ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో కథావిస్తృతికి విస్తారమైన కృషి జరుగుతున్నది. అనంతమైన వస్తు వైవిధ్యం గోచరిస్తోంది. ఇంతకు పూర్వం కథల్లోకి రాని మనిషి బ్రతుకు పార్శ్వాలు ఈనాటి ఇతివృత్తాల్లో చోటు చేసుకుంటున్నాయి. దీనికి గల వివిధ కారణాల్లో ఒకటి-ఈనాటి కథకులు-భిన్న వర్గాల నుండి, భిన్న వృత్తి, ప్రవృత్తి మార్గాల నుండి వచ్చిన వారు కావటం. వీరంతా మానవ సంబంధాల్లోనూ, సామాజిక జీవనంలోనూ వచ్చిన, వస్తున్న పరిణామాల్ని-స్వానుభవం కల్పిస్తున్న అదనపు సాధనంతో-గాఢంగా ఆవిష్కరిస్తున్నారు. సంక్షోభిత సమాజంలో మనిషి జీవనంమీద వివిధ వ్యవస్థల ప్రభావాల్ని లోతైన అవగాహనతో, అధ్యయనంతో, పరిశీలనతో ఆవిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కథానికల్లో స్థానికత అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
కథానికలో వస్తువు-స్థలానికి సంబంధించిన విలక్షణత మీద ఆధారపడి ఆ స్థల నేపథ్య చిత్రణ అనివార్యమైనప్పుడు స్థానికత ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఉదాహరణకు రాయలసీమలో ఒకచోట ఫాక్షన్ రాజకీయాల చిత్రణే ఇతివృత్తమైన కథలో స్థానికత ఆవశ్యకత వుంటుంది. అలాగే, అక్కడి కరువు, అనావృష్టి, నీటి ఎద్దడి వంటి సమస్యల చిత్రణే కథానికకి ఆధారబిందువు అయితే అప్పుడు స్థానీయత అవసరం అవుతుంది. తెలంగాణలో ఏ బొగ్గుబాయి ప్రాంతపు కథో ఇతివృత్తంగా ఉంటే ఆ స్థలం దాని వాతావరణం అవసరం అవుతాయి. కోస్తాలో ఏ రొయ్యల చెరువు అవస్థో ఇతివృత్తం అయితే ఆ ప్రదేశం ప్రాముఖ్యత కథాగతం అవుతుంది. ఒక్కొక్కప్పుడు ఆ స్థలమే ఒక పాత్ర కూడా కావచ్చు. అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి ప్రముఖుల కథల ద్వారా ఈ అంశం లోతునీ, వైశాల్యాన్ని విశ్లేషించుకోవచ్చు. వైశాల్యం అనేసరికి అంబళ్ల జనార్ధన్ గారి ‘వైశాల్యం’ కథే గుర్తుకొస్తున్నది. అది బొంబాయి స్థల కాలనేపథ్యంతో ఉండటమే కాక-ఉన్నత మానవీయ విలువల పరిరక్షణ ఆవశ్యకతనీ చెబుతుంది. ‘నగరపు నాగుపాము’ అని ప్రభాకర్ జైనీ- ‘జనగాం’ పట్టణీకరణం, దాని ప్రభావం గురించి మంచి కథ రాశారు. కూతురు రాంరెడ్డి గారి ‘సర్వే నం. 321’ ఉన్నది. అది ఘట్‌కేసర్ దగ్గర స్థలం. ఆ కథ మరీ అక్కడే జరుగుతుంది. ఆనాటి మునిపల్లె రాజుగారి కథ ‘బిచ్చగాళ్ళ జెండా’ పూనేలోనే జరిగింది. ఇంద్రగంటి వారి ‘గౌతమి గాథలు’ గౌతమి దరినే నడుస్తాయి కదా! అలాగే ‘అమరావతి’ కథలు వంటివి అలా వచ్చిన ‘పిల్ల వసు చరిత్రలు’ అనేకం ఉన్నైకదా – అవన్నీ కూడా స్థానికతకి పట్టంకట్టిన కథలే. ఆ మధ్య ఎమ్వీ రామిరెడ్డి ‘సుమిధ’ అని చాలా చిన్న కథని చాలా శక్తివంతంగా చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని రాకతో ఉపాధి కూలిపని కోల్పోయి గచ్‌బౌలీ చేరిన ఒక ‘ఏసుపాదం’ కథ. స్థల కాలాల ఐక్యతని కేంద్రకం చేసుకుని మంచి కథని రాశారు. మేడారం జాతర గాథని వస్తువుగా చేసుకొని ఇతివృత్తంలో సున్నితమైన మనస్తాత్విక అంశాల్ని జోడించి, విజ్ఞాన భూమికల్ని పాత్రలమయం చేస్తూ-ఒక ‘నభూతో’ అనవలసిన గొప్ప కథ రాశారు రామాచంద్రమౌళి. దానిపేరు ‘భరిణె!’ కథానికలో స్థానికత ప్రతిఫలింపజేసే విధానానికీ, దాన్ని ఉన్నతీకరించే నైపుణ్యానికి ఒక నమూనా కథ ఇది! ఇలా ఎందరో కథకుల మంచి రచనలు ఉన్నై.
కథానికలో స్థానికత అంశంతో ముడిపడివున్న మరో ముఖ్య విషయం ప్రాంతీయత. నిర్దిష్టమైన స్థలం-అంటే ఊరూ, పల్లె, పట్నం – పేరు చెప్పకపోయినా ఆ కథ జరుగుతున్న ప్రాంత నేపథ్యం కథంతా పరచుకొని ఉంటుంది కొన్ని కథల్లో. ఆనాటి పులికంటి కృష్ణారెడ్డి, రాజారాం, కె సభా వంటి పెద్దల నుండి ఈనాటి స్వామి, దేవేంద్రాచారి, సింగమనేని, శాంతినారాయణ, సన్నపురెడ్డి, గోపిని, ఆర్.సి. కృష్ణంరాజు, జొన్నవిత్తుల, నరేంద్ర వంటి వారి కథలన్నీ రాయలసీమలోని వివిధ జిల్లాల్లోనే జరుగుతాయి.
అలాగే ఆనాటి సురవరం, మాడపాటి, బండారు అచ్చమాంబ, పి.వి.నరసింహారావు, గూడూరి సీతారాం వంటి పెద్దల నుండి ఈనాటి పెద్దింటి అశోక్ కుమార్, బి.వి.ఎన్.స్వామి, కె.వి.నరేందర్, బి.ఎస్. రాములు, కాలువ మల్లయ్య, సంపత్ కుమార్ వంటి కథకుల రచనలకు తెలంగాణ కేందం.
నాటి చాసో, రావిశాస్త్రి, శేషగిరిరావు, అచ్యుతరామరాజు వంటి పెద్దల నుండి ఈనాటి కారా మాష్టారు, ఆదూరి, ద్విభాష్యం, అప్పలనాయుడు, గౌరునాయుడు, ఇందూరమణ, కె.వరలక్ష్మి, జగదీష్, సుగుణరావు వంటి వారి రచనలు ఉత్తరాంధ్ర నేపథ్యంతో చిక్కగా చక్కగా ఉంటాయి. ఇలాగే, నెల్లూరు, ప్రకాశం, ఇతర మధ్యాంధ్ర జిల్లాల ప్రాంతీయ నేపథ్యంతోనూ మంచి కథలు వచ్చాయి, వస్తున్నాయి.
ఇక, ఏ మనిషికైనా, ఎక్కడి మనిషికైనా సంబంధించిన ఏ మనస్తత్వ వైరుథ్యాల చిత్రణలోనో అయితే స్థానికత అవసరం కాకపోవచ్చు. స్థానికతని రచయిత జీవన తాత్త్వికతకీ, నిబద్ధతకీ కూడా ముడిపెట్టలేము. పద్మరాజు గారి ‘గాలివాన’ ఎక్కడ జరిగినా, గొరుసు ‘చీడ’, వరలక్ష్మి ‘మంత్రసాని’ వరకూ సాగిన శతాధిక మంచి కథలు ఏ ఊళ్లో జరిగినా అవి గొప్ప కథలే, కథలోని మానవీయ విలువల బలం, శిల్పపోషణ, శైలిలోని పటిష్టత-వాటిని అలాంటి గొప్ప కథలుగా తీర్చిదిద్దాయి.
కేతు విశ్వనాథరెడ్డి ‘దూరం’ కథ వుంది. అది హృదయ సాన్నిహిత్యం కలిగిన మిత్రుల మధ్య డబ్బు సహాయం అనే అంశం ఎంతటి దూరాన్ని సృష్టించగలదో చిత్రించిన అద్భుతమైన కథ. ఇందులో శ్రీకాళహస్తి, తిరుపతి వంటి ఊళ్ల పేర్లు తగులుతాయి. అవి కేవలం కథలోని పాత్రల భౌతిక ప్రయాణాల మార్గ సూచనకు వాడుకోవటానికి ఉదహరించబడినాయే తప్ప అదనంగా స్థానికతని దట్టించటానికి కాదు. అంటే కథానికలో కథాంశం వెలువరించే తాత్వికతకీ, స్థానికతకీ కూడా సంబంధం ఉండనక్కరలేదు. ఛాయాదేవిగారి ‘సుఖాంతం’కు స్థానీయతేం ఉంటుంది? ఇచ్ఛాపురపు జగన్నాథరావు ‘ఎదురద్దాలు’కీ, కాశీభట్ల ‘బృంద’కీ, విహారి ‘కొత్త నీరు’కీ, మల్లీశ్వరి ‘మాట్లాడుకుందాం’కి ఇతివృత్తబలం, ధ్యేయం, చిత్రణా అన్నీ వేరు. అలాగే, మునిపల్లె రాజుగారి ‘నెత్తురుకన్నా చిక్కనిది’, రాజారాం గారి ‘కమ్మ తెమ్మెర’, ‘జానకీబాల ‘మూడో పేజీ’, శ్రీ సుభా ‘నాలుగోమజిలీ’, ఇనాక్ ‘ట్రోఫీ’ వంటి సహస్రాధిక గొప్ప కథలకి ఈ అంశం ఆవశ్యకం కాలేదు.
ఉత్తమ మానవీయ విలువల్ని ప్రోదిస్తూ, చదువరిని ఉన్నత సంస్కారంవైపు పయనింపచేయాలనే ధ్యేయం కలిగిన గొప్ప కథలు-మనిషి గురించి చెబుతున్నాయి. ఆ మనిషి కోరుట్ల వాడు కావచ్చు. కోటప్పకొండవాడు కావచ్చు. చిత్తూరువాడూ కావచ్చు; సింహాచలం వాడూ కావచ్చు; మన్యంవాడూ కావచ్చు!
నిర్దిష్టమైన స్థానికతకి అతీతంగా అసంఖ్యాకమైన అద్భుతమైన కథల పంట ఈనాడు కూడా పండుతోంది. యువ రచయితలు ఎందరో పదునైన శైలితో, అణువులో అనంత ప్రపంచాన్ని దర్శింపచేస్తున్నారు. మనిషి విభిన్న జీవన పార్శ్వాల విశ్లేషణనీ, వ్యాఖ్యానాన్నీ కూడా సమర్థవంతంగా చదువరులకి అందిస్తున్నారు. ఇలాంటి కథల విశేషాల్ని – ప్రత్యేకించి అలాంటివాటిలో ఈనాడు వస్తున్న విభిన్న ఇతివృత్తాల విశేషాల్ని మరో వ్యాసంలో పరామర్శిస్తాను.
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.