Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

క్షేత్రయ్య పదాలు – మనోవిశ్లేషణ-4

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘క్షేత్రయ్య పదాలు – మనోవిశ్లేషణ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 4వ భాగం.]

‘ప్రేమ’ – మానవ భావజాలంలో అత్యంత శక్తివంతమైనది, అత్యంత సంక్లిష్టమైనది, అలాగే సర్వసామాన్యమైన అనుభూతుల్లో ఒకటి. సంస్కృతి, భాష, కాలం – ఈ మూడింటినీ దాటి ప్రవహించే శక్తి ప్రేమ! కళను, కవిత్వాన్ని, శాస్త్రాన్నికూడా ఆలోచింపజేసిన మహత్తర అనుభూతి అది.

లోతైన భావోద్వేగాలూ, సాంస్కృతిక విశాలత ఉన్నప్పటికీ, ప్రేమ అనేది కేవలం ఊహాత్మక కవితా ప్రతీక మాత్రమే కాదు, అది జీవశాస్త్ర పరంగా, మనోశాస్త్ర పరంగా అధ్యయనం చేయదగ్గ ప్రక్రియ. ప్రేమలో పడటం అనేది మన మెదడులో, నాడీవ్యవస్థలో, హార్మోన్లలో జరిగే ఒక సంక్లిష్ట పరివర్తనల పరంపర.

ప్రేమలో పడినప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా అనుభూతి చెందుతాం, ఎలా ప్రవర్తిస్తాం – ఈ అన్ని కోణాలనూ పరిశీలిస్తేనే ప్రేమ తత్త్వం, క్షేత్రయ్యగారి పదతత్త్వం కూడా అర్థం అవుతుంది.

ప్రేమ అనేది ఆకాంక్ష, అనుబంధం, ప్రతిఫల భావన ఈ మూడూ కలిసిన ఒక సంక్లిష్ట భావజాల వ్యవస్థ. అది మన పరిణామ చరిత్రలోనూ, మన మెదడు రసాయనిక నిర్మాణంలోనూ లోతుగా పాతుకుపోయిన అనుభవం.

ప్రేమ సైన్సు

ప్రేమ మన మనసును నిర్దేశిస్తుంది. మన మెదడు–హృదయం పరస్పరంగా స్పందిస్తాయి. మానవ జీవితంలో అత్యంత శక్తివంతమైన బంధం ప్రేమ! ప్రేమలో పడటం అంటే ఒక సంపూర్ణమైన అంతర్గత పరిణామాన్ని అనుభవించడమే. ఆవేశం, ప్రేరణ, అభద్రతాభావం, ఆకర్షణ, అలవాటు, మోజు, ఈ అన్నింటి మేళవింపే ప్రేమ. మన ప్రవర్తనను మరో కోణానికి మలుస్తుంది, మన జీవన దృక్పథానికే ఒక కొత్త ఆకృతి ఇస్తుంది.

“The Psychology of Love: What Happens When You Fall In” శీర్షికన ScienceNewsToday పత్రిక November 4, 2025 సంచికలో ప్రచురితమైన ఒక వ్యాసంలో క్షేత్రయ్యగారి ప్రేమ తత్త్వాన్ని అర్థం చేసుకోవటానికి కావలసినంత సమాచారం ఉంది.

ప్రేమ లేదా భక్తిలో నిజాయితీ ఉంటే, అది మానసిక వ్యవస్థ ప్రేరేపితంగా, మానసిక వ్యవస్థను ప్రేరేపించేదిగా కనిపిస్తుంది.

“అంత రంగమైన నీవే.. నన్నాదరించిన నీవే../చింతించి కూడ నా జీవస్వామివి నీవే” అని అనడం ద్వారా “సర్వమూ నీవే” అనే పరమాత్మ స్వరూపాన్ని ప్రేమభావంతో ఉపాసించే ఆత్మసమర్పణా మార్గాన్ని క్షేత్రయ్య ఆశ్రయించినట్టు కనిపిస్తుంది. ఇది కేవలం శృంగార కవిత్వం కాదు, భక్తి రూపం ధరించిన ఆత్మయానం. అదే క్షేత్రయ్య పదకవిత్వానికి అసలు తత్త్వసౌందర్యం.

ప్రేమ అనే భావన దానికదే భగవత్ప్రేరేపితమో విధి ప్రేరేపితమో ఎంతమాత్రమూ కాదు. ప్రేమ కలగాలంటే ఇద్దరు వ్యక్తులు, వారి మనసులు, వారి మెదళ్లు, ఆ మెదళ్లలోని హార్మోన్లు, న్యూరోకెమికల్స్ ఇన్ని జతగూడాలి. “ఇప్పుడు నన్ను ప్రేమించు” అని రావణాదేశం ఇస్తే ఎవరిలోనూ ప్రేమ కలగదు. ప్రేమే కాదు, కామం కూడా కలగదు. సంతృప్తి అంతకన్నా కలగదు! ప్రేమ దానికది కలిగేది కాదు. అది పరస్పర ప్రేరేపితం. భగవంతుడి పైన ప్రేమ కూడా భగవంతుడు, భక్తుడు ఇద్దరి ప్రేరేపితమే!

ప్రేమిస్తే మనసులో జరిగే ప్రక్రియలు

ప్రేమని ప్రభావితం చేసేందుకు సాంస్కృతిక పరమైన, భాషపరమైన, దేశకాలమాన పరిస్థితుల పరమైన అంశాలు అనేకం ఉన్నాయి. ఆ ప్రేమ భగవంతుని పైన కలిగినదైనప్పుడు ఆధ్యాత్మిక అంశాలు కూడా ప్రేరేపకాలుగా ఉంటాయి.

ప్రేమ అనేది కేవలం భావోద్వేగపరమైన విషయం కాదు, దీనివెనుక శాస్త్రపరమైన విషయాలున్నాయి. ఏదీ అశాస్త్రీయంగా జరగదు. జరిగిన దానిలోంచి శాస్త్రాన్ని వెదకటం విమర్శకుల బాధ్యత.

“ప్రేమలో పడటం” అనేది గణనీయమైన జీవశాస్త్ర-మానసిక ప్రక్రియ, ఇది మన ఆలోచనలు, భావాలు, ప్రవర్తనలు ఉత్తేజితం అవుతాయి! అంటే, ప్రేమ వలన మెదడులో కొన్ని మోటివేషన్ కేంద్రాలు క్రియాశీలమౌతాయి. వాటిలో డోపమైన్ అనే ఉత్ప్రేరకం ముఖ్యమైంది. డోపమైన్ ఆనందాన్ని, ఉత్సాహాన్ని, మోటివేషన్‌ను పెంచుతుంది. ప్రేమించిన వ్యక్తి దగ్గరగా ఉన్నప్పుడు డోపమైన్ కారణంగా మనలో ఆనందం, ఉత్సాహం, ఉత్తేజం పెరుగుతాయి.

ఆక్సిటోసిన్ మరియు వాసోప్రెసిన్ అనే ఉత్ప్రేరకాలు ప్రేమించిన వ్యక్తి స్పర్శ వలన విడుదల అవుతాయి. వీటివలన నమ్మకం, ఉద్వేగభరితమైన సాన్నిహిత్యం కలుగుతాయి. ఆక్సిటోసిన్ అనే ఉత్ప్రేరకం వలన అనుబంధం, సానుభూతి కలుగుతాయి. ‘నార్ ఎపినెఫ్రిన్’ అనే ఉత్ప్రేరకం వలన హృదయం ఉప్పొంగుతుంది. ఉత్కంఠ కలుగుతుంది. అందువలన దడగా ఉండటం గొంతు తడారిపోవటం, కాళ్ళుచేతులూ వణకటం, లాంటివి కలుగుతాయి. ఈ ఐదు ఉత్ప్రేరకాలూ కలిసి ప్రేమించిన వ్యక్తిపై మనసుని లగ్నం అయ్యేలా చేస్తాయి! ప్రేమ బలపడేకొద్దీ ఈ ఐదు ఉత్ప్రేరకాల విడుదల ఎక్కువగా జరుగుతుంది. ఇది మెదడుకి సంతోషం కలిగించే విషయం. మనసులో కలిగే ప్రేమ మెదడుకి ఆహారంలా ఉపయోగిస్తుంది. ప్రేమలో పడిన వ్యక్తులు సమయాన్ని మరచిపోయి, ఇతర ఆలోచనలు పక్కన పెట్టి ప్రేమలో జీవిస్తారు.

ఒక పిల్లవాడు చాక్లేట్ చూసినప్పుడు ఆకర్షితుడౌతాడు కదా! అప్పుడు ఆ పిల్లవాడి మెదడులో ఏ రసాయన చర్యలు జరుగుతాయో ప్రేమలో పడ్డ వ్యక్తుల మెదడులోనూ అలాంటివే జరుగుతాయి. కాలక్రమంలో, ఈ ఉత్సాహ భరిత ప్రేమ కలిసిజీవించే ప్రేమగా మారుతుంది. దీర్ఘకాల బంధం నిలబడటానికి మెదడులో ఈ రసాయనాల సమతుల్యత కారణంగా కనిపిస్తుంది.

ప్రేమ అనేది జీవశాస్త్రం మరియు జీవచైతన్యాల కలయిక కూడా! ప్రేమ మనకు సానుభూతి, త్యాగం, బలహీనత ఒప్పుదలను నేర్పిస్తుంది. ఇది మనసును మారుస్తుంది, వ్యక్తిని ఒక విశాల భావోద్వేగ సమగ్రతలో కలుపుతుంది. మనిషిలోని సృజనాత్మకతకు ఇంధనం లాంటిది ప్రేమ. మనుషుల్ని దగ్గరకు చేరుస్తుంది. కుటుంబాలను కట్టి ఉంచుతుంది. జీవితానికి పరమార్థాన్నిస్తుంది.

సంస్కృతి ప్రభావం

ప్రేమ సార్వత్రికమే! కానీ, దాని సాంస్కృతిక వ్యక్తీకరణలు భిన్నంగా ఉంటాయి. ప్రపంచంలో అనేక రకాలైన తత్త్వాలున్న సమాజాలున్నాయి. వ్యక్తిప్రాధాన్యత నిచ్చే సమాజాలు (Individualistic societies) ప్రేమను వ్యక్తిగత పరిపూర్ణతగా చూస్తాయి. సమూహ కేంద్రిత సమాజాలు (Collectivist societies): ప్రేమను ఒక సామాజిక బంధంగా భావిస్తాయి. వ్యక్తీకరణ మారినా, అంతర్గత భావోద్వేగం మాత్రం సార్వత్రికంగానే ఉంటుంది. ఒక మనిషి జనించి జీవించే సామాజిక విలువలు, కట్టుబాట్లు, సంస్కృతి పరమైన అంశాలు కూడా ప్రేమని ప్రభావితం చేసేవిగా ఉంటాయి. తగ్గట్టుగానే మెదడులో ఉత్పన్నమయ్యే ఉత్ప్రేరకాల పనితీరు కూడా ఉంటుంది.

ప్రేమబంధం పరిపక్వం చెందేకొద్దీ తొలి రోజు ఉన్నట్టే అన్నీ కొనసాగవు. ప్రేమ పాతబడే కొద్దీ బలపడేలా చేసే ఉత్ప్రేరకాల పని తీరు ఆ యా వ్యక్తుల సమాజ సాంస్కృతిక అంశాల ఆధారంగా ఉంటుంది.

ప్రేమ పాతబడేకొద్దీ హార్మోన్ల స్వభావం మారుతుందని మానస శాస్త్రం కూడా చెప్తోంది. ఇక్కడో పరిశోధనాంశాన్ని మనం గమనించాలి. ఏకపత్నీత్వం కలిగిన జంతువుల మీద చేసిన పరిశోధనల్లో- ఆలింగనం, స్పర్శ, శారీరక సమీపం సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ భావ అనుబంధాన్ని లోతుగా చేస్తాయని కనుగొన్నారు. ఆందోళనను తగ్గించి సాంత్వన, సానుభూతిని పెరుగుతాయి. ఇలాంటి హార్మోన్ స్థాయిలు ఎక్కువగా ఉన్న జంటలు మంచి సంభాషణ, ఎక్కువ సంతృప్తిని అనుభవిస్తాయని, చిరకాలం బంధాన్ని నిలుపుకుంటాయని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆరంభ దశలో ఆధిక్యంగా ఉండే డోపమైన్, నోర్‌పైన్‌ఫ్రిన్ స్థానాన్ని ఆక్సిటోసిన్ మరియు వాసోప్రెసిన్ ఆక్రమించినప్పుడే ఈ చిరకాల బంధం నిలిచి ఉంటుంది.

సంయోగానికి ప్రేమే పునాది

ఏకపత్నీవ్రతం కలిగిన మానవ జాతుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది! ఈ సాంస్కృతిక ప్రభావం లేనప్పుడు ఆక్సిటోసిన్ వగైరా స్థిరీకర ఉత్ప్రేరకాలు బలహీనంగాను డోపమైన్ లాంటి ప్రేరపక ఉత్ప్రేరకాలు అధికంగానూ పనిచేయటం వలన మనసు ఎప్పటికప్పుడు కొత్త ప్రేమకోసం, కొత్త స్పర్శ కోసం వెంపర్లాడుతుంది. బహుపత్నీత్వానికి గానీ, తరచూ విడాకులతో కొత్త బంధాలు ఏర్పరచుకునే సంస్కృతి కలిగిన జాతుల్లో గానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి.

వ్యక్తికేంద్రీకృత సమాజాల్లో ప్రేమను వ్యక్తిగత సార్థకత, స్వీయ వ్యక్తీకరణగా చూస్తారు. సామూహిక సంస్కృతుల్లో అది కుటుంబాలు, సమాజాలను కలిపే అనుబంధంగా భావిస్తారు. పాశ్చాత్య సంస్కృతికీ మన సంస్కృతికీ ప్రేమబంధం విషయంలో స్పష్టమైన తేడాని మానస శాస్త్రం కూడా అంగీకరించటాన్ని ఇక్కడ మనం గమనించాలి!

మహాభారతంలో వ్యాసుడు, ఋగ్వేద సంహితలో దీర్ఘతముడు లాంటి వారు ఎవరు కోరితే వారికి సత్సంతానాన్ని అనుగ్రహించిన కథల్లో సంగమించిన ఆ స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి ప్రేమబంధమూ లేదు. స్త్రీ పురుషుల సంగమం యొక్క పరమార్థం సత్సంతానమే అనే సిద్ధాంతం ప్రకారం ఏర్పడిన కథలవి! సంతానం కోసం మాత్రమే సెక్స్ అనేది నిజమైతే మానవ సంబంధాలనీ, వివాహ వ్యవస్థనీ బలసంపన్నం చేసే ఈ మానసిక రసాయన చర్యలన్నీ వృథా అవుతాయి. కుటుంబవ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది! అందుకని జంటకట్టేవాళ్ళు ప్రేమికులు కావాలనే సిద్ధాంతమే సరియైనది! అదే ‘అమలిన శృంగారం’ అంటే! ప్రేమబంధం లేని జంట భార్యాభర్తలైనా సరే వారిద్దరి మధ్యా జరిగేది మలిన శృంగారమే అవుతుంది. 1980లో నేను వ్రాసిన “అమలినశృంగారం” పుస్తకంలో ఈ విషయమై విపులంగా చర్చించాను.

సంతానం కోసమైనా, సంతోషం కోసం అయినా స్త్రీపురుష సమాగమాన్ని ప్రేమభావనతో చూసినప్పుడు సాధన లన్నిటిలోకీ ఉత్తమమైన సాధన ప్రేమసాధన అనేది స్పష్టమౌతుంది.

లైంగిక ఆకర్షణ వంశవృద్ధికి దారితీస్తే, శృంగార (రొమాంటిక్) ఆకర్షణ అనుబంధాన్ని, జంటగా నిలబడే తత్వాన్ని బలపరుస్తుంది. దీర్ఘకాలిక బంధం మాత్రం దీర్ఘకాల సంరక్షణ అవసరమైన సంతాన జీవనం కొనసాగేందుకు భరోసా ఇస్తుంది.

భక్తి అంటే ప్రేమే!

ప్రేమ అంటే పూర్ణాసక్తి. ఒక అంతఃస్ఫురణ. ప్రేమ అనేది కేవల భావోద్వేగం కాదు; అది గతి శీలమైన చైతన్య ప్రవాహం. పరమాత్మ స్వరూపం. ప్రేమ మనిషిలో పరిపూర్ణంగా మనసంతా నిండి ఉన్నప్పుడు అది పరమాత్మ మీద కేంద్రీకృతమైనప్పుడు దాన్ని భక్తి అంటారు. భక్తి అంటే ప్రేమే!

భక్తివలన కలిగే ఆనందాన్ని పరమానందం లేదా సచ్చిదానందం అంటారు మన తాత్త్వికులు. పరమానందం కలిగినప్పుడు కూడా మనిషి మస్తిష్కంలో పైన మనం చెప్పుకున్న డోపమైన్ లాంటి ఉత్ప్రేరకాల రసాయన చర్యలన్నీ సంభవిస్తాయి. భగవంతుడితో ఆ ప్రేమ బంధాన్ని సుస్థిరం చేసుకోవాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు అందుకు ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ లాంటి ఉత్ప్రేరకాలు సహకరిస్తాయి. ఆ పరమానంద స్థితిని పొందటానికి మనిషి చేసే సాధనే భక్తి. గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే ఒక పనై పోతుందనుకునే వాళ్లంతా భక్తులు కారు! అలాంటి పరమానంద రూపమైన భక్తిని సాధన ద్వారా సమకూర్చుకోగలగాలి. పరమాత్మతో సాన్నిహిత్యమో, ప్రేమించిన అమ్మాయితో సాన్నిహిత్యమో డోపమైన్ మాత్ర వేసుకున్నంత మాత్రాన కలగదు. ప్రేమ బంధం ఏర్పడినప్పుడు డోపమైన్ ఉత్తేజితం అవుతుందంతే! దానివలన ఆ బంధం బలపడ్తుంది!

గోకులంలోని గోపికలు పరమాత్మను జ్ఞానంతో గానీ, తపస్సుతో గానీ పొందలేదు. ప్రేమతోనే పొందారు. ప్రేమ అనేది అంతరంగం లోంచి ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఈ సృష్టిని రసమయం చేస్తుంది! అదే ప్రేమ కళ్లలోకి ప్రవహిస్తే – రూపం సౌందర్యమవుతుంది; చెవుల్లోకి ప్రవహిస్తే – శబ్దం మృదువవుతుంది; నాలుకలోకి ప్రవహిస్తే, రుచి ఆనందమవుతుందని!

అందుకే సామాజికంగా మనిషి ప్రేమించడం అలవర్చుకోవాలి. అది పరిశుద్ధమైనదిగా వ్యామోహం లేనిదిగా, నిష్కామంగా ఉండాలి. ప్రేమలో కోరిక ప్రవేశిస్తే, అది లావాదేవీలకు దారితీస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యాపారమవుతుంది. నిజమైన ప్రేమలో ‘నేను – నువ్వు’ ఉండదు. ‘నాది – నీది’ ఉండదు. స్వార్థానికి చోటుండదు. అది అమృతంలా మనలో ప్రవహిస్తుంది.

క్షేత్రయ్య పొందిన ప్రేమరసానుభూతి

ప్రేమ తత్త్వాన్ని, ప్రేమ రసాయనాన్ని ప్రేమ వలన మనసులోనూ మనిషి మస్తిష్కంలోనూ కలిగే రసాయన చర్యల్ని ఇలా అవగాహన చేసుకుంటే పరమాత్మతో పరమ భక్తుడైన క్షేత్రయ్య పొందిన అనుభూతుల్ని ఆయన పదాల్లోంచి ఆకళింపు చేసుకోవటం సులువౌతుంది!

క్షేత్రయ్య ప్రేమరస సముద్రంలో ఓలలాడిన వాడు. అందువల్లే ఆయన పదకవిత్వంలో ఆత్మాశ్రయ తత్త్వంతో కూడుకున్న మధురభక్తి విస్తృత రూపం దాల్చింది. ప్రేమరసాన్ని నవరసాలకూ అదనంగా 10వ రసంగా ప్రతిష్ఠించినవాడు క్షేత్రయ్య. భగవంతుని శక్తిని సౌందర్యవంతమైన రూపంగా భావించి, భగవంతుని పురుషుడిగా, తనను తాను స్త్రీగా సంభావించుకున్నాడు. అదొక తాదాత్మ్య భావన! పరమాత్ముడొక్కడే మహా పురుషుడు. తక్కిన ప్రకృతి యావత్తు స్త్రీయే ననే భావనతో, మువ్వగోపాలునిపై అపారమైన భక్త్యాధిక్యాన్ని ప్రదర్శించాడు. అందుకు తనను తాను స్త్రీగా భావించుకున్నాడు.

భగవంతునిపై మక్కువ పడి, తనకూ మువ్వగోపాలునికీ మధ్య జరిగిన నిగూఢమైన ప్రణయ భావాలను ఆత్మీయ ముద్రతో క్షేత్రయ్య వెలిబుచ్చాడు. పేయసియైన తాను-ప్రియుడైన భగవంతునిలో ఐక్యం కావటానికి పడిన ఆత్మతపన, అంరగత తృష్ణగా ఆయన పదాలలో వ్యక్తమవుతుంది.

“మహతః వరం అవ్యక్తం అవ్యక్తాత్‌ పురుషః పరః /వురుషాత్‌ న పరం కించిత్‌ సౌ కాష్ఠా సా పరాగతిః” అని కఠోపనిషత్తులో ఒక సూత్రం ఉంది. ‘అవ్యక్తం’ లోంచి మహత్తు వచ్చిందని సాంఖ్యశాస్త్రం చెప్తుంది. మహత్తు (అఖిల జగత్కారణ భూతతత్త్వం) కన్నా అవ్యక్తం శ్రేష్ఠమైనది. ఆ ‘అవ్యక్తం’ కన్నా “మహాపురుషుడు-పరమాత్ముడు) పరమ శ్రేష్ఠమైనవాడు..అని!

మహత్తు లోంచి ప్రకృతి సంభవించింది, ఈ ప్రకృతి పురుషుడితో సంగమించాలంటే పరమ శ్రేష్ఠత్వాన్ని పొందాలంటే ప్రేమ బంధం ఒక్కటే మార్గం. ఆ పరమ పురుషుణ్ణీ మువ్వగోపాలుడిగా భావించుకుని తనను ప్రకృతిగా మలచుకుని క్షేత్రయ్య పొందిన ప్రేమతాదాత్మతే ఆయన పద సాహిత్యంలో స్పష్టమౌతుంది! పరమాత్ముడే ఒక ఊహాజనితమైన ఆకృతి అయినప్పుడు ఆయనలో లీనం కావటం కూడా ఊహాత్మకమే! ఆ ఊహలోంచి పుట్టినదే భగవంతుని శృంగార రూపంతో తాను నాయికగా సంగమించటం!

“కూరిమితో మరుకేళిలో నన్నేలు మువ్వ

గోపాలు డెంతో సంతోసాన

నారీమణి నేలి నేడైన మీరిన మోహముతోనా”

అనే చరణంలో క్షేత్రయ్య పొందిన తాదాత్మ్య స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. భగవంతుడితో చదరంగం ఆడిన భక్తులున్నారు. పందెం వేసిన భక్తులూ ఉన్నారు. కానీ, మరుకేళినే జరిపిన భక్తుడు క్షేత్రయ్య!

కవిత్వంగా వ్యక్తమైనా, ఆచారాల్లో ప్రతిఫలించినా, మౌనంగా మిగిలినా.. ప్రేమ మానవత్వానికి మూలమైన పిలుపే.

క్షేత్రయ్య రసఙ్ఞుడు, సంస్కృత సాహిత్యం, అలంకార శాస్త్రం, సంగీతం, భరతనాట్యాది కళారీతులలో అభినివేశం కలిగిన మహాకవి. దేవుణ్ణి ఏ కళ్లతో చూడాలో తెలిసినవాడు. మనం మన కళ్ళతో చూస్తే ఆయన తత్త్వం అందేది కాదు!

“ఏనుని తెలుపుదు నేలాగు తాళుదు_

నేమి చేతునే? చెలియా |!

భామతో ! యూరికి బయలు దేరెడు వేళ

ప్రేమ మీర నాసామి పిలిచి చెప్పిన మాట..

అన్న మిందక అతివెత నొందకు

కన్నీరు నింపకు _ కలవరింపకు మని”

నాయకుడు తాను పనిమీద దేశాంతరం వెడుతూ, తన మీద దిగులుపడవద్దని, అన్నం తినకుండా పస్తులుండవద్దని, కలవరించవద్దని కోరాడట. భగవంతుణ్ణి నాయకుడిగా, తనను నాయికగా భావించుకున్నంత మాత్రానే ఈ స్థితి కలగదు. ఆయన పదాల వెనుక అంతకు మించిన సాహితీ సాంస్కృతిక ప్రతిభాపాటవాలున్నాయి. మనం వాటిని విశ్లేషించేందుకే పరిమితమైనప్పటికీ వాటి వెనుక శాస్త్రీయతను కూడా పరిశీలించటం వలన కవిహృదయం బోధపడ్తుంది!

“ఎన్నెన్నోవిధముల హితవులు తెలుపుచు

కన్నీరు నించుచు _ కాంతుడు చెప్పిన మాట” లాంటి చరణాలు తాను భగవంతుడి ఆశ్రితుణ్ణనే అంశాన్ని స్పష్టం చేస్తాయి.

ప్రేమ బలాన్ని, దాని లోతుని వ్యక్తీకరించటానికి ఆయన ప్రయోగించిన పదాలు చాలా విశిష్టంగా కనిపిస్తాయి.

అలముకొను: “నిచ్చనిచ్చట లాలించి నే నలుముకొనుటేగాని, గ్రుచ్చివాఁడు కౌగలించుకొను టెందు లేదుగా”

ఆరుదూరు (అల్లరి): “ఆరుదూరు చేసి నన్నలయించిన మంచిదే”

ఉప్పతించు(ఓర్వలేనితనము) : ఉప్పతించి వాఁడు సురసురనెనేమో

గుల్లకాడు (ఏమీలేనివాడు): “గుల్లకాడై మన యింటి గుఱుతు లడుగ వచ్చీనీ” భగవంతుడికి తాను భక్తుడు కావటం వలనే ప్రశస్తి వచ్చిందనే స్వాతిశయం “నేనొక్కడ లేకున్న” అనే అన్నమయ్య పదాన్ని గుర్తు చేస్తుంది.

ఎమ్మెకాడు: విలాసవంతుడు “పమ్మిన వేడుకతోను _ పడకిల్లు శృంగారించి/యమ్మెకాడు వచ్చునని యెదురుజూచితి”

గొంటుకాడు (కఠినుడు) “గొంటుకాఁడు మువ్వగోపాలరాయఁడు

చేపట్లు (కలహం): “చేపట్లు కావచ్చునా మీలో మీకు” (సిగపట్లు లాంటిది..భగవంతుడి ప్రేమను పొందటానికి భక్తులు పడే పోటీ)

ఎన్నిక (తలంపు): “ఎంచిన యెన్నిక లెల్ల నీడేరవాయే”

అంతరంగులు (ప్రాణసఖులు): “అంతరంగులున్నారా నన్నాదరించేరా”

ఇవి క్షేత్రయ్య పదలాలిత్యానికి మచ్చుతునకలు మాత్రమే! రచయిత తెలుగు కోసం గొంతెత్తి అరవనవసరం లేదు చక్కని తెలుగు భాషని ప్రయోగించగలిగితే భాషకు మహోపకారం చేసినట్టే! క్షేత్రయ్య పదలాలిత్యం అనేది ప్రత్యేక అధ్యయనాంశం!

ఒక్కసారికే యీలాగైతే-ఓ హోహో యిది యేటి రతిరా! అనే పదంలో ఒక్కసారికే అలసటపొందింది నాయకుడు కాదు నాయికే! నాయకుడు నీటుకాడే! రొమ్మదిరింది నాయికకే! కమ్మని వాతెర కందిందీ, కాళ్లు చేతులు తడబడిందీ, కన్నుల నిద్దుర కమ్మేసిందీ, ఒంటికి చెమటలు పట్టేసిందీ నాయికకే! చివరికి అంటుంది ఇనపురి ముద్దుల మువ్వగోపాల! ఏపుమీర ననుకలిసితి” వని!

“రేవు వత్తువుగాని పోర నేటికి తాళి రేపు వత్తువుగాని” పదం కూడా ఇలాంటిదే!

“అక్కరో ! యోర్వనివారు సరసుడు గాడని.. ఆడుకొంటే ఆడుకొనేరు”

“ఇటువంటి నావలపు ముప్పొంగనీచ్చేవో? లేదో? మువ్వగోపాలా?”

“ఊరకే చలము చేసేవేరా? మ్రొక్కేరా!”

“ముద్దుపెట్టమనసయ్యీరా”

“రమణిరో! బంగారు మంచముపై నిద్దరము చాలా/మమతతో సరసంపు మాట లాడేవేళ”

“కమలాక్షి పేర నన్ను – ఘనుఢు పిల్వగ కోప/ శమనము లేక నాదు _ జడకొద్ది కొట్టితి నమ్మ”

“ఎందు దాచుకొందు నిన్ను – ఏమి సేతు నేను” అని పాడుతూ పైటలో దాచుకొందునా? రోమరాజి చేతకట్టుకొందునా రొమ్మున నిల్చి నా జడచేతకట్టుకుందునా? ముంగురులవేత బిగింతునా..” అనే భావాలు వచ్చేలాగాముద్రలు పట్టాలని క్షేత్రయ్య పదాలను అభినయించే నర్తకులకు సూచించారు గిడుగు సీతాపతి గారు. కానీ, ఈ పదాన్ని ఒక పాటగా, చదువుకునేప్పుడు, లేదా ఎవరైనా పాడుతుంటే వినేప్పుడు ఈ దృశ్యాలు కళ్ళకు కట్టవు. దీక్షగా ఆలోచిస్తే భగవంతుణ్ణే అడుగుతోన్నాడు .. ఎందు దాచుకొందు నిన్ను – ఏమి సేతు నేను” అని భక్తుడు!

భక్తిని నిలుపుకునేందుకు స్థిరీకరణ ఉత్ప్రేరకాలైన ఆక్సిటోసిన్ లాంటివి ప్రేరేపణ అయ్యేందుకు ఇలాంటి ఆలోచనలు సహక రిస్తాయి. భగవంతుడి ప్రేమ విషయంలోనే కాదు, ప్రేమికులందరికీ వర్తించే విషయం ఇది! అసూయ ఇందుకు సహకరించే అంశాలలో ముఖ్యమైంది. అసూయ ప్రేమను బలసంపన్నం చేసే పోషకం లాంటిది!

 “చిత్త మొకరి మీదనెయుండు-చిరునవ్రు నవ్వుచునుండు

బత్తి గలిగినట్లే యుండు-భావనేు లాగునండు”

“తొలుత గూడిన కూటమె వాలు – వలపు లుంచని దారేటి మేలు”ఇలాంటి ఆలోచనలు మనలోనూ ప్రేమ బంధం పెంచేందుకే తోడ్పడతాయి. స్త్రీయైనా, పురుషుడైనా ప్రేమను బలంగా నిలుపుకోవాలనుకున్నవారు క్షేత్రయ్యని చదవాలి!

“మోము మోమున జేర్చి మోవీయ నైతినో?

ఆముకొని ముచ్చట లాడనైతినో

నోము ఫలమింతేనో మోహానాంగిరో!

“పామాడి జోగి వలె పోయె నా బ్రతుకు”

“భామరొ! నీమది – కేమని తెలుపుదు

కోమలాంగుడు నిన్నే – కోరియుండగను

వేమారు నీ వేమొ – వేడినా వని వాడు

నోము ఫలమని -_ నొచ్చుకొన్నా డట”

“అనుకూలుడైనట్టి మగవాడు కలిగితే అంతకన్నను సంభ్రమ మున్నదా?” “చేరి నాతో నేస్తము చేసిన.. పాపమా?” ఇలా ఆలోచిస్తుంది నాయిక, దీక్షగా చదివితే ఆ నాయిక స్థానంలోకి మనమూ చేరిపోగలం..అంతటి ప్రేమరసం గుప్పించిన పదాలివి!

క్షేత్రయ్య పదాలుగా భావించి పండితులు సంకలనం చేసిన 400కి పైగా పదాలలో ప్రతీ పదం మీద ఇంత విశ్లేషణ అవసరం అవుతుంది. చిగురులు వేసిన కలలు అనే నవలలో నేను క్షేత్రయ్య పదాలను అభినయించటం నేర్పేఒక నర్తకిని పాత్రగా తీసుకుని కొంత విశ్లేషణకు ప్రయత్నించాను. 2017లో సంగతి ఇది. చాలాకాలంగా క్షేత్రయ్యగారి గురించి నాలో మెదులుతున్న ఆలోచనలు ఇలా అక్షరీకరించటానికి ప్రధాన కారకులు నాట్యకళ సంపాదకులు రవిశర్మగారు. ఒకవిధంగా నన్ను వెంటాడి రాయించారాయన. వారికీ ఈ వ్యాసాలను ప్రచురించిన ‘సంచిక’ సంపాదకులు కస్తూరి మురళీకృష్ణగారికి, కొల్లూరి సోమ శంకర్ గారికీ ధన్యవాదాలు.

(సమాప్తం)

Exit mobile version