[‘కొత్తావతారం’ అనే అనువాద కథని అందిస్తున్నారు శ్రీమతి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. ఒడియా మూలం అరవింద్ రాయ్.]
1
విశ్వనాథం ఇంతగా దిగులుగా ఉండడం రాధిక ఎన్నడూ చూడలేదు. కొండంత బరువును మోస్తున్నట్టు క్రుంగిపోయి కనిపిస్తున్నాడు. ఆమె బావిలో నీళ్ళు తోడుతున్నా, ముంగిలిని పేడతో అలుకుతున్నా, పొయ్యి మీద అన్నం వండుతున్నా అతని వాలకమే గుబులు కలిగిస్తోంది. ‘అప్పెక్కువైందని దిగులు పడుతున్నాడా? లేదా ఊళ్ళో వాళ్ళెవరైనా ఏమైనా అన్నారా ? ఏమో, ఈమధ్య క్షవరంలో ఎన్నెన్ని కొత్త స్టైళ్ళొచ్చాయి! ఈయన క్షవరం స్టైల్ జనాలకు నచ్చడం లేదో ఏమో! కానీ దానికి ఎవరైనా ఈయన్నేమంటారు? క్షవరం చేసి డబ్బు తీసుకుంటారు, ఎవరి తలలేం అమ్ముకోలేదుగా’ అంటూ ఏవేవో ఆలోచిస్తోందామె.
విశ్వనాథం దిగులు మొహం రాధికనెంతో ఆలోచనలో పడేసింది. చాలా ఆలోచించి ఆలోచించి కొడుకు గురించని తేల్చుకుంది. ‘వీడేమో పనీపాటా లేకుండా తిరుగుతున్నాడు. జతగాళ్ళతో పైలాపచ్చీసుగా తిరుగుతున్నాడు. ఒక్కడున్నాడు.. ఖచ్చితంగా వాడి చింతే అయ్యుండాలి.’
రాధిక మెల్లగా వచ్చి విశ్వనాథం దగ్గర ఎవరైనా ఉన్నారేమోనని చూసింది. అక్కడెవరూ లేరు. మధ్యాహ్నం పూట అంతా నిర్జనంగా ఉంది. మునగ చెట్టు మీద కాకి ఒకటి దప్పికగొని అరుస్తోంది. రాధిక విశ్వనాథానికి మరింత దగ్గరగా జరిగి కూర్చుంది.
విశ్వనాథం ఏమీ మాట్లాడలేదు.
“పద, కాళ్ళు చేతులు కడుక్కో.” అంది.
అయినా విశ్వనాథం మాత్రం ఏమీ పలకలేదు.
“ఎన్ని ఇళ్ళలో పని దొరికిందీనాడు?” ధైర్యం తెచ్చుకుని ఆ మాటొకటీ అడిగేసింది.
నల్లగా ఉన్నా, రాధిక అందమైనదే. నలభైఐదుంటాయేమో గానీ అలా కనిపించదు. మట్టి రంగు నొసటిమీద పెద్దగా ఎఱ్ఱనైన బొట్టు మండుతున్న అగ్నిలా తోచి నిలువలేకపోయాడు. ఆమెను దూరంగా తోస్తూ, “వెళ్ళిపో నా ముందు నుంచి.” అన్నాడు.
“వెళ్ళిపో నా ముందు నుంచి.”
నిలదొక్కుకుంటూ రాధిక మళ్ళీ అడిగింది. “ఎవరైనా ఏమైనా అన్నారా ఏంటి?”
అపుడు విశ్వనాథం ఆవేదనతో రాధిక వైపు చూశాడు. అతని నిష్కల్మషమైన ముఖము, తడి కళ్ళను చూసిన రాధకు, ఏళ్ళ తరబడి తనలో పేరిన మంచు కన్నీరుగా కరుగుతున్నదనిపించింది. మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ కత్తెర, దువ్వెన, అద్దం ఉన్న బాగును అందుకోడానికి రాధిక చేయి చాపగా ఆ చేయిని పట్టుకుని విశ్వనాథ్ చిన్న పిల్లల్లా ఏడవసాగాడు.
2
యాభై ఏళ్ళ విశ్వనాథంతో ముప్ఫై ఏళ్ళ నుంచీ రాధిక కాపురం చేస్తోంది. పొద్దున్నే లేచి పాలు లేకుండా టీ తాగి ఒక కప్పుడు మరమరాలు తిని అతడు ఊళ్ళో క్షవరం పనికి వెళ్తాడు. ఓసారి రెండు మూడు రూపాయలు వచ్చినా ఒక్కోసారి ఒకే రూపాయి వచ్చినా తృప్తి పడాల్సిందే. షావుకార్ల ఇండ్లలో పెళ్ళో పేరంటమో అయితేనో, కానుపో, చావో అయితేనో ఇంకొంచెం ఎక్కువ దొరుకుతుంది. కాకపోతే పుష్యమాసంలో మాత్రం పంట కోతలప్పుడు పంటలో కొద్ది భాగం దక్కుతుంది. ఏడాదంతా ఇలాగే క్షవరం పైసలు, కొద్దిగా పంటధాన్యం ఇంత కొంచెం ఆదాయంలో కూడా విశ్వనాథాన్ని ఇంత దిగులుగా ఉండగా చూడలేదు రాధిక.
చీరకొంగుతో విశ్వనాథం కన్నీళ్ళు తుడుస్తూ రాధిక, “ఏం జరిగిందో చెప్పకపోతే నామీదొట్టే” అంది.
“ఊళ్ళో ఎవరూ ఈమధ్య నా దగ్గర క్షవరం చేయించుకోవట్లేదు. అందరూ పట్నం సెలూన్ లోనే జుట్టు కత్తిరించుకుంటున్నారు.”
రాధికకిప్పుడర్థమైంది, విశ్వనాథం దిగులుకు కారణమేంటో. ‘అవును. కుర్చీలో కూర్చొని క్షవరం చేయించుకోవడంలో ఉన్న మజానే వేరు. ఈ కాలంలో రాతిబండమీద, చెట్టుకింద మునిగాళ్ళ ముడుచుక్కూర్చుని ఎవరు క్షవరం చేయించుకుంటారు?’ మనసులోనే అనుకుంది.
అయితే పైకేమీ మాట్లాడలేదు. విశ్వనాథానికి ధైర్యం చెప్తూ, “మీకేం తక్కువ? మీరు కూడా ఇక్కడ మన పురస్తంపూర్లో చౌరస్తా దగ్గర ఒక సెలూన్ పెడితే ఏం?” అంది.
“నేనా! సెలూనా!” సెలూన్ అనే పదమే పులినో, కొండచిలువనో అన్నట్టు పూర్తిగా అనకుండా మాట మింగేశాడు విశ్వనాథం. కళ్ళు చించుకున్నట్టుగా పెద్దవి చేసి చూస్తూ అన్నాడు. “సెలూనా! నేను సెలూన్ పెట్టడమా!”
విశ్వనాథం అదే అదే పదే పదే అంటున్నాడు. ‘అవును. నేనూ సెలూన్ పెట్టాలి. ఒక సెలూన్ పెట్టాలి. చూడాలి జనాలు ఈ నాయీ చేతుల్తో క్షవరం ఎలా చేయించుకోరో చూడాలి. తాత ముత్తాతల కాలం నుంచి మేము క్షవరం చేస్తూ చేస్తూ చేతులు చిల్లులు పడ్డాయి. మాకు పట్నం వాళ్ళ బెదిరింపులా! నాయీలంటే ఏమి రాయీ రప్పలనుకున్నారా! మొదటంతా పెద్దల నుంచి పిల్లల వరకూ జుట్టు గొరిగించుకోవడానికి చుట్టూ తిరిగేవారు. ఇప్పుడేమైంది? పనయ్యాక ఎవరు ఎంతిస్తే అంత సంతోషంగా తీసుకునే వాడిని. ఎప్పుడూ ఎవరినీ కాదనలేదు. ఎపుడైనా మాటైనా తూలానా? నన్నిలా పరాయోడిని జేస్తిరే? సెలూన్ లో కుర్చీలో కూర్చుంటారు. పెద్ద అద్దంలో మొగం జూసుకుంటారు. అంత మాత్రాన నన్ను మరిచిపోతారా! కనీసం పిల్లల పుట్టువెంట్రుకలకూ పిలవడం లేదు. పెడతా, ఎట్లైనా సరే సెలూన్ పెట్టేస్తా.’
భర్త ఆలోచన రాధికకు నచ్చింది. ఆమె మరింత ప్రోత్సహిస్తూ, “మా తమ్ముడూ చండీగుడి దగ్గర సెలూన్ బెట్టినాడు. వాడికి జెప్తే అన్నీ ఏర్పాటు చేస్తాడు.”
భర్త సెలూన్ పెడతాడని రాధిక సంతోషానికి పట్టపగ్గాలు లేవు. మురిసిపోతూ అంది, “యో, విను. సెలూన్ పేరు విశ్వనాథ్ సెలూన్ అని పెట్టు.”
“వద్దొద్దు. రాధికా సెలూన్ అని పెడతా.” సరసంగా అన్నాడు విశ్వనాథం.
సిగ్గుపడిపోయి వేళ్ళు కొరుక్కుంటూ, “ఛీ ఛీ అదేం మాట? ఎవరైనా ఏమనుకుంటారు? నాకు సిగ్గు. జనాలు క్షవరానికి వస్తారు. మీరు మీ పేరే పెట్టండి.”
3
విశ్వనాథం అడిగాడు, “ఊ.. మరెవరి పేరు పెట్టాల్నో?”
మన కొడుకు ‘ధర్మా’ పేరు పెడితేనో!” విశ్వనాథ్ ఈ ప్రశ్న వస్తుందనుకోలేదు. ‘గుండె మండిపోతుంది అలా అంటే, చెప్తున్నా చూడు. ఎన్ని పూజలు చేస్తే పుట్టాడు వాడు దేవుని దయతో! చదువు బాగా వస్తుందో లేదో గానీ నాలాగా అందరికీ క్షవరం మాత్రం చేయనివ్వను.’ అంటూ గట్టిగా అరిచాడు.
రాధిక అడ్డుపడుతూ, “ఇందులో తప్పేముంది. తాత ముత్తాతల కాలం నుంచి మీరిదే చేస్తూ వస్తున్నారు గదా! మీరు నాలుగు డబ్బులు సంపాదిస్తారు. వాడూ ఏదో కొంత సంపాదించుకుంటాడు. వాడి పేరుతో ఉంటే వాడికీ పోవాలనిపిస్తుంది.”
రాధిక మాటలకు విశ్వనాథం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. “అలా మాట్లాడకు. నాలుగు డబ్బులు ఎక్కువొస్తాయని నేను నా కొడుకుతో క్షవరం పని చేయిస్తానా? నా కొడుకు నాలాగే బతుకంతా క్షవరం చేసుకుంటూ బతకాలా? నా కొడుకు భవిష్యత్తు కన్నా నీకు పైసలెక్కువైనాయా? ఛీ!”
రాధికకు అర్థమయింది. తన మాటలకు విశ్వనాథం గాయపడినాడని. పరిస్థితిని సంభాళిస్తూ, “అయితే, మనం మన ఊరి దేవుడు అమరేశ్వర ఠాకూర్ పేరుతో సెలూన్ పెడదాం, బాగుంటుంది. ఏమంటారు?”
విశ్వనాథ్ కు ఈ మాట బాగా నచ్చింది. ఎంత నచ్చిందంటే కాస్సేపటి క్రితం తాను పడిన దిగులంతా మరిచిపోయేలా అనిపించింది. ముంగిట్లోకెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కోడానికి వెళ్తూ ‘రామయ్యా వస్తా భయ్యా.. రామయ్యా వస్తా భయ్యా.. మై నె దిల్..!’ కూనిరాగాలు తీస్తున్నాడు.
కొన్ని నెలలు గడిచాయి. పురస్తంపూర్ చౌరస్తా దగ్గర ఒక గుడిసె ముందు సైన్ బోర్డ్ వేలాడుతూ కనిపించింది. ‘నమస్తే – శ్రీ అమరేశ్వర్ సెలూన్ – ప్రొ. విశ్వనాథ్ బారిక్.’
మొదటి రోజు విశ్వనాథం ఒక పెద్ద డబ్బా నుంచి పెద్ద అద్దం తీసి టేబుల్ మీద పెట్టాడు. ఎంత పెద్ద అద్దం! తల నుంచి కాళ్ళ వరకూ అంతా బాగా కనిపిస్తుంది. ఛాతీ, మెడ, నాభి అన్నీ కనిపిస్తాయి. కాళ్ళ గోళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తాయంటే నమ్మాలి!
అద్దం ముందు విశ్వనాథం మొదటి సారి తనను తాను పరిశీలించి చూసుకున్నాడు. తన మొగమే తనకు కొత్తగా కనిపించింది. మనసులోనే నవ్వుకున్నాడు. తర్వాత కోపంలో తన మొగం ఎలా ఉంటుందోనని కళ్ళు పెద్దవి చేసి అద్దం వైపు చూశాడు. తర్వాత క్షవరం చేయించుకునే వాళ్ళలాగా చెంపలలో గాలి నింపి అద్దం వైపు చూస్తూ, ‘ఏయ్ నేను తెలుసా నీకు? చూడు.. ఇప్పుడు.. ఏమీ చెప్పకపోతే.. పద పద!’ తన అరుపులకు తానే ఉలిక్కి పడ్డాడు. అర్రె ఎందుకింత కులుకు తనకు?
ఇక ఒక్కొక్కటిగా అంగట్లో సామాన్లు సర్దడం మొదలుపెట్టాడు. కత్తెర, టవల్, సబ్బు, దువ్వెన, రేజర్, గిన్నె అన్నీ సరిగ్గా ఉన్నాయి. ఇదసలు సెలూన్ లా లేదు ఒక అందమైన దుకాణంలా ఉంది.
కుర్చీని పట్టుకొని గట్టిగా లాగాడు. లేదు, బలంగానే ఉంది. ‘నా తర్వాత నా కొడుకు హయాం కూడా గడచిపోతుంది’.
4
కొడుకు మాట తలచుకోగానే విశ్వనాథం మనసులో దిగులుగా అనిపించింది. పెద్దింటి పిల్లల్లా చదువుకొని ఉద్యోగం చేస్తే ఎంత బాగుండేది! వాళ్ళమ్మ ఏమీ చేయనియ్యదు. వాళ్ళమ్మ వల్లనే వాడూ బేవార్సుగా తయారైనాడు. మెట్రిక్ పరీక్ష మూడు సార్లు తప్పాడు. ఏమో ఈసారేం చేస్తాడో! ఒకసారి తాటిచెట్టెక్కితే, ఇంకోసారి మామిడిచెట్టు. వెదురు చెట్ల కింద కూర్చుని బస్తీ బద్మాష్ పిల్లలతో కలిసి పేకాడుతుంటాడు.
సెలూన్ కి వచ్చి నాకు చేదోడుగా ఉంటాడంటుంది రాధిక. ఎవరికి తెలుసు? అసలు పనేమైనా చేస్తాడో లేదో!
కుక్క మొరగడంతో లోకంలోకొచ్చాడు విశ్వనాథం. తనెందుకింత ఆలోచిస్తున్నాడో అనుకున్నాడు. నెత్తి మీద బరువు పడితే వాడే దార్లోకొస్తాడు. బయటికి చూశాడు. మనిషి జాడ లేదు. ఏ వేళప్పుడు దుకాణం పెట్టానో, ఒక్కరైనా రాలేదు. ఊళ్ళో వాళ్ళందరూ సెలూన్ కైతేనే వెళ్తున్నారని ఉన్న ఆవు, ఎద్దులను తెగనమ్మి, అప్పు జేసి ఈ సెలూన్ పెట్టాడు. ఒకవేళ ఇక్కడికి ఎవరూ రాకపోతే ఏం చేయాలో! మునిగిపోతాడంతే. నిర్భాగ్యుడవుతాడు. అంతకన్నా చావడం మేలు. జనాలకు తన పని నచ్చకపోతే, అసలు ఇటు ఎవరూ రాకపోతే, బదికి లాభమేమి?
విశ్వనాథ్ అమరేశ్వర దేవుడిని తలచుకొని చేతులు జోడించాడు. ‘ప్రభూ, నాకు డబ్బవసరం లేదు. జీవితాంతం జనసేవ చేసుకుంటాను. ఇంత మాత్రం దయ చూపించవయ్యా.’
కింద కూర్చుంటూ విశ్వనాథం మనసులో ఆలోచిస్తున్నాడు. ‘జనాలు తప్పక వస్తారు. ఈ కుర్చీలో కూర్చుని ఇంత పెద్ద అద్దంలో మొగం చూసుకుంటూ క్షవరం తప్పక చేయించుకుంటారు. తానేం అట్టాంటిట్టాంటి మంగలి కాదు. నాయీ తాను. ఎవరైనా ఒకసారి సేవించుకోనిచ్చారంటే , తనను ఎవరూ మరిచిపోరు. తప్పక వస్తారు జనం..!’
జనాలు వస్తారు. అతడిని ఇష్టపడుతారు అని ఆలోచిస్తుంటే అతడు ఉత్సాహంగా ఉన్నాడు. లేచి నిలబడ్డాడు. తన మొగం అద్దంలో చూసుకున్నాడు. మొగం ప్రశాంతంగా ఉంది. తనలో తానే ‘నాయీ, నీవు ధన్యుడివి. నీ భార్య నీకు బుద్ధి ఇచ్చింది. లేకపోతే నీవు బేకారుగా ఉండవలసింది. కత్తెరెయ్, ఏయ్ కత్తెరెయ్! ఇక ఎంత మంది జుట్టు గొరుగుతావో గొరుగు! గొరుగు!’
“నాయనా విశ్వనాథం! కుశలమే కదా!”
ఉలిక్కిపడి విశ్వనాథ్ తలతిప్పి చూశాడు. వెనుక భోలా చౌదరి, ఇక్కడి జమీందారు. వీరులు. తండ్రి చెప్పగా వినేవాడు. ఎవరైనా జమీందార్ సాబ్ కు దండం పెట్టకుండా ముందుకు వెళ్తే, జమీందారు మనుష్యులు ఆ మనిషిని తీసుకెళ్ళి కాళ్ళూ చేతులూ కట్టేసి, కొబ్బరి చెట్టుకు కట్టేస్తారు. వాడి దేహానికి అశుద్ధం పూస్తారు. మేకకూ పులికీ ఒకే ఘాట్ లో నీళ్ళు తాపగలవాడీ జమీందార్. ఇప్పుడు జమీందారీ లేదు గానీ ఆ డాబు అలాగే ఉంది.
విశ్వనాథం తన మీసాలు గాలికి కదలడం చూస్తున్నాడు. బట్టతల వల్లో నూనె వల్లో బుఱ్ఱ మెరుస్తోంది. ధోవతి కర్పూరం వాసన వేస్తోంది. మాట్లాడేటప్పుడు నోట్లోంచి తాంబూలం వాసన వస్తోంది. చిన్న చిరునవ్వు దోబూచులాడుతోంది.
విశ్వనాథానికి కు ఇప్పుడు చౌదరిసాబ్ ఏమంటారో తేటతెల్లంగా కనిపిస్తోంది. ‘ఒరే దొంగనాకొడకా! సెలూన్ పెడుతున్నట్టు ఓమాటైనా అనలేదు గదరా! ఎంత కావరం! ఉండు ఇప్పుడే నిన్ను కట్టేసి నీ మొగానికి అశుద్ధం పుయ్యమంటాను. చంపేస్తానొరేయ్!’ అనకుండా ఉండడు.
5
విశ్వనాథం రాధికను లోలోపలే తిట్టుకోసాగాడు. ‘ఆడవాళ్ళ మాటవిని పనులు చేస్తే ఇట్లే ఉంటుంది. సెలూన్ పెట్టే దుర్బుద్ధి నాకెందుకు పుట్టించాలి! ఒకటే మాట డబ్బులొస్తాయి.. దండిగ డబ్బులొస్తాయంటూ. ఇప్పుడనుభవించు. నా చావు నే చస్తాను. నీ పరువూ పోతుంది. నా కొడుకు కూడా వాడి తప్పేం లేకున్నా దెబ్బలు తింటాడు.’
విశ్వనాథం చౌదరి కాళ్ళ మీద తల పెట్టి నమస్కారం చేస్తూ అతి దయనీయంగా అడిగాడు. “సాబ్! మన్నించండి. పెద్ద పొరబాటు జరిగిపోయింది. ముక్కు నేలకు రాస్తాను. సాబ్, ఈ అధముడిని మన్నించండి.”
విశ్వనాథ్ అలా వేడుకుంటుంటే, చౌదరీ సాబ్ అతడి రెండు చేతులూ పట్టుకుని లేపాడు. విశ్వనాథం చేతులు నేరస్తుడిలా కంపిస్తున్నాయి. చౌదరి అతని ఎదురుగా నిలబడి, “భయపడకు విశ్వనాథం భయపడకు.” అన్నాడు.
విశ్వనాథం నమ్మనేలేకపోయాడు. ఇతడు భోలా చౌదరేనా? ఆయనెప్పుడూ నన్ను పేరుపెట్టి పిలవలేదు. విశ్వనాథానికింకా వణుకు తగ్గలేదు. చౌదరి నవ్వుతూ అడిగాడు, “సెలూన్ ఎప్పుడు పెట్టావు?”
“హుజూర్, ఈ రోజే పెట్టాను. ఇప్పుడే సాయంత్రమే తీసేస్తా. సెలూన్ మూసేస్తా.”
చౌదరి మళ్ళీ నవ్వి, “ఒరేయ్, దీన్ని కూలగొడతావా ఏమి? నీవు సెలూన్ పెట్టావు. నాకు చాలా సంతోషం.”
చౌదరి మాటలు విశ్వనాథ్ కు ముసలి పులి, బంగారు కంకణం కథను గుర్తుకు తెచ్చాయి.
అతడు తన మీద జరగ్గల అత్యాచార దృశ్యం గురించి ఆలోచించి, బెదిరిపోతున్నాడు. ఇప్పుడు చౌదరి జమీందారులా వెళ్ళి సెలూన్ లోపలి పెద్ద కుర్చీ మీద కూర్చున్నాడు. విలాసంగా కాళ్ళూపసాగాడు.
గణేశుని పాదాల వద్ద ఎలుక కూర్చున్నట్టు విశ్వనాథ్ చౌదరి కాళ్ళవద్ద ఒక నేరస్థుడిలా మునికాళ్ళ మీద కూర్చున్నాడు. శ్రీకృష్ణుని స్టైల్లో నవ్వుతూ చౌదరి అడిగాడు. “విశ్వనాథం! ఎవరి బొమ్మ రా అది? ఎవరిది ఇక్కడ తగిలించావు?”
గోడ మీద శ్రీదేవి, సంజయ్ దత్, సోనాలీ బెంద్రె, హౌరా బ్రిడ్జ్, నితాయీ గౌర్ చిత్రాలున్నాయి. విశ్వనాథ్ చూశాడు. మళ్ళీ సాబ్ కాళ్ళమీద పడి క్షమాపణ అడిగాడు. “తప్పై పోయింది. మన్నించండి.” అంటూ.
చౌదరి మాత్రం అతనికి హుషారునిచ్చేలా మెచ్చుకున్నాడు. “భలే బాగుంది నీ సెలూన్.”
విశ్వనాథానికి ఏమనాలో తోచలేదు.
“అరె, మంచి అద్దం కూడా పెట్టావు.”
మెచ్చుకోళ్ళకు కూడా సంతోషపడలేకపోయాడు విశ్వనాథం. చౌదరి మరింత మృదుస్వరంతో అడిగాడు, “చూడబ్బాయ్ విశ్వనాథం! ఒక తలకెంత తీసుకుంటావో చెప్పు.”
విశ్వనాథం భయంతో బదులు పలికాడు. “రెండ్రూపాయలనుకున్నానండి.”
చౌదరి గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు సెలూన్ అంతా మారుమ్రోగింది. శ్రీదేవి, హౌరా బ్రిడ్జ్ ఫోటోలు అదిరాయి. విశ్వనాథానికి ఎక్కువ చెప్పానేమో అనిపించింది. ఉన్నట్టుండి చౌదరి నవ్వాపేసి, “ఒక తలకు రెండు రూపాయలైతే లక్షలు సంపాదించాలంటే ఎన్ని తలలు కొట్టాలి?”
6
లక్ష! జీవితంలో ఆ పదం విన్నదే రెండు మూడు సార్లు. కానీ ఇప్పుడు చౌదరి నోట ఆ మాట మరీ భయంకరంగా అనిపించింది. రెండు చేతులూ జోడించి, “నేను చదువురానోడ్ని, మొరటోడ్ని సాబ్. నాకు మీ మాటలు అర్థం కావు.”
చౌదరి అన్నాడు, “విశ్వనాథం, నీవు గనక ఒక తలకు రెండు రూపాయలు తీసుకుంటే, ఒక లక్ష సంపాదించేలోపు నీవు గడ్డిపరకవై పోతావు.”
“నిజం సాబ్. నా ఏడు తరాలు కాదు గదా పధ్నాలుగు తరాలలో ఎవరూ లక్షలు సంపాదించడం సాధ్యం కాదు. లక్షలెక్కడ? మేమెక్కడ?” అన్నాడు విశ్వనాథం.
“కానీ సంపాదించగలవోయ్ లక్ష.” చౌదరి అన్న ఈ మాట విశ్వనాథానికి మబ్బులు లేకుండా పిడుగు పడినట్టైంది. చెవుల్లో ఏదో రొద. వీలైనంత తల వంచుకొని, “అభాగ్యుడ్ని. మీ ఎంగిళ్ళతో మా పిల్లలు పెరుగుతారు సాబ్. నా తలరాతలో అవన్నీ ఎక్కడివి?”
చౌదరి ఏదో చెప్పాలనుకొనే లోపల దుకాణానికి ఒక వ్యక్తి రావడం చూసి ఆగిపోయాడు. వెళ్తూ వెళ్తూ, “నీ తలరాతలో లక్షలున్నాయి. కానీ నీవు ఆలోచించి నడచుకుంటే అన్నీ జరుగుతాయి.” బూట్లు టకటకలాడించుకుంటూ, చేతికఱ్ఱ నూపుతూ వెళ్ళిపోయాడు.
విశ్వనాథం మనసులో అనుకుంటున్నట్టుగా, ‘ఒక్క క్షణం ఆగుండొచ్చు కదా.. సర్లే.. అంతా నా ప్రాప్తం’ – ఆ మనిషి జుట్టు మీద కత్తెర పెడుతూ అన్యమనస్కంగా అనేశాడు, “మీరు రేపు వచ్చింటే బాగుండేది సెలూన్ కు.”
ఆ రాత్రి విశ్వనాథానికి నిద్ర రాలేదు. రాధికను పిలిచాడు.
“ఏయ్ నిద్రపోతున్నావా?”
“ఊ.. రోజంతా పనెక్కువ ఉండింది. అలసిపోయాను.” రాధిక పక్కకు పొర్లుతూ చెప్పింది.
“నిద్ర చాలు గానీ నా మాటొకటి విను. మనకు ఒక లక్షరూపాయలు వస్తే, నీకింకా వేరే వాళ్ళిండ్లలో పనికి పోవాల్సిన పని లేదు.”
రాధిక ఉలిక్కిపడింది. ‘తాగి గానీ వచ్చాడా ఏమి?’ అని ఆలోచింది. వాసన పీల్చి చూసి దేవునికి మొక్కింది. విశ్వనాథం పరాకుగా అడిగాడు. “ఏమాలోచిస్తున్నావు?”
“దేని గురించి?”
“అరె, అదే లక్షరూపాయల గురించి.”
కల్లాకపటం తెలీని, ఏ కోరికలూ లేని తన భర్త కలలు కంటున్నాడని రాధికకర్థమైంది. చింతల్లో మునిగిన వాడికి కలలు కనే అదృష్టమెక్కడిది? ఇప్పుడిన్ని రోజుల తర్వాత ఈ దుకాణం పెట్టాక, కలలు కనే ధైర్యం వచ్చింది.
సరే, అడుగుతున్నప్పుడు ఓ రెండు మాటలు చెప్తే ఏమైందిలెమ్మనుకుంది. బాగా ఆలోచించి చెప్పింది, “లక్షల రూపాయలు గనక వస్తే, మీకొక మంచి చొక్కా కొనాలి. ఒక ఇత్తడి గిన్నె కొనాలి. బయట తులసి కట్టకు సిమెంట్ వేయించాలి.”
రాధిక మాటలు విని విశ్వనాథం నవ్వసాగాడు. “ఆడోళ్ళ బుద్ధి ఇంతేనని జనాలు నిజమే చెప్తారు. లక్షలరూపాయలంటే పది ఇరవై రూపాయలనుకున్నావా? లక్షలంటే” అని రెండు చేతులూ వీలైనంత చాపి ఎంతెక్కువో, ఎంత గొప్పో చెప్పే ప్రయత్నం చేసి, అదింకా చిన్నదని అర్థం చేసుకొని ఇలా అన్నాడు.
7
“లక్షల రూపాయలతో తులసికట్టకు సిమెంట్ వేయిస్తావా? కావాలంటే నీ కొడుక్కు ఒక మోటర్ సైకిల్ కూడా కొనొచ్చు తెలుసా!”
రాధిక కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా, “ఏంటీ.. లక్షలంటే అంతెక్కువా?” అంది.
రాధికకన్నా తనకెక్కువ తెలుసని విశ్వనాథం లోపల్లోపలే భలే సంతోషపడ్డాడు. రాత్రంతా అదే ఆలోచించాడు. ‘ఛ చౌదరీసాబ్ ఏదో ఊర్కే అనుంటాడు. లేకపోతే లక్షల రూపాయలెక్కడ? నేనెక్కడ?’
రెండోరోజు మధ్యాహ్నసమయం. మనిషి జాడ లేదు. సెలూన్ తలుపులు సగం మూసి విశ్వనాథం అలసట తీర్చుకోడానికి నడుం వాల్చాడు. ఉన్నట్టుండి భోలా చౌదరి అక్కడికొచ్చాడు. ఆయన చెప్పుల శబ్దం విని విశ్వనాథం కుర్చీనుంచి లేచి ఆయన పాదాల మీద తలవాల్చాడు. వెంటనే లేచి కుర్చీని తన తుండుగుడ్డతో తుడిచిపెట్టాడు. దేవదూతలా ఆయన వచ్చినట్టు, వచ్చి తన చెవిలో ఏదో మంత్రం ఊదినట్టు, వెంటనే తాను లక్షాధికారి అయినట్టు భావించాడు. లక్షల రూపాయల కల అతడిని పిచ్చోడిని చేసేసింది. చౌదరి నోటి నుంచి వచ్చే మాట వినడానికి తపన పడిపోయాడు. జనాలు చౌదరి గురించి అబద్ధాలు చెప్పేవారని, ఆయనెంతో మంచివాడని లోలోపలే అనుకున్నాడు.
విశ్వనాథం ఈరోజు మరింత ఉత్సాహంగా ఉండడాన్ని చౌదరీసాబ్ గమనించాడు. కుర్చీలో కూర్చుంటూ, “ఒరేయ్, నిన్న చెప్పిన మాటేం జేశావు? ఏమంటావు?”
“చిత్తమయ్యా”
“ఏమంటావు?”
“లక్షల రూపాయలు. చాలా పెద్ద మొత్తం సాబ్. మేం చిన్నోళ్ళం. మాకెక్కడిదంత ప్రాప్తం సాబ్?”
“వస్తాయి. తప్పక వస్తాయి. ‘అకస్మాత్’ అనే మాటెప్పుడూ వినలేదా? చూడు, నీవు దారెంట వెళ్తున్నావనుకో. ఉన్నట్టుండి ఒక బంగారు నాణెం దొరికిందనుకో..”
“అట్లా జరుగుతుందంటారా సాబ్?”
“ఒరేయ్, మహాభారతం చదివావా లేదా?”
“లేదు. విన్నాను. బ్రాహ్మణుల ఇండ్లలో మహాభారతం గురించి చర్చ జరుగుతుండింది. నేను విన్నాను.”
చౌదరి ప్రవచనం చెప్తున్నట్టుగా చెప్పాడు, “ఆహా! శ్రీకృష్ణుడు తలచుకుంటే యుద్ధం ఆపలేకపోయేవాడా?”
“తప్పక ఆపగలిగేవాడు.”
“కానీ భగవంతుడు అర్జునునితో ఏం చెప్పాడు? చెప్పు.”
“యుద్ధం చేయమన్నాడు.”
8
బహుశా విశ్వనాథం ఇంత చిన్న జవాబు బహుశా చౌదరికి తృప్తి కలగలేదు. అందుకే మాటలను తిరగేసి మరగేసి చెప్పసాగాడు. “యుద్ధం చేయమని మాత్రమే చెప్పలేదు. నీవు నీ మామ, సోదరుడు ఎవరెదురుగా ఉంటే వాళ్ళందరినీ చంపెయ్యి. ఎందుకంటే ఇది మాయ. ఇదంతా మాయనే. విశ్వనాథం, మొత్తమంతా మాయనే.”
తలొంచుకొని విశ్వనాథం “ఊ.” అన్నాడు.
చౌదరి మళ్ళీ చెప్పసాగాడు. “ఒరేయ్, నీవు శ్రీకృష్ణుడికన్నా పెద్దవాడివేంరా?”
“లేదు సాబ్. నేను ఆయన అశుద్ధంలో పురుగును.”
విశ్వనాథం మాటలతో మరింత ఉత్సాహంతో చౌదరి ఇలా అన్నాడు. “మనూళ్ళో శామా మహంతి నీకు తెలుసు కదా.”
చౌదరి మాటలకు విశ్వనాథం ఠక్కున లేచి నిలబడి, “ఛీ ఛీ సాబ్.. ఆయన పేరెత్తకండి మీరు. ఆయన మీకందరికన్నా పెద్ద శత్రువు. మీలాంటి దేవుడంటి వ్యక్తిమీద వాడు కేసు పెట్టాడు. వాడి ధైర్యం చూడండి. కుక్కచావు చస్తాడు చూస్తూ ఉండండి. భగవంతుడు వాడిని వదిలిపెట్టడు.”
చౌదరిని ఖుష్ చేయడానికి విశ్వనాథం శామా మహంతిని తిట్టాడు. చౌదరి కూడా తన నంబర్ వన్ శత్రువు గురించి ఇలా విని లోపల్లోపలే సంతోషపడ్డాడు. ఇంకొకరి నోట శత్రునింద, సంతోషపెడుతుంది. ఈ సంతోషం చౌదరికీ కొత్తదే. మున్నెన్నడూ ఇలా అనిపించలేదు. ఉన్నట్టుండి విశ్వనాథం తిట్లను ఆపుతూ, దగ్గరికి పిలిచి, “లక్షాధికారివవుతావా?” అన్నాడు.
పగటి కల అది. అలా అనుకుని విశ్వనాథం కళ్ళు మూసుకున్నాడు. చౌదరి ‘తలుపు వేయ’మన్నాడు.
విశ్వనాథం వెంటనే సెలూన్ తలుపు వేసి వచ్చాడు. చౌదరి, “తలుపవతలికి చూడు. ఎవరికైనా ఏమైనా కనిపిస్తుందా?”
“లేదు సాబ్.”
“అయినా బయటివాళ్ళకేం తెలుస్తుందిలే ఇక్కడ జరిగేది! తెలుస్తుందంటావా?”
“లేదయ్యా”
చౌదరి తన చెవి దగ్గరికి రాగానే విశ్వనాథం కళ్ళు మూసుకున్నాడు. చౌదరీ సాబేమన్నా మంత్రం ఉపదేశిస్తాడేమోనన్నట్టుగా.
చౌదరీసాబ్ గుసగుసగా, “ఎప్పుడోసారి శామా మహంతి నీ సెలూన్ కు క్షవరానికి రానే వస్తాడు. అప్పుడో పని చేయి. మెల్లగా తలుపు వేసేసి క్షవరం చేసే సాకుతో వాడి గొంతు కోసెయ్యి. నేన్నిన్ను లక్షాధికారిని చేసేస్తా.”
చీకట్లో కాల్లో ముల్లు గుచ్చుకున్నవాడిలా విశ్వనాథం సెలూన్ లో ఇట్నించటు, అట్నించిటు ఆడసాగాడు. పెదవులు ఎండిపోతున్నాయి. నాలుక కురచైపోయి, గొంతులోకెళ్ళిపోయిన భావన, నలుదిక్కులా చీకటే చీకటి అన్నట్లుంది. లక్షరూపాయల మోహం తునాతునకలైపోయింది. అతడున్నట్టుండి సెలూన్ వదిలిపెట్టి పరుగు తీయాలనుకునేలోపే చౌదరి వాడిని పట్టుకున్నాడు. “ఒరే పిచ్చోడా, అంతగా ఏమైందిరా? నీకేమీ కాదు. డ్రైవర్ బండి నడుపుతాడు. దేన్నో గుద్దేస్తాడు. డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు. రోగి ఛస్తాడు. వాళ్ళని ఉరి తీస్తారా ఏం?”
9
విశ్వనాథం ఏడుస్తూ చౌదరి కాళ్ళ మీద పడి వేడుకోవడం మొదలుపెట్టాడు. “నేను చావనైనా చస్తాను హుజూర్, నా పైన దయచూపండి. నామీద కనికరం చూపండి. ఇంత పెద్ద నేరం నేను చేయలేను. నాకు నరకంలో కూడా చోటుండదు.”
చౌదరికి విశ్వనాథానికి ధైర్యం లేదని అర్థమైంది. మండిపడిపోతూ, “ధర్మం పాటించు. నీ తలరాతలో ఏం లేదు. బతుకంతా రోగిష్టోళ్ళకు, దరిద్రులకు కాలిగోళ్ళు తీసుకుంటూ కూర్చుంటే నీకేం దక్కదు. ఏమనుకున్నావ్? నీవు గాకపోతే ఈ పని చేసేవాళ్ళెవరూ లేరనుకున్నావా? సిగ్గులేనోడా! అట్లే చూస్తుంది. నీ ముందే జనాలు లక్షాధికార్లవుతారు.” ఒక్క గుక్కలో ఇన్నీ అనేసి చౌదరీ సాబ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
చౌదరి వెళ్ళిపోయాక, విశ్వనాథం సెలూన్ మూసేసి ఇంటికి వచ్చాడు. ఇక సెలూన్ మూసేయాలని లోపల్లోపలే నిశ్చయించుకున్నాడు. కత్తెర, రేజర్ ఇంక చేత్తో ముట్టుకోకూడదనుకున్నాడు. ఇట్లే లోకంలో జనాలు నమ్మకం, విశ్వాసం పోగొడతారు.
రాత్రి రాధిక అడిగింది. “ఏమైంది?”
విశ్వనాథం, “సెలూన్ మూసేస్తున్నానింక.”
రాధిక లేచి కూర్చుంది. దగ్గర్లో ఉన్న లాంతరు వత్తి లాగి పెద్దది చేసింది. చూస్తే విశ్వనాథం కళ్ళలో నీళ్ళు. “వ్యాపారం పుంజుకుంటుంది, ఈరోజు కాకపోతే రేపు. దేవుడిపై భారం వేయండి.”
విశ్వనాథం చిరాకు పడ్డాడు. “దేవుడి పేరెత్తొద్దు, చెప్తున్నా. ఈ కాలంలో ఏ దేవుడూ గీవుడూ లేడు. ఇవన్నీ పనికి రాని మాటలు.”
దేవుని ప్రసక్తితో భర్తకు సాంత్వన దొరకదని రాధికకర్థమైంది. “మనము సత్యమార్గంలో ఉన్నాము. మనకేం కాదు. మనం అదర్మాన్ని సమర్థిస్తేనే గదా ఏమైనా అయ్యేది!”
విశ్వనాథం మొహం వెలిగిపోయింది. దారి తప్పిన బాటసారికి, దారి దొరికినట్టు. ఇప్పుడతడు రాధిక దగ్గరికొచ్చి, ఇలా అడిగాడు. “సరే ఇప్పుడో మాట చెప్పు నేను క్షవరం చేస్తున్నప్పుడు నా చేతులు వణికి, ఎవరి మెడైనా తెగితే?” రాధిక మధ్యలోనే ఆపుతూ, “ప్రభుశ్రీ పరమేశ్వరుని మీద నమ్మకముంది. అలా ఎప్పుడూ జరగదు. మీరు నలభై ఏళ్ళ నుంచి క్షవరం చేస్తున్నారు. అలా ఎప్పుడైనా జరిగిందా? మీరు ధర్మమార్గంలో ఉన్నారు. అలా ఏమీ జరగదు.”
“చెప్పాను కదా ఈ కాలంలో ధర్మం, అధర్మం ఏవీ లేదు.” విశ్వనాథం సంకోచిస్తూ చెప్పాడు.
“లేవా? ధర్మబలంతోనే సూర్యచంద్రుల రాకపోకలు!” రాధిక మాటలతో విశ్వనాథానికి పోయిన బలం మళ్ళీ వచ్చినట్టైంది. రాధికకు మరింత దగ్గరగా జరుగుతూ, “నీవు చెప్పింది నిజం. నా చేతులు వణకవు.” అన్నాడు.
“నిజం. నిజం. ముమ్మాటికీ నిజం.” రాధిక అంది. విశ్వనాథం కళ్ళు తుడుచుకుంటూ, “నేనా రోజు నీతో లక్షల రూపాయల మాట చెప్పాను కదా? నీవదేం నిజం అనుకోకు.” అన్నాడు.
రాధిక విశ్వనాథం మాటలకు తలూపుతూ, “మీరు కష్టపడి రెండు పైసలు సంపాదిస్తారు. అదే నా పాలిటికి పరమాన్నం, పాలకోవా. మీరు ఒక వేళ అధర్మమార్గంలో వెళ్ళి లక్షల రూపాయలు సంపాదించినా అది కుక్క పీతిలా దుర్గంధమే నా పాలిటికి.” అంది స్థిరంగా.
రాధిక మాటలతో విశ్వనాథం మనసులోంచి చౌదరి భూతం దిగిపోయింది. తర్వాత అతడు నిశ్చింతగా నిద్రపోయాడు.
రెండో రోజు నుంచే విశ్వనాథం లోలోపలే సంతోషంగా పాటలు పాడుకోవడం మొదలుపెట్టాడు. పొద్దున రాత్రి సెలూన్ అద్దంలో తన మొహం చూసుకుంటూ, ‘నా మొహం ఎంత బాగా విచ్చుకున్నట్టుంది! దాంట్లో ధైర్యం కుప్పలు తెప్పలుగా ఉంది.’ అనుకుంటూ తన వీరత్వానికి శభాష్ చెప్పుకుంటూ చౌదరిని తిడుతుంటాడు.
ఒకరోజు పొద్దున్నే దుకాణం తెరవడానికి వెళ్తుండగా అల్లరి కొడుకు ధర్మానంద్ వచ్చి తండ్రి శరీరానికి అతుక్కుపోతూ, “నాన్నా, నన్నెప్పుడు మీతో పాటు ఎందుకు తీసుకుపోరు? నేనూ మీతో పాటు పని చేస్తా. మీకు సహాయం చేస్తా.” అన్నాడు.
ఇన్ని రోజులనుంచి కొడుకును గురించి పెద్ద పెద్ద కలలు కంటున్న విశ్వనాథం తెల్ల మొహం వేశాడు. “వద్దొద్దు. నీవు రావలసిన అవసరం ఏమీ లేదు. ఎంత డబ్బు ఖర్చయినా సరే, నేను జూసుకుంటా. నీవు బాగా చదువుకో చాలు” అని కోప్పడ్డాడు.
ధర్మానంద్ మొండిపట్టు పట్టాడు “నేనూ సెలూన్ కు వస్తాను.” అని. రాధిక కూడా నచ్చచెప్పింది, కానీ కొడుకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇక చేసేది లేక రాధిక కొడుకు పక్షం వహించి మొగుడికి నచ్చజెప్పింది. “వాడెక్కడ బాగా చదువుకుంటాడు? మెట్రిక్ లో మూడు మూడు సార్లు పల్టీకొట్టాడు. మొండిపట్టు పట్టాడు. తీసుకెళ్ళండి. మీకు సహాయం చేస్తాడు.” అంది.
విశ్వనాథానికి తన కల చెదిరిపోతూ కనిపిస్తోంది. ‘ధర్మానంద్ గొప్ప దొర అవుతాడని, తాను సాబ్ వాళ్ళ మాదిరి కుర్చీలో కూర్చొని వేరే వాళ్ళతో క్షవరం చేయించుకుంటాడు అనుకుంటే వీడేంటీ తాను సాబ్ కాకుండా సాబులకు క్షవరం చేస్తానంటాడు!’
అతనికేమీ నచ్చలేదు. ఏమీ అనడానికి ధైర్యం చాల్లేదు. జంకుతో, “నాకేం బాగనిపించడంలేదు. కానీ, రావాలనుకుంటే రానీ.”
10
సెలూన్ లో ధర్మానంద్ ప్రవర్తన విశ్వనాథానికి విచిత్రంగా అనిపించింది. పిల్లోడు దొరలకు క్షవరం చేసేటప్పుడు హిందీ పాటల కూనిరాగాలు తీస్తాడు. ఎవరూ లేకపోతే తన జుట్టు తనే సరిచేసుకుంటుంటాడు. చేతికి కడియం, మెడలో తావీదు.
విశ్వనాథానికి ఎన్నో ఆలోచనలు బుఱ్ఱలో తిరుగుతున్నాయి. ఉన్నట్టుండి వీడెందుకు వస్తానన్నాడు? ఎవరు పురిగొల్పారు? భోలా చౌదరి గానీ కాదు కదా!
చౌదరి మాట గుర్తుకురాగానే విశ్వనాథం బుఱ్ఱ పని చేయలేదు. ధర్మానంద్ మాటలేవీ నమ్మేలా లేవు. తర్వాత అతడు కొడుకునే గమనించసాగాడు. కొద్దిగా అంచనా వేసే ప్రయత్నం చేశాడు. ‘మళ్ళీ, కాదులే నా కొడుకు అలాంటి వాడు కాదు.’ అని తనకు తానే నచ్చజెప్పుకున్నాడు. కొడుకు బుద్ధిమంతుడైనాడు. తండ్రికి పనిలో తోడుగా వచ్చాడు అనుకున్నాడు.
రోజులు గడవసాగాయి, విశ్వనాథానికి తన కొడుకు తండ్రికి సహాయం చేయడానికే సెలూన్ వచ్చాడని నమ్మకం కలిగింది. కానీ ఒక సాయంత్రం భోలా చౌదరి వచ్చి దుకాణానికి కొద్ది దూరంగా నిలబడి, కొడుకు వంక చూస్తున్నాడు. ధర్మానంద్ ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఇది చూసిన విశ్వనాథానికి ఒళ్ళు మండిపోయింది. అనుమానంతో, భయంతో నుదుటన చెమటలు పట్టాయి. గంభీరంగా తన కొడుకుతో అన్నాడు, “నీవు రేపటి నుండి సెలూన్ కు రావద్దు. నీవు జుట్టు సరిగ్గా కట్ చేయడం లేదని అందరూ అంటున్నారు.”
ఇంటికెళ్ళి రాధికతో కూడా అదే మాట చెప్పాడు. రాధిక వాదనకు దిగుతూ, “అరె, దినదినానికీ నేర్చుకుంటాడు గదా. చూడు ఒక నాటికి నా కొడుకు లక్షల రూపాయలు సంపాదిస్తాడు.” అంది. కొడుకు కూడా సెలూన్ కు వెళ్తానని పట్టుపట్టాడు. లేకుంటే తానే ఒక సెలూన్ పెడతానన్నాడు. చాలా కాలం తర్వాత రాధిక నోటెంట లక్షల రూపాయలన్న మాట విని విశ్వనాథానికి గొంతు చించుకొని ఏడవాలనిపించింది. ఇప్పుడు ఖచ్చితంగా అర్థమైపోయింది. ఇది భోలాచౌదరి పనేనని. తాను కుదరదన్నందుకు కొడుకును పడేశాడు. ఈ మాట ఆలోచించి ఆలోచించి రాత్రంతా నిద్రపోలేకపోయాడు. ఎటు చూసినా అతడికి చౌదరి వికటాట్టహాసము, లక్షల రూపాయల ప్రతిధ్వని వినిపిస్తోంది. తెల్లారగానే వెళ్ళి సెలూన్ తగలబెట్టేయాలని, భార్య, కొడుకును తీసుకొని ఎటైనా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఎక్కడికెళ్ళినా తనకు ఇంకో భోలా చౌదరి, శామా మహంతి తగలకుండానే ఉంటారా?
రాత్రి నీరవంగా ఉంది. విశ్వనాథం తలుపు తెరచుకొని బయటకొచ్చాడు.. బయట వెన్నెల పరచుకొని ఉంది. తెల్లని దుప్పటి మాదిరి. తన సెలూన్ షాల్ మాదిరి. అంతలో అలాంటి ఒక తెల్లని షాల్ కప్పుకొని శామా మహంతి ధర్మానంద్ ముందు మెడ చాచి ఉన్నాడు. ధరమ్ క్షవరం చేసే సాకుతో శామా మహంతి మెడలో రేజర్ దించేశాడు. సెలూన్ మొత్తం రక్తపు మరకలతో ఎఱ్ఱబడిపోయింది. చూస్తుండగానే జనాలు గుమిగూడారు. అందరూ విశ్వనాథాన్ని ఛీ కొడుతున్నారు. మంగలి వాడు మెడలు కోస్తే, ప్రపంచంలో నమ్మకం అనే మాటకిక విలువే ఉండదు. విశ్వనాథం ఒళ్ళంతా భయంతో లజ్జతో వణికిపోయింది. తన క్షవరం డబ్బా తీసి బయటకు విసిరేశాడు.
ఈ ఒక రేజర్ ను పడేస్తే ఏమొస్తుంది అనిపించింది. ప్రపంచంలో లక్షల మంది క్షవరం చేయించుకుంటారు. అదే ఆలోచిస్తూ బయటకొచ్చాడు. అక్కడ ధర్మానంద్ ఉన్నాడు.
వెన్నెల రాత్రిలో ధర్మానంద్ మొహం కోమలంగా నిష్కల్మషంగా ఉంది. విశ్వనాథం వాడి దగ్గర కూర్చొని తల నిమురుతూ, “మనకా లక్షల రూపాయలతో పనేముంది? ఏమొస్తుంది? ప్రపంచంలో ధర్మమే అన్నిటికన్నా మొదటిది.” అని చెప్తూ, కళ్ళు తుడుచుకున్నాడు.
11
ధర్మా అలాగే గాఢనిద్రలో పడుకొని ఉండిపోయాడు. పైన చంద్రుడు మబ్బుల మాటున దాగుడుమూతలాడుతున్నాడు. విశ్వనాథం లేచి నిలబడ్డాడు. భార్యను, కొడుకుని వదిలేది ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలనుకున్నాడు.
ఎక్కడికెళ్తాడు? ఎక్కడికెళ్ళినా జనాలు గుర్తు పడతారు. ‘చూడు చూడు అదిగో నాయీ. విశ్వాసఘాతకుడైన కొడుకుకు తండ్రి. ఇతడి వల్ల జనాలకు ప్రపంచం మీద నమ్మకం పోయింది.’, ‘నీ వంశంలో ఎవరూ మిగలకుండుగాక.’ అని మనసులోనే భోలా చౌదరిని తిట్టుకున్నాడు. అడుగు ముందుకు పడగానే వెన్నెల రాత్రిలో నేలమీద తన ముందు పడిఉన్న రేజర్ పదును చకచకలాడుతూ కనిపించింది. పొద్దున లేస్తూనే ఈ రేజర్ తో శామా మహంతి తలను ధడాల్న నరికేస్తాడు. తక్షణమే ప్రపంచం మీద నమ్మకాన్నీ కోసి పారేస్తాడు.
‘ఓ దేవుడా! నేనేం చేయను? నేనేం చేయాలి? ఎక్కడికెళ్ళాలి.. ఎవరి దగ్గరికి? ఈ పిల్లాడిని ఎలా ఈ పాపం నుండి రక్షించను? వాడు అసలు నా మాట వింటాడా? వాడికేమో లక్షల రూపాయల మోహం పట్టుకుంది.’ విశ్వనాథం రాబోయే దుఃఖకాలాన్ని తలచుకుని బలంగా ఊపిరి తీసుకుంటున్నాడు.
ఇప్పుడు ప్రపంచాన్ని పాపభారం నుంచి రక్షించడానికి విశ్వనాథం ఒక కొత్త అవతారం ఎత్తాడు. స్వయంగా ఆ రేజర్‌ను చేతిలో గట్టిగా పట్టుకున్నాడు. ఊపిరి వేగంగా తీసుకుంటున్నాడు. కాళ్ళు తడబడుతున్నాయి. అతడికి చౌదరి వికటాట్టహాసము, శామా మహంతి రక్తపు మడుగులో పడిన శామా మహంతి శరీరము కనిపిస్తున్నాయి. శరీరం లేని ఆత్మలా అతడు ఉన్నట్టుండి చుట్టూ తిరిగి ఒక చూపు చూశాడు. ఎవరూ కనిపించలేదు. రాధిక, ధరమ్ మంచి నిద్రలో ఉన్నారు. వెన్నెల రాత్రిలో ఎక్కడి నుంచో ఒక దీనాలాపన వినిపించింది. అతడిప్పుడు ధరమ్ తలాపున కూర్చున్నాడు. ఉన్నట్టుండి ప్రళయంగా మారిన ఆ విశ్వనాథం చేతిలో పట్టుకున్న రేజర్‌తో ధర్మానంద్ తలను ధడాలున నరికేశాడు.
ఒడియా మూలం: అరవింద్ రాయ్
అనువాదం: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి విమర్శకులు, అనువాదకురాలు. అత్యంత లోతైన రీతిలో విమర్శలు చేయగల అరుదైన విమర్శకులు.
