Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కర్కాటకం-1

[శ్రీ కె. రామ్ మోహన్ రావు వ్రాసిన ‘కర్కాటకం’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి, ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో ప్రథమ బహుమతి గెల్చుకున్న రచన.]

కేన్సర్‌ని తెలుగులో కర్కాటకం లేదా పీత అంటారు. పీతకు ఉండే పది కాళ్ళ ద్వారా అది అన్ని వైపులా పాకగలదు. కేన్సర్ కూడా అంతే. ఎక్కడ పుట్టినా, అన్ని వైపులా పాకగలదు కనుక ఆ పేరు వచ్చింది. దానిని కర్కాటకం అని కాకుండా కర్కోటకం అనడమే కరక్ట్. ఎందుకంటే దానికి దయా దాక్షిణ్యం లేవు. పెద్దా చిన్నా, పేద గొప్ప అనే బేధాలు అసలే లేవు.

ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ మరణాలు బాగా ఎక్కువయిపోతున్నాయని మనకందరకూ తెలుసు. కేన్సర్ బాగా ప్రబలడానికి మొదటి కారణం అవగాహనా రాహిత్య౦. దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించని నిర్లక్ష్యం రెండవది. ఆ అవగాహన కలిగించడమే, ఈ చిన్న నవల యొక్క పెద్ద ఉద్దేశం.

***

“ఏమిటీ.. మావయ్యగారికి కేన్సరా? ఏ టైపు కేన్సర్? ప్రమాదం ఏమీ లేదు కదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది, నందన.

“ప్రోస్టేట్ కేన్సర్. ఆ విషయం తెలిసాక నేను కూడా తట్టుకోలేకపోయాను. నాన్నకు తెలిస్తే, పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేకున్నాను. ఏమి నేరం చేసామని మనకీ శిక్ష? అమ్మ మరణించి రెండేళ్ళయినా, ఇప్పుడిప్పుడే ఆ దుఃఖం నుంచి బయటపడుతున్నా౦. మళ్ళీ ఇదేమిటి? చీమకయినా హాని తలపెట్టని అమ్మా నాన్నలపై దేవుడింత కఠిన౦గా ఎలా ఉంటున్నాడు? ఏం పాపం చేసారని నాన్నకింత పెద్ద శిక్ష? ఈ విషయం తెలిసిన దగ్గరినుంచి నాకు కాలూ చేయీ ఆడటం లేదు. నాన్నెలా రియాక్ట్ అవుతారో అర్థం కాకుండా ఉంది” అంటూ ఆవేదనగా అంటున్న ఆకాష్ గొంతు దుఖంతో పూడుకుపోయింది. నందన అతని భుజంమీద చేయివేస్తూ అనునయంగా అంది.

“మీరు బాధ పడకండి. మామయ్యగారికి ఏమీ కాదు” అని. అలా ధైర్యం చెప్పిందేగానీ, తన మాట మీద తనకే నమ్మకం కుదరలేదు.

“మావయ్యగారికి ప్రోస్టేట్ కేన్సర్ ఎలా వచ్చింది? మా కజిన్ రఘు మామగారికి ఆ కేన్సరే వచ్చింది. అతను తిరుగుబోతు, స్త్రీలోలుడు. అలాగే మా నాన్నగారితో పనిచేసిన నరేంద్ర అంకుల్‌కి కూడా ఆ కేన్సర్ వచ్చింది. అతను కూడా గొప్ప తిరుగుబోతే. అతనికి ప్రోస్టేట్ గ్లాండ్ తీసేశారు. ప్రోస్టేట్ గ్లాండ్ అంటే, ‘స్పెర్మ్’కి సంబంధించిందే కదా? మరి మావయ్యగారు మచ్చలేని మనిషి. ఈయనకు ఎందుకొచ్చింది?” అంటూ ఆశ్చర్యపోతే,

“ఇదే మనందరిలోనూ లోపం. అందరం చదువుకున్నాం గానీ, కేన్సర్ లాంటి జబ్బుల గురించి అస్సలు అవగాహన ఉండదు. అటువంటి కేన్సర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫలానా కేన్సర్ రావడానికి, ఇవీ కారణాలు అని డాక్టర్లు, సైంటిస్టులు చెప్తారుగానీ, పూర్తిగా వాళ్ళకూ తెలియదని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడున్న రెండువందల రకాల కేన్సర్లలో ప్రోస్టేట్ కేన్సర్ సురక్షితమయినదని, మంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ, క్రమం తప్పకుండా మందులు వాడిన పేషెంట్లు ఇరవై ఏళ్ల పాటూ జీవిస్తున్నట్లు చెపుతున్నారు. అదృష్టవశాత్తు నాన్నకు వచ్చిన కేన్సర్ రెండవ దశలో ఉంది. అందుచేత, ప్రస్తుతానికి అంత ప్రమాదం లేదు..” అని చెపుతుండగా అడ్డుతగిలింది.

“మరింకేమేటి? పెద్ద ప్రమాదం ఏమీ లేదుగా? ఎందుకంత భయపెట్టేసారు? హడలిచచ్చాను. ముందునుంచీ మీకు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ” అంటూ దులిపేసింది.

“చెప్పేది పూర్తిగా విను. నాన్నకు ఏమీ కాదు అన్న ధైర్యం నాకూ ఉంది. మనం న్యూయార్క్ నగరంలో ఉన్నాం. అత్యంత అధునాతనమయిన వైద్యం అందించగలం. ప్రాథమిక దశలోనే ఆ వ్యాధి గుర్తించబడింది. ఎంత డబ్బు ఖర్చు అయినా ఫర్వాలేదు, ఇవన్నీ పాజిటివ్ పాయింట్లే. కానీ ఇక్కడ రిస్క్ లేకపోలేదు. నిన్ననే డాక్టర్ ఏడమ్స్‌తో మాట్లాడాను. మూడు, నాలుగు దశలు అతి ప్రమాదమయినవట. ఇప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్‌కే పరిమితమయిన కేన్సర్, ఆ దశలో ఇతర అవయవాలకు, ముఖ్యంగా ఎముకలకు సోకవచ్చునట. ఎముకలకు సోకితే, ఆశ వదిలేసుకోవాలట. ఆ విషయం తెలిసినదగ్గరినుంచి చాలా దిగులుగుగా ఉంది” అన్నాడు బాధగా.

“మీరు వర్రీ అవకండి. ఆ పరిస్థితి రాదు. ఏడమ్స్ చాలా గొప్ప డాక్టర్. నా ఫ్రెండ్ పల్లవికి ఆయనే వైద్యం చేస్తున్నారు కదా? అది ఇపుడిప్పుడే కోలుకుంటుంది. మనకు అందుబాటులో అటువంటి డాక్టర్లు, మంచి కేన్సర్ హాస్పటల్ ఉండడం ఎంతో అదృష్టం. గాభరా పడకండి. అంతా మంచే జరుగుతుంది. మావయ్యగారికి ఈ విషయం నింపాదిగా చెప్పండి. ఆయనలో ధైర్యం నింపండి. ఆయన డీలా పడిపోకుండా చూసుకోవాలి. మనమంతా అండగా ఉన్నామని చెప్పాలి” అనేసరికి ఆకాష్‌కు కాస్త ధైర్యం వచ్చింది.

ఆకాష్ తండ్రి, విశ్వం అమెరికాలోనే వివిధ ప్రాంతాలలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. భార్య ‘పూర్ణ’ పోయిన తర్వాత కొడుకు దగ్గరే ఉంటున్నాడు. పూర్ణ మరణంతో కలిగిన దుఃఖం ఇప్పుడిప్పుడే మరచిపోతున్న తరుణంలో వాళ్ళ జీవితంలో ఇలా మరో సునామీ వచ్చింది.

***

‘ఇలాంటి జీవితం పగవాడికి కూడా వద్దు. భగవంతుడా.. నువ్విచ్చిన జీవితాన్ని నువ్వే తీసేసుకో’ అనుకుంటూ ఫేన్‌కి చీర బిగించి చావడానికి సిద్ధపడుతున్న సమన్విత, సెల్ ఫోన్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడింది. ఆ శబ్దం ఆమెను బాగా డిస్టర్బ్ చేసింది. ఎలాగయినా చావాలనే ఆలోచన సడలిపోతుందేమోనన్న ఆదుర్దా ఆమెను బాగా కలవరపెట్టింది. ‘ఛ.. అన్ని ఏర్పాట్లు చేసుకుని, ఈ ఫోన్ సంగతి మర్చిపోయానేమిటి?’ అనుకుంటూ తనని తాను తిట్టుకుంది. ఏ మాత్రం డైవర్షన్ వచ్చినా, తను ఆత్మహత్య చేసుకోలేదు అనే విషయం స్పష్టంగా తెలుసు కాబట్టి, ఫోన్ తీసే ఉద్దేశాన్ని పక్కన పెట్టినా, ఫోన్ పదే పదే మోగుతూ, ఆమెను బాగా డిస్టర్బ్ చేయడం మొదలు పెట్టింది. ఫోన్ స్విచ్చాఫ్ చేయాలని నిర్ణయించుకొని ఆ మొబైల్‌ను అందుకోగానే, ‘ట్రూ కాలర్’లో ‘ప్రతిమ’ పేరు కనబడగానే, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

ప్రతిమతో సంబంధం ఎన్నో ఏళ్ల క్రితమే తెగిపోయింది. చాలా ఏళ్లుగా పట్టు వదలకుండా, ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నా.. తను ఎక్కడవుందో తెలుసుకోలేకపోయింది సమన్విత. అటువంటి ప్రతిమ తనకు ఫోన్ చేయడం, ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘కొన్ని క్షణాలు ఆలస్యమయి ఉంటే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్నేహితురాలి గొంతు వినకుండానే, ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోదునే? అలా వెళ్లిపోయి ఉంటే నా ఆత్మకు శాంతి ఉండేదా?’ అనుకుంది.

సమన్విత మొబైల్ అందుకునేసరికే కాల్ కట్ అవడంతో, తనే కాల్ చేసి, స్నేహితురాలు గొంతు విందామని ఆశగా ఎదురుచూసింది. మగ గొంతు వినబడగానే, తీవ్ర నిరాశకు గురి అవుతూ “ప్రతిమ మొబైల్ కాదా?” అని అడిగింది.

“అవుననండి. తన మొబైలే. నేను, ప్రతిమ భర్తని. నా పేరు భద్ర. మీరు సమన్వితే కదా?’ అంటూ అడిగాడు.

“అవునండి. ప్రతిమ దగ్గరలో లేదా? తనకు ఎలా ఉంది? మీరెందుకు ఫోన్ చేసారు?” అంటూ గాబరా పడుతూ ప్రశ్నల వర్షం కురిపించింది.

“ప్రతిమ ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగా లేదు. కేన్సర్ బాగా ముదిరిపోయింది. రేపో మాపో అన్నట్లుంది. చివరి క్షణాల్లో మిమ్మల్ని చూడాలని ఆశ పడుతుంది. మీరొకసారి హైదరాబాద్ రాగలరా?” అని అడుగుతున్న అతని గొంతులో విషాదం స్పష్టమవుతుంది. ఆ వార్త వినగానే మాన్పడిపోయింది సమన్విత. ఆ షాక్ నుంచి తట్టుకోవడానికి ఆమెకు కొంత సమయం పట్టింది. మొబైల్ నుంచి ‘హలో.. హలో..’ అంటూ మాటలు వినిపిస్తున్నాయి.

“ఈ పరిస్థితి వచ్చేవరకూ నాకు ఎందుకు చెప్పలేదు? నేను చచ్చాననుకున్నారా?” అని నిష్ఠూరంగా అంటూ ఏడవడం మొదలుపెట్టింది.

“ఈ వార్త వింటే మీరు తట్టుకోలేరని తనే చెప్పవద్దని అంది. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న భయం పట్టుకోవడంతో, తనే మీకు ఫోన్ చేసి చెప్పమంది” అంటూ సంజాయిషీ ఇచ్చాడు.

“ఒకసారి మా ప్రతిమకు ఫోన్ ఇవ్వండి” అని అడిగింది.

“ఇప్పుడు కీమో థెరపీలో ఉంది. మీతో మాట్లాడే పరిస్థితి లేదు. వీలు చూసుకొని నేనే మాట్లాడిస్తాను. మీరు తొందరగా వచ్చేస్తారు కదూ? ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని భయంగా ఉంది” అంటున్న భద్ర గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.

“ఇప్పుడే బయల్దేరతాను. ఎడ్రస్ మెసేజ్ చెయ్యండి. వీలయితే లొకేషన్ షేర్ చెయ్యండి” అని చెప్పింది. అలాగేనంటూ ఫోన్ కట్ చేసాడతను.

గబ గబా బట్టలు సర్దుకొని, బయటకు నడిచింది సమన్విత. తిన్నగా బస్ స్టాండ్‌కి వెళ్ళి, ఏ బస్ దొరికితే ఆ బస్ పట్టుకొని హైదరాబాదు చేరుకోవాలని నిర్ణయించుకుంది. విజయవాడ బస్ దొరకగానే అదే ఎక్కేసి, అక్కడినుంచి హైదరాబాద్ వెళ్ళడానికి నిర్ణయించుకు౦ది.

***

తండ్రి చేతిలో ఉన్న మెడికల్ రిపోర్ట్స్ చూడగానే, గుండె గుభేల్మంది ఆకాష్‌కి.

“అంతా తెలిసిపోయిందా నాన్నా?” అంటూ దిగాలుగా అడిగాడు.

“ఎప్పటికయినా తెలియాల్సిందే కదరా? నింపాదిగా చెపుదామనుకున్నావు. కానీ సడన్ తెలిసిపోయేసరికి నేను కూడా తట్టుకోలేకుండా ఉన్నాను” అంటున్న తండ్రిని చుట్టుకొని బావురుమంటున్న ఆకాష్‌ని విశ్వమే ఓదార్చవలసి వచ్చింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న నందనకు గుండె చెరువయ్యింది. భర్త భుజం మీద చేయివేసి,

“ఊరుకోండి.. ఊరుకోండి.. పిల్లలు వచ్చే టైమయింది” అంటూ నెమ్మదిగా హెచ్చరించేసరికి, తండ్రీకొడుకులు కళ్ళు తుడుచుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ సోఫాలో కూర్చున్నాక, తండ్రి చేయి తన చేతిలోకి తీసుకొని,

“ఫర్వాలేదులే నాన్నా.. ఇదేమంత ప్రమాదకరమైన కేన్సర్ కాదు..” అంటూ ధైర్యం చెప్పబోతున్న కొడుకుకు అడ్డు తగిలాడు.

“దీని గురించి కాస్త స్టడీ చేసానురా. కొంత రిస్క్ లేకపోలేదు” అనేసరికి ‘ఈయనకు ఏమి చెప్పి ఏమార్చగలను?’ అనుకున్నాడు నిరాశగా. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాటాపలుకూ లేకుండా అలాగే కూర్చుండిపోయారు, చాలాసేపటివరకూ.

***

డాక్టర్ ఏడమ్స్‌ని కలవడానికి కేన్సర్ హాస్పటల్‌కి వచ్చిన విశ్వానికి లిఫ్ట్ దగ్గర ఒక ‘వాలెట్’ కనబడడంతో దాన్ని చేతిలోకి తీసుకొని, దానిని పోగొట్టుకున్న వ్యక్తి కోసం అటూ ఇటూ చూసాడు. దరిదాపుల్లో ఎవరూ కనబడకపోయేసరికి, విజిటింగ్ కార్డులు ఏమయినా కనబడతాయేమోనని వాలట్ తెరిచేసరికి, కనిపించిన అందమయిన పెళ్లి ఫోటో అతన్ని బాగా ఆకర్షించింది. ఎంతో అందంగా ఉన్న నూతన వధూవరుల ఫోటో అది. ఒకరి కోసం ఒకరు పుట్టారా? అనిపించేటంత చూడచక్కని జంట అది. ఫోటో చూడగానే తెలిసిపోతుంది, వాళ్ళు తెలుగు వాళ్ళని. ‘క్లూ దొరికింది కనుక వాళ్ళను పట్టుకోవడం ఏమీ కష్టం కాదు, అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ లిఫ్ట్ లోకి నడిచాడు. పెద్దగా శ్రమ పడకుండానే వాళ్ళు వెయిటింగ్ హాల్లో కనబడ్డారు. ఒక మూలగా కూర్చుని ఉన్న ఆ జంట వైపు అడుగులు వేసాడు. వాళ్ళను సమీపించగానే అతని ముఖంలో దుఃఖం అలుముకుంది.

‘అయ్యో.. ఎంత అందమయిన అమ్మాయి, ఎలా అయిపోయింది? కేన్సర్ రాకాసి పాపం ఈ చిన్నారిని పీల్చి పిప్పి చేసేసిందే!’ అనుకుంటూ తెగ బాధ పడిపోయాడు. ఏవో మాట్లాడుకు౦టున్న వాళ్ళిద్దరూ అతని ఉనికిని గమనించలేదు. జేబులోంచి వాలట్ పైకి తీసి చిన్నగా దగ్గేసరికి, అతను విశ్వం వైపు చూసి,

“అరే.. ఇది నా వాలెట్టే.. ” అనేసి.. “ఐ యాం సారీ. దిస్ ఈజ్ మై వాలట్. హౌ కం..” అనబోతుండగా

“ఫర్వాలేదు తెలుగులోనే మాట్లాడండి. నేనూ తెలుగువాడినే. ఇది లిఫ్ట్ దగ్గర దొరికింది” అంటూ వాలట్ అందించాడు.

“ఓ.. థాంక్ యు వెరీమచ్ సర్. ఇది పోగొట్టుకున్నట్లే నాకు తెలియదు. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు ‘స్వరూప్’. ఈమె నా భార్య ‘కీర్తన’ అన్నాడు చేయి కలుపుతూ.

“దేశం కాని దేశంలో మనవారిని కలవడం ఆనందమే కదా? కాకపోతే ఇలా హాస్పటల్లో కలవడమే కాస్త బాధగా ఉంది. బై ది వే.. నా పేరు విశ్వనాధ్. ప్రొఫెసర్‌గా అమెరికాలోని అనేక చోట్ల పనిచేసి, చివరకు మా అబ్బాయి దగ్గర, ఈ న్యూయార్క్‌లో సెటిల్ అయ్యాను. ఈ మధ్యనే ప్రోస్టేట్ కేన్సర్ వచ్చినట్లు తెలిసింది. డాక్టర్ ఏడమ్స్‌ని కలవడానికి వచ్చాను” అంటుంటే స్వరూప్ జాలిగా చూసాడు. విశ్వం మనస్సు చివుక్కుమంది. ఆ జాలి చూపులు, సానుభూతి అతను తట్టుకోలేకపోతున్నాడు. కేన్సర్ కన్నా అవే అతన్ని ఎక్కుగా బాధిస్తున్నాయి. ‘అలవాటు చేసుకోవాలి’ అనుకుంటూ నిట్టూర్చాడు.

విశ్వం చాలా త్వరగానే వాళ్ళతో కలిసిపోయాడు. ఖాళీ దొరకడం వల్ల వాళ్ళు మాటల్లో పడ్డారు. అప్పుడే కీర్తనకు గల కేన్సర్‌కు సంబంధించిన విషయాలు తెలిసాయి. ముందుగా స్వరూప్ చెప్పడం ప్రారంభించాడు.

“మేమిద్దరం హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నపుడు ప్రేమలో పడ్డాం. మాది మిడిల్ క్లాస్ కుటుంబం. కీర్తన తల్లితండ్రులు బాగా సంపన్నులు. అదే మా పెళ్ళికి అడ్డంకి అయింది. మావాళ్ళు ఒప్పుకున్నారుగానీ, కీర్తన నాన్నగారు అంగీకరించలేదు. ఆయన్ని బతిమాలి ఒప్పించడానికి ఏడాదిపాటూ శక్తివంచన లేకుండా ప్రయత్నించాం. అయినా ఆయన మనసు కరగలేదు. మరోదారి లేక, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా మా అమ్మానాన్నల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నాం. రెండేళ్లు ఎంతో హాయిగా గడిపేసాం. ఆ తర్వాత కేన్సర్ మా జీవితాలను అతలాకుతలం చేసేసింది. కీర్తనకు ‘కొలోన్’ కేన్సర్ అని తెలిసేసరికే, అది ముదిరిపోయింది.

ఆ వార్త తెలిసాక కీర్తన తల్లితండ్రులు లబో దిబో మంటూ పరిగెత్తుకు వచ్చారు. అప్పటినుంచి తనను వదలకుండా కనిపెట్టుకునే ఉంటున్నారు. అలా కీర్తన తల్లితండ్రులలో మార్పు వచ్చింది. అయితే మా తల్లితండ్రులలో వేరే విధమయిన మార్పు వస్తుందన్న విషయాన్ని ఆరునెలల తర్వాత గానీ తెలుసుకోలేకపోయాం. కీర్తనకు విడాకులు ఇచ్చేయమని, నాకు వేరే పెళ్లి చేస్తామని ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. నేను వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. వారి ప్రోద్బలంతో మా బంధువులు, స్నేహితులు నా మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. అయినా నేను లొంగలేదు. ఆఖరికి మా అమ్మానాన్నల ప్రభావం ఎంతవరకూ వెళ్లిందంటే, కీర్తన కూడా విడాకులు తీసుకుందామని పోరడం మొదలు పెట్టింది..” అంటుండగా విశ్వం అడ్డు తగిలి,

“ఏమిటి.. కీర్తన కూడానా?” అంటూ. అపుడు కీర్తన అందుకుంది.

“అవును సార్. నేనే విడిపోదామన్నాను. దానికి కారణం మా అత్తా మామలు కాదు. నాకే అనిపించింది. నాకు బాగా తెలుసు, నేనెంతో కాలం బతకనని..” అంటుండగా స్వరూప్ కోపంగా అడ్డుతగిలాడు.

“ఆ మాటే అనొద్దన్నాను. నువ్వు ఎవరివి చెప్పడానికి? నిన్ను బతికించుకోవడానికే కదా? ఇంత దూరం తీసుకొచ్చింది? నీకు చాలాసార్లు చెప్పాను, ఆశ వదులుకోవద్దని” అంటుంటే, ఆమె పైన అతనికి ఎంత ప్రేమ ఉందో అర్ధమయింది.

“నువ్వు కాసేపు అడ్డురాకు. నేను బాబాయి గారితో చాలా చెప్పాలి” అంటూ అతన్ని వారించేసరికి

“అబ్బో అప్పుడే వరసలు కలిపేస్తున్నావే?” అంటూ నవ్వేసరికి, వాతావరణం కాస్త తేలిక పడినట్లు అనిపించింది విశ్వానికి.

“నిజమే.. నాకూ అనిపిస్తుంది, తను నా కూతురు లాంటిదేనని. నాకు కూతురు లేని కొరత ఇలా తీరబోతున్న౦దుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి పరిచయంలోనే మీరు నాకు, నేను మీకూ ఆత్మీయులం అయినట్లు నాకు అనిపిస్తుంది” అనగానే వాళ్ళిద్దరి ముఖాలూ వెలిగిపోయాయి.

“నువ్వు అడ్డురాకు. మా అమ్మాయి నాతో ఏదో చెప్పాలనుకుంటుంది. చెప్పనీయ్” అనగానే తన అంగీకారం తెలియజేస్తున్నట్లు చిన్నగా నవ్వాడు.

“థాంక్స్ బాబాయ్. దేవుడి దయవల్ల మా అమ్మా నాన్న, నన్ను వాళ్ళ అక్కున చేర్చుకున్నారు. నేను జీవించి ఉన్నన్నాళ్ళూ నాకు వాళ్ళు తోడుగా ఉంటారు. స్వరూప్ వేరే పెళ్లి చేసుకుని, సంతోషంగా ఉంటే నాకదే చాలు. అందుకే విడిపోదామని ఎంతో ఒత్తిడి చేసినా, ఈ మహానుభావుడు వింటేనా?” అంటూ చిరుకోపం ప్రదర్శించింది.

‘నిజంగా మహానుభావుడే’ అనుకున్నాడు విశ్వం మనసులో. అప్పుడు కలుగజేసుకున్నాడు స్వరూప్.

“తన పరిస్థితి అలా ఉంటే నేనెలా సంతోషంగా ఉంటాను సార్? మూడేళ్లు వెంటబడి వెంటబడి, ఏరి కోరి చేసుకున్నాను ఈ బంగారాన్ని. జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసి తాళికట్టాను. ఏది ఎలాగయినా జరగనీయండి. నేను తనను విడిచిపెట్టే సమస్యే లేదు” అంటున్న అతని మాటల్లో నిజాయితీ, స్థిరత్వం విశ్వాన్ని ముగ్ధుడిని చేసింది. ఆ మాట వినగానే స్వరూప్ చేయి పట్టుకొని, ఆప్యాయంగా నొక్కి,

“నీలాంటి భర్త, మా అమ్మాయికి దొరకడం చాలా అదృష్టం” అంటూ అభినందించాడు. కీర్తన చెప్పడం కొనసాగించింది.

“ఒకరకంగా ఈ పరిస్థితికి నేనే బాధ్యురాలిని బాబాయ్. ఇది నా స్వయంకృతాపరాధమే” అంటున్న ఆమె వైపు ఆశ్చర్యంగా చూసాడు.

“అవుననండి. ఇంత చదువుకున్నానుగానీ నాలో ఇంగితజ్ఞానం లోపించింది” అనేసరికి మరింత ఆశ్చర్యపోయాడు విశ్వం. ‘ఈ పిల్ల ఏమిటి ఇలా మాట్లాడుతుంది?’ అనుకున్నాడు మనసులో.

“మా కుటుంబంలో నాతోపాటూ నలుగురం కేన్సర్ బారిన పడ్డాం. మా తాతయ్యకు నాలాగే కొలోన్ కేన్సర్. మా బాబాయికి స్కిన్ కేన్సర్. మా మేనత్తకు బ్రెస్ట్ కేన్సర్. అంటే మా ఫేమిలీ హిస్టరీలోనే కేన్సర్ ఉంది కదా? కొంచమయినా జాగ్రత్తపడాలి కదా? లేదు. దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక ముఖ్యమయిన విషయం ఏమిటంటే, మా తాతయ్య ఒక్కరే బతికి బయటపడ్డారు. అదెలా జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఆయన పాతకాలపు మనిషి కదా? అందుకే ఆయన ఎప్పుడూ ‘ఇండియన్ టాయిలెట్లే ఉపయోగిస్తారు. ఆ అలవాటే ఆయనకు మేలుచేసింది. ఒకరోజు ‘స్టూల్స్’లో రక్తం పడుతున్నట్లు ఆయన గమనించి, ఆ విషయం వెంటనే నాన్నకు చెప్పారు. అదృష్టవశాత్తు ఆ రోజుల్లోనే ‘కొలెనోస్కోపీ’ అందుబాటులోకి వచ్చింది. దాంతో టెస్ట్ చేయిస్తే, కొలోన్ కేన్సర్ మొదటిదశలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే చికిత్స చేయడం వల్ల, ఆయన ఆరోగ్యం కుదుటపడింది. కానీ నా దగ్గరకు వచ్చేసరికి, పరిస్థితి తారుమారయిపోయింది. ఇప్పుడందరం ‘వెస్ట్రన్ టాయిలెట్ లే వాడుతున్నాం కదా? అందుచేత నా కేన్సర్ నేను ప్రాథమిక దశలోనే కనిపెట్టలేకపోయాను. ఒకసారి మా బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళినపుడు, టాయిలెట్‌కి వెళ్ళాల్సి వచ్చింది. వెస్ట్రన్ టాయిలెట్లు ఖాళీగా లేకపోవడంతో, ఇండియన్ టాయిలెట్ ఉపయోగించాల్సివచ్చింది. అప్పుడు తెలిసింది, నాకు కొలోన్ కేన్సర్ ఉందని. కానీ ఏమి లాభం? అప్పటికే అది ముదిరిపోయింది” అని చెపుతున్న కీర్తనను జాలిగా చూసాడు విశ్వం.

“బాధపడకమ్మా. అందరం అలాగే ఉన్నాం. ప్రపంచమంతటా కేన్సర్ ప్రబలంగా విస్తరిస్తుందని, అందరికీ తెలుసు. కానీ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం ఒక్కరూ చేయరు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ‘కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు’ తప్పనిసరి చేసారు. అందుకే అలాంటి చోట కేన్సర్ ను ప్రథమ దశల్లోనే గుర్తించడం వల్ల, మరణాల సంఖ్య మనదేశంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. స్కిన్, లంగ్, కొలోన్, ప్రోస్టేట్, బ్రెస్ట్, ఒవేరియన్.. ఇలా కొన్ని కేన్సర్లకు స్క్రీనింగ్ పరీక్షలున్నాయి. వాటిని ముందుగానే గుర్తిస్తే, తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో బయటపడవచ్చును. కానీ ఎవరూ పట్టించుకోరు. అది మన దౌర్భాగ్యం. నువ్వొక్కదానివే తప్పు చేసావని బాధపడకు తల్లీ. ఇది అందరూ చేసేదే. జరిగిపోయినదాని గురించి చింతించక, జరగబోయేదాన్ని గురించి ఆలోచించు. ఇక్కడికి వచ్చి మంచి పనే చేసారు. ఈ హాస్పటల్, చాలా ప్రఖ్యాతి గాoచింది. నీకు నయమవుతు౦దనే నమ్మకం నాకు ఉంది. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నా మాట నమ్ము” అని ధైర్యం నూరిపోసేసరికి, వాళ్ళిద్దరికీ కొండంత నైతికబలం చేకూరినట్లయింది. స్వరూప్ వెంటనే విశ్వం చేయి పట్టుకుని

“చాలా థాంక్స్ సర్. మీ మాటలు నిజం కావాలని కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు మా వెనుక ఉంటే, ఏదయినా సాధిస్తాం” అంటున్న అతని మాటల్లో ఎంతో ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమయింది. డీలా పడిన జంటలో చైతన్యం నింపగలిగినందుకు చాలా ఆనందపడ్డాడు విశ్వం.

ఆ తర్వాత, వాళ్ళను నాలుగైదు సార్లు కలిసాడు విశ్వం. ఆశించినట్లే ఇక్కడి ట్రీట్మెంట్ సత్ఫలితాలనే ఇచ్చింది. కీర్తన ఆరోగ్యం కొంత మెరుగుపడింది. పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో అందరూ ఆనందపడ్డారు. ‘ఏదో రకంగా ఈ చిన్నారి గండం గట్టేక్కేస్తే చాలు’ అని మనసారా ఆశించాడు విశ్వం. కానీ అతని పరిస్థితే రోజు రోజుకూ విషమ౦గా మారసాగింది. భయపడినట్లే జరిగింది. కేన్సర్ ఎముకలకు సోకింది. కీమో థెరపీ లాంటి చికిత్సల వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. ఏడమ్స్‌తో పాటూ మరో ఇద్దరు డాక్టర్లు ఎంతగానో శ్రమించినా ఫలితం లేకపోయింది. విశ్వం రూపురేఖలలో చాలా మార్పు వచ్చేసింది.

ఇంట్లో విషాదం గూడుకట్టుకుంది. ఇంట్లో వాళ్ళు నవ్వడం మానేసి, చాలా రోజులయిపోయింది. పెద్ద వాళ్ళు గుండె దిటవు చేసుకుని, ధైర్యాన్ని పోగుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా, పిల్లల ఏడుపులతో ఆ ఇల్లు అల్లాడిపోతుంది. ఇంత అభిమానంగా చూస్తున్న, తన వాళ్లందరికీ దూరమయిపోతున్నాననే వ్యథ విశ్వాన్ని కాల్చేస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version