Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కల్లు చెట్టు ఎందుకు ఎక్కావంటే తేనెపట్టు కోసం అని బొంకాడట

[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]

గొందిపేటలో రంగారావు అనే రైతు ఉన్నాడు. అతనికి వారసత్వంగా ఇరవై జీలుగు చెట్లు వచ్చాయి. ఇవి కాకుండా పనస చెట్లు, చింతచెట్లు ఉన్నాయి. గిరిజనులు జీలుగు కల్లు, వంటసారా త్రాగుతారు. రంగారావు కల్లు చెట్లు నుంచి కల్లు తీసి అమ్మడానికి ఇద్దరు కూలీలను పెట్టుకున్నాడు. వాళ్లు కల్లు చెట్టు కొమ్మలు నరకడం, మొదలు దగ్గర కత్తితో గంట్లు పెట్టడం, కల్లు కోసం చెట్లకు బిందెలు కట్టడం వంటి పనులు చేస్తుంటారు. వాళ్లు సేకరించిన కల్లును చెట్ల దగ్గరకే వచ్చి పరిసర గ్రామాల గిరిజనులు త్రాగుతారు.

ఇలా రంగారావు బాగా డబ్బులు గడించాడు. కొంత పొలం కొన్నాడు. అందులో తన తమ్ముడితో కలిసి వరి, చోళ్లు, మొక్కజొన్న పండిస్తుంటాడు. ఆ గ్రామంలో మూగన్న అనే గిరిజనుడున్నాడు. అతడు అడవిలోనికి వెళ్లి తేనెపట్టుల నుంచి తేనె సేకరిస్తుంటాడు. తేనెపట్టు నుంచి తేనె సేకరించడం ఒక కళ. ముందుగా తేనెపట్టున్న చెట్టు కొమ్మలు గుర్తించాలి. వాటి క్రింత పొగపెట్టాలి. తేనెటీగలు పారిపోయాక ఒంటికి పసరు రాసుకుని చెట్లు ఎక్కి, కొడవలితో పట్టునంతటిని జాగ్రత్తగా కోసి గుడ్డ సంచిలో మూటకట్టాలి. ఇలా అతడు సేకరించిన తేనెపట్టును అతని పెళ్లాం నాగమ్మ పెద్ద గిన్నెలోనికి ఉంచి చేతితో పిండి చిక్కని తేనె తీస్తుంది. దానిని వడగట్టి, ఎండబెట్టి సీసాలలో నింపగా మూగన్న సంతలో వాటిని అమ్ముతాడు. ఆ డబ్బులు భార్యకిస్తాడు. ఒకటో, రెండో రూపాయలు చుట్టలు కొనుక్కుందుకు ఉంచుకుంటాడు.

మూగన్నకు జీలుగుకల్లంటే ఎంతో ఇష్టం. రంగారావు కల్లు చెట్లు ఎక్కి దొంగతనంగా కల్లు బిందెలలో నుంచి చిన్న గిన్నెతో తీసి త్రాగుతూ ఒకమారు రంగారావు కూలీలకు దొరికిపోయాడు. వాళ్లు అతన్ని పట్టుకుని రంగారావు దగ్గరకు తీసుకెళ్లి అప్పచెప్పారు. ఆ సమయంలో రంగారావు ఇరుగు పొరుగువారితో ఏదో వ్యాపార విషయాలు మాట్లాడుతున్నాడు. మూగన్న కల్లు దొంగిలించి రోజూ త్రాగుతున్నాడని అతని కూలీలు చెప్పారు. “ఏరా మూగన్నా! నువ్వు కల్లు చెట్లు ఎందుకు ఎక్కువుతున్నావు” అని అడగ్గా “తేనెపట్టు కోసం” అని జవాబు చెప్పాడు. అక్కడి వారంతా పకపకా నవ్వారు. రంగారావు వాడి చెంపమీద గట్టిగా కొట్టి “ఒరే! కల్లు చెట్టుమీద తేనెపట్టు ఎక్కడైనా ఉంటుందా? చెట్ల కొమ్మలపైన తేనెటీగలు పట్టుపెడతాయని అందరికీ తెలుసు. ఇలా అబద్ధాలాడటం, దెబ్బలు తినడం ఎందుకు? నువ్వు అమ్మిన తేనె డబ్బులతో కల్లు తొగొచ్చును కదా!” అని అడిగాడు. ఇంతలో మూగన్న పెళ్లాం నాగమ్మ అక్కడికి వచ్చి రంగారావును తన మొగుడిని క్షమించమని వేడుకుంది. రంగారావు మూగన్నతో “నా పనస, చింతచెట్లకు కాపలాగ వుంటావా? నీకు రోజు కూలి, చెంబుడు కల్లు ఇస్తాను. పనస కాయలు బాగా పెరిగాక వాటిని పండబెట్టి సంతల్లో అమ్మాలి. అలాగే చింతచెట్ల నుంచి చింతపండు తెచ్చి నాకు ఇవ్వాలి” అన్నాడు. ఇందుకు మూగన్న అంగీకరించాడు. అతని పెళ్లాం సంతోషించింది. ఎప్పుడైనా హాస్యానికి మూగన్నతో “కల్లు చెట్లు మీద తేనెపట్లు నువ్వు చూసావురా! మేమెప్పుడూ చూడనేలేదు” అనేవారు. వాడు కూడా తన మాటకు నవ్వుకునేవాడు.

Exit mobile version