తొలకరి జల్లులు పుడమి తల్లిని ముద్దాడుతుంటే ..
హాయైన వాతావరణంలో.. అందంగా విరుస్తుంది హరివిల్లు!
సప్తవర్ణాల శోభతో మెరుస్తున్న హరివిల్లులో..
సమ్మోహనంగా నీ రూపం..
నా కళ్ళనలాగే సంబ్రమాశ్చర్యాలలో ముంచేస్తుంటే ..
నింగివైపు చూస్తూ నిలబడిపోయాను!
వెన్నెల రాతిరి వేళ..
పున్నమి కాంతుల శోభలతో..
జాబిలమ్మ అలా అలా కదలి వెళుతుంటే..
నీ చిరునవ్వుల వదనం.. మరోసారి సరికొత్తగా ఆవిష్కృతమవుతుంటే..
కళ్ళలో నీ రూపాన్ని నింపుకుంటూ.. మౌనమై ఆగిపోయాను !
తొలిపొద్దుల వేళ.. వీచే మలయమారుతాలు..
మేడ ప్రక్కనే వున్న పూల మొక్కల.. సుమగంధాల పరిమళాలను వెంటేసుకుని వస్తుంటే ..
అగుపించని నువ్వు..
కలవై.. కళ్ళలో కదులుతుంటే..
లేచి చుట్టూ చూసుకున్నాను..
ప్రక్కనే నువ్వు..
కలో.. నిజమో అర్థమవని సందిగ్ధం!
ప్రియా..
నా ఉశ్వాసనిశ్వాసాల రూపమై నువ్వు..
నా ప్రాణమై నువ్వు..
నిన్ను వీడలేని… నేను!
… మళ్ళీ తిరిగి మౌనమై నేను!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.