Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కర్కాటకం-3

[శ్రీ కె. రామ్ మోహన్ రావు వ్రాసిన ‘కర్కాటకం’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి, ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో ప్రథమ బహుమతి గెల్చుకున్న రచన.]

[అమెరికాలో ఉండే విశ్వానికి కేన్సర్ ముదిరి ఆరోగ్యం పూర్తిగా పాడయిపోతుంది. సమన్విత జీవితం అనుకోని దుర్ఘటన వల్ల సంక్షుభితం అవుతుంది. రోడ్ యాక్సిడెంట్‌లో భర్త చక్రవర్తి మరణిస్తాడు. నాన్నంటే అమితమైన ప్రేమ ఉండే కూతురు తన్మయ కోలుకోలేకపోతుంది. చక్రవర్తిది ప్రమాదం కాదని, హత్య అని కొన్ని అభిప్రాయాలు వినబడతాయి. తండ్రి లేని లోటును తట్టుకోలేని తన్నయ బలవన్మరణానికి పాల్పడుతుంది. సమన్విత దుఃఖానికి అంతులేకుండా పోతుంది. నాలుగు రోజుల తర్వాత, యాక్సిడెంట్ చేసిన డ్రైవర్‌ని పోలీసులు పట్టుకుంటారు. అతను సమన్వితకి క్షమాపణలు చెప్పుకుంటాడు. తనకు ‘గొంతు కేన్సర్’ అని తెలిసిందని, ఆ బాధలో ఉండగా యజమాని బలవంతంగా ట్రిప్‌కి పంపాడని, కశింకోట చేరేసరికి దుఃఖం ఆపుకోలేకపోయేసరికి బండి లారీ అదుపు తప్పిందని చెప్పి తనని క్షమించమంటాడు. సమన్వితని కొన్నాళ్ళ పాటు తన ఇంటికి తీసుకువెళ్తాడు తమ్ముడు సుధీర్. కొన్నాళ్ళ తరువాత, సమన్విత తన ఇంటికి వచ్చేస్తుంది. కానీ ఆమెని మళ్ళీ నైరాశ్యం కమ్మేయగా, చచ్చిపోవాలని అనుకుంటుంది. ఆ సమయంలోనే ప్రతిమ భర్త నుంచి ఆమెకు ఫోన్ వస్తుంది. తనకు రోగం తగ్గదు, ఇక ఇక్కడుంచి చేసేందేం లేదు అని చెప్పి ఇండియా రావడానికి నిశ్చయించుకుంటాడు విశ్వం. తండ్రిని ఒంటరిగా వదలలేక ఆకాష్ కూడా బయల్దేరుతాడు. విమానం ఎక్కి కూర్చోగానే పాత జ్ఞాపకాలు మనసులో మెదిలి, సుధాకర్, మైథిలి గుర్తొస్తారు విశ్వానికి. మైథిలిని మనసారా ప్రేమించిన రోజులు గుర్తొస్తాయి. – ఇక చదవండి.]

సుధాకర్ భయపడినట్లు ఏమీ జరగలేదు. మైథిలిని పరిచయం చేసినపుడు విశ్వం మెలికలు తిరిగిపోలేదు. ఆమె పట్ల ఉన్న ఆరాధనను బయటపెట్టలేదు. ఎంతో హుందాగా వ్యవహరించాడు. అతను వెళ్ళిపోయాక,

“మీ ఫ్రెండ్ చాలా డిగ్నిఫైడ్‌గా ఉన్నాడు. చాలా తెలివయినవాడనుకుంటాను. అబ్బో..! అతనికి చాలా విషయాలు తెలుసు” అంది మైథిలి. తన మీద ఆమె అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలని, విశ్వం తెగ తాపత్రయ పడుతుంటే, నవ్వుకున్నాడు సుధాకర్. ఆమె అభిప్రాయం చెప్పగానే, గాలిలో తేలిపోతున్నట్లుంది విశ్వానికి. అప్పటినుంచి అతని మనసు మనసులో లేదు. ఎప్పుడూ ఆమె గురించే ఆలోచనలు. ‘కనులు మూసినా ఆమే. కనులు తెరచినా ఆమే’. మనసంతా ఆమే.

నిరంతరం చిరునవ్వు నవ్వుతూ, పరధ్యానంగా ఉండడం. పుస్తకం చేత పట్టుకున్నా, అతని దృష్టి మరోచోట ఉండడం తరచూ జరుగుతూ ఉండేది. అతని ప్రవర్తనలో మార్పు తల్లి గమనించింది. ఆ విషయం గ్రహించినప్పటినుంచి, జాగ్రత్త పడ్డాడు. దాంతో ఆమె మనసు కుదుటపడింది.

రోజూ సుధాకర్ ఇంటికి వెళ్ళే అలవాటున్న విశ్వానికి, పెద్ద ఇబ్బంది లేకుండానే, మైథిలిని కలిసే అవకాశం లభిస్తూ వచ్చింది. అయితే రోజూ ఆమెతో మాట్లాడుతుంటే, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం ఒకటి ఉండేది అతనికి. కానీ పరిస్థితులు అనుకోకుండా అనుకూలించాయి.

“తెలుసుగా.. ఇది నా చెల్లి కూతురు. అక్కడ సరైన కాలేజీలు లేవని, ఇక్కడ పెట్టమని నేనే పోరితే, ఇష్టం లేకపోయినా మా మరిది, ఇక్కడ పెట్టాడు. ఇది బాగా చదువుకు౦టేనే, నా మాట నిలబడుతుంది. దీనికి లెక్కలలో సరైన పునాది లేదనుకుంటాను, ఇక్కడ కాలేజీలో చెప్పే పాఠాలు అర్ధం కావడం లేదని గోల పెడుతుంది. నీ చలవ వల్ల, మా సుద్దిగాడు గట్టెక్కుతున్నాడు. కాస్త శ్రమ అనుకోకుండా దీనికి కూడా ట్యూషన్ చెప్పి, కాస్త దారిలో పెట్టావా?” అంటూ బతిమాలుతున్న సుధాకర్ తల్లినే చూస్తూ ‘ఇది కలా? నిజమా?’ అనే సంభ్రమంలో మునిగిపోతూ అనాలోచితంగా తలాడించాడు.

“అమ్మ..! నా చింత దీరిపోయిందే తల్లీ.. నీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే” అంటూ వెళ్ళిపోతున్న పెద్దమ్మను చూస్తూ నవ్వుకుంది మైథిలి. ఈ ఏర్పాటుకు ఆమెకూ ఆనందంగానే ఉంది.

***

“నాన్నా.. అక్కడ బాగానే ఉందా? లేకపోతే ఇటువైపు వస్తారా? కాళ్ళు చాపుకోవడానికి ఈ సీట్ బాగుంటుంది అనుకుంటున్నాను” అని అడుగుతున్న కొడుకు మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు విశ్వం.

“లేదురా.. ఇబ్బంది ఏమీ లేదు. పైగా కిటికీ పక్కన కదా? బాగానే ఉంది” అంటూ సమాధానం ఇస్తూ, బయటకు చూసాడు. మబ్బుల్లోంచి దూసుకుపోతున్న విమానం ఒకటి దూరంగా కనిపించేసరికి, అది మాయమయిపోయేవరకూ చూస్తుండిపోయాడు.

ఇరవై గంటల సుదీర్ఘ ప్రయాణం పూర్తిచేసాక, వైజాగ్ చేరారిద్దరూ. వైజాగ్ విమానాశ్రయం నుంచి హోటల్‌కి వెళ్తున్నప్పుడు, విజయనగరం బస్ కనిపించగానే, విశ్వం పెదాలమీద సన్నటి చిరునవ్వు ఉదయించగానే, నవ్వుతూ అడిగాడు ఆకాష్,

“నాన్నా.. ఏమయినా పాత జ్ఞాపకాలా?” అంటూ. ప్రతిగా తనూ నవ్వాడు విశ్వం.

“నేను, సుధాకర్ విజయనగరం నుంచి వైజాగ్ సైకిళ్ళమీద వచ్చిన రోజులు గుర్తొచ్చాయి” అన్నాడు.

“వావ్.. సైకిళ్ళ మీదా? బాగా దూరం అనుకుంటాను. ఎన్ని మైళ్ళు?” అని అడిగాడు.

“దూరమే. అరవై కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను. ఆ రోజుల్లో, ఇంత ట్రాఫిక్ లేదుగా? అందుకే సైకిళ్ళ మీద వచ్చే సాహసం చేసేవాళ్ళం. అయినా చీటికి మాటికి బస్సులో తిరగడానికి డబ్బులెక్కడివి? అందుకే.. అలా..” అంటూ చిన్నగా నవ్వి, బాగా సలుపుతున్న మోకాలిని పట్టుకున్నాడు. కేన్సర్ ఎముకలకు పాకేక బాధలు ఎక్కువయ్యాయి. తండ్రికి సుఖంగా ఉండడానికి, ఆకాష్ బిజినెస్ క్లాస్ లోనే తీసుకొచ్చాడు. అయినా సుదీర్ఘ ప్రయాణం కదా? ఇబ్బందులు తప్పలేదు.

“నాన్నా.. బాధగా ఉందా?” అంటూ కలవరపడుతూ అడిగాడు ఆకాష్.

“తగ్గిపోతుంది లేరా.. మా సుధాకర్ గుర్తొచ్చాడు కదా? ఆ రోజులన్నీ తలుచుకుంటే, ఈ బాధ మర్చిపోగలనులే..” అంటూ అంత బాధలోనూ చిన్నగా నవ్వాడు.

“సుధాకర్ అంటే.. ఎవరు? బంధువా? స్నేహితుడా?”

“ప్రాణ స్నేహితుడు.. ఒకప్పుడు”

“ఒకప్పుడా? అదేమిటి? ప్రాణ స్నేహితుడు అంటున్నావు? ఆయనిప్పుడు నీతో టచ్ లో లేరా?”

“లేదు. చాలా ఏళ్లక్రితమే మా ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది” అని అంటున్నప్పుడు విశ్వం గొంతులో తీవ్రమయిన బాధ ధ్వనించడంతో, ఆకాష్ మనస్సు చివుక్కుమంది. విశ్వంకి ఎముకల బాధ ఎక్కువయింది. తండ్రి బాధతో మెలికలు తిరిగిపోవడం చూడలేకపోతున్నాడతను. ‘తొందరగా హోటల్‌కి వెళ్ళిపోతే బాగుండును’ అనుకుంటూ డ్రైవర్‌ని తొందర పెట్టాడు. డ్రైవర్ వేగం పెంచాడు. బాధను ఓర్చుకుంటూ, అప్పటికి, ఇప్పటికి బాగా మారిపోయిన వైజాగ్ అందాలను చూస్తూ ఉండిపోయాడు విశ్వం. చివరకు సుందరమయిన బీచ్ ఒడ్డున ఉన్న ‘నోవాటెల్’ హోటల్ ని చేరుకొని, విశ్రమించారిద్దరూ.

***

బస్ ఎక్కిన రెండు గంటలకు భద్ర నుంచి ఫోన్ వచ్చింది, “బయల్దేరారా? ఎక్కడున్నారు?” అంటూ. “బయల్దేరాను. ప్రతిమకి ఫోన్ ఇస్తారా” అంటూ ఆశగా అడిగింది సమన్విత.

“ఇప్పటికీ మాట్లాడే పరిస్థితిలో లేదండి. మందుల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుంది. ఇంకా మెలకువ రాలేదు. రేపు ఉదయానికి తయారుగా ఉంటుంది. మీరు వచ్చిన వెంటనే మాట్లాడవచ్చు. దయచేసి ఓపిక పట్టండి” అన్నాడు. దాంతో చాలా నిరాశ చెందింది.

సంభాషణ పూర్తి అయ్యాక ప్రతిమనే తలుచుకుంటూ చాలాసేపు గడిపేసింది. ఆనాటి జ్ఞాపకాలు ఆమె మదిలో సినిమా రీళ్ల లాగా తిరగసాగాయి.

సమన్విత బాల్యం కాకినాడలో గడిచింది. అక్కడే ప్రతిమ సమన్వితకు పరిచయం అయింది, చాలా చిత్రంగా. తను పదో తరగతి చదివే రోజుల్లో జరిగిన సంఘటన గుర్తు వచ్చింది ఆమెకు.

***

“ఓయ్.. ఆగు, ఒక్క నిమిషం” అంటూ ఎవరో పిలుస్తున్నట్లు అనిపించగానే వెనక్కి తిరిగి చూసింది సమన్విత. ఎవరో కొత్త అమ్మాయి. చాలా అందంగా ఉంది. ఆమెకు ఇంతకు ముందు పరిచయం లేదు. ఆగి ఏమిటన్నట్లు చూసింది. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి,

“నా పేరు ప్రతిమ. నేను కూడా పదో తరగతే చదువుతున్నాను. అయితే నాది వేరే సెక్షన్” అంది, పరిచయం చేసుకుంటూ.

“అయితే ఏమిటి? నన్నెందుకు ఆపావు?” అని అడిగింది, సమన్విత విసుగ్గా.

“ఈ ఉత్తరం ఒకసారి చదువు” అంటూ చేతిలో ఒక కాగితం పెట్టబోయింది ఆ అమ్మాయి. చప్పున వెనక్కి జరిగింది సమన్విత.

“ఏమిటి? లవ్ లెటరా? ఏ పోకిరీ పంపించాడు?” అంటూ కోపంగా అడిగింది. అందుకా అమ్మాయి గట్టిగా నవ్వి,

“కరెక్ట్ గానే ఊహించావు. పోకిరీ రాసిన ప్రేమలేఖే. కానీ నీకు కాదు. నాకు. ఒకసారి చదువు. ఎందుకు చదవమంటున్నానో నీకే అర్థమవుతుంది” అంటూ మళ్ళీ నవ్వేసరికి సమన్వితకు చిర్రెత్తుకొచ్చింది.

“నీకేమయినా మెంటలా? ఎవరి ఉత్తరమో నేనెందుకు చదవాలి?” అంటూ విసుక్కుంటూ ముందుకు వెళ్ళబోతున్న సమన్వితను పట్టి ఆపేసరికి ఆమెకు బాగా కోపం వచ్చింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ,

“నన్ను వదిలేయ్. నాకు కోపం వస్తే, నేనేం చేస్తానో నాకే తెలియదు. నీకు నాకూ, ఈ ఉత్తరానికి ఏ సంబంధమూ లేదు ” అంటూ హెచ్చరించింది.

“సంబంధం ఉంది. ఈ ఉత్తరం, నీ తమ్ముడు సుధీర్ నాకు రాసిన ప్రేమలేఖ” అంది నెమ్మదిగా. ఆ మాట వినగానే షాక్ అయిపోయింది సమన్విత.

“వాడు రాసాడా? ఛ.. నేను నమ్మను. ఎనిమిదో తరగతి చదువుతున్న వాడు, నీకు లవ్ లెటర్ రాయడమేమిటి? ఎక్కడో.. ఏదో పొరపాటు జరిగింది” అంది తల అడ్డంగా ఆడిస్తూ.

“నువ్వు ఇలా అంటావనే, నిన్ను ఈ ఉత్తరం చదవమన్నాను. ఇప్పుడయినా చదువు” అంటూ ఆ ఉత్తరాన్ని సమన్విత చేతిలో పెట్టింది, ప్రతిమ. ఉత్తరం చూస్తూనే, తమ్ముడి దస్తూరి పోల్చుకుంది.

‘వెధవ ఎంత పని చేసాడు?’ అనుకుంటూ ఉత్తరం చదవడం మొదలుపెట్టింది. సగం చదివేసరికే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబారింది. ఇక చదవలేక ఉత్తరం మడిచి పెట్టేసింది.

“అదేమిటి? సగంలోనే ఆపేసావు? పూర్తిగా చదివితేనే కదా? నీ తమ్ముడు ఎంత ఎదిగిపోయాడో అర్థమవుతుంది” అంటున్న ప్రతిమ కంఠంలో వెటకారం లేకపోవడంతో, ఆమె ఎంత సంస్కారవంతురాలో అర్ధమయింది. ప్రతిమే తిరిగి మాట్లాడడం మొదలు పెట్టింది.

“ఈ ఉత్తరం చదివిన వెంటనే చాలా కోపం వచ్చింది. ‘అంత చిన్న కుర్రాడు, ఇంత అసభ్యంగా ఎలా రాయగలిగాడు? అయినా నేనే దొరికానా వాడికి?’ అనుకుంటూ కుతకుతలాడిపోయాను. వెంటనే హెడ్మాస్టర్‌కి రిపోర్ట్ చేసేద్దామనుకున్నాను. కానీ పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ‘వాడి భవిష్యత్తు నాశనం కాకూడదు. మరోసారి ఇలాంటి పనిచేయకూడదు’ అనుకున్నాను. అందుకు ఏం చెయ్యలా? అని తల బద్దలు కొట్టుకుంటుంటే, నీ గురించి ఆలోచన వచ్చింది. ఈ సమస్య నీ దగ్గరకు తెస్తే, తగిన పరిష్కారం దొరకొచ్చు అనిపించింది” అని ముగించిన ప్రతిమ చేతులు పట్టుకొని.

“ఇంతసేపూ నీతో దురుసుగా ప్రవర్తి౦చినందుకు ఏమీ అనుకోకు. ఐ యాం రియల్లీ సారీ. నా తమ్ముడు ఇంత వెధవ పని చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. నువ్వు చాలా మంచిదానివి కాబట్టి, వాడి జీవితం నాశనం కాకుండా ఆపావు. మన హెడ్మాస్టర్ ఎంత చండశాసనుడో నాకు బాగా తెలుసు. ఆ ఉత్తరం ఆయన చేతిలో పడితే ఏమవుతుందో.. తలుచుకుంటేనే, ఎంతో భయం వేస్తుంది. ఈ విషయం నా దృష్టికి తెచ్చినందుకు నీకెలా కృతజ్ఞత చెప్పాలో అర్ధం కావడం లేదు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సమన్వితను దగ్గరకు తీసుకొని ఓదార్చింది ప్రతిమ.

“మీ వాడు అలా తయారవ్వడానికి కారణం చెడు స్నేహాలే. వాడితో తిరిగే సురేంద్ర, వాసు చాలా చెత్త వెధవలు. వాళ్ళ నుంచి దూరం చేస్తేగానీ, సుధీర్ బాగుపడడు. ఈ విషయ౦ మీ అమ్మా నాన్నలకు తెలియనివ్వకు. తెలిస్తే చాలా బాధపడతారు. ఏం చేసి మీ తమ్ముడిని మారుస్తావో బాగా ఆలోచించు” అంది ప్రతిమ.

“అమ్మో.. మా నాన్నకు తెలిస్తే ఇంకా ఏమయినా ఉందా? తోలు తీసేస్తారు. వీడు బాగా చదవడం లేదని, మంచి హాస్టల్లో పెట్టేయాలని ఆలోచనలో ఉన్నారాయన. హాస్టల్లో చేరనని వీడే మొండికేస్తున్నాడు. ఇప్పుడు వాడి పిలక నా చేతికొచ్చింది కదా? బాగా గడ్డి పెట్టి దారిలోకి తెస్తాను. ఈ ప్రేమలేఖ వ్యవహారం నాకు తెలిసిందనగానే వాడు, సిగ్గుతో చస్తాడు. నేను చెప్పినట్లు వినడం తప్ప వాడికి మరో మార్గం లేదు. వాడు చేరబోయే హాస్టల్ వార్డెన్ మాకు దూరపు చుట్టమే. జరిగింది ఆయనకు మాత్రమే చెప్తాను. ఆయనే వాడిని సరయిన దార్లో పెడతాడు” అంటూ ముగించింది. సంతృప్తి చెందినట్లు తల ఊపి “ఆల్ ది బెస్ట్” అని చెప్పి, అక్కడినుంచి వెళ్ళిపోతున్న ప్రతిమనే చూస్తూ ‘ఎంత ప్రమాదం తప్పింది!’ అనుకుంటూ నిట్టూర్చింది.

తర్వాత అంతా సమన్విత అనుకున్నట్లే జరిగింది. సుధీర్ తన తప్పు తెలుసుకొని, మరోసారి అలాంటి తప్పు చేయనని ప్రమాణం చేసాడు. మారుమాట్లాడకుండా హాస్టల్లో చేరిపోయాడు. అప్పటినుంచి సమన్విత, ప్రతిమల మధ్య గాఢ స్నేహం నెలకొంది. అనతికాలంలోనే ప్రాణ స్నేహితురాళ్లు అయ్యారు.

***

రెండ్రోజులు బాగా రెస్ట్ తీసుకొనేసరికి, కాస్త పుంజుకున్నాడు విశ్వం. ఇండియాలో ఉన్నన్నాళ్ళు తిరగడానికి మంచి కారు, మంచి హోటళ్ళు, ముందుగానే బుక్ చేసేసాడు ఆకాష్.

విశ్వం కోరిక ప్రకారం కారు ఆంధ్రాయూనివర్సిటీ వైపు పరుగులు తీసింది. కారు మెల్లగా యూనివర్సిటీ ఆవరణలో తిరుగాడుతుంటే, ఆ పరిసరాలను చూస్తూ మైమరచిపోయాడు విశ్వం.

ఆ ప్రాంగణమంతా చూస్తుంటే, అతనిలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆనాటి యునివర్సిటీ రోజులు గుర్తు చేసుకుంటూ ఉండగా కారు ‘వినయ్ విహార్’ హాస్టల్ ముందునుంచి వెళ్ళడం గమనించి, “ఆపాపు..” అంటూ చిన్నగా అరిచేసరికి, డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు.

“నేను ఈ పార్కులో కొంతసేపు కూర్చు౦టాను. నువ్వలా కేంపస్ చూసిరా” అని కొడుక్కి చెప్పి, కారు దిగాడు. కారు వెళ్ళిపోయాక తల పైకెత్తి, హాస్టల్ భవనాన్ని తృప్తిగా చూసాడు. ఎప్పుడో కట్టిన రాతి భవనమది. సముద్రగాలి వీచే దిశలో కట్టడం వల్ల, రూముల్లోకి నిరంతరం గాలి వీస్తూనే ఉంటుంది. ఫేన్లు అస్సలు అవసరం లేదు. ఎమ్మెస్సీ చదివేటప్పుడు మూడో ఫ్లోర్‌లో ఉండేవాడతను. పైకెక్కి తానున్న రూమ్‌ని చూడాలని మనసు పీకుతున్నా, ఎక్కలేని అశక్తత అతనిది. పెద్దగా నిట్టూర్చి దానికి ఎదురుగా గల పార్క్ వైపు దారి తీసాడు. అప్పట్లో రోజూ సాయంత్రం అక్కడే ఎక్కువకాలం గడిపిన రోజులు గుర్తు తెచ్చుకుంటూ, తానెప్పుడూ కూర్చొనే సిమెంట్ బెంచ్ వైపు చూసాడు. ఆ బెంచ్ మీద ఎవరో కుర్రాడు కూర్చొని, సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతని వాలకం చూస్తుంటే, గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్లు అనిపించింది. ‘హు.. వీడప్పుడే లేవడు..’ అంటూ నిరాశ పడుతుండగా, ఆ కుర్రాడు పైకి లేచి, బయల్దేరడానికి సిద్ధమవుతున్నపుడు విశ్వం ముఖం వికసించింది. హుషారుగా అడుగులు వేసి, ఆ బెంచి మీద కూర్చొని, దానిని ఆప్యాయంగా తడిమాడు. ‘దీనికే ప్రాణం ఉండి ఉంటే, నన్ను గుర్తుపట్టి, స్పందించేది’ అనుకున్నాడు. ఇంచుమించు నలభై ఏళ్ల తర్వాత ఆ పార్కులోకి అడుగు పెట్టాడు. పార్కు స్వరూపం దాదాపు అలాగే ఉంది. పాత సిమెంట్ బెంచీలు అలాగే ఉన్నాయి. కొన్ని కొత్తగా వెలిసాయి. ఆనాటి రీడింగ్ రూమ్ అలాగే ఉంది. అక్కడే చాలాసేపు కూర్చున్న విశ్వం ఎవరో మంత్రించినట్లు, గతంలోకి వెళ్ళిపోయాడు. అప్పటి జ్ఞాపకాలు అతని మదిలోoచి నిద్రలేచి, పైకి ఎగసాయి. ఒక్కసారిగా అతని మనసు, ఆలోచనలు నలభై ఏళ్ల వెనక్కి వెళ్ళాయి.

ఇప్పుడతని పక్కన సుధాకర్ కూర్చుని ఉన్నాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే సుధాకర్ ముఖం కోపంతో మండిపోతూ ఉంది.

“మైథిలి విషయం ఏం చేసావు? ఎన్నిసార్లు అడగాలి నిన్ను” అంటూ గద్దించి అడుగుతున్నాడు. విశ్వానికి కూడా కోపం తన్నుకొస్తుంది. బలవంతాన దాన్ని అణుచుకుంటూ, శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ,

“ఈ ప్రశ్న ఎన్ని సార్లు అడుగుతావు? నువ్వెన్ని సార్లు అడిగినా నా సమాధానo ఒక్కటే. ఇప్పట్లో తనని పెళ్లి చేసుకోలేను. నాక్కొంచెం టైం కావాలి. ఏం చూసుకొని పెళ్లి చేసుకోవాలి? నా చదువింకా పూర్తి కాలేదు. ఉద్యోగం లేకుండా, పైసా సంపాదన లేకుండా ఎలా చేసుకోమంటావు? ఆమెనెలా పోషించమంటావు? అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు?” అంటూ విసుగ్గా సమాధానం ఇచ్చాడు.

“నేనలా మాట్లాడడానికి కారణం నీకూ తెలుసు. మీ ప్రేమ వ్యవహారం వాళ్లింట్లో తెలిసిపోయింది. తనకిప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ‘చావనయినా చస్తాను గాని, విశ్వం లేకపోతే నేను బతకను’ అని అది కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అది ఎప్పుడు ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయపడి చస్తున్నాను. నువ్వేమో రాయిలా బిగుసుకు కూర్చున్నావు” అంటూ నిష్ఠూరమాడాడు సుధాకర్. మౌనంగా ఉండిపోవడం తప్ప, ఏమీ చెయ్యలేని పరిస్థితి విశ్వానిది.

“నీతో చర్చించి లాభం లేదు. నేను చెప్పినట్లు చెయ్యి” అని అనగానే అనుమానంగా చూసాడు విశ్వం.

“ఏదోలా తంటాలు పడి దాన్ని వైజాగ్ తీసుకొచ్చేస్తాను. ఇక్కడే ఏదో గుళ్ళో మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తాను. మరో దారి లేదు” అన్నాడు అదే ఫైనల్ అన్నట్లు.

“వెధవ సలహాలు ఇవ్వడం మానేసి, ప్రాక్టికల్‌గా ఆలోచించు. మీ చిన్నాన్నను జస్ట్ ఆరు నెలలు ఆగమను చాలు. మంచి ఉద్యోగం సంపాదించి, పద్ధతిగా పెళ్లి చేసుకుంటాను. ఇలా చాటుగా పెళ్లి చేసుకుంటే ఎవరు హర్షిస్తారు? తనని ఎలా పోషిస్తాను? ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోవడానికి మా అమ్మా,నాన్న కూడా ఒప్పుకోరు” అంటూ చిరాకుపడుతూ సమాధానమిచ్చాడు విశ్వం.

“పెళ్లి చేసుకుంటే అందరూ చచ్చినట్లు దారికొస్తారు. లేకపోతే మేమంతా లేమా? ఆర్నెల్లు మిమ్మల్ని పోషించలేమా?” అంటూ అర్థరహితంగా మాట్లాడుతున్న సుధాకర్‌ని చితకబాదేయాలన్నoత కోపం వచ్చిoది.

“ఏముందిరా నీకు? మమ్మల్ని పోషించడానికి? పైగా మేమంతా అట? ఎవర్రా? నీ వెనక వచ్చేది?” అని విశ్వం వెనకా ముందు చూడకుండా అనేసరికి, సుధాకర్ కి విపరీతంగా కోపం ముంచుకొచ్చింది. ఆవేశంతో ఊగిపోతూ అనరాని మాటలు అనడం మొదలు పెట్టాడు. విశ్వానికి సహనం చచ్చిపోయింది. అతను కూడా రెచ్చిపోయాడు. అయితే సుధాకర్ తొందరపడి విశ్వం చెంప పగలగొట్టాడు. ఈ గొడవంతా హాస్టల్ నుంచి చూస్తున్న విశ్వం స్నేహితులు కిందకు వచ్చేలోపులో సుధాకర్, విశ్వాన్ని డొక్కలో తన్ని, అతను కింద పడిపోయినా వదలకుండా కాలితో తన్నుతూ రెచ్చిపోతుంటే, విశ్వం స్నేహితులు అతన్ని పక్కకు లాగి, దేహశుద్ధి చేసి తరిమేశారు. అప్పటినుంచి విశ్వం సుధాకర్‌ని ఎప్పుడూ కలవలేదు.

సుధాకర్‌కి చదువు అబ్బలేదు. అతనింకా డిగ్రీలోనే డింకీలు కొడుతుంటే, విశ్వం పిజిలో చేరాడు. చదువయిపోయాక మంచి ఉద్యోగం సంపాదించి, మైథిలిని పెళ్ళి చేసుకొందామని ఆ రోజుకోసం ఎదుచూస్తుండగానే ఇలా జరిగింది. మైథిలి పెళ్ళి నిశ్చయమయిందని తెలిసినా అతనేమీ చేయలేకపోయాడు. మైథిలి పెళ్లి చేసుకుని బొంబాయి వెళ్ళిపోయింది. విశ్వం, ఎమ్మెస్సీ పూర్తిచేసి, రీసెర్చ్ చేయడానికి అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడిపోయాడు. ఐదారేళ్ళ తర్వాత ఇండియా వచ్చినపుడు, సుధాకర్‌ని కలవాలని ప్రయత్నిస్తే, రెండేళ్ల క్రితమే వాళ్ళ కుటుంబం మరో ఊరికి మారిపోయిందని తెలియడంతో విశ్వం నిరాశగా తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ అతని జ్ఞాపకాల్లో మైథిలి, సుధాకర్ మెదులుతూనే ఉంటారు. ‘ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు తనకి తటస్థపడతారు’ అనే ఆశ మాత్రం చావలేదతనికి. ‘చావుకు దగ్గర పడ్డాను. నాకిదే ఆఖరి ట్రిప్. ఇప్పుడయినా వాళ్ళు కనబడితే బాగుణ్ణు’ ఎన్ని సార్లు అనుకున్నాడో అతనికే తెలియదు.

కార్ హార్న్ వినబడేసరికి, జ్ఞాపకాల్లోంచి బయటపడ్డాడు విశ్వం. ఆకాష్ కారు దిగి అతని వైపు నడుచుకుంటూ రావడం కనిపించింది. నీరసంగా పైకి లేచి కొడుకు చేయి అందుకున్నాడు. జ్ఞాపకాలు అతన్ని బాగా కుంగదీసాయి. వాటి ప్రభావం కాబోలు అతనికి విజయనగరo వెళ్ళాలనిపించలేదు. సుధాకర్, మైథిలిల జ్ఞాపకాలు తట్టుకునే స్థితిలో లేడతను. విజయనగరం వెళ్ళటంలేదని తెలిసాక, ఆకాష్ ఆశ్చర్యపోయాడు.

“అదేమిటి నాన్నా? నీ హైస్కూల్ చదువు, కాలేజ్ చదువు అక్కడే కదా? అక్కడికి వెళ్ళాలనిపించటం లేదా?” అన్నాడు, తండ్రి ఎందుకు విముఖంగా ఉన్నాడో ఊహించలేక.

“లేదురా.. హైస్కూల్లో చదివినప్పుడుకన్నా ప్రైమరీ స్కూల్లో చదివినప్పుడే బాగా ఎంజాయ్ చేసిన రోజులున్నాయి. ముందు సామర్లకోట, కాకినాడ, అడ్డతీగెల, రాజమండ్రి వెళ్ళొచ్చి, అప్పుడు టైం ఉంటే విజయనగరం వెళ్దాం. ఎటూ తిరిగి ఫ్లైట్ ఎక్కడానికి వైజాగే రావాలికదా? అపుడు చూద్దాం” అనేసరికి ఆకాష్‌కి ఉత్సాహం వచ్చింది.

“ఏమిటో.. అప్పటి ఎంజాయ్‌మెంట్? నాక్కూడా తెలుసుకోవాలని ఉంది” అన్నాడు ఉత్సాహంగా.

“సరే.. రెడీగా ఉండు. కనీ వినీ ఎరుగని విషయాలు చెపుతాను” అంటూ ఊరించాడు.

“చెప్పు మరి” అంటూ ఆసక్తిని ప్రదర్శిస్తే, “ఎక్కడి విషయాలు అక్కడే. అంటే ఆ ప్లేస్ తీసుకెళ్ళాక, అక్కడే చెపుతాను. ముందు సామర్లకోట వెళ్ళనీ” అంటూ నవ్వాడు.

కారు వైజాగ్ నుంచి సామర్లకోట చేరేసరికి మూడు గంటలు పైనే పట్టింది..

(ఇంకా ఉంది)

Exit mobile version