Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొత్తల్లుడు

[శ్రీమతి దాసరి శివకుమారి గారు రచించిన ‘కొత్తల్లుడు’ అనే కథని అందిస్తున్నాము.]

“ఇంకొంచెం కళ్ళు పైకెత్తి, పెళ్లికొడుకు మొహంలోకి నవ్వుతూ చూడండి. అలా అలా చూస్తుంటే కళ్ళు పరవశంగా, మత్తుగా వాలిపోవాలి. పెళ్లికొడుకును చూడండి. మిమ్మల్ని ఎంతో గట్టిగా పట్టుమని మరీ దగ్గరకు పొదువుకుంటున్నారు. ఏ మాత్రం బిడియ పడటం లేదు. మేడమ్! మీరు సహకరిస్తేనే ఫోటో షూట్ బావుంటుంది. మంచి మంచి భంగిమల్లో తీశానని నేనూ సంతృప్తి పడతాను” అంటూ ఆ వీడియోగ్రాఫర్, నందినీ శివరామ్‌లను స్టూడియో అంతా తిప్పుతు, తానూ కలియ తిరగసాగాడు.

పెళ్లికి ముందు ఇలా ఫోటో షూట్ నెపంతో నందినిని మళ్లీ మళ్లీ తాకుతూ దగ్గరకు తీసుకోవటం శివరామ్‌కు బాగున్నది. నందిని మాత్రం కాస్త సిగ్గుపడుతున్నది.

“ఫోటో షూట్ అయిపోయింది. ఏదైనా హాటల్ కెళ్ళి భోజనం చేద్దాం. ఆ తర్వాత షాపింగ్ కెళ్దాం” అన్నాడు శివరామ్.

“ఇలా రోజూ ఏదో వంకతో ఈ మూడు రోజుల్నుండి నన్ను బయట తిప్పుతున్నారు. పెళ్లికి ముందే మీరడిగారని ఇలా మీ ఊళ్ళో మా మేనత్త గారింటికి వచ్చి వుండి ఇలా మీతో తిరగటం మావాళ్లందరికీ అంత నచ్చలేదు. ఇంట్లో బోలెడు పెళ్లి పనులు వున్నాయి. ‘షాపింగ్ అయిపోయిందా? ఇంకా బావగారు షేవింగ్ సెట్ లాంటిది ఏమైనా కొనుక్కోవటం మిగిలిపోయిందా’ అని మా చెల్లెలు జోక్ చేస్తుంది” అంది నందిని.

“ఈ రోజు వెళ్ళిపోదువుగాని, నందూ! మన పెళ్లి కాగానే వారం రోజుల్లోనే ఆషాఢ మాసం రావాలా! ఆ నెలంతా మనిద్దం ఒకే ఇంట్లో వుండగూడదట గదా? ఇవేమి బోడి ఆంక్షలు. నేను ఒక నెలే శెలవు పెట్టుకుని ఆస్ట్రేలియా నుండి వచ్చాను. మన సరదాలు ఎలా తీరతాయి” అన్నాడు చిరాగ్గా.

“హనీమూన్ కంటూ బయిటి ఊర్ల కెళ్దాం. మీరా ఏర్పాట్లలో వుండండి. చిరాకు తగ్గించుకోండి” అన్నది నందిని నవ్వుతూ.

***

నందిన శివరావుల పెళ్ళయింది. పెళ్ళిలో కూడా పెళ్ళికూతురు భుజాల చుట్టు అలవోకగా చేతులు చేస్తూ ఆమెను తన వేపు తిప్పుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తున్నాడు శివరామ్. పెళ్ళవగానే శివరామ్ ఇంటి కొచ్చారు నూతన దంపతులు. ఆ మర్నాడు ఉదయం సత్యనారాయణవ్రతం పూర్తయింది. బంధువులందరూ ఒక్కొక్కరుగా తిరుగు ప్రయాణమయ్యారు. ఆ రాత్రి నందిని తనకు తోడుగా వచ్చిన పిన్ని కూతురితో కలిసి తనకు కేటాయించిన గదిలో పడుకున్నది. శిక్షణమ్ పిల్లిలా అటు వేపు వెళ్లటం గమనించిన తల్లి “నాన్నా! శివరామ్! ఏం కావాలి? నందిని కోసమైతే వద్దు. వ్రతం జరిగిన రోజు రాత్రి మీరిద్దరూ ఒక చోట పడుకోవటం కుదరదు. అసలిలాంటివి ఇక్కడ కాదు, మీ అత్తగారింట్లోనే జరగాలి, వెళ్లు. ఎవరైనా ఇటువేపు వచ్చి చూస్తే బాగోదు..” అన్నది వచ్చే నవ్వుని ఆపుకుంటూ.

మర్నాడు నందినే వాళ్లు ఊరు వెళ్లారు. రాత్రయింది. ఇంట్లో  ఏ హడావిడీ లేదు. రాత్రి భోజనాలు కూడా పూర్తయ్యాయి. నందిని ఏ అలంకరణ లేకుండా మామూలుగానే వున్నది.

“బావగారూ! మీరు ఆ గది లోకి వెళ్లి పడుకోండి” అన్నది మరదలు.

లోపలకెళ్లి చూస్తే నందినిలాగే గది కూడా ఏ అలంకరణ లేకుండా మంచం మీద కొత్త దుప్పటి దిళ్ళతో మాత్రం వున్నది. మంచం పక్కన మంచినీళ్ళు మాత్రం వున్నాయి. నందినిని లోపలకి ఎలా పిలవాలో అర్థం కాలేదు. ఏ.సి. ఆన్ చేసుకున్నా ఊపిరాడనట్లే వున్నది. ఉండబట్టలేక, లేచి, “నందినీ!” అని పిలిచాడు.

నందిని లోపలకు వచ్చింది. తలుపులు ఓరగా చేరవేసి “సాయంకాలం పీరియడ్స్ వచ్చాయిు. అనుకోకుండా ఈసారి ఓ వారం ముందుగా వచ్చాయి. మనమీ మూడు రోజులూ, విడి విడిగా పడుకోవాల్సిందే. నిన్న మీ ఇంటి దగ్గర మీరు నా రూమ్ ముందు తచ్చాడటం, అత్తయ్య మమ్మల్ని లోపలికి తీసుకెళ్లటం అంతా నేను గమనించాను. నవ్వుకున్నాను. మీ ఆరాటానికి తగ్గట్లు ఇవ్వాళ్ళేమో ఇట్లా అయింది. నేను మాత్రం ఏం చేసేది?” అన్నది నిస్సహాయంగా.

“నిజంగానా! నన్ను ఆట పట్టిస్తున్నావా?” అన్నాడు ఆశ చావక.

“నిజమే చెప్తున్నాను రామ్. ఇదేమిటి ఇలా అయిందని నేను చాలా బాధ పడుతున్నాను. మూడు రోజులేగా? ఓపిక పడదాం!” అన్నది నెమ్మదిగా.

“నీ కలాగే వుంటుంది. నాకు శెలవు లేదో, దేవుడో అని నేనఘోరిస్తుంటే మధ్య ఈ గోల లన్నీ” అన్నాడు విసుగ్గా ముఖం పెట్టి.

నందినికి జాలేసింది. అతని గడ్డం పట్టి పైకెత్తుతూ “అల్మారాలో బుక్స్ వున్నాయి. ఏమైనా, తిరగేస్తూ కాలక్షేపం చెయ్యండి..” అన్నది వాటి వంక చూపుతూ.

“ఇంకా నయం, ఫోన్ చూసుకోండి. దిండును కావలించుకుని పడుకోండి అన్లేదు. పోనీ కాసేపు నువ్విక్కడే కూర్చుని కబుర్లు చెప్పొచ్చుగా. వాటిగ్గూడా రేషనుందా!”  అన్నాడు కచ్చగా.

“నేను ఎదురుగా వుంటే మీ చేతులు వూరుకుంటాయా?” అనేంతలో మరదలు కిరణ్మయి లోపలికి వచ్చింది. “అక్కతో పాటు నేను కూర్చుని కబుర్లు చెప్పేదా బావగారూ!” అంటూ కుర్చీ లాక్కుని, కూర్చున్నది.

లోలోపల అసహనాన్ని దాచుకుంటూ రాని నిద్ర వస్తున్నట్లుగా ఆవలించాడు. అది గమనించి వాళ్ళిద్దరూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయారు.

‘ఛీ! ఏంటిలా జరుగుతుంది? ఈ నందిని కాస్త జాగ్రత్తగా వుండి ఇప్పుడు పీరియడ్స్ రాకుండా ఏ టాబ్లెట్లో వేసుకుని వాటిని పోస్ట్‌పోన్ చేసుకోగూడదూ!’ అనుకున్నాడు.

అతి భారంగా రెండు రోజులు గడిచాయి. మూడో రోజు శివరామ్‌కు కొంచెం ఒళ్ళు వెచ్చబడింది. రెండు సార్లు వాంతులు గూడా అయ్యాయి. మామగారు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ‘ఏదో ఫుడ్ పాయిజినింగ్ లాగా వున్నది. ఈ టెస్టులు చేయించండి’ అంటూ రాసిచ్చారు.

“ఆస్ట్రేలియా నుండి 15 రోజుల క్రిందటే వచ్చాడండీ. వచ్చిన దగ్గర నుండీ అటూ, ఇటూ తిరిగాడు. షాపింగులకని బయటకు వెళ్లి హోటల్స్‌లో తిన్నాడు. ఈ పెళ్లిలో నిద్ర అదే సరిగా లేక నీరస పడిపోయాడు. నిన్న కూడా ఏదో ఫంక్షన్ కంటూ అందరూ వెళ్లి బయట తిన్నారు” అంటూ, ఆయన ఏకరువు పెట్టాడు.

జ్వరంతో, మందులు మింగుతూ వాంతులూ, మోషన్స్‌తో నానా ఇబ్బందులు పడ్డాడు. సెలైన్ పెట్టి హాస్పిటల్లోనే వుంచేశారు. మూడు రోజులు గడిచాక హాస్పిటల్ నుండి ఇంటి కొచ్చాడు. ఆ సాయంకాలం కొడుకును తమ ఇంటికి తీసుకెళ్లటానికి శివరామ్ తండ్రి వచ్చాడు. ఆ రోజే జ్యేష్ఠ మాసపు అమావాస్య. మర్నాటి నుండి ఆషాఢ మాసం మొదలు అవుతుంది. కొత్త అల్లుళ్ళూ, కొత్త కోడళ్ళూ ఎక్కడి వాళ్లక్కడ వుండాల్సిందే అన్నారు. శివరామ్ జుట్టు పీక్కున్నాడు.

“అమ్మా! ఈ నెల హనీమూన్‍కి వెళ్దామని నందినీ, నేనూ ముందే అనుకున్నాం. మేం వాళ్లింట్లోనూ వుండం. మనింట్లోనూ వుండం. ఈ నెలంతా ఊర్లు తిరిగి చూసొస్తాం. నువ్వు మా అత్తయ్యా వాళ్లతో మాట్లాడు. నందిని నడిగితే నూ అమ్మ, నాన్నా ఒప్పుకోవాలిగా అంటున్నది. నువ్వు మాట్లాడి వాళ్ల నొప్పించు. మా పాట్లు మేం పడతాం” అన్నాడు సిగ్గు విడిచి.

ఆమెకు జాలేసి పంతులు గారిని పిలిపించుకున్నది.

“పెళ్లయిన నెలలోపు ముఖ్యంగా పదహారు రోజుల పండగ లోపు ఏ పట్టింపు వుండదమ్మా. అయినా శోభనం జరగలేదుగా. అలా జరక్కుండా ఆషాఢమాసంలో ఎంత పొరుగూళ్ళు వెళ్ళినా మంచిరోజులు కాకుండా కాపురం చేయటం ఎలా మొదలు పెడతారమ్మా! మేం కాపురం చేయం. ఊరికే ఊళ్ళు తిరిగొస్తామని నమ్మబలికినా మనం నమ్మం గదమ్మా. ఒక్క నెల రోజులు ఓర్చుకుంటే మంచి రోజులు వస్తాయి. శ్రావణం రాగానే శోభనం జరిపించేయొచ్చు. అరిష్టాలేం వుండవు.” అని చెప్పి వెళ్లిపోయాడు.

“వాళ్ళ గోల ఏదో వాళ్ళు పడతారు. పెళ్లి చేసుకుని కూడా ఇలా దూరదూరంగా వుండమంటే వాళ్లెక్కడ వుండగలరు చెప్పు. నువ్వే వియ్యపురాలితో మాట్లాడి శోభనం జరిపించేయమని చెప్పగూడదూ? అనవసరంగా పంతులు గారిని పిలిపించి సలహాలు, అవి వినాలి, పాటించాలి అని మొదలు పెట్టావు.” అని విసుక్కున్నాడు శివరామ్ తండ్రి.

“వాడక్కడకు ఎలా వెళ్తాడు! నందిని ఇక్కడకు ఎలా వస్తుంది! ఆషాఢమాసం పట్టింపు వుంది కదండీ! మేం ఒకళ్ళు దాటిన గడప ఇంకొకళ్లం దాటకూడుదు గదా!”

“నీ తలకాయేం కాదూ? వియ్యపురాలికి ఫోన్ చేసి పిల్లలిద్దరూ హానీమూన్‌కు వెళ్తారు. అమ్మాయిని వాడితో పంపించమని చెప్పు” అన్నాడు.

అలాగేనని ఆమె ఫోన్ చేసింది. “వదినగారూ! పెళ్లయింది కాని పిల్లలద్దరూ ఇప్పటి వరకూ ఒకటి కాలేకపోయారు. ఆషాఢమాసం కాబట్టి హనీమూన్ వంకతో బయటి ఊళ్ళకు వెళతారు. మీరు అన్నయ్య గారితో మాట్లాడి ఒప్పించండి” అని చెప్పింది. “అయ్యో! వదిన గారూ! చూస్తు చూస్తూ ఎంతో పట్టింపున్న ఆషాఢంలో తొలిసారిగా వాళ్లద్దర్నీ ఒంటరిగా వదిలిపెట్టటం ఏమిటండీ? మా అత్తగారు అస్సలు ఒప్పుకోరు. నెల్లాళ్లు ఎన్నాళ్లలో వస్తాయి? అబ్బాయిని మరో నెల శెలవు పొడిగించుకోమనండి. జీతం పోతే పోతుంది. మా నందిని వర్క్ చేసేది ఇంట్లో నుండే కాబట్టి పిల్లలు మన దగ్గరే వుంటారు. కాదంటే ఊళ్ళు అప్పుడే తిరుగుతారు” అని తేల్చి చెప్పింది.

“నాన్నా! శివరామ్! మీ అత్తగారితో మాట్లాడాను. ఆవిడ ఒప్పుకోవటం లేదు” అంటూ ఆవిడన్న మాటలు చెప్పింది.

“ఆఁ పెద్ద చెప్పొచ్చారు. ఈ నెలంతా నాకు వేస్ట్‌గా గడిచిపోవాలా! అసలు జూన్ చివరలో ఆషాఢ మాసం వచ్చే ముందు ముహూర్తం పెట్టిందెవడు? నా ప్రాణానికి కాకపోతే?”

“మరి నువ్వొచ్చింది ఈ నెలలోనే కదరా. నన్నేం చేయమంటావు?”

“హనీమూన్ సంగతి నందిని నడిగితే మా ఇంట్లో ఒప్పుకోవటం లేదంటున్నది. మీరేమో వాళ్లకు నచ్చచెప్పరు. మీరందరితో మాట్లాడటం వేస్టు. నాకు నేనుగా మాట్లాడితే బరితెగింపు కిందకి వస్తుందని ఆలోచిస్తున్నాను. ఛ. ఛ” అంటూ చెప్పులు తొడుక్కుని బయటకు నడిచాడు.

కొడుకు మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు వాళ్లమ్మకు.

“అత్తగారు నడిచే ఇంట్లో నుండి నీకు ఫోన్ చేస్తే సమాధానమైనా ఇవ్వొద్దన్నారా మీ అమ్మ! లేక దానికీ ఏమైనా పట్టింపులున్నాయా నందూ!”

“ఎందుకంత నిష్ఠురంగా మాట్లాడతావు రామ్! మన టైం బాగాలేదు. నువ్వు ఆ టైమ్ లోనే సిక్ అవ్వాలా! ఇంకెంత కొద్ది రోజులు ఓపిక పడదాం. వీడియో కాల్‍లో నువ్వెంత చిరాగ్గా వుంటున్నావా తెలుస్తోంది. నువ్వు మగవాడివి కాబట్టి బయట పడుతున్నావు. నేను ఆడపిల్లని కాబట్టి గుంభనంగా వుండాల్సి వస్తున్నది. రోజూ మెలకువ లోనూ, నిద్ర లోనూ నువ్వే కనపడి గిలిగింతలు పెడుతున్నావు. నిజం.”

“నాకు కలత నిద్ర, కలవరింతల నిద్ర. ఏం చేద్దాం! ఇలా కలల్లో బతకాల్సి వచ్చింది. నీకు పాస్‌పోర్ట్ వున్నదిగా, నీ వీసా కోసం ట్రై చేయటానికి నేను హైద్రాబాద్ వెళ్తున్నాను. జాబ్‍కు రాజీనామా ఇచ్చేసెయ్.”

“ఇచ్చేసాను. వాళ్లకు మూడు నెలలు ముందే చెప్పాలిగా.. అవన్నీ గుర్తున్నాయి మహానుభావా.”

ఇలాంటి నిష్ఠురాలతో, అలకలతో రోజులు భారంగా గడుస్తున్నాయి వీళ్ళిద్దరికీ.

కొత్త అల్లుడికి అత్తవారింటి నుండి ఆషాఢ పట్టి వచ్చింది. స్వీట్స్, హాట్స్, ఇంటిల్లిపాదికీ బట్టలు, అల్లుడికి డబ్బు వగైరాలతో.

‘అమ్మాయిని ఎక్కడికీ పంపరు కాని ఈ చెత్తంతా పంపారు’ మనసులో అనుకున్నాడు శివరామ్.

“శ్రావణం రాగానే మనమూ శ్రావణ పట్టీ పంపాలి. వాళ్ల ఇంట వరలక్ష్మీ వ్రతమున్నా లేకున్నా మనమైన వ్రతం చేయించాలి” అన్నది శివరామ్ తల్లి,

“నీ ఇష్ట మొచ్చినట్లు చేసుకో” అన్నాడు శివరామ్.

***

32 ఏళ్ల బ్రహ్మచారి శివరామ్. కరోనా ఇబ్బందులలో పి.ఆర్. రావడం ఆస్ట్రేలియాతో వున్న శివరామ్‌కు ఆలస్యమైంది. పి.ఆర్. వస్తే కానీ పెళ్లి చేసుకోనని పట్టుబట్టి ఇప్పుడు పి.ఆర్. వచ్చిన తర్వాతే పెళ్లి సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే నందినికి రకరకాల కానుకలు కొన్నాడు. కొత్త కాపురం మధురాతి మధురంగా వుండాలని తెగ ఊహించుకున్నాడు. ఇప్పుడు అతి కష్టం మీద ఆషాఢం నెలరోజులు గడిచాయి. నానా తిప్పలు పడి మరో నెల శెలవు పొడిగించుకోగలిగాడు.

“శ్రావణం వచ్చింది. ఆస్ట్రేలియా వెళ్లిపోతే నందినికి తిరిగి రావటానికి ఎప్పటికి కుదురుతుందో? తద్ది పేరంటం, అట్లవాయనపు నోములు వెంటనే ఇప్పుడు తీరుస్తాం. వరలక్ష్మీ వ్రతం రోజున వ్రతం నోపిస్తాం. పంతులు గారిని పిలిచి మాట్లాడుతాం” అన్నారు శివరామ్ అత్తగారు.

“పెళ్ళి కాగానే పసుపుబట్టలతో జంటను తిరుపతి పంపించి కళ్యాణం చేయిద్దామనుకున్నాం. అంతా కలిసి వెళ్లండి” అంటున్నది నందిని వాళ్ల నానమ్మ.

“ఈ పూజలన్నీ చూడటానికా అమ్మా? నేను శెలవు పొడిగించుకునీ మరీ వున్నది! ఇవి తప్పితే వీళ్ళు ఇంకేం మాట్లాడటం లేదు” అంటూ వాళ్లమ్మ మీద అరిచాడు శివరామ్.

“ముందు కొత్తల్లుడిని తీసుకెళ్లి గడపలు దాటండి.” అంటూ శివరామ్ వాళ్లమ్మ ఫోన్ చేసింది. ‘అలాగే’నంటూ శివరామ్‌ను తీసుకెళ్ళి గడపలో ఒక కొబ్బరికాయ కొట్టించి గడప దాటించారు. అత్తగారు అలాగే చేసి ఆ గడపను అటూ ఇలా దాటింది.

ఆ రోజు రాత్రికి కూడా అత్తగారింట్లో శివరామ్ ఒంటరిగానే పడుకున్నాడు. ఎందుకంటే తెల్లవారు ఝామునే శుచిగా లేచి ముత్తైదువులకు నందిని వాయనాలిచ్చి తద్దె పేరంటం జరుపుకోవాలి. ఆ రోజు రాత్రికి అట్లు వాయనాలు తీర్చుమని మరలా ముత్తైదువులకు వాయినాలివ్వాలి. ఈ సంవత్సరం ఆ తెల్లారే వరలక్ష్మీ వ్రతం నోచుకునే శుక్రవారం వచ్చింది. నందిని చేత వరలక్ష్మీ వ్రతం చేయించాలి. ఇవన్నీ పూర్తయ్యాక శోభనం జరిపిస్తే శుభంగా వుంటుందని పంతులు గారు చెప్పనే చెప్పారు. శివరామ్ లోలోపల ఉడికిపోతున్నాడు.

కోడలి చేత వరలక్ష్మీ వ్రతం జరిపించడానికి శివరామ్ తల్లి ఐదారుగురు చుట్టాలని తీసుకుని సారె చీరలలో వచ్చింది. తల్లిని చాటుకు పిలిచి “ఇవ్వాళ ఈ పూజేదో కాగానే నందినిని మనింటికి తీసుకెళ్తామని గట్టిగా చెప్పు. మనందరం కలిసి వెళ్లి పోదాం” అన్నాడు.

“వ్రతం చేసిన రోజు పుట్టింట్లోనే నిద్ర చేయాలి. ఇవాళ తీసుకెళ్లటం కుదరదు” అన్నది.

“నా కొడుకు ఎక్కువ రోజులు ఇండియానే వుండలేడు. కొడుకునీ, కోడల్ని మా ఇంటికి తీసుకెళ్తామని చెప్పటం కూడా రాకపోతే ఎలాగమ్మా?” అంటూ మండిపడ్డాడు.

వ్రతానికి అతని మేనత్త కూడా వచ్చింది. “అత్తా! నా శెలవంతా అయిపోతున్నది. నందినిని ఇప్పటి దాకా నాకు దూరం గానే వుంచారు. వెంటనే నందినిని మనతోపాటు ఇంటికి పంపించేయమని నువ్వైనా చెప్పత్తా.” అంటూ వాపోయాడు.

‘వీడు పెళ్ళాంతో కాపురం చేయటానికి తహతహలాడుతున్నాడ’ని నవ్వుకుంటూ ఆ మర్నాడే శోభనానికి ముహూర్తం పెట్టించింది.

Exit mobile version