Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కావ్య-4

పెద్దవారు చెప్పినట్టు పని లేని మెదడు దెయ్యాల నిలయం అన్నట్టు, ఇంటిలో ఒంటరితనం వల్ల మనసులో పరి పరి విధాలుగా ఆలోచనలు వచ్చేవి. చదువుకోవాలనే నా తపనకు ఇదే సరైన సమయం అనిపించింది. నా ఒంటరితనం చూసి నీరజ్‌కి కూడా నా పైన జాలి కలిగింది. ఎట్టకేలకు నేను కాలేజీలో చేరేందుకు ఒప్పుకున్నాడు. ఎలాగో నేను బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేశాను.

రెండు సంవత్సరాలు జీవన నౌక అలా ముందుకు సాగిపోయింది. నీరజ్ వృత్తి రీత్యా డాక్టర్ కావటంతో ఇంటి ఖర్చు గురించి ఆందోళన ఉండేది కాదు. కానీ నా జీవితం అంతా సజావుగా సాగాలని నా నుదుటిరాతలో లేదు కాబోలు….

ఒక వ్యక్తి చెడిపోవటానికి నాలుగు స్టేజిలు చాలు అని నా అభిప్రాయం. ఈ నాలుగు స్టేజీలలో ఒకో దానికి 25 శాతం మార్కులు ఇస్తూ పోతే, నాలుగు దశలు పూర్తి అయ్యేటప్పటికి వాడి జీవితం సంపూర్ణగా నాశనం అవుతుంది. వాటిలో మొదటిది పేకముక్కలాట, చూడడానికి చిన్నగానే మొదలయ్యే వ్యసనం ఇది. దాని మూలంగా సంసారాలను నాశనం చేసుకున్న వ్యక్తులు మన ముందే ఎంతో మంది ఉన్నారు. తరువాత రెండవ స్టేజీలో తాగుడు, ఇది మత్తులో మెల్లిగా దింపుతూ పోతుంది. ఆ మత్తు ఒకనాటితో, ఒక రాత్రి తో సంపూర్ణం కాకుండా మెల్లిగా జేబు, ఇల్లు కూడా ఖాళీ చేస్తుంది. అలాగే, ఆరోగ్యాన్ని, పాడుచేసుంది. సంసారాన్ని వీధిన పడేసేందుకు కూడా తయారైన తాగుబోతులు మన చుట్టూ ఉన్నారు. వారిని మనం నిత్య జీవితంలో రోడ్డు మీద తప్పతాగి పడి ఉండటాన్ని చూస్తూనే ఉన్నాము. దీనికి తోడు మాంసం తినడం, ప్రతిరోజూ కూడా అంతా మంచిది కాదు అని నా అభిప్రాయం. దాని ఖర్చు కూడా ఎక్కువ పైగా, అది ఆలస్యాన్ని, సోమరితనాన్ని పెంచుతుంది.

కానీ నీరజ్ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినవాడు. అయినా ఆయనకున్న ఈ అలవాట్లు చూస్తే ఎవరూ నమ్మరు. కానీ మనుష్య జన్మ మరియు కర్మ అనేది వారి వారి పూర్వజన్మ కర్మఫలం మీద కూడా ఆధారపడి ఉంటుంది. జన్మ మూలంగా మనం ఎవరినీ బ్రాహ్మణుడు లేదా శూద్రుడు అనలేము.

ఒక రోజు నాకు ఒంట్లో నలతగా అనిపించి డాక్టర్‌ను కలిశాను. అపుడు నేను తల్లి కాబోతున్నానని తెలిసింది. నాకు సంతోష పడాలో, బాధపడాలో అర్థం కాలేదు. నేను ఇప్పుడిప్పుడే ఎం.ఏ. చదవటం మొదలు పెట్టాను. నీరజ్ దురాలవాట్ల వల్ల డబ్బులన్నీ ఖర్చవసాగాయి.

ఇక నా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. నా అన్నవారు, వారి ఆదరణ నాకు కూడా లేదు. అన్న తమ్ములు, బంధువుల మాట అటుంచి, వారిని మరచి కూడా పోలేని స్థితి నాది. కాలేజీ నుంచి అప్పుడప్పుడూ నా స్నేహితురాలు పూజా ఇంటికి మాత్రం వెళ్ళేదాన్ని. అక్కడ కొంత మనసుకు హాయిగా అనిపించేది.

ఒక రోజు అకస్మాత్తుగా పూజా ఇంట్లో అమ్మను చూశాను. కలనా, నిజమా అని నన్ను తరచి చూసుకున్నాను. అంతే, పరుగు పరుగున వెళ్ళి అమ్మ ను చూడగానే అమ్మ వడిళో తల దాచుకొని ఏడుస్తూ ఉండి పోయాను. ఇద్దరం అలా ఎంత సేపు ఏడుస్తూ ఉన్నామో తెలియలేదు. ఇంతలో పూజా మా ఇద్దరికీ మామూలుగా ఉంచే ప్రయత్నం చేసింది. అరె కావ్యా, అమ్మ నీకోసం ఏమి తెచ్చింది చూడు అని, అమ్మ చేతి లడ్డు ఇచ్చింది, అమ్మ చేతి లడ్డులంటే నాకు ప్రాణం. అమ్మ నా కోసం తయారు చేసుకొని వచ్చింది. నాన్న, అన్నయ్యలకు కూడా చెప్పకుండా తెచ్చింది.

నాన్నగారికి నన్ను ఇంటికి పిలవటం కానీ, లేక మా ఇంటికి వారు వచ్చేది కానీ ఇష్టం ఉండేది కాదు. వారికి నా వల్ల నా తమ్ముళ్లు, చెల్లెళ్ల జీవితం కూడా దెబ్బతింటుందని భయం ఉండేది. ఇపుడు నాకు ఒక కొత్త లోకం లోకి పోయినంతగా హాయిగా అనిపించసాగింది. అప్పుడప్పుడూ అమ్మను కలవటం నాకు ఒక పండుగ లాగా అనిపించేది.

నా సంతోషం వెనుక పూజా కృషిని నేను మెచ్చుకోకుండా ఉండలేను. నా కోసం అమ్మని వాళ్ల ఇంటికి పిలిపించేది, అపుడు నన్ను కూడా రమ్మని చెప్పేది. ఇలా ఎడారి లాంటి నా బ్రతుకులో అమ్మ రాక ఒక ఒయాసిస్ లాగా ఆనిపించసాగింది.

అమ్మ ఇంటి నుంచి వచ్చిన తరువాత – అమ్మను కలవటమంటే ఎంతో హాయిని కలిగిస్తుంది అనేది. ఈ రోజుకు కూడా గుర్తుకు చేసుకుంటే పూజా పట్ల నా మనసు కృతజ్ఞతా భావంతో నిండి పోతుంది.

అమ్మ కూడా నా కోసం ఏదో ఒకటి చేసుకొని వచ్చేది. నాకు తినిపించి అమ్మ తృప్తిపడేది. ఎంతైనా నేను ఆమె గారాలపట్టిని కదా. ఈరోజు నేను అమ్మ నయ్యాక అమ్మ మాతృత్వంలోని సంతోషాన్ని, ఇంకా ఆవేదనను రెండిటిని తెలుసుకుంటున్నా.

***

కానీ నాన్న!

నాన్నకు ఉన్న అసహాయత నేడు తెలుసుకుంటున్నా. నాన్నకు అమ్మ నన్ను కలిసే విషయం తప్పక తెలిసే ఉంటుంది. ఇలాంటి విషయాలు దాచాలి అనుకున్నా కూడా దాచలేం కదా. అమ్మ నన్ను కలిసి వెళ్ళిన తరువాత ఆమె మొహంలో కనిపించే సంతోషాన్ని ఎవరూ దాచలేరు కదా. నాన్నగారు ఇవి అన్నీ తెలిసి కూడా తెలియని వారిలా నటిస్తూ ఉన్నారు.

నాన్న నన్ను చాలా ప్రేమించేవారు, ఈ ఘటన వల్ల ఆయనకు పెద్ద షాక్ కలిగింది, ఇంటికి వెళ్లడానికి నాకు అనుమతి లేని రోజులలో ఓసారి నేనే ఆయనను కలిసేందుకు పోస్టాఫీసుకు వెళ్ళాను. నేను బి.ఎడ్. పరీక్ష కట్టడానికి నాకు నా డిగ్రీ సర్టిఫికెట్ కావాల్సి ఉండే. నా దగ్గర్ ఉన్న సర్టిఫికెట్‌లను నేను కోపంలో చింపేశాను కదా…

అదొక చిన్న సంఘటన అయినా నా జీవితంలోని దాని ప్రాముఖ్యత దానికుంది. అప్పుడప్పుడే నీరజ్ అనుమతి తీసుకొని కాలేజీ వెళ్లడానికి ప్రారంభించాను. కానీ ఒకటి రెండు రోజులు ఊరుకున్నాడు కానీ మరలా మెల్లిగా నస పెట్టడం మొదలు పెట్టాడు. “నీకు ఇంటి పట్టున ఉండడానికి ఇష్టం లేదు కానీ కాలేజీ పేరుతో ఊరి మీద పడి తిరుగుతావు” అంటూ మొదలు పెట్టాడు. “నీకు బయటకు పోయి ఇష్టం వచ్చినట్టూ తిరుగుతూ ఉండటం కావాలి., అందుకు కాలేజీ ఒక నెపం మాత్రమే” అని నిందించాడు నన్ను.

రోజూ అలా నీరజ్ అంటూ ఉంటే ఒకరోజు నాకు వెర్రెక్కి నా దగ్గర ఉన్న అన్నీ సర్టిఫికెట్స్ అన్నీ చించి వేశాను. అది ఒక పిచ్చి ఆవేశం మాత్రమే. అవి ఉంటే కదా నీరజ్ నన్ను తిడతాడు అని అనుకున్నా. కానీ ఆవేశం తగ్గాక కానీ తెలియలేదు నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని.

కానీ మనం జీవితంలో ఇలాంటి ఆవేశపూరితమైన ఆలోచనల ప్రభావానికి లోనూ కాకూడదు అని నాకు తర్వాత తెలిసింది. ఎప్పుడు ఏ వస్తువు అవసరం అవుతుంది అనేది తెలియదు. కానీ ఆన్నిటికీ ఒక సమయం వస్తుంది , ఆ రోజు ఆ వస్తువు లేకపోతే మనం ఉండలేము. ఆ రోజు నాకు ఈ విషయం అర్థమైంది.

***

ఎం .ఏ. పరీక్షలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఒక వైపు నేను అమ్మను కాబోతున్నాను. నీరజ్ ఇంటి వారు మాత్రం చాలా హాయిగా ఉన్నారు. కానీ నాకు మాత్రం నా చదువుకు మరలా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.

ఇప్పుడు జీవితం మరింతగా గంభీరంగా తయారైంది. పట్టుమని ఇరవై ఏళ్ళు లేవు, జీవితం లోని ఆటుపోట్లు రుచి చూసిన అనుభవాల మధ్య నేను కొట్టుమిట్టాడుతున్నాను, తొమ్మిది నెలల సమయం ఎలా గడిచిందో తెలియలేదు. ఇంకా జీవితంలో పెద్దగా ఏమి జరుగలేదు. ఇవి అన్నీ చిన్న చిన్న అలలు మాత్రమే అని నాకు తెలియలేదు. అపుడే నేను ఒక ఆడపిల్లకు జన్మనిచ్చాను.

హాస్పిటల్ బెడ్ మీద నేను పడుకొని ఉన్నాను. నాతో పాటు మా అత్తగారు ఉన్నారు. హాస్పిటల్‌లో ఒకటే సందడి, అలజడిగా అనిపించి అత్తయ్యను అడిగాను – “ఏం జరుగుతూ ఉంది హాస్పిటల్‍లో” అని.

నా కూతురికి పుట్టుక తోనే పళ్ళు ఉన్నాయి అనే విషయం తెలిసి హాస్పిటల్‌లో ఉన్న అందరూ ఆ పిల్లను చూడటానికి రాసాగారు. అదొక వింత అన్నట్టు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. అలా పుడితే సమాజానికి పెద్ద హాని ఉందని కొందరు, ఇంటికి పీడ పడుతుందని కొందరు, వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బయట కొందరు పత్రికల వాళ్ళు కూడా ఫోటో తీసుకోవాలి అంటూ వచ్చారు. హాస్పిటల్ లోని డాక్టర్లు, నర్సులు అందరూ గుమిగూడి ఉన్నారు. ఒకరికి ఈ విషయం కుతూహలం అయితే, ఇంకొందరైకి ఈ విషయం పరిశోధన చేయవలసిన విషయం అయింది. మరి కొందరైకి మాత్రం పూర్తిగా వినోదాన్ని ఇస్తోంది.

అప్పుడే నేను నా కూతుర్ని చూసా. నాకు కూడా కొంచెం ఆందోళన కలిగింది, ఇదేంటి, ఇపుడు యేమి చేసేది అని? అలా ఆలోచిస్తూ ఉండి పోయా కొంత సేపు. మామూలు పిల్లల లాగా రంగు, రూపులో కూడా తేడాగా ఉంది. శరీరం మీద వెంట్రుకలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ పిల్ల మా కూతురు. నీరజ్ తండ్రి అయినందుకు చాలా సంతోషపడ్డాడు. నేను కూడా చాలా సంతోషపడ్డా, కొంత కంగారుగా కూడా ఉంది.. నాకు ఇది కొత్తగా అనిపించసాగింది. ఇంటి పనులతో పాటు ఒక చంటిపిల్లను కూడా చూసుకోవాల్సి వచ్చేది. నేను ఒక్కదాన్ని పని మొత్తం ఎలా చేసుకోగలను? పాప చాలా బలహీనంగా కూడా ఉంది, సరిగా ఎత్తుకోవటానికి కూడా వీలు లేనంతగా.

భగవంతుడికి నా మొర వినిపించిది కాబోలు, నీరజ్‌కు తెలిసిన ఒక కుర్రాడు దొరికాడు. ఆ అబ్బాయి అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చేవాడు. ఇపుడు రోజూ వస్తూ ఉన్నాడు. నేను వాడికి కొంచెం చదవటం రాయటంలో సహాయం చేసేదాన్ని. ఆ అబ్బాయి కూడా నాకు ఇంటి పనులలో సహాయం చేసేవాడు. తరువాత ఆ అబ్బాయి మా ఇంట్లోనే ఉండటం మొదలు పెట్టాడు. నా కూతురు నీరజ ఒక సంవత్సరం పాప అయింది. కానీ మిగతా పిల్లల వలె నడవలేక పోతూ ఉంది. అది ఒక పెద్ద బాధగా మారింది.

ఇంతలో ఒక కొత్త సమస్య వచ్చి పడింది, నాకు తెలియనే లేదు నేను ఇంకొక సారి తల్లి అవుతున్నాను అని. కొంత సిగ్గుగా అనిపించింది. నేను ఇంత తొందరగా గర్భం దాలుస్తానని అనుకోలేదు. కానీ ఇపుడు ఇంకా ఏదీ ఉపాయం కూడా లేదు. అలాగే రెండవ సారి తొమ్మిది నెలలు, అటు నీరజతో, ఇటు ఇంటి పనులతో అలాగే గడిచి పోయింది. చూస్తూ చూస్తూ ఇద్దరి పిల్లల తల్లి అయ్యాను.

ఇద్దరు పిల్లలు, ఇల్లు సంబాళించడం కొంత సమస్యగా మారింది. సందులో సమారాధన అన్నట్టుగా మా పక్క ఇంటి వారు ఊరికి వెడుతూ, వాళ్ళు పెంచుకునే కుందేలు పిల్లను ఒకదాన్ని మా ఇంటిలో విడిచి వెళ్లారు. అసలే పిల్లలు, ఇంటి పనులతో నాకు టైమ్ దొరికేది కాదు. కాదనలేక వారి కుందేలుని చూసుకుంటానని అన్నాను. నీరజకు ఒకటిన్నర ఏడాది వయసొచ్చినప్పటికీ, నడవలేక పోయేది. ఆ కుందేలు ఏ ముహూర్తంలో మా ఇంటికి వచ్చిందో తెలియదు. ఆ కుందేలు పిల్లను పట్టుకునేందుకు నీరజ పరిగెత్తడం మొదలు పెట్టింది. ఆ కుందేలుకు ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెపుకున్నా. నాకు ఎంతో రిలీఫ్‌గా అనిపించింది.

***

నీరజ్ దురలవాట్లు నాలో భయాందోళనలు కలగచేయటంతో పాటు నా కాళ్ళ పైన నేను నిలుచుకోవాలనే ఆలోచనకు బీజం వేశాయి. నాకు ఎం.ఏ. చేయాలనే కల ఉండేది. ఆ కల మధ్యలోనే ఆగిపోయింది. నా చదువు సగం లోనే ముగించవసి వచ్చింది. సమయం దొరికినప్పుడల్లా ఇపుడు ఏమి చేయాలి? అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాను.

మరలా చదువు అనే ప్రసక్తి వస్తూనే అర్ధాంతరంగా నిలిచిపోయిన ఎం.ఏ. కన్నా బి.ఎడ్. చేయటం మరింత సబబు అని అనిపించసాగింది. కనీసం అవసరమైతే ఒక టీచరుగా నైనా ఏదైనా స్కూల్‌లో పని చేసుకోవచ్చు అని అనుకున్నా.

సరే, బి.ఎడ్.కు అప్లై చేయాలి అంటే డిగ్రీ సర్టిఫికేట్ అవసరమయింది. కానీ ఆ రోజు నీరజ్ మీద కోపంతో సర్టిఫికేట్ చింపేసింది గుర్తొచ్చి మనసు బరువెక్కింది. పెళ్లి కాక ముందు ప్రతి సమస్య వచ్చినప్పుడూ నాన్న దగ్గరికి వెళ్ళి పోయేదాన్ని.

ఈ రోజు నాన్న చాలా గుర్తొస్తున్నారు. ఇపుడు, పెళ్లి అయిన నాలుగు సంవత్సరాల తరువాత నాన్నను కలిసేందుకు వెళ్ళాను. నాన్నకు నా గురించి అన్నీ తెలుసు, నాన్న నా సర్టిఫికట్స్ ఒక కాపీ పెట్టుకున్నారు. నాకు ఇలాంటి సమస్య వస్తుందని నాన్నకు ముందే ఏలా తెలుసాని ఆశ్చర్య పోయాను.

నాన్నగారు నాతో అన్నారు- “నాకు తెలుసు, ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించాను. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా దాచి పెట్టాను. నువ్వు వీటిని తీసుకొని వెళ్ళు, కానీ వీటి ఇంకొక కాపీ ఇక్కడ నా దగ్గర కూడా ఉండనీ”అని.

నేను నాలుగు సంవత్సరాల నుంచి నాన్నను చూసిందే లేదు. నాన్నలో మొదట్లో ఉన్న జీవనోత్సాహం కనిపించ లేదు. బాగా సన్నబడ్డారు కూడా.

నాన్న నన్ను ఒక మాట కూడా ఏమీ అనలేదు. నాను ఇష్టమైనవి తెప్పించి తినిపించారు. సర్టిఫికెట్స్ ఇచ్చి పంపించారు.

నేను మళ్ళీ నా చదువు మొదలు పెట్టాను. నాకూ, నా పిల్లలకు ఈ విద్యనే ఆధారంగా మారుతుందని నేను ఆ రోజు అనుకోలేదు. నాన్న ఇచ్చిన సర్టిఫికేట్స్ పనికి వచ్చాయి. నేను బీ.ఎడ్ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యాను.

ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, ఒక బిడ్డ చాలా బలహీనంగా ఉండేది. ఇలాంటి సమయంలో ఇంకా ముందుకు చదవాలని మనసులో ఉన్నా కూడా సమయాభావం. ముఖ్యంగా పుస్తకాలను కొనుక్కోవడానికి బోలెడు డబ్బు కూడా కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇంటిని నడిపించేదే కష్టంగా ఉంది. పోనీ లైబ్రరీకి వెళ్ళి చదువుకుందాము అంటే సమయం దొరికేది కాదు. రాత్రి ఇద్దరు పిల్లలు పడుకున్నాక చదవటం మొదలు అయ్యేది. ఇక పరీక్షల సమయంలో నా ఘర్షణ మాటల్లో చెప్పలేను. నాకు అనిపించేది నేను పాస్ కూడా కాలేనేమో అని.

ఒక వైపు నీరజకు జ్వరం గా ఉంది, బిడ్డను విడిచి పరీక్షకు పోలేని పరిస్థితి. కానీ వెళ్ళక తప్పదు. నీరజ్ పూర్తిగా మారిపోయాడు. ఇంటి గురించి కానీ, పెళ్ళాం, పిల్లల గురించి కానీ ఏ మాత్రము చింత లేదు అతనికి. ఒక్కదాన్ని ఐతే అంతా భయపడి ఉండేదాన్ని కాదేమో, ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లిని. వారి బాధ్యత కూడా నా మీద ఉంది.

ఎలాగో ఒకలాగా పరీక్షలు ముగిశాయి. ఆ భగవంతుని దయ వల్ల నేను పాస్ కూడా అయ్యాను.

***

నీరజ్ గురించి ఆలోచిస్తూ పోతే ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు గుర్తుకు వస్తాయి. మామూలు గృహిణి భరించలేని సంఘటనలు అవి. కానీ మామూలు భార్య మాత్రమే కాదు, ఇద్దరు పిల్లల భాధ్యత నా మీద ఉందనే ఆలోచన నాకు ఎప్పుడూ ఉండేది.

మేము ఉండే వీధి గురించి ఇక్కడ చెప్పలేదు కదూ.. ఆ వీధిలో ఉన్న వారందరూ నాకు బాగా తెలుసు. వారందరిలో ఒక కుటుంబం బాగా క్లోజ్‍గా ఉండేవారు. మేము అందరం కలిసి మెలసి ఉండేవారం. ఒకరికి అవసరమైనప్పుడు ఇంకొకరు సహాయం చేసుకునే వారు. ఒక రకంగా కుటుంబ సభ్యుల వలె ఉండేవారు. వారు క్రైస్తవ ధర్మాన్ని అనుసరించేవారు. వారి కూతురు నాకన్నా వయసులో చిన్నది. నన్ను వదిన అని పిలిచేది. తన పేరు జెనిఫర్.

మా ఇంటి నుంచి నాలుగు ఇళ్ల తరువాత ఉత్తర దిశగా ఒక రోడ్డు ఉండేది. ఆ వీధి చివర వారి ఇల్లు ఉండేది. ఆ అమ్మాయి నాన్నగారికి ట్రీట్మెంట్ ఇవ్వటానికి నీరజ్ అప్పుడప్పుడూ వారి ఇంటికి వేళ్ళేవాడు. నీరజ్ స్వయంగా ఈ మాటను నాకు చెప్పాడు. నాకు కూడా వారందరూ బాగా తెలిసినందున అంత పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించలేదు.

ఒక రోజు ఏదో పని మీద నేను బయటకు వస్తూ ఉన్నాను. అంతలో నీరజ్ మిత్రుడు వచ్చాడు. “వదిన గారు, నీరజ్ ఉన్నాడా ఇంట్లో?” అని అడిగాడు.

“లేదు, ఇప్పుడే ఏదో పని ఉందని బయటకు వెళ్లారు” అని చెప్పా.

“అలాగా! అయితే జెనిఫర్ ఇంటికి పోయి ఉంటాడు లెండి”.

“ఉండొచ్చు, ఆ అమ్మాయి తండ్రిగారికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండొచ్చు”

“అయ్యో, వదిన గారు, కొంచెం నీరజ్‌ను ఒక కంట కనిపెట్టండి”

“అయ్యో, ఆయనను నేను కనిపెట్టుకొని ఉండటం ఏమిటి?”

ఆయన ఏమి చెప్పలేదు, కానీ అతని కన్నులలో నాకు ఏదో చెప్పాలని ఉంది అని మాత్రం తెలిసింది.

మరలా కొన్ని రోజుల తరువాత మరికొందరు నీరజ్ స్నేహితులు ఇంటికి వచ్చారు. అపుడు కూడా నీరజ్ ఇంటి పట్టున లేరు..

వారిని కూర్చోమని చెబుతూ అన్నాను- “నీరజ్ ఇంట్లో లేరు!”

“మాకు తెలుసు వదినా, నీరజ్ ఇపుడు ఎక్కడ ఉన్నాడు అనేది”

“అలా అయితే మీరు నన్ను కలిసేందుకు వచ్చారా?”

“అవును అక్కా! మీ చేతి యాలకుల టీ తాగాలని వచ్చాము.”- శేఖర్ అన్నాడు.

శేఖర్ నన్ను తన పెద్ద అక్క అని ఎప్పుడూ చెప్పేవాడు. నీరజ్ స్నేహితులందరిలో శేఖర్ మాత్రమే నా కన్నా వయసులో చిన్నవాడు.

నేను నవ్వుతూ టీ పెట్టడానికి వంటింటి వైపు వెళ్ళాను. సరే ఎలాగూ టీ పెడుతున్నాను కదా , కొన్ని పకోడీలు చేసి ఇద్దాము అని పకోడీలు చేయసాగాను. అంత వరకు వారు నా పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. ఇల్లంతా నవ్వులతో నిండి పోయింది.

ఇంతలో నేను పకోడీలు, యాలకుల టీ తయారు చేసి కప్పులలో పోసుకొని తీసుకొని వచ్చాను.

అంతలో శేఖర్ పిల్లలతో బయటకు వెళ్ళి ఆడుకోండి అని వారిని పంపించాడు. వారందరూ నాతో ఏదో చెప్పాలి అనుకుంటూ ఉన్నారు అని మాత్రం అర్థం అవుతూ ఉంది, ఏవిషయం గురించి అయి ఉంటుంది అనేది మాత్రం అర్థం కాలేదు. నా దగ్గర మాట్లాడేందుకు సంకోచిస్తూ ఉన్నారు అని మాత్రం గ్రహించాను.

వారందరిలో నిరంజన్ పెద్దవాడు, ఇంకా తెలివైన వాడు కూడా. వేరే వారికి అతడు పొగరుబోతు వలె కనిపించినా నాకు మాత్రం నా పెద్ద అన్న వలె అనిపించేవాడు.

అతను పకోడీలు కూడా పళ్ళెంలో చూసి – “ఆహా! వదిన గారు, అందుకే అంటారు స్త్రీని అన్నపూర్ణ స్వరూపం అని, మాకు కేవలం టీ దొరుకుతుంది అని అనుకున్నాము. దానికి తోడు మీరు బోనస్‌గా పకోడీలు కూడా తెచ్చారు” అన్నాడు.

అందుకు శేఖర్ అన్నాడు- “ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ గా తెచ్చారు వదిన గారు.”

“ఏంటి ఈ రోజు అన్నింటికీ ఎక్కువగానే పొగుడుతూ ఉన్నారు నన్ను? ఏంటి సమాచారం? ఏదో చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారు, కానీ అది ఇది చెబుతూ ఉన్నారు. నేనూ అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను” అని అన్నాను.

అవధేష్ వాళ్ళిద్దరినీ చూస్తూ, ఒక నిమిషం తరువాత మెల్లిగా అన్నాడు- “వదిన గారు, నీరజ్ గురించి మీకు కొద్దిగా చెప్పాలి.”

“అరె. ఏమైంది? నీరజ్‌కు ఏమి కాలేదు కదా? ఆయన బాగున్నారు కదా?”

నా గుండె వేగంగా కొట్టుకోసాగింది.

“హా, వదినా. నీరజ్‌కు ఏమి కాలేదు, అతను బాగా ఉన్నాడు. మీరు భయపడవలసిన పని లేదు. కొంచెం అతని ప్రవర్తన బాగా లేదంతే.”

“నాకు అర్థం కావటం లేదు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు. కొంచెం వివరంగా చెప్పండి” అని అన్నాను.

అపుడు అవధేష్ ఇంకొక సారి దైర్యం చేసి ఇలా అన్నాడు-

“నీరజ్ ఈ మధ్యన జెనిఫర్ ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నాడు. ఆమెను తీసుకుని బయటకు కూడా వెళ్తున్నాడు. మిమ్మలను పిలుచుకొని వచ్చినపుడు మీరిద్దరూ ప్రేమించుకున్నారు అని అనుకోని మేము కూడా చేయూత నిచ్చాము. మాకు చాలా రోజుల తరువాత కానీ తెలియలేదు. మిమ్మల్ని కలిసిన తరువాత మాకు చాలా సంతోషం అయింది. కానీ ఈ రోజు నీరజ్ ప్రవర్తన, అలవాట్లు చూసి మాకు చాలా బాధ కలుగుతోంది.”

నేను కొయ్యబొమ్మ లాగా నిలబడి వారి మాటలన్నీ వింటూ ఉన్నాను. పెద్ద పిడుగు నా తల మీద పడినట్టు అయింది. ఒక్కసారిగా నా భవిషత్తు అంధకారమయంగా తోచింది. కొంత సమయం తరువాత నేను తేరుకున్నాను. నా మొహంలో రక్తపు చుక్క లేనంతగా పాలిపోయింది. ఏమీ జరగనట్టు మామూలుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ, జీవం లేని నవ్వు నా మొహాన పులిమే ప్రయత్నం చేశాను.

నేను ఏమీ మాట్లాడలేదు, నెమ్మదిగా ఖాళీ కప్పులన్నీ ట్రే లో పెట్ట సాగాను. శేఖర్ అన్నాడు- “మంచిది అక్కా, మేము వెళ్లొస్తాము” అని. అందరూ బయటకు నడచారు.

వీరందరూ నీరజ్‌కు మంచి మిత్రులు, అలాగే నేనంటే కూడా వీళ్లకి ప్రత్యేకమైన గౌరవం ఉంది. వీరు అబద్ధం చెప్పరు అని నాకు బాగా తెలుసు. ఇప్పుడిప్పుడే అంతా సరిపోతూ ఉంది. నీరజ్ కూడా ఇంటి గురించి శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. పిల్లలను కూడా బాగా చూసుకుంటూ ఉన్నాడు. నేను కూడా చాలా ఆటు పోట్ల తరువాత జీవితాన్ని కొద్ది కొద్దిగా ఆస్వాదించడం మొదలు పెట్టాను.

ఇంతలో ఇలా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇంతటి నమ్మకద్రోహం నీరజ్ నాపట్ల ఎందుకు చేశాడు? ఒక వేళ నీరజ్‌ను ఈ విషయం గురించి అడిగినా, తాను ఒప్పుకోడు. పైగా నా పైన విరుచుకొని పడతాడు. ఆయన స్వభావాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. కానీ ఆలాని ఊరకే ఉండటం కూడా తప్పే అని నా ఆభిప్రాయం. ఇదే ఆలోచనలో పడి సాయంకాలం దేవుడి దీపం కూడా పెట్టలేదు. వంట కూడా వండలేదు. నేను, నా ఆలోచనలు, నన్ను ఏ పని చేయనివ్వ లేదు. పిల్లలకు ఏమీ అర్థం కాలేదు, కానీ వారికి అమ్మ మామూలుగా లేదని మాత్రం అర్థం అయింది. వారి పాటికి వారు బొమ్మలతో ఆడుకోవటం మొదలు పెట్టారు.

ఎలాగో ఒక లా లేచి ఒక కూర, కొన్ని చపాతీలు చేసి ఉంచాను. పిల్లలు తిన్నారు. నీరజ్ కొరకు కొన్ని చపాతీలు ఉంచాను. నాకు ఏమీ తినాలని అనిపించ లేదు. ఒక పెన్ తీసుకొని నా భావనాలన్నిటినీ పేపర్ మీద రాయటం మొదలు పెట్టాను. పెళ్లి అయినప్పటి నుంచి పేపర్ మరియు పెన్ మాత్రమే నా స్నేహితులయ్యారు. నా మనసు లోని భావనలు వారికి చెప్పినట్టు ఇంకెవరికీ చెప్పలేదు, చెప్పడానికి ఎవరూ లేరు కూడా.

కొంత సేపు రాసిన తరువాత మనసుకు నెమ్మదిగా అనిపించింది. అంతలో వాకిలి చప్పుడు అయింది. నీరజ్ వచ్చి ఉంటారని అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను. “భోజనం వడ్డించనా?” అని అడిగాను

“వద్దు, నాకు ఆకలి లేదు” అని అన్నాడు.

ఎందుకు తినవు? ఎవరితో తిన్నావు? అని అడగాలని ఉంది. కానీ ఏమి అనకుండా వెళ్ళి పడుకున్నాను.

నిజానికి మొదటి సారి శేఖర్ “వదినా, నీరజ్ గురించి ఒక కంట కనిపెట్టండి” అని అన్నప్పుడే నాకు అర్థం అయింది. నాకు అతను దేని గురించి చెప్పబోతున్నాడనేది పూర్తిగా అర్థం అయింది.

పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరూ చూడలేదు అనుకోవటం మూర్ఖత్వం. అనైతిక సంబంధాలు అనేవి కూడా ఇలాంటివే, ఎంత మూసి పెడతారో అంత ఎక్కువ అవి ఇతరులకు తెలుస్తాయి .

మా వీధి వాళ్ళు నన్ను చూసినప్పుడు చెవులు కొరుక్కోవటం నేను గమనిస్తూ ఉంటి. ఇంకా కొంచెం సన్నిహితులు నాకు మంచి-చెడు చెప్పడానికి కూడా వచ్చారు. కానీ నేను ఎవరి మాట ను నమ్మలేదు. నీరజ్ అలా చేయడు అని నా బలమైన అభిప్రాయం. అయినా నేను కంటితో చూడకుండా , చెప్పుడు మాటలు విని నిర్ణయం తీసుకోరాదు అని నా అభిప్రాయం.

కానీ నేడు ఆయన స్నేహితులే అలా చెప్పెటప్పటికీ, కొంచెంగా ఉన్న అనుమానం కాస్త బలపడింది. కానీ రెడ్‌హాండెడ్‌గా దొరికితే కానీ అడుగరాదు అనుకున్నా. నీరజ్ నాతో ప్రేమ అని, పెళ్లి అని పెద్ద ఫోజు కొడుతూ ఉంటాడు కదా.

నీరజ్ వాళ్ళ పెద్దక్క బెనారస్ లోనే ఉంటారు. మా ఇంటి నుంచి వాళ్ళ ఇల్లు దాదాపుగా నలభై ఐదు నిమిషాలు దూరం ఉంటుంది. రెండు రోజుల క్రితం నీరజ్ నాతో అన్నాడు- “నువ్వు రేపు పిల్లలను తీసుకొని అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రా, రేపు ఎలాగూ సెలవు కదా. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. నేను రావటం కుదరదు. మీరు వెళ్ళి చూసి రండి. చాలా రోజులు అయింది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి. అక్కయ్యను కలిసి మాట్లాడు.”

“అరె, పోయిన నెలలో వదిన గారు మన ఇంటికి వచ్చి వెళ్లారు కదా”

“అవును, ఒక నెల అయిందిగా! పొద్దున్నే త్వరగా విడిచి, సాయంకాలం కల్లా తిరిగి వచ్చేయి”

“అంటే నేను రోజంతా అక్కడే ఉండాలా?” ఇంతకు ముందు నీరజ్ ఇలా ఎప్పుడూ చెప్పలేదు. నేను కూడా మొండిగా ఉండలేదు. సరే చూద్దాం అని ఆ క్షణానికి అన్నాను.

పొద్దున్నే లేచి శంకర్‌ను కూడా తీసుకొని వదిన గారింటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేయసాగాను. నీరజ్ కూడా సహాయం చేయసాగాడు. “కనీసం పది గంటలకైనా బయలుదేరండి” అని మమ్మల్ని తొందర చేయసాగాడు.

అంతవరకు ఏదో ఆలోచనలో ఉన్న నాకు అనుమానం వచ్చింది. ఎప్పుడూ ఒక పని చేయని వాడు సహాయం చేస్తూ ఉన్నాడు, పైగా మమ్మల్ని త్వరగా బయటకు నెట్టేలాగా చెబుతున్నాడు ఏంటి? అని అనుకున్నా! ఏదో మతలబు ఉంది అని అనిపించింది. కానీ నా భావనలను ఎక్కడా కూడా బయటకు చూపించలేదు.

ఎలాగో అన్నీ పనులు తెమల్చి, సరిగా పదకొండు గంటలకు బయలుదేరాను. బయటికి వస్తూనే పది అడుగులు వేసి వేయంగానే రిక్షా దొరికింది. అలా రిక్షాలో నేను కూర్చున్నానో లేదో జెనిఫర్ కనిపించింది. నేను వెంటనే చేయి ఊపుతూ “అరె జెనిఫర్, ఎక్కడికి వెళుతున్నావు?”అన్నాను. నన్ను చూసి జెనిఫర్ ఒక్కసారిగా కంగారూ పడింది. “అయ్యో, మిమ్మలను కలవాలనే వస్తూ ఉన్నాను వదినా, మీరు ఎక్కడికో వెళుతున్నట్టు ఉన్నారు?” అని అంది అమాయకం నటిస్తూ.

“అవును, నేను మా వదిన గారింటికి వెడుతున్నాను.”

“సరే వదినా, వెళ్ళి రండి”

ఇంత చెప్పి జెనిఫర్ వెనక్కు తిరిగి కూడా చూడలేదు. అలాగే ఇంటి వైపు వెళ్లింది. అపుడు అనిపించిది ఆయనకు అంత అర్జెంట్‌గా అక్క మీద ప్రేమ ఎందుకు కలిగిందో అని. నా పెదవుల పైన ఒక వ్యంగ్యాత్మక నవ్వు వచ్చింది. ఒకసారి రిక్షా వెనక్కి తిప్పి ఇంటికి చేరాలి అనిపించింది. కానీ మనసు వద్దు అని చెప్పింది. రిక్షా వాడితో ముందుకు వెళ్ళు అని చెప్పాను.

సాయంత్రం ఇంటికి వచ్చాక నీరజ్ జెనిఫర్ వచ్చిన సంగతి చెబుతాడేమో అని ఎదురు చూడసాగాను. కానీ వారు నోరు విప్పలేదు. అపుడు నేనే అడిగాను – “పొద్దున నేను బయటకు వెళ్ళేటప్పుడు జెనిఫర్‌ను చూశాను”

అప్పుడు కూడా నీరజ్ చెప్పలేదు తను ఇక్కడికి వచ్చింది అని. నేను చెప్పినా, ఆ మాట వినపడినా వినపడనట్టు ఉండిపోయాడు.

ఒకరోజు పిన్ని గారింటికి వెళ్ళాలి అనుకున్నాను. జెనిఫర్ అమ్మను నేను పిన్నిగారు అని పిలిచేదాన్ని. పిల్లలిద్దరూ భోజనం చేసి శంకర్‌తో ఆడుకుంటూ ఉన్నారు. వేసవి లాగా ఎండ బాగా ఉంది. అపుడు నేను నా అరిగిపోయిన పాత చెప్పులు వేసుకొని, చేతిలో ఒక బాస్కెట్ తీసుకొని బయటకు వచ్చాను.

చలికాలం సాధారణంగా ఎండలో కూర్చోవాలి అని అనిపిస్తుంది కదా, కొంత సేపు మాత్రమే ఎండ శరీరానికి హాయిగా అనిపించిది. మొహం అంతా మండుతున్నట్టు అనిపించసాగింది. ఎదురుగా జెనిఫర్ ఇల్లు కనిపించింది. వారు మొదటి అంతస్తులో ఉంటారు. మెల్లిగా మెట్లు ఎక్కాను, కాలింగ్ బెల్ నొక్కాను. ఎదురుగా పిన్ని గారు నిలబడి ఉన్నారు. అనే, నను చూసి ఆమె మొహం పాలిపోయింది. “అరె నువ్వా? కావ్యా?” అని గట్టిగా అరుస్తూ అంది.

నేను వచ్చిన విషయం ఇంటిలోని వారికి వినబడేలాగా చెప్పాలన్నది ఆమె సంకల్పం కాబోలు. కానీ నేను మాత్రం ఒక నిమిషం కూడా వ్యర్థం చేయలేదు. అలాగే ఇంటిలోకి వెళ్ళాను. అక్కడ నేను చూసిన దృశ్యం, దాని తాలూకు నా స్థితి అవర్ణనీయం. ఎదురుగా ఉన్న రూమ్‌లో నీరజ్, జెనిఫర్ ఒకే రగ్గు కాలు పైన కప్పుకొని ఉన్నారు. నేను మాత్రం ఏదీ గమనించనట్టు అన్నాను “ఇపుడే బజారుకు వచ్చాను. చాలా రోజులు అయింది కదా బాబాయ్ గారి ఆరోగ్యం గురించి కనుక్కుందామని ఇలా వచ్చాను” అని అన్నాను.

పిన్నిగారికి పై ప్రాణం పైనే పోయినట్టు ఉంది. “అవును, నిజమే, కూర్చో కావ్యా, బయట చాలా చలిగా ఉంది. పగలు కూడా రజాయి కప్పుకోకుండా ఉండలేకపోతున్నాం కదా” అంది, అక్కడ ఏమీ తప్పుగా నేను చూడలేదు అన్నట్టు ..

నేను అందుకు “బయట చాలా ఎండగా ఉంది. నా మొహం చూడండి, ఎలా ఎర్రబడిందో. ఇపుడు టీ తాగాలని కూడా లేదు నాకు. ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇవ్వండి చాలు” అన్నాను.

పిన్ని నీరు తేవటానికి వంటింట్లోకి వెళ్లింది. అపుడు నీరజ్ బయటకు మెల్లిగా వచ్చాడు. “నేను బాబాయ్ గారికి మందు ఇవ్వటానికి అని వచ్చాను. పద, ఇద్దరం కలిసే వెళదాం” అన్నాడు. కాకరకాయ లేదా వేపకాయ తిన్నట్టు నా నోటి నుంచి బలవంతంగా తీయగా మాట్లాడేందుకు ప్రయత్నం చేయసాగాను.

“లేదు లేదు, మీరు మీ పని పూర్తి చేసుకుని రండి, నేను ఇంకా బజారుకు వెళ్ళి కొనవలసినవి చాలా ఊన్నాయిలే.”

ఆప్పటికి పిన్ని గ్లాసు నిండా నీరు తీసుకొని వచ్చింది. రెండు గుటకలు తాగి నుంచున్నాను. పిన్ని నా వాలకాన్ని మొదటి నుంచీ గమనిస్తూనే ఉంది. మాట మారుస్తూ – “నీరజ్ బాబాయ్ గారిని బాగా చూసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి కొడుకును భగవంతుడు అందరికీ ఇవ్వాలి” అని అంది.

నేను నా లోనే నవ్వుకున్నా, కానీ బయటకు మాత్రం సమాధానం ఇవ్వకుండానే మెట్లు దిగి వచ్చాను.

నాకు అర్థం అయిందని, నీరజ్‌కు అర్థం అయింది. ఇంటికి వచ్చి త్వరగా భోజనం చేసి మాట్లాడకుండా గది లోకి వెళ్ళి నిద్రపోయాడు.

“ఈ మధ్యన నువ్వు క్లినిక్ కు వెళ్ళడం లేదా?” అని నేను అడిగాను. అంతే, నా ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు. గట్టిగా అరచి నన్ను దబాయించాలని చూశాడు.

“ఏంటి, నీకు నా మీద నమ్మకం లేదా? మానవత్వం అనేది ఉంది కాబట్టే అక్కడికి వెళ్ళి ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. బాబాయ్ గారు మంచాన ఉన్నారు. ఆయనను చూసుకునేందుకు ఒక కొడుకు కూడా లేడు.”

అప్పుడు అనిపించింది, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. ‘నేను క్లినిక్ గురించి అడిగితే బాబాయ్ ఊసేందుకు ఇపుడు చెబుతున్నావు’ అని మనసులో అనుకున్నా.

ఈ రోజు అర్థం అయింది, పల్లె నుంచి వచ్చే ధాన్యం కూడా సగానికి సగం వారింటికి ఎందుకు పోతుందో అని. నీరజ్‌కు ఆదాయం పెరగక పోయినా పిల్లల కొరకు కూడా సమయం ఎందుకు లేదో అర్థం అయింది. ఇంకా ఆర్థిక పరిస్థితి సరేసరి, అంతంత మాత్రమే.

వీధిలో బీదవారు, సహాయం లేనివారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ మేము కూడా పెద్ద అంత డబ్బున్న కుటుంబం వాళ్ళం కూడా కాదు కదా…… నీరజ్ మాట్లాడుతూ ఉన్నాడు, నేను మాత్రం అతని మొహాన్ని చూస్తూ ఉండిపోయాను.

నేను కూడా మాటకు మాట ఇవ్వడం వలన కేవలం పిల్లలు అనవసరంగా భయపడతారు, చుట్టుపక్కల వారికి ఉచిత వినోదం మాత్రమే తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం కాదు.

ప్రొద్దున్నే లేచి మామూలుగా నా పనులను నేను ప్రారంభిచాను. నీరజ్ మాత్రం మొహం ముడుచుకొని ఉన్నాడు. కోపంగా అన్నాడు- “నేను ఈ రోజు నుంచి అక్కడికి పోను” అని.

నేను ఏమి జవాబు చెప్పలేదు. నా పాటికి నా పని నేను చేసుకుంటూ ఉండిపోయాను. రాత్రి గిన్నెలు కడిగి పడుకునేదాన్ని. నిన్నటి రోజు మనసు బాగోక కడుగలేదు. గిన్నెల రాశి పెరిగి ఉంది. ఒక్కొక్కటే కడగటం ప్రారంభించాను. ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ నుంచి ప్రారంభించాలో తెలియని స్థితి, ఇంటిలో, మనసులో….. కానీ రోజూ ఏదో ఒక కలహం. కొట్లాటలతో నేను విసిగి పోయాను. ఒక రోజు మనసు చంపుకొని చెప్పాను, “నువ్వు జెనిఫర్ ఇంటికి వెళ్ళు” అని చెప్పాను.

ఒక రోజు మా చిన్న మామయ్య అంటే నీరజ్‌కు స్వయానా బాబాయ్ గారు వచ్చి అడిగారు, “అమ్మా, నాకు అంతా తెలుసు, నువ్వు ఎలా ఉన్నావు? నీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను.” అని.

(సశేషం)

Exit mobile version