[కోవెల సుప్రసన్నాచార్య గారు వ్రాసిన ‘కృష్ణరశ్మి’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు ధూళిపాళ అరుణ.]
“నల్లనివాడు పద్మనయనంబుల వాడు కృపారసంబు పై
జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు..”
జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీకృష్ణుడు జగత్కల్యాణ నిమిత్తము లీలామానుష వేషధారియై బాల్యక్రీడలతో ఆబాల గోపాలాన్ని పరవశులను చేశాడు.
అణువణువూ వ్యాపించి ఉండే ప్రేమ తత్త్వాన్ని, తద్వారా కలిగే అలౌకికానందమయ స్థితిని విశ్వానికి ఎరుకపరిచాడు.
నందగోకుల విహారి, బృందావన సంచారి, వేణుగానామృతఝరి, గోపికా మనోహారి అయిన శ్రీకృష్ణ పరమాత్ముని తత్త్వాన్ని ఆకళింపు చేసుకొని, విశ్వ చేతనమై విలసిల్లిన ఆ భావాన్ని తన హృదయాంబుధిలో నిక్షిప్తం చేసుకొని మధురభక్తి సుధలో పరవశించిన కవిపుంగవులు సుప్రసన్నాచార్య గారు. పరమ యోగీశ్వరేశ్వరుడు, పరాత్పరుడు, అఖిలాండ బ్రహ్మాండానికి నాయకుడైన జగన్నాథుని తనివితీరా అనుభూతి చెందారు. అవ్యక్తము, అలౌకికము, అనంతమైన ఆ పరమాత్మ శక్తిని తన నుండి అవిభాజ్యంగా భావించారు. అంతర్గతంగా నిబిడీకృతమైన అట్టి చేతనత్వాన్ని ‘కృష్ణ రశ్మి’గా ఆవిష్కరించి వెలుగు రేఖలను ప్రసరించారు.
“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్”
(భగవద్గీత 4-7)
భూమిపై ధర్మానికి అవరోధం ఏర్పడినప్పుడల్లా ధర్మ పరిరక్షణార్థం తనను తాను సృజించుకుంటానని శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు. కర్మాకర్మ విచక్షణను, మోక్షసాధనోపాయాలను, అశాశ్వతమైన ఈ దేహ భ్రాంతిని విడిచి, నిత్య చైతన్యమైన ఆత్మను దర్శించుకునే మార్గాంతరాలను భగవద్గీత ద్వారా మనకు అందించాడు.
దైవికమైన ఒక శక్తి, సామాన్య మానవునిగా జన్మించి, అనేక కష్టాలకోర్చి, తనవి కాని బాధ్యతలను మోస్తూ కూడా ఎన్నో అవహేళనలను, అపనిందలను ఎదుర్కొని జీవితాన్ని అత్యంత వేదనాభరితంగా గడిపి మానవ జీవనానికి ఆదర్శప్రాయమైన మార్గనిర్దేశం చేసినవాడు శ్రీకృష్ణుడు. భక్త సులభుడైన అటువంటి కృష్ణుని తమ మనోనేత్రంతో దర్శించారు సుప్రసన్నగారు. నిరంతర స్మరణ ద్వారా తమలో లయం చేసుకున్నారు.
శ్రీకృష్ణుని అనుభూతి చెందుతూ ఆ అనుభూతుల అనుభవాల నుండి ఆవిష్కరించబడిన ఒక భావకావ్యం ‘కృష్ణరశ్మి’. కృష్ణ సంబంధిత కథాంశాల విస్తరణ లేకుండా భావలహరిలో తేలియాడిన కావ్యమిది. తనలోకి తాను ఇంకిపోయేలా మూలాలను తెలుసుకునే ప్రయత్నంలో అంతస్సులోంచి అమృతత్వం వరకు ప్రవహించిన సుధా ప్రవాహం. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో పరంధాముని తల్లీనం చేసుకునే ప్రయత్నం.
‘కృష్ణరశ్మి’ని అష్టదళ పద్మంలా తీర్చారు సుప్రసన్న గారు. అంటే ఎనిమిది కవితా ఖండికలు. ఒక్కో ఖండికలో పదహారు రేఖలు అనగా పదహారు పద్యాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా దశావతారాల్లో అష్టమావతారం శ్రీకృష్ణుడు. దేవకీదేవికి అష్టమగర్భుడు, షోడశ కళా ప్రపూర్ణుడు. వీటికి ప్రతీకగా భాసిస్తుంది ఈ రశ్మి.
సాధన చేస్తున్నప్పుడు ధ్యానంలో నామరూపాలు నిశ్శబ్దంలో లీనమైనట్లే కావ్యం కూడా అంతస్సులో లీనం కావాలని కవి ఆకాంక్షించారు. భక్తియోగాల మధ్య, అంతర్బహిశ్చేతనల మధ్య సమన్వయం కోసం చేసిన ప్రయత్నమే ఈ కావ్యమని విన్నవించుకున్నారు.
“అచట రసము చిందు, నాదము విచ్చు/ అచట నీల జలద/ మచట బర్హ/ మచట కృష్ణ భావ మచట గోలోకము/ అచట నీవు నేను నందరమును”
అలతి పదాలతో కృష్ణతత్త్వాన్ని ఒక్కపద్యంలో ఇమిడ్చిన భావం. గోలోకంలో రమ్య ప్రవాహ మాధురీ రాసలీల, జగత్తును నాదమయం చేసే వేణు గానామృతం, నీలమేఘ వర్ణం, శిఖి పింఛము.. లోకానికి ముగ్ధమనోహర దృశ్యం. అదే తనివితీరని కృష్ణ తత్త్వం. ఆ భావనా జగత్తులో సమస్తాన్ని దర్శిస్తారు సుప్రసన్నగారు.
మొదటి దళంలో..
“ధ్యానము కుదురదు, నెం తభి/ మానించిననైన చిత్తమను పాత్రికలో/ తేనె చినుకైన రాలదు/ గానమొ, యోగమ్మొ, త్రోవ కల్గునొ, లేదో”
భగవంతునిపై ధ్యాస మరల్చడానికి ఎన్ని రీతుల త్రోవలు తెలిసినా చివరకు గమ్యం చేరుతానో లేదోనని పరిపరి విధాలుగా తపిస్తూ, వైయక్తికమైన అనుభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తారు. ఒకవైపు ఈ అన్వేషణ కొనసాగుతుండగానే..
“ఆ జన్మాంతము జీవనం బిచట వాంఛాకారమై పొల్చినన్/ సాజంబైన రిరంస యింద్ర ధనువై సర్వేంద్రియ వ్యూహ మీ/ హా జాలమ్ములలోన చిక్కినది, వ్యోమాతీతా నీలచ్ఛటా/ రాజత్కోకిల మొండు కూసినది సారవ్యక్త నాదాంకమై”
జీవనమంతా కోర్కెల జ్వాలలలో రగిలిపోతూ, సుఖాపేక్షతో, ఇంద్రియాలు విసిరిన మాయా జాలమ్ములో చిక్కువడి ఉండగా ఆకాశాన్నంతా ఆవరించిన నీలంపు కోకిల తన సుమధుర నాదంతో జీవితాన్ని ఫలప్రదం చేసిందని పరవశిస్తారు. ఆ నీలంపు కోకిల మరెవరో కాదు. తనతో ఆత్మానుసంధానం చేసుకున్న ఆ పరమాత్ముడే. ఇది కవి పొందిన శ్రీకృష్ణానుభవం.
ఇక్కడ కవిలో షోడశ భావనలు అంకురించిన విషయం స్ఫష్టమవుతుంది.
“శబ్దలోకముల వాకిట పూచిన తమ్మిరేకు”
“మృదు ఝంకృతుల్ మెరయు కోమల షట్పది”
“నిగమవల్లి కాచిన చిటారపు తోరపు ద్రాక్షాగుత్తి”
“అంభోనిధానోత్థ వీచీ కల్పమ్ములు”
“సర్వేంద్రియ వ్యూహమీహా జాలమ్ములు”
మొదలగు పదప్రయోగ విన్యాసాలు పఠితృల మనస్సులను రంజింపజేస్తాయి.
రెండవ దళంలో..
గాఢంగా అల్లుకున్న చీకట్ల సమూహం తన వెలుగుదారికి అవరోధాలుగా భావిస్తూ..
“మూర్తి కట్టని ప్రియ భావమునకు రెండు/చివరలయి తాను నేనుగా, జీవితమ్ము/నడిమిదిగనున్న ఈ రాత్రి నాకు తోపదాయె..”
అవ్యక్త మాధురీ భావము అణువణువు నిండగా అది రెండు చివరలుగా విడిపోయి ఒకవైపు మేఘవర్ణుడు, మరో వైపు తానుగా మారి నడుమ ఉన్న జీవితము రాత్రిగా, దిక్కుతోచని చీకటిని వ్యాపింపజేసింది.
మనోభావ వీచిక కృష్ణునిపై ప్రసరించి ఉన్నప్పటికీ జీవితమనే తిమిర యవనిక ఆయనను చేరుకోవడానికి కవికి ఆటంకంగా పరిణమించింది.
అయినప్పటికీ..
“ఈ నిరంతర రాత్రమందెరుక చాలి/చాలనట్లు ప్రాజ్ఞత నొంది సర్వజీవ/ భావమును చేదుకోనెంతు..”
ఎడతెరిపి లేని జీవన ప్రయాణంలో కూడా ఒకింత వివేకముతో సర్వజీవ భావాన్ని చేరుకుంటానంటారు. ఇక్కడ ఆయన విశ్వజనీనమైన భావన స్పష్టమవుతుంది. “ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం” అన్నట్లు ఆయన విశ్వ ప్రేమికులు. ఆయనలోని చైతన్యం సమిష్టి చైతన్యం.
ఏ క్షణం ఏవిధంగా రాగలడోనని కృష్ణుని రాకను కాంక్షిస్తూ..
“కదలునొ చీకటుల్, మొయిలుగా చనుదెంచునొ, నెమ్మిపించియం/ బు దెసల తోచునో! కనుల ముందర రూపిడరాని వేల్పు తా/నొదుగుచు పృథ్విపై చరణ ముంచుటకై దిగి వచ్చు చుండెనో/ పది దెసలావరించునొకొ, ప్రాణము చిల్కునొ, నన్ కరంచునో”
అంటూ మధురభక్తితో కూడిన ఆయన వేదన, నివేదన కృష్ణశాస్త్రి గారి “..కోమల జలజాత పత్రముల మాటున నేటికి డాగినాడవో” అని గోపికలు మొరవెట్టుకున్నట్లు అన్ని దెసలను పరికిస్తూ అన్వేషణ కొనసాగుతుంది.
“ఇగమై గాఢ తమోభి మంత్రితము”
“బంహిష్ఠ ప్రవాహ ప్రకీర్ణగతి శ్లిష్టము”
“అరణ్యక్లిష్టము”
“ఉచ్ఛ్వాస సంధి గవాక్షమ్ము”
తిమిర గాఢతను అనుభూతి పరం చేయించే ఇటువంటి పదబంధురాలు సుప్రసన్న గారి శబ్దసౌందర్య ప్రావీణ్యతను కట్టెదుట నిలుపుతాయి.
మూడవ దళంలో..
మైత్రేయుని రాక, శ్రీకృష్ణ నిర్యాణమూ, కొత్త సృష్టి ఆవిర్భావాన్ని మనకు దర్శింపజేస్తారు.
“తాను కాలమయ్యు తాను కాలాతీతు /డగుచు భావి సృష్టి నాత్మ దర్ప/ ణమ్ము వంటివాని నెమ్మది నెంచెనో/ నడిచె తా సుషుమ్న నా నొకండు”
కాలమే తానైన వాడు, కాలానికి అతీతుడు పరమాత్ముడు. అత్యంత దయాంతరంగుడై భావి సృష్టి నిర్మాతగా ఉత్తేజాన్ని నింపుతూ వెలుగుతూ నడుస్తాడు.
అటువంటివాడు..
“హా3 వూహా3 వూహా3 వూ/ ఆవృతమగు శార్జ్ఞధను రుదాత్త స్వనిత/ జ్యావృత్తియె నభమెల్లను/ శ్రీ వైకుంఠమ్ము త్రోవ చెందిన యట్లై”
సామవేదావృతమైన ఉదాత్త స్వరాలతో ఎక్కుపెట్టిన వింటి ధ్వనులు ఆకాశమంతా నిండి వైకుంఠ మార్గంగా తోచాయి.
వెంటనే..
“అంతలోన నీరవ వృత్తి యలమి స్వామి/ రమ్య దేహము యమునా తరంగమయ్యె/ కాలమొక లిప్త యాగెనో, క్రమ్ముకొన్న ఒక వినీల రోచిర్ వృత్తి నొదిగె జగతి”
అంతటా ఆవరించిన నిశ్శబ్దంతో ఆ పరంధాముడు యమునా తరంగంలో తరలిపోయాడు.
ఎంతటి వేదనాభరితమిది? పరాత్పరుడైన ఆ స్వామి లోకోద్ధరణ కొరకు పృథ్విపై మానవునిగా అవతరించి ప్రేమను పంచి, వీడిపోతున్న వేళ ఆ దుఃఖభారాన్ని మోయడం సాధ్యమా? మనసునిండా కృష్ణతత్త్వాన్ని నింపుకున్న కవి ఇక్కడ శోకాగ్ని తప్తుడవుతున్నాడు.
జగన్నాటక సూత్రధారి ఎడబాటును కలలోనైనా ఊహించలేని దుర్భరస్థితి.
అందుకే పోతన భాగవతంలో..
అనుక్షణం శ్రీకృష్ణుని సాహచర్యాన్ని అనుభవించిన అర్జునుడు కృష్ణ నిర్యాణ వార్తను ధర్మరాజుకు చెబుతూ ఆయన తమకు చేసిన మహోపకారాలను, అనుబంధాన్ని తలచుకుంటూ..
“మన సారథి, మన సచివుడు/ మన వియ్యము, మన
సఖుండు, మన బాంధవుడున్/ మన విభుడు, గురుడు, దేవర/ మనలను దిగనాడి చనియె మనుజాధీశా!”
అంటూ దుఃఖాతిశయంతో శోకసంద్రంలో మునిగిపోతాడు. జగత్సృష్టి కర్త పరంధాముడు లేని స్థితి ఊహాతీతము.
ఈ దళంలోని..
“మినులెల్ల క్రమ్ముకున్నట్టి మృగమదనీలపంకజము”
“హృత్సరసీజ కర్ణిక”
“క్రన్నన మేల్కనునో వ్యథాంగణమ్ము పవనమై”
వంటి పాదాలు ఆచార్యుల వారి శైలీ నికషోపలములు.
నాలుగవ దళంలో.
“ఇది భావనా లోకమగునొ, ఇది జీవితాంభోదమగునొ
మొదలెరుంగని తుద లేని ముగ్ధరహో మధురిమయొ
కదుపులు గట్టి మొయిళ్లు కడలిలో దూకుచున్నవియొ
అదుపులు దప్పి వాయువులు ఆకాశమున ప్రాకునేమొ”
ఇక్కడ కవి, అతిశయమైన భావవినీల జగత్తును అభివ్యక్తీకరిస్తూ..
“ఈ నభస్సెల్ల తానయి ఇచట విరియు/సవ్వడు లివెల్ల తనలోని శాంత భావ/మివురులై పువ్వులై పోల్చెనేమొ కాని/ఎంత వెదికియు తనను రూపింపలేము”
సృష్టి అంతా నీలమేఘశ్యాముని ఛాయా మాత్రంగా అనుభూతి కలుగుతున్నప్పటికీ ఎంత వెతికినా ఆ రూపము దృగ్గోచరము కాకున్నది అంటారు.
“తా వేదము తా నాదము/ తా వియదాదియును తానె
తాత్పర్యమ్మై/ భావ జగత్తుల పొల్చు స/ మావృతమగు జగతి కవల యావలి గట్టై”
పరావాక్స్వరూపుడైన కృష్ణునితో రస జగత్తైన కావ్యాన్ని అనుసంధానించి పరవశులవుతారు కవి.
అందుకే..
“తెలి చామరముల వెలుగుల.. కలిత కేకి పింఛా వలిత జలద మూర్తి వాక్ ప్రభాభాస్వరుడై” అవతరించినట్టు భావించి వేయి నెమళ్ళు ఒక్కసారిగా నాట్యం చేసినట్లు, అంతరంగంలో వేయి ఇంద్రధనుస్సులు విరిసినట్లు, గుండె ఊయలలూగుతుండగా కాలిమువ్వలు ఘల్లుమన్న సవ్వడిని అనుభూతి చెందుతారు. మనసునిండా కమ్ముకున్న భావనతో ఇక్కడ కృష్ణుడు, తానూ ఒక్కరే అన్నంతగా మమేకమవుతారు.
ఇందులో..
“విద్యుత్ వలాహకము నిలుచు నిరుల వాకిళులందున్”
“అగాధ శూన్య బృంహిత జగత్తు”
“విగాహితా గాధ వాస్తరంగ ప్రహతుడ”
“అంతులేని వెల్గు కరళ్లు లవఘళించి”
వంటి పద్య పంక్తులు హృదయ నిగూఢమైన కవి భావనా సౌందర్యగీతికలుగా భాసిల్లుతాయి.
అయిదవ దళంలో..
గంగానదికి అతిపెద్ద ఉపనది అయిన యమునా నదీ వర్ణన. సూర్య తనయగా, సమానశ్వాసగా, హిమాలయ పర్వత సానువులకు చెందిన కాళింది పర్వత ప్రాంత యమునోత్రి జన్మస్థలంగా స్థిరమైన ప్రవాహంగా సాగే నది.
“ఎంతటి పొడవైన సోపాన సంతతి ఇది.. అకుంఠితముగ/ మొరయి నంట నాద తరంగ లొరయుచుండ” అంటూ ప్రారంభంలోనే ఆ ప్రవాహాన్ని అభివర్ణిస్తారు ఆచార్యులవారు.
“ప్రథిత షట్పదీ ఝంకార పటలి/ తోరణాలు గట్టెనో ఘంటా స్వనముల తోట/ స్వాపమున వికసిత పద్మశాంత సరసి/ స్వప్నవేళ ప్రాణ ప్రభాంచల మయూరి”
“ఒక మహాపగ సాగుచు నొక మహోత్థ/ గీతము చెలంగుచు.. తుద లెరుంగని వెన్నెల లొదుగు నీట”
“యమున కదలినంతటి మేరలందు క్షీర/ జలధి శాయికై యమరిన శయ్య పొలిచె/ యమున పొంగులెత్తిన వేళ నాదిశేషు/ ఫణి మణి చ్ఛటా క్రాంతి నభస్సు కొలిచె”
అంటూ యమునా నది పొంగుతున్నంత మేర కుండలిని నుండి సహస్రారాన్ని చేరుతున్నట్లు యోగమార్గాన్ని కవి సాక్షాత్కరింపజేసుకుంటున్నాడు.
అదే క్రమంలో
“అఖిల జగమిది ఖిలమయినట్టి వేళ/ ఉనికి కోల్పోయి ప్రకృతి భావోపపన్న/ యైన యమున అనా
హతమందు చేరు/ చివరకు నెవండొ నెమ్మి పించియము తాల్పు”
అని నెమలి పింఛమును సహస్రారంగా చెబుతూ దానిని ధరించిన శ్రీకృష్ణుడు యోగీశ్వరేశ్వరునిగా వర్ణిస్తారు.
పద్యాలలో యమునా నదీ ప్రవాహవేగపూరితమైన శబ్ద జగత్తును, ధ్వన్యనుకరణగా అక్షరబద్ధం చేస్తారు కవి.
మనుచరిత్ర కారుని హిమాలయ వర్ణనలో
“అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర జ్ఝరీ/పటల ముహూర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ..” పద్యంలోని శబ్ద సౌందర్యాన్ని ఇది స్ఫురింప జేస్తుంది.
ఇందులో..
“అనంత ఖేలనముగ, ఆగమిష్యద్యుగాళి స్వప్నాయితమ్ము”
“ఊదబడిన సడులు వినబడి త్రవ్వె ప్రాగ్జనుల వ్యథలు
“స్ఫీత చిత్తమున కవిజ్ఞేయ మాధుర్యమును వెలార్చె”
వంటి కవిత్వ పంక్తులు కవి శాబ్దిక పరిజ్ఞానాన్ని విశదపరుస్తూ హృదయరంజకమొనరిస్తాయి.
ఆరవ దళంలో..
నందుని ఇంట్లో వెలసిన త్రిజగన్మోహనాకారుని గురించి చిత్ర విచిత్రాలుగా గోలోక వాసులు చెప్పుకుంటున్నారు.
ఆతని మాయానిద్ర నుండి మేల్కొల్పడానికి అనేక ప్రయత్నాలు సలుపుతున్నారు. లీలా మానుషుడైన కృష్ణపరమాత్మను మేల్కొల్పడం అంత సులభమా? వారి అమాయకత్వానికి ఆనందించడమే వారి పట్ల ఆయన అనుగ్రహం కదా!
“కృష్ణుడన్న నేమి, కేశవుడన నేమి/ హరియటన్న నేమి, అబ్జనాభు/ డన్న నేమి, ఆతడచ్యుతుడై యెల్ల/ యెదల నిండె నేమొ యెరుగునంత”
ఏ పేరుతో పిలిస్తే ఏమిటి? అతడు వేయి నామాల వేల్పు. స్థిరమైన వాడు. నశింపని వాడు, శాశ్వతుడు. అందుకే ఎల్లప్పుడూ లోకుల మదిలో మెదలుతూ ఉంటాడు.
“తడబడు నడుగుల తలపుల సొలపులు/ బెడగగు నడుగుల పిలుపుల సొగసులు/ ఎడదల కలతలా విడుదల నొనరుచు/ బుడుతడు, కడలుల పడకల నొడయడు”
శబ్దాలంకార పదప్రయోగంగా ‘డ’, కార ‘ల’ కార శోభితమై శ్రీకృష్ణుని బాల్య చేష్టితములను వర్ణిస్తున్న ఈ పద్యం.. గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి ఆ గజేంద్రుని రక్షించడానికి పరుగెడుతున్న ఘట్టాన్ని వర్ణిస్తూ పోతన రచించిన..
“అడిగెదనని కడు వడి జను/..నడు గిడదు జడిమ నడుగిడు నెడలన్”
అనే పద్యానికి దీటుగా తోస్తుంది.
“ఎంత జాగు సేసితే.. శ్రీ యశోద యెద తేనెపట్టు తా/ నిట ద్విరేఫ మగుచు నెసగు నేమొ”
యశోద హృది మాతృత్వ మమకారపు పూదోటలో నిండిన తేనెపట్టు కాగా కృష్ణుడు దాని చుట్టూ ఆ అనుభూతి అతిశయించిన పారవశ్యమున తేనెటీగలా తిరుగుతున్నాడని, అందుకే ఇంతవరకూ మెలకువ గాంచలేదని చెప్పుకుంటున్న గోపికల మాటలను రమణీయంగా అభివర్ణిస్తారు.
ఇందులో..
“మెదలుచు నుండెనంట నవ మేచక నీల పయోధి భంగమై”
“నవ్విన పాల సంద్రపు నుర్వు కవ్వపు కుండలో వెన్న తార్కొన్నయట్లు”
“దధి మధన గీతముల వెంట తరలివచ్చు శ్రుతి రహో మాధురులు చైత్య సుందరములు”
“ప్రణవ ఝంకృతుల హృదయ గుహాంతర శ్రుతి”
వంటి పంక్తులలో సుప్రసన్న గారి కవిత్వ పటుత్వ నిర్మాణ శక్తి అనన్య సామాన్యం.
ఈ దళంలో ఒకచోట ఆయన ‘బుదుగరించెడు’ అనే పద ప్రయోగం చేయడం విశేషం. తెలంగాణ వ్యావహారికంలో ‘బుజ్జగించు’ అనే పదాన్ని ‘బుదుగరించు’ అనడం పరిపాటి. తెలంగాణ ప్రాంతీయుడైన ఆయన పద్యంలో వ్యావహారిక భాషా రత్నాలను పొదగడం దానిని మరింత అందగింపజేసింది.
ఏడవ దళంలో..
యుద్ధరంగంలో అర్జునుని నిర్వేదం, యుద్ధం పట్ల విముఖత వర్ణితం.
“నభమెల్ల క్రమ్మిన రక్త నవ్యాంశు సంభార మమర
ఉభయ సేనామధ్యమందు ఉద్యత్సర స్పరాహరణ
నిభృత మతుల్ దేవ దైత్య నీరంధ్ర తత్త్వ నిర్భరులు
ప్రభువులు, మృత్యువునెంచి పర్వెత్తుచున్న వాహినులు”
ఇక్కడ కౌరవ పాండవ సేనల నడుమ జరగబోయే భీకర యుద్ధ వాతావరణం ప్రకటితమవుతుంది. ఒకవైపు పరస్పరం ఆయుధాలను ప్రయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్న సైనిక దళాలు, మరోవైపు మృత్యు భీతి చేత వెన్ను చూపుతున్న సైన్యం..
వీరి మధ్య రక్త సంబంధీకులను, బంధుగణాలను చూస్తూ రథముపై నున్న అర్జునుడు…
“రథముపై నరుడు శంకా/ పథమున విహ్వలితుడాత్మ భావమ్మున వి/ శ్లథితుడు హింసాఽ హింసా/ వ్యథాకులుడు పాప భావానాందోళితుడై”..
యుద్ధఫలితాల తాలూకు భయముతో అవయవముల పట్టు తప్పి దుర్బలుడైనాడు.
“సేనయోరుభయోర్మమధ్యే రథం స్థాపయమేఽచ్యుత”
“యావదేతాన్ నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణ సముద్యమే!!
(అర్జున విషాద యోగము -21, 22)
కౌరవ, పాండవ సేనల రెండింటి మధ్య తమ రథాన్ని నిలుపుమని, రణరంగంలో తాను ఎవరెవరితో పోరాడవలసి ఉన్నదో వారిని చూడాలని స్వయంగా కోరుకొని సమరోత్సాహుడైన అర్జునుడు ఇంద్రియాధీనుడై బలహీనుడయ్యాడు.
ఇట్టి స్థితిని సుప్రసన్నాచార్య గారు..
“మత్స్య యంత్రచ్ఛేద మహిమ చూపిన నాటి గరువమ్ము నిముసాన కరిగిపోయె/అగ్ని గర్భమ్మైన యాజ్ఞసేనిని గెల్చు నభిమానమింతలో నణగి పోయె/మయ సభాభవన నిర్మాణ మహైశ్వర్య రేఖ మనస్సున క్రిందు వడియె/ పాశుపతాస్త్ర సంపద గెల్చు శౌర్యమ్ము త్రస రేణువంతగా తలపు దెచ్చె..”
ఇక్కడ కవి, మత్స్య యంత్రాన్ని పడగొట్టి ద్రౌపదిని గెలుచుకున్న అర్జునుని వీరత్వము క్షణంలో కరిగిపోయిందని, మయసభను నిర్మించుకున్న సంపదాతిశయము పడిపోయినదని, నిటలాక్షుని ఎదిరించి పాశుపతాస్త్రాన్ని పొందిన శౌర్యము అణుమాత్రంగా మారినదని అభివర్ణిస్తారు. అవిక్రమ పరాక్రముడైన అర్జునుడు కూడా ఇంద్రియాలకు వశుడు కావడం ఇక్కడ కనిపిస్తుంది. మహాతపస్వులు సైతం ఇంద్రియాశ్వములకు లోబడగా సామాన్య మానవుడెంత?
“కరిగిన కాలమందెదుర కన్పడు దైహిక జైవ చైత్య సం
సరణము నందు పాశపరిషద్వినిబద్ధ పశూపమానుడై
చెరబడి యున్న వేళలను శ్రీ మధుసూదనూక్తి శాంతి ని
ర్భరత వెలార్చు, పాశముల పట్లు తొలంగును దివ్యసంగతిన్”
భవబంధ పాశములకు చిక్కిన అర్జునునికి, మధుసూదనుని గీతోపదేశం దుఃఖాన్ని ఉపశమింపజేసి కర్తవ్యోన్ముఖుని చేసింది. సర్వ జగద్గురుడు, ఆర్త శరణ్యుడు అయిన శ్రీకృష్ణుడు స్వయంగా బోధించిన తత్త్వ జ్ఞానము. ఇది అందరూ తెలుసుకోవలసిన సత్యం. భగవద్గీతను పరిపూర్ణంగా అర్థం చేసుకొని, పరమాత్మ తత్త్వాన్ని అవగాహన చేసుకున్నవాడు ఇహలోక బంధాల నుండి విముక్తుడవుతాడు.
ఈ దళంలోని ప్రతీ పద్యము యుద్ధ గాంభీర్యమైన పద ప్రయోగంతో కవితా సౌందర్యాన్ని అతిశయింప జేస్తుంది.
ఎనిమిదవ దళంలో..
వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు భూలోకంలో బదరికాశ్రమానికి ఏతెంచిన విధానము మనోహరంగా వర్ణించబడింది.
“అనుకోకుండ తనంతగా నెదుర వీణాగ్రాన నావిర్భవిం
చిన ప్రాణాధిక జీవనప్రియసుమార్చిర్మూర్తి సౌందర్యమం
దున నిర్బద్ధుడ, ముగ్ధచిత్తుడను, ప్రాణోత్తీర్ణతన్ కృష్ణ చే
తన వార్ధింబడి పోవుచుంటి హృదయ ద్వార్ దేశముల్ విప్పుకోన్”
వికసిత హృదయ కవాటముల ద్వారా అతులితము, నిత్యానందమయము, సమ్మోహనము అయిన కృష్ణ సౌందర్య మాధుర్యాంబుధితో పాటు ప్రవహిస్తున్నారు కవి.
“అవికృత శ్రీవికుంఠాధిపత్యము వీడి, క్షీరాబ్ధి తరగల చేర్చి.. మిన్నలము కొన్న బదరికాసన్నవనము/ నందు దిగి వచ్చి అష్టాక్షరాంశువుల ప్ర/పంచమును నరుడై చుట్టి పట్టు ప్రభువు/వెలసె నారాయణుండు శ్రీ విభుడు తాను”
వైకుంఠము వీడి బదరికాశ్రమానికి వచ్చి నారాయణుడు తపమాచరించాడు. ఇక్కడనే “ఓం నమో నారాయణాయ” అష్టాక్షర మంత్రం పుట్టింది. సాధకునిలో అంతర్గత శాంతికి, దైవంతో అనుసంధానానికి మార్గం ఈ మంత్రం.
“తట్టుకొనంగరాని భవతాపములల్లిన కాననాన నె
ప్పట్టుననైన గ్రీష్మ ఋతుబంధము క్రమ్మిన చిత్త వీధి ప్రా
వృట్టమగు మేఘమైన మణికృద్రుచిముగ్ధ నభంబు సూచుచున్
నట్టువపిట్టనై నలిన నాభుని చిత్తము నాక్రమించెదన్”
దుర్భరములైన భవబంధముల గ్రీష్మర్తువు కమ్ముకొన్న హృదయంలో, వర్షఋతు ఆగమనంతో దట్టమైన మేఘములు వ్యాపించిన గగనాన్ని చూస్తూ నర్తించే మయూరమై పంకజనాభుని వశం చేసుకుంటానంటారు. ఉన్నతోన్నతమైన కవి భావనా సామ్రాజ్యమిది. ఎల్లలు లేని భక్తి పారవశ్యత. భగవంతుని భక్తునికి అనుసంధానించే తన్మయస్థితి. ఎటువంటి వికారాలు లేని స్వచ్ఛము, పవిత్రము, నిశ్చలములైన మానసిక ధ్యానము. ద్వైదీభావం లేని ఏక రూపత. ఎంతటి ఏకాగ్రచిత్తం ఉంటే తప్ప ఇటువంటి భావన అనూహ్యము, అసాధ్యము.
చివరగా.. తనలో ఉత్పన్నమైన అనేక భావనలను పుష్పాలుగా పరంధామునికి అర్పించుకుంటున్నారు సుప్రసన్నగారు.
“కుదురై ఈ బ్రదుకిట్లు సాగినది నీకున్ వాక్ ప్రసూనార్చనా
స్పదతన్ గూర్చితి సర్వభావముల, నీ సంబంధమే బంధమై
కొదువల్ చేరని మన్కి దక్కినది నాకున్ శ్రీ శివానంద సం
పద చింతామణి! చిత్పదారణి!శ్రుతి ప్రావారముక్తామణీ!”
భావనా పుష్పములను సమర్పిస్తూ, జగన్నాయకునితో తనకున్న సంబంధం వలన జీవితం కొదువ లేకుండా సాగుతున్నదని కవి అలౌకికానందాన్ని ప్రకటిస్తారు. ఇటువంటి ఆధ్యాత్మిక తత్పరతకు మార్గాన్ని ఏర్పరచిన తమ గురువు శ్రీ శివానంద మూర్తి అనే చింతామణి ద్వారా అఖండమైన విద్యాధనం లభించిందని ఆయనను స్మరించుకుంటూ కావ్యాన్ని ముగిస్తారు.
సుప్రసన్నమై వెలువడిన కృష్ణభావ ప్రవాహమే ఈ కావ్యం. కణకణమూ ఆవరించిన కృష్ణతత్త్వం. అత్యంత మాధుర్య మనోహర సమ్మిళితమై ఎద నిండా ఆవరించిన మనోజ్ఞ తత్త్వం. అది అనుభవైకవేద్యమే తప్ప వర్ణనాతీతం. భక్తి పారవశ్యవిలోలురై కృష్ణునితో మమేకమై ఆ బ్రహ్మాండ నాయకునితో తనకు అభేదాన్ని అనుభవించిన కవి జీవితం ధన్యం.
ధూళిపాళ అరుణగారు అధ్యాపకురాలిగా పనిచేసారు. తెలుగు ఎమ్.ఏ., టిపిటి చేశారు. 25 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా, ఉపన్యాసకురాలిగా వివిధ విద్యాసంస్థల్లో బోధనానుభవం గడించి, స్వచ్ఛందంగా విరమించుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్‌గా అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల నిర్వహించారు. వివిధ పత్రికల్లో కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. తరుణి, మయూఖ ఆన్లైన్ పత్రికలకు ఇప్పటివరకు ప్రముఖ సాహితీవేత్తలను, 28 మందిని ఇంటర్వ్యూలు చేశారు.
ప్రచురణలు: ‘జ్ఞాపకాల సంతకం’ తొలి కవితా సంపుటి. ‘మిగిలేవి గురుతులే’ తొలి కథా సంపుటి. ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్యావలోకనం, మయూఖ ముఖాముఖి (సాహితీవేత్తల ఇంటర్వ్యూల సంకలనం), చేతనాశిల్పం (కవితా సంపుటి), మసన చెన్నప్ప సమగ్ర సాహిత్యం ఇతర ముద్రిత గ్రంథాలు. ఫోన్: 8712342323

