[శ్రీ ఎన్. వి. హనుమంతరావు గారి ‘కర్మ Vs ఖర్మ’ అనే రచన అందిస్తున్నాము.]
జీవితంలో మనం పుట్టగానే ఏ ఏ పనులు చేయాలి, మన మరణం తో సహా అన్నీ భగవంతుడు ప్రోగ్రాం చేసి ఈ భూమి మీదకు పంపిస్తాడు. ఆ ప్రోగ్రాం ప్రకారం మన జీవితం గడుస్తుంది. దాన్నే కర్మ అనొచ్చు.
ఆ కర్మలు గతానివా లేదా వర్తమానానికి సంబంధించినవా అని తెలుసుకోవడం మనిషికి కొంచెం కష్టం.
భగవంతుడు మన జీవితాన్ని ప్రోగ్రాం చేసి ఈ భూమి మీదకు పంపిస్తాడు అని చెప్పుకున్నాం కదా. మరి అందరిని మంచి వాళ్ళు గాఈ భూమ్మీదకు పంపవచ్చు కదా. గత జన్మలోని నాలుగైదు ప్రధాన కర్మల ఆధారంగా వర్తమానంలో మన పుట్టుక ఉంటుంది. ఆ తరువాత మనం భూమి మీదకు వచ్చిన తర్వాత మంచి చెడు కర్మలను నిర్వర్తిస్తాము. భగవంతుడు అందరిని మంచిగానే సృష్టించి ఈ భూమి మీదకు పంపవచ్చు కదా. అవును నిజమే. కోటాను కోట్ల మందిని సృష్టించే క్రమంలో ఆయన బిజీగా ఉంటాడు. అందుకని ఇది కుదరదట. రైల్వే రిజర్వేషన్ లో మనం berth బుక్ చేసుకున్నట్లుగా, ఆయన కంప్యూటర్ లో మన కర్మలు సెలెక్ట్ చేయబడతాయి. మనిషి జన్మ ఎత్తక ముందు మనం చీమ, దోమ, పిపీలకం దగ్గరనుండి కొన్ని వేల జన్మలు ఎత్తి చివరకు విశిష్టమైన మానవజన్మను పొందుతాం.
అందుకే భగవంతుడు మొదటి మానవజన్మను మాత్రమే మంచి కర్మలతో ఈ భూమి మీదకు పంపిస్తాడు. ఆ తరువాత మన చేతులలో, చేతలలో భవిష్యత్తు ఉంటుంది. ఈ జీవితంలో భగవంతుడు నాకు ఎలాంటి
ప్రోగ్రాం రాశాడు. నన్ను నేను తెలుసుకోవాలి. నా గురించి నేను తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ తెలుసుకొని సత్కర్మలను ఆచరించాలి అంటే మన పెద్దలు కొన్ని మార్గాలు ఏర్పాటు చేశారు. మనకు మనం ఏది చేస్తే బాగుంటుంది అనుకుంటామో ఏం చేస్తే మనం ఆనందంగా ఉండగలం అనుకుంటామో అలా చేయడమే ఉత్తమం.
మన చుట్టూ రోజూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు ఉంటాయి. అలాగే మన మనసు లోపలి పొరల్లో ఎన్నో జ్ఞాపకాలు కూడా ఉంటాయి. వీటన్నిటికీ స్పందించకుండా ఉండటం మంచిది. మన చుట్టూ జరిగే అనేక విషయాలకు ప్రతిస్పందన ఉండకూడదు. నిజానికి వీటిని గుర్తించకుండా ఉంటే ‘కర్మ’ అనేది ఏర్పడదు. ఇలాంటి కర్మలు ఒకసారి ఏర్పడితే వాటినివదిలించుకోవడం కష్టం. వదిలించుకోవడానికి పడే శ్రమ ఇంకా ఎక్కువ. అందుకే అలాంటి వాటిని వదిలించుకునే విధంగా మన జీవితం ఉంటే బాగుంటుంది.
దూరదర్శన్ విశ్రాంత కార్యనిర్వాహణాధికారి
