[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘కల్లోల భారతం’ పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు హేలీ కళ్యాణ్.]
‘కల్లోల భారతం’ పుస్తకంలోని వివరాల్లోకి వెళ్ళే ముందు కొంత నేపథ్యం అవసరం. ఈ పుస్తకం భారత ఉపఖండపు ప్రాంతంలో వందల సంవత్సరాల ఇస్లాం ప్రస్థానం గురించి. ఇటువంటి విషయం గురించి పుస్తకం రాయాలన్నా లేక ఇటువంటి ఒక పరిచయ వ్యాసం రాయాలన్నా కూడా ముందుగా సంజాయిషీ చెప్పుకోవలసిన కాలం ఇది. ఆ సంజాయిషీతోనే మొదలుపెడుతున్నాను ఈ వ్యాసాన్ని. ఈ పుస్తకం నేనెందుకు చదివాను ఇటువంటి విషయాల గురించిన అధ్యయనం అవసరమని నేను ఎందుకు అనుకుంటున్నాను ఈ పరిచయం ద్వారా ఈ పుస్తకం మరింత వ్యాప్తిలోకి రావాలని నేనెందుకు ప్రయత్నిస్తున్నాను తెలియాలంటే ఈ విషయమై కొంత వివరం తెలుపవలసిన అవసరం ఉంది.
మన భారతదేశపు సంస్కృతి విషయంలో కొంత విమర్శనాత్మకంగా ఇస్లాం గురించిన ప్రస్తావన రాగానే వెంటనే ప్రశ్నించే వర్గం ఒకటి ఉంది. నువ్వు మత విద్వేషాలను రగల్చాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు బీజేపీ, ఆర్.ఎస్.ఎస్. సభ్యత్వం కానీ తీసుకున్నావా? నీవు హిందుత్వ రాజకీయాలు చేస్తున్నావా? ఇలా ప్రశ్నలు సంధిస్తారు కొందరు. శాంతి సౌభ్రాతృత్వం సౌహార్దంతో రెండు మతాల వారూ ఒక అద్భుతమైన కనీ వినీ ఎరుగని ఉమ్మడి సంస్కృతితో ఆనందంగా ఉంటే మీరంతా వచ్చి చిచ్చు పెడుతున్నారు అని అంటారు ఈ వర్గపు మేధావులు మరికొందరు. పైగా ప్రగతి పథంలో వారంతా సెక్యులరిజం అనే మతావలంబులుగా ఉంటారు చాలా వరకు. లౌకికవాదులు కనుక మతాల గురించి ధర్మాల గురించిన ప్రస్తావన వారికి చిరాకు కోపం తెప్పిస్తుంది. వారి ప్రకారం అందరూ నాస్తిక ధోరణి అవలంబించటం ఉత్తమం. కుదిరితే అన్ని మతాలను నిరంతరం విమర్శిస్తూ ఉండాలి. కానీ కొన్ని మతాలను విమర్శించాలంటే చాలా ధైర్యం కావాలి కాబట్టి కనీసం వీలయినంత హిందూ ధర్మాన్ని నిరంతరం తిట్టిపోస్తూ ఉంటే వారికి కొంత ఆనందం వీడు కూడా మనవాడే అని. అప్పుడు ఈ మేధావుల ఆశీస్సులు మీకు లభిస్తాయి.
ఇదీ ప్రస్తుతం మన తెలుగు సాహిత్య లోకపు పరిస్థితి. ఇస్లాం మతం యొక్క వందల ఏళ్ళ చరిత్ర ప్రామాణికంగా ఆధారాలతో సహా చర్చ చేయాలంటే ఈ ఆక్షేపణలన్నీ ఎదుర్కోవలసి వస్తుంది. గత కొన్నేళ్ళుగా అంతర్జాల మాధ్యమంలో సామాజిక మాధ్యమాలలో ఇటువంటి చర్చల్లో పాల్గొంటూ ఉన్నాను. నేను ఒక విచిత్రమైన వైఖరి గమనించాను. హిందూ ముస్లిం ఉమ్మడి సంస్కృతి అని ఒక ఊహ చేసి ఇస్లాం లేదంటే నా సంస్కృతే లేదు అన్న స్థాయి వ్యామోహంలో ఉన్నారు కొందరు తెలుగు రచయితలు, సాహిత్యకారులు మన దగ్గర. అయినా, ఇస్లాం పవిత్రగ్రంథం నుంచే ఏదయినా సూరా ఉదాహరించినా ‘సర్ తన్ సె జుదా’ ఆగ్రహాగ్నిని అనుభవించాల్సి వస్తుంది. కోర్ట్ సమర్ధనకూడా లభిస్తుంది.
మొన్నామధ్యన ఒక కోర్టు కేసు జరిగింది. “పొన్నియిన్ సెల్వన్” చిత్రంలో ఒక పాటను నీవు మా నుంచి మా అనుమతి లేకుండా తీసుకున్నావు ఇది కాపీరైట్ చట్టం ఉల్లంఘన చేసినట్టే నీవు మాకు దీనికి నష్ట పరిహారంగా డబ్బు ఇవ్వవలసినదే అని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ పైన ఒక హిందుస్తానీ సంగీత పరంపరకు చెందిన ముస్లిం కళాకారుల కుటుంబం కేసు వేసింది. అయితే తర్వాత కోర్టు వారు సాంప్రదాయ సంగీత పరంపరల కళా రూపాల విషయంలో ఈ ట్యూను వీరి సొంతం ఈ రాగం వీరి వారసత్వం అని తేల్చి చెప్పటం కుదరదు కనుక కాపీరైట్ చట్టం వర్తించదు అని ఆ వివాదాన్ని అంతటితో ముగించింది అని ఒక వార్త చూసాను. రెహ్మాన్‌ను కోర్టుకు ఈడ్చిన ఈ సంగీత కళాకారుడు ముస్లిం అయినప్పటికీ కూడా హిందుస్తానీ సంగీతంలో పేరెన్నిక గల ద్రుపద్ సంగీత పరంపరకు చెందిన వ్యక్తి. తరతరాలుగా తాము ముస్లిములము అయినప్పటికీ వారంతా కూడా ఇప్పటికీ సరస్వతి దేవి ప్రార్థన చేస్తారనీ వేదంతో బాంధవ్యం కలిగి ఉన్న కృతుల గానం చేస్తారనీ ఇవన్నీ ఈ దగర్ కుటుంబాల ముస్లిం సంగీత కళాకారుల పరంపరలో భాగమని ప్రతీతి. “శివ స్తుతి” అన్నది తమ కుటుంబ వారసత్వమని వాదించారట ఆ ముస్లిం కళాకారుల పరంపరకు చెందిన వారు కోర్టులో. రెహ్మాన్ స్వరపరచిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోని గీతం తమ “శివ స్తుతి” ను పోలి ఉందని వీరి వాదన. రెహ్మాన్ కూడా హిందూ మతం నుంచి ఇస్లాంకు మారిన వ్యక్తే. ఇది పక్కన పెడితే శివస్తుతిని తమ వారసత్వ సొత్తు అని అంటూ ఒక ముస్లిం కళాకారుల కుటుంబం వారు కోర్టుకు ఎక్కటం విచిత్రం. ఈ దేశంలో కొన్ని వందల ఏళ్ళుగా తాము మతం మారక ముందు తమకు హిందూ దేవతల ఆరాధనతో ఉన్న సంబంధం భక్తి నిష్ఠ కోల్పోకుండా సంగీత కళను పరంపరగా అభ్యాసం చేసెడి కొన్ని ముస్లిం కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికీ.
విశ్వనాథ సత్యనారాయణ “మ్రోయు తుమ్మెద” నవల అంతా కూడా ద్రుపద్ టుమ్రీ ఖయాల్ ఇటువంటి హిందుస్తానీ సంగీతం ఆ సంగీత కళాకారుల గురించిన చర్చలే. ఈ మధ్య కాలంలో నన్ను హిందూ ముస్లిం విషయంలో తీవ్రంగా ఆలోచింపజేసింది ఈ “మ్రోయు తుమ్మెద” గురించిన చర్చలే.
ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్ గారు ఒక సభలో ఈ నవల గురించి ప్రస్తావిస్తూ ఇది హిందూ ముస్లిం కాంపోజిట్ కల్చర్‌కు ప్రతీక అన్నారు. మరొక తెలుగు రచయిత రాణి శివ శంకర శర్మ గారు కూడా మ్రోయు తుమ్మెదలో ఉమ్మడి కల్చర్‌ను ఉదారవాదాన్ని ఒక రకంగా చెప్పాలంటే సెక్యులర్ విశ్వనాథను దర్శించారు. అయితే నాకు ఈ నవలలో విశ్వనాథ పూర్తి భిన్నంగా కనిపించాడు. పైన ప్రస్తావించిన హిందూస్థానీ కళాకారుల విషయం తీసుకుంటే విశ్వనాథ ఈ కళాకారులను సెక్యులరిజంకు గొప్ప ప్రతీకగా భావించలేదు. ఆయన ఇలా అంటారు ‘మ్రోయు తుమ్మెద’ లో.
“సంగీతవిద్వాంసులలో హిందువన్నది. ముసల్మానన్నది లేదు. అందరును హిందువులే. వారి పూర్వు లెందుకో ముసల్మానుమతమును స్వీకరించిరి. రాజాశ్రయము లేని సంగీతవిద్యకు దిక్కుదిబాసు లేదు గనుక వారానాడు తురకమతమును స్వీకరించియుందురు, అది వట్టి పైమతము. తలలు గొరిగించు కొందురు. గడ్డములు పెంచుదురు. వారు నమాజే చేయరు. వారిదైవ మల్లా కాదు. అనాది నుండియు నీ దేశములో గొన్ని కుటుంబములలో నీ సంగీతవిద్య ప్రబలెను. ఈ సంగీతవిద్యా కుటుంబములలో ప్రతికుటుంబమునకు నొక యారాధ్యదేవత యుండును. ఒక కుటుంబము కృష్ణభక్తులు. ఒక కుటుంబము దేవీభక్తులు, మరియొక కుటుంబము రామభక్తి ప్రధానముగా గలది. కొందరు కాళీభక్తులు. ఇన్ని వందలయేండ్ల నుంచి వారు ముసల్మానులే. కాని వారియిండ్లలో కృష్ణపూజలు, దేవీపూజలు సాగు చుండును. వారందరును బ్రాహ్మణులు, బ్రాహ్మణవంశీయులు. వారు పైకి తురకలు గాని, లోన హిందువులు, వారిలో కొందరు సంస్కృత విద్వాంసులు. పలుమంది సంస్కృతములో కీర్తనలను వ్రాసిరి”
ఇలా విశ్వనాథ ఇటువంటి ముస్లిం కళాకారుల పరంపరాలలో ఏదో జమిలి సంస్కృతి ఉమ్మడి సంస్కృతి చూడలేదు. వారిలో కూడా హిందూ ధర్మపు పరంపరల బీజ శక్తినే చూసారు ఆయన. ఇదే నవలలో విశ్వనాథ ఒక వేద స్వరూప దేవతా రూపం గురించి రాస్తారు. తురుష్క ఛాయ అనే చెర నుంచి తనను విడిపించమని తిరిగి శాస్త్ర అభ్యాసం చేసి వేద శాస్త్ర పునాదుల పైన సంగీతాన్ని పునర్నిర్మించమని కథా నాయకుడు తుమ్మెదకు చెబుతుంది ఆ స్త్రీ మూర్తి. అంటే హిందూస్థానీ సంగీతమూ ఇస్లాం ప్రభావము భారతదేశంలో పెరిగిన కాలంతో ముడిపడి ఉన్న ఇతరత్రా సంగీత కళలను ఏదో సెక్యులర్ ఉమ్మడి సంగీతంగా గుర్తించలేదు విశ్వనాథ. తురుష్క ఛాయ నుంచి విడిపించి తిరిగి శాస్త్ర పునాదులపై పునర్నిర్మించమనే చెప్పారు. అంటే స్వత్వం గురించిన విషయంలో విశ్వనాథకు ఇస్లాం అనే ఆసరా అవసరం లేదు ఇస్లాంతో మమేకమైన సంస్కృతిలో ఏదో గొప్ప కాంపోజిట్ కల్చర్‌ను ఆయన దర్శించలేదు.
హిందూ ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే సనాతన ధర్మం గురించి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఇస్లాం మతం ఆసరాగా తీసుకోవాలి, ఇస్లాం హిందూ ధర్మం ఎలా పాలు నీళ్ళలాగా కలిసిపోయాయో ప్రస్తావించాలి గంగా జముని తెహజీబ్ గురించి మాట్లాడాలి, ఈ కలగాపులగపు సంస్కృతే అసలు సిసలు ధార్మిక సంస్కృతి అని కీర్తించాలన్న ఒక నియమం తెలుగు సాహిత్య లోకంలో చెలామణిలో ఉంది. ఇస్లాం మతం అనేదానిని ఊతంగా తీసుకుని భారతీయ సనాతన హిందూ ధర్మం గురించిన చింతన చేయవల్సిన అవసరం లేదు. ఈ సిన్క్రెటిక్ కల్చర్ అనే వ్యామోహం క్రైస్తవం విషయంలో కూడా ఉంది మనకు ముఖ్యంగా ఇటువంటి విషయాలలో ప్రతిపాదనలు చేసే మేధావి వర్గం వారికి.
ఇక్కడ మనం గుర్తించాల్సినది ఏమిటి అంటే హిందూ దేవాలయం ప్రాకారాన్ని ఆనుకుని మసీదు అనే కట్టడం ఉంటేనే సనాతన ధర్మము ఇదే మన ఉమ్మడి సంస్కృతికి ఉదార భావానికి తార్కాణం అని అనుకోనక్కర్లేదు. అరెరే ఈ మందిరాన్ని ఆనుకుని మసీదు లేదు ఇది మైనారిటీ మతాలను ధ్వంసం చేసే హిందుత్వ ఆధిపత్య భావజాలం ఇది ఫాసిజం అన్న దృష్టి ఉండనక్కర్లేదు. అక్బర్ ఆంటోనీల మునుపు కూడా అమర్ అనే వాడు ఉన్నాడు. అక్బర్ ఆంటోనీలు ఉన్నా కూడా అమర్ అనే వాడు తన అస్తిత్వం కోల్పోకుండా ఉండగలడు. సదరు అక్బర్ అనేవాడి పూర్వీకులు సంగీత సంప్రదాయ పరంపరలకు చెందిన వారైతే వాడి స్మృతులలో వైదిక ధర్మం అమరంగా ఉంటుంది. ఎంతో కొంత పుణ్యం లభిస్తుంది వాడికి కూడా. ఈ విషయంతో అమర్‌కు పేచీ ఏమీ లేదు. హిందువుల దగ్గర ఉదార భావం అనేది అంటే లివ్ అండ్ లెట్ లివ్ అనే భావన కావలసినంత ఉంది. అందరికీ ఇదే దృక్పథం ఉంటే వందల ఏళ్ళుగా ఈ సంఘర్షణలు అసలు ఉండేవే కావు. అమర్ కమర్ తోడ్‌కే అక్బర్ అంంటోనీకో దియా! అక్బర్ ఆంటొనీ నే అమర్కా చమ్డా లేలియా! అని ఒక భారతదేశంలో ఉదారభావం గురించి ఒక వ్యంగ్య సామెత వుంది.
“మ్రోయు తుమ్మెద” గురించి ఇదివరకు సంచిక పత్రికలోనే ‘విశ్వనాథ ‘మ్రోయు తుమ్మెద’లో ఇస్లాం – ఒక విశ్లేషణ’ అని ఒక వ్యాసంలో ఈ విషయాలపై విస్తారంగా చర్చించాను. విశ్వనాథ మునిమాణిక్యం ఇద్దరు కలిసి సృజించిన ‘వక్రరేఖ’ నవలలో కూడా బహ్మనీ సుల్తాను కాలం నుంచి ఇస్లాముకు హిందూ మతానికి మధ్యన జరిగిన సంఘర్షణల ప్రస్తావన ఉంది. విశ్వనాథ శివాజీ గురించిన రచనలు కూడా చేశారు. వీటన్నిటి గురించిన ప్రస్తావన ఆ వ్యాసంలో ఉంది. ఆ వ్యాసం రాసే కాలంలోనే తెలుగు సాహిత్య లోకంలో ఇస్లాంకు హిందూ మతానికి మధ్యన ఉన్న బంధం గురించిన దృక్పథం గురించి చాలా ఆలోచన పరిశోధన చేసాను.
అందుకనే ‘కల్లోల భారతం’ పుస్తకంలో రచయితగా కోవెల సంతోష్ కుమార్ గారి ఆవేదన ఆక్రోశం ఆకళింపు చేసుకోవటానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. ఈ విషయాల గురించిన లోతైన చర్చలు తెలుగు సాహిత్య లోకంలో జరగాలి. అందుకు ఈ ‘కల్లోల భారతం’ పుస్తకం నాంది కావాలి.
ఇటువంటిదే మరొక చర్చ కూడా జరిగింది మరొక ప్రముఖ రచయితతో ఫేస్బుక్ మాధ్యమంలో. ఇస్లాం ప్రభువుల కాలంలో హిందూ ధర్మం నుంచి ఇస్లాంకు జరిగిన మత మార్పిడులలో ఇస్లాం ప్రభువుల రాజ్యాధికార దుర్వినియోగం ఇస్లాం మత దృక్పథం ప్రభావం చాలా తక్కువ అనీ ఇవంతా కేవలం స్వచ్చంధంగా జరిగిన మత మార్పిడులేనని ఏదైనా ప్రధాన కారణం అంటూ ఉంటే కూడా ఆ లోపాలన్నీ హిందూ సమాజంలో హిందూ ధర్మంలో ఉన్నవేనని చర్చ జరిగింది. చివరికి వాదించే ఓపిక లేక ‘బమియాన్ బుద్ధం శరణం గచ్చామి’ అని ఆ చర్చను ముగించాను. ఆఫ్గనిస్తాన్‌లో బమియాన్ బుద్ధుని విగ్రహాల విషయంలో జరిగిన వివాదం లోకవిదితమే. ఎంతసేపు హిందూ ధర్మం గురించి హిందూ సమాజం గురించి తీవ్ర అపరాధ భావనతో కృంగిపోతూ సనాతన ధర్మంతో ఉన్న తల్లి పేగు బంధాన్ని ద్వేషించుకుంటూ సాంప్రదాయ పరంపరలను తిట్టుకుంటూ గడపడటం చాలా మంది మేధావులకు అలవాటు తెలుగు సాహిత్య లోకంలో.
ఇటువంటి చర్చలలో పాల్గొనప్పుడంతా అనిపిస్తూ ఉండేది అసలు వందల ఏళ్ళ ఇస్లాం మత ప్రస్థానం గురించి ఆంగ్లంలో అన్ని పుస్తకాలు ఉన్నాయి కదా తెలుగులో ఎందుకు లేవు అని. ఎందుకంటే ఈ సమస్యలు కేవలం హిందువులకు సంబంధించినది కాదు. ఇస్లాం ప్రభావానికి లోనుకాక పూర్వం ఇప్పుడు మనం వేటినైతే ఇస్లాం ప్రధాన దేశాలు అని అంటున్నామో అక్కడి స్థానిక సంస్కృతులు ఎంతో తీవ్ర విధ్వంసానికి మార్పుకు లోనయ్యాయి. ఇరాన్లో పార్సీ మతంతో జరిగిన సంఘర్షణలు కావచ్చు, పైన ఉదహరించిన బమియాన్ బుద్ధుని ఉదంతం కావచ్చు, ఐసిస్ తీవ్రవాదుల చేతిలో తీవ్ర దారుణ మారణహోమానికి లోనైన యెజీదీ తెగల వారు కావచ్చు, వీరందరిని గురించిన చర్చలు తెలుగు సాహిత్యంలో తక్కువ. మనకు ఎంత సేపు హిందూ ధర్మాన్ని బోనులో పెట్టి క్రాస్ ఎక్జామిన్ చేయటమే వచ్చు. అదీ తర్క దూరంగా, ఆలోచన బాహిరంగా!
అసలు అఫ్గనిస్థాన్ పాకిస్థాన్ బాంగ్లాదేశ్‌లో ఇస్లామీకరణకు ముందు నాటి సమాజాన్ని అప్పటి ప్రజల నమ్మకాల గురించిన చర్చలు కూడా తెలుగు సాహిత్య లోకంలో దాదాపుగా శూన్యం. ఒకరో ఇద్దరో చేసి ఉండచ్చు బహుశా అడపాదడపా. ప్రధాన స్రవంతిలో లేదు. ప్రధాన స్రవంతి ఇప్పటికి వామపక్షపు లౌకిక ఉదారవాదపు దృక్కోణంలోనే ఉంది. హిందూ ధర్మం గురించిన అపరాధ భావనను ప్రచారం చేయటంలో, న్యూనతా భావం పెంపొందించటంలోనే నిమగ్నమై ఉన్నారు మన రచయితలూ విమర్శకులు చాలా వరకు. అందరూ కాదు కానీ తెలుగు సాహిత్య లోకంలో ప్రాపకం, పలుకుబడి ఉన్న వాళ్ళలో చాలా మంది. ఈ ధోరణులను ప్రశ్నిస్తూ కొంత పరిశోధనతో కూడి ఉన్న పుస్తకాలు ఏదైనా వస్తే బాగుండు అని అనుకుంటూ ఉండగా వచ్చిన పుస్తకం కోవెల సంతోష్ కుమార్ గారి ‘కల్లోల భారతం’.
ఈ పుస్తకంలో వందల ఏళ్ళ చరిత్ర దాగుంది. ఇప్పటికీ పైన చెప్పినట్టు మనకు మనలని మనం తక్కువ చేసుకోవటమే తెలుసు. కేరళలో మోప్లా సంఘర్షణ ప్రస్తావన వస్తే ఇస్లాం మతం గురించి మాట్లాడకూడదు. ఇది కేవలం క్లాస్ వార్ అని అంటుంది మన ప్రధాన స్రవంతి మేధావి వర్గం. ఇది కేవలం భూస్వాములకు ఉన్నత వర్గాలకు పీడిత వర్గానికి జరిగిన సంఘర్షణ అని తేలుస్తారు. కాశ్మీర్ పండిట్ల గురించిన ప్రస్తావన వచ్చినా కూడా అంతే. అందులో మతం ప్రభావం తక్కువ. అది కూడా బూర్జువా వర్గమైన బ్రాహ్మణులపై అణచివేతకు గురికాబడ్డ వర్గం వారు చేసిన తిరుగుబాటు అంటారు. కాశ్మీర్ ఇప్పుడు ఇంతలా ఇస్లామీకరణకు గురికావటం సహజ పరిణామం. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. దాని గురించిన చింతన అవసరం లేదు. ఊరికే ఇస్లాంను ఆడిపోసుకుంటారు ఎందుకు? కాశ్మీర్ సంస్కృతి అంటేనే కాశ్మీరీయత్. అసలు ఇస్లాం ను కాశ్మీర్ సంస్కృతిని విడదీసి చూడటం మహా పాపం. ఇలా ఉంటుంది మన సాహిత్య లోకంలో పలుకుబడి ఉన్నఉదారవాద మేధావి వర్గం వారి ఆలోచన.
వీటన్నిటిని ప్రశ్నిస్తారు సంతోష్ కుమార్ గారు. వందల ఏళ్ళ చరిత్రను చదవమని మనకు చెబుతారు. ఇటువంటి చరిత్రకు సంబంధించిన ప్రస్తావనలు మనకు కల్హణ రాజతరంగిణి, శ్రీవర రాజతరంగిణి, జోనరాజ రాజతరంగిణి వంటి పుస్తకాలలో కనిపిస్తాయి. కస్తూరి మురళీకృష్ణ గారు వీటన్నిటి గురించిన పరిశోధన చేస్తూ తెలుగు సాహిత్యంలో ఈ విషయాలను చర్చలోకి తెస్తున్నారు. కాశ్మీర్ గురించిన అంశాలను చాలానే ప్రస్తావించారు ఈ పుస్తకంలో సంతోష్ కుమార్ గారు.
‘బుత్షికన్’ అన్న పేరుతో పిలువబడే ఒక సుల్తాను గురించి నాకు ఆంగ్లంలో సామజిక మాధ్యమాలలో జరిగే చర్చల ద్వారా తెలిసింది కొన్నేళ్ళ కిందట. ఆ బుత్షికన్ సాగించిన విగ్రహ విధ్వంసం గురించి మత మార్పిడుల గురించి ఆంగ్లంలో చాలా సమాచారం ఉంది. తెలుగులో ఈ ప్రస్తావనలు కొంత తక్కువ. వీటన్నిటి గురించి కూలంకషంగా చర్చించారు సంతోష్ కుమార్. ఈ ‘బుత్షికన్’ వంటి తీవ్ర మతావేశం గల వారి పాలనలో వేల మంది హిందూ బ్రాహ్మణ కాశ్మీరీ పండిట్ల జంధ్యాలను తెంపి వేసి చాలా మందిని ఊచకోత చేసిన మారణహోమం గురించి తెలుగులో నేను చదివినది తక్కువ. తెలుగులో జోనరాజ రాజతరంగిణిలో ఈ సంఘటన ప్రస్తావన వుంటుంది. ఇది తప్పించి దాదాపుగా లేదనే చెప్పాలి. అటువంటి సంఘటనల ప్రస్తావన ఉంది సంతోష్ కుమార్ గారి పుస్తకంలో. ఈ చరిత్ర గురించిన అవగాహన ముఖ్యం నేటి కాలానికి. ఈ అవగాహన పెంపొందించటానికి ఈ పుస్తకం పనికొస్తుంది. మనకు చెప్పని చరిత్రను తిరిగి చదవాలని పరిశోధించాలన్న ఆసక్తిని రేకెత్తిస్తుంది.
మొన్నామధ్యన అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో హిందూ ధర్మానికి సంబంధించిన అపోహలను ఖండిస్తూ విద్యార్థి సమూహాలలో హిందూ ధర్మం విషయంలో తీవ్ర అపరాధ భావనను పెంపొందించే ప్రయత్నం చేసే హిందూ వ్యతిరేక శక్తుల ప్రయత్నాలను తిప్పికొడుతూ కృషి చేస్తున్న ఒక సంస్థ వారి ప్రకటన చూసాను. అందులో ‘కాఫిరిస్తాన్’ అనే ప్రాంతంకు చెందిన ఒక తెగకు సంబంధించిన ఒక వ్యక్తి ముఖచిత్రం ఉండింది. ఈ ‘కాఫిరిస్తాన్’ అంటే ఏమిటీ అని అంతర్జాలంలో కొంత శోధన చేసాను. ‘కాఫిరిస్తాన్’ అంటే పేరులో ఉన్నట్టుగానే ఇప్పటి ఆఫ్గనిస్తాన్ ప్రాంతంలో ‘కాఫిర్లు’ అంటే ఇస్లామేతర మతాన్ని పాటించే వారు ఉండే ప్రాంతానికి సూచకమట. తర్వాత ఈ కాఫిర్లను బలవంతంగా మతం మార్పించో లేదా వారిని భయపెట్టి అధికార బలంతో వారిని అక్కడి నుంచి తరిమి వేసాక ఆ ప్రాంతం పేరు ‘నూరిస్తాన్’ అని మార్చారట. అంటే ‘కాఫిరిస్తాన్’ కు ఇస్లాం మతపు వెలుగు వచ్చి, ఇప్పుడు అది ‘నూరిస్తాన్’ అయ్యిందట.
అక్కడి ‘కలష్’ అనే తెగవారి గురించిన సమాచారం కూడా కొంత ఉండింది. ఈ ‘కలష్’ తెగ వారు బహుళ దేవతారాధన చేస్తారట. కాకులలో పూర్వీకులను దర్శిస్తారట, దేవతలకు జంతుబలి ఇచ్చే ఆచారం ఇవన్నీ ఉన్నాయట. ఇలా ఆ ప్రాంతం ఇస్లామీకరించబడిన వివరం అంతర్జాలంలో లభ్యం. రాజ్యాధికారం వినియోగించి బలవంతంగా చేసిన మార్పిడులు, జిజియా పన్ను విధానం ద్వారా జరిగిన మార్పులు వగైరాల గురించి ప్రస్తావన ఉంది. కానీ ఇప్పుడు వీటి గురించిన అవగాహన మనకు ఎంత మేరకు ఉంది అని మనలను మనం ప్రశ్నించుకోవాలి. ఇందాక చెప్పినట్టు తెలుగు సాహిత్యంలో వీటి గురించిన ప్రస్తావనలు మృగ్యం. దాదాపుగా శూన్యం.
ఆఫ్గనిస్తాన్ ఇస్లామీకరణ గురించి పాకిస్తాన్ ఇస్లామీకరణ గురించి చాలా విస్తారంగా వ్యాసాలు రాశారు సంతోష్ కుమార్ గారు ఈ పుస్తకంలో. వీటన్నిటి గురించిన అవగాహనను పెంపొందించుకోవలసిన అవసరం నేటికాలంలో చాలా ఉంది.
వీటి గురించిన చర్చ చేస్తూ మనలను అంటే హిందూ ధర్మానికి చెందిన వారిని భారత భూభాగంతో అనుబంధం ఉన్న వారిని ఉద్దేశిస్తూ ఇది “అస్తిత్వం పోగొట్టుకున్న జాతి” అని అంటారు సంతోష్ కుమార్ గారు. వినటానికి పరుషంగా ఉన్నా కూడా అది సరైన పోలికే. ఎందుకంటే వైదిక ధర్మం వైదిక సంస్కృతి వీటన్నిటికీ సంబంధించిన ఆనవాళ్ళు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్లో. అయినా వాటి గురించిన చింతన అవగాహన శూన్యం మనకు ఇప్పటి కాలంలో. ఇది కేవలం ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్‌కు మాత్రమే పరిమితమవలేదు. ఇప్పటి కాలపు అరబ్బు దేశాలలో ఇస్లామీకరణకు మునుపు నాటి సంస్కృతుల గురించిన చర్చ కూడా తక్కువ మన తెలుగు సాహిత్య లోకంలో. వీటన్నిటి గురించి కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు సంతోష్ కుమార్ గారు.
పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ కాశ్మీర్ వంటి ప్రాంతాలలో హిందూ దేవాలయాల గురించి హిందూ ధర్మావలంబులు ప్రధానంగా ఉండెడి నగరాల గురించి అవి విధ్వంసానికి గురవటం ఇస్లామీకరణకు గురవటం వీటన్నిటి గురించి రాసారు. ముల్తాన్ వంటి ప్రాంతాల గురించి మార్తాండ్ దేవాలయం గురించిన పరిశోధనాత్మక విశ్లేషణలు ఉన్నాయి ఈ పుస్తకంలో. సోమనాథ్ వంటి ఆలయాల విధ్వంసం గురించి భారతదేశంలో ఇటువంటి ఎన్నో ఆలయాలను పునర్నినిర్మాణంలో కృషి చేసిన అహల్యా దేవి హోల్కర్ గురించి కూడా రాసారు సంతోష్ కుమార్ గారు.
ఆ మధ్యన అయోధ్య రామాలయం గురించిన చర్చలలో కూడా ఇవన్నీ వచ్చాయి. కొందరు విదేశీ ప్రొఫెసర్లు వారికి వత్తాసు పలికే స్వదేశీ మేధావులు అంతర్జాల పత్రికలలో వ్యాసాలు కూడా రాశారు. అసలు ఈ గుడులు గోపురాలు మనకెందుకు. ఇవంతా సనాతన ధర్మములో తెచ్చిపెట్టుకున్న ఆచారాలు. మొన్నమొన్నటి వరకు అసలు మనకు గుడులు గోపురాలు లేవు. మనకెందుకు ఈ అయోధ్య వివాదం హిందూ ధర్మానికి దీనికి సంబంధం లేదు అన్న చందాన ప్రతిపాదనలు చేసారు. అయోధ్య రామాలయం విషయంలో ఇటువంటి తీర్మానాలు చేసిన తెలుగు రచయితలు కూడా ఉన్నారు. ‘ఇప్పుడు ఆ గుడి లేకపోతే ఏమిటట? నేను సనాతన హిందువుని. నాకు ఈ గుడులు గోపురాలు ఆర్భాటాలు అక్కర్లేదు. నా రాముడు నా మదిలో పదిలంగా ఉన్నాడు’ అంటూ ప్రగల్భాలు పలికినవారు చర్చలు చేసిన వారు కూడా ఉన్నారు మన సాహిత్య లోకంలో. వీటన్నిటికీ సమాధానం కావాలంటే వందల ఏళ్ళ ఆలయాల విధ్వంసం, పునర్నిర్మాణం గురించిన చరిత్రను చదవాలి. కల్లోల భారతం పుస్తకంలో ఆ చరిత్రను మనకు తెలియజెప్పే ప్రయత్నం చేసారు సంతోష్ కుమార్ గారు.
ఇవంతా కూడా ఏదో గతించిన చరిత్ర గురించిన విషయాలు మాత్రమే వీటన్నిటికీ ఇప్పటికాలంలో ప్రాసంగికత లేదు అని అనుకుంటారు కొందరు. ఈ సంవత్సరం నవంబర్ మాసం రెండవ వారంలో “బారాముల్లా” అన్న పేరుతొ నెట్‌ఫ్లిక్స్‌లో ఒక చిత్రం వచ్చింది. కాశ్మీర్ పండిట్ల ఊచకోత గురించి, కాశ్మీర్లో విచ్చలవిడిగా విస్తరించిన ఇస్లామీయ తీవ్రవాదపు భావనల గురించి చాలా గొప్పగా చిత్రీకరించారు ఇందులో. ‘ట్రాన్స్ జెనెరేషనల్ ట్రామా’, అంటే, తరతరాలుగా మానని గాయాల గురించిన చిత్రం ఇది. అయితే ఈ చిత్రాన్ని గురించిన విమర్శలు కూడా వెంటనే మొదలైపోయాయి.
“కాశ్మీర్ ఫైల్స్” చిత్రం వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. ‘బారాముల్లా’ చిత్రం సోఫిస్టికేటెడ్ ప్రాపగాండా అని అన్నారు ఒకాయన. అంటే ఇదివరకు ఈ హిందుత్వ వాదులు క్రూడ్ (crude) చిత్రాలు చేసేవారు అని, ఇప్పుడు ఇటువంటి కళాత్మక ప్రాపగాండా చిత్రాలు చేస్తున్నారు అని ఆక్షేపణ అనమాట. ఇటువంటి వ్యక్తులు సాధారణంగా విశాల్ భరద్వాజ్ ‘హైదర్’ చిత్రాన్ని గొప్ప కళాఖండం అని పొగుడుతారు.
రాజ్య వ్యవస్థను ఆర్మీకి చెందిన సైనికులను పోలీసులను దోషులను చేస్తూ కాశ్మీరు వేర్పాటువాదానికి ప్రోద్బలం ఇస్తూ చిత్రం చేస్తే అది గొప్ప కళాఖండం. కానీ ‘కాశ్మీర్ ఫైల్స్’, ‘బారాముల్లా’ చిత్రాలు ప్రాపగాండా. ఇలా ఉంటుంది మన కాలపు మేధావి వర్గపు వైఖరి. అయితే ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు అంటే ఇదే ‘హైదర్’ చిత్రం వచ్చినప్పుడు, హిందువుల అస్తిత్వానికి దేవతారాధనకు చిహ్నం అయినటువంటి ‘మార్తాండ్’ ఆలయం ముందు ‘షాహిద్ కపూర్’ చేసిన నాట్యం విషయంలో పెద్ద దుమారమే రేగింది అప్పట్లో. ఈ ‘మార్తాండ్’ ఆలయం గురించిన ప్రస్తావన ఉంది సంతోష్ కుమార్ గారి పుస్తకంలో. ఇదొక్కటే కాక ఇప్పటి కాలపు పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్‌లో మరుగునపడ్డ మరచిపోబడ్డ హిందూ గతం గురించిన చింతన చాలా కనిపిస్తుంది ఈ పుస్తకంలో.
అయితే మనకు ప్రధాన స్రవంతిలో వీటి గురించిన చర్చలు తక్కువ ఈ వ్యాసంలో ఇదివరకే చెప్పినట్టుగా. స్వతంత్ర సంగ్రామం కేవలం ఆంగ్లేయుల మీద మాత్రమే జరిగినట్టు చిత్రీకరణ. ఇస్లాంకూ, హిందూ ధర్మానికి మధ్యన జరిగిన సంఘర్షణల గురించి మాట్లాడటం పెద్ద పాపం. దేశ విభజనకు సంబంధించిన మత ప్రాతిపదికను గురించిన చర్చలు చేయరాదు. ఇది మన అప్రకటిత నియమావళి . ఈ వైఖరిని ప్రశ్నిస్తారు సంతోష్ కుమార్ గారు. వందల ఏళ్ళ చరిత్రను మన ముందు పెడ్తారు. ప్రశ్నలు సంధిస్తారు.
సూఫీల గురించి కూడా ఇప్పటి కాలంలో వారు శాంత కపోతాలనే ప్రచారం ఉంది. వీటన్నిటికీ ఆంగ్లంలో ఎందరో పరిశోధకులు సామజిక మాధ్యమాలలో జరిగే చర్చలలో జాతీయవాద భావం గల హిందూ ప్రచారకర్తలు ఎన్నో సార్లు సమాధానం చెప్పారు. అయితే తెలుగులో వీటన్నిటి గురించిన చర్చలు తక్కువ. ఈ విషయాలను గురించి కూడా చాలా వివరంగా వ్యాసాలు రాసారు సంతోష్ కుమార్ గారు ఈ పుస్తకంలో. సూఫీల విషయంలోనే కాదు ఔరంగజేబు విషయంలోనూ అంతే. ఔరంగజేబులో కూడా ఏదో గొప్ప మానవతావాదం, ఉదారవాదం, సహనశీలత, సౌభ్రాతృత్వ ధోరణి దర్శించే మేధావి రచయితలు ఉన్నారు మన కాలంలో. ఆంగ్లంలోనూ తెలుగులో కూడా. వీరందరి ధోరణిని తీవ్రంగా విమర్శిస్తారు సంతోష్ కుమార్ గారు ఆధారాలతో సహా.
ఈ చర్చలు చేసే ధైర్యం ఉన్న రచయితలు సాహితీవేత్తలు తక్కువ తెలుగు సాహిత్యంలో మన కాలంలో. ఇటువంటి రచయితలలో సంతోష్ కుమార్ గారి పేరు ముందుగా ప్రస్తావించచ్చు. ఈ పుస్తకం ఇప్పుడు మార్కెట్టులోకి వచ్చింది కనుక , ఒక అలజడిని సృష్టించి కొత్త ఒరవడికి నాంది పలికింది కనుక.
సాధారణంగా హిందువులలో ఇటువంటి విషయాలలో ఒక నిర్లిప్తత నిష్క్రియాపరత్వం ఉండటం చూస్తూ ఉంటాము. వాడి పాపాన వాడే పోతాడు. మనకెందుకు ఇదంతా. మనమేదో మన పూజ ఉపాసన భక్తి మీద శ్రద్ధ పెడితే చాలు కదా. ఇప్పుడెందుకు ఈ గత చరిత్ర గురించిన చర్చలు. పైన దేవుడున్నాడు వాడన్నీ చూసుకుంటాడు. ఇప్పుడు ఈ పరిశోధనలు చేసి మనసు పాడుచేసుకోకూడదు అని చాలా మంది హిందువులు అనుకుంటూ ఉంటారు. ఈ వైఖరిని గురించిన విమర్శ కూడా చేసారు సంతోష్ కుమార్ గారు ఈ పుస్తకంలో.
ఈ దేశంలో ఐకమత్యం అనేది ఎప్పుడూ లేదని, ఇదొక నానా జాతి సమితి అని, కలగూరగంప అని కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈ మాత్రం ఐక్యత కూడా ఏదో మొఘలు రాజులూ, బ్రిటిషు వలస పాలకులు అందరిని ఒక్కత్రాటి పై తేవటం వలననే సాధ్య పడింది అని అంటూ ఉంటారు. ఈ ధోరణులను కూడా ఖండిస్తారు సంతోష్ కుమార్ గారు. ఆచార సంప్రదాయాల భిన్నత్వం వెనుక ఒక ధార్మిక సాంస్కృతిక ఏకత్వం ఉందనే విషయాన్ని ఎత్తి చూపుతారు రచయిత.
సిక్కుల గురించి, వారు ఇస్లాంకు ఎదురొడ్డి చేసిన పోరాటం గురించి కూడా ప్రస్తావిస్తారు. శివాజీ శంభాజీ వంటి మరాఠా యోధుల చరిత్ర గురించి విజయనగర సామ్రాజ్య ప్రతిఘటన గురించి కూడా వివరంగా విశ్లేషణలు చేశారు. ఇప్పటికీ చిదంబరం, తంజావూరు వంటి ప్రదేశాలలో ఎన్నో ఆలయాలకు మరాఠా రాజరిక కుటుంబాలతో సంబంధాలు కొనసాగుతున్నాయి. శ్రీశైల క్షేత్రానికి శివాజీకి ఉన్న సంబంధం గురించి కూడా ఆ మధ్యన ప్రధాన మంత్రి మోడీ ఆ క్షేత్రాన్ని దర్శించిన సందర్భంలో వార్తలలో ప్రస్తావించారు. ఇలా మన కళ్ళ ముందే ఏకత్వం కనిపిస్తూ ఉన్నా కూడా భిన్నత్వం గురించి వైరుధ్యాల గురించి మాత్రమే మాట్లాడతారు మన మేధావులు. ఇక ఆది శంకరాచార్యుల వంటి వారు వందల ఏళ్ళ కిందటే దేశం మొత్తం చుట్టి చేసిన ధర్మ విజయ యాత్ర గురించి చెప్పుకోనక్కర్లేదు. అందులో కూడా ఈ దేశంలోని ఏకత్వం ప్రస్ఫూటంగా కనిపిస్తుంది. వీటన్నిటి ప్రస్తావనలు కూడా ఉన్నాయి ఈ పుస్తకంలో.
ఇక ఇరవయ్యో శతాబ్దపు తొలి నాళ్ళలో జరిగిన సంఘర్షణలు, బెంగాల్ విభజన, పాకిస్తాన్-భారత్ విభజన, బాంగ్లాదేశ్-పాకిస్తాన్ విభజన, వీటన్నిటి గురించిన చర్చలు ఉన్నాయి ఈ పుస్తకంలో. దేశ విభజనకు సంబంధించి కూడా రకరకాల భావజాలాల ప్రచారం ఉంది. అసలు గాంధీ మార్గాన్ని మనమంతా అనుసరించి ఉంటే విభజన అనేది జరిగేదే కాదని ఒక వింత ఊహ చలామణిలో ఉంది. హిందుత్వవాదులు గాంధీ నుంచి వేరుపడి మెజారిటీ మతపు ఫాసిస్టు హిందుత్వను పట్టుకు వ్రేలాడటం వల్లనే జిన్నా వంటి వారికి ఇస్లాంను పట్టుకుని వేర్పాటు వాదం దిశగా అడుగులు వేసే అవకాశం ఇచ్చినట్టయిందని అనేవారు కొందరు ఉన్నారు. మరికొందరు బ్రిటీషువారిని తప్పు పడతారు. కానీ పాకిస్తాన్ ఏర్పాటు వెనుక అసలు ఇస్లాం మతం తాలూకా మూలాలు ఉన్నాయి అనే విషయం ప్రస్తావించే ఆసక్తి ఉండదు ఇటువంటి వారికి. సయ్యద్ అహ్మద్ ఖాన్ వంటి వారు పంతొమ్మిదవ శతాబ్దపు చివరి ప్రాంతానికే ఇటువంటి విషయాల పై తీవ్ర మతవాదపు దృక్పథం కలిగి ఉన్నారని చాలా తక్కువ మందికి తెలుసు మన కాలంలో. ఆయనను ఏదో సంఘ సంస్కర్తగా పరిచయం చేశారు మనకు. అలాగే మహమ్మద్ ఇక్బాల్ వంటి వారిని కూడా “సారే జహాఁ సే అఛ్ఛా” అనే గీతాన్ని రాసిన గొప్ప దేశభక్తుడు అన్నట్టుగా చూపారు కానీ, పాకిస్తాన్ విభజనకు జిన్నా కంటే కూడా ఎక్కువగా తాత్త్విక పునాదులు వేసింది ఇక్బాల్ అన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. పాకిస్తాన్ వేర్పాటువాదపు పితామహుని వంటి వ్యక్తి మహమ్మద్ ఇక్బాల్. వీటన్నిటి గురించిన చర్చలు చాలా ఉన్నాయి ఈ పుస్తకంలో. ఇవంతా కూడా తిరిగి చదవలసిన అవసరం చాలా ఉంది.
తెలుగు వారైన ప్రొఫెసర్ వెంకట్ ధూళిపాళ గారు “క్రియేటింగ్ ఎ న్యూ మదీనా” అని పాకిస్తాన్ సృష్టి వెనుక గల ఇస్లాం మతవాదపు తాత్విక కారణాలను విశ్లేషిస్తూ ఒక గొప్ప పుస్తకం రాసారు. ఈ విషయాల గురించి తెలుగులో చర్చలు తక్కువ ఈ వ్యాసంలో పదే పదే ప్రస్తావించినట్టు. అటువంటి తరుణంలో సంతోష్ కుమార్ గారు వీటన్నిటికీ తిరిగి మన సాహిత్య సమాజం ముందు పెట్టటం చాలా గొప్ప పరిణామం. ఇది అప్పటి హైదరాబాద్ రాష్ట్రం విషయంలోనూ వర్తిస్తుంది. ఈ మధ్యనే కస్తూరి మురళీకృష్ణ గారు పూనుకుంటే హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనం అవటం గురించి అప్పట్లో కె.ఎం. మున్షీ రాసిన పుస్తకం తెలుగు అనువాదం ఎన్నో దశాబ్దాల తర్వాత విడుదలయ్యింది. ఇలా అప్పటి హైదరాబాద్ గురించీ, నిజాము రాజుల కాలం గురించిన చర్చలు కూడా ఉన్నాయి ఈ కల్లోల భరతం పుస్తకంలో.
ఇప్పటి కాలపు భారత దేశం ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్ గురించి మాత్రమే కాకుండా బాంగ్లాదేశ్ గురించిన చర్చలు కూడా ఉన్నాయి ఈ పుస్తకంలో. చిట్టగాంగ్ వంటి ప్రాంతాలలోని బహుళ దేవతారాధన హిందూ దేవతల గురించిన ప్రస్తావన కూడా ఉన్నది ఈ పుస్తకంలో. ఎనభైల దశకంలో పుట్టిన నా వంటి వారికి బాంగ్లాదేశ్ యుద్ధం గురించిన అవగాహన తక్కువ. ఇందిరా గాంధీని దుర్గకు ప్రతిరూపంగా అభివర్ణించారని, బాంగ్లాదేశ్ అనేది ఆవిడ సాధించిన గొప్ప సైనిక విజయమని, బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ వంటిది కాదని, అక్కడి బెంగాలీ లేదా బంగ్లా సంస్కృతి బీజాలు చాలా శక్తిమంతమైనవని, హిందూ ధర్మానికి బాంగ్లాదేశ్‌తో వచ్చిన ముప్పేమీ లేదనీ చెప్పేవారు. మాకు ఆ విశ్వాసం ఎన్నో దశాబ్దాలు బలంగా సాగింది కూడా. అయితే ఇప్పటి కాలపు పరిస్థితి వేరు. బాంగ్లాదేశ్ తిరిగి తూర్పు పాకిస్తాన్ గా, ముస్లిం దేశంగా మారటానికి చాలా దగ్గరవుతోంది. ఇందిర సాధించిన విజయం ప్రశ్నార్థకంగా మారింది. బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శక్తి స్వరూపమైన ఢాకేశ్వరి కొలువై ఉన్న ఆలయం ఉంది. దానిని ఇస్లాం ప్రధాన మతంగా ఉన్న దేశమైన బాంగ్లాదేశ్ జాతీయ మందిరంగా ప్రకటించుకుంది అప్పట్లో. అదేదో గొప్ప లౌకికవాదపు విజయం అంటే సెక్యులర్ విక్టరీగా ప్రకటించుకున్నారు అప్పటి కాలంలో. అయితే ఇప్పుడు ఆ ఢాకేశ్వరి ఆలయాన్ని కాపాడుకునే శక్తి అక్కడి హిందువులకు ఉన్నదా?
మొన్నటికి మొన్న బాంగ్లాదేశ్ గురించి ఒక వార్త వచ్చింది. అక్కడి ప్రభుత్వం సంగీత విద్యకు నిధులు కేటాయించకూడదు అని గొడవ జరిగింది, అక్కడ ఏవో విద్యాలయాలకు, ప్రభుత్వానికి ఇస్లాం మత వాదులకు మధ్యన. సంగీతం చెప్పే గురువులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకూడదు అని, సంగీత కళ అనేది ఇస్లాంకు వ్యతిరేకమని, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ వారికి మల్లే బంగ్లాదేశ్‌లోని ఇస్లాం మతవాదులు అక్కడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. ఈ వ్యాసంలో మొదట్లో హిందూస్థానీ సంగీతం గురించి మ్రోయు తుమ్మెదను గురించిన చర్చ చేశాను. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరిగినటువంటిది పాకిస్థాన్‌లో కూడా జరిగింది.
విభజన అనంతరం పాకిస్తాన్లో హిందుస్తానీ సంగీతం మృగ్యమైపోవటం గురించి కొందరు పరిశోధన చేశారు. ద్రుపద్ వంటి హిందుస్తానీ సంగీత ప్రక్రియలలో హిందూ ధర్మపు ఛాయలు ఎక్కువగా ఉండటం వలన వాటిని పక్కన పెట్టడం జరిగిందని అన్నారు. అంతే కాక ఇతర సంగీత ప్రక్రియలకు ఇస్లాం మతానికి కూడా సామ్యం కుదరక మెల్లగా పాకిస్తాన్లో హిందుస్తానీ సంగీత పరంపరలు కనుమరుగయ్యాయి అని అన్నారు ఆ పరిశోధకులు. ఇప్పుడు ఈ వారంలో బాంగ్లాదేశ్ కు సంబంధించి వచ్చిన వార్తలను చూస్తే అదే గుర్తుకు వచ్చింది. ఫలానా సమాజంలో ఫలానా భావజాలం బలంగా ఉంటే ఆ సమాజంలోని పరిస్థితులు ఆ భావజాలానికి అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఈ మార్పులను వాటికి గల కారణాలను గమనించుకోవాలి. లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అన్న చందాన తయారవుతుంది.
కాబట్టి ఇదేదో గత చరిత్ర కాదు. ఇప్పటి చరిత్ర. నడుస్తున్న చరిత్ర. ఇదంతా సరిగ్గా అర్థమవ్వాలి అంటే వందల ఏళ్ళ ఇస్లాం తాలూకా చరిత్ర అధ్యయనం చేయాలి. అటువంటి పరిశోధనకు కోవెల సంతోష్ కుమార్ గారి పుస్తకం తొలి మెట్టు. విస్తారంగా పరిశోధన చేసి రాయాలంటే మరొక పది పుస్తకాలకు కావలసినంత ముడిసరుకు ఉంది ఈ పుస్తకంలో. తెలుగు సాహిత్యంలో ఇటువంటి పుస్తకాలు మరిన్ని రావాలి. ఇటువంటి చర్చలు మళ్ళీ జరగాలి. సెక్యులర్ లిబరల్ లౌకిక వాదపు ఉదారవాదపు ఛాయలు తొలగాలి. అది కూడా ఒక దృక్కోణంలా ఉంటే ఫర్వాలేదు కానీ అదే ప్రధాన స్రవంతిగా ఉండకూడదు. ఎంత సేపు అన్ని తప్పులు హిందూ ధర్మంలోనే ఉన్నాయని హిందువులను నిరంతరం అపరాధ భావంలో, ఆత్మ న్యూనతలో, లేదా, సొంత ఇంటికే నిప్పు పెట్టుకునే ప్రతిక్రియావేశంతో నింపుతున్న వామపక్ష చరిత్ర వక్రీకరణల నుంచి మనకు విముక్తి లభించాలి. సత్య శోధన వైపు మనం ప్రయాణం సాగించాలి. ఈ విషయంలో కోవెల సంతోష్ కుమార్ గారి కల్లోల భారతం పుస్తకం ఖచ్చితంగా మనకు సహకరిస్తుంది. ఈ పుస్తకం రాసినందుకు సంతోష్ కుమార్ గారికి ఒక పాఠకుడిగా మిత్రుడిగా ఈ పరిచయ వ్యాసం ద్వారా నా శుభాభినందనలు తెలుపుకుంటున్నాను.
***
రచన: కోవెల సంతోష్ కుమార్
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: 368
వెల: ₹ 275/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్ 9000413413
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచయిత: 9052116463, 7396116463
ఆన్లైన్లో:
https://www.amazon.in/dp/B0FRXNJ63V
~
శ్రీ కోవెల సంతోష్ కుమార్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ :
https://sanchika.com/special-interview-with-mr-kovela-santosh-kumar/
