[కొల్లా పుష్ప గారు రచించిన ‘కొత్త వెలుగు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
అమృత్‌సర్.. జూలై మాసం. రాత్రి తొమ్మిది గంటలవుతున్నా సూర్యుడు ఇంకా పడమటి కొండల వెనుక పూర్తిగా దాగుకోలేదు. మేజర్ ప్రతాప్ తన ఇంటి ముందున్న చిన్న లాన్‌లో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. దేశభక్తి గాథలన్నా, పురాణాలన్నా ప్రతాప్‌కు ప్రాణం. ఖాళీ దొరికితే చాలు వాటిలో మునిగిపోతుంటాడు.
అప్పుడు అతను ‘మహాభారతం’లోని ఒక ఘట్టం చదువుతున్నాడు. పాండురాజు మరణించాక కుంతీ, మాద్రిల మధ్య జరుగుతున్న సంభాషణ అది.
“నేను తప్పు చేశాను అక్కా, అందుకే నేను సహగమనం చేస్తాను” అంటుంది మాద్రి.
“లేదు చెల్లెమ్మా, నేను పెద్దదాన్ని, బాధ్యత నాదే” అని కుంతి వారించినా వినదు మాద్రి.
“నీకున్న ఓర్పు, సహనం నాకు లేవు అక్కా. నేను పిల్లల్ని నీలా పెంచలేను. నా బిడ్డలను నీ బిడ్డల్లాగే చూసుకుంటావని నమ్ముతున్నాను. నాకు అనుమతి నివ్వు” అంటూ కుంతి పాదాలకు నమస్కరించి, నిశ్చయంతో చితి వైపు అడుగులు వేస్తుంది మాద్రి.
ఆ సన్నివేశం చదువుతుంటే ప్రతాప్ మనసు భారమైంది. సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న ఫోన్ మోగింది. తన తల్లి మీరా ఫోన్ నుంచి కాల్.
“అమ్మా.. బాగున్నావా?” అన్నాడు ప్రతాప్. కానీ అవతలి నుంచి వినిపించిన మాట వినగానే ఒక్కసారిగా దిగ్భ్రమకు లోనయ్యాడు. “ఎప్పుడు? ఎలా? ఏమైంది?” అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు.
అతని కంగారు చూసి వంటింట్లో ఉన్న భార్య పరి, గదిలో చదువుకుంటున్న కూతురు కోమల్ పరుగున వచ్చారు.
“ఏమైంది నాన్నా?” అని అడిగింది కోమల్ ఆందోళనగా.
“తాతయ్య చనిపోయారమ్మా! మనం వెంటనే బయల్దేరాలి. ఫ్లైట్ గానీ, ట్రైన్ గానీ ఏది ఉంటే అది బుక్ చేయి” అన్నాడు ప్రతాప్ గొంతులో వణుకుతో.
“పరి, నువ్వు త్వరగా బట్టలు సర్దు” అని చెప్పి, ఆఫీస్‌కు ఫోన్ చేసి విషయం వివరించాడు.
“నాన్నా.. ఈ సమయంలో విమానాలు గానీ, రైళ్లు గానీ ఏమీ లేవు” అని కోమల్ చెప్పడంతో, “అయితే మన డ్రైవర్‌ను కారు తీయమనమ్మా” అన్నాడు. పది నిమిషాల్లో ప్రయాణం మొదలైంది.
***
ప్రతాప్ ఇండియన్ ఆర్మీలో మేజర్. 24 గంటలు దేశసేవలోనే గడిపేవాడు. ఏళ్ల తరబడి సరిహద్దుల్లో ఉండి, ఏడాది కిందటే అమృత్‌సర్‌కు బదిలీ కావడంతో కుటుంబంతో గడుపుతున్నాడు. తన తల్లిదండ్రులను చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, డ్యూటీ వల్ల కుదరలేదు. అతని తండ్రి దేవేంద్ర ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు. “మన కుటుంబం కంటే దేశ క్షేమమే ముఖ్యం.” ఆ మాటలను గౌరవిస్తూ ప్రతాప్ విధుల్లో నిమగ్నమయ్యాడు. కానీ ఇప్పుడు తండ్రిని చూడకుండానే కోల్పోయినందుకు అతని గుండె తరుక్కుపోతోంది.
అతని భార్య పరి ఆర్మీ స్కూల్లో టీచర్, కూతురు కోమల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. వారి ప్రయాణం రాజస్థాన్‌లోని దేవరాల్ జిల్లాలో ఉన్న సీకర్ అనే ఒక చిన్న గ్రామం వైపు సాగుతోంది.
“ఎంత సమయం పడుతుంది?” అని డ్రైవర్‌ను అడిగాడు ప్రతాప్ ఆందోళనగా.
“సుమారు 12 గంటలు సార్!” అన్నాడతను.
“అంటే రేపు మధ్యాహ్నం రెండు గంటలకు గానీ చేరం అన్నమాట” అని భారంగా నిట్టూర్చాడు ప్రతాప్.
“ఎందుకు నాన్న అంత కంగారు పడుతున్నారు? మనం వెళ్లే వరకు తాతయ్య పార్థివ దేహాన్ని ఉంచుతారు కదా!” అని తండ్రి చెయ్యి పట్టుకుని ఓదార్చింది కోమల్.
“నీకు తెలియదు తల్లి.. నా బాధ మా అమ్మ గురించి. ఆమె ఏమైపోతుందోనని నా భయం” అన్నాడు ప్రతాప్ ఆవేదనగా.
“నానమ్మకు ఏం కాదులే నాన్న.. మీరు ఎంతో ధైర్యంగా సైన్యాన్ని నడిపిస్తారు కదా, ఇప్పుడెందుకు ఇలా బేలగా మాట్లాడుతున్నారు?” అని అడిగింది కోమల్.
ప్రతాప్ గంభీరంగా ఇలా అన్నాడు, “కోమల్, సరిహద్దులో శత్రువు ఎవరో మనకు తెలుసు. వాడిని ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఉంటుంది. కానీ కళ్లు మూసుకుపోయిన మూఢనమ్మకం ముందు తుపాకులు పనిచేయవు తల్లి. మన ఊరు రాజస్థాన్‌లోని మారుమూల గ్రామం. అక్కడ ఇప్పటికీ కొన్ని ప్రాచీన మూఢాచారాలు బలంగా ఉన్నాయి. భర్త చనిపోతే భార్యను కూడా చితిలోకి నెట్టే ‘సతీ సహగమనం’ అనే దురాచారం ఆ చుట్టుపక్కల ఇంకా వినిపిస్తూనే ఉంటుంది.”
“మై గాడ్! ఇంకా ఈ కాలంలో కూడానా?” అని కోమల్ నిర్ఘాంతపోయింది.
“అవునమ్మా. పూర్వం రాజుల కాలంలో యుద్ధ సమయంలో రాజులు మరణిస్తే ఆత్మగౌరవం కోసం ఆ దేశపు రాణులు సహగమనం చేసేవారు. తర్వాత వారికి దేవాలయాలు కట్టించేవారు. వారు చేసిన పనిని ఇప్పుడు కొందరు స్వార్థం కోసం, ఆస్తుల కోసం వాడుకుంటున్నారు. 1987లో ప్రభుత్వం దీనిపై కఠిన చట్టాలు తెచ్చినా, కొన్ని గ్రామాల్లో జనాల మెదళ్లలో ఆ విషం ఇంకా పోలేదు. అందుకే నాకు అమ్మ పరిస్థితి తలచుకుంటే వణుకు పుడుతోంది” అన్నాడు ప్రతాప్.
“నీకేమైనా తెలుసా అమ్మా?” అని కోమల్ తల్లిని అడిగింది.
“నాకు ఏమీ తెలియదు తల్లి. పెళ్లయ్యాక ఒక్కసారి మాత్రమే ఆ ఊరు వెళ్లాను. ఆ తర్వాత ఎప్పుడు అడిగినా మీ నానమ్మే ‘మేమే వస్తాంలే’ అని వచ్చి ఒకట్రెండు రోజులు ఉండి వెళ్లేవారు” అంది పరి.
మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు వారు ఊరు చేరుకున్నారు. తండ్రి ఇంటి ముందు వందలాది మంది జనం.. అందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ప్రతాప్ కంగారుగా లోపలికి వెళ్ళాడు. తల్లి మౌనంగా కూర్చుని ఉంది. ఆమె కళ్ళలో కన్నీళ్లు లేవు కానీ, ఏదో తెలియని నిశ్శబ్దం.
తండ్రి పార్థివ దేహాన్ని స్మశానానికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఊరేగింపుగా బయలుదేరుతుంటే, ఆ జనాన్ని చూసి ప్రతాప్ మనసులో అనుమానం పెరిగింది. ‘వీళ్లంతా నా తల్లిని కూడా చితిలోకి నెడతారా? నేను చూస్తూ ఊరుకోను. నా అధికారాన్ని ఉపయోగించైనా సరే అమ్మను కాపాడుకుంటాను’ అనుకుంటూ, పోలీసులకు ఫోన్ చేయమని కూతురికి సైగ చేశాడు.
తండ్రి వెంటే తల్లి కూడా నడిచి వస్తుంటే, “వద్దమ్మా, నువ్వు ఇక్కడే ఉండు” అని ప్రతాప్ అడ్డుకున్నాడు.
“లేదు నాయనా, చివరి వరకు మీ నాన్న తోడుగా ఉంటాను” అని ఆమె మొండిగా స్మశానం వరకు వచ్చింది. చితికి నిప్పంటించే సమయంలో ప్రతాప్ తల్లిని గట్టిగా పట్టుకున్నాడు.. ఎక్కడ ఆమె చితిలోకి దూకుతుందోనని!
కొడుకు కళ్ళలోని భయాన్ని గమనించిన తల్లి ప్రశాంతంగా “భయపడకు నాయనా.. నేను ఆ చితిలో దూకను. మీ నాన్న ఆశయాల సాక్షిగా చెబుతున్నాను, ఆ పని నేను చేయను.” అన్నది తల్లి.
ప్రతాప్ ఆశ్చర్యంగా చూస్తుండగా ఆమె కొనసాగించింది. “నాకు పదేళ్ల వయసులో పెళ్లి చేశారు. నా స్నేహితురాలు అమన్ కూడా నా వయసే. ఆమె భర్త క్షయ వ్యాధితో చనిపోతే, ఆమెను బలవంతంగా సజీవ దహనం చేశారు. ఆ దృశ్యం నా కళ్ల ముందు నుంచి పోలేదు. అప్పుడే అనుకున్నాను, ఈ దురాచారాన్ని ఆపాలని. మీ నాన్నకు కూడా ఈ విషయాలు ఇష్టం ఉండేవి కావు. మేమిద్దరం కలిసి ఎన్నో ఏళ్లుగా ఈ ఊరిలో మార్పు కోసం పోరాడుతున్నాం.”
అప్పుడు అక్కడే ఉన్న ఒక గ్రామస్థుడు ముందుకు వచ్చి, “అవును బాబు.. మీ నాన్నగారు మమ్మల్ని మనుషులుగా మార్చారు. ‘మా ఆడబిడ్డను మేము చంపుకుంటుంటే అడ్డు రావడానికి మీరెవరు?’ అని మేము ఆయన మీదకు వెళ్తే.. ‘నన్ను చంపి అప్పుడు ఈ చితి వెలిగించండి’ అని గుండె ఎదురొడ్డి నిలబడిన ధైర్యశాలి ఆయన. చట్టాలు చేయలేని పనిని ఆయన తన మొండితనంతో, ప్రేమతో సాధించారు. ఈ ఊరిలో ఇప్పుడు ఏ ఆడపిల్లకీ ఆ గతి పట్టదు బాబు” అని కన్నీళ్లతో నమస్కరించాడు.
“అంతే కాదు ప్రతాప్, భర్తలు పోయిన మహిళలందరికీ మీ నాన్నగారే చదువు చెప్పించి, వాళ్లకి ఉపాధి కల్పించేవారు. మీరు బాధపడతారని ఇవేవీ మీకు చెప్పలేదు. దేశ సేవలో ఉన్న నువ్వు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే నీ భార్య పిల్లలు పరిస్థితి ఇదే అని తలంచి నీ భార్య పిల్లల్ని కూడా ఈ ఊరికి దూరంగా ఉంచాము” అని తల్లి చెప్పింది.
ప్రతాప్ మనసు ఆనందంతో, గర్వంతో ఉప్పొంగింది. సరిహద్దులో తాను చేస్తున్న సేవ కంటే, సమాజంలోని మూఢాచారాల మీద తను తండ్రి చేసిన పోరాటం ఎంతో గొప్పదని అతనికి అర్థమైంది.
గ్రామస్తుల మాటలు విన్నాక, తన అత్తమామలు చేసిన త్యాగం మరియు పోరాటం చూసి పరి మనసు ద్రవించిపోయింది. ఆమె అత్తగారి దగ్గరకు వెళ్లి, ఆమె చేతులు పట్టుకుని ఎంతో వినమ్రంగా
“అత్తమ్మా.. ఇన్నాళ్లూ మీరు మమ్మల్ని ఈ ఊరికి రావద్దన్నప్పుడు, మమ్మల్ని దూరం పెడుతున్నారేమో అనిపించింది. కానీ, ఒక ఆడపిల్ల ఆత్మగౌరవం కోసం, ఈ ఊరి కోడళ్ల ప్రాణాల కోసం మీరు ఇంత పెద్ద యుద్ధమే చేస్తున్నారని మాకు తెలియదు. మీ పోరాటం ముందు మేం చేస్తున్న సేవ చాలా చిన్నదత్తమ్మా. ఒక సైనికుడి భార్యగా నేను గర్వపడుతున్నాను, కానీ అంతకంటే మిన్నగా.. ఒక గొప్ప ఆశయం కోసం నిలబడిన మీ కోడలిని అని చెప్పుకోవడానికి నేను ఇంకా ఎక్కువ గర్వపడుతున్నాను. మీ ఆశయాలను, మామయ్య గారి కలలను మేం కూడా ముందుకు తీసుకెళ్తాం.”
అత్తగారి ఆలోచనలకు, ఆమె పట్టుదలకు తలవంచి మనస్ఫూర్తిగా నమస్కరించింది పరి. తాతయ్య ఆశయాలకు ఆత్మ ప్రణామం చేస్తూ, అప్పటివరకు తండ్రిని ఓదారుస్తున్న కోమల్ కూడా తన నానమ్మ పాదాలకు నమస్కరించింది.
ఒక దురాచారాన్ని కాల్చివేస్తూ, చైతన్యపు దీపమై వెలుగుతున్న ఆ చితి మంటల్లో ప్రతాప్‌కు తన తండ్రి చిరునవ్వు కనిపిస్తున్నట్లు అనిపించింది. ఆ గ్రామంలో నిజమైన ‘కొత్త వెలుగు’ ప్రసరించింది.
శుభం
కొల్లా పుష్ప విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందినవారు. వీరికి బాల్యం నుండి పుస్తకాలు చదవడం అలవాటు. మూడేళ్ల నుంచి రచనలు చేస్తున్నారు.
40 సామాజిక కథలు, ఆధ్యాత్మిక యాత్ర విశేషాలు, వ్యాసాలు, వంటలు కూడా ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
చదరంగం ఆడటం, కొత్త రకం వంటలు చేయడం ఇష్టం.
చదరంగంలో జిల్లా స్థాయి పోటీలలో మొదటి బహుమతి అందుకోవడం విశేషం. అలాగే వంటలకు కూడా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ఫోన్ నెంబర్ 83745 96096
