీవితం. ఉదయంలో అక్షరాభ్యాసం. అనంతరం నాలుగు దశాబ్దాలు ఆంధ్రభూమిలో అక్షర సేద్యం. 1987లో ఆంధ్రభూమిలో జర్నలిస్ట్‌గా ఉద్యోగంలో చేరక ముందు నుంచే భూమిలో బోలెడు వ్యాసాలు. 2017లో ఆంధ్రభూమి నుంచి వెళ్లిపోయిన తరువాత కూడా రాయడం ఆపలేదు. ఆంధ్రభూమి ఎడిట్ పేజీలో 20 ఏళ్ళ పాటు ‘జనాంతికం’ పేరుతో వారం వారం రాజకీయ పోకడలపై సెటైర్ కాలం. ఈ కాలంకు తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం లభించింది. ఆంధ్రభూమి మాసపత్రికలో ఐదేళ్ల పాటు ‘వర్తమానం’ కాలం. విద్యార్థిగా ఉన్నపుడు ఆంధ్రభూమితో ఏర్పడిన అనుబంధం కరోనా ఆంధ్రభూమిని మింగేయక ముందు వరకు కొనసాగింది. రిపోర్టర్‌గా ఉంటూ కాలం రాసిన వాళ్ళు అరుదు. 87లో ఆంధ్రభూమి విశాఖపట్నం ఎడిషన్‌లో కాళీపట్నం ఆధ్వర్యంలో ‘నేటి కథ’ అని రోజుకో కథ వచ్చేది. అక్కడే కథలు రాయడం మొదలు పెట్టి, అక్కడే ఆపేశాను. చాలా ఏళ్ళ తరువాత తిరిగి కథలు రాయాలి అని ఆసక్తి కలిగింది. 2017లో తెలంగాణ తొలి సమాచార హక్కు కమిషనర్ పదవి చేపట్టాను. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలోని ఈ పదవివి ఐదేళ్ల పాటు విజయవంతంగా పూర్తి చేశాను. తిరిగి పూర్తి స్థాయి రాత పనిలో పడిపోయాను. రాసుకొని బతకడంలో ఓ తృప్తి ఉంటుంది.
పుట్టింది భువనగిరి జిల్లా మన్నెవారి తుర్కపల్లి. కనులు తెరిచింది, జీవిత కాలం మొత్తం గడిపింది/గడిపేది హైదరాబాద్ లోనే.. ఇద్దరు పిల్లలు, భార్య.. ఇదీ జీవితం.
