Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొర్రలు దొంగిలించబోతే కొర్రు గుచ్చుకుంది

[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]

గిరిజనులు కొర్రలు పండిస్తారు. వాటితో జావ చేసుకుని తింటారు. పండగ రోజుల్లో కొర్రలతో పాయసం చేసుకుంటారు. అది ఎంతో రుచిగా ఉంటుంది. కొత్తపాడేరులో రామన్న అనే రైతు ఉండేవాడు. అతడు తన పొలంలో కొర్రలు బాగా పండించి వాటిని సంతలకు వచ్చే వ్యాపారులకు అమ్మేవాడు. ఈ విధంగా అతడు లక్షలు గడించాడు. అతన్ని అందరూ కొర్ర రామన్న అని పిలిచేవారు.

కొత్తపాడేరులో గంతన్న అనే ఒక గిరిజనుడు ఉండేవాడు. వాడిది దొంగబుద్ధి. అతనికి రామన్న అంటే అసూయ. ఎందుకంటే అతడు కొర్రలు పండించి బాగా డబ్బులు సంపాదించడమే. గంతన్న చిల్లర దొంగతనాలు చేసి పబ్బం గడుపుకునేవాడు. అతని భార్య గున్నమ్మ అతడిని కష్టపడి డబ్బులు సంపాదించమని చెబుతూ ఉండేది. ఆమె మాటలు అతడు వినేవాడు కాడు.

గంతన్న ఒకరోజు రామన్న పొలంలో బాగా పెరిగిన కొర్ర చేను చూశాడు. ఈ చేనువల్లనే కదా రామన్న బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. నేను ఈ రాత్రి అతని చేను కొంత దొంగిలిస్తానని తలచాడు. బాగా చీకటిపడ్డాక గ్రామంలో అందరూ నిద్రిస్తుండగా కొడవలి పట్టుకుని రామన్న చేలో పడ్డాడు గంతన్న. గబగబా చేను కోసి ఒక మూలపడేయసాగాడు. ఆ చేను అమ్మి కొంత డబ్బు సంపాదించాలనేది అతని దురాశ.

గంతన్న కొర్ర చేను కోస్తుండగా పొరపాటున అతని పాదం ఒక కొర్రు (సూదిమొనగల కర్ర) మీద పడింది. సూదిగా ఉన్న ఆ కర్ర అతని పాదంలో గుచ్చుకుంది. పాదాన్ని కొంతమేరకు చీల్చింది. రక్తం ధారలుగా కారుతుండగా బాధతో చేను కోయడం మానేసి ఊరిలోకి వచ్చేసాడు. అలా వస్తూ వీధిలో పడుకున్న నల్లకుక్క నడుం తొక్కాడు. అది గబాలున లేచి అతడి కాలు కరిచింది. గంతన్న ఎవరికీ కనబడకుండా ఇళ్లు చేరాడు. తెల్లారి లేచేసరికే అతని భార్య గున్నమ్మ ఇంటి ముందు ముగ్గు పెడదామనుకుంటే రక్తం పాదాల అచ్చులు కనిపించాయి. మొగుడు పడుకుని లేవలేదు. వీధిలో వారంతా లేచారు. వారికీ రక్తంతో కూడిన పాదం ముద్రలు కనిపించాయి. రామన్న తన చేనులో కొంతమేరకు కోసిన చేనును చూశాడు. ఒక మూల కొంత చేనుపడి ఉంది. ఎవరో దొంగ తన చేనులో పడ్డాడని గ్రహించాడు. అతడు ఎవరై ఉంటారని ఆలోచించసాగాడు. ఈలోగా గంతన్న తన కాలికి గట్టిగా గుడ్డకట్టి బాధతో మూలుగుతున్నాడని ఎవరో చెప్పారు. గంతన్నను పరామర్శించడానికి అతని ఇంటికి రామన్న వెళ్లాడు. గున‌్నమ్మ ఎంత అడిగినా గంతన్న తన గాయం గురించి చెప్పలేదు. ఆమెకు అతడి పరిస్థితి అర్ధమైంది. రాత్రి కొర్రలు దొంగలించబోతే కొర్రు గుచ్చుకుంది అని అనుకుంది. వీధిలో అందరికీ గంతన్న విషయం తెలిసింది. అతని దొంగబుద్ధి ఊరందరూ ఎరుగుదురు. వారంతా అతన్ని గట్టిగా నిలదీసి అడగ్గా నిజం చెప్పేసాడు. కొర్రలు దొంగిలించబోయే కొర్రు గుచ్చుకుంది అని ఊరందరకీ తెలిసిపోయింది. వారందరూ అతన్ని చెడామడా తిట్టారు. దొంగబుద్ధి మానుకోమని చెప్పారు. నాటి నుంచి ఎవరైనా దొంగతనానికి పాల్పడితే గంతన్నకు జరిగినట్టే జరుగుతుందని భయపడసాగారు. గంతన్న నాటి నుంచి బుద్ధిగా మెలగసాగాడు. రామన్న కొర్ర చేనుకు సలహాదారుగా పనిచేసి డబ్బులు సంపాదించసాగాడు. రామన్న ఏడాదికి గంతన్నకు రెండు బస్తాల కొర్రలు ఉచితంగా ఇవ్వసాగాడు. ఎవరైనా దొంగతనం చేయబోతే, దొంగిలించబోయి కొర్రు గుచ్చుకుంది అనే సామెత గుర్తు చేసుకుంటారు.

Exit mobile version