Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

క్షేత్రయ్య పదాలు – మనోవిశ్లేషణ-3

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘క్షేత్రయ్య పదాలు – మనోవిశ్లేషణ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మూడవ భాగం.]

“ఘోర పాపాలలో, సరదా ఏమాత్రం లేని పాపం – అసూయ” అంటాడు జోసెఫ్ ఎప్‌స్టేన్ అనే అమెరికన్ రచయిత. మానవ ప్రవృత్తుల ఆధారంగా రచనలు చేసి ప్రసిద్ధి పొందాడాయన!

అసూయని పాపతలంపుగానే భావిస్తారు పాశ్చాత్యులు. ఇటాలియన్ రచయిత డాంటే అలిఘిరి 14వ శతాబ్దపు కవి. క్షేత్రయ్య కన్నా 200 యేళ్ళ ముందువాడు. ఆయన ఇన్ఫెర్నో (నరకం) అనే కావ్యంలో అసూయని కవితాత్మకంగా చిత్రించటానికి భారమైన సీసపు కప్పెలు వేసుకొని, కళ్లపాపలను సీసపు తీగలతో కుట్టేసినట్లుగా చిత్రిస్తాడు. అసూయ అనేది అంధత్వం నుంచే పుడుతుంది, లేదా అంధత్వానికే దారి తీస్తుంది.. అని ఆ కవి హృదయం. ఇది పాశ్చాత్యుల తాత్త్విక దృష్టికోణంగా చెప్పుకోవచ్చు.

మానసిక శాస్త్రపరంగా అసూయని envy అంటారు. లాటిన్ invidia దీనికి మూలం. చూడలేకపోవడం అని దీని భావం!

కానీ, అసూయకి అచ్చమైన భారతీయ నిర్వచనం మనకు క్షేత్రయ్యగారి పదాలలోనే దొరుకుతుంది. క్షేత్రయ్యగారి నాయిక అసూయ అనే పాపపు పంకిలంలో పడి నరకాన్ని సృష్టించదు. అసూయ అనే నరకంలో తనూ జీవించదు. అసూయను ప్రేమ శక్తిగా సబ్‌లిమేట్ చేసుకుని తన ప్రభువుకు మరింత చేరువౌతుంది. క్షేత్రయ్య పదసాహిత్యం ప్రేమని పెంచే సాధనంగా అసూయని చిత్రిస్తుంది.

మనిషిలో ఉండే ‘లోపలి మనిషి’ యొక్క తాత్త్వికతకు అద్దం పట్టేది అసూయ అనీ, లోపలి మనిషి (అపరిచితుడు) ద్వారా నెగెటివ్ ఆలోఛనలు ప్రేరేపితం అవుతాయని, అసూయని వదులుకోవాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్తారు. “నీలో సైతాన్ తరిమేసై” అని ఆరుద్ర గారి సినిమా పాట ఉంది. అసంపూర్ణత, అసంతృప్తి ఇవి ఈర్ష్య అసూయల ప్రేరేపకాలు. సంతృప్తికి అవధి ఏముంటుంది? కాబట్టి అసూయక్కూడా అవధి ఉండదు. అసంతృప్తి, అసూయ రెండూ కలిసే పయనిస్తాయని మనకు ప్రబోధించాయి పాశ్చాత్య శాస్త్రాలు.

అసూయ అనే ఓర్వలేనితనం రెండు రకాలుగా ఉంటుంది.

  1. Envy (అసూయ): ఇతరుల దగ్గర ఉన్నదాన్ని మనకూ కావాలని కోరిక వలన పుట్టే బాధ. బెర్ట్రాండ్ రస్సెల్ అంటాడు: “ఒక భిక్షకుడికి కోటీశ్వరుల మీద అసూయ ఉండకపోవచ్చు! కానీ, తనకన్నా ఒకింత ఎక్కువ సంపాదించిన సాటి బిచ్చగాడంటే అసూయ పడతాడు” అని! ఎన్వీ అనేది బిచ్చగాడికి కలిగే అసూయ లాంటిది!
  2. Jealousy (ఈర్ష్య): మన దగ్గర ఉన్నదాన్ని ఎవరో పొందుతారనే భయం వల్ల పుట్టే బాధ. మహాభారతంలో దుర్యోధనుడు ఈర్ష్య వల్లే పాండవులను యుద్ధంలోకి లాగి తన ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. Dislike, passion, anger, wickedness ఇలాంటి లక్షణాలన్నీ ఈర్ష్యలో ఉంటాయి. గ్రీకు పురాణాలలో హేరా, అథేనా, అఫ్రొడైట్, ఈరిస్ ల మధ్య ఉన్న ఈర్ష్య కారణంగా ట్రోజన్ యుద్ధం జరుగుతుంది. బైబిల్‌లో, కేన్ ఈర్ష్యవల్ల అబేల్‌ను చంపాడు. చరిత్రలో ఈర్ష్యప్రేపిత సంఘటనలు కొల్లలు.

విశ్లేషకులు ఈర్ష్యని (జెలసీ), అసూయ (ఎన్వీ)ని కలిపేసి తికమక పడుతుంటారు. క్షేత్రయ్య గారి నాయిక ఈర్ష్య ప్రేరేపిత కాదు. ఆమె అసూయ ద్వారా ప్రేమ సాధన చేసిన ప్రియురాలు!

అసూయ, ద్వేషాలు అందరూ అనుకునేట్టు మెదడులోనో మనసులోనో కాదు, ఫ్రాయిడ్ చెప్పిన ఈగో అనే రజోగుణంలో పుడుతున్నాయి. అది సత్వగుణ ప్రేరేపితం అయినప్పుడు ప్రేమబంధం బలపడుతుంది. తమో గుణ ప్రేరేపితం అయినప్పుడు ఈర్ష్యతో రగిలిపోతుంది! ఎరుసు, ఒడ్డారం, కరకస, ద్వేషం, ప్రతిఘటన, మత్సరం ఇవన్నీ ఈర్ష్యకు సంబంధించిన పదాలు. ‘యత్ర అహంకారః, తత్ర ద్వేషః’- అహంకారం వలనే ద్వేషాలు కలుగుతున్నాయి. అహంకారం ప్రబలితే ఈర్ష్య పెరుగుతుంది. అహంకారం నశిస్తే ప్రేమ పెరుగుతుంది.

అసూయ ఆశతో పుడుతుంది; ఈర్ష్య స్వాధీనతతో పుడుతుంది. ఈ రెండింటికీ సున్నితమైన వ్యత్యాసం ఉంది.

మధురభక్తిలో భక్తుడు దేవుడి దగ్గరకు ‘మేను’తో చేరలేకపోవచ్చు. కానీ ‘నేను’ మాత్రం తప్పక చేరుతుంది! భగవంతుడి పట్ల ప్రేమ, ప్రేమించగల తన సమర్థత, భగవంతుడి పక్కనే తన స్థానం గురించి ఆలోచించే వ్యక్తికి ‘నేను’ పక్కనే అసూయ చేరటం సహజం.

“ఎందుకె రాధా.. ‘ఈసు నసూయ’లు – అందములందరి ఆనందములే” అని, “బృందావనమది అందరిదీ.. గోవిందుడు అందరి వాడే” పాటలో పింగళి నాగేంద్రరావుగారు ఈసు(ఈర్ష్య), అసూయలకు ఒక్కమాటలో తాత్త్వికమైన జవాబు చెప్తారు.. గోవిందుడు అందరి వాడేనని! పాశ్చాత్యుల ఆలోచనలలో ఈ తాత్త్వికత మచ్చుకు కూడా కనిపించదు! అందుకని వారి దృష్టిలో అసూయ పాపకార్యమే!

మన ‘సంపూర్ణత’ మన బయట ఎవరో ఒకరిపై, ఏదో ఒక విజయంపై ఆధారపడి ఉండి, మనం అనుభవంలోకి పొందేవరకు అసూయ మననుని వెంటాడుతుంది. తనకన్నా ఎక్కువ అవతలి వ్యక్తికి లభించిందని అనిపించినప్పుడు, తనకూ అలాంటిది కావాలనుకున్నప్పుడు, ఆ కోరిక తన మనసుని తీవ్రంగా భాధిస్తున్నప్పుడు అసూయ పుడుతుంది. పోటీ లేకపోతే విజయగాథలో మలుపులు ఏముంటాయి?

క్షేత్రయ్యగారు తన పదాలను సంగీత సాహిత్యాలు మిళితమైన అభినయం కోసం ఉద్ధేశించే వ్రాశాడని మనం చెప్పుకున్నాం! అభినయానికి అసూయని ఒక ప్రముఖమైన మనో ప్రవృత్తిగా తీసుకున్నారాయన. అసూయ, ప్రేమ, అమితమైన భక్తి, అసంతృప్తి, విరహం లాంటి భావాలు అభినయానికి ప్రాణప్రదాలు. కీ.శ. 2వ శతాబ్ది నాటి భరతముని కాలం నుంఛి మన నాట్యశాస్త్రం అభినయ కళను అష్టవిధ నాయికల చుట్టూ అల్లుకుని విస్తరించింది.

స్వాధీనపతిక (ప్రేమతో ప్రియుణ్ణి పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకున్న నాయిక), వాసకసజ్జిక (ప్రియుడు రానున్నాడనే ఆనందంతో అలంకరించుకుని నిరీక్షించే నాయిక), విరహోత్కంఠిత (విరహంతో కుంగి, ప్రియుడి రాక కోసం ఆత్రంగా ఎదురు చూసే నాయిక) విప్రలబ్ధ, (సంకేతస్థలానికి రాని ప్రియుడిచేత మోసపోయి, వ్యాకులతతో కోపించే నాయిక), ఖండిత (ప్రియుడు అన్యస్త్రీతో గడిపి రాగా ఆగ్రహంతో మండిపడే నాయిక), కలహాంతరిత (తాను చేసిన కలహంతో ప్రియుడిని దూరం చేసుకుని తర్వాత పశ్చాత్తాపపడే నాయిక), ప్రోషితభర్తృక (దూరప్రయాణంలో ఉన్న భర్తను కోరి దుఃఖముతో ఉండే నాయిక), అభిసారిక (అడ్డంకులను లెక్కచేయకుండా రహస్యంగా ప్రియుణ్ని కలవడానికి బయలుదేరే నాయిక) ఇలా ఈ ఎనిమిదిమంది నాయికల ప్రవృత్తుల్నీ ఒక్కో పదంలో చిత్రిస్తూ క్షేత్రయ్య పదరచన సాగింది. ఈ 8మంది నాయికల ఆలోచనల్లోనూ దుఃఖం, కోపం, విరహం త్రివేణిలా పెనవేసుకుని ప్రవహిస్తాయి. వాటిలో సరస్వతిలా అసూయ అంతర్వాహిని! ఈ మూడింటి సంగమ స్థలి లేదా కూడలి.. ‘ప్రేమ’! క్షేత్రయ్య పదాలు ప్రపంచానికిచ్చే సందేశం ‘ప్రేమ’ను బలపరచుకోవాలని!

ఈ ఎనిమిది మంది నాయికల మనోభావాలను తానే నాయికగా తనను తాను భావించుకోవటం ద్వారా ఒక తాదాత్మ్య స్థితిలో పారలౌకిక భావావేశంలో క్షేత్రయ్యగారు కూర్చిన పదాలివి! వాటిని అభినయం కోసం మాత్రమే ఆయన ఉద్ధేశించారు. అందుకు అసూయ అద్భుతంగా ప్రదర్శనకు ఉపయోగించే ఒక చక్కని అవకాశం!

“చాడిమాటలు వినేది, నను చౌకచేసి యల్ల సఖిని మెచ్చేది”.

“నీకు నే మడుపు లందించేది, నీవా నెలత కందిచ్చేది”

“నిన్ను నే కౌగిలించేది, నీవా నీరజాక్షిని తలచేది”

ఇలా వెదుకుతూ వెడితే వందలకొద్దీ క్షేత్రయ్య పదాలలో నాయికలోని ఓర్వలేని తనపు ఛాయలు కనిపిస్తాయి. “వలచియున్నదాని వలెను కలసియున్న దెవతోయి” అంటోందంటే పరోక్షంగా తన నాయకుడి నాయిక లందరూ తనలాగే వలచి ఉన్నవాళ్లేనని ఒప్పుకోవటమే కదా!

ఓర్వలేమితనం పరోక్షంగా మన అంతర్గత నిర్మాణాన్ని వెలిగించే దీపస్తంభం లాంటిది! మన ఆశలు, భయాలు, లోపాలు, అసంపూర్ణతల్ని అధిగమించి ఆత్మవిశ్వాసాన్ని, మనో ధైర్యాన్ని, మనోబలాన్ని మనకు కల్పించేందుకు ప్రకృతి మనిషికి ప్రసాదించిన ఒక వరం అసూయ! కావాలని ఎవరూ అసూయపడరు! అసూయ పడాలని ప్రయత్నించరు కూడా! అసూయ కలుగుతుంది అంతే! అదొక అసంకల్పిత ప్రతీకార చర్య!

తానింకా పొందాల్సింది ఉందనే అంతర్గత కోరిక, మరియు ఇతరులకు వచ్చింది తనకెందుకు రాలేదనే బాధ అసూయలో కనిపిస్తాయి. ఇది తన మనోస్థితితో మనిషి చేసే యుద్ధం. అందుకే తీవ్రంగా ఉంటుంది.

“ఎవరివల్ల దుడుకు మా యిద్దరిలో సఖియా
వివరింపుమమ్మా మా విధము ‘దెలెసే నిపుడు”

అనే పదాన్ని పరిశీలిస్తే, అసూయలో ఉండే రెండు శక్తులు ప్రధానంగా కనిపిస్తాయి. ఉన్నది కోల్పోతాననే ఆందోళన మొదటిది కాగా, పొందాలనుకున్న అత్యున్నత స్థితిని పొందాలనే బలమైన కోరిక రెండవది. ఒక వంక ఆందోళన, మరొక వంక కోరిక రెండింటిలోంచి అసూయ పుడుతోంది. ఈ ఆందోళనలూ ఈ భయాలూ ఈ కోరికలూ ఈ నమ్మకా లేవీ లేని నిర్లిప్తుడికి అసూయ ఎందుకుంటుంది..?

“ఏమో యని యుంటి, ఎరుగక యిన్నాళ్లూ” అంటుంది క్షేత్రయ్య నాయిక. ఆ మాటలో ఆమె సన్నధ్ధత ఎంత గంభీరంగా వెల్లడి అవుతుందో అంచనా వేయవచ్చు. తూకపురాళ్ళుంటే తూకం వేయొచ్చు కూడా!

ఈ నాయికని నాయకుడు ఎపుడు పెళ్ళాడాడో తెలీదు గానీ, ఒకసారి అత్తారింటికి పంపాడట నాయకుడు. ఇది సామాజికంగా కనిపిస్తుంది. సాధారణంగా మనుషులందరికీ ఉండే గుణమే నాయికా నాయకులిద్దరిలోనూ కనిపిస్తుంది. “పొత్తు మరువక యుండు.. పోయివచ్చెద సామీ! కత్తి కోతగాడు మగడేమి జేసునో..” అంటుంది! గిడుగు సీతాపతి గారు ఈ పదంలో – “కత్తికోతగాడనగా దయా విహీనుడు, నా మనస్సునకు ఇష్టము లేనివాడు. కఠినుడు, విరసుడు, నాకు సరిపడడు అనే అర్థం వచ్చేలా అభినయించాలి గానీ, కత్తితో కోస్తున్నట్టు అభినయించకూడదు” అని క్షేత్రయ్య పదాలను అభినయించేవారికి సూచించారు.

భర్త దేశాంతరగతుడైతే భార్య ప్రోషితభర్తృకగా మారుతుంది. కానీ, నాయికే దేశాంతరం వెడుతూ తను లేకపోతే నాయకుడు ఏమైపోతాడో అని మరోచరణంలో ఆందోళన చెందుతుందా పిచ్చితల్లి!

ఎంత ప్రేమ ఉంటే, అంత అసూయ ప్రతిధ్వనిస్తుంది. ఇది మానవ సహజం. తనది అనుకున్నదాన్ని కాపాడుకోవాలనే తపనని అసూయగా మనం నిర్వచిస్తే, క్షేత్రయ్య పదాలను ‘అసూయ పదాలు’గానే చెప్పుకోవాలి! అసూయ వ్యాధి కాదు, అది మన అసంపూర్ణతకు సంకేతం. మనసులోని అవసరాలను, గాయాలను, లోపాలను అసూయ మనసనే అద్దంలో చూపిస్తుంది. “అసంపూర్ణత యొక్క నీడ.” అంటుంది ఆధునిక మానస శాస్త్రం అసూయని!

“నీకు నే మడుపు లందించేది నీ వా – నెలత కందిచ్చేది”

“నన్ను నీ వాడు కొనేది అల్ల – ననబోణింటను నవ్వుకునేది”

“వలచియున్నదాని వలెను – కలసియున్న దెవతోయి”

“విరులు జుట్టిన సిగను – వెగటు వాస నేడదోయి”

“చాడిమాటలు వినేది నను – చౌకచేసి యల్ల సఖి ని మెచ్చేది”

“వద్దికి రావేమోయి,నాడిన ముఖ మేడ దోయి”

“నిద్దుర కనురెప్పలపై – నిండియున్న దేమోయి”

“అద్దపు చెక్కిలి నొక్కి. – ముద్దిడుకొన్న దెవతోయి”

“మరుగేల చేసేవు – మగువపేరు దెలుపవోయి”

ఇలా ఏరితే ప్రతీ పదంలోనూ అసూయ జాడలు కొల్లలుగా తారసిల్లుతాయి.

“అద్దపు చెక్కిలి నొక్కి. – ముద్దిడుకొన్న దెవతోయి”

“మరుగేల చేసేవు – మగువపేరు దెలుపవోయి”

ఇలా మరో నాయికని గురించి తెలుసుకుని పోల్చుకు చూడటమే అసూయ! అసూయ లేకుండా అభివృద్ధి లేదు. పోటీ పడాలంటే పోలిక ఉండాలి. ఇతరుల విజయాలు మన లోటు కాదు, మనం మరింత మెరుగైన ఫలితాలను సాధించాలనే హెచ్చరిక. అసూయను జ్ఞానంగా మార్చడం ద్వారా మన అంతరంగంలో శాంతి సాధించవచ్చు.

అలాగని, క్షేత్రయ్యగారి నాయిక మరీ బేలగా ఏమీ కనిపించదు! “వదరక పోపోవే వాడేల వచ్చేని-వద్దు రా వద్దన వే” అని గట్టిగా చెప్పగలదు కూడా! “ఒక్కసారికే యీలాగై తే-ఓ హో హో యిది యేటి రతిరా! మక్కువ దీర్చర మా మువ్వగోపాల” అనే పదంలో నాయిక పొందిన ఆత్మశాంతి వ్యక్తమౌతుంది.

మానవ గుణాలన్నింటిలోకెల్లా అత్యంత ప్రాచీన భావోద్వేగం అసూయ. అది మనిషి ఆత్మలోని అగోచర, జీవతాత్మక నీడలకి అనుసంధానమై ఉన్న మూలప్రవృత్తి (primitive instinct). మనది మనుగడ కోసం పోరాడే శరీరం అయితే, అసూయ ఆ పోరాటానికి మనసు ధరించే రక్షణాభరణం.

ఫ్రాయిడ్ దృష్టి కొంతవరకూ భారతీయతకు దగ్గరగా ఉంటుంది. ఫాయిడ్ వారసుల్ని నియో ఫ్రాయిడియన్లంటారు. భారతీయ ఆలోచనా విధానం పైన ఫ్రాయిడ్ కున్నంత అవగాహన నియో ఫ్రాయిడియన్లకు లేదు. అసూయ అనేది ఆత్మరక్షణలో భాగం, కాని మానసిక పరిపక్వత లేని స్థితిలో అది వ్యర్థమైన, విధ్వంసకరమైన శక్తిగా మారుతుందన్నాడు ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ శిష్యుడైన కార్ల్ యూంగ్ దీన్ని మన వ్యక్తిత్వంలోని నీడ భాగం (Shadow) నుండి పుట్టేదిగా భావించాడు. ‘మనసు దాచిపెట్టిన అసమర్థతలు, అసూయలు, భయాలు, అపరిపూర్ణతల సమాహారం’ అన్నాడు. రెండు సిద్ధాంతాలను సమన్వయపరచుకుంటే, మనకు లోపించిన సామర్థ్యాలను ప్రతిబింబించే అద్దం అసూయ అనీ, అవగాహనలోకి రాని అచేతన భాగం బయటపడి మనల్ని మేల్కొల్పే సంకేతం అనీ అర్థం అవుతుంది!

ప్రేమను రక్షించాలనే జీవశక్తి అసూయ! మనల్ని మెరుగు పరచుకునేందుకు అసూయలోంచి వెలువడిన మానసిక శక్తిని ఉపయోగించుకో గలిగితే చైతన్య వంతులౌతాం. నిరాశలో పడితే కృంగిపోతాం అని వివరిస్తుంది మనోవిశ్లేషణ శాస్త్రం! క్షేత్రయ్య గారి నాయిక అసూయలోని పరమార్థాన్ని గ్రహించి,స్వయంగా అభివృద్ధి సాధనంగా మార్చుకోవడం ద్వారా ఒక తాత్త్విక ప్రయాణం చేసిందని భావించాలి.

“తత్తరపడ లేక యున్న ప్రౌఢ తనమేమను కొందునే /కొత్తగాను మువ్వగోపాల ! నీ వన్న ఉత్తరంబు ఎటు లోర్చుకొందు నని” నాయిక తత్తరపడలేక ఉన్నదట క్షేత్రయ్యగారిచ్చిన ధృవీకరణ పత్రం అది!

“వేడుక ఊరికి వెడలి వచ్చెద నంటే
విడెమొసగి యిదివిహితమో | ప్రాణేశ!
నేడు నీ మది కోర్కె నెరవేరును నీకు
తోడున్న మనసున తొలుత చూపితి నని ॥తత్తర॥”

అనటంలో నాయిక చూపిన ఆత్మవిశ్వాసం ధ్వనిస్తుంది.

“మొన్నటి నేరము లెంచక నేను మువ్వగోపాల దేవుని
ఎన్నిక చేసి నా మదిలోనే ప్రొద్దుబాయక
చెన్నుగ రతుల గలసిమెలసి, చిత్తము రాను సేవచేసి
కన్నెరో! నే మించుకొన్న దెంచక
గ్రక్కున దానింటి కేగిన తడవ”

అనే ఈ చరణం “కావలెనమ్మ వాని కట్లు కంబుకంఠి” అనే పదం లోది! తన అసూయకి నాయకుడి పట్ల వల్లమాలిన ప్రేమ మాత్రమే కారణం అని చెప్పుకుంటోంది నాయిక. నేనింతగా ప్రేమిస్తున్న గ్రక్కున దానింటికే పోతాడనేది ఆమె మనసులో కలిగిన గుబులు.

“వదరక పోపోవే వాడేల వచ్చేని-వద్దు రా వద్దన వే
అది యొక యుగము వేరేజన్మ మిపుడు
అతడెవరో నే నెవరో ఓ చెలియరో”

“కలకంఠ పిక నాదములు మించు మధుమాసములు
గడపితీ వట్టి ముచ్చట లికనేలే”

అని ఆగ్రహం కూడా ప్రదర్శిస్తుంది, ‘ఖండిత నాయిక’లా!

షేడెన్‌ఫ్రూడ్ అని ఓ జెర్మన్ పదం ఉంది. విచిత్రమైన అసూయని తెలియచెప్పే పదం ఇది. మనింట్లో కరెంటు పోయినప్పుడు పక్కింట్లో కరెంటు ఉన్నదో లేదో అడుగుతాం. వాళ్లింట్లో ఉందిట! మనింట్లోనే పోయింది. అప్పుడు మనకు కలిగేది అసూయ. ఆ సమయంలో ఆ పక్కింటి వాళ్లకు కలిగేది షేడెన్‌ఫ్రూడ్. “schadenfreude= pleasure derived by someone from another person’s misfortune” ఒకడికి కలిగిన కష్టానికి ఇతరులకు అంతర్గతంగా కలిగే సంతోషం షేడెన్‌ఫ్రూడ్.

క్షేత్రయ్యగారి నాయిక ఏనాడూ తనను తాను ఇంకా ఏం మెరుగుపరచుకోవాలనే ఆలోచిస్తుంది! ఒకవేళ నాయకుడు తన ఇంట్లో ఉన్నప్పుడు తక్కిన చెలియలు ఏడుస్తారనో ఏడవాలనో కూడా కోరుకోదు! పైగా ఆంటుంది: “కులుకులాడీని మరుగూడి యుండగ నిపుడు పలుకుట మనకది పలుచదనము గాద?” అని! వాళ్ళిద్దరూ కలిసి ఉండగా పలకరించకూడదనే భావన వ్యక్తపరుస్తుంది. “ఏల వచ్చితి వే సామి నెడబాసి? ఏలాగు కాళ్లాడెనే? యో లలనరో” అని కూడా అంటుంది. తన నాయకుడికి తన వలనే కాదు వేరే నాయిక వలన కూడా అసౌకర్యం కలగకూడదనే ఔదార్యం ఆమెది. ఆమె ప్రేమ బంధం అంతటిది.

ఒకరోజు ఓ ఇంటి ముందు బిక్కపోయి నిల్చున్న నాయకుణ్ణి చూసిందిట నాయిక. ఆ యింట్లో ఉండే నాయిక ఈ నాయకుణ్ణి లోపలికి రావద్దు పోపొమ్మన్నట్టుంది. ఆ స్థితిలో ఉన్న నాయకుడు ఈ నాయిక కళ్ళలో పడి తలుపుచాటున నక్కాడట. “దాని బొంద దాని మోవి అంత రుచిగా ఉండదు” అన్నాడట ఎప్పుడో నాయకుడు. ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తోంది.

“అలుకదీర దాని వాకిట నిలచి వీథిలో నన్ను జూచి
తలుపుమూల దాగియున్నది- తానో నేనో
తలిరుబోణి మోవి రుచికి రాదన్నది- తానో నేనో
పనిబూని ‘మువ్యాగోపాలా!’ యని పిలిచేనా?”

అని పాడుకుంటూ వెళ్లిపోతుంది. నాయకుడి పరువు కాపాడాలి కదా!

భగవంతుడి సంయోగం తాను పొందింది. తన లాగే భవగంతుని ప్రేమించే వారెందరో.. భగవంతుడు ఆ అందరినీ సంబాళించుకోవాలి కదా.. అందుకని స్వామిని కట్టడి చేయదు. తనకన్నా ఇతరుల భక్తి ఎక్కువా తక్కువా అని పోల్చుకుంటుందంతే!

“రేపగలివియని లేక వా రిద్దరు నా పడకింటిలో కాపురమైయుండి
యా పడతికి సుంత కోపము గల నాదు
గోపాలుడు నన్ను గూడ వచ్చుచుంటే ||
ఎవతె తాళునమ్మా యీ నడత లేమందునే కొమ్మా||”

అనే పదంలో ఆ మరో నాయికకు తనపడకింటిలో తన నాయకుడి పక్కన చోటిచ్చిన గొప్ప హృదయం ఆమెది! తనింట్లో సుఖించే ఆమెకి ఒకింత కోపం వస్తే వెంటనే నాయకుడు తన దగ్గరకొచ్చాడట. స్వామి చేసే ఇలాంటి పనుల్ని ఎవతె తట్టుకోగలదమ్మా.. అంటుంది నాయిక!

అసూయకి జీవితం మీద ఆధిపత్యం కలిగించాల్సిన అవసరం లేదు. వ్యక్తిలోని భావోద్రేకాల మూలాన్ని తెలుసుకుని, అవగాహనతో స్పందించ గలిగినప్పుడు అసూయ కూడా వ్యక్తిత్వ వికాసానికి మార్గం చూపే గురువుగా మారుతుంది.

అసూయను శత్రువుగా కాక, మన అంతర్గత సత్యాన్ని వెల్లడించే సంకేతంగా చూడగలిగితే మనసు నెమ్మది అవుతుంది; జీవితం సులువవుతుంది.

అసూయను పూర్తిగా నిర్మూలించడం మోక్షదాయకం ఏమీ కాదు, ఎందుకంటే అది సహజ భావన. దానిని అర్థం చేసుకుని, స్వీయజాగ్రత్తతో ఎదుర్కొని, అది ఆనందానికి అడ్డుపడకుండా చూసుకోగలిగిన నాయిక ప్రేమ విజేత అవుతుంది.

ఒక ప్రేమ గర్వితగా నాయిక పలికే ఈ విజయ వాక్కులు చూడండి..

“నిను బాసి తాళలేను! నీ సొమ్ము జేసితి
నా మేను! తనివి దీర్చక పోనీను! దక్కితి నేను!
నను విడనాడే ననునగ మాను!
ననిచెను మోహము నా మదిలోను|
తడరగ నీవు నా దైవము గాను!
మనసున నెంచితి మక్కువతోను!”

“ఇతరుల వద్ద ఉన్న ప్రయోజనాలను కోరుకోవడం కంటే, తనలో వాటి లోపం ఉన్నదనే హీనభావన నుంచే అసూయ యొక్క నిజమైన బాధ పుడుతుంది. తన సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి తాను ప్రయత్నం ఎప్పుడు జరుగుతుందంటే, ఇతరులు తన గురించి అసూయ చెందకుండా ఉండాలని కృత్రిమంగా ప్రయత్నించటం వలన తన సంపూర్ణ సామర్థ్యాన్ని తెలుసుకోవడంలో తనను వెనక్కి నెడుతుంది. అసూయ మిత్రుల్ని దూరం చేస్తుంది. అత్యంత సన్నిహిత సంబంధాలను కూడా కఠినంగా మార్చి, నిరోధించి, బలహీనపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో, అది విధ్వంసక చర్యలకూ దారితీస్తుంది. తనకు దక్కదని తెలిసిన బొమ్మను పగలగొట్టే పిల్లాడిలా మారిపోతుంది. కాలక్రమంలో, ఈ వ్యథ, కలత, విద్వేషం చివరికి డిప్రెషన్, ఆతురత, నిద్రలేమి లాంటి మానసిక సమస్యలకు, అలాగే సంక్రమణలు, హృదయరోగాలు, క్యాన్సర్ వంటి శారీరక సమస్యలకు కూడా దారితీస్తాయి. ఉదాసీనత, వ్యంగ్యం, ధిక్కారం, అహంకారం, స్వీయాభిమానం వంటి ప్రతిరక్షణ పద్ధతులను సృష్టిస్తుంది. అసూయ మనల్ని నెమ్మదిగా తినేయటం మొదలెడుతుంది”ఇదీ మానసిక శాస్త్రం అసూయ గురించి చెప్పే శాస్త్ర పరమైన విశ్లేషణ.

నిజానికి క్షేత్రయ్యగారి నాయికలో ఇలాంటివేవీ కనిపించవు. ఎందుకు కనిపించవంటే ద్వేషం లోంచి కాకుండా ప్రేమ లోంచి ఆమె అసూయ పుట్టింది కాబట్టి. అసూయను ఆమె ప్రేమశక్తిగా సబ్‘లిమేట్ చేసుకోగలుగుతోంది కాబట్టి!

“నీ మేను నా మేననుచును బలికిన – నీ మాట నిజ మాయె రా
ఏమో యని యుంటి – ఎరుగక యిన్నాళ్లూ
నిన్న రాతిరి నీకు – నిదుర లేకున్న నా కన్ను లెర్రగా – గలిగెను గదరా
అన్య కాంతను నీవు – అనుభవించితి వేమొ. న న్నేలిన దొరా నా తమి దీరెరా

గోవిందుడు అందరివాడన్న సంగతి తెలీనంత అమాయకురాలు లేదా మూర్ఖురాలు కాదు క్షేత్రయ్యగారి నాయిక! ఆయన అందరివాడు కాబట్టే కదా తన వాడయ్యాడు. లేకపోతే ఏ రుక్మిణికో మాత్రమే పరిమితం అయ్యేవాడు కదా!

‘పనిబూని ‘మువ్యాగోపాలా!’ యని పిలిచేనా’
“ఇన్నాళ్ళవలె నేననుసరించేనా
యువిద నావలె నది యొక్కతేనా”

నైతికత యొక్క బయటి వలయాలు, వృత్తుల పై పొరలు, సామాజిక గుర్తింపులు ఇవి అన్నీ తొలగించిన తర్వాత, ప్రేమ ఎలా ఒక మౌలిక మానవ స్పందనగా నిలుస్తుందో చూపించే ఒక అద్భుత ప్రకాశం క్షేత్రయ్య పదకవిత! దాన్ని తర్కంతో కాదు, తాత్త్వికతతో చూడాలి!

Exit mobile version