Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కర్కాటకం-4

[శ్రీ కె. రామ్ మోహన్ రావు వ్రాసిన ‘కర్కాటకం’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి, ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో ప్రథమ బహుమతి గెల్చుకున్న రచన.]

[విమానంలో ఇండియాకొస్తున్న విశ్వం తన తొలి ప్రేమని, ప్రేయసి మైథిలిని, మిత్రుడు సుధాకర్‌ని గుర్తు చేసుకుంటాడు. సుధాకర్ మైథిలిని పరిచయం చేశాకా, అది ప్రేమగా మారడానికి ఎక్కువసేపు పట్టదు విశ్వానికి. మైథిలి కూడా విశ్వాన్నిష్టపడుతుంది. సుధాకర్ తల్లి, మైథిలికి లెక్కలు చెప్పమని విశ్వాన్ని కోరడంతో, ఆమెతో ఎక్కువసేపు గడిపే అవకాశం దక్కుతుంది. ఇంతలో ఫ్లయిట్ లాండ్ అవుతుంది. వైజాగ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకి హోటల్‌కి వెళ్తున్నప్పుడు విజయనగరం వెళ్ళే బస్‌ని చూడగానే మరికొన్ని సుధాకర్‍కి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. కొడుకు ఆకాష్‌కి అవన్నీ చెప్తాడు. ప్రతిమని కలవడానికి హైదరాబాద్ బయల్దేరిన సమన్విత – బస్సులో తమ స్నేహం గురించి జ్ఞాపకం చేసుకుంటుంది. రెండు రోజులు రెస్ట్ తీసుకున్న విశ్వం కాస్త తేరుకుంటాడు. విశాఖపట్టణంలో, యూనివర్శిటీ క్యాంపస్‌లో తన తరగతి గదులు, హాస్టల్‌లో తన రూమ్ అన్నీ చూస్తాడు విశ్వం. ఎమ్మెస్సీ చదివేటప్పుడు సముద్రానికి ఎదురుగా పార్కులో తాను ఒక బెంచీ మీద కూర్చునేవాడు. అప్పటిదాక అక్కడ కూర్చున్న కుర్రాడు లేచి వెళ్ళిపొవడంతో, దాని మీద కూర్చుంటాడు విశ్వం. అతని మళ్ళీ జ్ఞాపకాలు మేల్కొంటాయి. మైథిలి తండ్రి ఆమెకు సంబంధాలు చూస్తున్నాడని, పెళ్ళి చేసేసుకోమని సుధాకర్ విశ్వాన్ని బలవంతం చేస్తాడు. సంపాదన లేకుండా పెళ్ళి ఎలా చేసుకోనని మిత్రుడితో వాదిస్తాడు విశ్వం. మాటామాటా పెరిగి సుధాకర్ విశ్వాన్ని కొడతాడు. హాస్టల్ నుండి అది చూసిన విశ్వం ఫ్రెండ్స్ వచ్చి సుధాకర్‍ని కొడతారు. అప్పుడు విడిపోయిన సుధాకర్ మళ్ళీ ఎన్నడూ కనబడడు. మైథిలికి వేరే పెళ్ళయిపోతుంది. కొడుకు క్యాంపస్ చూసి వచ్చాకా, ముందు అనుకున్నట్టుగా విజయనగరం వెళ్ళకుండా, సామర్లకోటకి బయల్దేరదీస్తాడు విశ్వం. – ఇక చదవండి.]

“మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ కావడం వల్ల కాకినాడ నుంచి ఇక్కడికి మారాం. వచ్చిన రోజునే ప్రతి ఇంటి తలుపు మీద, ‘ఓ స్త్రీ రేపురా’ అని రాసి ఉండడం గమనించి, మేమంతా ఆశ్చర్యపోయాం. దాని గురించి పక్కింటి వాళ్ళను అడిగితే, రోజూ రాత్రివేళల్లో ఒక ఆడదెయ్యం తిరుగుతుందని, అది ఇంట్లోకి రాకుండా ఉండాలంటే అలా రాయాలని, లేని పక్షంలో ఆ దెయ్యం ఇంట్లోకి చొరబడి కీడు చేస్తుందని పక్కింటి ఆవిడ చెప్పింది..”. ఆ వాక్యం పూర్తిచేయకుండానే అడ్డుతగుల్తూ గట్టిగా నవ్వాడు ఆకాష్ “అయితే మీ ఇంటి తలుపుల మీద కూడా రాయించారా?” అంటూ. “మేం దిగిన అద్దె ఇoటి తలుపుల మీద అప్పటికే రాసి ఉంది” అంటూ నవ్వాడు విశ్వం. “ఇంతకూ అలా రాయని ఇళ్ళు ఏమైనా ఉన్నాయా? ఎవరికయినా హాని జరిగిందా?” అంటూ మళ్ళీ నవ్వాడు ఆకాష్. “లేదు లేదు.. పాపం దెయ్యం చొరబడడానికి ఏ ఇల్లూ ఛాన్స్ ఇవ్వలేదు. ఆ దెయ్యం మరో ఊరు వెళ్ళిపోయిఉంటుంది” అంటూ బిగ్గరగా నవ్వాడు విశ్వం. “అయి ఉంటుంది” అంటూ జత కలిపాడు ఆకాష్. నవ్వడం ఆపి,

“మఠం జంక్షన్ ఎక్కడుందో కనుక్కొని, అక్కడికి తీసుకెళ్ళు” అని డ్రైవర్‌తో చెప్పాడు విశ్వం. డ్రైవర్ అలాగే చేసాడు. విశ్వం కారు దిగి, చుట్టుపక్కల పరిశీలనగా చూసి, పెదవి విరిచి ‘అప్పటికే ఇప్పటికీ ఈ జంక్షన్ చాలా మారిపోయింది. అస్సలు గుర్తు పట్టేలా లేదు’ అని తనలో తాను గొణుక్కున్నాడు.

“ఈ చుట్టూ పక్కలే మేము అద్దెకు ఉండేవాళ్లం. అంతా మారిపోయింది. మేమున్న ఇల్లిప్పుడు గుర్తుపట్టలేము” అన్నాడు కొడుకుతో. కావచ్చు అన్నట్టు తల ఊపాడు ఆకాష్. విశ్వం కొంచెం ముందుకు నడిచి, తాను చదివిన గవర్నమెంట్ స్కూల్ గురించి వాకబు చేసి, ఆకాష్ వైపు చూసి, రమ్మన్నట్లు సైగ చేసాడు. ఇద్దరూ కొంత దూరం నడిచి, దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌కి చేరుకున్నారు. ఆ స్కూల్ వైపు ఆశ్చర్యంగా చూసాడు విశ్వం. అతనికి తెలిసిన ఆనవాళ్ళు ఏవీలేవు. వెనుక విశాలమయిన స్థలంతో ముందు భాగాన ఉండే పెద్ద పెంకుటిల్లు, ముఖ ద్వారానికి అటూ, ఇటూ పెద్ద అరుగులు, మధ్యలో మెట్లు, లోపల తరగతి గదులు.. ఇవన్నీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు అవేమీ లేవు. స్లాబ్ వేసిన, పెద్ద పక్కా బిల్డింగ్ దాని స్థానంలో కనిపించింది. స్కూల్‌కి ఎదురుగా ఉన్న రావిచెట్టు మాత్రం అక్కడే ఉంది. ఆ చెట్టు చుట్టూ కొత్తగా కట్టించిన అరుగు మీద కూర్చుని, కొడుకును కూడా పిలిచి స్కూల్ వైపు చూస్తూ గట్టిగా నవ్వాడు. ఆకాష్ తండ్రి పక్కన కూర్చొని, అతనెందుకు నవ్వుతున్నాడో తెలియక ఆశ్చర్యంగా చూసాడు. విశ్వం ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కాని, నవ్వాగక, అతనేమీ చెప్పలేకపోతున్నాడు. అతన్ని చూస్తూ ఆకాష్ మహదానందపడసాగాడు. చాలా రోజుల తర్వాత తండ్రిని ఇంత ఆనందంగా చూడడం అతనికెంతో సంతోషాన్ని ఇచ్చింది. తండ్రి చెప్పేది వినడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. నవ్వాపి చెప్పడం మొదలు పెట్టాడు విశ్వం.

“కనీ వినీ ఎరుగని విషయాలు చెప్తానన్నాను కదా? విను. నేను, మీ చిన్నాన్న గిరి ఇదే స్కూల్లో చదువుకున్నాము. మేము చేరిన కొత్తలో ఒక శనివారం మధ్యాహ్నం, మొదటి పీరియడ్ అయిన తర్వాత లాంగ్ బెల్ కొట్టారు. ‘ఓహో.. సెలవిచ్చేసారు’ అని సరదా పడుతూ నేను, గిరి ఇంటికెళ్ళిపోవడానికి సిద్దపడుతుండగా, గిరి స్కూల్ బయటవైపు చేత్తో చూపించాడు, ఆశ్చర్యపోతూ. అది చూసి నేనూ ఆశ్చర్యపోయాను, అటుచూస్తూ. బయటకొచ్చిన పిల్లలు, ఇళ్లకు వెళ్ళిపోకుండా, స్కూల్ బయట నేలమీద కూర్చుoటున్నారు. టీచర్లు వాళ్ళను పద్ధతి ప్రకారం కూర్చోబెడుతున్నారు. కొంతమంది పిల్లలు ముందు కూర్చోవడానికి ఉత్సాహం చూపిస్తుంటే, టీచర్లు వాళ్ళను అదిలిస్తున్నారు. నేను, గిరి అయోమయంగా బయటకు నడిచాం. మా టీచర్ మిమ్మల్నిద్దరినీ ఒకచోట కూర్చోబెట్టింది. ఏం జరగబోతుందో మా ఇద్దరికీ అర్ధం కావడం లేదు. పక్కనున్న కుర్రాడిని అడిగాను.

“మీరు కొత్తగా వచ్చారు కదూ.. సినిమా..” అంటుండగా ‘హెడ్మాస్టారొస్తున్నారు. సైలెన్స్’ అని ఒక మాస్టారు అరిచేసరికి, అందరూ సైలెంట్ అయిపోయారు. ‘సినిమా’ అని వాడెoదుకన్నాడో.. అసలేం జరగబోతుందో తెలియక నేను, మీ చిన్నాన్న అయోమయంగా చూస్తూ ఉండిపోయాం. ఈ లోగా హెడ్ మాస్టారు వచ్చారు. ఆయన గుమ్మo ఎదురుగా మఠం వేసుకొని కూర్చుని నవ్వారు. పిల్లలంతా నవ్వారు. టీచర్లు అటూ ఇటూ ఉన్న అరుగుల మీద పిల్లల పక్కన కూర్చున్నారు. మా సస్పెన్స్ విడిపోయే టైమొచ్చిoదనిపించింది. మాస్టారు గొంతు సవరించుకొని, “ఏమర్రా పిల్లలూ ఈ రోజు ఏ సిన్మా కథ చెబుతానని చూస్తున్నారా? చెప్పుకోండి చూద్దాం” అంటూ కిసుక్కున నవ్వారు. వెంటనే ఒకడు లేచి “గులేబికావళి కథ” అనగానే ఒక్కసారిగా పిల్లలలో కలకలం రేగింది. “అవును.. ఆ సిన్మా కథే చెప్పండి” అంటూ కొందరు ఉత్సాహంగా అరిచారు.

ఆ రోజుల్లో సామర్లకోట లో సిన్మా హాళ్ళు ఉండేవికావు. సిన్మా చూడాలంటే కాకినాడ వెళ్ళాలి. కాకినాడ ఇక్కడికి పెద్ద దూరం కాదు. ఓ.. పద్నాలుగు, పదిహేను కిలోమీటర్లు ఉండొచ్చేమో! అయితే ఆ రోజుల్లో బస్సు సౌకర్యం, రవాణా సదుపాయాలూ చాలా తక్కువ కదా? చాలా దూరమన్నట్లు ఫీలయ్యేవారందరూ. పిల్లలందరితో పాటూ మేము కూడా రోజూ, గోడల మీద గులేబికావళి సినిమా పోస్టర్లు చూసేవాళ్ళం. అక్కడ కనిపించే సీన్లు అన్నీ మిమ్మల్ని ఆకర్షించేవి. ముఖ్యంగా ఎన్.టి.ఆర్, అస్తిపంజరాలతో ఫైట్ చేసే సీన్, మా అందరికీ నచ్చేది. రోజూ నేను, గిరి ఆ సిన్మా చూపించమని మా అమ్మను బతిమాలేవాళ్ళం. నాన్నగారికి ఖాళీ అయితే తీసుకెళ్తారు అని అమ్మ బుజ్జగించేది. మా నాన్న గారికి ఎప్పుడూ తీరికయ్యేది కాదు. ఆదివారం కూడా ఆయన ఆఫీస్ లోనే ఉండేవారు. సిన్మా చూడాలని ఎంత ఆశగా ఉన్నా, గట్టిగా అడగలేక, నోర్మూసుకుని ఉండేవాళ్లం.

అప్పుడా సిన్మా కథ కళ్ళకు కట్టినట్లు మాస్టారు చెపుతారని తెలిసి చాలా ఆత్రంగా ఎదురుచూస్తూ కూర్చున్నాము.

“అబ్బ.. మీది ఏం మెమరీ నాన్నా..? ఏభై ఏళ్లకు పైగా జరిగిన విషయాలన్నీ పొల్లు పోకుండా ఎలా గుర్తు పెట్టుకొని చెప్పగలుగుతున్నారు? ఏదో అమెరికాలో పెరిగామని, ఎన్నో చూసామని, ఎంతో అనుభవించామని ఎప్పుడూ గర్వపడుతుంటాను గానీ, మీ అనుభవాల పోలిస్తే మావి ఏపాటి?” అంటూ తండ్రిని ఆరాధనగా చూస్తున్న ఆకాష్ భుజం తట్టి, చెప్పడం కొనసాగించాడు విశ్వం.

“నిజంగానే మాస్టారు ఆ సిన్మా కథ అంతా కళ్ళకు కట్టినట్లు చెప్పారు, గంట సేపు. ఒక్క పిల్లాడు గానీ, ఒక్క టీచర్ గాని కదల్లేదు, ఆయన కథ చెపుతున్నంత సేపూ. పాటలు, డ్యాన్సులు, ఫైట్లు చేసి చూపించకపోయినా, అవి మేము ఊహించుకునే స్థాయిలో చెప్పాడాయన. చెప్పడం పూర్తి అయిన తర్వాత,

‘ఏమర్రా.. బాగా ఎంజాయ్ చేసారా? కథ నచ్చిందా?’ అని ప్రశ్నించారు. బాగా నచ్చిందంటూ పిల్లలంతా కేకలు పెట్టారు. అందరినీ ఆగమన్నట్లు చేత్తో సైగ చేసి,

‘ఒరేయ్ శ్రీనూ.. ఇక మీ పని కానివ్వండి’ అంటూ లీడర్ లాంటి వాడితో అన్నారు. వెంటనే శ్రీనుతో పాటూ ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు లేచి నిలబడ్డారు. అందరి చేతుల్లోనూ డబ్బాలున్నాయి. పిల్లలతో పాటూ టీచర్లు కూడా అందులో నాణాలు వేస్తున్నారు. మాకేమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంటే, మాస్టారే మావైపు చూస్తూ,

‘మీరు కొత్తగా వచ్చారు కదా? చెప్తా వినండి. రేపు ఆదివారం కాకినాడ వెళ్ళి మరో సినిమా చూడాలి కదరా? బస్సు ఖర్చులు, భోజనం ఖర్చులు, సిన్మా టిక్కెట్ల ఖర్చులు ఉంటాయి కదా? వాటి కోసం అన్న మాట ఇదంతా’ అన్నారు ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఆ రోజుల్లో ఎవరయినా కాకినాడ వెళ్లి సిన్మా చూడాలంటే, మధ్యాహ్నం వేసే మేట్నీకే వెళ్ళేవారు. సాయంత్రం వేసే ఫస్ట్ షోకి అవకాశం ఉండేది కాదు. ఆ రోజుల్లో రాత్రి తొమ్మిది తర్వాత తిరిగి రావడానికి బస్సు సదుపాయం ఉండేది కాదు. పగలు కూడా బస్సులు చాలా తక్కువగా ఉండేవి.

మరి ఇప్పుడంతా మారిపోయింది. మన కార్లో సామర్లకోట నుంచి కాకినాడకు పదిసార్లు వెళ్లి రావచ్చు. ఏమంటావ్?” అంటూ నవ్వాడు విశ్వం.

“గ్రేట్ నాన్నా.. మీ అనుభవాలు ఒక ఎత్తు. అవన్నీ జ్ఞాపకం పెట్టుకొని పూసగుచ్చినట్లు చెప్పడం మరొక ఎత్తు. చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇంకా ఏమయినా విషయాలున్నాయా?” అంటూ ఆసక్తిగా అడిగాడు.

ఓ.. చాలా ఉన్నాయి. కాకినాడ వెళ్తూ మాట్లాడుకుందాం. కారెక్కు” అన్నాడు విశ్వం.

కారెక్కాక చాలా కబుర్లు చెప్పాడు విశ్వం. తండ్రి ఉత్సాహం చూసాక ఇండియా తీసుకొచ్చి మంచి పని చేసానని తృప్తి పడ్డాడు ఆకాష్. “ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల మొబైల్ లోనే సిన్మాలు చూసేసుకుoటున్నాం. అప్పట్లో సినిమా చూడడం ఒక పెద్ద విషయం. ఒక మనిషి సగటున, నెలకు రెండు సినిమాలు చూస్తే గొప్ప. చెపితే నమ్మవు.. ప్రతి ఆదివారం రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం అనే ప్రోగ్రాం వచ్చేది. మూడు గంటల సినిమాని కుదించి, ఒక గంట పాటూ ఆడియో ప్రసారం చేసేవారు. అది వినడానికి అందరూ పనులు మానుకొని ఆ రేడియో దగ్గర కదలకుండా కూర్చొని ఆనందించేవారు.

మరో తమాషా సంగతి చెప్తాను విను. మా నాన్న గారు తూర్పు గోదావరి జిల్లాలో చాలా చోట్ల పనిచేసారు. కాకినాడ, రాజమండ్రి వంటి టౌన్ లలోనూ, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు లాంటి చిన్న ఊర్లలోనూ, అడ్డతీగెల, రంపచోడవరం వంటి కీకారణ్య ప్రాంతాలలోనూ పనిచేసారు. మాకు ఒక్కో ఊర్లో ఒక వింత ఎదురయ్యేది. సామర్లకోటలో సంగతులు విన్నావుగా?

రాజమండ్రి సంగతి చెప్తా విను. ఆ ఊరిలో సినిమా హాళ్ళు ఎక్కువే. అయితే హిందీ సినిమా ఆడే ప్రతి సినిమాహాలు ముందు ‘ఈ హాలులో తెలుగులో కథ చెప్పబడదు’ అనే బోర్డ్ ఉండేది. అది ఎందుకు పెట్టారో నాకు అర్ధమయ్యేది కాదు. ఆ రోజుల్లో సిన్మా హాళ్ళలో స్త్రీలు కూర్చోవడానికి ప్రత్యేక స్థలం ఉండేది. ఆ విషయం తెలియజేస్తూ బోర్డ్‌లు పెట్టడం తెలుసుగాని, ఈ రకపు బోర్డులు నేనెప్పుడూ ఎరుగను. ఆ విషయమే మా అమ్మని అడిగితే, అమ్మ చిన్నగా నవ్వి ‘ఈ రోజు తెలుసుకుంటావులే. మనం ఈ రోజు సాయంత్రం ‘వక్త్’ సినిమా చూడ్డానికి శ్యామలా టాకీస్‌కి వెళ్తున్నాము’ అంది. ‘అది హిందీ సినిమా కదా? నాకు హిందీ రాదు కదా? నాకు అర్థం కాదు’ అన్నాను. అమ్మ నవ్వుతూ ‘నాకూ హిందీ రాదుగా. ఎలా అర్థం అవుతుందో చూద్దుగాని’ అంది. సినిమా ప్రారంభమయ్యేంత వరకూ నా సందేహo నివృత్తి కాలేదు. సినిమా ప్రారంభం అయింది. డైలాగులు మొదలయ్యాయి. హాలంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు ఒక గంభీరమైన గొంతు వినబడింది. బాల్కనీలో ఓ మూల నిల్చున్న ఒక మనిషి, ప్రతి డైలాగూ తెలుగులో తర్జుమా చేసి చెపుతున్నాడు. మైక్ లేకుండా అంతమంది జనంకి స్పష్టంగా వినబడేలా చెపుతున్నాడతను. ఆ రోజుల్లో హిందీ చాలా అర్ధమయ్యేది కాదు. అందుకే ఆ సదుపాయం ఉండేది. క్రికెట్ కామెంట్రీలా డైలాగులు లేని సీన్లు కూడా వర్ణించి చెప్పాడతను.

ఆ తర్వాత అన్ని హాళ్లలోనూ ఆ సదుపాయం నిలిపివేసి, హాళ్ళ ముందు ఆ విషయం తెలియజేసే బోర్డులు పెట్ట్టడం మొదలు పెట్టారని, అమ్మ చెప్పింది. ‘అదేమిటి? అలా చేస్తే అందరికీ సినిమా అర్థమవుతుంది కదా?’ అని నేను వేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘అలా డబ్బింగ్ చెప్పే మనుషులు కరువవడం వల్ల, హిందీ తెలిసిన వారికి అది ఇబ్బంది కావడం వల్ల ఆ సదుపాయం తీసేయవలసి వచ్చింది’ అని అమ్మ చెప్పింది” అంటూ ముగించాడు విశ్వం నవ్వుతూ.

“వామ్మో.. గ్రేట్ హిస్టరీ.. ఈ అనుభవాలన్నీ కలిపి మీరొక నవల రాయొచ్చు నాన్నా” అన్నాడు ఆకాష్ హుషారుగా.

“రాయొచ్చు కానీ, అప్పటిదాకా నేను బతికి ఉండాలిగా?” అని తండ్రి చప్పున సమాధానం ఇచ్చేసరికి, ఆకాష్ మనస్సు చివుక్కుమంది. ఆ ఒక్క డైలాగ్‌తో కారులోని వాతావరణం మారిపోయి, విషాదం అలుముకుంది. ‘అయ్యో పరిస్థితి ఇలా మారిపోయిందేమిటి?’ అనుకుంటూ బాధపడ్డాడు. తండ్రి మూడ్ ఎలా మార్చాలో అర్థం కాలేదతనికి.

***

సాయంత్రానికి కాకినాడ చేరుకొని హోటల్లో దిగారు. రాత్రి భోజనాలు పూర్తిచేసి నిద్రపోయేవరకూ తండ్రి, కొడుకులు పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు. ఆకాష్ కూడా మాటలు పొడిగించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు విశ్వం చాలా ఆలస్యంగా లేచాడు. బాగా విశ్రాంతి తీసుకోవడం వల్ల, అతనికి కొంత అదనపు శక్తి వచ్చినట్లయింది. మూడ్ కూడా మారిపోవడంతో ఆకాష్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.

 “కాకినాడే మన స్వంత ఊరు. కానీ ఎక్కువకాలం ఈ ఊరిలో మేముండే అవకాశం లేకపోయింది. మీ తాతగారు విధి నిర్వహణలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. అందువల్ల, పలుకుబడి ఉన్న పెద్దవాళ్లు, పై అధికారులు కక్షగట్టి, తరచుగా ట్రాన్సఫర్ చేయిస్తూ ఉండేవారు. ఇన్నేళ్ళ తర్వాతే ట్రాన్సఫర్ చెయ్యాలనే నియమం, ఆ రోజుల్లో ఉండేది కాదు. ఒక్కోసారికి ఏడాదికి రెండు సార్లు బదిలీ అయిన సందర్భాలుండేవి. ఆ కక్షల వల్లనే ఆయన మన్యంలో ఎక్కువకాలం పనిచేయాల్సి వచ్చింది. మారు మాట్లాకుండా, ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడికి వెళ్ళిపోవడమే గాని, తన తీరును మార్చుకోని ఆదర్శ జీవితం ఆయనది. ఆయనకు కొడుకుగా పుట్టడం నా అదృష్టం” అనగానే, ఆకాష్ అందుకున్నాడు,

“ఆయనకు మనవడవ్వడం, మీకు కొడుకవ్వడం నాకూ అదృష్టమే నాన్నా” అంటూ. సమాధానంగా చిన్న నవ్వు నవ్వి, కొడుకు చేయి పట్టి ఆప్యాయంగా నొక్కాడు. ఆ ఆత్మీయ స్పర్శ ఆకాష్‌లో అలౌకిక ఆనందాన్ని కలిగించింది. ‘ఏదయినా అద్భుతం జరిగి, నాన్న బతికి బట్టకడితే, ఈ ఆనందం శాశ్వతమయితే ఎంత బాగుణ్ణు!’ అని అనుకోగానే ఆకాష్ కంట్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. అతని మనసు బాధతో మూలిగింది, అసాధ్యమయిన కోరిక కోరుకుoటున్నాడని. తన ఆవేదన తండ్రి గుర్తించకుండా, చప్పున ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు, ఏదో చూస్తున్నట్లు. అదేది గమనించని విశ్వం,

“పద.. అలా కాకినాడలో నేను తిరిగిన ప్రాంతాలన్నీ చూసివద్దాం” అన్నాడు నూతనోత్సాహంతో. తలూపుతూ తండ్రిని అనుసరించాడు ఆకాష్.

విశ్వం చెప్పినట్లు డ్రైవర్ గాంధీనగరంలో, గాంధీ బొమ్మ దగ్గర కారు ఆపాడు. విశ్వం కారు దిగి, చిన్నప్పుడు తాము నివాసం ఉన్న పెంకుటిల్లు కనబడుతుందేమోనన్న ఆశతో కాస్త ముందుకు నడిచాడు. అనుకున్నట్లే ఆ వీధంతా బాగా మారిపోయింది. పెంకుటిళ్ళు ఉండాల్సిన చోట, డాబా ఇల్లు, బహుళ అంతస్తుల ఇళ్ళు, అక్కడక్కడ అపార్ట్మెంట్లు వెలిసాయి. తామున్న ఇల్లు కనుక్కోవడం కష్టమేనని తెలిసి వచ్చింది విశ్వానికి. నిరాశగా వెనుదిరిగితున్న సమయంలో అతని కళ్ళు మెరిసాయి. ఆ ఇంటిని గుర్తు పట్టాడు. ‘అవును అదే ఇల్లు’ అనుకున్నాడు. అతని ముఖంలో కనిపించిన వెలుగును చూడగానే, తండ్రి ప్రయత్నం ఫలించిందని ఆకాష్ పసిగట్టాడు. “నాన్నా.. ఈ ఇల్లేనా?” అని అడిగాడు ఆనందంగా. నవ్వుతూ తలూపి, ఆ ఇంటిని సమీపించాడు. అతని అదృష్టం కొద్దీ, ఆ ఇల్లు ఒక్కటే మారలేదు. అలాగే ఉంది. ఆ ఇంట్లో ఎవరూ ఉండడం లేదు కాబోలు. ఆలనా పాలనా లేక శిధిలమైపోయి ఆదరణ కరువైనట్లుగా ఉంది. ముందంతా విశాలమయిన ఆవరణ, వెనుక భాగంలో రెండు పోర్షన్ల పెద్ద పెంకుటిల్లు, ఇంటి వెనుక, చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అక్కడే నిలబడి, ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నాడు విశ్వం. ఆ తర్వాత తృప్తిగా నిట్టూర్చి, “పద.. పార్క్ లోకి వెళ్దాం. నేను ఎక్కువకాలం గడిపింది అక్కడే” అంటూ ఆకాష్ చేయిపట్టుకొని ముందుకు నడిచాడు. ఆ ఇంటికి ఫర్లాంగ్ దూరంలో ఉంది, పెద్ద మునిసిపల్ పార్క్. పార్కు లోకి అడుగు పెడుతూ “ఈ లేండ్ స్కేపింగ్ కాన్సెప్ట్ లు వచ్చాక పార్కులు చాలా అందంగా తయారవుతున్నాయి. ఆ రోజుల్లో ఇంత ప్లానింగ్ గానీ, ఇలాంటి పేవ్ మెంట్లు గానీ, లాన్స్ గానీ ఉండేవి కాదు. అప్పటికన్నా చాలా బాగుంది” అంటుంటే ఆకాష్ అడిగాడు, “మీరు, చిన్నన్నా ఇక్కడే ఆడుకొనేవారా?” అని. “స్కూల్ నుంచి రాగానే ఇద్దరం ఇదే పార్క్ లోకి వచ్చేసేవాళ్ళం. వాడు ఆడుకొనేవాడు. నేను మాత్రం అదిగో ఆ చివర ఉన్న లైబ్రరీలో చదువుకునే వాణ్ణి. పద అక్కడికి వెళ్దాం” అంటూ హుషారుగా వడి వడిగా నడుస్తున్న తండ్రిని చూస్తే, అతనికా లైబ్రరీ అంటే ఎంత ఇష్టమో ఆకాష్‌కి అర్ధమయింది. ఆ చివర ఒక షెడ్, పెద్ద బిల్డింగ్ ఉన్నాయి. అక్కడ ఆగిపోయి అయోమయంగా చూసాడు విశ్వం. తను చదివిన గ్రంథాలయాన్ని పోల్చుకోలేకపోయాడతను. నేరుగా బిల్డింగ్ లోకి వెళ్లి, లైబ్రేరియన్‌ను కలిసి, అడిగినపుడు తెలిసింది, అక్కడున్న షెడ్ లోనే తను చదువుకున్న విషయం. ఈ బిల్డింగ్ ఇటీవల కట్టినదని చెప్పాడతను. ఏభై ఏళ్ల క్రితం చదువుకున్న గ్రంథాలయాన్ని చూడడానికి అమెరికా నుంచి వచ్చిన విశ్వంని చూసి ఆశ్చర్యపోయాడు లైబ్రేరియన్. ముందు ఆ షెడ్ చూసి వస్తాను అంటూ లేవబోతున్న విశ్వంని ఆపాడతను,

“మాస్టారూ.. ఇప్పుడక్కడ ఏ పుస్తకాలూ లేవు. పాత బల్లలు, టేబుళ్ళు అక్కడ పడేసాం. మీరు ఏం చూడాలన్నా ఇక్కడే” అoటూ. “కావచ్చు. కానీ నా జ్ఞాపకాలన్నీ అక్కడే ఉన్నాయి. చూసి వస్తాను” అని నవ్వుతూ అంటూ పైకి లేచాడు.

షెడ్ తాళం తీసి తెరిపిస్తానని లైబ్రేరియన్ అన్నా, అవసరం లేదని చెప్పి అక్కడికి బయల్దేరాడు. తాళం వేసి ఉన్నా, మెష్ లోంచి లోపలిభాగం స్పష్టంగా కనిపిస్తుంది. లోపలికి చూస్తూ, అప్పటి పుస్తకాల షెల్ఫులను, టేబుళ్ళను, బెంచీలను, లైబ్రరి సిబ్బందిని అక్కడున్నట్లు ఊహించుకుంటూ కళ్ళు మూసుకున్నాడు కొన్ని క్షణాల పాటూ. అతని మదిలో ఆ దృశ్యమంతా సినిమా సీన్‌లా కనిపించింది. విశ్వం అనుభవిస్తున్న అలౌకిక ఆనందాన్ని ఆకాష్ స్పష్టంగా గుర్తించగలిగాడుగానీ, ‘కేవలం ఒక చిన్న గ్రంథాలయంతో ఇంత అనుబంధమా?’ అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. విశ్వం ఆ గ్రంథాలయపు గోడలను, తలుపులను తడుముతూ చాలాసేపు అక్కడే ఉండిపోయాడు. ఆకాష్ అతన్ని డిస్టర్బ్ చేయకుండా ఓపిగ్గా అక్కడే నిలుచుండిపోయాడు. జ్ఞాపకాల్లోంచి బయటపడిన విశ్వం మాట్లాడడం మొదలు పెట్టాడు.

“మన దేశంలోనూ, విదేశాలలోనూ ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలయాలు చూసినా, అవన్నీ దీని తర్వాతే. దిస్ ఈజ్ మై ఫస్ట్ లవ్. రోజూ సాయంత్రం, ఇది తెరిచే సమయానికి అంటే మూడున్నరకే ఇక్కడికొచ్చి కూర్చొనేవాణ్ణి. మూసేసేవరకూ అంటే ఏడున్నరవరకూ కదిలేవాడిని కాదు. ఎన్నో అద్భుతమయిన పుస్తకాలు చదివానిక్కడ. అప్పట్లో స్కూల్ విద్య అంతా తెలుగులోనే కదా? తెలుగులో కూడా మంచి పుస్తకాలుoడేవి ఇక్కడ. ఆర్కే నారాయణ్ వ్రాసిన ‘మాల్గుడి డేస్’ మొదలు అన్ని పుస్తకాలు తెలుగులో అనువాదం చేసి ఉండేవి. రాజాజీ రామాయణం, భారతం. మాలతిచందూర్ తెలుగులో అనువాదం చేసిన అద్భుతమయిన రివ్యూలు నేను ఐదో తరగతిలోనే ఎంతో ఆసక్తిగా చదివేవాడిని. జేన్ ఆస్టెన్, ప్రైడ్ అండ్ ప్రిజుడిస్, ఎమ్మా.. లాంటి పుస్తకాల గురించి అప్పుడే తెలుసుకొనేవాడిని. ఆ వయసులో ఎన్ని వందల పుస్తకాలు చదివానో నాకే తెలియదు. ఆ పుస్తకపఠనమే నాకో దిశ, ఒక గమ్యం చూపించిoదని ఎప్పుడూ అనుకుంటుoటాను. పద లైబ్రేరియన్‌ను కలుద్దాం” అంటూ ముందుకు నడిచాడు విశ్వం.

గ్రంథాలయంలోకి అడుగుపెడుతూనే, అక్కడున్న ప్రతి షెల్ఫ్‌ని, వాటిలో ఉన్న పాత పుస్తకాలను తడిమి చూస్తూ విచిత్రమయిన అనుభూతికి గురయ్యాడు విశ్వం. ఆనాటి జ్ఞాపకాలతో అతని మనసంతా అదో రకమయిన ఉద్వేగానికి గురయింది. అతని కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. లైబ్రేరియన్ సందర్శకుల పుస్తకాన్ని అందిస్తూ, దానిలో ఏదయినా రాసి సంతకం చేయమని కోరాడు. వణికే చేతులతో ఆ పుస్తకాన్ని అందుకున్నాడు. ఏదో తెలియని భావోద్వేగం అతన్ని ఆవరించింది. ‘ఐదు దశాబ్దాల కింద ఈ పుస్తక భాండాగారాన్ని సద్వినియోగం చేసుకున్న ఒకనాటి పాఠకుడు’ అని రాసి సంతకం పెట్టి, ఆ పుస్తకంతో పాటూ పదివేల రూపాయులు అందిస్తూ, “కొత్త పుస్తకాలకు నా విరాళం” అంటూ చిన్నగా నవ్వాడు. లైబ్రేరియన్ ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు. “ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడే రసీదు రాసి ఇస్తాను” అంటూ రసీదు బుక్కు అందుకున్నాడు.

గ్రంథాలయం నుంచి నేరుగా సినిమా హాళ్ళ రోడ్ కి వెళ్ళారు. “ఇప్పుడు కాస్త క్రమం తప్పిందిగానీ అప్పట్లో ఊరిలోని సినిమా హాళ్ళన్నీ బారులు తీరినట్లు ఒకే వీధిలో పక్క పక్కనే ఉండేవి. ఇదిగో ఇలా చూడు.. పాత హాళ్ళనీ వరుసలోనే ఉన్నాయి. నాకు తెలిసి ఆ ప్రత్యేకత దేశం మొత్తం మీద ఒక్క కాకినాడలోనే ఉండేది” అంటూ ఆకాష్‌కి, కాకినాడ తాలూకు ఇతర ప్రత్యేకతలను గురించి విడమర్చి చెప్పాడు. తర్వాత సుబ్బయ్య హోటల్లో సుష్టుగా భోంచేసి హోటల్‌కి వెళ్ళి విశ్రమించారిద్దరూ.

(ఇంకా ఉంది)

Exit mobile version