Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆలోచించమంటూ, మంచి చెప్పే పుస్తకం ‘కశప-2’

[డా. బి.వి.ఎన్ స్వామి రచించిన ‘కశప-2’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

డా. బి.వి.ఎన్ స్వామి ప్రసిద్ధ కథకులు, కవి, పరిశోధకులు. ఆయన గతంలో, ఒక నీతి పద్యాన్ని ఏదైనా శతకం నుంచి తీసుకుని దానికి అనుగుణంగా కథ చెబుతూ కథా శతక పద్యం (క.శ.ప.) పేరిట ఒక సంపుటి వెలువరించారు. ఇటీవల ‘కశప’ 2వ సంపుటిని వెలువరించారు. ఈసారి కథా ఆయనదే, దాని సారాన్ని విశదీకరిస్తూ చెప్పే పద్యమూ ఆయనదే.

రచయితది బోధనారంగపు నేపథ్యం కాబట్టి ఈ పద్యాలను, కథలను పిల్లల వికాసానికి ఉద్దేశించి రచించారు. నైతిక విలువలను నేర్పుతూ, పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేందుకు ఉపకరించే కథలను, పద్యాలను అందించారు డా. స్వామి. ఈ సంపుటి లో ‘కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము’ అన్న మకుటంతో 108 తేటగీతి పద్యాలు, కథలు ఉన్నాయి.

ఈ కథలలో ‘బుంగి’ ప్రధాన పాత్ర. కొన్ని కథలలో బుంగి ఆడపిల్ల. కొన్ని కథల్లో మగపిల్లాడు. బుంగి నేపథ్యంగా వివిధ సామాజిక సమస్యలను కథలో ప్రస్తావిస్తూ, దానికి తగ్గ సూచనని పద్యంలో అందించారు రచయిత.

అభివృద్ధి పేరిట అడవుల్ని, ఆధునికత పేరిట గుట్టలని నాశనం చేసి పర్యావరణానికి చేటు చేస్తున్న వైనాన్ని మొదటి కథలో ప్రస్తావిస్తారు. “నీళ్ళు నీడాలు రాళ్ళును నికరముగను/మిగుల నీయక మనుజులు మింగివేయ/అడవులన్నియు అణగారె అవని లోన” అంటారు. చాలా సరళమైన పద్ధతిలో, సమాజంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని వివరించారు.

కాలక్రమంలో మనుషులలో మారిపోయి, పద్ధతులు మారిపోయి, మానవత్వం లోపించడాన్ని రెండవ కథలో చెప్పారు. “మనిషి మారుట తథ్యము మహిని యెపుడు/మార్పు వేగము కరుణను మంట గలిపె/మనిషి మరుగున పడిపోయె మమల లుడిగి/” అంటూ వాపోతారు.

ఒక కథలో బుంగి రాజకీయ నాయకుడవుతాడు. మొదట ఓడిపోతాడు. మరోసారి గెలుస్తాడు. ప్రజలకు ఎంతో కొంత మేలు చేద్దామని ప్రయత్నిస్తే, తోటి నేతలు పడనీయరు. చివరకు రాజకీయాల నుంచి తప్పుకుని వ్యాపారంలో రాణిస్తాడు. బీదాబిక్కీని ఆదుకుంటాడు. తనకి అబ్బని చదువుని అనాథ పిల్లలకు అందిస్తాడు. ‘ధనికుడిలా సంపాదించు, పేదగా బ్రతుకు’ అని తన జీవన విధానం ద్వారా పిల్లలకు చెప్తాడు.

ఒకరంటే ఒకరికి ప్రీతి కలగడం ఎంత అవసరమో చెప్తూ, “వ్యవస్థ లోను, మనిషిలోనూ ఎక్కువ చెడు ఎక్కకుండా జాగ్రత్త పడడమే ప్రతి వ్యక్తీ, సంస్థా చేయవలసింది” అంటాడు బుంగి. “కడుపు నిండని మనిషికి గడక కొరత/కూడు నెక్కువ మనిషికి కొరత నిదుర/రీతి తెలిసిన మనిషికి ప్రీతి కలుగు” అంటారు ఈ కథలో.

ఇంటిని, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఊరిని ఉద్ధరించడానికి పూనుకోవడం సమంజసం కాదని అంటారు రచయిత ఒక కథలో. తన తండ్రి చేసిన తప్పును బుంగి చేయడు.

మరో కథలో చిన్న పిల్లలు టీవీ అతిగా చూడద్దని, పిల్లలున్న ఇంట్లో టీవీ మూగబోవాలని చెప్తారు డా. స్వామి. “కాలహరణము మనిషిని కరగదీయు/మనిషి ముచ్చుగా మారును మరుపు వచ్చు/టీవి ఠీవిని మింగెను టెక్కులాడి” అని వ్యాఖ్యానిస్తారు.

మార్పు అనివార్యమనీ, అయితే దానికి మానవత్వం తాపడం మన పని అంటారు రచయిత. “మనసు తీర ముచ్చట్లు మమతను పెంచు/మార్పు మనిషికి తప్పక మంచి చేయు/మేలు కోసం మార్పును మలచవలయు” అంటూ మార్పు ఎలా ఉంటే బాగుంటుందో చెప్తారు.

సమాజంలో హింస ఏ రకంగా చెలరేగుతుందో అత్యంత ప్రతీకాత్మకంగా చెప్పారు రచయిత. “ఆధునికతకు రూపాలు అవని లోన/రకరకములుగ వర్ధిల్లె లజ్జ లేక/హింస చెలరేగె నెంతయో ఇజ్జగమున” అని వాపోయారు.

తండ్రిని రెండు రోజులుగా ఇంటికి రానీయకుండా ఆఫీసు పనుల మీద బయటే ఉంచేసిన తండ్రి పైఅధికారి మూర్ఖత్వాన్ని నిరసిస్తుంది బుంగి. “పరమ పిసినారి నడిగిన ఫలితమేమి?/శాంతి తొలగును లుబ్ధుడి శబ్దమిన్న/నీచుడని భూమి వాడిని నిలిపి తిట్టు” అంటూ మనుషుల్లో లోభిత్వాన్ని ఎండగడతారు.

ఎదుటివారేదో సుఖంగా ఉన్నారనీ, తమకు అటువంటి సౌకర్యాలు, వెసులుబాట్లు లేవని బాధపడద్దని ఓ కథలో మేక – ఎద్దు పోలిక ద్వారా చెప్తారు రచయిత. “చూసి పరుల యున్నతికి నసూయ పడకు/తనదు ధర్మము పాటించ తనకు మేలు/పరుల ధర్మము పాటింప పాడికాదు” అని అంటారు.

సమాజంలో వికృతాలు ఎక్కువైపోయి, పెద్దచిన్నా భేదాలు లేకుండా ఎవరిని పడితే వారిని అమర్యాదగా మాట్లాడడంలో, స్త్రీలని వేధించడం వంటివాటిని నిరసిస్తూ, ఒక కథలో, “కాని మనుషులు చేసిరి కలుషితముగ/మన్ననలు మరియాదలు మంట గలిసె/బడియును గుడియును మర్యాద వదిలివేసె” అని వేదనని వ్యక్తం చేస్తారు.

కొన్ని సార్లు మార్పుకి అంగీకరించాల్సిదేననీ, మారనంటే కుదరదని పేర్కొంటూ, “మారనంటేను కుదరదు మనిషి ముందు/మారిన మనిషి సుఖపడు మరల మరల/మార్పు భవితకు మేలు కూర్చునెపుడు” అని అన్నారు రచయిత.

బుంగిని బడిలో ఒక పిల్లాడు ఆటపట్టిస్తాడు, దాంతో ఇక బడికి వెళ్ళనని భీష్మించుకుని కూర్చుంటుంది. ఆమెకి నచ్చజెప్పి బడికి పంపుతారు. ఈ సందర్భంగా “ఎదుగు వారల లాగెడి ఎనుము జాతి/తనకు తానుగ చావుకు తావు నిచ్చు/మనిషి మర్మము కనుగొని మసలవలెను” అని చక్కని సూక్తిని అందించారు రచయిత.

అనవసరమైన భయాలకి లొంగి జీవితాన్ని ముగించుకోకూడదని హెచ్చరిస్తారు డా. స్వామి ఓ కథలో. “చిక్కిన మనసు సలుపుతు చితికి పోవు/చిన్నబోయిన మనుషుల చేవ చచ్చు/బతుకు రీతులు తెలిసిన బాగు బాగు” అంటారు.

స్పందించే హృదయమున్న మనిషిని కథ సంస్కరిస్తుందనీ, సమాజ మార్పుకు దోహద పడుతుందనీ చెబుతూ, “కథలు తెచ్చును మార్పును ఖచ్చితముగ/యెదుటి వారల మనసులు ఎరిగినంత/రీతి తెలిసిన కథనము రిత్త కాదు” అని అంటారు.

♧

పేరుకి బాలసాహిత్యమైనా, పెద్దలనూ ఆకట్టుకుంటుందీ పుస్తకం.  ఎందుకంటే ఇందులో పిల్లలకి ఉపకరించే మంచి మాటలు ఉన్నట్టే, సమాజంలోని అవకతవకలు, అర్థిక పరమైన వెతలు, క్రుంగుబాట్లు, నిస్సహాయతలు, జీవితంలో ఎదగాలన్న కాంక్షలు, అభివృద్ధి తలంపులు, పెడధోరణులపై నిశితమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇవి పెద్దలను ఆలోచింప చేస్తాయనడంలో సందేహం లేదు.

***

కశప-2 (కథ శతక పద్యం-2వ సంపుటం)
రచన: డా. బి.వి.ఎన్. స్వామి
ప్రచురణ: నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్
పేజీలు: 110
వెల: ₹ 125/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‌లైన్‌లో:
https://navatelanganabooks.com/book/kashapa-2-katha-shathaka-padhyam/

Exit mobile version