[కన్నడంలో బి.ఎస్.శైలజ గారు వ్రాసిన వ్యాసాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి.]
‘రజనిగం చంద్రం మహా భూషణం’ – సోమేశ్వర శతకం [కన్నడ]లోని ఒకానొక పద్యపు ప్రథమ పాదం. ఇంకా అనేక మహా కావ్యాలలోనూ చంద్రుని గురించి ప్రస్తావన ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. చంద్రునికి విశిష్ట స్థానం ఇచ్చినవారు కవులు మాత్రమే కాదు, ఖగోళ విజ్ఞానులు, అంతరిక్ష విజ్ఞానులు కూడా. అలాగే జీవశాస్త్ర విజ్ఞానులు, సేనాధిపతులతో పాటు, బందిపోట్లను కూడా మనం మరచిపోలేము.
చాలా పూర్వ కాలం నుంచీ చంద్రుని స్నేహానికి ఎక్కువ తపించినవారు ఎవరో తెలుసా?
దొంగలు.
హత్య, దోపిడి, లూటీ …ఇవన్నిటికీ చంద్రుడు లేని రాత్రి భాగాన్నే వాళ్ళు ఎంచుకుంటారు. కాబట్టి చంద్రోదయ, అస్తమయాలు వారికి బాగా తెలుసు. మృచ్ఛకటికం అనే సంస్కృతనాటకంలో శర్విలకుడు దొంగతనం చేయడానికి అర్ధరాత్రి చంద్రుడు ఎప్పుడు మునుగుతాడా అని ఎదురుచూసి, మునిగాక ‘అహో! నాయందనుగ్రహించిన వాడు వోలె చంద్రభగవానుడు గూడ నస్తమించుచున్నాడు గదా!’ అనుకుంటాడు.
ఈ కాలంలోనూ యుద్ధాలలో చంద్రుని ప్రమేయం ఉందని బ్రాడ్లీ షేఫర్ కనుగొన్నారు. పౌర్ణమి, అమావాస్యలు మాత్రమే కాదు, వృద్ధి, క్షయము పొందుతున్న చంద్రుడే కారణమైన సార్వత్రిక శెలవుదినాలు యుద్ధాలలో నిర్ణాయకమైన అంశాలు అయి ఉన్నాయి. 1916లో ఈస్టర్ రోజు మొదలైన విప్లవం, 1938లో గుడ్ ఫ్రైడే నాడు ఇటలీ అల్బేనియాను చుట్టుముట్టడం, 1968లో దక్షిణకొరియాపైన ఆక్రమణ, 1973లో ఇజ్రాయిల్ పైన దాడి, 1979లో మక్కా మసీద్ పైన ఆక్రమణ ఇలా అనేక ఘటనలను బ్రాడ్లీ షేఫర్ ఒక పట్టికగా తయారుచేశారు. వీటన్నిటిలో చంద్రుని పాత్ర ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉండనే ఉంది.
రెండవ ప్రపంచయుద్ధంలోనైతే ఇలాంటి అనేక ఉదాహరణలు లభిస్తాయి. హవాయ్ ద్వీపం మీద దాడి చేయడానికి జపనీయులు పౌర్ణమికై ఎదురుచూశారు.
వీటిలో ఒకటి అత్యంత రోమాంచితమైన సంఘటన.
రెండవ ప్రపంచయుద్ధంలో మిత్ర రాష్ట్రాల ఖైదీలు ఒక జర్మన్ శిబిరం నుంచి తప్పించుకున్న సందర్భం. ఇది 1968 లో The Great Escape అనే చలనచిత్రంగా వచ్చి అత్యంత ప్రసిద్ధిపొందింది. ఖైదీలు శిబిరం నుంచి బయటకు పారిపోవడానికి సొరంగం అవసరం ఉండింది. అత్యంత రహస్యంగా దాన్ని తవ్వడమయితే అయింది. అయితే తప్పించుకోవడానికి అమావాస్య వరకూ వేచి ఉండవలసి వచ్చింది. ఒక అమావాస్యనాడు అవకాశం తప్పిపోయింది. కాబట్టి మళ్ళీ ఒక అమావాస్య వచ్చే వరకూ ఆ ప్రయత్నం వాయిదా వేయాల్సి వచ్చింది.
1943 అక్టోబర్ 29 నాడు ముగ్గురు తప్పించుకున్నాక మళ్ళీ అవకాశం దొరికింది 1944 మార్చ్ 24నాడు. తప్పించుకున్న 76 మందిలో ముగ్గురు మాత్రం ఇంగ్లండ్ చేరుకొని తమ సాహసగాథను ప్రపంచానికి తెలియజేశారు.
చంద్రుని గురించి ఖగోళజ్ఞుల ఆకర్షణకు కారణమేమి అని తెలుసుకుందాం. పౌర్ణమి అమావాస్యలు కాలగణనకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఇచ్చాయి. ఖగోళం లోని నక్షత్రాల హైవే ను గుర్తించడానికి చంద్రుడు సహాయం చేశాడు. అంతకన్నా ముఖ్యమైనదేమిటంటే చంద్రుని కక్ష్య. ఇది గణితజ్ఞులకు ఒక పెద్ద సవాలుగా ఉండింది.
భూమిని ఒకసారి చుట్టి వచ్చేసరికి చంద్రుడు తన అక్షంలో కూడా ఒక భ్రమణం పూర్తి చేస్తాడు. దీనిని తెలుసుకోవడానికి భూమి ఉదాహరణనే తీసుకోండి. భూమి తన అక్షం మీద ఒక భ్రమణం పూర్తి చేయడానికి కావలసిన సమయం 24 గంటలు. సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కావలసిన సమయం 365 ¼ రోజులు. అయితే చంద్రునికి రెండు వ్యవధులూ ఒకటే.
ప్రతి పౌర్ణమి రోజూ చంద్రుని మీద స్పష్టంగా కనిపించే ఆకారాల్లో ప్రజల కల్పనలకూ స్ఫూర్తి దొరికింది. గ్రీకులు దాన్ని యుద్ధ దేవత డయానా అని పేరు పెట్టారు. అక్కడో కుందేలు ఉందని ఊహించిన భారతీయులు చంద్రుడిని శశాంకుడని పిలిచారు. జాతక కథల్లో కనిపించే బోధిసత్వుని అవతారమే ఇదని కొందరి అభిప్రాయం. ఐరోపాలో కొందరు విశేష కేశాలంకరణ చేసుకున్న సౌందర్యవతిని కల్పన చేశారు. కొందరు శిశువును ఎత్తుకొని కూర్చున్న తల్లిని కల్పన చేశారు. దానికి అనుగుణంగా కథలనూ కల్పించారు.
ఈ అన్ని రకాల కల్పనలకూ మూలమైన చంద్రుని ఉపతలానికి చెందిన ఈ లక్షణాలు, భూమిమీద ఉన్న పర్వతాలు, లోయలు, గుంటలు వంటివే. మూడొందల యాభై ఏళ్ళ క్రితం గెలీలియో తన దూరదర్శకం నుంచి మొదటిసారి చంద్రుని పరిశీలించాడు. ఈ వివరాలను నోట్ చేసి పేర్లు కూడా పెట్టాడు. లోతైన ప్రదేశాలను సముద్రమని భావించి పేర్లకు ‘మారె’ అనే పూర్వప్రత్యయాన్నీ చేర్చాడు. ఉదాహరణకు ‘మారె ఇంబ్రియం’ అంటే ‘ఇంబ్రియం సముద్రం’ అని అర్థం. పూర్ణచంద్రుని మీద ఈ ‘సముద్రాల’ను చర్మచక్షువులతోనే గుర్తించవచ్చు. ఇలాంటి వివరణలలో ఒకచోట గెలీలియో, ‘నగరం చుట్టూ కట్టిన కోటలా ఉంది.’ అని వ్రాశాడు. అంతేకాక నీడలలో వచ్చే తేడాను గమనించి, పర్వతం యొక్క దిగువ అంచుల మీదికి అవి జరుగుతాయి అని వివరించాడు. ఆ పర్వతాల ఎత్తులనూ లెక్కగట్టాడు. ఈ వివరణలను అర్థం చేసుకోవడానికి దుర్భిణీ ద్వారా అర్ధచంద్రుని దాదాపు పది నిమిషాలకొకసారి సూక్ష్మంగా పరిశీలిస్తే చాలు. చంద్రుని ఉపరితలంపైన చీకటి భాగంలో కనిపించే చుక్కలు క్రమంగా పర్వత శిఖరాలుగా గోచరమవుతాయి.
చంద్రుని మరోభాగం ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదని తెలుసుకొనడానికి 1959 లో రష్యా స్పేస్ క్రాఫ్ట్ లూనా ఉపయోగపడింది. ఆ తరువాత దాని ఉపరితలం వివరాలు అపోలో స్పేస్ క్రాఫ్ట్ వల్ల తెలిశాయి.
చంద్రుని కళలు అందరికీ సుపరిచితమే. సూర్యుని వెలుగు పడే చంద్రుని వేర్వేరు భాగాలు భూమి వైపు తిరిగి ఉండే దిశను బట్టి కొన్ని సార్లు రేఖాచంద్రుడు, కొన్ని సార్లు అర్ధచంద్రుడు, కొన్ని సార్లు అర్ధాధిక చంద్రుడులాగా కనిపిస్తుంటాడు. వీటివల్ల చంద్రుని పరిభ్రమణము గురించి సూచన లభిస్తుంది.
చంద్రుడు లేని రాత్రి అనగానే గుర్తొచ్చేది అమావాస్య మాత్రమే. అయితే వేరే రోజుల్లో చంద్రుడు ఖచ్చితంగా కనిపిస్తాడు అనవచ్చునా? ఇది ఆలోచించవలసిన ప్రశ్న. ఉదాహరణకు వినాయక చవితిరోజు చంద్రుడిని చూడకూడదు అంటారు. ఇలా ఎందుకు అంటారు అనేది అప్రస్తుతం. అయితే చంద్రుడు కంటికి కనిపించనే కనిపిస్తాడు. రాత్రి మంగళహారతి, నిమజ్జనం ముగించి వినాయకుడిని పంపించడానికి బయలుదేరినప్పుడు చంద్రుడు కనిపించడు. ఎక్కడ చంద్రుడు? అలాగే కృష్ణాష్టమి రోజు చంద్రుడు కనిపించనే కనిపించడనేది గమనించి ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందనేది తెలుసుకుందాం.
పౌర్ణమి రోజు సాయంకాలం దాదాపు ఆరు గంటలకు తూర్పున చంద్రోదయం అవుతుందనుకుందాం. మరుసటి రోజు సాయంకాలం అదే ఆరు గంటలకు చంద్రుడిని వెదికితే కనిపించడు. దాదాపు ఆరూ ముప్పావు గంటలకు తూర్పున ఎఱ్ఱగా బింబం ఉదయిస్తుంది. ఆ మరుసటి రోజు దాదాపు ఏడున్నరకు చంద్రోదయమవుతుంది. అలాగే చంద్రోదయం రోజురోజుకూ కొంత కొంతగా ఆలస్యమవుతూ ఏడురోజుల తర్వాత అర్ధరాత్రి జరుగుతుంది. అప్పటికి సప్తమి లేదా అష్టమి వస్తుంది. ఇది చాంద్రమానపు చివరి పాదం; లాస్ట్ క్వార్టర్ అని ఇంగ్లీషులో సూచిస్తారు. ఇలాంటి ఒక రాత్రి కృష్ణజననం జరిగింది. ఆనాడు చంద్రుని వద్ద ఉన్నది రోహిణి నక్షత్రం. ఇది శ్రావణమాసంలో మాత్రమే సాధ్యం. ఈ విషయాన్ని ఇప్పుడూ పరిశీలించవచ్చు.
ఇలాగే రోజురోజుకూ కొంత ఆలస్యం కావడం వల్ల దాదాపు 13 రాత్రులు ఏదో ఒక సమయంలో చంద్రుని చూడవచ్చు. త్రయోదశి మరుసటి రోజు చంద్రుడు పొద్దున దాదాపు 5 గంటలకు ఉదయించినపుడు చంద్రుని కనుగొనడం కష్టం. ఆ మరుసటిరోజైతే అసలు సాధ్యమే కాదు. ఎందుకంటే ఆనాడు చంద్రుడు సూర్యుడితో పాటు ఉదయిస్తాడు. సూర్యునితో పాటే అస్తమిస్తాడు. దాంతో చంద్రుడిని చూసేందుకు త్రయోదశి వరకే ఆ పక్షానికి చివరి అవకాశం. దీనికి మాస శివరాత్రి అనే పేరు కూడా ఉంది.
మహా శివరాత్రి ఆచరణకు సంబంధించి ప్రముఖ విద్వాంసులు ప్రొఫెసర్ అభయంకర్ మరి కొన్ని విషయాలు ప్రకటించారు. అమావాస్యను నిర్ధారించడానికి చంద్రుడు, సూర్యుడిని గుర్తించాలంతే. గతంలో దీనికై 27 నక్షత్రాల పద్ధతి అనుసరించేటప్పుడు అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఈ పనికోసం అమావాస్యకు ముందు, తర్వాత చంద్రుని స్థానాన్ని గుర్తించాల్సి ఉండేది. అయితే ఈ రెండు రోజులలో చంద్రుడిని కనిపెట్టడమే కష్టం. తెల్లని గీత అంత మాత్రమే చంద్రుడు కనిపిస్తాడు. ప్రకాశమూ తక్కువే. ఆ స్థానంలో సంధ్య వెలుగుల అరుణిమ పరచుకొని ఉంటుంది. దాంతో చంద్రుడిని అమావాస్యకు రెండు రోజుల ముందు, తర్వాత గుర్తించే పద్ధతి ఆరంభించారు. అంటే త్రయోదశి మరియు విదియలలో చంద్ర వీక్షణం చేసేవారు. దాంతో కృష్ణ పక్ష త్రయోదశి తెల్లవారు జామున చంద్రవీక్షణం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆ రాత్రి మొత్తమంతా నిర్మలమైన ఆకాశం యొక్క విశ్వరూపదర్శనం. ఉదయం శివసాక్షాత్కారం వలెనే అనిపించి ఉండొచ్చు. బాల చంద్రోదయం శివుని శిరోభాగాన్ని తలపించి ఉండొచ్చు. అందుకేనేమో ఆ రోజుకు శివరాత్రి అని పేరు దక్కింది.
ప్రొఫెసర్ అభయంకర్ గారు ఈ లెక్కను కొనసాగిస్తూ క్రీస్తుపూర్వం 3000 లో మాఘమాస శివరాత్రి నాడే ఉత్తరాయణం మొదలై ఉండొచ్చని అంటారు. అందుకే ఆ శివరాత్రికి విశేష మహత్త్వం దక్కింది. అందుకే దానినే మహాశివరాత్రి అనే పేరు వచ్చి ఉండొచ్చు. లేక మాఘ శివరాత్రినే మహాశివరాత్రి అయ్యుండొచ్చు. అన్ని శివరాత్రులకన్నా ఇది దీర్ఘమైనది. చలి ఎక్కువ. కాబట్టి రాత్రంతా మేలుకొని ఉన్నవాడు గడగడ వణుకుతూ శివశివా అనుకుంటూ ఉండుండొచ్చు.
అమావాస్య తర్వాతి రోజులలో సూర్యుని కన్నా ఆలస్యంగా ఉదయించే చంద్రుడిని సాయంకాలమే చూడగలము. విదియనాడు చిన్న రేఖగా కనిపించే చంద్రుడు రానురానూ పెరిగి పౌర్ణమికి గుండ్రటి ఆకారం దాలుస్తాడు. ఆ తర్వాత శివరాత్రి వరకూ కనిపిస్తాడు. అమావాస్య తర్వాత ఏడు రోజుల తర్వాత సప్తమి లేదా అష్టమినాడు చంద్రుడు అర్ధరాత్రి అస్తమిస్తాడు. ఇది చాంద్రమానపు మొదటి నాలుగోభాగాన్ని సూచిస్తుంది. ఇంగ్లీషులో ఫస్ట్ క్వార్టర్ అనే వాడకం ఉంది.
మన సాంస్కృతిక పరంపరలో చంద్రుని కళల అంశ మమేకమయిపోయింది. ఉదాహరణకు చతుర్థి నాడు రాత్రి దాదాపు తొమ్మిదిన్నర గంటల సమయంలో చంద్రుని గమనించండి. శుక్లపక్షమైతే పడమటి అంచుల్లో కనిపిస్తాడు. కృష్ణపక్షమైతే తూరుపు అంచుల్లో ఉదయించడం మొదలవుతుంది. అదేవిధంగా దుర్గాష్టమి నాడు సాయంకాలం అర్ధచంద్రుడు కనిపిస్తే, కృష్ణాష్టమి నాడు తెల్లవారుజామున అర్ధచంద్రుడు కనిపిస్తాడు. మన అన్ని పండుగల ఆచరణలకూ, చంద్రుని కళలకూ ప్రత్యక్ష సంబంధం ఉంది. కృష్ణాష్టమి నాడు అర్ధరాత్రి చంద్రోదయం కావడం ఆ కథతో కూడా సరిపోలుతుంది. అలాగే రామనవమి నాడు సాయంకాలం పునర్వసు నక్షత్రం పక్కన చంద్రుడు కనిపించే సంగతీ స్పష్టంగానే ఉంది. ఇలాంటి విషయాలు అప్పటి వారికందరికీ సహజంగానే తెలిసేవేమో.
అన్ని మతాలలో పండుగలలో చంద్రుని ప్రమేయం ఉండనే ఉంటుంది. ముసల్మానుల పండుగల్లో చంద్రదర్శనం అతి ముఖ్యము. జైనుల సంవత్సరి వంటి పండుగలకూ చంద్రుడే ముఖ్యము. వసంత విషు తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాతి ఆదివారమే ఈస్టర్.
చంద్రుడు భూమిని చుట్టి రావడానికి 27 రోజులు కావలసి వస్తుందీ అంటే, పౌర్ణమి నుంచి పౌర్ణమికు 29 రోజులెందుకు? ఇది ఇంకో రహస్యమును బయటపెడుతుంది. భూమి A అనే ఒక నిర్దిష్ట స్థానములో ఉన్నప్పుడు పౌర్ణమి అయితే చంద్రునికి సూటిగా దూరములో పుష్యమి P అనే నక్షత్రముంది అనుకుందాం. ఈ నక్షత్రమే మన ఆధారబిందువు. 27 రోజుల తర్వాత చంద్రుని భ్రమణం ముగిసేటప్పుడు మళ్ళీ చంద్రుడు అదే నక్షత్రం దగ్గరికి వస్తాడు. అయితే అప్పుడు పౌర్ణమి కాదు. పౌర్ణమికి చంద్రుడు ఇంకా కొంచెం ముందుకు రావాలి. అందుకు కారణం భూమి చలనం. భూమి చలించకుండా ఉంటే ప్రతి నెలా పౌర్ణమి చందుడు అదే నక్షత్రం వద్ద కనిపించేవాడు. ఈ విధంగా చంద్రుని స్థానమును సూక్ష్మంగా పరిశీలించి కూర్చిన వివరణతో భూమి తిరుగుతుంది కానీ సూర్యుడు తిరగడు అని స్పష్టమవుతుంది.
ఈ చమత్కారాన్ని గమనించిన భారతీయ ఖగోళజ్ఞులు సంవత్సర గణనకు ఒక ఉపాయం ఆలోచించారు. ప్రతి పౌర్ణమి నాడూ చంద్రుని వెనుక కనిపించే నక్షత్రాలను గమనించారు. సగటున 12 పౌర్ణిమలు గడచాక 13వ పౌర్ణిమ యొక్క నక్షత్రం మళ్ళీ ఒకటోదే పునరావర్తనమవుతున్నదని గమనించారు. ఈ పన్నెండు పౌర్ణిమలను కలిగిన వ్యవధిని ఒక సంవత్సరం అని పేరు పెట్టి, పన్నెండు నెలలకు నక్షత్రాల పేర్లనే పెట్టారు. అవే చైత్రం, వైశాఖం, జ్యేష్టం.. మొదలైన పన్నెండు నెలలు. చైత్రము అనే పేరు యొక్క ఖగోళ వైజ్ఞానిక అర్థం, ‘ఆ నెల పౌర్ణిమనాడు చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గరగా ఉంటాడు’ అని. అలాగే విశాఖ, జ్యేష్ట, పూర్వాషాఢ, శ్రవణ, పూర్వాభాద్ర, అశ్విని, కృత్తికా, మృగశిర, పుష్యమి, మఘ, పూర్వఫల్గుణి ఇలా పన్నెండు నక్షత్రాలు విశేష స్థానాలను పొందుతాయి.
ఒక రహస్యం – నక్షత్రాల స్థానాన్ని గుర్తించడానికి ఇది ఒక సులభమైన ఉపాయం. ప్రతి పౌర్ణిమనాడూ చంద్రుని సమీపాన ఉన్న నక్షత్రాలను గమనించుకోండి. పౌర్ణిమకు రెండు మూడు రోజుల తర్వాత, ఆ నక్షత్ర సమూహపు మ్యాప్ తయారుచేసి, అప్పటికే వాడుకలో ఉన్న నక్షత్రాల మ్యాప్‌తో పోల్చండి. నక్షత్రాల మరియు నక్షత్ర సమూహాల పరిచయం చేసుకోండి.
సముద్రం యొక్క పొంగు, కుంగు తీరప్రాంత జనాలకు పరిచయం. అయితే ఇతరులూ విని ఉంటారు.
‘చంద్రోదయానికి సంద్రం పొంగుతుంది’ అని వచనాలలో చెప్పినట్టు చంద్రునికీ సంద్రం పొంగు కుంగులకూ ప్రత్యక్ష సంబంధం ఉంటుందని చాలా కాలం ముందు నుంచే తెలిసిందే. ఈ విషయాన్ని యుద్ధాల్లో సంపూర్తిగా వాడుకోవడం జరిగింది. పొంగే నాటికి తీరాన్ని చేరితే పడవ నుంచి దిగి నడిచి పోవాల్సిన దూరం తగ్గదూ? దీన్ని చేపలు పట్టేవాళ్ళు అనుభవంతో కనుగొన్నారు.
వైజ్ఞానికులు పొంగుల గురించి రకరకాల సిద్ధాంతాలను రూపొందించారు. అయితే గురుత్వాకర్షణ శక్తి మాత్రమే ఈ పొంగు కుంగుల మూలకారణం అని మొదట ప్రతిపాదించినది ఐజాక్ న్యూటన్.
సూర్యుడిని చుట్టి వచ్చే భూమిని చంద్రుడు చుట్టి వస్తాడు. అందుకే భూమి మీద సూర్యచంద్రులిద్దరి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఉంటుంది. ఒక నిర్దిష్ట సమయంలో చంద్రుని ఆకర్షణ భారత తీరంలో గరిష్ఠంగా ఉందనుకుందాం. అప్పుడు ఆఫ్రికా తీరంలో కనిష్ఠంగా ఉంటుంది. అయితే అమెరికా తీరంలోనూ గరిష్ఠ ఆకర్షణ ఉంటుంది. కాబట్టి అమెరికా, భారత తీరాల్లొ సముద్రపు నీటిమట్టం పెరుగుతుంది. ఆరు గంటల తర్వాత ఆఫ్రికా తీరాలలో పొంగు కనిపిస్తుంది. అమెరికా, భారత తీరాలలో కుంగు కనిపిస్తుంది. ఇలా సుమారు ఆరుగంటలకొకసారి పొంగు, కుంగులు కనిపిస్తాయి.
అమావాస్య, పౌర్ణమి రోజులలో సూర్యుడు, చంద్రుడు ఒకే తలంలో ఉండడం వల్ల పొంగు ప్రమాణం సాధారణం కన్నా హెచ్చు.
అంటే ఈ ఆకర్షణల ప్రభావం భూకేంద్ర స్థానం మీద కూడా ఉంటుంది. అయితే ఈ ప్రభావం చాలా తక్కువ. నీరు ద్రవం కాబట్టి ప్రరిణామం స్పష్టంగా కనిపిస్తుంది. గాలి ఇంకా సులభంగా ఈ పరిణామానికి లోనవుతుంది. అయితే దీనిని గమనించడం కష్టం.
ఈ ఘర్షణ నిరంతరంగా జరుగుతుంటుంది. దీనికి కారణం చంద్రుడే అయినా భూమి ఆవర్తనం యొక్క ప్రభావమూ ఇక్కడ కనిపిస్తుంది. పొంగు ఏర్పడేది భూమి మీద చంద్రునికి సూటిగా ఉండే బిందువులో కాదు. ఈ నీటి పొంగు కొంచెం పక్కకు జరుగుతుంది అని గమనించండి. దీనికి కారణం భూమి ఆవర్తనము. పొంగుల మధ్య అవధి సరిగ్గా పన్నెండు గంటలు కాదు. అలా గనుక అయితే ప్రతి రోజూ ఒకే సమయానికి పొంగు, కుంగులు ఏర్పడేవి. చంద్రుని చలనము కారణంగా సుమారు ఇరవై-ఇరవైఐదు నిమిషాలు ఎక్కువ కావలసి వస్తుంది. అంటే పన్నెండు గంటల ఇరవైఐదు నిమిషాల అంతరంలో పొంగులు ఏర్పడతాయి.
చంద్రుడే లేకుంటే ఎలా ఉండేది? ఈ విషయం గురించీ లెక్కలు వేశారు. భూమి యొక్క ఆవర్తనపు అక్షము 13½ డిగ్రీ ఓరగా ఉండడానికి చంద్రుడే కారణం అనేది ఒక సిద్ధాంతం. అయితే మన ఋతుచక్రాలకు చంద్రుడే కారణం అని అర్థం. చంద్రుడు లేకుంటే ఋతువులే లేవు.
పొంగు కుంగుల వల్ల భూమి పైన నీరు మరియు ఘనభాగాల మీద సతతంగా ఘర్షణ జరుగుతూ ఉంటుంది. దాని పరిణామమేమి? చంద్రుడు నిదానంగా దూరం జరుగుతాడు. దీనివల్ల మిలియన్ సంవత్సరాల తరువాత భూమి నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క అద్భుత దృశ్యం కనిపించనే కనిపించదు. అంతే కాదు భూమి ఆవర్తనమూ నిదానమవుతుంది.
ఐతిహాసిక గ్రహణ దాఖలాలు, భౌగోళిక శిలాజాల దాఖలాల వల్ల ఈ విషయం స్పష్టమైంది. ఈ విధానం వలన రెండొందల మిలియన్ సంవత్సరాల క్రితం రోజు వ్యవధి 22 గంటలు ఉండేది. ఇంకా 100 మిలియన్ సంవత్సరాల తర్వాత అది 24½ గంటలు కావచ్చు. అలాగే కొనసాగితే బిలియన్ సంవత్సరాల తర్వాత భూమిలో రోజు వ్యవధి మరియు చంద్రుని ఆవర్తనావధి కూడా 47 గంటలు కావచ్చు. అప్పటికి మానవులు బ్రతికి ఉంటే, భారతదేశానికి ఎప్పుడూ పౌర్ణమిగా, అమెరికా వారికి చంద్రదర్శనమే లేకుండా ఉండే స్థితి రావచ్చు. అంటే భూగోళంలో సగభాగం జనులకు చంద్రదర్శనమే లభించకుండా పోవచ్చు.
కన్నడ మూలం: బి.ఎస్. శైలజ
తెలుగు అనువాదం: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి విమర్శకులు, అనువాదకురాలు. అత్యంత లోతైన రీతిలో విమర్శలు చేయగల అరుదైన విమర్శకులు.
