[రఘు శేషభట్టర్ గారి ‘కవలల్లాంటి ఊపిరితిత్తుల్లో ఒకటి కవిత్వానికిచ్చాను’ అనే రచనని అందిస్తున్నాము.]
అది తొంభయో దశకం. తెలుగు కవిత్వాన్ని కొత్త ముఖాలు సుసంపన్నం చేస్తున్న కాలం. అప్పటికింకా చదువుల దశలోనే ఉన్న నాకు ఆ రాతల్ని తూచటం అనివార్య విషయంగా మారింది. వాళ్ళలో కొందరి రాజకీయ కవిత్వాన్ని నేను మెచ్చలేదు. అలా అని ద్వేషించనూ లేదు. ఇదే సూత్రాన్ని ఇతరులు కూడా పాటించాలని మాత్రం కోరుకున్నాను.
నా కవిత్వాభ్యాసం ‘యుగ కవి’ శేషేంద్ర శర్మ వల్లే జరిగింది. ఆయన రాసిన ‘కవిసేన మేనిఫెస్టో’ నాకు అధ్యయన గ్రంథం. మరీ ముఖ్యంగా అందులో ప్రస్తావించిన ‘కవిత్వం ఒక ఆత్మ కళ’ అనే చాప్టర్ చదివాక అందాకా దొరకని నిధేదో దొరికినట్టు సంబరపడ్డాను. కవిత్వంలో శబ్దం నిర్వహించే పాత్ర గురించి ఆయన చేసిన అర్థవంతమైన చర్చకు నేను ఫిదా అయ్యాను. ఫలితంగా నా సహ కవులకు భిన్నంగా రాయటం అలవాటైంది. మొదట్లో నాలుగైదు కవితల్ని పత్రికలకు పంపి చూశాను. అవేవీ అచ్చుకు నోచుకోలేదు. అదే విషయం శేషేంద్ర శర్మ గారి దగ్గర ప్రస్తావిస్తే “పత్రికల్లో పని చేసే ఒకరిద్దరు మిమ్మల్ని పట్టించుకునేదేమిటి, మీరు వాళ్ళను పట్టించుకున్నారా లేదా అనేదే ముఖ్యం” అన్నారు. ఈ సలహా ఏదో బాగుందనుకొని ఎన్నో ఏళ్ళు పత్రికలకు కవిత్వం పంపలేదు. నా తొలి సంకలనం ‘ఒక స్వాప్నికుడి శ్వేత సంతకం’ ( 1997 ) తో నాలోని విశుద్ధ కవితాత్మను జెండాలా ఎగరేశాను.
“రాత్రి నీడలో రాలిన వెన్నెల తెరల్ని చింపి పోగులు పెడుతున్న చెట్టులా ఉంది మనసంతా” తరహా వాక్యాలు శుద్ధ కవిత్వ ప్రేమికుల్ని బాగా అలరించాయి. ఈ తరహా సౌందర్య పోషణ నాకెంతో ఇష్టం. దానిని ఏనాడూ పోగొట్టుకోలేదు సరికదా కవలల్లాంటి ఊపిరితిత్తుల్లో ఒకటి కవిత్వానికిస్తానని చెప్పుకున్నాను.
నా సారస్వత మైకానికి మెరుగులు దిద్దిన ఇంకో ఉద్దండుడు పొత్తూరి సుబ్బారావు గారు. ఆయన నాకు తారసపడకపోయి ఉంటే classics జోలికి పోయేవాడిని కాను. ఖమ్మంలో ఉన్న రోజుల్లో ఆయనతో మార్నింగ్ వాక్ నాకు సారస్వత పాఠం లాంటిది. ఎన్నో ప్రాచీన కావ్యాల పరిచయం ఆయన వల్లే దక్కింది. తదనంతర కాలంలో ప్రాచీన కవుల నుండి సహ కవుల వరకు గొప్ప కవిత్వం రాసిన వాళ్ళను స్మరిస్తూ ‘సౌరభం’ అనే వ్యాస సంపుటి వేసి సుబ్బారావు గారి స్మృతికి అంకితం చేశాను.
ఇప్పటి వరకు తొమ్మిది కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి అచ్చేసినా రాసే ప్రతి అక్షరాన్ని edit చేసుకోవటం నా అలవాటు. వీలైనంత వరకు ఉద్వేగాలు మిళితం చేసి రాసుకుంటాను. నేనొక బహుళ జాతి సంస్థలో పని చేస్తాను. విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. కవిత్వ వాతావరణం బొత్తిగా శూన్యం. కానీ కవిగా నిలబడేందుకు అది అడ్డు కాలేదు. ఒత్తిడిని కవిత్వంతో balance చేయటం అలవాటైంది. సాహిత్య దృక్పథం, సామాజిక దృక్పథం అనే పడికట్టు మాటల్ని నేను పట్టించుకోను. రాయటం ఒక్కటే నా దృక్పథం.
“రాయటం ఒక అలవాటుగా ఉన్నప్పుడు
పలచటి నీటి అలల కింద
ఈదుతున్న చేపల్ని చూసినట్టు
లోకాన్ని చూడాలి” (అనల్పం)
వాక్యాన్ని ఎంత ప్రతిభావంతంగా చెబుతామన్న దాని మీదే మన సారస్వత జీవితం నిలబడుతుంది. రాబోయే తరాలు నెమరు వేసుకునే దినుసులేవో వాక్యాల్లో ఉండాలని కోరుకుంటాను.
శిల్పం, శబ్దం, ఉపమ, ఉత్ప్రేక్ష, తాత్వికత అనే ఐదు అంగాలుగా దిద్దబడిందే ఉత్తమ కవిత్వం అని ‘దిశాంతర స్వప్నం’ అనే నా కవితా సంపుటానికి రాసుకున్న ముందుమాటలో తీర్మానించాను. దాని మీద జరగవలసినంత చర్చ జరగలేదు.
భాషను ఉద్ధరించటం కవుల అనివార్య బాధ్యత. దాని కోసం ప్రణాళికలేమీ లేనప్పుడు కనీసం ప్రామాణికత చెడకుండా రాస్తే చాలంటాను. ఏ వాక్యాన్నైనా శ్రద్ధగా రాయటం, మఖలో పుట్టి పుబ్బలో పోయే రాతల మీద వ్యాసాలు రాయకపోవటం నాకు నేను ఏర్పరచుకున్న నియమాలు. ఈ పద్ధతిలో కొనసాగటమే నన్ను నిలబెట్టిన ఉద్దండులకు నేనిచ్చే నివాళి.
రఘు శేషభట్టర్ గారి స్వస్థలం ఖమ్మం. 18 నవంబర్ 1970వ తేదీన జన్మించిన రఘు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక బహుళ జాతి సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక స్వాప్నికుడి శ్వేత సంతకం, సూర్యుడు పొడిచిన రాత్రి, నిద్రపోని మానవ కోయిల, లిపి తడిసిన తరుణం, మోహధూపం, నేను కల వెన్నెల, అసంకల్పిత పద్యం, అనల్పం, దిశాంతర స్వప్నం (9 కవితా సంపుటాలు), సౌరభం (వ్యాస సంపుటి) ప్రచురిచమయ్యాయి. ప్రస్తుతం హైదరబాద్ నేరేడ్మెట్ లోని రామకృష్ణాపురంలో నివాసం. ఫోన్స్: 9676144904 & 9603264732
