Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కర్కాటకం-2

[శ్రీ కె. రామ్ మోహన్ రావు వ్రాసిన ‘కర్కాటకం’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి, ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో ప్రథమ బహుమతి గెల్చుకున్న రచన.]

[న్యూయార్క్‌లో ఉంటున్న భార్యాభర్తలు ఆకాష్, నందన మాట్లాడుకుంటూంటారు. ఆకాష్ తండ్రి విశ్వం అమెరికాలోనో ప్రొఫెసర్‍గా పని చేసి రిటైర్మెంట్ తీసుకుని కొడుకు దగ్గరే ఉంటుంటాడు. ఆకాష్ వాళ్ళ అమ్మ చనిపోయి రెండేళ్ళవుతుంది. ఈలోప్పు విశ్వానికి ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్టు రిపోర్టులో తేలుతుంది. ఆ వార్త తండ్రికెలా చెప్పాలో తెలియక మథనపడతాడు ఆకాష్. జీవితంలో కష్టాలపాలై, నిస్పృహతో తనువు చాలించాలనుకున్న సమన్విత ఓ ఫోన్ కాల్ రావడంతో ఆ ప్రయత్నం విరమించుకుంటుంది. ఫోన్ ఆమె ఆప్తమిత్రురాలు ప్రతిమ నుంచి. హలో అనగానే అవతలివైపు నుంచి ప్రతిమ భర్త మాట్లాడుతాడు. ప్రతిమ కేన్సర్ బారినపడిందనీ, చివరి రోజుల్లో ఉందనీ, సమన్వితను చూడాలనుకుంటోందని చెప్తాడు. విజయవాడ వెళ్ళి అక్కడ్నించి ఏదో ఒక బస్‍లో హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది సమన్విత. తండ్రి చేతిలో మెడికల్ రిపోర్టులు చూడగానే ఆయనకీ విషయం తెలిసిపోయిందని ఏడుపు ఆపుకోలేకపోతాడు ఆకాష్. తాను ఆ కేన్సర్ గురించి స్టడీ చేస్తానని చెప్తాడు విశ్వం. డా. ఏడమ్స్‌ని కలవడానికి కేన్సర్ హాస్పటల్‌కి వెళ్ళిన విశ్వానికి అక్కడ ఓ తెలుగు జంటతో పరిచయం కలుగుతుంది. అతని పేరు స్వరూప్, ఆమె పేరు కీర్తన. కీర్తనకి కొలోన్ కేన్సర్. ఆమెకి ధైర్యం చెప్తాడు విశ్వం. వాళ్ళ పరిచయం స్నేహంగా మారుతుంది. కీర్తనకి చాలా సపోర్ట్ చేస్తాడు విశ్వం. కానీ విశ్వం పరిస్థితి క్షీణిస్తుంది. రూపురేఖలలో చాలా మార్పు వచ్చేస్తుంది.  – ఇక చదవండి.]

రెండు నెలల క్రితం, సమన్విత జీవితంలో అనుకోని సంక్షోభం వచ్చి, ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసేసింది. ఆమె భర్త చక్రవర్తి, కశింకోట ఒక గ్రామీణ విద్యుత్ శాఖలో మంచి స్థాయి ఉద్యోగం చేసేవాడు. ఒక్కగానొక్క కూతురు, ‘తన్మయ’తో ఆనందంగా గడుపుతూ ఉన్న రోజుల్లో జరిగిన సంఘటన వాళ్ళ జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసింది.

ఒక రోజు..

ప్రశాంతంగా ఉండే వీధిలో సడన్‌గా కోలాహలం వినిపించేసరికి వంటగదిలో౦చి కేకవేసింది సమన్విత

“తనూ.. వీధిలో ఆ హడావిడి ఏమిటో చూడు” అంటూ. ‘అలాగేనమ్మా’ అంటూ తలుపులు తీసి, అక్కడి దృశ్యాన్ని చూసిన తన్మయ నిలువెల్లా వణికిపోయింది. ఆమె నోట మాట రాలేదు.

“తలుపు తీసావా? ఏమయిందో చెప్పవే?” అంటూ వంటగదిలోంచి బయటకు వచ్చిన సమన్విత, కళ్ళు తిరిగి పడిపోతున్న తన్మయ పొదివి పట్టుకొని, ఎదురుగా కనిపిస్తున్న భర్త శవాన్ని చూసి గావుకేక పెట్టి, తను కూడా నేల కూలబోతుండగా, అది ముందే గ్రహించిన చక్రవర్తి సహ ఉద్యోగి ‘సాయిబాబా’ వెంటనే, ఒక్క అంగలో అక్కడికి ఉరికి, తల్లీకూతుళ్ళు పడిపోకుండా కాపాడగలిగాడు. మనోధైర్యం ఎక్కువున్న సమన్విత, షాక్ నుంచి తన్మయకన్నా ముందుగా తేరుకుంది.

తన్మయకు తండ్రి దగ్గర చేరిక, చాలా ఎక్కువ. అతను ఇంట్లో ఉంటే, ఆమె అతన్ని ఒక్క క్షణం కూడా వదిలేదు కాదు. అతను ఆఫీసు పని చేసుకుంటున్నా, అతని పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుని, చదువుకుంటూ ఉండేది. చిన్నప్పుడు అలాంటివి సమన్వితకు ముచ్చటగానే అనిపించినా, తన్మయ పెద్దవుతున్నప్పుడు, ఆమెలో బెంగ పెరగసాగింది. అప్పటినుంచీ తన్మయ లేనపుడు, భర్తతో పోరడం మొదలుపెట్టింది,

“అదిప్పుడు చిన్నపిల్ల కాదు. టెన్త్ చదువుతుంది. ఇంకా మిమ్మల్ని కావలించుకొని పడుకోవడమేమిటి? కాస్త దూరం పెట్టండి. రేపోమాపో పెళ్లి చేస్తాం. ఇదే ఇలా కొనసాగితే, చాలా ఇబ్బందులు వస్తాయి” అంటూ.

“ఆ మాట నిజమేనోయ్. కానీ నా చిట్టితల్లిని ఎలా దూరంగా నెట్టేయను? అప్పటికీ నయానా భయానా చెప్తానే ఉన్నాను. వయసు పెరిగింది గానీ, పసితనం వదలలేదు. చెప్పిన మాట వినకుండా మొండికేస్తుంది. గట్టిగా మందలిస్తే ఏడుస్తూ కూర్చు౦టుంది. అయినా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను” అన్నాడు బాధగా.

అలా తండ్రితో ముడిపడ్డ బంధమే కొంపము౦చింది. తండ్రి మరణాన్ని ఆ పిల్ల తట్టుకోలేకపోయింది. చాలాసేపటివరకూ తను ఆ షాక్ నుంచి కోలుకోలేదు. సమన్విత పరిస్థితి అధ్వాన్నంగా తయారయింది. ఒకపక్క భర్త ఆకస్మిక మరణం. మరోపక్క కూతురు ఏమయిపోతుందోనన్న బెంగ. చివరకు ఎలాగయితేనేం.. కాస్త తేరుకుని ప్రశ్నించింది,

“ఎలా జరిగింది? ఏక్సిడెంటేనా?” అని.

“హైవే మీద నుంచి వెళ్తుంటే, చక్రి స్కూటర్‌ని లారీ గుద్దేసి౦ది. లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్ళిపోయాడు. ఎవరో లారీ నంబర్ నోట్ చేసారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అది ఏక్సిడెంట్ కాకపోవచ్చని, కావాలనే గుద్దినట్లున్నదని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. మాకు ఏమీ అర్ధం కావడం లేదు. లారీ డ్రైవర్ దొరికితే, కొంత స్పష్టత రావచ్చు” అని చెప్పాడు సాయిబాబా.

“ఎందుకలా జరిగి ఉంటుంది? ఆయన్ని అంతం చేయడానికి పూనుకున్న శత్రువులు ఎవరుంటారు? ఆయన ఎవరితోనూ గొడవపడే మనిషి కాదు కదా?” ఆశ్చర్యంగా అడిగింది.

“మీకూ తెలుసుగా? ఆయన విధి నిర్వహణలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఆ కారణం వల్ల శత్రువులు ఉండే అవకాశం ఉంది. తరచూ కాంట్రాక్టర్లు ఆయనతో గొడవ పడడం, వాళ్ళు ఆయన్ని బెదిరించడం జరుగుతూ ఉండేది. కానీ పరిస్థితి ఇంతవరకూ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకవేళ ఇది హత్య కాకుండా, ఏక్సిడెంటే అయినా అవ్వొచ్చు. ఇప్పుడప్పుడే ఏదీ నిర్ణయించలేము” అని మరో ఉద్యోగి యేసుదాసు అన్నాడు.

వాళ్ళలా మాట్లాడుతుండగా డాక్టర్ వచ్చాడు. తన్మయను పరీక్షించి, ఇంజక్షన్ చేసిన కాస్సేపటికి, ఆమెకు తెలివి వచ్చింది. మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు ఎంత హృదయవిదారకంగా ఉందంటే, అక్కడున్న ప్రతి వ్యక్తి గుండె చెరువయిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.

దగ్గర బంధువులు అందరూ వచ్చాక దహన సంస్కారం ముగిసింది. అమ్మమ్మ తాతయ్య, నానమ్మ ఎంత బతిమాలినా తన్మయ ఒక ముద్ద ముట్టలేదు. ఒక చుక్క నీరయినా తాగలేదు. హాస్పటల్లో చేర్చి, నిరంతరం వైద్య సదుపాయం అందించి ఆమె ప్రాణాలను నిలబెట్టగలిగారు. ‘కానీ మనసుకు మందులు లేవు కదా?’ ఆ విషయంలో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా తన్మయలో మార్పు తేలేకపోయారు. సమన్విత తమ్ముడు తన్మయను వైజాగ్ తీసుకెళ్ళి, ఎవరయినా మంచి మానసిక వైద్యుడికి చూపించాలని అనుకుంటుండగా, తన్మయ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. సమన్విత దుఃఖానికి అంతులేకుండా పోయింది.

***

నాలుగు రోజుల తర్వాత, పోలీసు స్టేషన్ నుంచి కబురొచ్చింది. తమ్ముడు సుధీర్‌ని తోడుతీసుకొని స్టేషన్‌కి వెళ్ళింది సమన్విత. “రండమ్మా. ఏక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ని పట్టుకున్నాం. వాడీ నేరం చేసానని ఒప్పుకున్నాడు. మీతో మాట్లాడి క్షమాపణ కోరతానంటే మీకు కబురుపెట్టాం” అని లారీ డ్రైవర్ వైపు తిరిగి, “అమ్మగారు వచ్చారు. ఏమయినా చెప్పుకోవాలంటే చెప్పుకో” అన్నాడు. లారీ డ్రైవర్ ముందుకొచ్చి ఒక్కసారిగా సమన్విత కాళ్ళమీద పడ్డాడు.

“కావాలని చేయలేదమ్మగారూ.. అలా జరిగిపోయింది. నన్ను క్షమించమ్మా. ఏక్సిడెంట్‌కి ముందురోజే నాకు ‘గొంతు కేన్సర్’ అని తెలిసింది. ఆ వార్త తెలియగానే కుప్పకూలిపోయాను. ఆ రోజంతా ఏడుస్తూ కూర్చున్నాను. తప్పంతా నాదేనమ్మా. మా ఆవిడ ఎంత చెప్పినా వినకుండా గుట్కా, ఖైనీ, జర్దా విపరీతంగా నమిలేవాడిని. కాస్తో కూస్తో చదువుకున్నాను. కాస్తంత ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరిమాటా లెక్కపెట్టేవాడిని కాదు. ఆ మాయదారి జబ్బు నా ప్రాణం తీసుకుంటుందని తెలుసుగానీ, దాని కారణంగా మరొకరు ప్రాణాలు పోతాయని ఊహించలేకపోయాను.

నాకు కేన్సర్ ఉందని తెలిసిన మర్నాడే, నాకు డ్యూటీ పడిందని మా యజమాని కబురుపెట్టాడు. ఒంట్లో బాగాలేదని, డ్యూటికి రాలేనని చెప్పినా, ఆయన ఒప్పుకోలేదు. ఆ రూటు, ఆ కష్టమర్లు తెలిసినవాడిని నేనొక్కడినే కాబట్టి, వెళ్ళక తప్పదని మొండికేసాడు. కేన్సర్ వచ్చిందని చెపితే, ‘కేన్సర్ వస్తే, ఇప్పటికి ఇప్పుడే చచ్చిపోతావేమిటి? ముందు వెళ్లిరా. మంచి డాక్టర్‌కి చూపిస్తాను’ అంటూ బలవంత పెట్టేసరికి, కాదనలేకపోయాను. కశింకోట వచ్చేవరకూ మనసు అదుపులో పెట్టుకునే బండి తోలాను. ఆ తర్వాత నా పరిస్థితి తలుచుకొని ఏడవడం మొదలుపెట్టాను. ఇలా తోలితే ప్రమాదం జరుగుతుందని, ఎక్కడయినా బండి ఆపుదామని అనుకుంటూ, నిర్లక్ష్యం చేసాను. దాంతో ఘోరం జరిగిపోయింది. బండి ఆపితే, జనం అక్కడే చంపేస్తారని భయపడి, ఆపకుండా ముందుకు పోయాను” అంటూ హృదయవిదారకంగా ఏడుస్తున్నతన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయింది.

ఒకవైపు భర్త మరణం, మరొక వైపు కూతురి మరణం ఆమెను బాగా కు౦గదీసాయి. దెబ్బ మీద దెబ్బ తట్టుకోలేని సమన్విత విరాగిలా మారిపోయింది. ఆమె కూడా ఏదయినా అఘాయిత్యం చేసుకుంటుందేమోనన్న భయంతో ఆమె తమ్ముడు సుధీర్ తనతో పాటూ వైజాగ్ తీసుకుపోయి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. అతను ఆశించినట్లు అక్కలో మార్పు వచ్చింది. ‘ఇక ఫర్వాలేదు’ అనే నమ్మకంతో ఆమె స్వంత ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఆమె కూడా అదే ధీమాతో ఇంటికి వచ్చేసింది గానీ, పరిస్థితి తిరగబెడుతుందని తనూ ఊహించలేదు. రెండ్రోజులు బాగానే ఉంది గానీ, ఆ తర్వాత భర్త జ్ఞాపకాలు, కూతురు జ్ఞాపకాలు ఆమెను తొలిచివేయడం ప్రారంభించాయి. ఒకరకమయిన వైరాగ్యం, నైరాశ్యం ఆమెను ఆవరించాయి. ఆమెలో క్రమ క్రమ౦గా మార్పు రావడం మొదలయింది. చివరకు అది ఆత్మహత్యా ప్రయత్నానికి దారితీసింది. కానీ ప్రతిమ భర్త ఫోన్‌తో ఆమెకు మేలు జరిగింది.

***

“నేను ఇండియా వెళ్దామనుకుంటున్నానురా” అంటూ తను కొత్తగా తీసుకున్న నిర్ణయాన్ని బయటపెడుతూ బాంబ్ పేల్చేసరికి ఆకాష్ అదిరిపడ్డాడు.

“ఏం మాట్లాడుతున్నారు నాన్నా? ఈ పరిస్థితిలో ఇండియా వెళ్ళడమేమిటి? ఎందుకా నిర్ణయం తీసుకున్నారు?” అంటూ ఆదుర్దాగా అడిగాడు.

“డాక్టర్లు చేతులెత్తేశారు. ఈ జబ్బు తగ్గే ఆశ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడున్నా ఒకటే. ఎన్నాళ్ళ నుంచో మనదేశం వెళ్దామని ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ కుదరలేదు. కనీసం ఈ చివరి రోజుల్లోనయినా నేను పుట్టి పెరిగిన ప్రాంతాలన్నీ చూసుకుంటూ ఆ గడ్డమీదే తుది శ్వాస విడుస్తాను” అని వేదాంత ధోరణిలో అంటున్న తండ్రి మాటలకు ఆకాష్ చలించిపోయాడు. చెవులు మూసుకుంటూ,

“ఆపండి నాన్నా.. ఆ మాటలు. నేను వినలేకపోతున్నాను. ఇంకా ట్రీట్మెంట్ జరగుతూనే ఉందిగా? అప్పుడే నిర్ణయం తీసేసుకున్నారా? మిమ్మల్ని కదలనీయం. నందన, పిల్లలు మిమ్మల్ని గడప దాటనిస్తారానుకున్నారా? మీ మానాన మీరు వెళ్ళిపోతే, మా పరిస్థితి ఏమిటి? మేము తట్టుకోగలమనే అనుకుంటున్నారా? వద్దు నాన్నా. ఆ పిచ్చి ఆలోచనలు మానుకోండి” అని ఏడుపు మొదలుపెట్టాడు ఆకాష్. ఆ ఏడుపు విన్న నందన కిచెన్ లోంచి బయటకు వచ్చింది. జరిగిందంతా తెలుసుకొని నిర్ఘాంతపోయింది. కాస్సేపటివరకూ ఆమె నోటంట మాట రాలేదు. ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత,

“అవేం మాటలు మావయ్యగారూ. ఈ పరిస్థితిలో మిమ్మల్ని ఎలా వెళ్ళనిస్తాం? స్థితప్రజ్ఞులయిన మీరే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా?” అని కోడలు అడిగేసరికి

“అవునమ్మా.. స్థితప్రజ్ఞుడిని కాబట్టే, వాస్తవాన్ని గ్రహించాను. మామూలు మనుషుల కన్నా భిన్నంగా ఆలోచించాను. కాదంటావా?” అని అడుగుతున్న మామగారి వైపు చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది, మాటా పలుకూ లేక. ఆ విషయం పిల్లలకూ తెలిసిపోయింది. వాళ్ళిద్దరూ విశ్వం కాళ్ళను చుట్టేసుకుని,

“మీరు వెళ్లొద్దు తాతయ్యా..” అంటూ భోరున ఏడవడం మొదలుపెట్టారు. అయినా విశ్వం నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదు. తాను కళ్ళ ఎదురుగా ఉన్నంత వరకూ ఆ ఇంట్లో విషాదమే రాజ్యమేలుతుందని, తను కనుమరుగు కాగానే, వాళ్ళు దుఃఖసాగరం నుంచి బయటపడతారని, కాస్తయినా తేరుకుంటారని అతని ఆశ. అందుకే అతన౦త మొండిపట్టు పట్టాడు.

వారం రోజులయినా తండ్రి తన పంతాన్ని వీడకపోవడంతో, ఆకాష్ ఒక మెట్టు దిగివచ్చి,

“సరే నాన్నా.. మీ ఇష్టప్రకారమే కానివ్వండి. అయితే ఒక షరతు. మీతో పాటూ నేనూ వస్తాను” అన్నాడు. “నువ్వొస్తావా? అది ఎలాకుదురుతుంది? నీ ఉద్యోగం? నీ సంసారం?” అంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానం కోడలి దగ్గరినుంచి వచ్చింది.

“ఏమీ ఫర్వాలేదు. మేము సర్దుకుంటాము. కొంతకాలం ఉద్యోగానికి సెలవు పెట్టేస్తే, పెద్ద నష్టం ఏమీలేదు. మీ కన్నా మాకు ఏదీ ముఖ్యం కాదు” అంటూ. ‘భగవంతుడా.. ఇంత మంచి మనుషులనుంచి నన్ను దూరం చేస్తున్నావా? ఎన్ని జన్మలెత్తితే, ఇలాంటి బంగారు మనుషులు నాకు మళ్ళీ దొరుకుతారు?’ అనుకుంటూ అతని మనసు బాధతో మూలిగింది.

“అదికాదు.. నేనెంతకాలం ఉండాల్సివస్తుందో..” అంటూ నసుగుతుంటే

“ఎంత కాలమయినా ఫర్వాలేదు. నేనూ మీతోపాటే. ఇంకేమీ అడ్డుచెప్పకండి” అని దృఢస్వరంతో అంటున్న కొడుకుని చూసి ‘మెండితనంలో వీడు నాకు తీసిపోడు’ అనుకుంటూ తలూపాడు.

***

వీడ్కోలు చెప్పడానికి, నందన, పిల్లలతో పాటూ కీర్తన, స్వరూప్‌లు కూడా వచ్చారు.

“అంతా ఇలా తారుమారు అయిపోయిందేమిటి సార్? మేము అక్కడినుంచి ఇక్కడకు వస్తే, మీరు ఇక్కడినుంచి అక్కడికి వెళ్తున్నారు. ఆశ వదిలేసుకున్న కీర్తన పరిస్థితి మెరుగుపడితే, చాలా సులువుగా నయమయిపోతుందని అందరం ఆశ పడిన మీ పరిస్థితి ఇలా అయిపోయింది” అని బాధగా అన్నాడు స్వరూప్. విశ్వం అతని భుజం తడుతూ,

“అదే కదా జీవితం? అన్నీ మనం అనుకున్నట్లే ఎలా అవుతాయి?” అన్నాడు జీవం లేని నవ్వు నవ్వుతూ.

“మాకో మంచి బాబాయి దొరికారు. ఎప్పుడూ ధైర్యం చెప్పడానికి ఆయన మా వెనకాలే ఉంటారు, అనుకుంటూ ఆనందపడ్డాము. ఎందుకిలా మమ్మల్ని అందరినీ వదిలివెళ్ళిపోతున్నారు?” అంటూ కీర్తన రోదిస్తుంటే, ఆమె తల నిమిరి,

“నేనెక్కడున్నా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. మొదటి రోజే చెప్పాను కదా? నీకు నయం అయిపోతుందని. అదే జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు తల్లీ” అంటూ దీవించాడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ వీడ్కోలు చెపుతున్న కోడలిని, పిల్లలని చూస్తూ, ధారాపాతంగా వర్షిస్తున్న కళ్ళతో సెక్యూరిటీ చెక్ లోకి అడుగుబెట్టాడు, కొడుకుతో.

విమానం ఎక్కి కూర్చోగానే, ఇండియాలో తను తిరిగిన ప్రదేశాలూ, స్నేహితులు, బంధువులు అందరూ గుర్తుకు రాసాగారు విశ్వానికి. అందరికన్నా ‘మైథిలి’ అతని మదిలో స్థిరంగా నిలిచిపోయింది. మైథిలి గుర్తుకురాగానే మనసంతా తీయని బాధతో మూలిగింది. ఆమెను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాడు. తను కూడా అంతే. ‘నువ్వు లేకుండా నేను బతకలేను విశ్వం’ అంటుండేది. మైథిలితో అతని పరిచయం విచిత్రంగా జరిగింది.

ఒకరోజతను గ్రంథాలయంలో కూర్చుని మంచి పుస్తకమేదో చదువుతూ, కాకతాళీయంగా కిటికీ వైపు చూసి, చూపు మరల్చుకోలేకపోయాడు. రోడ్డు మీద నిలబడి ఉన్న అమ్మాయి అతన్ని అయస్కాంతంలా ఆకర్షించింది. ‘కేవలం అందం మాత్రమే కాదు. ఆమెలో మరో ప్రత్యేకత ఏదో ఉంది’ అనుకున్నాడు. గతంలో ఎ౦తోమంది అందమయిన అమ్మాయిలను చూసాడు గానీ, ఈ అమ్మాయి ఆకర్షించినంత బలంగా ఏ అమ్మాయి అతన్ని ఆకర్షించలేదు. ‘ఆమెలో ఏదో ఉంది’ అని మరోసారి అనుకుంటూ ఆమెనే తదేకంగా చూడసాగాడు. ఎత్తుగా, తెల్లగా ఉంది అమ్మాయి. విశ్వానికి తారసపడే అమ్మాయిలు అంత పొడవుగా ఉండేవారు కాదు. ఐదు రెండు, ఐదు మూడుకి మించేది కాదు వాళ్ళ ఎత్తు. ఈ అమ్మాయి దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుంది. విజయనగరంలో ఉండే అమ్మాయిలకన్నా భిన్నంగా పంజాబీ డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ ఆ అమ్మాయికెంతో చక్కగా నప్పింది. మొత్తం మీద ఆ అమ్మాయి విలక్షణంగా ఉంది. అందుకే దారినపోయే వాళ్ళ కళ్ళన్నీ ఆమె మీదే ఉన్నాయి. రోడ్డుకు ఒక పక్కగా నిలబడి ఎవరికోసమో ఎదురుచూస్తుందామె. విశ్వం ఆమెను కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. ఉన్నట్టుండి ఆమె కళ్ళు మెరిసాయి. ‘ఎదురుచూస్తున్న వ్యక్తి కనిపించాడు కాబోలు’ అనుకుంటూ ఆసక్తిగా ఆమె చూస్తున్న దిశవైపు చూపు మరల్చాడు. రోడ్డుకు అవతల నిలబడిన ఒక యువకుడు ఆమె వైపే రావడం గమనించిన విశ్వం ‘లక్కీ ఫెలో’ అని కసిగా అనుకున్నాడు. తనకు తెలియకుండానే అసూయతో రగిలిపోతున్నాడు. అతని నడక చూడగానే, అతనెవరో గుర్తుపట్టి, ‘ఓరినీ.. సుధాకర్ గాడు! వీడా.. ఆ లక్కీ ఫెలో?’ అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. ‘ఇంత చక్కని అమ్మాయితో పరిచయం ఉందని ఏనాడూ ఈ వెధవ నాతో చెప్పలేదే? వీడి పని అయిపోయింది’ అనుకున్నాడు కసిగా. సుధాకర్ అతని క్లాస్‌మేటే కాదు, బెస్ట్ ఫ్రెండ్ కూడానూ. వెంటనే వెళ్లి అతన్ని కలవాలని అనుకున్నా, ఇప్పుడు సరైన సమయం కాదు అనుకుంటూ ఆగిపోయాడు. వాళ్ళిద్దరూ రిక్షా ఎక్కి ఎక్కడికో బయల్దేరడంతో, నీరసంగా అక్కడే కూలబడ్డాడు.

రోజూ లాగే సాయంత్రం సుధాకర్ ఇంటికి వెళ్ళాడు, ఆ సంగతేమిటో తేల్చుకుందామని. ‘సుధాకర్ ఇంట్లోలేడని వైజాగ్ వెళ్ళాడని తెలిసేసరికి, కోపంతో కుతకుత లాడిపోయాడు. ‘అంత అందమయిన అమ్మాయి తోడు౦టే వైజాగేమిటి? బొంబాయి అయినా వెళ్తాడు’ అనుకున్నాడు కసిగా. ప్రతి విషయం తనతో చెప్పే సుధాకర్ ఇదెందుకు దాచిపెట్టాడో విశ్వానికి అర్ధం కాలేదు. ఆ రోజు సుధాకర్ ఎలాగూ దొరకడు కనుక, మర్నాటివరకూ వేచిఉండాల్సివచ్చిందతనికి. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. సుధాకర్‌ని కలిసేట౦తవరకూ అశాంతితో కొట్టుకుంటూనే ఉన్నాడు.

చివరికి సుధాకర్‌ని కలిసే సమయం వచ్చింది.

“ఎవర్రా? ఆ అమ్మాయి? ఎంత కాలం నుంచి జరుగుతుంది, ఈ ప్రేమాయణం?” అంటూ సుధాకర్ మెడచుట్టూ తన చేతిని బిగించి గట్టిగా నొక్కాడు. బాధతో గట్టిగా కేకలు పెడుతూ

“వదలరా. చంపేస్తున్నావురా.. బాబూ.. ఏ అమ్మాయి?” అంటూ గింజుకున్నాడు.

“ఎంతమంది అమ్మయిలున్నారేమిటి? నిన్న సాయంత్రం వైజాగ్ తీసుకెళ్ళావు కదా? ఆ అమ్మాయి” అన్నాడు. పూర్తి బలం ఉపయోగించి, అతని పట్టు విడిపించుకొని,

“ఓర్నీ.. ఎన్ని అభాండాలు వేసావురా? ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? మా పిన్ని కూతురు” అంటూ విసుక్కున్నాడు. దాంతో విశ్వం టెన్షన్ అంతా వదిలిపోయింది. ఆనందంతో పెద్దగా నవ్వేసి, సుధాకర్‌ని గట్టిగా కౌగలించుకొని,

“సారీరా బావా?” అని అరిచాడు ఆనందంగా. సుధాకర్ కి ఏదో సినిమా సీన్ చూస్తున్నట్లుంది.

“బావా..? ఏంట్రా ఈ కొత్త పిలుపు? నీకేమయింది ఈ వేళ?” అంటూ అయోమయంగా చూసాడు. అదేమీ పట్టించుకోకుండా

“ఆ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. నీకింత అందమయిన చెల్లెలు ఉందని నాకెప్పుడూ చెప్పలేదు. ఏ ఊరూరా ఆ అమ్మాయిది? ” అని ప్రశ్నలు గుప్పిస్తున్న విశ్వాన్ని విచిత్రంగా చూసాడు. ‘ఏమయింది వీడికి ఈ రోజు? ఎప్పుడూలేనిది ఈ రోజు ఇలా ప్రవర్తిస్తున్నాడేమిటి? అమ్మాయిలు కనబడితే ఆమడదూరంలో ఉండేవాడు. అందరితో చాలా డిగ్నిఫైడ్ గా ప్రవర్తించేవాడు. వీడేనా ఇలా అయిపోయాడు? మా మైథిలి అంత బలంగా ఆకర్షించి౦దా వీడిని? వీడేమిటి.. ఇలా అయిపోయాడు?’ అనుకుంటూ విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు.

“చెప్పరా.. ఆ అమ్మాయి పేరేమిటో” అంటూ భుజాలు పట్టుకొని కుదిపేస్తుంటే, వదిలించుకొని “మైథిలి” అన్నాడు పొడిగా. “వావ్..! మైథిలి! ఆ అమ్మాయి లాగే అందమయిన పేరు” అన్నాడు తన్మయత్వంగా. సుధాకర్ కి ఇదంతా కొత్తగానూ ఇబ్బంది గానూ ఉంది.

“అయితే.. ఏమిట్రా.. మా చెల్లిని ప్రేమించేస్తున్నావా?” అని అడిగాడు చురుగ్గా.

“ఎస్.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్” అన్నాడు తన్మయత్వం చెందుతూ, మనసులో ఆమెను ఊహించుకుంటుంటూ.

“ఈ ప్రేమా.. దోమా.. అన్నీ ట్రాష్. మనం బాగా చదువుకొని, స్థిరపడ్డాకే, ఇలాంటి వాటి గురించి ఆలోచించాలి అంటూ క్లాసులు పీకేవాడివి. ఇప్పుడిలా ప్లేట్ ఫిరాయిస్తున్నావేమిటి?” అంటూ తగులుకున్న సుధాకర్‌ని చూసి

“అలా అన్నానా? అలా అని ఉండనే!” అంటూ నవ్వుతూ బుకాయించాడు. సుధాకర్‌కి విశ్వం మంచి స్నేహితుడే కాదు. ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. అటువంటివాడు తన చెల్లెల్ని ఇష్టపడుతున్నాడంటే, ఆనందంగానే ఉంది గానీ, దానివల్ల ఏమి గొడవలు వస్తాయోనని భయపడుతున్నాడు.

“ఇంతకూ.. ఏ ఊరూరా వాళ్లది? ఇక్కడికి ఎందుకొచ్చింది?” అని అడిగాడు విశ్వం. తను చెప్పబోయేది వింటే వీడి కాళ్ళు భూమి మీద నిలవవు అనుకుంటూ,

“ఒరిస్సా లోని ‘పారాదీప్’. అక్కడే ప్లస్ టూ పూర్తిచేసి, మన కాలేజ్‌లో డిగ్రీలో చేరడానికి వచ్చింది. ఈ మూడేళ్ళూ మా ఇంట్లోనే ఉంటుంది” అని చెప్పగానే, అనుకున్నట్లే విశ్వం ఆనందంతో ఊగిపోయాడు. సుధాకర్ ని గట్టిగా కౌగలించుకుంటూ

“ఎంత మంచి వార్త చెప్పావురా?” అనుకుంటూ ఏదో ఏదో ఊహించుకుంటూ తన్మయత్వంలో మునిగిపోయాడు. సుధాకర్‌కి ఒక పక్క సంతోషంగా ఉన్నా, మరో పక్క బెంగగానే ఉంది.

(ఇంకా ఉంది)

Exit mobile version