[శ్రీ పొన్నాడ సత్యప్రకాశరావు రచించిన ‘కష్టమే అదృష్టం’ అనే రచనని అందిస్తున్నాము.]
అదృష్టం.. ఈ మాటంటేనే పడదు కొందరికి. చాదస్తం, వెనుకబడినతనం, పలాయనవాదం ఇలా ప్రతికూల దృక్పథానికి చెందిన అంశంలా కనిపిస్తుంది చాలా మందికి. విజయానికి కావాల్సింది కృషియే కాని అదృష్టం కాదని ఛాందసులు తెలుసుకోవాలని అభ్యుదయవాదుల సూచన. అయితే వారు కొత్తగా చెప్పేదేముంది కష్టేఫలి అనే ధోరణి ముందు నుంచి వున్నదేగా. విజయానికి కఠోర పరిశ్రమే సరైన తిరుగులేని మార్గమని సనాతన వాదం స్పష్టంగా చెబుతొంది. అయితే అదృష్టాన్ని కొట్టివెయ్యదు. నీవు చేయవలసిన కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించకు అనేగా గీతాకారుడి సందేశం.
కర్మ అంటే పనేగా. అదృష్టాన్ని నమ్ముకొని కూర్చోమని ఎక్కడా చెప్పబడలేదు. అసలు అదృష్టం అనే పదం ఎలా పుట్టింది అంటే.. పని చెయ్యమన్నారు కదా అని పనిచేస్తారు.. కానీ ఆశించిన ఫలితం రాకపోయేసరికి కుదేలయి పోవడం చాల మంది చేసేది. సరిగ్గా అదే సమయంలో అదే పనిని తమంతగా శ్రమించకుండా ఆషామాషీగా చేసిన వాళ్లకు విజయం వరించడం చూసి ఆ బలహీన క్షణంలో కర్మదేముంది అంతా అదృష్టం చేతిలోనే వుంది అనుకోవడం కూడా కద్దు. అక్కడే ఆ బలహీన క్షణాలను తమకు అనుకూలంగా వాడుకోవాలని చూసే దొంగ సాధువులు రంగ ప్రవేశం చేస్తారు. అదృష్టం తలుపు తట్టే మంత్ర యంత్ర తంత్రాలన్నింటిని బయటికి తీస్తారు. ఓ తాయెత్తు కట్టగానే లేదా ఓ పూర్ణాహుతి చెయ్యగానే అంతకు ముందు ఎంత శ్రమించిన రాని ఫలితం రావడం కూడా కొన్ని సందర్భాలలో జరుగుతుంది.
కృషిని నమ్ముకొని పైకొచ్చిన వాడు కష్టాన్ని ఎంతగా విశ్వసిస్తాడో, ఉంగరాలు తాయెత్తులు కట్టుకొని పైకొచ్చినవాడు కూడా అంత కన్నా ఎక్కువ గాఢంగా అదృష్టాన్ని నమ్ముతాడు. కష్టపడినా మంత్ర తంత్రాలు ప్రయోగించినా పైకి రాలేని వాడు ముందు దేవుడిని తరువాత సమాజాన్ని తిడుతు, నిరాశావాదంలో మునిగిపోతాడు
***
ఇక్కడ ముఖ్యంగా గమనించ వలసిన విషయం ఏమిటంటే కష్టపడి పైకొచ్చిన వాడు, కష్టపడకుండా పైకొచ్చిన వాడు, కష్టం ఫలించక ఉంగరాలతో పైకి వచ్చినవాడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నట్లుగా పడివున్నవాడు.. వీరందరూ వారి వారి తీవ్రమైన అనుభవాలు కల్పించిన సిద్ధాంతాలకే కట్టుబడి ఉండిపోతారు. ఇతరులు ఎప్పుడూ చూసేదీ మెచ్చేదీ విజయాన్నే.. కష్టపడి పైకొచ్చినవాడి విజయ గాథలకి చప్పట్లు కొడతారు గాని అనుసరించడానికి మొగ్గు చూపరు. తంతే బూరెల గంపలో పడినవాడి అదృష్టమే ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. ఆ అదృష్టం కోసం ఎంత వ్యయప్రయాసలకైనా వెనుకాడరు. అయితే ఈ వెంపర్లాట వలన వెంపర్లాడే వాళ్లే కాదు వెరసి సనాతన వాదమే విమర్శలకు గురి అవుతోంది.
సనాతన ధర్మంలో కీలకమైన అంశం కర్మసిద్ధాంతం. మరి కర్మ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు మరలా అదృష్టం అనే భావనను ఎందుకు కలుగ చేశారు.. ఎప్పుడైతే విజయ సాధనకి అదృష్టం కూడా ఒక మార్గం అనిపిస్తే సహజంగా ఎక్కువ మంది అటువైపే మళ్లుతారుగా. అసలు అదృష్టమనే భావనే, ఛాందసమని అభ్యుదయవాదుల అభిమతం.
పైపైనే చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది కూడా.
ఇక్కడ అందరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే అదృష్టం అనే ప్రబలమైన అంశం చాదస్తంగా పరిగణించబడుతోందంటే కేవలం అవగాహనా రాహిత్యమే అవుతుంది. అదృష్టం అంటే నీవు గతంలో చేసిన మంచి పని తాలూకా ఫలితమే కానీ వేరేమీ కాదు. అదృష్టం కూడా కర్మకి సంభదించినదే. గతంలో స్వయంగా నీవే చేసిన ఓ సత్కర్మ తాలూకా ఫలితమే ఆ అదృష్టం. ఆ గతం నిన్న కావొచ్చు క్రిందటి జన్మ కావొచ్చు. పూర్వ జన్మ సుకృతం అంటారుగా. సుకృతం అంటే చేసిన మంచిపని తాలూకా మంచి ఫలితమన్నమాట.. అంతేగాని అదృష్టమనేది ఆయాచితంగా లభించింది కాదు. ఆలా కనిపిస్తుంది అంతే. ఇలా అంటే ఆధునికులు అనుకునేవాళ్లు ఇక్కడ అసలు వున్నది ఒక జన్మే గత జన్మ మరు జన్మలు లేనే లేవు, కాబట్టి ఎప్పుడో చేసిన పని ఇప్పుడు ఫలించటం అనేది మరొక చాదస్తపు ఆలోచన అని దుయ్యబడతారు. గతంలో ఈ విధంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని తన ఎదుటే ఎద్దేవా చేసిన ఓ పాశ్చత్యుణ్ణి తన తర్కంతో నివ్వెరపరిచారు కంచి పరమాచార్యుల వారు. ఒకే ఆసుపత్రిలో ఒకే సమయంలో పుట్టిన పిల్లలు ఒకేలా ఉండకుండా వివిధ సామాజిక, ఆర్థిక పరిస్థితులలో ఉండడానికి కారణం ఆ పసికందుల గతజన్మల పాపపుణ్యాలు తప్ప వేరే కారణం చూపించగలరా అని అడిగితే ఆ పాశ్చాత్యుడు తల వంచక తప్పలేదు. అతడికి ఎంత ఆలోచించినా ఒకే సమయంలో పుట్టిన పిల్లలు పలు రకాలుగా ఉండటానికి ఆధునిక శాస్త్రంలో జవాబు దొరకలేదు. ఆరోగ్యం విషయంలో తల్లితండ్రుల జీన్స్ కారణమనుకొన్నా అంతస్తులకి సమాధానం లేదు..
ఈ సందర్భంలో ఒక విచిత్ర సంఘటనని గుర్తు చేసుకోవాలి.. ఒకసారి తెల్లగా వుండే దంపతులకి నల్లగా వుండే పిల్లవాడు పుడతాడు. ఇంట్లో పనివాడు నల్లవాడు కావడంతో భార్యని అనుమానిస్తాడు భర్త.. భార్య తాను ఏ తప్పు చేయలేదని వేడుకొంటుంది. తగువు పెద్దల వరకు వెడుతుంది.. విషయం తెలుసుకొన్న ఓ వృద్ధ బంధువు ఆ భర్త ముత్తాత నల్లగా వుండే వాడని ఆ పోలిక వచ్చి ఉంటుందని భార్యకు మద్దతుగా నిలుస్తాడు. వైజ్ఞానికులు కూడా ముత్తాత జీన్స్ కారణంగా ఆ పిల్లవాడు నల్లగా వుండే అవకాశాలున్నాయని ఒప్పుకొంటారు. ఒక వ్యక్తి డి.ఎన్.ఏ తరువాత తరాలలోను పూర్తిగా కాకపోయినా కొంత శాతం ఉంటుందని శాస్త్రజ్ఞులు కూడా అంగీకరిస్తున్నారు.. అందుకే పెళ్లిళ్ల విషయంలో ఏడూ తరాల లక్షణాలు పరిశీలించాలని పెద్దల ఉవాచ.
అదే విధంగా మనం చేసిన పని యొక్క ఫలితం ఒక్కోసారి వెంటనే మన కళ్ళకు కనబడక పోయినా ఆ పని ఫలితం ప్రభావంవెంటనే చూపిస్తుంది. ఆ మంచి ఫలితం ముందుగా మనం మోస్తున్న పాప భారాన్ని తగ్గించడడానికి వాడబడుతోంది. ఆ పాప రాశి తొలగగానే మంచి పని తాలూకా ఫలితాలు కనబడుతూ ఉంటాయి. ఈ కారణం వలెనే కొంతమందికి కష్టానికి తగిన ఫలితం వెంటనే, మరికొంత మందికి చాలా ఆలస్యంగానూ గోచరమవుతువుండటం జరుగుతుంటుంది. కొంతమందికి చాలా సులువుగా అనుకొన్న పనులు జరిగిపోతు ఉంటాయి. అంటే అతడికి గతంలో కర్మల తాలూకా పుణ్యం అతడి పాపాలని కడిగేసాకా కూడా కొంత మిగులు ఉందన్న మాట. ‘కాలం కలిసి రావడం’ అంటే అదే. ఏ కర్మ ఎప్పుడు ఫలిస్తుందో చెప్పడం కష్టం.
అందుకే ఆశించిన ఫలితం రాక పోయినా ప్రతికూల ఫలితాలు ఎదురైనా నీ కర్తవ్యం మానకూడదనే కదా పదేపదే గీత చెబుతోంది. ఫలితం రాలేదు అంటే ఫలితం కలగలేదు అని కాదు అర్థం. తెలిసి మంచి పని చేసినా తెలియక చెడ్డ పని చేసినా ఆ కర్మ ఫలం నీ ఖాతాకే జమ వేయబడుతుంది.. లాభ నష్టాల ఖాతా వలెనె పాప పుణ్యాల చిట్టా కూడా ఉంటుంది.. ఫలితం ఆలస్యమైనా రాక మానదు. ఆవు దూడ ఎలాగయితే వందల ఆవుల మధ్యలో వున్నా తన తల్లిని ఎలా చేరుకొంటుందో అలాగే నీ కర్మఫలం నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఏ రూపంలో వున్నా నిన్నే చేరుకొంటుంది, ఇది తధ్యం. మంచి కర్మ తాలూకా ఫలితమే అదృష్టం రూపంలో నిన్ను వరిస్తుంది. దుష్కర్మ తాలూకా ఫలమైతే దురదృష్టం రూపంలో వేధిస్తుంది.
అందుకే మంచి పనులు చేసుకొంటూపోతే వెంటనే ఫలితం రాకపోయినా ఆ సత్కర్మ తాలూకా ఫలితం నీ పాపాన్ని మాఫీ చేసి కొంతకాలం తరువాత అదృష్టం రూపంలో నిన్ను వరించొచ్చు. నీవి ఆర్థిక సంవత్సరాల లెక్కలయితే ఆ విధాతవి జన్మ జన్మల లెక్కలు. ఆ పాపపుణ్యాల నికర ఫలితం ప్రకారమే నీ జీవనయానం ఒక్కోసారి ఉజ్వలంగా మరోకసారి పేలవంగాను ఉంటుందని గ్రహించి ఫలితాలు ఎలావున్నా ముందుకు సాగిపోవడమే అసలు సిసలైన కర్మ అని తెలుసుకోవాలి.. ఆచరించాలి. నీ పరిస్థితి మెరుగు పడుతుంటే మంచిరోజులు వచ్చాయనుకొంటారు. పరిస్థితి మెరుగుపడటానికి నీవు చేసిన కర్మ ఫలితమే తప్ప వేరేమి కాదు. అది ఎప్పుడు చేసావు ఏ జన్మలో చేసావు అనేదానికి అంత ప్రాముఖ్యం లేదు. భూతకాలంలో జరిగిపోయిన దానిని నీవు మార్చలేవు, తెలుసుకొని ఏమీ చేయలేవు. దాని కర్మ ఫలం నీవు అనుభవిస్తూ ఉంటావు కూడా. ఆ ఫలం అదృష్టం కావొచ్చు దురదృష్టం కూడా కావొచ్చు. అంటే అదృష్టమైనా దురదృష్టమైనా అది నీవు గతంలో చేసిన మంచి లేదా చెడ్డ పని తాలూకా ఫలితమే. అందుకే ఫలితం కోసం చూడకుండా మంచి కర్మలు చేసుకొంటూ సాగి పోవడమే మనిషి చేయవలసినది. మంచి కర్మ తాలూకా ఫలితం అదృష్టం రూపంలో ఆలస్యమైనా నిన్నే చేరుతుంది.. ఇది తథ్యం.
పొన్నాడ సత్య ప్రకాశ రావు కథకులు, కవి. వీరివి ఇప్పటి వరకు 1 నవల, 4 ధారావాహికలు, 78 కథలు, 150 కి పైగా కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడినవి. వీరి నవల ‘ఊరు పొమ్మటోoది’ 2002 సంవత్సరం స్వాతి మాస పత్రిక అనిల్ అవార్డును,. మరి పది కథలు వివిధ పోటీలలో బహుమతులు ను గెలుచుకొన్నవి. వీరి నవలను సాహితీ ప్రచురణల వారు విజయవాడ, కథల సంపుటాన్ని చినుకు ప్రచురణల వారు విడుదల చేసారు .వీరికి విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్, ఎలకుర్రు వారు 2023 సంవత్సరానికి ‘విశ్వదాత’ దేశోద్దారక నాగేశ్వర రావు పురస్కారాన్ని అందచేశారు.
