[డా. కోగంటి విజయ్ రచించిన ‘జ్వరం!’ అనే కవితని అందిస్తున్నాము.]
~
దృష్టి కుదరదు.
ఏ పనీ చేయబుద్ధికాదు.
ధర్మామీటర్లు పట్టనంత జ్వరం
నాలుక పిడచగట్టి పెదవులు పగిలి
అన్ని చోట్లా అందరికీ ఇదే జ్వరం.
మళ్ళీ వస్తుందా ఈ కాలం అంటూ
జ్వరం ఒకటే జ్వరం
వేళ్ళు వేగంగా తెరల మీద
కదులుతూ
రంగులు రంగులుగా
బొమ్మల తెరల జ్వరం
ఎవరికి వారే నవ్వుకుంటూ
విచిత్ర పైత్య జ్వరం
మాటల జ్వరం
పాటల జ్వరం
భక్తి రక్తి ముక్తుల జ్వరం
పసిపాపలు సైతం తెరలు
చూడందే బువ్వని ముట్టని జ్వరం
ఏమీ తోచకుండా చేసి
తలలో పాములు దూరినట్లు
అసహనంగా చేసే జ్వరం
ప్రపంచమంతా విస్తరించిన జ్వరం
బాల్యానికి
యవ్వనానికి
మధ్యతరానికి
ముసలీ ముతక తరాలకీ
మాటలు సైతం మరచి
మౌనయోగం లోకి పోయేంతటి
జ్వరం మహా జ్వరం
కళ్ళలో తెరలు నింపుకు
తన్మయ మయ్యే జ్వరం
కడుపులో ఆకలి
మరచిపోయేంతటి జ్వరం
మేధ మెదడులోనే
ఆవిరై పోయే జ్వరం
గుడిలో బడిలో
రాదారుల్లో పనిచోటుల్లో
చేసే వాడికీ
చేయించే వాడికీ
జ్వరం జ్వరం జ్వరం
ఒకటే జ్వరం..
విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. పాశ్చాత్య రచయితలను పరిచయం చేస్తూ ‘ పడమటి రాగం’ ఆనే వ్యాస సంపుటిని,
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. ‘ ద స్పారో అండ్ ద కానన్’ అనే ఆంగ్ల కవితల సంపుటిని 2021 లో ప్రచురించిన డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ‘పైనాపిల్ జామ్’ (2023) ఈయన మొదటి కథా సంపుటి.
డా. కోగంటి విజయబాబు ప్రస్తుతం కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు.
drvijaykoganti2@gmail.com
8309596606
