Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాలుడు… నరకములు

పాండవులలో ధర్మరాజు యమదేవత అంశతో జన్మించాడు. ఈ యమదేవత ఎవరో కాదు, కాలుడు. యమనియములు కలగినవాడు యముడు. అందుచేత యముడని, యమదేవతగ ధర్మదేవతై, యమధర్మరాజని పిలువబడ్డాడు. బ్రహ్మ కుడివైపు ఛాతి చనుమొన నుండి పుట్టినవాడుగ వృషభరూపుడై సంచరించిన ధర్మదేవత కథ భాగవతంలో ఉంది. కాని కాలుడులా ఈ ధర్మదేవత మృత్యు దేవత కాదు. వేరు. కుంతి యమధర్మరాజును ఆరాధించి ధర్మజుని కన్న అంశ మాత్రం మృత్యు లోకాధిపతిగ యముడని పిలువబడిన సూర్య సుతుడు కాలునిది. తల్లి ఛాయ.

బ్రహ్మమానస పుత్రుడుగ ధర్మదేవత, సూర్య పుత్రుడుగ కాలుడు ఇద్దరూ ధర్మరాజుగా వేరు వేరు. కాబట్టి మహాభారత గాథ చదివినపుడు ధర్మరాజు ఏ ధర్మదేవత అంశ అన్నది గజిబిజి కాకూడదు.. కుంతి ఆహ్వానించిన యమధర్మరాజు పితృలోకాధిపతి కాలుడు. విదురజన్మ కూడ కాలుని అంశగానే చెప్పబడింది.. కాలుడు, ధర్మదేవతకు వేర్వేరుగ పురాణకథనాలున్నాయి. కాలం తీరినవారి ప్రాణాలు హరించే వాడు కాలుడు.

బ్రహ్మ మానసపుత్రుడుగ ధర్మదేవతది ఒక ప్రత్యేక అవతారమని పురాణ గాథలున్నాయి. ఈ ధర్మదేవత దక్షప్రజాపతి పదమూడుమంది పుత్రికలను వివాహమాడాడు‌. వారిలో మూర్తి అనే ఆమెకు నరనారాయణులు జన్మించారని భాగవతములో ఉంది. ఈ ధర్మదేవత, ధర్మదేవతగ పేరుపడిన కాలుడు ఒకటే అని కొంతమంది భావవ్యక్తీకరణ చేయడం సబబుకాదు. ధర్మదేవతకు నాలుగు పాదాలు బ్రహ్మ ఇచ్చాడు. కృష్ణనిర్యాణము తరువాత వృషభ రూపంలో కలి కారణంగా ఒక పాదముతో సంచరించిన ఈ ధర్మునికి అండగా నిలిచి ధర్మాన్ని పరీక్షిత్తు కాపాడాడన్నది భాగవత కథ.

మరి యముడు విదురజన్మగ వ్యాసపుత్రునిగ మాండవ్యముని శాపకారణంగ శూద్రయోనిలో పుట్టి దృతరాష్ట్రునికి సోదరసమానుడై హితుడిగ మెలిగాడు. శాపము పొంది యమలోకానికి దూరమైనా కూడ దండధరుని స్థానంలో పితృలోకాధిపతిగా వంద సంవత్సరాలు అర్యముడు పేరుతో యముడు పితృలోకం పాలన వదలలేదని భాగవతములో ఉంది. యుధిష్టరుని జన్మకు కుంతి ఆరాధించింది సూర్యసుతుడు కాలుడు పితృలోకాధిపతి అన్నది స్పష్టము.

ధర్మదేవతగ మహాభారతములో అరణ్యపర్వములో ధర్మరాజుకు యక్షప్రశ్నలు వేసినది కాలుడే! జీవుల ప్రాణములు తీసే యముడు. మృత్యు లోకాధిపతిగా యమధర్మరాజని పేరొందాడు. కాలుడిగ జీవుల పాపపుణ్యముల ననుసరించి నరకశిక్షలు, స్వర్గభోగములు నిర్ణయించు అధికారము గల సూర్య పుత్రుడు. తల్లి ఛాయ. వ్యాసభారతము ప్రామాణికము? బ్రహ్మ యముని దిక్పాలకుడిగ కూడ నియమించాడు. నరకలోకముగ పేరుపడ్డ యమలోకమును సమవర్తిగ ఖ్యాతి వహించి పాలిస్తున్నాడు. పితృలోకాధిపతి కాలుని గురించిన వ్యాసమిది.

స్వర్గలోకము కానిది నరకలోకముగ చెప్పబడింది. దీనికి పితృలోకము అని పేరుతో శతపధబ్రాహ్మణము దక్షిణ దిశగా ఉందని పేర్కొంది. ఇక్కడ పితరులకు ప్రత్యేక విభాగ స్థలముంది. చనిపోయిన పూర్వీకులు రూపము పొంది తమ వారసులు శ్రాధ్ధకర్మాది క్రియలద్వార అందించే పూజలు స్వీకరించి ఆశీర్వదిస్తారు. కాని చనిపోయిన వారందరూ పితృదేవతలు కాలేరు. పాపపుణ్యముల శిక్షాప్రదేశము వేరే చోట ఉంది. ఆ ప్రదేశములకు నరకములు అని పేరు. పితృదేవతల రూపము యముడు చనిపోయిన వారి కందరికీ ఇవ్వడు. అది కూడా పావపుణ్య శిక్షలనుబట్టి ఉంటుంది. పాండురాజు నిస్సంతుగ మునిశాపానికి గురయ్యాడు. అందుచేత దేవరన్యాయముగ కుంతిమాద్రిలకు జన్మించిన పాండవులలో ధర్మదేవత వరం వల్ల ధర్మరాజుకు పాండురాజు తండ్రయాడు. మరణానంతరము ఈ పాండురాజుకు స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేకుండా యమధర్మరాజు సభలో పితృలోకములో పితృదేవతగ మిగిలాడు. నారదుని ద్వారా ఈవిషయం తెలిసి తండ్రికి స్వర్గార్హతకు ఫలమిచ్చే రాజసూయాగము యుధిష్టరుడు చేశాడు .

పితృలోకము అనేది పితరుల కోసమని యముడు నరకలోకములో ఏర్పాటు చేశాడు. ఆ ప్రదేశము నరకశిక్షలేని సుఖభూమేకాని పితరులుగ వారికి స్వర్గ భూమి భోగార్హప్రవేశము దూరము. యమసభా ప్రవేశము మాత్రము ప్రత్యేక గౌరవాన్ని యముడిచ్చాడు.

ప్రత్యేక నివాసాల పితృలోకముగ యమలోకంలో సుఖంగా ఉన్నా అందరూ కోరుకుని చేరుకునే స్వర్గ భూమి మిన్న కనుక ఉండడానికి ఇష్టపడని తండ్రికి నరకలోక నివాస విముక్తికి ధర్మపుత్రుడిగ ధర్మరాజు రాజసూయ యాగము చేశాడు. యమసభలో పితరులు గౌరవ జీవితంలో సఖంగానే ఉన్నా పాపులకు విధిస్తున్న శిక్షలు వినవలసిరావడం శిక్ష గానే భావించేవారనుకోవాలి. భూలోకంలో తమ వారసులు ఎప్పటికయినా స్వర్గానికి తరింపచేయాలని ఎదురు చూస్తారన్నది నమ్మకముగ పురాణ గాథలలో పితృదేవత రూపము కూడ పుణ్య రూపమే.

సకలసుఖాలు కలిగిన పితృలోకనివాసము యమచిత్రగుప్త నివాసములతోబాటు నరకలోకములోఉంది. యమలోకంలో శిక్ష అనుభవిస్తున్న వారిని చూస్తూ యమసభకు పితృదేవతల రూపమిచ్చి పరీశీలకులుగ చేసే అధికారము యమునికుంది. అందుచేతనే పితృలోకాధిపతయాడు.

పాపపుణ్యముల శిక్షలతో నిమిత్తము లేక స్వర్గార్హతకు నోచుకోని ఉత్తమ జీవులకు, రాజ్యాంతే నరకంద్రువమ్మనే నానుడిగ పాండురాజు వంటి ప్రముఖులకు నరకభూమి నివాసముగ పితృదేవతల రూపమిస్తాడు. ప్రత్యేక పుణ్యరూప మది. వారిని నరకశిక్షలుకు గురిచేయడు. వారి వంశీకులు ప్రయత్నిస్తే తప్ప స్వర్గార్హతకు అంగీకరించడని చెప్పవచ్చు. పితృలోకము నివాసము కూడ యముని నిర్ణయము. అందుచేత జీవులు పాపపుణ్య శిక్షలకతీతులవాలి. పిండప్రదానము వంటి కర్మకాండలు వెలిశాయి. నరకములోనే ఆగిపోకుండా వారసులు పితరులకు చేస్తున్నారు.

యమలోకము భూమికి 86వేల యోజనముల దూరంలో ఉందని మహాభారతములో ఉంది. యమసభను బహు సుందరముగ విశ్వకర్మ నిర్మించాడు. విచిత్రమేమిటంటే ఇక్కడ సూర్యకాంతి ప్రకాశమానము వర్ణించలేనంత శోభాయమానంగా ఉంటుంది. యమలేకము చీకటి గుయ్యారముకాదు. మరణానంతరం వచ్చే జీవాత్మల తప్పొప్పుల న్యాయస్థానమది.

దక్షిణ దిక్పాలకుడిగ యమపురి పాలకుడిగ కొలువు చేస్తాడు. ఆయన నివసించే భవనానికి కాలిచి అని పేరు. చిత్రగుప్తుడు, మహాచండ, కాలపురుష, యమకింకరులు ఆయనకు సహాయకరంగా విధులు నిర్వహిస్తున్నారు. సారమేయము సంతానమైన చతురక్షములను పేరుగల శునకములు యమభటులకు తోడు వెళ్లి జీవుల ప్రాణహరణలో సహకరిస్తాయని చెప్పబడింది. చతురక్ష సంచారాన్ని గుర్తించగల అకారణ కుక్కల మొరుగుడుకు అందుకే జనం భయవడడం ఉంది. పాపులకు శక్షలువేసే సమయంలో సభలో రాజర్షులు, సిద్దులు, యోగులు, పితరులు యమసభలో ఉంటారు. పితృదేవతలు.. .వైరాజులు, అగ్ని స్వవత్తా, గార్హపత్యు పితర విభాగాలుగ వారికి స్వర్గమునకు వెళ్ళగల శక్తి ఉంది. ఇంకా సోమప, ఏకశృంగులు, చతుర్వేదులు, కాలులు పితృదేవతారాధనని ఏడు విభాగలుగ మహాభారతము పితృదేవతలను పేర్కొంది. నరకశిక్షలు వేసి పాపులను శిక్షించి యముడు తీసుకునే నిర్ణయాలకు మన పురాణములో 28 నరకప్రదేశములు చెప్ప బడ్డాయి. ఈ నరకములు కూడ పితృలోకంలోనే ఉనికిగా ఉన్నాయి. ముల్లోకాలకు నడుమ దూరంలో పితృదేవతల లోకముంది. అతలలోకానికి పైన భూమికి దక్షిణము దిగువ భాగముగ ఈ పితృలోకంలో అగ్నిస్వాత్తు, ఇతర పితరులు నిరంతర ధ్యానమగ్నులై ఉంటారు. మరణానంతరము శిక్షార్హతలేని నిర్దోష పితరుల రూపంలోయమలోకములో ఆగిపోయిన మానవజీవికి ఈ పితరులు స్వాగతము పలుకుతూంటారు.

యమసభలో పాపులకు శిక్ష అమలు సమయంలో వీరికి పరిశీలకులుగా ప్రవేశార్హత ఉంది. నారదుడు యమసభలో పాండురాజును చూశానని సభాపర్వములో పాండవులకు చెప్పాడు. అగ్నిస్వాత్తు, వైరాజ, గార్హపత్య సోమవ, ఏకాశ్రాంగ, చతుర్వేద, కాలుడు.. ఈ ఏడుగురు పితృదేవతలులో కాలుడు పితృదేవతలకు అధికారి. పితృలోకాన్ని శాసించే యమధర్మరాజుగా కాలుడు దిక్పాలకుడుగా కూడ బ్రహ్మచే దక్షిణదిక్కుకు నియమించబడ్డాడు.

యమసభలో శిక్షలు విచారణ ససమయములో పితృదేవతలుగా ఉన్న వారందరూ వస్తారు. యమపురి నివాసముగా బ్రహ్మ ఆదేశాల ప్రకారముగా ఆయుస్సు తీరినవారిని యమపురికి రప్పించేందుకు అధికారి. మానవత్వానికి దూరమనిపించినవిగా భావించి క్షమించరాని కొన్ని పనులను పాపములుగా నరకశిక్ష యముడు విధిస్తాడని పురాణములు చెప్పాయి. శిక్ష పూర్తయినవారు యమనిర్ణయము ప్రకారము శాశ్వతమైన పితృదేవతలుగా మారతారు. లేదా స్వర్గానికి శాస్వతనివాసము పొందవచ్చు. లేదా ఇంకా పాపనాశనం జరగనివారు జన్మపరంపరలతో పునర్జన్మ నెత్తవలసి ఉంటుంది. పితృలోకంలో ఆగిపోయిన పునర్జన్మ లేని పితరులు శ్రాద్ధ విధి వ్రకారం తమ వంశీకులచే అర్చింపబడి ఆకలి దప్పులు లేకుండా ఉంటారు. స్వర్గానికి శాశ్వతమైన మోక్ష ప్రయత్నాన్ని ఆశిస్తూంటారు.

మహాభారతంలో పాండురాజు పితృలోకములోనే ఆగిపోయాడు. పితృ లోకము అంటే నరకము కాదు. పితృలోకము వర్ణన అగ్ని పురాణములో ఉంది. పితరులకు పిండప్రదానము వలన ఆహారము లభిస్తుంది. లుప్తపిండ ప్రశంస, పితృ లోకపతనము గురించి భగవద్గీతలో అర్జునవిషాదయోగంలో శ్రీ కృష్ణుడు ప్రస్తావించాడు. సభాపర్వము యమసభను వర్ణించింది. గరుడపురాణము నరకలోక వర్ణన చేసింది. యమునికి సహాయకుడిగ చిత్రగుప్తుడు, యమభటులు నరకభూమిలో నివాసమున్నారని ఆ నివాసములను గరుడపురాణమువర్ణించింది.

పురాణాలు పేర్కొన్నవి 28 నరకములు.

1.తమిశ్రమనే నరక శిక్ష దొంగలు, పరుల భార్యను అపహరించిన వారు, శిశుహంతకులు అసుభవిస్తారు. యమభటులు ఈ పాపులను తాళ్ళతో కట్టేస్తారు. చెవులు చిల్లులు పడేలా భేరీ నినాదాలు వినిపిస్తారు. మూర్ఛపోయిన పాపులకు మెలకువ తెప్పించి పాప పరిసమాప్తి వరకు వినిపిస్తారు. 2. అంథతమిశ్ర శిక్ష ఒకరికి తెలియకుండా ఒకరినొకరు ఆహార, శయ్యావిషయాలలో రహస్యప్రవర్తనతో మోసగించుకునే భార్యాభర్తలకు వేయబడుతుంది. భేరీ శబ్దము లుండవు. కాని చితకబాదుడు నిరంతరముగా సాగుతుంది. భార్యాభర్తలిద్దరినీ కలిపి కదలకుండా కట్టేసి కొడతారు. 3. రౌరవము వంచకుల కోసము. సొమ్మొకడిది, సోకొకడిదిగ పరాయి సంపదను సొంతము చేసుకుని అసలు హక్కుదారుని హీనంగా చూసినా, కష్టాల పాలుచేసినా ఈ శిక్ష యముడు వేస్తాడు. రురు అని పేరుగల భయంకర విషనాగులు నిరంతరము శిక్ష పూర్తయేవరకు కాటువేసి బాధిస్తాయి. 4.మహారౌరవము కూడా మరిన్ని భయంకరమైన రురు పాములుతో వంచకుల కోసము ఎదురు చూస్తాయి. ఇక్కడకు వచ్చే పాపులు వారసులను హింసించి సంపదలు హరించి అతిక్రూరముగ హత్యలు కూడ చేసినవారు. 5.కుంభీపాకము పక్షుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే మాంసభక్షణ పాపాలకు శిక్షలు వేస్తుంది. సలసలకాగే నూనె లో యమభటులు వీరిని వేవుతారు. శరీరం మీది రోమాలు ఊడిపోవాలి. అఖరిరోమం రాలిపోయేవరకు ఒకటి మిగిలినా వేగుతూ పాపులు హాహాకారాలు చేస్తారు. 6.కాలసూత్రము, లేదా యమసూత్రమనే నరకము కట్టుబాట్లు అతిక్రమించినవారికి, తల్లిదండ్రులును,పెద్దలను అవమానకరమైన రీతిలో బాధ పెట్టే వారికి శిక్ష వేస్తుంది. ఈనరకములో భరింపరాని ఉష్ణోగ్రత తట్టుకోలేక పాపే అల్లల్లాడిపోతాడు. 7.స్వధర్మవిముఖులకు అసిపత్రనరకములో అసిపత్ర అంచుఖడ్గహింస. 8.అదే శిక్ష రాజధర్మము తప్పిన వానిని శూకరముపేర నరకశిక్ష. 9.బ్రాహ్మణులను బాధలు పెట్టిన వారు అంధకూవము. 10. అలాగే అకారణ హింసావ్రవృత్తి ఎవరు కలిగినా క్రిమిభోజన నరకశిక్షను క్రిములు భక్షించాల్సి ఉంటుంది.ఈ ప్రధానమైన శిక్షలుకాక స్త్రీ అపహరణకు, అసహజ వ్యభిచారము, జంతువులతో సంభోగము మొదలైనవి 11.తప్తమూర్తి 12.సాల్మలి, 13.వజ్ర కంటకశాలి ,14.మానవ మలమూత్రాల ప్రవాహ వైతరిణి 15.చీమునెత్తురుల పూయోదకనరక శిక్షలు అనుభవించాలి. 16.నిషిద్ధ జంతువుల వేటకు ప్రాణారోధము,17.ఆవును చంపినందుకు విశాసనము యముని శిక్షలు. 18. అంగచూషణకు లాలభక్ష సముద్ర మునకలు విధిస్తాడు. 19.సారమేయాశ్రయమను నరకభూమిలో 700 కుక్కలు దేశద్రోహనేరస్థులను పీక్కు తినడానికి ఎదురు చూస్తుంటాయి. 20.కూట సాక్ష్యానికి అవిచి, 21.అయఃపాన నరకమునకు త్రాగుబోతులై సంస్కారాన్ని మరచిపోయి హీనజీవితము గడిపినవారు చేరుకుని లోహద్రవమును పానీయ శిక్ష అనుభవిస్తారు. క్షారకర్దమ, రక్షేభక్షము, శూలప్రోతము, దందశూకము,వఠరోదము,పర్యావర్తనకము,మొదలైన నరకములు వాటి ఉనికితో బాటు పిసినిగొట్టులు కూడ సూచీముఖము అనే నరకముతో 28 పేర్లు గల నరకములు పురాణాలు పేర్కొన్నాయి.

ఇది కలియుగము. యముడు నైమిశారణ్యములో శౌనకాది మునులు చేసిన సత్రయాగానికి వెళ్ళాడు. అక్కడ సూతుని భాగవతాక్షర పఠనము విని నంతసేపు యమశిక్షలు అమలు కూడ మరచిపోయి పరవశించాడు. పాపనాశనం కావాలని భాగవతము చదివితే కాలుడు తప్పక ప్రసన్నుడై మనలను, మనపితరులను అనుగ్రహిస్తాడు. భాగవతమే కాదు అష్టాదశ పురాణశ్రవణము ముక్తి దాయకమని నా అభిప్రాయము.

Exit mobile version