Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అసత్య చరిత్ర నిర్మాణ రహస్యాన్ని విప్పిన కల్లోల భారతం

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘కల్లోల భారతం’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు ధూళిపాళ అరుణ గారు.]

ధునిక మానవుడు మేధస్సుతో అంతరిక్షాన్ని ఆక్రమిస్తుంటే చరిత్రను పదే పదే తవ్వుకోవడమెందుకు? దానితో పనేముంది? రాజరికాలు, రాజ్యాలు, యుద్ధాలు తప్ప అందులో ఏముంది? అనే ప్రశ్న ఉత్పన్నమవడమే కాక చరిత్ర పట్ల ఒక వ్యతిరిక్త భావం వేళ్లూనుకుంది. కానీ మన జాతి తన అస్తిత్వాన్ని, వైభవాన్ని కోల్పోయి, అనేక విధాలుగా పొందిన నష్టఫలితాలను ఇప్పటికీ అనుభవిస్తున్నదని తెలుసుకోలేకపోవడం దౌర్భాగ్యం. పాశ్చాత్యులు, ఇతర జాతుల వారి దురాక్రమణలే వీటికి కారణాలనుకొని పోనీ అనుకుందామా? ‘దేశవిభజన’ అనే అంశం తెరపైకి రావడానికి చాలా సంవత్సరాల క్రితం నుండే ఈ విషబీజం నాటుకొన్నదని, ఛేదించలేని ఆ విషవలయంలో చిక్కుకొన్న అఖండ భారతావని ముక్కలై సుందరమైన తన రూపు రేఖా విలాసాలను కోల్పోయిందని ఎంతమందికి తెలుసు? మరి చరిత్రలో దాచిన ఆ వాస్తవాలేమిటి?

కాలక్రమంగా మారిన పరిణామాలు ఎటువంటివి? అటువంటి పరిస్థితులకు కొమ్ము కాసిందెవరు? వీటన్నిటికీ కారణాలు తెలుసుకోవాలంటే కోవెల సంతోష్ కుమార్ గారు రచించిన ‘కల్లోల భారతం’ పుస్తకం చదవాల్సిందే. ఇంతవరకూ భారతీయులందరిలో నరనరానా జీర్ణించుకొని ఇదే సత్యమని సిద్ధాంతీకరించబడిన విషయాలను అపోహగా కొట్టిపారేస్తూ, వాస్తవాన్ని మరో కొత్త కోణంలో  సాక్ష్యాలతో సహా ఋజువు చేస్తూ ఆవిష్కరించడం అత్యంత సాహసం. దానికి పర్యవసానంగా ఎన్నో హెచ్చరికలు, బెదిరింపులు ఎదురైనా జాతి ప్రజలకు సత్యమేమిటో అందించాలనే తపన ఆయన చేత ఈ పుస్తకం రాయించింది.

మరుగున పడదోసిన జాతి వాస్తవిక చరిత్రను తిరగదోడి, దుష్టకార్యాలకు పాల్పడిన వారి సంకుచిత భావ ధోరణులను కట్టెదుట నిలపడానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. దేశాభ్యున్నతికి అవరోధంగా బిగించబడిన ఇనుపసంకెళ్లను గురించి ఇప్పటికే ‘రామం భజే శ్యామలం’ పేరుతో ఒక పుస్తకం రాసి ఉన్నారు. ఇప్పుడు ‘కల్లోల భారతం’ తో మరొకటి, రానున్న కాలంలో ఇంకొకటి ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు.

ఇందుకోసం అహర్నిశలు ఆయన పడుతున్న శ్రమ అనితరసాధ్యం. ఒక విషయాన్ని తేటతెల్లం చేయడం సులువు కాదు. దాని పూర్వాపరాలను విశ్లేషించి, దాని వాస్తవికతను బహిరంగ పరచి, అందరి చేత అంగీకరింపజేయడం కత్తి మీద సాము చేయడమే. సత్య నిరూపణలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించి, అనేక పుస్తకాలను పరిశీలించి, అన్వేషించి, ప్రామాణిక గ్రంథంగా మలచడం సంతోష్ గారి ప్రతిభావ్యుత్పత్తులకు నిదర్శనం. ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు. సత్య నిరూపణ చేస్తూ ప్రజలను జాగృతం చేయడానికి ఆయన చేసిన మహోపకారం. మరెవ్వరూ చేయలేని సాహసం.

*ఇమం చే గంగే యమునే సరస్వతి
శతుద్రి స్తోమం సచతా వరుష్ణ్యా
అసిక్న్యా మరుద్వ్రధే యార్జీకేయే
శృణు హ్యా సుషోమయా*
(నదీ సూక్తం)

ఈ శ్లోకం ఈనాటి పాకిస్తాన్‌లో ఉన్న సప్త సింధు ప్రాంత వైశిష్ట్యాన్ని తెలుపుతుంది. మన నాగరికత విలసిల్లిన పవిత్ర భూమి ఇది. భారతదేశ సమగ్రతను తెలియజెప్పే శ్లోకం. దీన్ని ఉటంకిస్తూ.. భారతీయతకు ఆత్మగా భావించిన ఈ సింధూ ప్రాంతం, మెజార్టీ, మైనారిటీ వాదాల నడుమ, హిందూ ముస్లిం మత వైరుధ్యాల నడుమ, సోషలిజం,సెక్యూలరిజం ముసుగుల చాటున ‘విభజన’ కారణంగా దేహం నుండి విడిపోయి అఖండ భరతవర్షం మూడుముక్కలైన విషయాన్ని ఆయన నిర్ధారించారు. ‘విభజించి పాలించు’ అనే నినాదంతో బ్రిటిష్ పాలకులు మనలను విడదీసారని అనుకుంటున్నామే కానీ అంతకు ముందు వెయ్యేండ్లుగా ఈ కుతంత్రం నడుస్తూ ఉండిందని తెలిస్తే, నమ్ముతారా? ఆయన ఒక్కొక్క విషయాన్ని నిగ్గు తేలుస్తుంటే, ఔరా! అనిపించక మానదు.

ఆనాటి ఇస్లామీయుల ప్రకారం మతమార్పిడి కేవలం ధార్మిక విధానాన్ని మార్చడం కొరకు మాత్రమే కాక అంతకుముందున్న సంప్రదాయాన్ని సమూలంగా విచ్ఛేదనం చేసే దిశగా సాగింది. 624 సంవత్సరంలో మహమ్మదీయులు యూదు వ్యాపారులపై భయంకరమైన దాడి చేసి 70మంది తలలను నరికారు. ఇది తొలి దాడి. అక్కడినుండి మొదలై 708-711 మధ్య ఖలీఫాగా ఉన్న ఆల్ వాలిద్, ఇరాక్ గవర్నర్‌గా ఉన్న అల్ హజ్జజ్ లు కలిసి అరబ్బుల సైన్యాన్ని సింధురాజైన రాజా దాహీర్ సేన్ పైకి పంపారు. అందులో వారు ఓటమిని చవి చూశారు. తరువాత మహమ్మద్ బీన్ ఖాసిం నాయకత్వంలో సింధు పైన అనేక దాడులతో మారణకాండ జరిగింది. దాహీర్ సేన ఓడిపోవడంతో ఆయన తల నరికి ఆ తలతో పాటు, ఆయన కుమార్తెలిద్దరిని అల్ హజ్జజ్‌కు కానుకగా పంపాడు ఖాసిం. ఇది వక్రీకరించబడి “దాహిర్ అరబ్బు వ్యాపారులను బందీగా పట్టుకుంటే వాళ్ళను విడిపించడానికి ఖాసిం దాడి జరిపినట్టు” చరిత్రను రాయడం గమనార్హం. ఆసియాలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా భాసిల్లిన దేబల్ పోర్ట్‌పై 15 సార్లు దాడులు జరిపి విధ్వంసాన్ని సృష్టించి, దాని నామరూపాలు లేకుండా చేసి భారతదేశంలో తొలి ముస్లిం రాజ్యాన్ని స్థాపించడంతో విజయుడైన ఖాసిం విభజన విషబీజాన్ని నాటడంలో కూడా సఫలుడయ్యాడు.

స్కాట్లాండ్ పురాతత్త్వ వేత్త హెన్రీ పాకిస్తాన్ లోని హైదరాబాద్ జిల్లాలో చేసిన పరిశోధనలో సుసంపన్నమైన బ్రాహ్మణాబాద్ పట్టణ ఆనవాళ్లు కనిపించాయి. దీన్ని సమూలంగా నాశనం చేసినవాడు మహమ్మద్ బీన్ ఖాసిం. ఇస్లాం సంస్కృతి బీజాలు నాటి, అల్ మన్సూర్ గా పేరు మార్చుకున్నారు.

భారతదేశంలోకి ఇస్లాం చొరబడలేదని, బలవంతంగా ఇస్లాంలోకి భారతీయులు మార్చబడ్డారన్న వాదన అసత్యమని, బ్రాహ్మణ వర్గ అణచివేతల నుండి ప్రజలు బయట పడడానికి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన ఇస్లాంలోకి స్వచ్ఛందంగా ప్రజలు మారారని మహమ్మద్ హబీబ్ రాశాడు. ఎంత హాస్యాస్పదం? కానీ మహమ్మద్ బిన్ ఖాసిం దాహిర్ సామ్రాజ్యాన్ని స్వాధీన పరచుకున్న తర్వాత సింధ్ రాజులందరికీ “వెంటనే మీరంతా ఇస్లాంలోకి మారాలని, ఖలీఫాపై విశ్వాసం ప్రకటించాలని, ఆ ఆజ్ఞలను కచ్చితంగా పాటించాలని లేదంటే దారుణంగా చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి” అని ఫర్మానా పంపడాన్ని చరిత్ర చూపించలేదు. అలెగ్జాండర్ నాటికే ప్రపంచంలోనే అత్యున్నత సంపన్న దేశమై అంతర్జాతీయ వ్యాపారం చేస్తున్న మన దేశంపైన కన్నేసి దాడి చేసి అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఖాసిం అనేక సూర్యదేవాలయాలను ధ్వంసం చేసి 13,200 మణుగుల బంగారాన్ని దోచుకుపోయాడు. అలీ కుఫీ అరబ్బీలో రాసిన ‘చాచ్‌నామా’లో ఈ విషయం ఉంది. ఖాసిం సింధ్ ప్రాంతంలో సెటిలైన తర్వాత ఇస్లామిస్టుల దాడులు భారతదేశంలో విస్తరించాయి.

ముస్లింల దండయాత్రలో భారతదేశం మొదటగా తన అస్తిత్వాన్ని కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్ అని, ఇది ఈ దేశంలో అంతర్భాగమని, పదో శతాబ్దం దాకా దీనిని భారతీయ రాజులే పరిపాలించిన విషయం మరుగున పడిపోయింది. దీనికి ప్రాస్తావికంగా సంతోష్ గారు వరాహమిహిరుని ‘బృహత్సంహిత’ లో ‘అవగణ’ పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌ను ప్రస్తావించిన విషయం ధృవీకరించారు. ఇస్లామాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అబ్దుల్ రహమాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ వైభవాన్ని రెండు పుస్తకాలుగా రచించి ఆధ్యాత్మికతకు అది కేంద్రంగా ఉండేదన్న విషయాన్ని వివరించారు. మహా భారతంలో పేర్కొన్న గాంధార రాజ్యం ఇదే.

ఇస్లామీయులు మనదేశంలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు. సంపదను కొల్లగొట్టారు. మహమ్మద్ ఘజ్‌నీ సోమనాథ్ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఐదువేల మంది భారతీయ సైన్యాన్ని హతమార్చాడు. యాత్రికుడు ఫెరిస్తా సోమనాథ్ దేవాలయం గురించి అద్భుతంగా వర్ణించాడు. రెండువేల మంది పూజారులు ఉండేవారంటే దాని వైభవాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈనాటి ఆధునిక యంత్రాలు కూడా లెక్కపెట్టలేనంత సంపద మన సొత్తు. దాన్ని దోచుకోవడమే కాక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, భారతీయులను బానిసలుగా చేసుకోవడం, వారి మాట వినని వారిని అత్యంత పైశాచికంగా తలలు నరికి మానవ హననం చేయడం, స్త్రీలను వేశ్యలుగా మార్చడం, మన సంస్కృతి మూలాలను విచ్ఛేదనం చేసి, వారి మతాన్ని బలవంతంగా చొప్పించడం లాంటి అనేక దారుణాలకు తెగబడ్డారు. ఆ తర్వాత వచ్చిన మహమ్మద్ ఘోరీ, ఆ తరువాత బానిస రాజులు, ఢిల్లీ సుల్తానులు, ఖిల్జీలు, తుగ్లక్‌లు, సయ్యద్‌లు, లోడీలు.. ఈ రాజవంశాల పరిపాలనలో దేశం భయానక వాతావరణ గుప్పిట్లో ఉండిపోయింది.

ఒక దేశం, రెండు ఆచారాల పద్ధతి ఢిల్లీ సుల్తానుల కాలంలో మొదలైంది. దేశంలో ఖురాన్ అనివార్యంగా అనుసరించాలని, షరియా చట్టాన్ని పాటించాలని, ఎవరైనా తమ ఆచారాలను వదులుకోలేని పరిస్థితుల్లో జిజియా పన్ను చెల్లించాలని నియమాలు ఏర్పాటుచేయబడ్డాయి. కానీ చరిత్ర మాత్రం ముస్లిం రాజులు మత సామరస్యాన్ని పాటించారని చెప్పడం, ఆ మత సమరసతను చూసి స్వచ్ఛందంగా మనవాళ్లే ఇస్లాంలోకి మారారని చెప్పడం, దాన్నే మూఢంగా మనం నమ్మడం వలన మనలో మనకే అంతర్గత కలహాలు పుట్టాయి. పుడుతున్నాయి. 13వ శతాబ్ది చివరలో మధ్య ఆసియాపై మంగోలుల దాడుల నుండి భారతదేశంలోకి అనేక జాతులవారు రావడంతో అన్నీ సంకరమైపోయాయి. ఇండో ముస్లిం కలిసిన సరికొత్త సంస్కృతి అన్నింటిలోకి చొచ్చుకొని వచ్చింది.

1398లో ఢిల్లీని ఆక్రమించుకున్న తైమూర్ ఆగడాలకు అంతం లేదు. ఒకేరోజు లక్షమంది భారతీయులను బానిసలుగా చేసి ఒకే చోట చేర్చి అమానవీయంగా కాల్చివేశాడు. పిల్లలను, మహిళలను ఇస్లాం లోకి మార్చివేశాడు. ముసల్మానులు నివసించే ప్రాంతాలు కాకుండా నగరాన్ని మొత్తం నాశనం చేశాడు. ఇది తైమూరు ‘తజ్క్ ఏ తైమూరీ’ (తైమూరు జ్ఞాపకాలు) అని తాను రాసుకున్న జీవితచరిత్రలోని అంశాలు. చరిత్రాధ్యయనంలో విభజన జరిగి ఏడున్నర దశాబ్దాలు గడిచినా ఆ ప్రతికూల పరిణామాలు ఇప్పటికీ దేశాన్ని అతలాకుతలం చేస్తుంటే నిజమైన భారతదేశంగా ఈ దేశం మనుగడ ఎట్లా సాధించగలదన్న కోవెల సంతోష్ గారి ప్రశ్నకు సమాధానం మనమే ఆలోచించుకోవాలి.

మహమ్మద్ బీన్ తుగ్లక్ చనిపోయిన తర్వాత అతని బంధువు ఫిరోజ్ షా తుగ్లక్ అధికారంలోకి వచ్చాడు.

హిందువులపై తెగబడి బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడు. అంతేకాకుండా అత్యంత హేయంగా వీరిని ఇతర ముస్లిమేతరుల పైకి పంపించి వారిని హింసించి ఇస్లాం మతంలోకి మార్పించాడు. జ్వాలాముఖి దేవాలయంలోని గ్రంథాలయం నుండి 1300 గ్రంథాలను తీసుకెళ్లి అందులో సంస్కృతంలో ఉన్న ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని అనువదింప జేసుకొని ‘దలాయతే ఫిరోజ్ షాహీ’ అని పేరు పెట్టుకొని చలామణి చేసుకోవడం అతని నీచ ప్రవృత్తికి పరాకాష్ఠ.

సంతోష్ గారు ఈ విషయాలను కూలంకషంగా వివరిస్తూ చరిత్రను వక్రీకరించడానికి, తప్పుడు రాతలు రాయడానికి పరిమితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింహుడి లాంటి వాళ్ళ పేర్లను, వాళ్ళు రాసిన చరిత్రలను పూర్తిగా తీసివేయడం, ముస్లిం రాజుల ఘనతను కొనియాడడం చరిత్ర చేసిన పని. చరిత్ర సత్యదూరమై ఒక కాల్పనిక నవలగా మారిన విపరీతాన్ని ఆయన ఈ పుస్తకంలో ఎండగట్టారు. చరిత్రను యథాతథంగా తెలియజేయాలని, అప్పుడే తరువాతి తరాల వారు వాస్తవిక విషయాలను తెలుసుకొని భవిష్యత్తును రూపొందించుకుంటారని ఆయన ఉద్దేశ్యం. 1400 సంవత్సరాల పాటు మన దేశాన్ని సర్వనాశనం చేసిన ముస్లింల మీద పోరాటం చేసిన విషయాన్ని మరుగున పడేసి స్వాతంత్ర్యం కోసం కేవలం బ్రిటీష్ వారితోనే పోరాటం చేసామని చరిత్రలో పరిమితం చేయడాన్ని ఆయన నిరసించారు. అమరప్రేమికునిగా షాజహాన్, గొప్ప మానవతావాదిగా ఔరంగజేబు, పరిపాలనా విధానానికి అక్బర్ ఈ రకంగా వారిని తలమీద మోస్తూనే వచ్చాం. ఇదేనా చరిత్ర? అసలైన మన శౌర్యం, అపరిమితమైన మన విజ్ఞానం, ప్రపంచానికే తలమానికమైన సంస్కృతి ఏమయ్యాయి? వీటికి సమాధానాలు ఎవరు చెప్పాలి?

మన అస్తిత్వాన్ని కాపాడుకోవడంకోసం భారతీయ రాజులు అనేకులు దాదాపు 50 ఏండ్ల పాటు రాజ్యాన్ని ఏలిన ఔరంగజేబును ఎదిరించి పోరాడారు. వారిలో ముఖ్యుడు ఛత్రపతి శివాజీ. భారతదేశ వెయ్యేండ్ల బానిస సంకెళ్లను తుంచినవాడు. హిందూ సామ్రాజ్యాన్ని దేశమంతటా స్థాపించినవాడు. భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయమది. ఔరంగజేబు కంటికి కునుకు లేకుండా భయాన్ని ఆవరింపజేశాడు. శివాజీని ఎదిరించి నిలవడం అతనికి సాధ్యం కాలేదు. ఈ పరిస్థితుల్లో 50ఏండ్ల వయసుకే ఆరోగ్యం క్షీణించి శివాజీ చనిపోతే పిరికివాడని చరిత్రకారులు చిత్రించారు. వెయ్యేండ్లకు పైగా అల్లకల్లోలంగా మారిన దేశపు చూపును స్వతంత్ర పరిపాలనా లక్ష్యం వైపు మరల్చిన ధీరుడు శివాజీ. ఆ బీజాలు స్వాతంత్ర్య సంగ్రామానికి ఊపిరి పోసి 1857 పోరాటానికి నాంది పలికాయి.

శివాజీ కుమారుడు శంభాజీ శివాజీ అనుసరించిన గెరిల్లా యుద్ధాన్ని మరింత దూకుడుగా కొనసాగించాడు. మావోయిస్టులు, మన గ్రే హౌండ్ దళాలు ఉపయోగిస్తున్న పద్ధతి అదే. భారతీయ ధర్మాన్ని కాపాడడానికి తన శరీరంలో కంటి నుంచి కాలు దాకా ప్రతి మాంసపు ముద్దను అర్పించినవాడు శంభాజీ. ఔరంగజేబు హింసాత్మకమైన చర్యకు పరాకాష్ట శంభాజీని చంపిన వైనం. చరిత్రలో కనీవినీ ఎరుగని భయంకరమైన చావును చూపించాడు ఔరంగజేబు.  ప్రాణం పోయే చివరి దశలో కూడా శంభాజీ హిందూ ధర్మాన్ని వదులుకోవడానికి అంగీకరించలేదు. అదీ దేశభక్తి అంటే! జాదూనాథ్ సర్కార్ తన ‘హిస్టరీ ఆఫ్ ఔరంగజేబ్’లో ఈ విషయాలను వివరించాడు. ఇంతటి హత్యోదంతాన్ని కళ్లారా చూసినా మరాఠాలు ఔరంగజేబుకు లొంగిపోలేదు. ఇది చుట్టూ ఉన్న హిందువులలో కూడా చైతన్యాన్ని రగుల్కొల్పింది.

ఇంతటి వీరత్వాన్ని పక్కకు నెట్టి “ఛత్రపతి శివాజీకి హైందవధర్మోద్ధారక అని బిరుదు ఉన్నప్పటికీ తన ప్రాంతంలో హిందువులను ఎలాంటి మానవత్వం లేకుండా దారుణంగా హింసించి చంపించాడు” అని చరిత్ర రాశారు. మతం మార్చుకోవడానికి అంగీకరించని తేజ్ బహదూర్ సింగ్ తలను ఔరంగజేబు నరికివేశాడు. కానీ ఎస్.సి.ఈ.ఆర్.టి. 11వ తరగతి పుస్తకంలో “తేజ్ బహదూర్ దోపిడీదారు, పంజాబ్‌ను దోచుకున్నాడు, అత్యాచారాలు చేశాడు, ముస్లింలను సిక్కుల్లోకి మార్చాడు, గత్యంతరం లేక ఔరంగజేబు అతనికి మరణదండన విధించాడు” అని రాసి ఉంది. ఇదెక్కడి చరిత్ర? ఎవరు దీనిని ప్రామాణీకరించారు? అసలైన చరిత్రను ఎందుకు దాచారు? పిల్లలు వీటిని చదువుకొని ఏం నేర్చుకుంటారు? వీటన్నిటి మీద లోతైన పరిశోధన జరిగితే తప్ప నిజాలు తెలియవు.

తేజ్ బహదూర్ సింగ్ కుమారుడు గురు గోవింద్ సింగ్ చరిత్రను కాదని భారతదేశ చరిత్రను వేరుగా చూడడం సాధ్యం కాదని, అతనొక జ్ఞానభాండాగారమని సంతోష్ గారు అభివర్ణించారు. తండ్రి చనిపోయాక తొమ్మిదేండ్ల వయస్సులో గురుపీఠాన్ని అధిష్ఠించి, సిక్కులను ఏక తాటిపైకి తీసుకువచ్చిన వాడు గోవింద్ సింగ్. సిక్కులందరినీ యోధులుగా మార్చాడు. కేవలం నలభై ఏండ్ల జీవితంలోనే మరణించాడు. ఆయన కొడుకులు ఐదేండ్లు, పదేళ్ల వయస్సు ఉన్నవారిని మెడ వరకు సమాధి చేసి, తలలు నరికినా ఇస్లాంలోకి మారడానికి వారు ఒప్పుకోలేదు.

భారత్‌పై ముస్లింల దాడులను ప్రపంచంలోనే అతి భయంకర రక్తసిక్తచరిత్రగా అమెరికన్ రచయిత ఫిలాసఫర్ విల్ దురాంట్ స్పష్టంగా పేర్కొన్నాడు. భారత చరిత్ర పుస్తకాలు వాటిని గురించి చెప్పవు. కొంతమంది చరిత్రకారులు తప్పుదోవ పట్టించగా పాఠ్యపుస్తకాలలో అదే చరిత్ర చెప్పడం జరిగింది. సూఫీ తత్త్వవేత్తగా ఔరంగజేబును కొనియాడారు. మన దేశ హిందీ సినిమా పరిశ్రమ సూఫీ సంగీతాన్ని, కవిత్వాన్ని  మాత్రమే కాక వేషధారణలోనూ, నడతలోనూ వారిని శాంతి కాముకులుగా ప్రచారం చేసింది. నిజానికి సూఫీలు వివిధ జాతులుగా జీహాదుకు కరడుగట్టిన మద్దతుదారులు. సంగీతానికి, కవిత్వానికి ప్రసిద్ధి పొందినవాడుగా గుర్తించిన అమీర్ ఖుస్రూ చిత్తోడ్ కోటపై ఖిజ్ర్ ఖాన్ దాడి చేసి 30 వేలమంది హిందువులను హతమార్చినప్పుడు అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మాలిక్ కాఫర్ హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినప్పుడు వారి మతాన్ని ఘనంగా చెప్పుకున్నాడు. వాస్తవ చరిత్రను మొత్తం పరిశీలిస్తే, సూఫీ సిద్ధాంతానికి ‘శాంతి కాముకత’ ప్రథమ లక్షణమన్నది పూర్తి అసత్య ప్రచారం.

సూఫీల నేతృత్వంలోనే కాశ్మీర్ హిందువుల మీద పిశాచాల విలయ తాండవం జరిగింది. కాశ్మీర్ భూతల స్వర్గం. హిందూ సంస్కృతికి కేంద్ర స్థానం. ఆదిశంకరులు కేరళ నుండి కాశ్మీరుకు నడచి వచ్చారు. కశ్యప మహర్షి సంవత్సరాల తరబడి మెడిటేషన్ చేశారు. అభినవగుప్తుడు, ఉత్పలదేవుడు ఫిలాసఫీ మీద ఇక్కడ పరిశోధనలు చేశారు. భారతీయ ఆలంకారికులు, విద్యావేత్తలు ఎంతోమంది ఇక్కడ పరిశోధనలు నిర్వహించారు. ఇక్కడ విద్యనభ్యసించి పండిట్లు అయినారు. ఈ పండిట్ అనేది విద్యలో ఉన్నతస్థానాన్ని పొందినదానికి గుర్తుగా వారు భావిస్తే ఈ పదాన్ని ఒక కులానికి పరిమితం చేసి నాశనం చేశారు.

మొఘలులకు వారసులుగా వ్యాపారం పేరుతో అరుదెంచినది బ్రిటిష్ వారు.  స్వతంత్రత కోసం మనం జరిపిన మొట్టమొదటి మన సిపాయిల తిరుగుబాటును నాగరికతకు, అనాగరికతకు మధ్య జరిగిన ఘర్షణగా వర్ణించారంటే, దాన్నే మనం చదువుకుంటున్నామంటే అది మన దౌర్భాగ్యం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరిట డల్ హౌసీ ఏర్పరచిన నియమాల వలన  ఝాన్సీ లక్ష్మీ బాయి కుమారుడికి రాజ్యం దక్కకుండా పోవడంతో అసలు యుద్ధం మొదలైంది. సిపాయిల తిరుగుబాటు మాత్రమే కాక అంతర్గతంగా ఉన్న అనేక కీలక కారణాలను చరిత్ర అణగదొక్కింది. ఇక సయ్యద్ అహ్మద్ ఖాన్ బ్రిటిష్ అనుయాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు బద్ధ వ్యతిరేకి. ముస్లిం లీగ్‌కు కారకుడు. ఈయనకు బ్రిటిష్ వారు అండగా నిలిచి ఈ వ్యతిరిక్తతను పెంచి పోషించడానికి కావలసినన్ని నిధులు సమకూర్చారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్ గులాం మహమ్మద్, ముస్లిం లీగ్ నాయకులు ఇట్లా అనేకులు దేశ విభజనలో పాత్ర వహించినవారే.

బెంగాల్‌ను విభజించడానికి లార్డ్ కర్జన్ తీసుకున్న నిర్ణయం భారతదేశంలో ముస్లిం వేర్పాటువాద కాంక్షను తీవ్రతరం చేసింది. వందేమాతర ఉద్యమంతో జాతీయోద్యమం వైపు నడిపించింది. అదే సమయంలో కాంగ్రెస్‌లో మితవాద, అతివాద చీలికలు బ్రిటిష్ వారికి ఆనందాన్నిచ్చింది. అనేక చట్టాల కింద నాయకుల అరెస్టుల వలన ఏకత లోపించింది. 1909లో మింటో, మార్లే సంస్కరణల అమలుతో దేశంలో మత విభజన జరిగింది. ఖిలాఫత్ ఉద్యమ సమయంలోనే ముస్లిం నేతల ఎత్తుగడలను కాంగ్రెస్ అవగాహన చేసుకోలేకపోయింది. బ్రిటిష్ పాలకుల ‘విభజించి పాలించు’ అన్న సూత్రమే విభజనకు కారణమని ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు. అంతకుముందే దాదాపు ఆరువందల సంవత్సరాల పాటు అత్యంత పాశవికంగా జరిగిన దమనకాండ నుండి పుట్టిందని అర్థం చేసుకోలేకపోతున్నారు.

ఈ దేశంలో ముస్లిం వ్యవహారాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నది ఒకరు వీర సావర్కర్ అయితే మరొకరు అంబేద్కర్. మహాత్మాగాంధీ కూడా బ్రిటిష్ వారి సూత్రమే విభజనకు మూల కారణంగా భావించాడు. 1933లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతున్నా రహమత్ అలీ షా ‘పాకిస్తాన్’ పేరును మొదటిసారి ఖాయం చేశాడు. ఇప్పుడు తప్ప ఎప్పుడూ సాధించలేమని కరపత్రం విడుదల చేశాడు. “Now are never.. Are we to live or perish for ever” అని స్పష్టం చేశాడు. ఈ కరపత్రమే ‘పాకిస్తాన్ డిక్లరేషన్’గా పేరు పొందింది. దీంతో పాటు ఎన్నో మ్యాపులు తయారయ్యాయి. అనేక డిమాండ్లు ప్రతిపాదనకు వచ్చాయి. కానీ శ్రీరాముని జన్మభూమి అయిన ఈ నేల ఎంతమంది ఎన్ని కుతంత్రాలు చేసినా తనను తాను కాపాడుకుంటూనే ఉంది. మతం ముసుగులో ఇస్లాం చేసిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఆ ముసుగులోనే దేశం ముక్కలుగా విడిపోయింది. ఇప్పటికీ అదే చరిత్రను నమ్ముతుంటే భవిష్యత్తు తరాలకు మన వైభవాన్ని ఏమని చెప్పగలం? ఇప్పటికైనా నిజ నిర్ధారణలు జరగాలి. పాఠ్యపుస్తకాలలో అసలైన చరిత్రను తిరిగి రాయించాలి.

ఈ పుస్తకంలో సంతోష్ గారు విశ్లేషించిన ఎన్నో విషయాలు ఆసక్తిని, ఆశ్చర్యాన్ని, గగుర్పాటును కలిగిస్తాయి. ఇది చదివిన ప్రతీ వ్యక్తి ఊరకే వదిలేయక తప్పకుండా వెనుకకు తిరిగి ఆలోచించడం మొదలు పెడతాడనడంలో సందేహం లేదు. ఏదో ఆయనకు తోచింది రాస్తూ పోయాడని అనుకుంటే పొరపాటు. వీటికోసం వందకు పైగా పుస్తకాలను ఆయన పరిశీలించారు. సత్యానిరూపణ చేసుకున్న తర్వాతే మనకు అందించారు. అందువల్ల ఎటువంటి అపోహలకు తావివ్వకుండా ఆయన తేటతెల్లం చేసిన విషయాలలోని నిజాలను తెలుసుకుందాం. మనం మూఢంగా నమ్మిన చరిత్రను కాకుండా వచ్చే తరాలకైనా అసలైన చరిత్ర రూపాన్ని అందించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతటి ఆధారపూరిత గ్రంథాన్ని రచించినందుకు సంతోష్ గారికి అభినందనలు తెలుపుతూ ఆయన రాయబోతున్న మరో పుస్తకం త్వరలో మనముందుకు తెస్తారని ఆశిస్తున్నాను.

***

కల్లోల భారతం
రచన: కోవెల సంతోష్ కుమార్
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: 368
వెల: ₹ 275/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్ 9000413413
~
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
రచయిత: 9052116463, 7396116463

~
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/dp/B0FRXNJ63V

Exit mobile version