[శ్రీ కె. రామ్ మోహన్ రావు వ్రాసిన ‘కర్కాటకం’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి, ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో ప్రథమ బహుమతి గెల్చుకున్న రచన.]
[బస్‌లో హైదరాబాద్‌కి వెళ్తున్న సమన్వితకి, సుమారు ఐదేళ్ళ క్రితం ప్రతిమ వ్రాసిన ఉత్తరం గుర్తొస్తుంది. తను ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయిందో, తను ఎంతగానో నమ్మిన రాజాబాబు చేసిన మోసం, జీవితంలో అన్ని రకాలుగా నష్టపోయిన వైనం వ్రాస్తుంది. అవన్నీ చదివి బాధపడుతుంది సమన్విత. విశ్వం, ఆకాశ్ కారులో కాకినాడ వెళ్తుంటారు. దారిలో ఏదో రాజకీయ పార్టీ ఆందోళన వల్ల – వాహనాలన్నీ నిలిచిపోతాయి. ఒక వ్యక్తి తన భార్య కడుపుతో ఉందని, హాస్పటల్‌కి తీసుకువెళ్ళాలని అందరినీ అడుగుతూ, ఆకాశ్‌ని కూడా అడుగుతాడు. తీసుకురమ్మంటాడు. అతను మరో వ్యక్తి సాయంతో, భార్యని తీసుకుస్తాడు. అతను అతను భార్య వెనుక కూర్చుంటారు. ఆకాష్ ముందు సీట్లోకి మారుతాడు. ఎలాగొలా భద్రంగా కాకినాడ ఆసుపత్రికి చేరుతారు. ఆమెను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకువెళ్తారు. అతను థ్యాంక్స్ చెబుతుంటే, అతనిలో సుధాకర్ పోలికలు కనిపించి, మా సుధాకర్‌లా ఉన్నాడు అని విశ్వంపైకే అంటాడు. బదులుగా అతను సుధాకర్ తన తండ్రేనని చెప్తాడు. నీ పేరేమిటి అని అడిగితే, విశ్వనాథ్ అని చెప్తాడతను. అనుకోకుండా తన మిత్రుడి కొడుకుని చూసినందుకు చాలా సంతోషిస్తాడు విశ్వం. సుధాకర్ గురించి అడిగితే, ఉప్పాడలో ఆయుర్వేద వైద్యుడిగా స్థిరపడ్డాడని చెప్తాడు. విశ్వానాథ్‌కి కొడుకు పుడతాడు. బిడ్డని ఆశీర్వదిస్తాడు విశ్వం. హాస్పటల్‌కి చేరగానే ప్రతిమ భర్త సమన్వితకు ఎదురెళ్ళి రిసీవ్ చేసుకుంటాడు. ప్రతిమ పరిస్థితి చూసి బాధపడుతుంది సమన్విత. రాజాబాబు మోసం చేసి వెళ్ళిపోయాకా, తన జీవితం ఏయే మలుపులు తిరిగిందో చెప్తుంది. భద్రతో పెళ్ళి ఎలా జరిగిందో చెప్తుంది. తర్వాత కేన్సర్ నివారణ కోసం తను చేయాలనుకున్న కార్యక్రమాన్ని స్నేహితురాలికి వివరిస్తుంది. తాను సేకరించిన సమాచారపు ఫైల్స్ అందిస్తూ ఆ బాధ్యత ఆమెకు అప్పగిస్తుంది. తన వల్లేం అవుతుందని సమన్విత సందేహిస్తుంది. – ఇక చదవండి.]
“ఈ ప్రశ్నలు నీ దగ్గరినుంచి వస్తాయని ఊహించాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి డాక్టర్లే రావాలంటే, ఎలా కుదురుతుంది? ఈ రోజుల్లో ఏ డాక్టర్లు ఖాళీగా ఉంటున్నారు? వాళ్ళ ప్రాక్టీస్ వదులుకొని, ఇలా సంఘసేవ కోసం ఎలా రాగలుగుతారు? కావాలంటే మనకు సలహాలు ఇస్తారు. అవసరమయిన సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమానికి వాళ్ళు రావాలని కోరుకోవడంలో అర్థం లేదు. జగ్గీ వాసుదేవ్ లాంటి గురువులు కూడా కేన్సర్ గురించి తెలుసుకొని, అవగాహన కలిగిస్తున్నారు. అలాంటి వాళ్ళు డాక్టర్లు కాకపోయినా జనం వాళ్ళ మాటలు విని, అవగాహన పొందుతున్నారు.
అసలు నువ్వు బయోకెమిస్ట్రీ లో పీజీ చేసావన్న సంగతి మర్చిపోయావా? అయితే ఏమిటి? అని అడ్డు ప్రశ్నలు వేయకు. నన్ను పూర్తిగా చెప్పనీయ్. కేన్సర్ అవగాహనకు నేను ఎన్నుకున్న టైటిల్, ‘కేన్సర్ కారణాలు – నివారణలు’. ఇక్కడ మనం గుర్తుంచుకొనేది ఏమిటంటే, కేన్సర్‌ను ఎలా ట్రీట్ చేస్తారు? అన్న విషయాన్ని పైపైనే టచ్ చేస్తాము గానీ, లోతుగా వెళ్ళ౦. అది పూర్తిగా డాక్టర్ల పని. మన పరిధిలోకి రాదు. ఇక కేన్సర్ ఎలా వస్తుంది? అది రాకుండా ఎలా జాగ్రత్తపడాలి? అన్న విషయాలు ప్రజల బుర్రల్లోకి ఎక్కించడమే మన పని. ఇక్కడ నీ పాత్ర ‘టీచర్ పాత్ర’. నువ్వు కూడా చాలాకాలం టీచర్‌గా పనిచేసి, మంచి పేరు తెచ్చుకున్నావు కదా? టీచర్ చెప్పే పాఠాలు తను కనిపెట్టినవి కావు. పుస్తకంలో ఉన్న సమాచారం బోధపరచడమే తన పని. అలాగే ఎందరో సైంటిస్టులు, డాక్టర్లు కనుగొన్న సమాచారం మనకు అందుబాటులో ఉంది. దాన్ని ప్రజలకు చేరవేసి చైతన్య పరచడమే మన పని. అయితే ఆ పనికి కావాల్సిన అర్హత, నాలాంటి వాళ్లకు లేదుగానీ, నీకుంది. ఆ సమాచారాన్ని బాగా అర్థం చేసుకొని, దోషాలు లేకుండా చెప్పగలిగే పరిజ్ఞానం నీకుంది. నువ్వు చదివిన బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ నీకు బాగా ఉపయోగపడతాయి.
నువ్వు నన్ను చూడ్డానికి వస్తున్నావని తెలినప్పుడే ఈ బాధ్యత నీకు అప్పగించాలని నిర్ణయించేసుకున్నాను. అందుకే పూర్తిగా రెడీగా ఉన్నాను. నీ సందేహాలన్ని౦టికీ నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఇపుడు నేను చెప్పేది శ్రద్ధగా విను. ఇది చాలా చోట్ల నువ్వు చెప్పాల్సి ఉంటుంది.
కెమిస్ట్రీ అంటే రసాయనాలను అధ్యయనం చేసే శాస్త్రం. అంటే కెమికల్స్‌ను స్టడీ చేసే సైన్స్. కేన్సర్ రావడానికి రసాయనాలే కారణం. వాటిని కార్సినోజెనిక్ కెమికల్స్ అంటారు. కేన్సర్ చికిత్సలో ప్రధానమైనది ‘కీమో థెరపీ’. అంటే కెమికల్స్‌తో చికిత్స చేయడం. దీనిని బట్టి కేన్సర్‌కి కెమిస్ట్రీకి ఎంత దగ్గర సంబంధం ఉందో నీకు తెలియనిది కాదు.
ఎలాగయినా ఈ బాధ్యత నీకే అప్పగించాలని చాన్నాళ్లనుంచి అనుకుంటున్నాను. ఎప్పటికయినా మనిద్దరి మధ్య ఈ టాపిక్ వస్తుందని తెలుసు. అందుకే సిద్ధపడి ఉన్నాను. ఎంతో పరిజ్ఞానం ఉన్న నీ ముందు, నీ సబ్జెక్ట్ గురించి మాట్లాడడం సాహసమే. అయినా దానికి సిద్ధంగానే ఉన్నాను. అందుకు కావాల్సిన పరిజ్ఞానం కూడగట్టాను. అయినా నా మాటల్లో తప్పులు దొర్లవచ్చు. సరిదిద్దడానికి నువ్వు ఉన్నావు కదా?
మనకు కెమిస్ట్రీలో ఓనమాలు దిద్దించిన దీక్షితులు మాస్టారి మాటలు నాకింకా గుర్తే. కెమిస్ట్రీ లేనిది ఎందులో? మనం పీల్చే గాలి, తినే ఆహారం, వాడే వస్తువులు, ఇలా అన్నీ కెమికల్స్ మయం. ఒక కప్పు కాఫీలో వెయ్యి కెమికల్స్ ఉంటాయి. సిగరెట్ పొగలో వందల కొద్దీ కెమికల్స్ ఉంటాయి. అందులో ఏభయ్ వరకూ కేన్సర్‌ను కలిగించేవే!.. ఇలా ఎన్నో విషయాలు చెప్పి ఆ సబ్జెక్ట్ మీద ఎంతో ఇంట్రస్ట్ కలిగేలా చేసారు. నీకు అవన్నీ గుర్తున్నాయా?” అంటూ అడిగింది.
“మర్చిపోయాను గానీ, నువ్వు చెపుతుంటే ఒక్కొక్కటి గుర్తు వస్తున్నాయి” అంది సమన్విత.
“ఇంకేమీ ఆలోచించకు. నాకోసం ఈ కార్యక్రమం చేపట్టు. నీ వల్ల నా కల సఫలమవుతుంది. ప్లీజ్. ఒప్పుకో. చివరిరోజుల్లో నాకు కాస్త మనశ్శాంతి కలిగేలా చూడు” అంటూ బతిమాలుతున్న ప్రతిమను చూస్తూ అయోమయంగా తలూపింది.
చాలా కాలం తర్వాత ప్రతిమ అంత హుషారుగా ఉండడం చూసిన డాక్టర్లు, నర్సులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఎంతో మంచి మందులు చేయలేని పని, ఒక స్నేహితురాలి వల్ల అవడం వాళ్ళను సంభ్రమంలోకి నెట్టేసింది.
***
హైదరాబాదులో ఉన్న వారం రోజులూ ప్రతిమ కేన్సర్ అవగాహన గురించే మాట్లాడుతుంటే, ఆ విషయంలో ఆమె ఎంత పట్టుదలగా ఉందో తెలిసొచ్చింది. ఇద్దరూ కలసి ఆ ప్రణాళిక ఎలా అమలుచేయాలన్న విషయం గురించి చర్చించి ఒక కార్యాచరణ పథకం రూపొందించారు.
“ముందు ఈ రెండు ఫైళ్ళు బాగా స్టడీ చేస్తాను. నాకు పూర్తిగా అవగాహన వచ్చాక, ఒక కరపత్రం ముద్రించడానికి కావలసిన విధంగా సమాచారాన్ని సిద్ధం చేస్తాను. కరపత్రాలు చేతికి అందాక, మా ఊర్లో ఉన్న స్వచ్చంద సేవాసంస్థలను సంప్రదిస్తాను. మాకు దగ్గరగా ఉన్న స్కూళ్ళు, కాలేజీల హెడ్మాస్టర్ లను, ప్రిన్సిపాల్‌లను కలుస్తాను. ఆ సంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయమని చెప్తాను” అంది సమన్విత ఉత్సాహంగా.
***
తన ఊరు వెళ్ళాక అవగాహన కలిగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది, సమన్విత. కేవలం చదువుకే ప్రాధాన్యతను ఇస్తూ, కేన్సర్ అవగాహనా కార్యక్రమాల వంటివి టైమ్ వేస్టు కార్యక్రమాలు అని భావించే చాలా విద్యాసంస్థలు అవకాశం ఇవ్వకపోయినా సమన్విత నిరాశపడకుండా ప్రయత్నించి ఒక విద్యాసంస్థలో తన గళం విప్పింది.
“కేన్సర్ గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక కారణాలను చెప్తారు గానీ నాకు తెలిసిన ప్రధాన కారణాలు రెండు. మొదటిది, అవగాహనా రాహిత్యం. రెండవది, మన నిర్లక్ష్యం. ప్రాణాంతకమైన ఆ జబ్బు గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేయం. తెలిసిన కొన్ని విషయాలను సీరియస్‌గా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ రెండు కారణాల వల్లే అది ఇలా విరుచుకు పడుతుంది.
ఇక ప్రముఖులు అందించిన శాస్తీయ కారణాలు ఏవిటో చూద్దాం. ముందుగా ‘పొగాకు’. దాన్ని ఏ రూపంలో తీసుకున్నా, ప్రమాదమే. కేవలం ఒక్క సిగరెట్ పొగలోనే ఏభయ్ కార్సినోజెనిక్ కెమికల్స్ ఉన్నాయట. ‘సిగరెట్ తాగే వాడి ఆరోగ్యమే పాడవుతుంది’ అనుకున్నాం ఇప్పటివరకూ, ఆ మహానుభావుడు వదిలే పొగ పీలుస్తున్న అతని కుటుంబం, చుట్టూ ఉన్నవాళ్లు బలి అయిపోతున్నారని ఇప్పుడు అర్థం అవుతుంది కదా? మీరింకా చిన్న పిల్లలు కాబట్టి పొగాకు జోలికిపోరు. కానీ ఈ విషయంలో మీద పెద్ద బాధ్యతే ఉంది. అదే.. మీ ఇంట్లో పెద్దవారికి ఎవరికయినా పొగాకు అలవాటు ఉంటే మాన్పించడం. ఆ పెద్దవారు మీ తాతగారు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, మీ చిన్నాన్నో, మావయ్యో.. ఇలా ఎవరయినా కావచ్చు.
ఇక రెండవది ప్లాస్టిక్. అనేక కారణాల వాళ్ళ దాని వాడకం చాలా ఎక్కువయింది. పర్యావరణ కాలుష్యం ఒక్కటే కాదు. దాని ప్రభావం కేన్సర్ మీద కూడా ఉంది. వేడి ఆహారపదార్ధాలు తినడానికి, పేక్ చేయడానికి దానిని విరివిగా వాడుతున్నారు. ప్లాస్టిక్‌లో ఉండే హానికరమయిన కెమికల్స్‌తో ఆహారంతో చర్యచెంది, కేన్సర్ బారిన పడడానికి కారణమవుతున్నాయి.
మూడవది ‘ఫుడ్ ఎడిటివ్స్’ అంటే ఆహారపదార్ధాల తయారీలో కలిపే కెమికల్స్. కంటికి ఇంపైన రంగుల కోసం కొన్ని కెమికల్స్, నిల్వ ఉండడానికి కలిపే ప్రిజర్వేటివ్‌లు, తీపి కోసం చక్కర బదులు కలిపే ‘ఆస్పార్టేమ్, సుక్రలోజ్, శాకరీన్’ అనే ఆర్టిఫిషియల్ షుగర్ లను వాడుతున్నారు. ఇవన్నీ కేన్సర్‌కు కారణాలు అవుతున్నాయి. మీరు బాగా ఇష్టపడే జామ్‌లు, జెల్లీలు, కూల్ డ్రింక్లు, సాస్‌లు, సిరప్‌లు, సూపులు.. వీటన్నిటిలోనూ అవన్నీ ఉంటాయి. అందుచేత వాటికి దూరంగా ఉండాలి. మీకిది చాలా కష్టంగా ఉండొచ్చు. ఒక్కసారిగా మీరు వాటిని మానేయలేరు. మెల్ల మెల్లగా వాటికి దూరం అవ్వాలి.
ఇంకా పెస్టిసైడ్‌లు, కృత్రిమ ఎరువులు, మామిడి, బొప్పాయి వంటి వాటిని తొందరగా పండబెట్టడానికి వాడే కాల్షియం కార్బైడ్, వాతావరణ కాలుష్యం, ఆహార పదార్ధాలలో కల్తీ.. ఇలా అనేక కారణాలు ఉన్నాయి.
ఇవన్నీ కారణాలు. మరి నివారణల గురించి కూడా తెలుసుకుందాం. కార్సినోజెనిక్ కెమికల్స్ వేటి ద్వారా వస్తాయో తెలిసింది కదా? వాటికి దూరంగా ఉండాలి. ఊబకాయం కూడా కేన్సర్ రావడానికి ఒక కారణమేనట. అది రాకుండా చూసుకోవాలి. అంటే రోజూ ఏదో ఒక వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. సమతుల్య ఆహారం అంటే బేలన్స్డ్ డైట్ తీసుకోవాలి.
ప్లాస్టిక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేడి ఆహార పదార్ధాలకు దానిని వాడకూడదు. ఎక్కువ కాలం పాటూ తేనె, నూనె వంటి ద్రవాలను, ఆవకాయ లాంటి వాటిని ప్లాస్టిక్ సీసాల్లో ఉంచకూడదు. వాటితో ప్లాస్టిక్ చర్యచెందే అవకాశం ఉంది.
మనం వాడే కూరలు, కాయలు, పళ్ళు కనీసం అరగంటసేపు ఉప్పు కలిపిన లేదా సోడియం బై కార్బోనేట్ అంటే వంట సోడా కలిపిన నీళ్ళలోగానీ ఉంచితే, పెస్టిసైడ్లు చాలావరకూ తొలగిపోతాయి.
పేకెట్లలో అమ్మే వాటిని కాకుండా, మిల్లులో ఆడించుకుంటూ చాలా వరకూ ఆహారపదార్ధాలను వాడుకోవడం ఉత్తమం. ఉదాహరణకు బజార్లో దొరికే పసుపు ప్రమాదకరం. అది ‘మెటానిల్ ఎల్లో’ అనే కార్సినోజెనిక్ కెమికల్ తో కల్తీ చేయబడి ఉంటుంది.
తాజా ఆహారపదార్ధాలే వాడాలి. డబ్బాలలోనూ, పేకెట్లలోనూ ఉండే సింథటిక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఏంటి ఆక్సిడెంట్‌లు ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే, మరో గంట అయినా పడుతుంది. మరికొన్ని వివరాలు కరపత్రంలో ఉన్నాయి. ఆ పత్రాన్ని బాగా చదివి, పదిమంది చేత చదివించడమే కాకుండా, మీ కుటుంబ సభ్యులను, చుట్టూ ఉన్న ప్రజలను చైతన్య పరచవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను” అంటూ ముగించేసరికి, హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.
ఆ ఉపన్యాసంతో సమన్విత అంటే ఏమిటో అందరికీ తెలిసివచ్చింది. దాంతో ఆమెకు ఎన్నో అవకాశాలు రావడంతో ఎందరినో చైతన్యపరిచే అవకాశం ఆమెకు వచ్చింది.
***
ఇంటి ముందు కారు ఆగిన శబ్దం విని, మొక్కలకు నీళ్ళు పోస్తున్న సుధాకర్ అటు వైపు చూసాడు. గేట్ తీస్తూ ఇద్దరు మనుషులు లోపలికి రావడం కనిపించింది. ‘ఇంత పొద్దునే ఎవరొచ్చారు?’ అనుకుంటూ పరికించి చూస్తే వాళ్లెవరో కొత్త వాళ్ళలా కనిపించారు. అయినా బక్క చిక్కిపోయిన విశ్వంని గుర్తుపట్టాడు.
“ఒరేయ్ విశ్వం నువ్వటరా..?” అని గట్టిగా అరుస్తూ, అతన్ని కౌగలించుకొని వలా వలా ఏడ్చేశాడు. విశ్వం కూడా ఏడుస్తూ అతన్ని పట్టుకొని వదల్లేదు చాలా సేపు. చాలా సేపటికిగానీ స్నేహితులను ఆవరించిన ఉద్వేగం వీడలేదు. అక్కడే ఫలహారం చేసాక, అందరూ కాకినాడకు బయల్దేరారు. దారంతా కబుర్లే. ఆ కబుర్లలో పడిన వాళ్ళిద్దరూ, ఆకాష్‌ని, సుధాకర్ భార్య లలితను పట్టించుకోనేలేదు. హాస్పటల్‌కి వెళ్ళాక, సుధాకర్‌ని విడిగా పిలిచి మైథిలిని గురించి అడిగాడు రహస్యంగా.
“మైథిలి గురించి అడుగుతావని అనుకున్నాను. తనతో మా సంబంధాలన్నీ దాదాపుగా తెగిపోయినట్లే. వాళ్ళ అత్తగారు గొప్ప గయ్యళి. తనను ఎక్కడకూ పంపేది కాదు. తనుండేది బొంబాయి కావడం వల్ల, మాకు కూడా చూసి రావడానికి అవకాశం ఉండేది కాదు. తన పెళ్ళయిన ఐదేళ్లకు, వాళ్ల నాన్న చనిపోయినప్పుడు వచ్చింది. అప్పుడు చూడటమే. ఆ తర్వాత చూడలేదు. పదేళ్ల క్రితం వాళ్ళు ఆస్ట్రేలియాలో సెటిల్ అయినట్లు తెలిసింది” అని చెప్పగానే, ‘అయ్యో ఈ జన్మకు మైథిలిని చూసే రాత లేదన్నమాట’ అనుకుని బాధపడ్డాడు విశ్వం.
***
మర్నాటికిగానీ కేన్సర్ విషయం తెలియలేదు సుధాకర్‌కి. ఆ విషయం తెలియగానే గుండెలు పిండినట్లయింది అతనికి. దుఖం తన్నుకొస్తుంటే, అతన్ని విశ్వం, ఆకాష్‌లే ఓదార్చవలసి వచ్చింది. తేరుకున్న సుధాకర్ అన్నాడు
“ఇది ఆఖరి దశకు వచ్చేసింది కాబట్టి, అమెరికా డాక్టర్లు సైతం చేతులేత్తేసారన్నమాట. ఆయుర్వేదంలో ప్రయత్నిస్తేనో?” అనగానే ఆకాష్ పెద్దగా నవ్వి, సర్దుకొని సారీ చెప్పాడు. సుధాకర్‌కి కోపం రాలేదు.
“ప్రయత్నం చేద్దామన్నాను. నయమవుతుంది అని చెప్పలేదు. ఎలాగూ ఆశ వదిలేసుకున్నాం. ఈ ప్రయత్నం చేస్తే తప్పేమిటి? కేరళలో నాకు ఈ విద్య నేర్పిన ‘సుచీంద్రన్’ అనే గురువుగారున్నారు. ఆయనకి ఆయుర్వేదంతో పాటూ ప్రకృతి వైద్యం వంటి ఇతర వైద్య విధానాలలో పరిజ్ఞానం ఉంది. ఆయన కొంతమందికి కేన్సర్ నయం చేయడం నాకు తెలుసు. ఆయనకు చూపిద్దాం. పేషెంట్ పరిస్థితి చూడగానే, ఆయన చికిత్స వల్ల ప్రయోజనం ఉంటుందో లేదో, ముందే చెప్పేస్తారు. ప్రయత్నం చేయడంలో నష్టమేముంది?” అని అనేసరికి. తండ్రీకొడుకులిద్దరూ అంగీకారం తెలిపారు.
ఆ మర్నాడు బాంబ్ పేల్చాడు విశ్వం.
“నాన్నా.. నువ్వు తిరిగి వెళ్లిపోరా. నేను ఇక్కడే వుంటాను. చివరి దశలోనయినా నా ప్రాణమిత్రుడితో కలిసిఉండే అవకాశం దొరికింది. ఇది నేను చేజార్చుకోదలుచుకోలేదు. వీడితో పాటూ కేరళ ఆశ్రమానికి వెళ్లి, నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. అదృష్టం బాగుండి, నయమయితే, అప్పడు నువ్వొచ్చి నన్ను తీసుకెళుదువి గాని. ఎంత కాలం నీ పనులన్నీ మానుకొని నా వెనుక తిరుగుతావు?” అంటూ. ఆ మాటలు వినగానే ఆకాష్‌కి మతిపోయింది. తండ్రిని విడిచి వెళ్లనని చిన్న పిల్లాడిలా గొడవ చేసాడు. అయినా విశ్వం తన మొండి పట్టు వదలలేదు. అతని తీరే అంత. సులువుగా ఏ నిర్ణయమూ తీసుకోడు. తీసుకున్నాక, ఆ నిర్ణయంలో మార్పు ఉండదు. ఆ విషయం స్పష్టంగా తెలిసినా, తండ్రితో పాటూ ఉండిపోవడానికి అతను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వికలమయిన మనస్సుతో, భారమైన గుండెలతో తండ్రిని సుధాకర్‌కి అప్పజెప్పి, వదల్లేక, వదల్లేక వెళ్ళాడు.
***
ఆ రాత్రంతా విశ్వానికి నిద్రపట్టలేదు. సుధాకర్‌తో గడిపిన మధురమయిన రోజులు గుర్తొచ్చాయి. వాటితో పాటూ మైథిలి జ్ఞాపకాలు కూడా మదిలో గిలిగింతలు పెట్టాయి. ఎంతో అందమయిన, అమాయకమైన ఆమె ముఖం గుర్తుకు రాగానే అతని మనసు పులకించిపోయింది. ‘చావనయినా చస్తాను గానీ, విశ్వం లేకుండా నేను బతకలేను’ అని ఆమె అన్నమాట పదే పదే గుర్తుకుచ్చేసరికి, అతనికి దుఃఖం ఆగలేదు. తనని వదులుకోకూడదని, ఆమె చేసిన ప్రయత్నాలన్నీ గుర్తొచ్చాయి. ‘తానే సాహసించి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయాడు’ అనుకోగానే అతని మనసంతా బాధతో నిండిపోయింది. అపరాధ భావన అతన్ని తొలిచేసింది. ఆ దుఖంతో అతను గిలగిలలాడిపోయాడు. తప్పు చేసానన్న భావన అతన్ని నిలువెల్లా దహించేస్తుంది. వెక్కి వెక్కి ఏడవడం తప్ప అతను ఏం చేయగలడు?
నాలుగురోజుల తర్వాత విశ్వంను తీసుకొని కేరళ ఆశ్రమానికి తీసుకెళ్ళాడు సుధాకర్. కేరళ రాష్ట్రంలో త్రిసూర్ జిల్లాలో ‘చాలకుడి’ అనే టౌన్‌కి, ప్రసిద్ధి చెందిన ‘అత్తిరాపల్లి’ జలపాతానికి మధ్యలో ఉంది సుచీ౦ద్రన్ ఆశ్రమం. సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల సదుపాయాలతో ఉన్న ప్రకృతి ఆశ్రమం అది. అక్కడ ప్రకృతి వైద్యమే కాక, అన్ని రకాల వైద్య సదుపాయాలూ అందుబాటులో ఉంటాయి. అవసరాన్ని బట్టి నిష్ణాతులు అయిన డాక్టర్లు అక్కడికి వచ్చి వైద్య సేవలు అందిస్తారు. అన్నిరకాల బడ్జెట్ లకు అనుగుణంగా అక్కడ నివాసపు ఏర్పాట్లు ఉంటాయి. క్రమశిక్షణకు, సుచికి, శుభ్రతకు అక్కడ ప్రాధాన్యత ఇస్తారు. కోలుకుంటున్న పేషెంట్లు తమంతట తామే, తోట పనిలోనూ, వంటపనిలోనూ సాయం చేస్తూ ఉంటారు.
అక్కడ చేరినవారు ఎల్లకాలమూ అక్కడే ఉండిపోవాలన్న౦త చక్కగా అక్కడి వాతావరణాన్ని తీర్చిదిద్దారు. నెలకొకసారయినా, ఆరోగ్యం కుదుట పడిన పేషెంట్లు అత్తిరాపల్లి జలపాతం దగ్గరకు వెళ్లి, ఒక పూట అయినా గడిపివస్తూ ఉంటారు.
విశ్వం, సుధాకర్ సుచీంద్రన్‌ని కలిసారు. తెల్లని గెడ్డంతో, మల్లెపూవులాంటి తెల్లని దుస్తుల్లో ఉన్న స్వామీజీని చూడగానే ఎవరికయినా గురుభావం కలుగుతుంది. చక్కగా నవ్వుతూ తెలుగులోనే ఆహ్వానం పలకడంతో ‘స్వామీజీకి తెలుగు వచ్చా?’ అనుకుంటూ ఆశ్చర్యపోయాడు విశ్వం. అది గమనించిన సుధాకర్ మెల్లగా అన్నాడు, “స్వామీజీకి పద్నాలుగు భాషలు వచ్చు” అని. విశ్వం ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు.
“సుధాకర్ ముందుగానే మీ గురించి అంతా చెప్పాడు. మీ ఫైల్ మా వాళ్లకు ఇచ్చి, మీకు కేటాయించిన కాటేజ్‌లో రెస్ట్ తీసుకోండి. ఆ ఫైల్ స్టడీ చేసాక మీతో మాట్లాడతాను. అప్పుడు ఏమి చెయ్యాలన్నది నిర్ణయిద్దాం” అనేసరికి, ఇద్దరూ సెలవు తీసుకొని బయటపడ్డారు.
మూడోరోజు స్వామీజీ నుంచి కబురు వచ్చింది. వైద్యం వల్ల ఫలితం ఉండొచ్చునని, కనీసం ఆరుమాసాలు ఆశ్రమంలో ఉండాల్సి వస్తుందని చెప్పారాయన. ఆ మాటలతో ఇద్దరి గుండెలు కుదుటబడ్డాయి. వారం రోజుల పాటూ విశ్వంతో పాటూ అక్కడుండి, తిరిగి వెళ్ళిపోయాడు సుధాకర్. ఆరునెలల పాటూ విశ్వంతో పాటూ ఉందామని గట్టి నిర్ణయం తీసేసుకున్నా, ఉప్పాడలో అతని వైద్యసేవలు అవసరం కాబట్టి, అతన్ని బాగా ఒత్తిడి చేసి, బలవంతాన పంపేశాడు విశ్వం.
ఆ ఆశ్రమం, అక్కడి సేవలు, సదుపాయాలూ అతనికి బాగా నచ్చాయి. రోజూ ఉదయం, సాయంత్రం ఆశ్రమమంతా కలియదిరగడం, అందరితోనూ కలివిడిగా ఉండడం అతనికి బాగా అలవాటయిపోయింది.
ఒకరోజు ఉదయం ఆశ్రమంలో నడుస్తున్న విశ్వం, తనకి కొద్ది దూరంలో సైక్లింగ్ చేస్తున్న ఒక లావుపాటి స్త్రీ, సైకిల్ మీదనుంచి కిందపడి, సహాయం కోసం అరవడంతో, విశ్వం వీలయినంత వేగంగా నడిచి, ఆమెను లేవదీయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. బరువుగా ఉన్న ఆమెను లేపడం అతని తరం కాలేదు. దెబ్బలు గట్టిగా తగిలినట్లున్నాయి. బాధ తట్టుకోలేక సహాయం కోసం అరుస్తుంటే, కొంతమంది వచ్చి, ఆమెను లేపి, పక్కనే ఉన్న బెంచీపై కూర్చోబెట్టారు. ఆమెను తేరపార చూస్తుండగా, “మైథిలీ..” అంటూ విశ్వం పెదాలు కదిలాయి. అంత బాధలోనూ మైథిలి, చిన్నగా నవ్వింది. “నువ్వే కదా? నువ్వు వాకింగ్ చేస్తున్నపుడు, రెండ్రోజులనుంచీ, నా రూంలోంచి చూస్తున్నాను.. నువ్వా కాదా? అని అనుమానపడుతూనే ఉన్నాను. ఎలా ఉన్నావు?” అంది అతని వైపు చూస్తూ. ఆమె మాటలు అతనిలో ఎంతో వేదనను నింపాయి. ‘ఎన్నో ఏళ్ల తర్వాత నన్ను చూసిన మైథిలి, నన్ను కలిసే ప్రయత్నం చేయకుండా ఉండిపోయిందంటే, ఆమె మనస్సులో నాకు ఏ స్థానమూ లేదన్నమాట’ అనుకోగానే అతను బాధతో విలవిల లాడాడు. అయితే అతని బాధను, ఫీలింగ్‌ని అణుచుకొని, మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో జీవం లేదు. “నువ్వు చాలా మారిపోయావు” అన్నాడు ఆమెను తదేకంగా చూస్తూ. “కొబ్బరి బొండాంలా అయ్యానని చెప్పు” అంటూ బిగ్గరగా నవ్వుతున్న మైథిలిని చూసి, ‘ఈమేనా? నాకు తెలిసిన మైథిలి?’ అనుకున్నాడు.
మైథిలికి ప్రథమ చికిత్స చేసాక, వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ మాటలను బట్టి, ఆమెలో శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా ఎంతో మార్పు వచ్చిందని గ్రహించాడు.
“ఏమిటి? అమెరికాలో పెద్ద పెద్ద డాక్టర్లు నయం చేయలేని, కేన్సర్ ఈ వైద్యంతో నయమవుతుందని, అక్కడినుంచి వచ్చేసావా? ఏదో నాలా లావయిపోయిన వారి బరువు తగ్గించగలరేమో గానీ, ఇలాంటి జబ్బులను నయం చేస్తారనే నమ్మకం నాకు లేదు. ఇప్పటికయినా మించిపోయింది లేదు. నీ కొడుకు దగ్గరకు వెళ్ళిపో. శేషజీవితం మీ వాళ్ళ దగ్గర గడుపు” అంటూ నిర్మొహమాటంగా సలహా ఇస్తున్న మైథిలిని చూస్తూ ఉండిపోయిన విశ్వానికి మతిపోయింది. ఆనాటి మైథిలి ఖచ్చితంగా ఇలా మాట్లాడదు. ఈమె దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఎంతసేపూ తన భర్త, పిల్లలు, తన ఐశ్వర్యమే గానీ, మరో ప్రపంచం తన మాటల్లో కనబడలేదు. ఎంతో విశాలమయిన వ్యక్తిత్వం గల ఆనాటి మైథిలికి, సంకుచిత మనస్తత్వం గల ఈమెకు ఏ కోశానా పోలికల్లేవు. ‘ఈమెకు అన్యాయం చేసానని ఇంత కాలం కుమిలిపోయానా? ఎంత పిచ్చివాణ్ణి?’ అనుకుంటూ, ఆమె వాగుడు పట్టించుకోకుండా ముందుకు సాగిపోయాడు. విశ్వాన్ని చూస్తూ, విస్తుపోయింది మైథిలి.
‘ఈ ఆశ్రమంకి వచ్చిన తర్వాత, రెండు చింతలు తీరిపోయాయి. మైథిలి గురించి తెలిసాక, మనసిప్పుడు ప్రశాంతంగా ఉంది. రెండో చింత కేన్సర్.. ఇక్కడి చికిత్స సత్ఫలితాలను ఇస్తుంది. దాని గురించి కూడా ఇప్పుడు చింతలేదు, భయమూ లేదు. కాలమే దానికి తగ్గ పరిష్కారం చూపించకపోదు’ అనుకుంటూ ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తున్న విశ్వం వైపు చూస్తూ, ‘నేను తప్పుగా మాట్లాడానా?’ అనుకుంటూ చాలా కాలం తర్వాత ఆత్మవిమర్శ చేసుకోవడం మొదలు పెట్టింది మైథిలి.
***
ప్రతిమ మరణం తథ్యమని తెలిసినా, ఆమె మరణం సమన్వితను బాగా కుంగదీసింది. సమన్వితలో నైరాశ్యం చోటుచేసుకుంది. ఆమెలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. ఆమె ఉపన్యాసాల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నా, ఆమెలో చలనం లేదు. ఆమెలో చోటుచేసుకున్న నిరాశ, నిస్పృహలను తొలగించాలని మిత్రులు ఎందరూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కానీ చిత్రంగా ఒక ఉత్తరం ఆమెలో కదలికను తెస్తుందని ఎవరూ ఊహించలేదు.
అసలు ఉత్తరాలే కరువయిన రోజుల్లో, పోస్ట్‌మాన్ అందించిన రిజిస్టర్డ్ కవర్ అందుకుంటూ ఆశ్చర్యపోయింది సమన్విత. దాని మీద ఉన్న అందమయిన చేతి వ్రాత ఎవరిదో ఆమె గుర్తుపట్టలేకపోయింది. గబ గబా కవరు చించగానే, తన పేరున రాసి ఉన్న లక్ష రూపాయిల చెక్కు చూడగానే, ఆమె అప్రతిభురాలయింది. వెంటనే కవరు మీద ఉన్న ఎడ్రస్, చెక్కు మీదున్న పేరు తిరిగి చదివి, అది తన కోసం పంపిన కవరే అని నిర్ధారణ చేసుకుని, ఉత్తరాన్ని ఆసక్తిగా చదవడం మొదలు పెట్టింది.
చిరంజీవి సమన్వితకు నా ఆశీస్సులు.
నా పేరు విశ్వం. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న నేను, చివరి ప్రయత్నంగా కేరళలో ఉన్న ఒక ప్రకృతి ఆశ్రమంలో చేరాను. నేనెవరో నీకు తెలియదు. కానీ మా ఆశ్రమంలోనే కేన్సర్ రోగుల స్వాంతన కోసం ఒక పేలియేషన్ సెంటర్ పెట్టడానికి వచ్చిన డాక్టర్ రోహిణి ద్వారా నీ గురించి చాలా తెలుసుకున్నాను. నువ్వు కేన్సర్ అవగాహన కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నావని ఆమె చెప్పారు. నువ్వు తయారు చేసిన కరపత్రాలు చదివి చాలా ఇంప్రెస్ అయ్యాను. మన్యంలో సైతం నువ్వు ఉపన్యాసాలు ఇచ్చావని తెలిసి ఆశ్చర్యపోయాను. నీ కథ విన్న తర్వాత నా మనసెంతో ఆర్ద్రమయింది. ప్రియాతి ప్రియమయిన కూతురిని, భర్తను, ప్రాణ స్నేహితురాలిని కోల్పోయినా చెక్కు చెదరని ధైర్యంతో నువ్వు చేస్తున్న ఒంటరి పోరాటానికి నా వంతు సాయం అందించాలని అనిపించింది. నాకు కూడా నీలాంటి కూతురు ఉంటే ఎంత బాగుండును? అన్న ఊహే నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అదృష్టం బాగుండి, కేన్సర్ రాకాసి కోరలనుంచి బయటపడితే, నా శేష జీవితమంతా నీతో పాటూ కేన్సర్ పోరాటంలో గడిపేయాలని ఆశపడుతున్నాను. ప్రతిమ మరణం నిన్ను నిరాశ, నిస్పృహల లోకి నెట్టేసిందని, మునుపటి ఉత్సాహం నీలో కొరవడిందని రోహిణి చెప్పారు. ఆ భావనను పూర్తిగా తుడిచేయి తల్లీ. నీ అవసరం ఈ సమాజానికి చాలా ఉంది. నా మాట మన్నించి ముందడుగు వెయ్యి. ఈ ఉత్తరంతో పాటూ పంపిన చెక్కు స్వీకరించి, నీ కార్యక్రమానికి ఉపయోగించవలసినదిగా కోరుతున్నాను.
దీవెనలతో.. విశ్వం
ఉత్తరం చదవడం పూర్తిచేసి, దీర్ఘంగా నిట్టూర్చింది. జారి పోతున్న తీగకు ఆలంబన దొరికినట్లయింది. విశ్వం మాటలు ఆమెను బాగా ప్రభావితం చేసాయి. ఆమెలో మునుపటి ఉత్సాహం మెల్ల మెల్లగా చోటుచేసుకోవడం మొదలయింది.
(సమాప్తం)
రచనా వ్యాసంగం 2015 నుంచి ప్రారంభం అయింది. మొదటి కథ ‘చిరునామా చేరని ఉత్తరం’ స్వాతి మాసపత్రిక లో ప్రచురించబడింది. అదే ఏడాది ఒక కథకు మూడో బహుమతిగా రంజనీ అవార్డ్, 2016 లో ‘డాక్టర్ సాబ్’ కథకు స్వాతి వారపత్రిక పోటీలో 10 వేల రూపాయల బహుమతి, తర్వాత సుకథ కథల పోటీలో మొదటి బహుమతి 15000 రూపాయలు, ఆ తర్వాత రమ్యభారతి కథల పోటీలో ప్రథమ బహుమతి.. ఇలా అనేక బహుమతులు లభించడమే కాక స్వాతి, ఈనాడు ఆదివారం అనుబంధం లో అనేక కథలు ప్రచురించబడ్డాయి. ఇప్పటివరకు 110 కి పైగా కథలు వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి.
2024లో నా కథ ‘Women’s Era’ అనే ప్రముఖ ఇంగ్లీష్ మేగజైన్ లో పబ్లిష్ అయినది.
నా నవల ‘ఎదురు లేని ఏడు’ కు ఆన్వీక్షికి సంస్థ ద్వారా 10 వేల రూపాయల బహుమతి లభించింది.
నా కథలు రెండు కన్నడంలో కి అనువాదం అయ్యాయి. వీటితో పాటు ఈనాడు లో ప్రచురితమైన ఏడు కథలు, బహుమతుల కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాయి.
నా విద్యార్హతలు – MSc, M.Phil.. Anakapalle AMAL. కాలేజీలో కెమిస్ట్రీ HOD గా 2011లో రిటైర్ అయినా స్థానిక డా. హిమశేఖర్ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫేకల్టీ గా పనిచేస్తూ, ఇప్పటివరకు కెమిస్ట్రీ పరిజ్ఞానం తో 251 కేన్సర్ అవగాహన సదస్సులు నిర్వహించాను. ఆ అవగాహన విస్తృత పరచడానికి కర్కాటకం నవల రాసాను.
3 ఏళ్ల క్రితం అనకాపల్లి తెలుగు భాషా పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 135 కార్యక్రమాలు చేసాను.
