కవులంతా నిన్ను ఎందుకు పొగిడారో
కర్ణ కఠోరమైన నీ అరుపులు విని
కోయిల గానం, వసంత గానం అంటూ
చెట్టు మీద కూర్చొని పని ‘పాట’ లేక
అరచిన అరుపులు పాట అన్నారు
పెరట్లో కూర్చొని పేపరు చదూతుంటే
మధ్యలో నీ వికృత శబ్దాల గోల
కవులకు పైత్యం ఎక్కువయి
నిన్ను పొగిడి ఉంటారు ఓ కోయిలా
మండు వేసవిలో చెమట కారుతుంటే
మామిడి చిగురు తిని నువ్వు పాట పాడావట
అది వసంత గీతమట, స్మశానగీతం కాదా
నీకంటే కాకి నయం కాదా కోయిలా
పిండం పెట్టినప్పుడే అరుస్తుంది
కావు కావు అని కమనీయంగా..!
భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.