[ఎలనాగ గారు రచించిన ‘కవిత్వంలో డిక్షన్’ అనే రచనని అందిస్తున్నాము.]
మౌఖిక లేదా లిఖిత పదాల ప్రయోగరీతిని డిక్షన్ అని నిర్వచించవచ్చు. పదకోశం (vocabulary), వాక్యనిర్మాణం (syntax) ఇందులోని ముఖ్యాంశాలు. సింటాక్స్ అంటే ప్రధానంగా పదాల క్రమమే. సాహిత్యానికి సంబంధించని మామూలు వ్యక్తీకరణ సాధనం భాష (language) కాగా, సాహిత్యానికి చెందినది డిక్షన్. అది కవిత్వానికి సంబంధించినదైనప్పుడు దానికి పోయెటిక్ డిక్షన్ (కవిత్వ పరిభాష) అనే పదబంధాన్ని వాడాల్సి ఉంటుంది. కాబట్టి మామూలు భాషకు పరాయిదైన ఒక ప్రత్యేకభాష కవిత్వానికి అవసరమౌతుంది. వచనానికీ రోజువారీ వ్యవహారిక భాషకూ భిన్నంగా ఉండేలా ప్రత్యేకమైన పదాల ఎంపికను, పదసంయోజనాన్ని, వాక్యనిర్మాణాన్ని ఉపయోగిస్తూ రాసిన రచనకు ఉన్నతమైన, అందమైన, భావోద్వేగాలను ప్రభావితం చేయగల విశేషత సిద్ధిస్తుంది. విశిష్ట వ్యక్తీకరణ ద్వారా మాత్రమే కవిత్వస్పర్శ మనసుకు లేదా మెదడుకు తగులుతుంది కనుక, పోయెటిక్ డిక్షన్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఆధునిక ఆంగ్లసాహిత్య చర్చలలో పోయెటిక్ డిక్షన్ అనే మాటను ఎడ్మండ్ స్పెన్సర్, జి.ఎమ్. హాప్కిన్స్‌లు రాసే విధంగా, అంటే మామూలు వచనానికి మాత్రమే భిన్నంగా కాకుండా తమ కాలపు ఇతర కవుల రచనలకు కూడా భిన్నంగా ఉండే భాషకు వర్తింపజేస్తున్నారు. కాబట్టి దీన్ని మరొక విధంగా, శైలికి సంబంధించిన అంశాన్ని ఇముడ్చుకున్న భావనగా తలచాలి. ఇదే భావనను మరింతగా కుదిస్తూ, ఉత్తమమైన పోయెటిక్ డిక్షన్‌ను పద్దెనిమిదవ శతాబ్దంనాటి నియో క్లాసిక్ కవుల శైలికి అంటగట్టారు. తిప్పితిప్పి అతి వివరంగా రాసే విధానం (periphrasis) ఇందులో ఒక భాగం. సమకాలీన భాష ఎప్పటికీ కవిత్వభాష కాదు, అన్నాడు థామస్ గ్రే. నియో క్లాసిక్ కవిత్వ భాష ముఖ్యంగా పాతతరం వాళ్లైన వర్జిల్, స్పెన్సర్, మిల్టన్‌ల ప్రయోగరీతి నుండి తీసుకోబడింది. అది principle of decorum అనే సూత్రం మీద ఆధారితమైంది. ఈ సూత్రం ప్రకారం కవులు తమ భాష స్థాయిని, రీతిని ప్రక్రియకు తగిన విధంగా మార్చుకోవాలి. సాధారణ వ్యంగ్యం ప్రజల రోజువారీ వ్యవహారాల మీద వ్యాఖ్యానం కనుక, దానికోసం ప్రజల భాషను అనుమతించడమే కాకుండా దాన్ని అవసరమైన అంశంగా ఎంచారు. కానీ ఇతిహాసం (epic), విషాదాంత రచన (tragedy), భావగీతం లేదా స్తుతికావ్యం (ode) మొదలైనవాటి కవిత్వభాష ఉన్నతస్థాయికి చెందినదిగా ఉండాలని చెప్పారు. కానీ ఈ పద్దెనిమిదవ శతాబ్దపు కవిత్వభాషను విలియం వర్డ్స్ వర్త్ ఖండిస్తూ దాన్ని కృత్రిమమైన, దుర్మార్గమైన, అసహజమైన భాషగా అభివర్ణించాడు. దానికి బదులు ‘బలమైన అనుభూతులు యథేచ్ఛగా ఉప్పొంగడాన్ని’ (spontaneous overflow of powerful feelings) ప్రతిపాదించాడు.
కవిత్వపు డిక్షన్‌లో ఎన్నో అంశాలుంటాయి. కొన్నిటిని స్పర్శిద్దాం.
సంస్కృత పదాలను మానుకోవాలనేది ఈ రోజుల్లో బలంగా వినిపిస్తున్న వాదం. ఇది సమంజసమైనదే కానీ, దీనిపట్ల అతి వీరాభిమానం పనికిరాదు. ఏది అచ్చతెలుగు పదమో ఏది సంస్కృత పదమో వెంటనే చెప్పడం కొన్నిసార్లు అంత సులభం కాదు – ముఖ్యంగా నిఘంటువులు ఉపేక్షకు గురవుతున్న ఈ కాలంలో. చాలా దశాబ్దాల కింద సువర్ణసుందరి సినిమాలో చలమున మోడి సలుపకు రాజా అన్నాడు శ్రీశ్రీ. ఇందులోని మొదటి రెండు పదాలు అచ్చతెలుగువి కావనుకుని వాటిని మానుకుంటున్నారులా ఉంది. కానీ అవి దేశ్యపదాలే. బిడారము, వేసట, ముక్కంటి, తమకము, మనికితము, కడలి మొదలైన ఎన్నో మాటలను సంస్కృత పదాలుగా భ్రమపడి వాటిని మానుకుంటే అవి కనుమరుగవుతాయి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. మరి దీనితో మన భాషకు నష్టం వాటిల్లడం లేదా? అన్నము, రక్తము, మేఘము, రాగము లాంటి మరెన్నో పదాలు సంస్కృతం నుండి వచ్చినంత మాత్రాన వాటిని ఉపయోగించకుండా ఉండగలమా? వ్యవహారంలో ఉన్నవాటినే వాడాలి అని వాదించవచ్చు. కానీ మనం వాడకపోవడం వల్లనే కదా అవి వ్యవహారం లోంచి తొలగిపోయేది, తొలగిపోతున్నది!?
సంస్కృత పదాలనే కాదు సమాసాలను కూడా వాడకూడదనే వాదం కూడా ఒకటి ఉంది. కానీ వాటితో ఒక వెసులుబాటు కూడా ఉందన్న సంగతిని మనం గుర్తించాలి. యొక్క అనే మాట వాటిలో ఆటోమేటిక్‌గా కలిసి ఉంటుంది. ఉదాహరణకు ‘జీవిత పరమార్థం’నే తీసుకుందాం. జీవితం యొక్క పరమార్థం అని ఈ రోజుల్లో రాయలేం. రాస్తే మనవైపు వేలెత్తి చూపిస్తారు ఆధునికులు. జీవితపు పరమార్థం అనొచ్చు కానీ, సగం మందికి పుంప్వాదేశం కూడా నచ్చదు. అటువంటి సందర్భాలలో జీవిత పరమార్థం అని రాస్తే ‘యొక్క’ అందులోనే ఇమిడిపోయి ఉంటుంది. జీవితం పరమార్థం తెలియడం లేదు అని రాస్తే జీవితమూ పరమార్థమూ రెండూ తెలియడం లేదు అనే అర్థం వస్తుంది. కొందరు అలా రాస్తున్నారు కూడా. కానీ మనం ఉద్దేశిస్తున్నది జీవితం యొక్క పరమార్థం మాత్రమే. అచ్చతెలుగు సమాసాలలో రాస్తే బాగానే ఉంటుంది కానీ, అవి అన్ని వేళలా దొరకవు. బతుకు కొఱ, బతుకు బెరుకు, బతుకు సెలవు.. వీటిలో ఒక్కటైనా ఎబ్బెట్టుతనం లేకుండా సహజంగా ఉందా? పైగా ఇవి సరళమైన పదాలే అయినా సమాసాల రూపంలో వ్యవహారంలో లేవు.
అంత్యప్రాసలు వద్దు అనేది మరొక ప్రతిపాదన. ఇది కూడా సబబైన సూచనే కానీ సహజంగా, భావాన్ని ఉద్దీపించే విధంగా ఉన్నప్పుడు ఆచితూచి అరుదుగా ప్రయోగించడం ఔచిత్యంతో కూడుకున్నదే. ఇక్కడ ఒక ప్రశ్న: ఈ రోజుల్లో వచన కవిత్వంలో ముకారాంత తత్సమాలు సహజంగా ఒదుగుతాయా? ఉదాహరణకు, జీవితం నన్ను ఈడ్చికొట్టింది అనే బదులు జీవితము నన్ను ఈడ్చికొట్టింది అని రాసినప్పుడు. నిజానికి ముకారాంత తత్సమాలు ఈ కాలపు వచనంలో సైతం సహజంగా ఒదగవు. అవి గ్రాంథిక వచనంలో మాత్రమే సహజంగా అమరిపోతాయి. ఇక మాండలికం, యాస కూడా డిక్షన్‌ను ప్రభావితం చేస్తాయి అన్నది స్పష్టం.
డిక్షన్ శైలిని ప్రభావితం చేస్తుందనటానికి చలం రాసిన వాచకమే చక్కని ఉదాహరణ. ఆయన చేస్తూ, రాస్తూ లకు బదులు చేస్తో, రాస్తో అంటూ తనదైన శైలిలో రాశారు. అదే విధంగా విశ్వనాథ, కృష్ణశాస్త్రి, తిలక్, రంధి సోమరాజు, మో లలో అందరి శైలి ఒకేవిధంగా ఉండదు. దానికి కారణం వారు ఎంచుకునే డిక్షన్. అంటే పదాలు, వాటి ప్రయోగ రీతి అన్నమాట. వచనం విషయానికి వస్తే చలం, మల్లాది రామకృష్ణశాస్త్రి, రావిశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, కరుణకుమార.. ఇలా ఎందరి వాచకాల మధ్యనో భేదం ఉండటాన్ని మనం గమనించవచ్చు. డిక్షన్ వలన ఏర్పడే ప్రత్యేకమైన శైలి, ముద్ర ఆయా కవులను, రచయితలను పాఠకులు గుర్తించేలా చేస్తాయి.
కాబట్టి కవిత్వంలో డిక్షన్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే అది భావం, భావుకతల తర్వాతనే అని ఒప్పుకోక తప్పదు.
వృత్తిరీత్యా వైద్యులైన శ్రీ ఎలనాగ (డాక్టర్ నాగరాజు సురేంద్ర) ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త. కవిగా, భాషావేత్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా సుప్రసిద్ధులు.
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత. తెలుగులోనూ, ఆంగ్లంలోనూ రచనలు చేసే ఎలనాగ గారు సుమారు 40 గ్రంథాలు వెలువరించారు.
‘ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫ్లైస్’, ‘ఇంప్రెషన్-ఇమేజెస్’, ‘మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్’ మొదలైనవి ఆయన తెలుగు నుండి ఆంగ్లంలోకి తెచ్చిన కవితా సంపుటాలు.
వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు వంటి సుప్రసిద్ధ తెలుగు రచయితల కథలను, నవలలను ఆయన ఆంగ్లంలోకి తీసుకువచ్చారు. వివిధ దేశాల సాహిత్యాన్ని కూడా ఆయన తెలుగు పాఠకులకు అందించారు. వాటిలో ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు ఉన్నాయి.
వివిధ దేశాల కథల అనువాద గ్రంథం ‘కథాతోరణం’ వెలువరించారు. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథాన్ని ‘గాలిబ్ నాటి కాలం’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చారు.
