Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథా సోపానములు-4

డా. బి.వి.ఎన్. స్వామి ‘కథా సోపానములు’ అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘సంఘటన – సన్నివేశం’ ఎంత అవసరమో వివరిస్తుంది.

సంఘటన-సన్నివేశము

యువకుడొకడు ఆత్మహత్య చేసుకోవడానికి సముద్రంలోకి వెళుతున్నాడు. “అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏదీ తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అదియే ధీర గుణం” అనే పాట అతనికి వినపడింది. ఆలోచనలో పడ్డాడు. ఆత్మహత్యా ప్రయత్నం విరమించి వెనిక్కి వెళ్ళిండు.

యువకుడు, సముద్రతీరం, ఇవన్నీ కలిస్తే సన్నివేశం. పాట వినపడటం సంఘటన. ఆత్మహత్య విరమించుకోవడం పర్యవసానం. సంఘటనలకు ఫలితాలుంటవి. కేవలం సన్నివేశాలకు ఫలితాలుండవు. పాట వినపడటం అభౌతిక సంఘటన.

“ఎన్నో ఏళ్ళ నుండి తను ప్రేమిస్తున్న యువతి వద్దకు వెళ్ళిండు. ఇతణ్ణి చూసి పనిలో పడింది. ఆ రోజు ఏదో ఒకటి తేల్చుకోవాలనుకున్నడు. ‘నీవు లేంది బ్రతక లేన’న్నడు. ఇలాంటి మాటల్ని అనేక సార్లు విన్న ఆమె లేచి అతని చెంపచెళ్ళు మనిపించింది. అప్పటికే అసహనంతో ఉన్న అతడు, ఆమెపై కత్తితో దాడి చేసిండు.”

అతను, ఆమె, పని ప్రదేశం, సంభాషణ ఇదంతా సన్నివేశం. “చెంప చెళ్ళుమనడం సంఘటన”, “కత్తితో దాడి” దానికి పర్యవసానం. ఇందులో భౌతిక సంఘటన ఉంది. భౌతిక, అభౌతికాలతో సంబంధం లేకుండా సంఘటనకు పర్యవసానం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి దీనికి మినహాయింపులూ ఉంటాయి.

జీవితంలో “చర్య-ప్రతిచర్య” అనేవి తప్పవు. జీవిత గమ్యానికి ఇవి చోదక శక్తులుగా ఉంటాయి. జీవితాల్ని ప్రతిబింబించేదే కథ. అందులో ఇవి సంఘటన రూపంలో తారసిల్లుతుంటవి. సంఘటన ప్రధానమైనది కథ. సంఘటనలో ఎంతో కొంత ఘర్షణ తప్పదు. దానివల్ల కథ ముందుకెళుతుంది. ఘర్షణ మనుషుల మధ్యే కాదు, ప్రకృతికి మనిషికి, జంతువుకు మనిషికీ మధ్య కూడా జరగవచ్చు. సన్నివేశం వంటపాత్ర అయితే, సంఘటన అందులో వుండే వంటకం. ఈ రెండు కూడా కథకు ప్రాణాధారాలే. సంఘటనకు ముందున్న సన్నివేశం, సంఘటన జరిగాక మారే అవకాశం ఉంది. ఒక్కోసారి సన్నివేశమే సంఘటనకు కారకం అవుతుంది. రెండు వైరి వర్గాలు అనుకోకుండా ఒక దగ్గర చేరినా, కావాలని చేరినా సంఘటన జరగక తప్పదు. సన్నివేశ కల్పన, అందులోకి సంఘటన చొప్పించే విధము, అత్యంత సహజంగా జరగాలి. అట్లా జరగకపోతే కట్టుకథ అని పెదవి విరుస్తరు. కథలో కల్పన అనివార్యం. వాస్తవిక కల్పనలు ఆమోదం పొందుతాయి. అభూత కల్పనలు వినోదాత్మకాలు. వాస్తవిక కల్పనలపై ఆధారపడి సన్నివేశాల్ని, సంఘటనల్ని సృష్టించాలి. జీవితంలో యాదృచ్ఛిక సంఘటనలు కూడా జరుగుతాయి. అలాంటి వాటిని కథలో ప్రవేశపెట్టవచ్చు. ఆ పని చేసేటప్పుడు జాగరూకతగా ఉండాలి. లేకపోతే అపనిందల పాలు కావలసివస్తుంది. ఎక్కువగా యాదృచ్ఛిక సంఘటనలపై ఆధారపడి కథలు రాస్తే పాఠకుల నమ్మకం కోల్పోవాల్సి వస్తుంది. సన్నివేశం-సంఘటన-ఫలితం ఈ మూడు పరస్పరాధారితాలు. కథలో ప్రధాన సంఘటన ఒకటే ఉంటే మంచిది. మిగతా చిన్నచిన్న ఘటనలు ఉన్నా ఫరవాలేదు. సన్నివేశం, సంఘటన ఈ రెంటిలో ఏది ముందు, ఏది తరువాత అనే దానికి కథకుడి ఇష్టం కారణమైతది. మంచి కథకు సంఘటన ప్రాణం లాంటిది. అది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

కథ ముందుకు కదలడానికి దోహదపడే వాతావరణాన్ని, పరిసరాల్ని, వర్ణనల్ని, పాత్రల్ని, నేపథ్యాల్ని సన్నివేశం కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒక సన్నివేశంలో ఏయే పాళ్ళలో ఉండాలో కథా వస్తువు నిర్దేశిస్తుంది. రచయిత కథన నైపుణ్యంతో అది వర్దిల్లుతుంది. కథలోని మలుపుకు సన్నివేశం, నేపథ్యంగా నిలుస్తుంది. సంఘటన కథావేగాన్ని పెంచుతుంది. అగ్గిపెట్టెలో అగ్గి పుల్లలు ఏ విధంగా ఇమిడిపోయి ఉంటయో సన్నివేశంలో సంఘటన అలా ఇమిడి ఉండాలి. అలాంటి ఐక్యత కథకు శోభను చేకూర్చుతుంది.

కథలో సంఘర్షణ అనేక రూపాల్లో చోటుచేసుకుంటుంది. వ్యక్తి అంతరంగ ఘర్షణ, వ్యక్తుల మధ్య ఘర్షణ, రెండు భావాల మధ్య ఘర్షణ, ప్రకృతికి మనిషికి మధ్య ఘర్షణ, తాత్విక దృక్పథాల మధ్య ఘర్షణ, స్త్రీ పురుషుల మధ్య ఘర్షణ ఇలా రకరకాలుగా ఘర్షణ మానవజీవితంలో కనపడుతుంది. అదంతా కథలో సంఘటనాత్మకంగా, సన్నివేశ పరంగా పండుతుంది. ఈ క్రమంలో పాత్రలు గుణాత్మక మార్పులకు, కథ మలుపులకు గురి అవుతుంది.

సన్నివేశం-ఉదాహరణ:

“లీనా జబ్బుపడిన వారం రోజులకు, ఎల్లా ఇంటికొస్తున్న పాలబండి వాడికి చక్రాల కింద ఏదో నలిగినట్టనిపించింది. కిందికి దిగి చూస్తే పారాఫిన్ డబ్బా కనిపిం చింది. అందులోంచి ఏదో ఆకారం బయటికి సాగినట్టుగా ఉంది. బండి డ్రైవర్ చార్లీకి చదువురాదు. పెద్ద తెలివితేటలూ లేవు. ఏ విషయమూ త్వరగా అర్థం చేసుకోలేడు. “డబ్బా ఖాళీగా లేదే” అనుకున్నాడు. అది బోర్లాపడివుంది. నీలిరంగు గుడ్డలో చుట్టి పడేశారెవరో, కాలితో తన్ని చూశాడు. అందులోంచి పిండం బైటికొచ్చింది. తల కనిపిస్తోంది. బ్లూ సాటిన్ నైట్ గౌనులోచుట్టి ఉంది శరీరం.

శిశువు ఇంకా బతికి వుందనే అనుకున్నాడు చార్లీ. కడుపులో తిప్పినట్లైంది. చాలా చిన్న శరీరం. పిల్లి పిల్లంత ఉంది. అతడు చదువగలిగితే ఆ గౌను మీద “E. Plasto” అని పేరు కుట్టి ఉందని తెలిసేది.

దక్షిణాఫ్రికా రచయిత్రి నదీన్ గార్డిమర్ రాసిన కథకు తెలుగు అనువాదం. “మనిషి-పనిమనిషి” పై సన్నివేశాన్ని కథ మధ్యన ప్రవేశపెట్టింది రచయిత్రి. ఈ సన్నివేశానికి ముందు ఒక రోజు పని మానేసిన, పనిమనిషి గురించి చిత్రించింది. ఈ సన్నివేశం తర్వాత పోలీస్ స్టేషన్, కోర్టు దృశ్యాలు కనపడతాయి. కథ వాటివరకు వెళ్ళడానికి సన్నివేశం దోహదపడింది. “బ్లూ సాటిన్ నైట్ గౌన్”, “E. Plasto” అని కుట్టి ఉన్న గౌను కథకు చోదక శక్తులు. సన్నివేశం వల్ల కథ కొనసాగాలి. అందుకు ఉదాహరణగా ఇది నిలుస్తుంది.

సంఘటన-ఉదాహరణ:

కథలో సంఘటనకు ప్రాధాన్యత ఉంటుంది. అది కథను మలుపు తిప్పవచ్చు. ముందుకు కదిలించవచ్చు. కథ కొనసాగడానికి సంఘటన దోహదపడుతుంది.

స్వీడన్ రచయిత్రి సెల్మా లాయర్లాప్ రాసిన కథకు తెలుగు అనువాదం “గోస్టా బెర్లింగ్స్ సాగా”. ఇందులో గోస్టా బెర్లింగ్ అనే వాడికి మార్గారెటా అనే ఆవిడ తన ఎకెబీ ఎస్టేట్‌లో వసతి కల్పించడంతో కథ మొదలవుతుంది. ఎకెబీ ఎస్టేట్‌లో దాదాపు డజనుమంది నిరాశ్రితులకు నీడ దొరుకుతుంది. కథ మధ్యలో ఒక సంఘటన ఉంది.

“సంతోషంగా ఉన్న ఈ డజను మందిని చూసి సైతానుకు కన్ను కుట్టింది. యజమానురాలికి వీళ్ళకూ మధ్య చిచ్చు పెట్టాలనుకున్నాడు. కొంతకాలం క్రితం, మార్గారెటా, తల్లిదండ్రుల బలవంతంతో, తన ఇష్టానికి వ్యతిరేకంగా మేజర్ సాంజె లియస్‌ను పెళ్ళాడింది. నిజానికి ఆమె మరొకర్ని ఇష్టపడింది. అందువల్ల ఇలా చెయ్యవలసి వచ్చినందుకు, తనను తాను అసహ్యించుకుంటున్న మార్గరెటాలో తల్లి పట్ల ద్వేషం పెరిగింది. ఒకసారి, తల్లి ఇంటికి వస్తే మర్యాదలు చేసింది. కానీ అపరిచితురాలిగానే ఆమెను దూరంగా ఉంచింది.

కోపగించిన తల్లి “త్వరలో ఎకేబీకి నువ్వు దూరమవుతావు” అంటూ శపించింది. ఈ శాపాన్ని నిజం చెయ్యాలనుకున్నాడు సైతాను.”

పై పేరాలో బలవంతపు పెళ్ళి ఒక సంఘటన. అది తల్లి, బిడ్డల మధ్య సంఘర్షణను సృష్టించింది. తల్లి, బిడ్డను శపించడం వల్ల కథ మలుపు తిరిగింది, కొనసాగింది.

(మరోసారి మరో అంశంతో)

Exit mobile version