Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

క్షేత్రయ్య పదాలు – మనోవిశ్లేషణ-1

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘క్షేత్రయ్య పదాలు – మనోవిశ్లేషణ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.]

ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే। ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః॥
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత। క్షేత్రక్షేత్రజ్ఞయోర్ఙ్ఞానం యత్తజ్ఞానం మతం మమ॥

భగవద్గీత 13వ అధ్యాయంలో గీతాకారుడు “కౌంతేయా! ఈ శరీరాన్నే ‘క్షేత్రం’ అనీ, ఈ క్షేత్రాన్ని (శరీరాన్ని) తెలుసుకోగలిగిన వారినే ‘క్షేత్రజ్ఞుడు’ అని జ్ఞానులు పిలుస్తారు. సమస్త ప్రాణుల శరీరాల్లో క్షేత్రజ్ఞుణ్ని నేనే! క్షేత్రం మరియు క్షేత్రజ్ఞత గురించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం” అని ఇది ‘తన మతం’ అంటూ అర్జునుడికి చెప్తాడు.

శరీరంలో నివసించే జీవాత్మను ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడు! అలాంటి క్షేత్రజ్ఞుడు కాబట్టి ప్రజలు పదసంకీర్తనాజనకుడు మహాకవి క్షేత్రయ్యగా ఆయన్ని పిలుచుకున్నారు. తమిళనాడులో క్షేత్రజ్ఞ అనే పిలుస్తారాయన్ని! అసలు పేరు వరదయ్య.

క్షేత్రమనే పదానికి శరీరం అనే అర్థంతో పాటు పంటభూమి, స్థలము. భార్య, పుణ్యభూమి అనే అర్థాలు కూడా ఉన్నాయి. ‘పస్తు’ ఉండటం అని కూడా! నిన్న ‘కటికిక్షేత్రం’గా ఉన్నాడంటే, ఉపవాసం ఉన్నాడని! ‘క్షేత్రములు చేయుట’ అంటే ఉపవశించటం అనే! ‘క్షేత్రాజీవుడు’ అంటే రైతు అని కూడా!

మొవ్వ వాడేనా?

మువ్వగోపాలాంకిత వాగ్గేయకారుడిగా తెలుగు సాహిత్యాన్ని, తెలుగువారి నాట్యకళా ప్రపూర్ణతనూ, కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేసినవాడు క్షేత్రయ్య! క్రీ.శ. 1610–1690ల కాలం నాటివాడు. కృష్ణాజిల్లా కూచిపూడి దగ్గర ‘మువ్వ’ గ్రామం వాడని చెప్తారు. ఆరుద్ర ప్రభృతులు విశ్వసించకపోయినా విస్తృత ప్రచారంలో ఉన్న చరిత్ర అది! ఇనపురినాథుడని మువ్వగోపాలుణ్ణి సంబోధించటాన్ని బట్టి ఆ ఇనపురి కృష్ణాజిల్లా ‘మొవ్వ’ కాకపోవచ్చని కొందరి అనుమానం. కాగా, మొవ్వ గోపాలుడు మువ్వగోపాలుడెలా అవుతాడని ఇంకో అనుమానం కూడా ఉంది.

కొందరు పుత్తూరు తాలూకా వాడంటారు. కానీ, ఆ వాదన నిలవలేదు. మొవ్వ సమీప గ్రామం కూచిపూడికి చెందిన భాగవతులు క్షేత్రయ్య పదాలను భక్తి భావనతో అభినయించటం చేతా, మొవ్వ గ్రామంలో మొవ్వ ఇంటిపేరున్నవాళ్లు ఉండటం చేతా, విస్సా అప్పారావు గారు క్షేత్రయ్య కృష్ణాజిల్లా మొవ్వ గ్రామం వాడే అని డంకా బజాయించి ప్రకటించారు. దానికి తోడు మొవ్వ గ్రామం లోని వేణుగోపాల స్వామి గుడికి కనీసం వెయ్యేళ్ల ప్రాచీనత ఉందని నిర్ధారించటం కూడా అదనపు సమర్థన ఇచ్చింది!

తన నాలుగు వేలకు పైగా పదాలలో క్షేత్రయ్య కంచివరదుని, చెవ్వంది లింగని, కడప వేంకటేశ్వరుని, హేమాద్రి స్వామిని, ఇనపురి వేణుగోపాలుణ్ణి, తిరువళ్ళూరి వీరరాఘవుణ్ణి, శ్రీరంగేశుణ్ణీ ఇలా ఎందరో దేవతామూర్తుల్నిస్తుతిస్తోత్ర పదాలతో అరాధించటం వలన క్షేత్రాలన్నీ తిరిగి క్షేత్రయ్య అయ్యాడని ప్రతీతి.

క్షేత్రయ్య కృష్ణాజిల్లా మొవ్వ వాడే అయినట్లయితే, ఆయన చిన్ననాడే కూచిపూడి గురువుల వద్ద నృత్యాభినయాలు, సంగీత సాహిత్యాలు నేర్చుకుని ఉండాలి, ఈ మూడు విద్యల్లోను బాల్యంలోనే ప్రవేశం లేకపోతే అంత గొప్ప సాహిత్యసృష్టి సాధ్యం కాదు! చిన్నప్పటి నుండే పద్యాలూ పదాలూ రాసిన అనుభవం కూడా ఉండి ఉండాలి.

భౌతిక వాంఛలకు సంబంధించిన కవిత్వం వ్రాయటంలో గొప్పతనం లేదని, దివ్య పారలౌకిక ఆనందానుభూతిని కలిగించే సాహిత్యం వెలయించగలిగిన రోజున అతని కోరికని మన్నిస్తానని తను ప్రేమించిన దేవదాసి అన్నదని ఒక కథనం! ఆమెతో అన్ని సుఖాలూ అనుభవించాకే పారలౌకిక ఆనందం కోసం అన్వేషణ ప్రారంభించాడని ఇంకో కథనం. ఒక యోగి గోపాల మంత్రోపదేశం చేశాడనేది మరో కథనం కూడా ఉంది. అన్నీ ఊహాగానాలే! ఎక్కడ పుట్టాడనేకన్నా, ఏం సాధించాడన్న దానిమీద ఎక్కువ దృష్టిపెట్టటం ఉత్తమం!

శ్రీపాద పినాకపాణిగారు నాట్యోపయోగకరమైన క్షేత్రయ్య పదాలకు స్వరాలు కట్టి, సంగీతానికి పనికివచ్చే విధంగా వ్రాశారు. ఇప్పుడు సంగీత కచ్చేరీల్లో కూడా అక్కడక్కడా క్షేత్రయ్య పదాలు వినిపిస్తున్నాయి.

దక్షిణాంద్రయుగం పదకవితల యుగం

పదకవితలకు దక్షిణాంధ్ర యుగం సువర్ణయుగం! పదకవితలు శృంగారరస ప్రధానంగా ఉంటాయి. ఆ యుగంలో ఓహరిసాహిరిగా వెలువడిన యక్షగానాలు, పద్యకావ్యాలకంటే పదకవితలు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. ఒక ఎలకూచి బాలసరస్వతి, ఒక చేమకూర వేంకటకవి కన్నా జనసామాన్యానికి క్షేత్రయ్య, త్యాగయ్య ఎక్కువ మందిని చేరారు. త్యాగరాజ కృతులు సంగీత సాహిత్య ప్రాధాన్యాన్ని సంతరించు కుంటే, క్షేత్రయ్య పదాలు సంగీత సాహిత్య నృత్య ప్రాధమ్యాలు మూడింటినీ సంతరించు త్రివేణీ సంగమం అయ్యాయి.

“తముఁ దామె వత్తురర్ధులు/క్రమమెఱిఁగిన దాతకడకు, రమ్మన్నారా
కమలంబు లున్నచోటికి/భ్రమరంబుల నచ్యుతేంద్ర రఘునాధనృపా”

అనే పద్యాన్ని క్షేత్రయ్య చెప్పినట్టుగా ఆంధ్రకౌముదిలో మండ నృసింహ కవి ఉదాహరించాడు. కమలాల దగ్గరికి భ్రమరాల్లా దాతల దగ్గరకు అర్థులు రమ్మకుండానే వస్తారని భావం. ఇది 1630ల నాటి సంగతి! ఇలాగే 2,3 పదాల్ని జింజి రాజ్య దండనాయకుడు తుపాకుల వేంకట కృష్ణరాజుకి కూడా అంకితం ఇచ్చాడట. ఈ ఆధారంగా క్షేత్రయ్య జింజి వాడై ఉంటాడని ఒక వాదన! 1643లో బీజాపూరు సుల్తాన్లకు జింజి వశమై పోతే, గోలకొండ సేనాని మీర్ జుమ్లా సైన్యంలో ఈ కృష్ణంరాజు చేరాడని, అతని ద్వారానే క్షేత్రయ్య మీర్ జుమ్లాని, అలాగే గోలకొండ ప్రభువు అబ్దుల్లా కుతుబ్షానీ కలిశాడని చెప్తారు.

తంజావూరు విజయరాఘవ నాయకుడు తననుతాను రాసలీలా కృష్ణుడిగా ఊహించుకుని తన వెయ్యిమంది రాణుల్నీ ఒకేసారి రప్పించి వాళ్ళతో కృష్ణుడిలానే రాసలీలలు నిర్వహించాడని రంగాజమ్మ వ్రాసింది. అది క్షేత్రయ్య ప్రభావమే! దాన్నే చరిత్రగా సాహిత్య చరిత్రకారులు వ్రాశారు. తన యుగాన్ని క్షేత్రయ్య అంతలా ప్రభావితం చేశాడన్నదే అసలు చరిత్ర!

క్షేత్రయ్య పదాల లక్ష్య లక్షణాలు

క్షేత్రయ్య తరువాతి కాలం వాడైన ఒక ఆంధ్రకవి భానుదత్తుడి రసమంజరి సంస్కృత లక్షణ గ్రంథాన్ని ‘శృంగార రనమంజరి’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చాడు. అందులో అనేక లక్షణాలకు ఆయన క్షేత్రయ్య పదాలను ఉదహరించాడు. కూచిపూడి వారిక్కూడా ఈ భానుదత్తుని రస మంజరి పాఠ్యగ్రంథం కావటాన వారికి క్షేత్రయ్య పదాలపట్ల పూర్తి అవగాహన ఉంది. పూర్తి ‘పట్టు’ ఉంది!

“క్షేత్రయ్య తన పదములలో కాంభోజిరాగము పాడుటలో నెవ్వరైన చూపగల విన్యాస వైఖరుల నన్నిటిని బూర్తిగావించెనని శ్యామశాస్త్రుల వారు చెప్పియుండుట యీ కారణము చేతనే క్షేత్రయ్యరాగ న్వరూపచిత్ర మతిసుందరము మనోహరము. అదివఱ కెవ్వరును రాగమున కిట్టి యందమును తీర్చిదిద్దినవారు లేరు. ఇట్టి రాగరచన చేసి రాగమునకు రససిద్దివి గల్పి౦చి, రాగము యొక్క సంపూర్ణ స్వరూపమును నిరూపించి, సంగీతములో రాగమునకుఁగల యున్నత స్థానమును నిర్ణయించి క్షేత్రయ్య తర్వాతి వాగ్గేయ కారులకు, సంగీత వేత్త లకు మార్గదర్శియైనాడు “ అని వ్రాశారు దివాకర్ల వెంకటావధానిగారు.

భక్తిరసాయనం

క్షేత్రయ్య సాహిత్యాన్ని మధురభక్తి పరమైనదిగా, నాయక–నాయికల క్రీడగా విశ్లేషకులు భావిస్తారు. భక్తిని తొమ్మిది రకాలుగా వివరిస్తారు. వాటిలో హృదయావర్ధకమైనది మదురభక్తి. కొందరి భక్తి రచనల్లో భక్తి అనేది ఒక భావంగా కనిపిస్తే, కొందరిలో ఒక రసంలా ప్రస్ఫుటమౌతుంది. భక్తిని కూడా ఒక రసం అనుకుంటే రసాలు పది ఉన్నట్టు! మధురభక్తిలో రసస్పర్శ ఉంటుంది కాబట్టి ఆ రచనల లోతు వెదకాలనే ప్రయత్నం జరుగుతోంది. రసహీనరచన గురించి మనం మాట్లాడేదేం ఉంటుందీ?

భక్తిరసానికి తాదాత్మ్యం దాని స్థాయీభావం అవుతుంది. భక్తిని 10వ రసంగా ఆలంకారికులు అంగీకరించక పోతే దాన్ని ‘భక్తిరసాయనం’ అని పిలుచుకుందాం. రసాయనం అంటే రసమే భక్తి చుట్టూ పరిభ్రమించేదని!

భక్తిరసాయనం పండటం చేతే శివుడనగానే పాల్కురికి సోమన, హరిహరనాథుడనగానే తిక్కన, కృష్ణుడనగానే పోతన, రాముడు అనగానే రామదాసు-త్యాగయ్య, వెంకటేశ్వరుడనగానే అన్నమయ్య, మువ్వగోపాలుడనగానే క్షేత్రయ్య మన స్మృతిపథంలో మెదలుతారు.

భగవంతుణ్ణి సేవించటం భక్తి అని కొందరు, సాంసారిక బంధాలనుండి విడివడటం భక్తి అని మరికొందరు, భగవంతుడిలో మమేకం కావవటం భక్తి అని ఇంకొందరు- ఎవరెన్ని అర్థాలు చెప్పినా క్షేత్రయ్యగారి భక్తికి ఈ నిర్వచనాలేవీ అందవు. ఎందుకంటే భగవంతుడి చుట్టూ భక్తుడు కాకుండా, భక్తుడి చుట్టూ భగవంతుడే తిరిగిన భక్తిరసాయనం ఇది!

‘వనజాక్ష! నీ విటకు వచ్చేదాక/తలవాకిలె యిల్లు సుమీ నా ప్రాణనాథ!
శరణు మువ్వగోపాల/ఈ రేయి గూడ జాగుసేయక రమ్మీ నా ప్రాణ నాథ’

అంటూ తననొక అభిసారికగా భావించుకుని, తలవాకిట నిలబడి ప్రభువు కోసం ఎదురుచూస్తోన్నానంటున్నాడు.. నాయిక మిషే గానీ మనసు ఆ ప్రభువు వచ్చి తనను తీసుకుపోవాలనే దాని మీదే ఉంది!

“నిను చూడగలిగే నిన్నాళ్ళకి
నిన్ను చూచి నాలుగైదు నెలలయ్యె మువ్వగోపాల
నిన్న రేయి కలలో నా కన్నుల గట్టినట్టుండ వెన్నుడా!
దిగ్గున లేచి వెదకి కానక
కన్నీరుచే పైట తడిసి, కరగి చింత నొందితి
నన్ను తలచిదోలేదో నా నోము ఫలము”

అనే పదంలో స్వామి తరచూ వచ్చిపోయేవాడుగానే కనిపిస్తాడు. ఈ మధ్య కొంచెం ఎక్కువ విరామం వచ్చినట్టు చెప్తాడు. రాత్రి కలలో వచ్చినట్టు కనిపిస్తే ఇల్లంతా వెదికి కనపడక కన్నీళ్ళతో పైటకొంగంతా తడిసిపోయిందట!

“ఒక్కసారికే యీలాగైతే – ఓహోహో యిది యేటి రతిరా!/మక్కువ దీర్చర – మా మువ్వగోపాల” అని దీనాలాపం చేస్తాడు.

భక్తిరసం పండాలంటే, భక్తుణ్ణి భగవంతుడికి చేరువ చెయ్యాలంటే, భగవంతుని ప్రేమిస్తే కలిగే సౌఖ్యభావనను వ్యక్తం చేయటానికి అన్నమయ్య క్షేత్రయ్య ఈ మహాకవు లిద్దరూ శృంగారరసాన్ని ఒక పోలికగా తీసుకున్నారు! ఒకరు పదకవితా పితామహులైతే, ఇంకొకరు పదకవిత జనకులు. పదకవిత అంటే భక్తి రసాయన కవిత! భక్తి రసాయనం అంటే భక్తి+శృంగార రసం.

వేంకటేశ్వరుడు అమ్మవారితో సలిపిన కేళీ విలాసాలను తాను మనోనేత్రంతో దర్శించి కమనీయంగా వర్ణించినవాడు అన్నమయ్య. తానే ఆ నాయికగా మారి, భగవంతుని స్పర్శను తన ఆత్మదృష్టితో ఆస్వాదించి తన అనుభవాన్ని పాటగా మలచినవాడు క్షేత్రయ్య. ఆ ఇద్దరి భక్తితవంలో తేడాని ఆ యా కోణాలలోంచి విశ్లేషించి చూడాలి! భస్క్తి అనేది గుణం కాదు తత్త్వం. గుణాలెప్పుడూ మారుతూ ఉంటాయి. ఎన్నటికీ మారనిది తత్త్వమే!

భగవంతుణ్ణే పెళ్ళాడాలనే కోరిక

“చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ/జిక్కఁడు దానముల శౌచశీల తపములం
జిక్కఁడు యుక్తిని-భక్తినిఁ/జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండ”

అంటారు పోతనామాత్యులు. వ్రతాలు క్రతువులు, దానాలు, శౌచశీలతపాదులవలన భగవంతుడు చిక్కడని, కేవలం భక్తికి మాత్రమే చిక్కుతాడనీ పోతనగారు ప్రహ్లాడుడి నోట పలికిస్తారు. Devotion, Prayer, Worship లకూ భక్తి చిక్కేది కాదు. అది అనిర్వచనీయమైనది. అంతటిస్థాయిలో భక్తుడికి మాత్రమే అందే ఒక తాదాత్మ్య స్థితిని సాధారణ సాంకేతిక పదాల పంజరంలో ఇమడ్చలేం. అది మనసా వచసా అనుభవేకవేద్య స్థితి.

స్త్రీమూర్తులైన అక్కమహాదేవి శివుణ్ణి, ఆండాళ్లు విష్ణువుని ప్రేమించిన కథలు అసత్యాలు కాదు. ఇలాంటి పుణ్య స్త్రీలకథలు మనకు ఎన్నో ఉన్నాయి. వాళ్లంతా ఏ విధంగా భగవంతుని ప్రేమించారో పురుషుడైన క్షేత్రయ్యా ఆ విధంగానే భగవంతుణ్ణి ప్రేమించాడు. అందుకోసం తనను తాను స్త్రీగా మలచుకున్నాడు. భగవంతుడొక్కడే పురుషుడు, తక్కిన జగమంతా స్త్రీయేననే భావన ఇందుకు ప్రేరణ.

జీవాత్మ స్త్రీ, పరమాత్మ పురుషుడని చెప్పేది మధురభక్తి. “అసంప్రదాయవిత్ సర్వశాస్త్రవిదపి మూర్ఖవదుపేక్షణీయః – అన్నీ తెలుసుసనుకునేవాడికి సంఫ్రదాయం తెలీయకపోతే మూర్ఖుడని వదిలేయి” అన్నారు శంకరులు. జీవాత్మా పరమాత్మలకు సంబంధం కుదిరితే, సంయోగం సాధ్యపడితే, ఆ ఇద్దరి కలయికా ఓ మధుర కావ్యమే!

“కూడి ఎడబాయక యుందునని యెంచుకుంటి” అనీ, “ఆటకు మేటిగా వలె తంబుర గోట మీట రాగ మనవలె వానిపై సొగసు పాటలు వినుపించవలె” అంటూ నాయికే స్వయంగా మాట్లాడుతుంది.

“శృంగారవనములో చెలువుడు నేను రంగు మీరగ చదరంగ మాడగను” అంటూ నాయిక, నాయకుడు ఆడుకుంటారు పాడుకుంటారు. .

“వాలాయముగాను – వాతెర యానుచు/ఏలపదము బాడుచు – నెలమి సొక్కించుచు” అంటూ నాయిక సంతృప్తి ప్రకటిస్తుంది. “ఇటువంటి వాడని నే దెలియనైతిని”అంటూ అసంతృప్తినీ, “కోపము రాదా? – యెవ్వరికైన” అంటూ అలకని, “ఇక్కడ లేదే మనసు – ఇంతిరో వానికి” అంటూ విరహాన్నీ, ఇలా ఎన్నో రకాలుగా విరహోత్కంఠ, వాసకసజ్జిక, అభిసారిక, ఖండిత లాంటి నాయికలందరి పాత్రల్నీ స్వయంగా క్షేత్రయ్యే పోషింఛాడనిపిస్తుంది ఈ పదాలు చదివితే!

అభినయించగలవారికి అభినయింగలిగినంత అవకాశం ఇచ్చే పదాలివి! ఏ తరహా నాయిక గురించికావాలన్నా క్షేత్రయ్య పదాలలో ఉదాహరణలు కనిపిస్తాయన్నారు గిడిగు సీతాపతి.

డివోషనల్ లిబిడో-భక్తిరసాయనం

“ఒహోహో యిది యేటి రతిరా” అంటూ, క్షేత్రయ్య అంత బహిరంగంగా అక్కడ జరిగేది బూతే నని చెప్తోంటే దానికి అంతరార్థాలు వెదుకుతా రేమిటనే అసహనం పాఠకుడిలో కలగటం సహజం. “రతిర్దేవాది విషయః” అని దేవాది విషయకమైన భక్తినే రతిగా భావించారు. కేవలం మన వాడుకలో ఉన్న పదాల్ని మన వాడుకలో ఉన్న అర్థాలతోనే అన్నింటినీ తూకం వేస్తానంటే కుదరదు. బంగారాన్ని తూచే తూకాలు వేరు. కిరసనాయిల్ని తూచే తూకాలు వేరు.

రతి, రతము పదాలకు స్త్రీ పురుష సంయోగం Coition, sexual intercourse అని మాత్రమే కాదు, ఆసక్తి, కోరిక అనే అర్థాలు కూడా ఉన్నాయి. రతి అని మన్మథుడి భార్యకు పేరు. ఒక సినిమా నటి కూడా ఆ పేరుతో ప్రసిద్ధి అయ్యింది. రతి అనగానే బూతు అనుకోనవసరం లేదు. శృంగార రసానికి రతి స్థాయీభావం. దానికి ఆనందించటం అనే గానీ స్త్రీ పురుషుల సంయోగ క్రియ అని అర్థం కాదు. ఆ ఆనందానుభవాన్ని కలిగించే అంశాలన్నీ రతి కిందకే వస్తాయి. ఫ్రాయిడ్ దీన్నే లిబిడో అన్నాడు.

పాశ్చాత్యులకు ఈ’ భక్తిశృంగారం’ గురించిన అవగాహన లేదు. వారి సంస్కృతిలో ఇలాంటి సన్నివేశాలు లేవు. ఒకవేళ వాటి గురించి కూడా తెలిసి ఉంటే, ఫ్రాయిడ్ దీన్ని “డివోషనల్ లిబిడో” అని ఉండేవాడు. భక్తిరసాయనం అనేది దీనికి సమానార్థకం! అది అన్నమయ్యకు తెలుసు, క్షేత్రయ్యకు తెలుసు. కాకికేమి తెల్సు సైకో ఎనాలిసిస్?

శృంగారం అనేది పునరుత్పాదకతకు ప్రేరకమైన ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. మనో విశ్లేషణ శాస్త్రంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ దీన్నే ‘ఈథోస్’ అన్నాడు. వైరాగ్యం ద్వారా శరీరాన్ని శుష్కింపచేసుకుని మరణాన్ని తెచ్చుకోవటం ‘ఈథోస్’కి వ్యతిరేక చర్య. ఫ్రాయిడ్ దీన్ని “థనటోస్” అన్నాడు.

సమాజంలో జీవించాల్సిన ఇతర అవసరాలూ అనేకం ఉన్నాయి. అవి వ్యక్తిలో వాస్తవిక సూత్రం (Reality Principle)ని అభివృద్ధి చేస్తాయి. ఈ వాస్తవిక సూత్రాలు ఆనంద సూత్రాల్ని నియంత్రిస్తాయి. ఇలా నిగ్రహం వలన నెరవేరని ప్రవృత్తులు శరీరంలో పేరుకుపోతే మానసికంగా ఒత్తిడి, అశాంతి కలుగుతాయి. ఆ ఉద్రిక్తతను తొలగించడానికి మనోశక్తిగా సబ్లిమేట్ (ఉన్నతీకరణ) జరుగుతుంది. ఇదే ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఆనంద సూత్రం (Pleasure Principle).

మనిషి తక్షణ ఆనందాన్ని కోరుకున్నప్పటికీ సామాజిక సూత్రాల కారణంగా దాన్ని వాయిదా వేసుకుని, దారిమళ్లించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. మానవ వికాసం అనేది ప్రేరణల వల్ల పుట్టే అంతర్గత ఒత్తిడికి మరియు జీవన పరిస్థితులు విధించే నియంత్రణలకు మధ్య జరిగే నిరంతర రసాయన చర్యల ఫలితం. ఇలా కోరికల్ని జయించిన స్థితికి చేరిన వ్యక్తులు భక్తికి అర్హత సంపాదించుకుంటారు.

భారతీయ మనో విశ్లేషణ సిద్ధాంతం.

ఆనంద సూత్రాలు తమో గుణంలోంచి పుడతాయి. వాస్తవిక సూత్రాల నియంత్రణ రజో గుణం వలన జరుగుతుంది. రజోగుణాన్ని ప్రేరేపించేది ‘సత్త్వగుణం’ అని భారతీయ మనోవిశ్లేషణ శాస్త్రం చెప్తోంది.

సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా మనసుకు మూడు గుణాలనే చెప్పాడు. ఇడ్, ఈగో, సూపర్ ఈగో (ఈగో ఐడియల్) అని! వీటిని ఆయన తన గురువు జార్జి గ్రాడెక్ చెప్తే తెలుసుకున్నానని వ్రాశాడు. ‘గ్రాడెక్’ని ‘ఫాదర్ ఆఫ్ సైకో సొమాటిక్ మెడిసిన్’గా గుర్తించారు. ఆయన ఇండియాలో కొన్నాళ్ళు ఉన్నాడని చెప్తారు. ఆయన ద్వారానే మన సత్వరజస్తమో గుణాలు ‘ఫ్రాయిడ్’ని చేరాయన్నది సత్యం. ఫ్రాయిడ్ ప్రోక్తమైన మూడు గుణాల విధులూ, ఆయుర్వేద ప్రోక్తమైన త్రిగుణాల విధులూ రెండూ ఒకటే కావటం విశేషం!

కాశ్యపసంహిత అనే ఆయుర్వేద గ్రంథంలో “సత్త్వం ప్రకాశకం విద్ధి రజశ్చాపి ప్రవర్తకం| తమో నియాకం ప్రోక్తం అన్యోన్య మిధునం ప్రియం” సత్త్వ గుణం (సూపర్ ఇగో) ప్రకాశాన్నిస్తుంది. జ్ఞానానికి, ఉన్నత ఆలోచనలకీ అది ఆధారం. రజోగుణం (ఇగో) ప్రవర్తన, స్పందన లకు కారణం. తమో గుణం (ఇడ్) నియంత్రణలేని అజ్ఞాన పరంపర. ఈ మూడూ పరస్పరం అన్యోన్యంగా కలసి మన మనసుని నిర్మిస్తాయి. ఫ్రాయిడ్ చెప్పిన ఇడ్, ఇగో సూపర్ ఇగో త్రిగుణాలు మన శాస్త్రాలు చెప్పిన సత్త్వ రజస్తమో గుణాలనుండి స్వీకరించినవే! అలా తీసుకున్న సంగతి బహిరంగంగా చెప్పకపోయినా త్రిగుణాల సిద్ధాంతాన్ని ఆధునీకరించి ప్లెజర్ ప్రిన్సిపుల్ అనే ఆలోచనను ఫ్రాయిడ్ అందించగలిగాడు.

తమోగుణంలో ప్రవాహంలా ప్రసరించే కోరికల్ని రజో గుణం నియంత్రిస్తుంది. నియంత్రించాలనే ప్రేరణని సత్త్వగుణం ఇస్తోంది. నియంత్రించబడిన కోరిక మనోబలంగా sublimate అవుతుందన్నాడు ఫ్రాయిడ్. చిత్తవృత్తుల్ని నిరోధించటం వలన యౌగిక శక్తి కలుగుతుం దన్నాడు యోగశాస్త్ర ప్రవర్తకుడు పతంజలి. ఫ్రాయిడ్ Ethos అన్నాడు. ఈ సూత్రం సామాజిక అంశాలతో ప్రారంభించి ఆధ్యాత్మిక సూత్రాలవరకూ అన్నింటికీ వర్తిస్తుంది.

పౌరాణిక సూత్రాల ప్రకారం అతి నిగ్రహంతో శరీరాన్ని శుష్కింపచేసుకుని ఆత్మ విధ్వంసం ద్వారా మోక్షాన్ని పొందాలి! ఫ్రాయిడ్ దీన్నే ‘Thanatos’ అన్నాడు. ఇది `Ethos’ కి వ్యతిరేక చర్య.

చిత్తవృత్తుల నిరోధం ద్వారా మానసిక శక్తిని సబ్లిమేట్ చేసుకుని, ఈ మానసిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మళ్లీ సబ్ లిమేట్ చేసుకునే ప్రయత్నం మధురభక్తి సిద్ధాంతంలో కనిపిస్తుంది. అంటే, రెండు సబ్లిమేషన్లు జరగాల్సి ఉంటుంది. అన్నమయ్య క్షేత్రయ్య అక్కమహాదేవి ఆండాళ్ల స్థాయి భక్తిని పొందాలంటే! అంతటి ఆధ్యాత్మిక స్థితిని ఉన్నతీకరించుకోగలిగిన ఒక మహాకవి వ్రాసిన పొఅదాలను విశ్లేషించుకోబోయే ముందు ఆ కవి స్థాయిని మనం అర్థం చేసుకోగలగాలి!

తనని తాను నాయికగా భావించుకుని పరమాత్ముణ్ణి పురుషుడిగా భావించుకుని కేళీకలాపాలు పొందటం అంటే సినిమా పాట రాయటం కాదు. అదీ ఒక తపస్సే! కానీ, ఇది ఒక అసాధారణ జీవనసాధన!

భక్తి భావన ప్రపంచంలో అన్ని జాతులకూ ఉన్నప్పటికీ ఈ తాదాత్మ్య స్థితి భారతీయతలో మాత్రమే కనిపించే ప్రత్యేకత. భగవంతుణ్ణి పెళ్ళాడటం అనే స్థితి సిద్ధించాలంటే ఆ భక్తి అనేక మెట్లు పైస్థాయికి చేరినప్పుడే కలుగుతుంది. సాధారణ భక్తులకు కలిగే అనుభవం కాదిది. భగవంతునిలో ఆసాంతం లీనమైపోవాలనే తపనకు పరాకాష్ట!

‘నీవు’లో ‘నేను’ కరిగిపోయే అద్వైత స్థితి

భగవంతునితో సంబంధం కోసం మనిషి సృష్టించుకున్న రూపాలలోమాధుర్యభావం (పెళ్లి/కన్యాభావం) అత్యంత మధురమైంది. ఎందుకంటే అక్కడ ‘నీవు’లో ‘నేను’ కరిగిపోతుంది. భార్య-భర్తల సంయోగంలాగా భగవంతుడు, భక్తుడి సంలీనం కోసం అర్రులుచాచే ఆంతరంగిక స్థాయికి భక్తి చేరుతుంది. ఇదొక దివ్య ప్రేమ, దాన్ని మానవప్రేమ రూపంలో వ్యక్తపరిచాడు క్షేత్రయ్య. మానవ ప్రేమ పరిభాషలో అది కామమే! కానీ దివ్యప్రేమ పరిభాషలో అది భక్తి!

‘నన్ను నేను విడిచిపెట్టుకొని, పూర్తి హృదయంతో నీలో లీనమైపోవా’లని కోరుకుంటారు దంపతులు. ఇది మానవ సహజం. ఇదే విషయాన్ని భగవంతుడిలో లీనం కావటానికి ప్రయోగించిన భక్తశ్రేష్ఠులు ఆండాళ్లు, అక్కమహాదేవి, క్షేత్రయ్య ప్రభృతులు.

ఇదొక అద్వైతిక విలీన అభిలాష. ఇదొక ఆత్మానందం అనుకుంటే, అందులో శాశ్వత నివాసం కోరుకున్న భక్తులు వీరంతా!

భగవంతుణ్ణి పెళ్ళాడేది ఈ శరీరం కాదు, మనస్సు, ప్రాణం, చిత్తం, చైతన్యం-ఇవి భగవంతుని పెళ్లాడుతున్నాయి. దీన్నే భక్తిరసాయనం అంటున్నాను. ఈ భక్తిరసాయనంలో భౌతిక భావన ఒక్క చుక్క కూడా లేదు.

It is doubtful whether we are spiritualizing sex or sexualizing spirit whether we are sublimating earth to heaven or bringing down the heaven to our muddy levels and depths.. మనం నిజంగా లైంగికతను ఆధ్యాత్మికత వైపు ఉన్నతస్థితికి తీసుకెళుతున్నామా? లేక, ఆధ్యాత్మికత అనే మహద్భావాన్నే లైంగిక కోరికల స్థాయికి దిగజార్చుతున్నామా? మనం భువిని స్వర్గానికి చేర్చే ప్రక్రియలో ఉన్నామా? లేక, స్వర్గాన్నే మన మట్టి మనస్తత్వపు లోయలకు ఈడ్చుకొస్తున్నామా? భక్తి, ఆధ్యాత్మికత అనే పేర్లతో మనలోని శరీరాసక్తులను ఎత్తిచూపుతున్నామా? లేక మన శరీరాసక్తులను శాంతింపజేసి, శుద్ధి చేసి, ఉన్నతమైన చైతన్యంలో విలీనం చేస్తున్నామా? అని కట్టమంచి రామలింగారెడ్డి ఆగ్రహించిన మాట కూడా నిజమే!

ఆధ్యాత్మికత అనే పర్వతాన్ని మనం అధిరోహిస్తున్నామా? లేక మన కామాసక్తుల బరువుతో ఆ పర్వతాన్ని నేలమీదికి గుంజుతున్నామా? అనడుగుతున్నారాయన. చాలా మంది లాగానే కట్టమంచి వారూ కవి కష్టాన్ని మరచిన వారే! ఆగ్రహంగాఅ అన్నా ఆయన సబ్లిమేటింగ్ అనే మంచి పదం పదం వాడుతూ,. భూమిని స్వర్గంగా సబ్లిమేట్ చేయటం గురించి ప్రస్తావించారు. నిజానికి క్షేత్రయ్య చేసింది అదే! ఇందుకు తిరుగులేదు. అందుకు ఎవరి ఆమోదమూ అవసరం లేదు కూడా!

“వెలయ నీదు ముఖారవిందంబు లిఖియించి అలరు వాసనలు వ్రాయంగ నేరనైతి,
కళలొల్కు నీ మోవి గడఁగి వ్రాసితిఁగాని నెలఁత తేనియలుంచ నే నేరనై తి”

లాంటి చరణాలలోని లోతుని రామలింగారెడ్డిగారి లాంటి రసికుడు ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? నాయిక నాయకుడి ముఖారవిందాన్ని చిత్రిస్తోందట. అన్ని సొంపుల్నీ అందులో పొదిగిందట. నాయకుని మోవిని చిత్రించిందట. కానీ, ‘దాని తేనె తియ్యదనాని చిత్రించలేకపోయా’నంటుంది. క్షేత్రయ్య కలం/ గళంలోని సొగసుని ఆస్వాదించటమూ ఒక యోగ్యతే!

క్షేత్రయ్య పర్యావరణ కవిత

ప:
లలనామణిరో ఈ భావము తెలుపవే లలితముగానిపుడు

అ.ప.
వెలదిరో మా మువ్వ గోపాలుని దయచేత వేడుకగా దెలుపవే ఓ బాల!

చ:
అలివేణి నీ దేశమేమ౦టేను అపుడు చెట్టు చూపెను
చెలి నీ యూరి పేరేమని యడిగితే చెట్లు రె౦డు చూపెను
చిలుకల కొలికి నీ చెలుల పేరేమ౦టేను చెట్లు రె౦డు చూపెను
పలుమారు నీ జాతి పేరేమని యడిగితే వదరి చెట్టే చూపెనే ఓ బాల (లలనా)

చ.
నక్షత్ర నఖ నీకు హితమేమని అడిగితే పక్షి హితవని అనెను
లక్షణవతి నీదు చెక్కిట నేమ౦టె పక్షి యున్నదనెను
వక్షస్థలాన ఉన్నది యేమ౦టే పక్షి యున్నదనెను
సూక్ష్మముగ నీ పేరేమని యడిగితే పక్షి పేరే చెప్పెనే ఓ బాల.. (లలనా)

చ.
వారిజానన నీకు యెన్నే౦డ్లాయెన౦టే ఊరి పేనే చూపెను
చేరి నీ తోడబుట్టువు లెవర౦టే ఊరి పేనే చెప్పెను
తీరుగా మెరసెడు మేలు౦గర మేమ౦టే ఊరి పేరే చూపెను
ఓ రమణి నీ మోము౦దున్నది యేమ౦టే ఊరిపేరే చెప్పెనే ఓ బాల.. (లలనా)

ఇది మహాకవి క్షేత్రయ్య పదాలలో దొరికిన ఒక అపురూప పర్యావరణ కవిత. ఆయన శృంగారం మాత్రమే రాశాడన్నవారికి సమాధానం ఈ పర్యావరణ కవిత. ఈ పాటంతా పొడుపు కథ పద్ధతిలో సంకేత్మకంగా సాగుతుంది.

ఇందులో నాయిక తనను తాను ప్రకృతి కాంతగా మార్చుకుంది! తన దేశం చెట్టు, తన ఊరు చెట్టు, తన ఊపిరి చెట్టు, తన మనుషులు చెట్టు, అసలు తన జాతే చెట్టు అని గర్వంగా చెప్పుకుంటోంది. తన ఇష్ట౦, తన కష్ట౦, తన మనసు అన్నీ ఆ పక్షిలాంటి వంటోంది. తన ఊరు తనలా యవ్వనంతో కళకళ లాడుతుందనీ, ఈ సృష్టి ఎంత పురాతనమో తానూ అంతే పురాతనం అని చెప్పటానికి “వారిజానన నీకు యెన్నే౦డ్లాయె న౦టే ఊరి పేనే చూపెను” అంటాడు క్షేత్రయ్య! తన ఊళ్ళో అంతా అక్కచెల్లెళ్ళలా కలిసి మెలిసి ఉంటారని, తన ఊరు తన మోమంత అందమైందనీ, మెరిసే మేలుంగరం లాంటిదనీ చెప్పుకుంటోంది. చివరిగా “ఓ రమణి నీ మోము౦దున్నది యేమ౦టే ఊరిపేరే చెప్పెనే ఓ బాల” అంటాడు “నీముఖంలో ఏముందంటే నాముఖంలో మా ఊరుంది” అనటం కన్నా గొప్ప కవిత్వం ఏముంటుందీ..!

క్షేత్రయ్యని అర్థం చేసుకోవాలంటే ఇప్పటి కాలపు పడిగట్టు తూకపు రాళ్లతో తూస్తానంటే కుదరదు, తూచే త్రాసు మారాలి, తూకపు రాళ్లు మారాలి. చూసే చూపు కూడా మారాలి!

(ఇంకా ఉంది)

Exit mobile version