Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కర్కాటకం-5

[శ్రీ కె. రామ్ మోహన్ రావు వ్రాసిన ‘కర్కాటకం’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి, ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో ప్రథమ బహుమతి గెల్చుకున్న రచన.]

[విశ్వం కొడుక్కి తన చిన్నప్పటి రోజుల గురించి చెప్తాడు. సామర్లకోటలో తను చదివిన ప్రైమరీ స్కూల్‍కి తీసుకువెళ్తాడు. ఏదో సంఘటన గుర్తొచ్చి బాగా నవ్వుతుంటే, ఆకాష్ కారణమడిగితే, చిన్నప్పుడు ఆ స్కూలు హెడ్‍మాస్టర్ గులేబకావళి సినిమా కథ చెప్పడం, ఇంకో సినిమా చూడ్డానికి డబ్బు కోసం పిల్లల దగ్గర డబ్బులు విరాళంగా తీసుకున్న పద్ధతి కొడుక్కి చెప్తాడు విశ్వం. అక్కడ్నించి కాకినాడకి బయల్దేరుతారు. దారిలో తన చిన్నప్పటి సినిమా అనుభవాలు మరికొన్ని చెప్తాడు విశ్వం. సాయంత్రానికి కాకినాడ చేరి హోటల్లో దిగుతారు. ఆ రాత్రికి పూర్తి విశ్రాంతి తీసుకోడంతో విశ్వానికి కొంత శక్తి వస్తుంది. మర్నాడు ఉదయం తన చిన్నప్పటి ఇంటికి తీసుకువెళ్తాడు. దదగ్గరలో ఉన్న ఒకప్పుడు తను చదువుకున్న గ్రంథాలయాన్ని చూసి, మైమరచిపోతాడు విశ్వం. కొత్త భవనంలో ఉన్న లైబ్రరీకి పదివేల రూపాయలు విరాళం ఇస్తాడు. కాకినాడ తాలూకు ఇతర ప్రత్యేకతలను గురించి కొడుక్కి విడమర్చి చెప్తాడు. మధ్యాహ్నం భోం చేసి విశ్రమిస్తారిద్దరూ. – ఇక చదవండి.]

మర్నాడు ఉదయమే అడ్డతీగెల బయల్దేరారు. మెల్లగా, మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళినా మూడు గంటలు పట్టింది, అక్కడికి చేరడానికి. రోడ్డుకు ఇరువైపులా ఉండే అడవి అంతా అంతరించిపోయింది. అక్కడికి వెళ్లేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ఎండ గట్టిగానే ఉంది. విశ్వం ఊహించినట్లే, వాతావరణం బాగా మారిపోయింది.

“అబ్బో.. ఈ ఊరు చాలా మారిపోయింది. కార్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. జీపులకు, ఆటోలకు కొదవే లేదు. డిష్ ఏ౦టెన్నాలు, సెల్ ఫోన్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు.. చాలా వెలిసాయి. అప్పటికీ ఇప్పటికీ పోలికేలేదు.

ఆ రోజు అక్కడ సంత జరుగుతుంది. ఆ సంతలో చాప మీద కూర్చుని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వ్యాపారం చేస్తున్న గిరిజనులను చూస్తుంటే, విశ్వానికి నవ్వాగింది కాదు. ‘మనదేశం పురోగమించలేదని ఎవరన్నారు? దానికి అడ్డతీగలే నిదర్శనం’ అనుకున్నాడు.

ఒక్క ‘అయ్యర్ హోటల్’ తప్ప అన్నీ మారిపోయినట్లు అర్ధమయింది, విశ్వంకి.

“పద.. అక్కడే భోజనం చేద్దాం” అన్నాడు విశ్వం హుషారుగా.

“అక్కడా..? అక్కడి ఫుడ్ ఎలా ఉంటుందో? హైజనిక్‌గా ఉంటుందో..లేదో? అందుకే కాకినాడలో ఫుడ్ పేక్ చేయించాను. కావాలంటే హోటల్ చూసి వద్దాం” అన్నాడు ఆకాష్.

“ముందు చూద్దాం పద. బాగుంటేనే భోజనం చేద్దాం” అంటూ అటు దారి తీసాడు. లోపల కొంతమంది కూర్చుని భోజనం చేస్తున్నారు. వాళ్ళంతా ఉద్యోగస్తుల్లాగ కనిపించారు. ‘చాలామంది, తమ కుటుంబాలను సిటీలో వదలి, ఇక్కడ ఒంటరిగా ఉంటూ, ఇలాంటి హోటళ్ళ మీద ఆధారపడుతున్నట్లున్నారు’ అనుకున్నాడు. హోటల్ కాస్త శుభ్రంగానే ఉన్నట్లు అనిపించగానే సంతృప్తిగా తలూపాడు విశ్వం. ఆకాష్ మాత్రం సంతృప్తి చెందనట్లు పెదవి విరిచాడు.

“అరిటాకుల్లో శుభ్రంగా పెడుతున్నారు. ఎప్పుడో ఈ హోటల్లో తిన్నాను. నాకోసం ఒప్పుకోరా” అంటూ కొడుకుని బతిమాలితే, అయిష్టంగానే తలూపాడు. ఇంతలో హోటల్ యజమాని వచ్చి,

“రండి సార్. కూర్చోండి. భోజనం వడ్డించేయమంటారా?” అని అడిగాడు. దానికి సమాధానం చెప్పకుండా “చాలా ఏళ్ల క్రితం ఈ ఊర్లో అయ్యర్ హోటల్ అని ఒకటి ఉండేది. అదే ఇదా?” అని అడిగాడు.

“అదేనండి. కానీ అయ్యర్ గారి కుటుంబం తాలూకు వారెవరూ లేరు. మా నాన్నగారు ఆయన దగ్గర కొన్నారు. అప్పటినుంచీ మేమే నడుపుతున్నాం” అని వివరణ ఇచ్చాడు

భోజనం ముగించాక ఒక వ్యక్తి వాళ్ళను కలిసి,

“మీరు చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నారా?” అని అడిగాడు విశ్వంని.

“అవునండి. ఏభై ఏళ్ల క్రితం” అంటూ నవ్వాడు.

“అబ్బో..? ఇప్పుడు ఏ పనిమీద వచ్చారు?” అని అడిగాడు.

“ఏం పని లేదు. ఒకప్పుడు పెరిగిన ఊరు కదా? ఎలా ఉందో చూద్దామని” అనేసరికి ఆశ్చర్యంగా చూసాడతను.

“ఇంతకూ ఎక్కడినుంచి వచ్చారు?” అని అడగ్గానే, తండ్రీకొడుకులు ముఖముఖాలు చూసుకొని, నవ్వుకున్నారు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో తెలియక తెల్లబోయి చూస్తున్న అతనికి, మరోసారి తెల్లబోవాల్సిన పరిస్థితి వచ్చింది,

“న్యూయార్క్ నుంచి” అని వినగానే. దాంతో అతనితో పాటూ అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూసారు.

“న్యూయార్క్.. అమెరికా?” అంటూ రెట్టించి అడిగాడతను. చిరునవ్వు నవ్వుతూ తలూపాడు విశ్వం.

“రెండేళ్ల క్రితం నేను న్యూయార్క్‌లో వారం రోజులున్నాను. బై ది వే.. ఐ యాం కె. తులసీ రావు. డిప్యూటి కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా ఈ మధ్యనే రిటైర్ అయ్యాను. ప్రస్తుతం కాకినాడలో ఒక యూకే బేస్డ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ టేకప్ చేసాను” అంటూ పరిచయం చేసుకోగానే ఆశ్చర్యపోవడం విశ్వం వంతైయింది.

“మై హెవెన్స్.. మీరేనా డాక్టర్ తులసి రావ్? మీ గురించి చాలా విన్నాను. నేను కెమికల్ ఓషనోగ్రఫీలో ప్రొఫెసర్‌గా పని చేసి, రిటైర్ అయ్యాను. మీరు న్యూయార్క్‌లో ఇచ్చిన సెమినార్‌కి నేను కూడా అటెండ్ అవ్వాల్సింది. కానీ ఏదో ప్రోజక్ట్ పనిమీద హవాయ్ వెళ్లి, అక్కడ చిక్కుకుపోయాను. మిమ్మల్ని ఇలా.. ఇలాంటి రిమోట్ ప్లేస్‌లో కలుస్తానని అస్సలు ఊహించలేదు” అంటూ ఆనంద౦గా చేయికలిపి, కొడుకుని పరిచయం చేసాడు. “పదండి. మా ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌కి వెళ్లి మాట్లాడుకుందాం. మీరు కాస్త రెస్ట్ తీసుకున్నట్లు ఉంటుంది” అంటూ ఆహ్వాని౦చేసరికి విశ్వం కాదనలేకపోయాడు.

విశ్వం, తులసి రావ్ ఒకే వయస్సు వాళ్ళు కావడం వల్లనో, వాళ్ళు పనిచేసిన విభాగాల్లో చాలా దగ్గర సంబంధాలు ఉండడం వల్లనో, ఇద్దరూ తొందరగానే బాగా కలిసిపోయారు. మాటల సందర్భంలో విశ్వం కేన్సర్ గురించి తెలుసుకున్న తులసిరావ్ చాలా బాధపడ్డాడు.

“మన మోడరన్ లైఫ్ స్టయిల్, ఎన్విరాన్మెంట్‌లో మార్పులు, బాగా పెరిగిన పారిశ్రామీకరణం, ఆహారపు అలవాట్లలో మార్పులు.. ఇలా చాలా కేన్సర్ ప్రబలడానికి కారణం అవుతున్నాయి. మన పూర్వీకులు ఎంతో మంచి సాంప్రదాయాలు, పద్ధతులు, ఆహారం అలవాటు చేసారు. మనమే వేలం వెర్రిగా పాశ్చాత్య పోకడలకు ఆకర్షింపబడి, చేతులారా నష్టాన్ని కొని తెచ్చుకు౦టున్నాము. అయినప్పటికీ ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే, మన దేశంలోనే కేన్సర్ బారిన పడిన వారి సంఖ్య తక్కువ..” అంటుంటే అడ్డుపడ్డాడు ఆకాష్.

“ఏమంటున్నారు సార్? అలా అనేస్తున్నారేమిటి? మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేకపోతున్నాను. ఇండియాతో పోల్చితే అమెరికా లాంటి దేశాలు మెడికల్‌గా ఎంతో అభివృద్ధి చెందాయి. బోలెడుమంది కేన్సర్ పేషెంట్లు చికిత్స కోసం అమెరికా వస్తున్నారు. ఇక్కడిలాగ కాదు మా దేశంలో కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అందరికీ తప్పనిసరిగా చేస్తారు. అక్కడ దొరికే మందులు చాలా బాగా పనిచేస్తాయి. ఉండండి.. గూగుల్లో చెక్ చేస్తాను. క్రితం ఏడాది ఇండియాలో ఎందరికి కేన్సర్ వచ్చింది? అమెరికాలో ఎందరికి వచ్చింది? అన్న విషయం తెలిసిపోతుంది” అనగానే అందుకున్నాడు తులసిరావ్

“ఓకే ఓకే.. అలాగే చేద్దువుగాని ముందు నేను చెప్పేది కాస్త విను నాయనా” అంటూ రిక్వెస్ట్ చేసేసరికి “ఆయన్ని చెప్పనీయరా ముందు” అని సలహా ఇచ్చాడు విశ్వం. దాంతో కాస్త తగ్గాడు ఆకాష్. తులసిరావ్ చెప్పడం మొదలు పెట్టాడు.

“అందరం నీలాగే అనుకుంటాం. ఆరోగ్యం పట్ల అమెరికా వాళ్ళు ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. శుచి, శుభ్రత విషయంలో మా కన్నా ఎన్నో రెట్లు నయం. నువ్వన్నట్లు మెడికల్‌గా కూడా మా కన్నా బాగా ముందున్నారు. కానీ మీ జనాభా ఎంత? ముఫ్ఫై రెండు, ముఫ్ఫై మూడు కోట్లు దాటి ఉండదు. మరి మన దేశపు జనాభా..? నూట ముఫ్ఫై ఒక్క కోట్లు. కాబట్టి ఇక్కడి కేన్సర్ రోగుల సంఖ్య, కేన్సర్ మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఒక లక్ష జనాభాకు లెక్కలు చూడాలి, ఏ దేశం విషయంలోనైనా. ఇప్పుడు నా లెక్కలు ఒకసారి విను. ఎక్కువ కేన్సర్ కేసులు ఇంగ్లాండ్, యూరప్ దేశాల్లో రికార్డ్ అవుతున్నాయి. అక్కడ లక్ష జనాభాకు కేన్సర్ కేసులు రెండు వందల ఏభయ్ నుంచి మూడు వందలు. అమెరికాలో సుమారు రెండు వందలు. మలేసియా సింగపూర్ లాంటి దేశాల్లో ఎనభయ్‌కి పైనే. మనదేశంలో నలభయి నుంచి అరవై లోపే. ‘మనదేశంలో లెక్కలు సరిగ్గా చూపరు’ అనే అపోహ ఉంది. అందుకే నలభైగా రికార్డ్ అవుతున్నా, అరవై వరకూ పొడిగించాను. పోనీ ఇంకా ఎక్కువని అనుకున్నా, ఖచ్చితంగా వందలోపే. దీనికి గల కారణాలు నేను చెప్పడం కాదు. ‘మైకేల్ గ్రెగర్’ అని ఒక అమెరికన్ డాక్టర్ చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు మీకు యథాతథంగా చెప్తాను వినండి.

‘ఇండియాలో పసుపు వినియోగ౦ చాలా ఎక్కువ. మసాలా దినుసులు కూడా ఎక్కువగానే వాడతారు. ఆ దేశంలో నలభై శాతం మంది శాకాహారులే. మిగిలినవారు మాంసాహారులే అయినా, అమెరికన్లు వాడేట౦త ఎక్కువగా మాంసాహారం వాడరు. వాళ్ళు తప్పనిసరిగా వాడే పసుపు, మసాలా దినుసులు, పప్పులు వారిని కేన్సర్ నుంచి కాపాడుతున్నాయి. భారతీయుల్లో చాలామంది సహజమైన, తాజా ఆహార పదార్థాలనే తీసుకుంటారు. అందుకే అక్కడ కేన్సర్ కేసులు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల కన్నా తక్కువ’ అంటూ ఈ విషయాలు, ఆయన లెక్కలతో సహా చాలా విపులంగా వివరించిన వ్యాసాలు అనేక పత్రికల్లో చోటుచేసుకున్నాయి. ఇంటర్నెట్‌లో కూడా ఆ సమాచారం అందుబాటులో ఉ౦ది.

ఇక్కడ మరో విషయం చెప్పాలి. కేన్సర్ నుంచి బయటపడటం విషయంలో ఇండియా వెనకబడే ఉంది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కేన్సర్ నయమయిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి, మనదేశంతో పోల్చితే. ఉదాహరణకు, అమెరికాలో నలుగురికి కేన్సర్ ఉన్నట్లు గుర్తిస్తే, అందులో ఇద్దరికి నయం అయిపోతుంది. కానీ మనదేశంలో నలుగురిలో ఒక్కడు బతకడమే కష్టంగా ఉంది. దీనికి కారణం నువ్వన్నట్లు, అమెరికా లాంటి దేశాల్లో అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండడం, స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయడం వల్ల, కేన్సర్ ప్రాథమిక దశలోనే బయటపడడం, అందువల్ల చికిత్సకు అవకాశాలు ఎక్కువగా ఉండడం. మరి మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కేన్సర్ గుర్తించేసరికే, అది ముదిరిపోయి, చికిత్సకు అవకాశాలు అల్పంగా ఉండేలా చేస్తుంది” అంటూ ముగించేసరికి, అతని వివరణకు సంతృప్తిగా తలూపి,

“బాగా చెప్పారు సార్. నేనే పూర్తిగా వినకుండా తొందరపడ్డాను. మీరు చెపితే తెలుస్తుంది. నిజమే మా జీవన విధానమే మాకు దెబ్బకొడుతుంది. ప్రోసెస్డ్ ఫుడ్స్, పేక్ చేసిన ఫుడ్స్‌కి బాగా అలవాటు పడిపోయాం. వాటిలో ఉండే కృత్రిమ తీపి పదార్థాలు, నిలవ ఉంచడానికి కలిపే ప్రిజర్వేటివ్‌లు, రంగు కోసం వాడే పదార్ధాలు.. ఇవన్నీ కేన్సర్ రావడానికి కారణాలు. సుఖాలకు బాగా అలవాటు పడిన మాలాంటి అమెరికన్ సిటిజన్లలో ఏ కొద్దిమందో వ్యాయామం చేస్తున్నారు. కానీ చాలామంది వ్యాయామం లేకపోవడం, బర్గర్లు, పిజాలు, ఐస్ క్రీములు తినేసి, ఒళ్ళు పెంచుకోవడం లాంటి కారణాల వల్ల కేన్సర్ బారినపడుతున్నారు. మాకు అందుబాటులో ఉన్నవన్నీ ఒళ్ళు పెరగడానికి సహకరించేవే. ఎటియం లోంచి డబ్బు తీయడానికి కూడా కారు దిగాల్సిన అవసరం లేదు. కార్ లోనే కూర్చుని డబ్బు తీసుకునే సదుపాయాలు ఉన్నాయి. ఫుడ్ ఆర్డర్ చేయడం, కార్లనుంచే, అందుకోవడం కార్లనుంచే. బాత్ రూమ్‌లో కూడా వంగే పని ఉండదు. అన్ని చోట్లా షవర్ బాతే కదా? షాపింగ్ మాల్‌లో బరువులు మోసే పని ఉండదు. అంతా ట్రాలీల తోనే. ఆ ట్రాలీ కారు దాకా తెచ్చుకుంటాం. ఇంటా బయటా, అన్నింటికీ మెషీన్‌లే. ఇప్పుడు ఇండియా కూడా అలాగే తయారవుతుంది లెండి” అంటూ నవ్వాడు. మళ్ళీ తనే అన్నాడు.

“అయితే అక్కడుండే మాలాంటి ఇండియన్స్ ఇంకా మన పద్దతులే పాటించడం వల్ల, అంటే ఆహారంలో పసుపు, అల్లం, వెల్లుల్లి, ఇంగువ మొదలయినవి ఉపయోగించడం, మన ఆచార వ్యవహారాలు పాటించడం చేస్తున్నారు కాబట్టి కొంత నయం. మీలాంటి వాళ్ళు ఇలాంటి విషయాల్లో అవగాహన కలిగిస్తే, అందరికీ మేలు కలుగుతుంది. అందరమూ చదువుకున్న వాళ్ళమే అయినా, మన నిర్లక్ష్య౦, అవగాహనారాహిత్యం కొంపముంచుతున్నాయి” అన్నాడు.

“అవగాహనారాహిత్య౦..? అమెరికాలో పుట్టి పెరిగిన మీరు ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించడం ఆశ్చర్యంగా ఉంది. మీకు తెలుగు బాగా వచ్చా?’ ఆశ్చర్యపోతూ అడిగాడు తులసిరావ్.

“మీ కన్నా చిన్నవాణ్ణి. నువ్వు అని సంబోధించవచ్చు. నాకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు” అంటూ నవ్వి

“మా అమ్మా నాన్నా తెలుగుతో పాటూ, మన పద్దతులు, ఆచార వ్యవహారాలూ నేర్పారు. మా పిల్లలకూ మేము నేర్పుతున్నాము. చిన్నప్పటినుండి తెలుగు సాహిత్యం చదవడం అలవాటు చేసారు మా నాన్నగారు. అందుచేత కొంచమయినా తెలుసుకున్నాను” అన్నాడు.

“బాగుంది. అయితే నీకు చిన్న పరీక్ష. కేన్సర్‌కి తెలుగు పదం ఏమిటి?”  అని అడిగాడు తులసిరావ్ నవ్వుతూ. తలగోక్కుంటూ.. “టీ కి, కాఫీకి తెలుగు పదాలు అడుగుతున్నట్లుంది. ఆ పదాల్లాగే కేన్సర్ కూడా మన తెలుగులో కలిసిపోయింది. దానికి కూడా తెలుగు పదం ఉందా? టీకి ‘తేనీరు’ లాగ?”  అంటూ భుజాలు ఎగరేసి

“నాకు తెలియదు సార్” అంటూ నవ్వాడు. “మీ నాన్నగారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది” అనగానే నవ్వుతూ అందించాడు విశ్వం “కర్కాటకం” అంటూ.

“కర్కాటకమా?.. ఈ పదం ఎప్పుడూ వినలేదు. ‘కర్కోటకం’ అనే పదం విన్నాను” అన్నాడు.

“అదీ ఉంది. ఇదీ వుంది. కానీ రెండూ వేరు. వాటి అర్థాలు వేరు. కర్కాటకం అంటే పీత అని అర్థం. పీతకు ఉండే అనేక కాళ్ళ ద్వారా అది అన్ని వైపులా పాకగలదు. కేన్సర్ కూడా ఎక్కడ పుట్టినా, అన్ని వైపులా పాకగలదు కనుక ఆ పేరు వచ్చింది. కర్కోటకం అంటే ‘దయా దాక్షిణ్యం లేని’ అనే అర్థం వస్తుంది. కేన్సర్ కూడా అలాంటిదే కాబట్టి, దానికి ఈ పేరు కూడా సరిపోతుంది” అన్నాడు తులసిరావ్.

***

సమన్విత, ప్రతిమ పదో తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యారు. సమన్విత చదువు కొనసాగించింది. ఆర్ధిక పరిస్థితుల కారణంగా ప్రతిమ చదువు ఆపేయవలసినందుకు సమన్విత ఎంతో బాధపడింది. ప్రతిమ తండ్రి లారీ డ్రైవర్. ఏ బాధ్యతా లేకుండా తాగుతూ కుటుంబాన్ని పట్టించుకోడు. పచ్చళ్ళ వ్యాపారంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది ప్రతిమ తల్లి. ఆమెకు కాస్త ఆసరాగా ఉండడానికి ఒక ప్రయివేటు కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరింది ప్రతిమ.

ప్రస్తుతం సమన్విత బిఎస్సీ చదువుతుంది. ప్రతిమ మరో కంపెనీకి మారడంతో వాళ్ళ ఆర్ధిక ఇబ్బందులు కాస్త గట్టెక్కాయి. సమన్విత పోరు పెట్టడం వల్ల, ప్రయివేటుగా చదవడం మొదలుపెట్టింది ప్రతిమ. స్వతహాగా తెలివయింది కావడం వల్ల, ఆ చదువులో కూడా ప్రగతి సాధించడంతో తృప్తి చెందింది సమన్విత.

వాళ్ళిద్దరి మధ్య ఏ అరమరికలు ఉండవని, ఏ రహస్యాలూ ఉండవని భావించిన సమన్విత, తన అభిప్రాయం తప్పని తెలుసుకునే రోజు వచ్చింది.

“చిన్నమ్మా.. నీకోసం ఎవరో వచ్చారు” అని పనిమనిషి చెప్పగానే, హాల్లోకి వచ్చిన సమన్విత అక్కడున్న ప్రతిమ తల్లి జగదాంబను, తండ్రి వెంకట్రావుని చూడగానే, ఆశ్చర్యపోతూ..

“మీరేమిటిక్కడ? కబురు పెడితే నేనే వచ్చే దాన్ని కదా?” అంటూ పుట్టెడు దుఃఖంలో ఉన్న జగదాంబను చూస్తూ ‘ఏదో తేడాగా ఉన్నట్లుంది’ అనుకుంది. కందగడ్డలా అయిపోయిన వెంకట్రావు ముఖం, ఎర్రబారిన అతని కళ్ళు చూసేసరికి సమన్విత గుండెలు ఎందుకో దడ దడా కొట్టుకున్నాయి.

“అలా బయటకు వెళ్లి మాట్లాడుకుందామమ్మా” అని జగదాంబ అడగ్గానే అయోమయంగా చూస్తూ బయటున్న తోటలోకి దారి తీసింది. అక్కడే ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చోగానే,

“ఆంటీ.. ఏమిటి విషయం? మీరిద్దరూ అలా ఉన్నారేమిటి? ఏదయినా సమస్యా?” అంటూ ప్రశ్ని౦చి౦ది ఆదుర్దాగా.

“ఏమీ తెలియనట్టు మట్లాడతావేటి?” అంటూ గద్దించాడు వెంకట్రావు కోపంగా. దాంతో సమన్విత తీవ్రంగా భయపడిపోయింది. ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు. ఇంతకుముందెప్పుడూ అతను ఆమెతో అలా మాట్లాడలేదు. అందుకే సమన్విత ఖంగుతింది. వెంటనే జగదాంబ జోక్యం కలిగించుకుంటూ భర్తను గసిరింది,

“నువ్వుండవయ్యా.. పిల్ల బెదిరిపోతుంది. ఎందుకలా అరుస్తావు?” అంటూ. దాంతో అతను కాస్త తగ్గాడు. అయినా సమన్విత గుండె వేగంగా కొట్టుకోవడం తగ్గలేదు. అది గ్రహించిన జగదాంబ సమన్విత భుజం మీద చేయివేసి,

“కంగారు పడకమ్మా అతని తీరే అంత. మా ప్రతిమ ఎక్కడికెళ్ళి౦దో చెప్పి పుణ్యం కట్టుకోమ్మా” అంటూ బతిమాలేసరికి, షాక్ తింది సమన్విత. కాస్సేపు తన నోటమ్మట మాట రాలేదు.

“అదేమిటి ఆంటీ.. ప్రతిమ కనిపించక పోవడం ఏమిటి? నాకేమీ అర్థం కావడం లేదు. మాకు పరీక్షలు మొదలు కావడం వల్ల, వారం పదిరోజులుగా మేమిద్దరమూ కలుసుకోలేదు. ఏమి జరిగిందో నాకు అస్సలు తెలియదు. ఏమయిందసలు?” అంటూ గాభరా పడుతూ ప్రశ్నించింది. సమాధానం చెప్పకుండా భర్త ముఖం వైపు చూసింది జగదాంబ. అతని ముఖంలో మళ్ళీ కోపం చోటుచేసుకుంది. అది చూడగానే, సమన్విత భయంతో వణకడం మొదలు పెట్టింది. వెంకట్రావు తనని తానూ కంట్రోల్ చేసుకుంటూ కటువుగా అన్నాడు,

“నాటకాలు ఆడకు. నీకంతా తెలుసు. మా అమ్మాయికి ఉన్న ఒకే ఒక ప్రాణ స్నేహితురాలివి నువ్వే. మర్యాదగా నిజం చెప్పు. అది ఎక్కడికి వెళ్ళింది? ఆ రాజాబాబుతో లేచిపోయిందా?” అని. ఆ మాటలు వినగానే సమన్విత భయంతో వణికిపోతూ,

“నాకేమీ తెలియదు అంకుల్. అసలు ఈ రాజాబాబు ఎవరు? ఆ పేరు నేను ఎప్పుడూ వినలేదు” అంది. ఆ సమాధానం వినగానే మళ్ళీ రెచ్చిపోబోతున్న భర్తను ఆపింది జగదాంబ.

“తల్లీ.. మీరిద్దరూ ఎన్నో ఏళ్లనుంచి ప్రాణానికి ప్రాణంగా ఉండే స్నేహితురాళ్లు. అది అన్ని విషయాలూ నీకు చెపుతుంది. నీ దగ్గర ఏమీ దాచదు. నువ్వే మా దగ్గర ఏదో దాస్తున్నావు. దయచేసి చెప్పమ్మా” అంటూ చేతులు పట్టుకొని అర్థిస్తున్న జగదాంబను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది, ఏ సమాధానమూ చెప్పలేక. సమన్విత నిజం దాస్తుంది అని నమ్ముతున్న వెంకట్రావు మళ్ళీ కేకలు మొదలెట్టేసరికి, చిగురుటాకులా వణికి పోయింది సమన్విత.

“ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకలా కేకలు వేస్తున్నారు?” అంటూ అక్కడికి వచ్చాడు సమన్విత తండ్రి. ఇంటి లోపలి నుంచి ఆ వ్యవహారాన్ని గమనిస్తున్న అతను బయటకు రాక తప్పలేదు. అతను రాగానే సమన్విత తండ్రి చాటుకు చేరింది. అతన్ని చూసి ప్రతిమ తల్లితండ్రులు కలవరపడ్డారు. జగదాంబ కాస్త ధైర్యం తెచ్చుకుని,

“నమస్కారమయ్యా.. ప్రతిమ మా అమ్మాయే. మొన్నటినుంచి కనబడటం లేదు. మీ అమ్మాయి ద్వారా ఏదయినా విషయం తెలుస్తుందేమోనన్న ఆశతో వచ్చాము. తనేమీ చెప్పడం లేదు. వాళ్ళిద్దరూ ఎంత మంచి దోస్తులో మీకూ తెలుసు. మీరయినా చెప్పండయ్యా.. అమ్మాయికి” అంటూ బతిమాలుకుంది జగదాంబ. వెంటనే సమన్విత వైపు చూసాడతను.

“నాకేమీ తెలియదు నాన్నగారూ. నా మాట నమ్మండి. ప్రతిమ నాకు బెస్ట్ ఫ్రెండే గానీ, నా దగ్గర కూడా చాలా విషయాలు దాచిపెట్టినట్లుంది. వీళ్ళు చెపుతున్న రాజాబాబు ఎవరో నాకు నిజంగా తెలియదు. మీక్కూడా తెలుసుకదా.. పరీక్షలతో ఎంత బిజీగా ఉంటున్నానో? ఈ పదిరోజుల్లో ప్రతిమతో అస్సలు మాట్లాడనేలేదు. ఏమి జరిగిందో నాకు తెలియదని మొత్తుకుంటున్నా.. నా మాట వినిపించుకోవడం లేదు” అంటూ తండ్రికి ఫిర్యాదు చేసింది.

“విన్నారు కదా? ఎంత పెద్ద స్నేహం ఉన్నా, అందరూ అన్ని రహస్యాలూ చెప్పరు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు. నిజంగా అలాంటిదేదో ఉందని మా అమ్మాయికి తెలిస్తే, ప్రతిమకు గడ్డి పెట్టి ఉండేది. ముందుగానే మిమ్మల్ని హెచ్చరించి ఉండేది. అందుకే మీ అమ్మాయి తన దగ్గర ఆ విషయం దాచి ఉంటుంది. ఒక ఆడపిల్ల తండ్రిగా మీ బాధను నేను అర్థం చేసుకోగలను. దయచేసి ఇక్కడినుంచి వెళ్ళిపోండి. వేరే మార్గం ఏదయినా దొరుకుతుందేమోనని ప్రయత్నించండి” అని చెప్పగానే, బదులు మాట్లాడక వాళ్ళు నిష్క్రమించారు. అప్పటికిగానీ సమన్విత గుండెలు కుదుట పడలేదు.

***

ప్రతిమ కనబడకుండా వెళ్ళిపోయి చాలా ఏళ్లయింది. కానీ ప్రతిమ ఏమయిందో, ఎక్కడికి వెళ్లిందో, ఎక్కడుంటుందో.. తెలియలేదు సమన్వితకి. తను గుర్తు వచ్చినప్పుడల్లా కుమిలిపోవడం తప్ప చేసేదేమీ కనిపించలేదు. ప్రతిమ తల్లిని కలిసి అడిగే సాహసం ఆమెకు లేకపోయింది. రెండేళ్ల తర్వాత మార్కెట్‌లో కనిపించింది ప్రతిమ తల్లి. ధైర్యం చేసి పలకరించింది, “ఆంటీ.. ఎలా వున్నారు?” అంటూ.

“ఇదిగో.. ఇలా ఉన్నాను” అంది పుల్ల విరుపుగా. దాంతో సంభాషణ పొడిగించే ధైర్యం లేకపోయింది సమన్వితకి. అవమానభారంతో వెనక్కి తిరిగింది.

“ఏమీ అనుకోకమ్మా.. తొందరపడి అలా అనేసాను” అంది జగదాంబ వెంటనే. అలా అన్నందుకు ఎంత బాధపడిందో ఆమె ముఖమే చెపుతుంది. ఆ మాట వినగానే సమన్విత ముఖం వికసించింది.

“అయ్యో.. ఫర్వాలేదు ఆంటీ. మీరు మా అమ్మలాంటి వాళ్ళు. ఏమయినా మాట్లాడే హక్కుంది మీకు” అనగానే ‘అయ్యో ఇంత మంచి పిల్లతో అలా మాట్లాడేసానేమిటి?’ అనుకుంటూ మళ్ళీ బాధపడింది.

ఆ తర్వాత ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. ప్రతిమ విషయం ఏమయినా తెలుస్తుందేమోనని ఇద్దరూ ఆశపడ్డారు. ఇద్దరూ భంగపడ్డారు.

“నాకు తెలిసి, దానికి అత్యంత ఆప్తులు నేనూ, నువ్వేనమ్మా. రెండేళ్లు గడచినా.. ఇప్పటివరకూ నిన్ను గానీ, నన్నుగానీ పలకరించలేదు చూసావా? అందుకే ఎక్కువ బాధపడుతున్నాను” అంటూ కన్నీరు కారుస్తున్న జగదాంబను ఎలా ఓదార్చాలో తెలియలేదు సమన్వితకి.

“మనిద్దరికన్నా ఆ రాజాబాబు గాడే ఎక్కువయిపోయాడు దానికి. వాడి మోజులో పడి అందరినీ మర్చిపోయింది” అంది జగదాంబ కళ్ళు తుడుచుకుంటూ.

“రెండేళ్లుగా ఈ ప్రశ్న నన్ను తినేస్తుంది. ఎవరాంటీ.. ఈ రాజాబాబు?” అని అడిగింది, కుతూహల౦గా.

“నిజంగా నీకు వాడెవడో తెలియదా?” అంటూ విస్తుపోయింది జగదాంబ. సమన్విత అడ్డంగా తలూపేసరికి,

“అయ్యో తల్లీ.. ఇప్పటికీ నిన్ను అనుమానిస్తూనే ఉన్నాం. ఎంత తప్పయిపోయింది?” అనుకుంటూ పశ్చాత్తాప పడింది.

“ఆ రాజాబాబుది హైదరాబాదమ్మా. ఇక్కడ షిప్పింగ్ కాంట్రాక్ట్‌లు ఉన్నాయతనికి. అందుకే తరచూ ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఎలా పడిందో గానీ మన ప్రతిమ వాడి కంట పడింది. ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి, తన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చాడు. దాదాపు రోజూ అతని గురించి చెపుతుండేది ‘మా బాస్ చాలా మంచివాడు. నా పని బాగా మెచ్చుకుంటాడు’ అంటూ. ఎవరో పెద్ద వయసువాడు అయిఉంటాడులే అనుకునేదాన్ని చాన్నాళ్ళు. నాకు వేరే ఆలోచనలు, అనుమానాలు వచ్చేవి కాదు, దాని మాటలు వింటుంటే.

ఆ రోజు, నీ దగ్గరనుంచి ఏ వివరాలూ తెలియక పోయేసరికి, మీ ఇంటినుంచి సరాసరి దాని ఆఫీసుకు వెళ్లాం. రాజాబాబు గురించి వాకబు చేస్తే, రెండ్రోజుల క్రితమే హైదరాబాద్ వెళ్లిపోయాడని తెలిసింది. అప్పటికీ మాకు అనుమానం రాలేదు. కానీ ఆ ఆఫీసులో అతని ఫోటో చూసాక, మా అనుమానం బలపడింది. బాగా వయసులో ఉన్నాడతను. అందంగా కూడా ఉన్నాడు. ‘మీ అమ్మాయి ఆఫీసుకు రావడం లేదేమిటి?’ అని అడుగుతున్న మేనేజర్, అతని అసిస్టెంట్ గుంభనగా నవ్వుకోవడం కూడా మా అనుమానాన్ని బలపరిచాయి. కానీ ఏం చెయ్యగలం? వాళ్ళందరూ పెద్దవాళ్లు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన రాజాబాబుని, మా ఆయన కలిసినప్పుడు, తనకేమీ తెలియదని, బుకాయి౦చాడట” అంటూ ఏడుస్తూ చెప్పింది జగదాంబ.

“పోనీ, పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా?”

“మీ అమ్మాయి ఎవడితోనో లేచిపోయి ఉంటుంది. మాకు రోజుకు ఇలాంటివి ఐదారు కేసులు వస్తున్నాయి. మాకిదే పనేమిటి? పో.. పో.. వెతుక్కో. లేకపోతే నాలుగు రోజులు ఆగు. తనే తిరిగి వస్తుందని, వెళ్లగొట్టారు మా ఆయన్ని” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది జగదాంబ.

(ఇంకా ఉంది)

Exit mobile version