[అంతోన్ చెహోవ్ రాసిన రష్యన్ కథకి ఆంగ్లానువాదం ‘The Lady with the Dog’ ఆధారంగా తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ ఎలనాగ.]
1
సముద్ర తీరం దగ్గర ఒక మహిళ చిన్న కుక్కపిల్లతో కనిపించిందని ప్రజల నోట వినపడింది. రెండు వారాలుగా ఏ ఇబ్బందీ లేకుండా యాల్టా నగరంలో హాయిగా ఉంటున్న డిమిత్రి డిమిత్రిచ్ గురోవ్‌కు ఈ వార్త ఆసక్తిని కలిగించింది. అతడు వెర్నీ అనే రెస్టారెంట్ పెవిలియన్‌లో కూచుని, ఓ మోస్తరు ఎత్తున్న తెల్లని యువతి బీచిలో నడుస్తూ ఉండటం చూశాడు. ఆమె తల మీద అందమైన ఒక టోపీ ఉంది. వెనకాల ఒక తెల్లని పామరేనియన్ కుక్కపిల్ల నడుస్తోంది.
తర్వాత ఆమె అతనికి పబ్లిక్ గార్డెన్స్ లో ఒకసారి, చౌరస్తాలో చాలాసార్లు కనిపించింది. ప్రతిసారి ఆమె అదే టోపీ పెట్టుకుని, అదే కుక్కపిల్లతో ఒంటరిగా నడవటం గమనించాడతడు. ఆమె ఎవరో ఎవరికీ సరిగ్గా తెలియదు. అందరూ ఆమెను ‘కుక్కపిల్ల గల యువతి’ అని పిలిచారు.
‘భర్త గాని స్నేహితులు గాని లేకుండా ఆమె ఇక్కడ ఒంటరిగా ఉంటున్నదంటే ఆమెను పరిచయం చేసుకోవడంలో తప్పు లేదు,’ అనుకున్నాడు గురోవ్.
అతని వయసు నలబయ్యేళ్లు. కానీ అతనికి పన్నెండు సంవత్సరాల కూతురు, బడిలో చదువుకుంటున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతనికి తక్కువ వయసులో, కాలేజీలో రెండవ సంవత్సరంలో ఉన్నప్పుడు పెళ్ళైంది. ఇప్పడతని భార్య అతని వయసులో సగం వయసున్నదానిలా కనిపిస్తుంది. నల్లని కనుబొమలతో పొడవుగా నిటారుగా ఉన్న ఆమెలో గాంభీర్యం, ఆత్మగౌరవం, ఆమె చెప్పుకునే మేధావిత్వం కనిపిస్తాయి. చాలా పుస్తకాలు చదివిన ఆమె, పదాలను లిపిలో ఉన్నదానికి భిన్నంగా శబ్దపరమైన కచ్చితత్వంతో పలుకుతుంది. ఉదాహరణకు తన భర్త పేరు లిపి ప్రకారం Dmitri అయినా అతడిని డ్మిత్రి అని కాకుండా డిమిత్రి అని పిలుస్తుంది. అతడామెను తెలివితక్కువదానిగా, సంకుచితత్వం గలదానిగా, అందం లేనిదానిగా ఎంచడమే కాకుండా ఆమెకు భయపడతాడు. ఆ కారణం చేత అతడు ఇంటిపట్టున ఉండేందుకు ఇష్టపడడు. అంతే కాకుండా చాలా రోజుల క్రితమే ఆమెకు విశ్వాసఘాతకునిగా మారాడు. బహుశా అందువల్లనే అతడు స్త్రీల గురించి చెడుగా మాట్లాడుతాడు. వాళ్లను ‘తక్కువరకం జాతి’ కింద జమ కడతాడు.
తనకు కలిగిన చేదు అనుభవాలు తను ఆడవాళ్ల గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేలా చేశాయని అనిపిస్తుందతనికి. కానీ ఆ ‘తక్కువ రకం జాతి’ లేకుండా అతడు రెండు రోజులు కూడా బతకలేడు. పురుషుల సమక్షంలో అతనికి విసుగు కలుగుతుంది. కాబట్టి వాళ్లతో అతడు ఎక్కువగా మాట్లాడడు. కానీ స్త్రీల సాహచర్యంలో ఉన్నప్పుడు అతనికి సుఖంగా ఉంటుంది. వాళ్లతో ఎలా మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో అతనికి తెలుసు. అటువంటి సందర్భాలలో అతడు మౌనంగా ఉన్నా ఠీవిగా కనిపిస్తాడు. అప్పుడు అతని రూపంలో, వాలకంలో, మొత్తం స్వభావంలో ఏదో తెలియని ఆకర్షణ, సమ్మోహనత్వం చోటుచేసుకొని అది వాళ్లను తనకు అనుకూలంగా మార్చుతుందనీ, వారిలోని ఏదో శక్తి కూడా తనను వాళ్లవైపు లాగుతుందనీ అతనికి తెలుసు.
బలమైన పాత చేదుజ్ఞాపకాలు చాలా కాలం క్రితమే అతనికి ఒక విషయం నేర్పాయి: మంచి మనుషులు – ముఖ్యంగా మందకొడిగా, డోలాయమానంగా ఉండే మాస్కో వాసులు – మొదట అనుకూలంగా ఉన్నా తర్వాత తప్పనిసరిగా పదేపదే సమస్యకు, చిక్కులకు తావిచ్చి, ఆఖరుకు భరించలేని పరిస్థితిని తెచ్చిపెడతారు. కానీ ఆసక్తికరమైన స్త్రీని కలిసిన ప్రతిసారీ ఆ చేదుజ్ఞాపకాలు అతని స్మృతిలోంచి జారిపోయి, అతనికి జీవితం మీద ఆశను రేకెత్తిస్తాయి. అప్పుడతనికి ప్రతి విషయం సులువైనదిగా, వినోదం కలిగించేదిగా మారుతుంది.
ఒకనాటి సాయంత్రం వేళ అతడు పబ్లిక్ గార్డెన్స్ లోని రెస్టారెంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఆ టోపీ యువతి మెల్లగా వచ్చి తన పక్కటేబులుకు చెందిన కుర్చీలో కూర్చుంది. ఆమె నడక, మనోభావాలు, దుస్తులు, తలదువ్వుకున్న తీరు ఆమె ఒక వివాహిత యువతి అనీ, యాల్టా నగరానికి మొదటిసారి వచ్చి ఒంటరిగా ఉంటున్నదనీ, ఆ సమయంలో నిస్తేజంగా ఉన్నదనీ చెబుతున్నాయి. యాల్టా వంటి నగరాలలో అనైతికత గురించి చెప్పుకునే ఉదంతాలను చాలా వరకు అబద్ధాలుగా ఎంచుతూ వాటిని నిరసిస్తాతడు. అవకాశం దొరికితే పాపం చేయడానికి సంతోషంగా ఒడిగట్టేవాళ్లే ఎక్కువగా అటువంటి కథలను అల్లుతారని అతని అభిప్రాయం. కానీ తనకు మూడడుగుల దూరంలోని బల్ల దగ్గర ఆ స్త్రీ కూర్చోగానే ఆ కథలకు సంబంధించిన సులభ విజయాలను జ్ఞాపకం చేసుకున్నాడు. కొండప్రాంతాలకు ప్రయాణాలు, కవ్వించే తాత్కాలిక ప్రేమవ్యవహారాలు, పేరు తెలియని అపరిచిత స్త్రీతో శృంగారం.. ఇవన్నీ అకస్మాత్తుగా అతడిని ఆవహించాయి.
బుజ్జగిస్తున్నట్టుగా ఆ పామరేనియన్ కుక్కపిల్లను అతడు పలుకరించాడు. అది దగ్గరికి రాగానే సఖ్యతను నెలకొల్పేందుకు తన వేలును ఊపాడు. ఆ కుక్క గుర్రుమని శబ్దం చేసింది. గురోవ్ మళ్లీ తన వేలును కదుపుతూ సంజ్ఞ చేశాడు.
ఆమె అతడిని చూసి వెంటనే కళ్లు వాల్చింది.
“అది కరవదు,” అన్నది కొంచెం బిడియంగా.
“నేను దానికి ఒక ఎముకను ఇవ్వొచ్చా?” అని అడిగాడు గురోవ్. అవునన్నట్టుగా ఆమె తల ఊపగానే, “యాల్టాలో మీరు చాలా రోజులనుండి ఉంటున్నారా?” అని అడిగాడు వినమ్రంగా.
“ఐదు రోజులనుండి,” అన్నదామె.
“ఇక్కడ నేనిప్పటికే రెండు వారాలు గడిపాను.”
కొంచెం సేపు నిశ్శబ్దం అలముకుంది.
“ఇక్కడ సమయం త్వరగా గడుస్తుంది. అయినా నిస్తేజంగా ఉంటుంది,” అన్నదామె అతని వైపు చూస్తూ.
“ఇక్కడ నిస్తేజంగా ఉందనటం ఉబుసుపోక కోసం మాత్రమే. బెల్యోవ్ లేదా జిడ్రాలో నివసించే స్థానికులకు అక్కడ నిరుత్సాహకరంగా ఉండదు. కానీ ఇక్కడికి రాగానే ‘అబ్బా ఇక్కడ ఎంత డల్‌నెస్, మన్నూ మశానం.’ వాళ్లు గ్రెనేడా నుంచి వచ్చారని అనిపిస్తుంది మనకు.”
ఆమె నవ్వింది. వాళ్లిద్దరు అపరిచితులలాగా నిశ్శబ్దంగా భోజనం చేశారు. కానీ తర్వాత ఒకరి పక్కన ఒకరు నడిచారు. వాళ్ల మధ్య సరాగంతో కూడుకున్న ఒక తేలికపాటి ఉల్లాసకర సంభాషణ చోటు చేసుకుంది. సంతుష్టి నెలకొని, తామెవరమో ఏం మాట్లాడుతున్నామో అన్న సంగతిని మరిచిపోయారు. నడుస్తూ నడుస్తూ వాళ్లు సముద్రం మీద పరుచుకున్న వింతకాంతి గురించీ, నీళ్లు లేత ఊదారంగులో ఉండటం గురించీ, వాటిమీద చంద్రుడు ఏర్పరచిన బంగారు రంగు చార గురించీ మాట్లాడుకున్నారు. ఇంకా ఆనాటి వేడి పగలు అనంతరం ఎంత ఉక్కగా ఉండిందో అనేదాని గురించి కూడా ముచ్చటించుకున్నారు. గురోవ్ తాను మాస్కో నుండి వచ్చాననీ, తనకు ఆర్ట్స్‌లో డిగ్రీ ఉన్నప్పటికీ బ్యాంకులో పని చేస్తున్నాననీ చెప్పాడు. ఇంకా తను సంగీత నాటకాలలో గాయకునిగా శిక్షణ పొందినప్పటికీ ఆ వ్యాపకాన్ని వదులుకున్నట్టూ, తనకు మాస్కోలో రెండు సొంత ఇండ్లు ఉన్నట్టూ చెప్పాడామెకు. ఆమె తాను పీటర్స్‌బర్గ్‌లో పెరిగినా రెండేళ్ల కింద తన పెళ్లి తర్వాత నుండి స– పట్టణంలో నివసిస్తున్నదనీ, యాల్టాలో మరొక నెలరోజులు ఉండబోతున్నదనీ చెప్పింది. తన భర్త కూడా పనినుండి విశ్రాంతి కోసం వచ్చి బహుశా తనను తీసుకుపోతాడని చెప్పింది. అతని ఉద్యోగం పరిపాలనశాఖలోనా లేక ప్రాంతీయ కౌన్సిల్ లోనా అన్న సంగతి ఆమెకు కచ్చితంగా తెలియదన్నది. తన అజ్ఞానం తనకే తమాషాగా తోస్తుందని చెప్పింది. ఆమె పేరు ఆనా సెర్గెయెవ్నా అని చెప్పింది ఆమె.
మరుసటి రోజు ఆమె తనను తప్పక కలుస్తుందని ఆనాటి సాయంకాలం ఒకటికి రెండుసార్లు అనుకున్నాడు గురోవ్. మొన్నమొన్నటి వరకు ఆమె స్కూలు అమ్మాయిగా పాఠాలు చదవటం, ఇక తనకు కూడా ఆమెలాంటి ఒక కూతురు ఉండటం గుర్తుకు తెచ్చుకున్నాడు. కొత్తవాళ్లతో మాట్లాడేటప్పుడు ఆమెలో ద్యోతకమయ్యే బేలతనాన్నీ, బెరుకునూ, కోణాలు కలిగిన ఆ ముఖాన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను అనుసరించి ఒక వ్యక్తి కలుసుకోవడం, మాట్లాడటం జీవితంలో మొదటిసారి అయివుండాలి ఆమెకు. ఆ సంభాషణలో ఒక రహస్య ఉద్దేశం ఉన్న సంగతిని ఆమె ఊహించకుండా ఉండదనుకున్నాడు. సన్నని, సుకుమారమైన ఆమె మెడను, అందమైన బూడిదరంగు కళ్లను గుర్తు చేసుకున్నాడు.
‘మొత్తం మీద ఆమెలో ఒక విషాద కోణం ఉంది’ అనుకుని నిద్రలోకి జారుకున్నాడు.
2
వాళ్లు ఒకరికొకరు పరిచయమై వారంరోజులు అవుతోంది. ఆ రోజు సెలవుదినం. ఇళ్లలోపల ఉక్కగా ఉంది. వీధుల్లోనేమో చిన్నగా గాలిదుమారాలు సుళ్లు తిరుగుతుంటే ఆ గాలికి మనుషుల టోపీలు కింద పడిపోతున్నాయి. వాతావరణం దాహాన్ని పెంచేవిధంగా ఉండటంతో గురోవ్ పెవిలియన్ దగ్గరికి పోయి సెర్గెయెవ్నాను ఒత్తడి చేశాడు – చల్లని పానీయాలు తాగమని. ఏం చేయాలో తెలియడంలేదెవరికీ.
సాయంత్రం గాలివాటు కొంచెం తగ్గడంతో, ఓడ వస్తుంటే చూద్దామని వాళ్లు కరకట్ట దగ్గరికి వెళ్లారు. రేవు దగ్గర మనుషుల రద్దీ ఎక్కువగా ఉంది. వాళ్లందరూ తమకోసం పుష్పగుచ్ఛాలను తెచ్చేవారిని స్వాగతించడం కోసం అక్కడ గుమిగూడారు. చక్కని దుస్తులు తొడుక్కున్న ఆ మనుషుల తాలూకు రెండు విచిత్రాలు స్పష్టంగా కనిపించాయి: మొదటిది, వయసు మీరిన స్త్రీలు పడుచువాళ్లలాగా దుస్తులు వేసుకున్నారు. రెండవది, మిలిటరీ వాళ్లు పెద్దసంఖ్యలో ఉన్నారు.
సముద్రం కొంచెం అల్లకల్లోలంగా ఉండటం చేత ఓడ ఆలస్యంగా, సూర్యాస్తమయం తర్వాత వచ్చింది. అది మలుపు తిరుగుతూ కరకట్టను చేరుకునేసరికి చాలా సమయం పట్టింది. ఆనా సెర్గెయెవ్నా ఎవరో తెలిసినవాళ్ల కోసం వెతుకుతున్నదా అన్నట్టు మనుషులను తన కళ్లద్దాలలోంచి చూసింది. గురోవ్ వైపు తిరిగినప్పుడు ఆమె కళ్లు మెరిశాయి. సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ చాలా మాట్లాడింది ఆమె. కానీ క్షణం కింద తనేం అడిగిందో తనకే జ్ఞాపకం లేదు. తర్వాత ఆమె తన కళ్లద్దాలను బ్యాగులో వేసుకుంది.
ఉత్సాహంతో ఉప్పొంగిన ఆ గుంపులోంచి మనుషులు వెళ్లిపోతున్నారు. చీకటి ముదిరిపోవడంతో మనుషుల ముఖాలను గుర్తు పట్టలేని విధంగా ఉంది పరిస్థితి. గాలి పూర్తిగా ఉపశమించింది కానీ గురోవ్, సెర్గెయెవ్నాలు ఇద్దరూ ఇంకా అక్కడ నిలబడే ఉన్నారు – ఓడలో వచ్చే ఎవరికోసమో ఎదురు చూస్తున్నరా అన్నట్టు. ఆనా సెర్గెయెవ్నా పువ్వుల వాసన చూస్తూ మౌనంగా ఉంది. ఆమె గురోవ్‌ను చూడటం లేదు.
“ఈ సాయంకాలం వాతావరణం బాగుంది. ఎక్కడికి పోదాం మనం? ఎక్కడికైనా కారులో ప్రయాణిద్దామా?”
ఆమె ఏమీ మాట్లాడలేదు.
అతడు ఆమె ముఖాన్ని నిశితంగా చూసి, ఎకాయెకిన ఆమె చుట్టూ చేతులు వేసి, పెదాలను ముద్దు పెట్టుకున్నాడు. పువ్వుల సువాసనను అనుభవించాడు. వెంటనే చుట్టూ చూశాడు, ఎవరైనా తనను చూశారేమోననే గాబరాతో.
“మీ హోటల్ కు పోదాం పదండి,” అన్నాడు మృదువుగా. ఇద్దరూ వడివడిగా నడవడం ప్రాంభించారు.
ఆమె హోటలుగది దగ్గర్లోనే ఉంది. అంతకు ముందు ఆమె జపనీస్ దుకాణంలో కొన్న సెంటు తాలూకు పరిమళం ఆ గదిలో వ్యాపించి వుంది. గురోవ్ ఆమెను చూసి, ఈ ప్రపంచంలో ఎలాంటి విభిన్న వ్యక్తులను కలుస్తాం మనం, అనుకున్నాడు. నిర్లక్ష్యం, మంచి స్వభావం, ఉల్లాసం నిండిన స్త్రీల తాలూకు జ్ఞాపకాలు అతని మనసులో భద్రంగా ఉన్నాయి. తాను వాళ్లకు ఇచ్చిన ఆనందం తాత్కాలికమైనదైనా వాళ్లు అతని పట్ల కృతజ్ఞులుగా ఉన్నారు. తన భార్యలాగా ఎలాంటి నిజమైన అనుభూతి లేకుండా, అనవసరమైన మాటలతో, కృత్రిమంగా, ప్రేమా తమకం కాని వెర్రి ఉద్వేగంతో ప్రేమించిన స్త్రీల తాలూకు జ్ఞాపకాలు కూడా అతని మనసులో నిక్షిప్తమై ఉన్నాయి. ఇంకా ఇద్దరు ముగ్గురు అత్యంత అందమైన స్త్రీల ముఖాలలో పారవశ్యం కనిపించిందతనికి. జీవితం ఇవ్వగలిగినదానికంటే దాన్నుండి ఎక్కువగా లాక్కోవాలనే మూర్ఖమైన కోరిక వారిలో కనిపించిందతనికి. వాళ్లు తొలియవ్వనంలో ఉండిన చపలచిత్తులు, ఆలోచన లేనివాళ్లు, ఆధిపత్యం చలాయించేవాళ్లు, తెలివితక్కువ స్త్రీలు. వాళ్ల అందం అతనిలో అసహ్యాన్ని నింపింది. అప్పుడు వారి గుడ్డలమీది లేసులు అతనికి పాము కుబుసపు పొలుసులలాగా కనిపించాయి.
కానీ ఈమెలోని బిడియం, సంకోచం, అనుభవ రాహిత్యాన్ని సూచించే పడుచుదనం, కొంత ఇబ్బందికరమైన భావప్రసారం, ఎవరో అకస్మాత్తుగా తలుపు తట్టినప్పటి విస్మయం అతడిని సంభ్రమానికి గురి చేశాయి. ‘కుక్కపిల్ల గల యువతి’ అయిన ఆనా సెర్గెయెవ్నా వాలకం కొంత విచిత్రంగా అసమంజసంగా ఉన్నా, అది అతనిలో ఉల్లాసాన్ని నింపింది. ఆమె ముఖం కిందకు వాలి వాడిపోయింది. దానికి ఇరువైపులా పొడవాటి కేశాలు దిగులును సూచిస్తున్నట్టుగా వేలాడుతున్నాయి. పాతకాలపు సినిమాలోని పతిత లాగా ఆమె విషాదంగా ఆలోచనలో మునిగిపోయింది.
“ఇది తప్పు. ఇప్పుడు నిన్ను నువ్వే అసహ్యించుకుంటావు,” అన్నదామె.
బల్ల మీద ఒక తర్బూజ పండు ఉంది. గురోవ్ దానిలోంచి ఒక ముక్కను కోసుకుని నిదానంగా తినడం మొదలు పెట్టాడు. తర్వాత కనీసం అరగంట సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది.
ఆనా సెర్గెయెవ్నా తీరు హృదయాన్ని కదిలించే విధంగా ఉంది. తక్కువ జీవితాన్ని చూసిన సజ్జనురాలైన నిరాడంబర స్త్రీ తాలూకు స్వచ్ఛత ఆమెలో గోచరించింది. బల్లమీద ఒంటరిగా వెలుగుతున్న కొవ్వొత్తి ఆమె ముఖం మీద సన్నని వెలుగును ప్రసరించింది. అయినా ఆమె దిగులుగా ఉన్నట్టు స్పష్టంగా తెలిసింది.
“నిన్నెందుకు అసహ్యించుకుంటాను నేను? నువ్వేమంటున్నావో నీకే అర్థం కావడం లేదు.” అన్నాడు గురోవ్.
“దేవుడా నన్ను క్షమించు. ఇది దుర్భరంగా ఉంది,” అన్నదామె అశ్రువులు నిండిన కళ్లతో.
“ఎవరో నిన్ను క్షమించాలని అనుకుంటున్నట్టున్నావు నువ్వు.”
“క్షమించడమా? లేదు లేదు. నేనొక చెడ్డ, నీచమైన స్త్రీని. నన్ను నేనే అసహ్యించుకుంటున్నాను. సమర్థించుకునే ప్రయత్నం కూడా చేయను. నేను మోసగించింది నా భర్తను కాదు, నన్నే. ఇప్పుడు మాత్రమే కాదు, చాలా కాలం నుండి నన్ను నేనే మోసగించుకుంటున్నాను. నా భర్త నిజాయితీ గల మంచి వ్యక్తే కావచ్చు. కానీ అతడొక చప్రాసీ. అతడు చేసే పనేమిటో తెలియదు నాకు. కానీ అతడొక చప్రాసీ అని మాత్రం తెలుసు. నేనతణ్ని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఇరవయ్యేళ్ల వయసుండింది. నేను నరక యాతన అనుభవించాను. నేను మంచి జీవితానుభవాన్ని ఆశించాను. ఇంతకన్న భిన్నమైన జీవితం ఉండివుండాలి అనుకున్నాను. నాకు నేనే జీవించాలనుకున్నాను, జీవించాలనుకున్నాను, జీవించాలనుకున్నాను. కాబట్టి నేను ఒక విధంగా ప్రవర్తించాను. ఇది నీకు అర్థం కాదు. కానీ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. నాలో ఏదో జరిగింది. నియంత్రించుకోవడం నావల్ల కాలేదు. నాకు ఆరోగ్యం బాగా లేదని నా భర్తతో చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. వచ్చి, దిగ్భ్రాంతికి గురైనదానిలాగా, ఉన్మాదిలాగా తిరిగాను. ఇక్కడ ఇప్పుడు ఒక అసభ్యమైన, అసహ్యకరమైన స్త్రీగా మారాను. ఇప్పుడు నన్నెవరైనా ఏవగించుకోగలరు.”
ఆమె మాటలను వింటున్న గురోవ్‌లో అప్పటికే విసుగు పుట్టింది. ఆమె గొంతులోని అనూహ్యమైన, అసంగతమైన బేలతనం, పశ్చాత్తాపం అతణ్ని నిర్వేదానికి గురి చేశాయి. ఆమె కళ్లలో అశ్రువులు లేకపోయివుంటే ఆమె హాస్యానికి అలా అంటున్నదా లేక నటిస్తున్నదా అని భావించేవాడు.
“నీకేం కావాలో అర్థం కావడం లేదు నాకు.”
ఆమె తన ముఖాన్ని అతని ఛాతీ మీద పెట్టి గట్టిగా హత్తుకుంది.
“నన్ను నమ్ము. నిన్ను వేడుకుంటున్నాను. స్వచ్ఛమైన, నిజాయితీ గల జీవితాన్ని కోరుకుంటాను నేను. పాపం అన్నది నాకు ఎంతో అసహ్యకరమైనది. నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. మామూలు మనుషులు దుష్టపిశాచం నన్ను మోసగిచింది అంటారేమో. ఇప్పుడు నేను కూడా అదే అంటాను.”
“ష్, ష్.”
కదలక మెదలక స్థిరంగా ఉన్న ఆమె కన్నులను చూశాడతడు. ఆపైన ముద్దు పెట్టుకొని ఆమెతో మృదువుగా, ప్రేమగా మాట్లాడాడు. అలా మెల్లమెల్లగా విడతలలో ఆమెకు ఉపశమనం కలిగించాడు. ఆమె తిరిగి మునుపటి స్థితిని పొందింది. ఇద్దరూ నవ్వారు.
తర్వాత వాళ్లు బయటికి పోయినప్పుడు సముద్రతీరం దగ్గర ఎవ్వరూ లేరు. తమాల వృక్షాలు నిండిన ఆ నగరంలో మరుభూమి లాంటి వాతావరణం నెలకొన్నది. కానీ సముద్రం సవ్వడి చేస్తూ తీరాన్ని పదేపదే తాకింది. ఒకే ఒక్క చిన్న పడవ అలలమీద ఊగుతోంది. దానిమీద ఒక లాంతరు మిణుకు మిణుకుమంటూ వెలుగుతోంది.
వాళ్లు ఒక టాక్సీలో యాల్టా శివారులోని ఓరియాండా అనే ప్రదేశానికి వెళ్లారు.
“హాల్లో నీ ఇంటిపేరును ఇప్పుడే చూశాను. ఫొన్ డిడెరైటిస్ అని రాసివుంది. బోర్డుమీద. నీ భర్త జర్మనీ వాడా?”
“కాదు, అతని తాత జర్మనీ వాడనుకుంటాను. కానీ నా భర్త అచ్చమైన రష్యన్ పౌరుడు.”
ఓరియాండాలో వాళ్లు చర్చికి దగ్గర్లో ఉన్న బండ్ మీది బెంచి మీద కూర్చుని, కింద ఉన్న సముద్రాన్ని చూస్తూ మౌనంగా ఉన్నారు. ఉదయపు పొగమంచులో యాల్టా సరిగ్గా కనిపించడం లేదు. కొండశిఖరాల మీద తెల్లని మబ్బులు నిశ్చలంగా ఉన్నాయి. చెట్లమీది ఆకులు కదలడం లేదు. మిడతలు చిన్నగా శబ్దం చేస్తున్నాయి. సముద్రపు అలలు ఎగసిపడుతుంటే వాటి నిరవధిక శబ్దం నిద్ర తాలూకు శాశ్వత శాంతిని గుర్తు చేస్తోంది. కాబట్టి అక్కడ యాల్టా గానీ ఓరియాండా గానీ లేనప్పుడు కూడా ఆ చప్పుడు వచ్చివుండాలి. మనుషులెవరూ మిగలనప్పుడు సైతం అదే శబ్దం నిరంతరాయంగా అదే తీరున వచ్చివుండాలి. ఆ సూర్యోదయం వేళ మంత్రముగ్ధకరమైన పరిసరాల నడుమ, ఆ అందమైన స్త్రీ పక్కన కూర్చుని గురోవ్ ఇలా అనుకున్నాడు: ‘వాస్తవంలో ఈ ప్రపంచంలోని ప్రతిదీ అందంగా ఉంటుంది. మన ఆత్మగౌరవాన్ని, ఉన్నత ఆశయాలను మరచిపోయిన వేళలలో తప్ప ఎప్పుడూ ప్రతిదీ అందంగానే ఉంటుంది.’
ఒక వ్యక్తి – అతడు బహుశా ఆ ప్రదేశానికి కాపలాదారు కావచ్చు – వాళ్లదగ్గరికి వచ్చి పరిశీలించి వెళ్లిపోయాడు. ఈ సంఘటన కూడా మార్మికంగా, అందంగా ఉన్నట్టనిపించింది. తియడోషియా నుంచి వస్తున్న ఒక ఓడను చూశారు వాళ్లు. దాని వెలుగు ఉదయపు వెల్తురులో కలిసిపోయింది.
కొంత మౌనం తర్వాత, “గడ్డిపరకల మీద మంచు పడింది,” అన్నది ఆనా సెర్గెయెవ్నా.
“ఔను, మనం వెళ్లిపోవాల్సిన సమయమైంది.”
వాళ్లు నగరానికి తిరిగి వెళ్లారు.
ఆ తర్వాత వాళ్లు ప్రతిరోజు బీచి దగ్గర కలుసుకున్నారు. మధ్యాహ్నం, రాత్రి కలిసి భోంచేశారు. కలిసి నడుస్తూ సముద్రపు అందాన్ని ఆస్వాదించారు. తాను రాత్రి సరిగ్గా నిద్ర పోలేదనీ, తనకు ఉధృతమైన గుండెదడ వస్తున్నదనీ అన్నది ఆమె. అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడిగింది. అతడు తనను తగినంతగా గౌరవించడం లేదని అక్కసుతో రగిలిపోయింది. ఖాళీ స్థలంలో, గార్డెన్‌లో చుట్టూ ఎవరూ లేనప్పుడు అతడు చటుక్కున ఆమెను దగ్గరికి తీసుకొని ఆర్తితో చుంబించాడు. పట్టపగటి వెల్తురులో, ఎవరైనా చూస్తున్నారేమోననే భయంతో పెట్టుకుంటున్న ఆ ముద్దులు, వాతావరణపు వేడిమి, సముద్రపు వాసన, మంచి దుస్తులు తొడుక్కుని తమ ముందునుంచి వెళ్లే మనుషులు – ఇవన్నీ గురోవ్‌ను ఒక కొత్త పురుషునిగా మార్చాయి. ఆనా సెర్గెయెవ్నాతో, ఆమె చాలా అందంగా, సమ్మోహనకరంగా ఉన్నదని అన్నాడతడు. అతనిలో ఆపుకోలేని ఆర్తి, వివశత్వం చోటు చేసుకున్నాయి. ఆమెకు ఒక్క అడుగు దూరంలో కూడా ఉండలేకపోయాడు. ఆమేమో ఎప్పుడూ దీర్ఘాలోచనలో మునిగిపోతూ, అతడు తనకు తగినంత గౌరవం ఇవ్వడం లేదని, కనీసం తనను ప్రేమించడం లేదని, తనను ఒక మామూలు స్త్రీగా మాత్రమే చూస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ప్రతి సాయంత్రం పొద్దుపోయాక వాళ్లు ఓరియాండా, జలపాతం మొదలైన ప్రదేశాలకు పోయారు. ప్రతిసారి పరిసరాలు అద్భుతంగా, మనోహరంగా, గొప్పగా ఉండటం వలన ఆ పర్యటనలు విజయవంతం అయ్యాయి.
ఆమె భర్త రావాల్సివుండింది. అతనికోసం ఎదురు చూస్తున్న సమయంలో అతడినుంచి ఒక ఉత్తరం వచ్చింది. తనకు కంటి సమస్య వచ్చిపడిందనీ, కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఇంటికి తిరిగి రావాలని ఆ ఉత్తరంలో ఆమెను కోరాడతడు. ఆనా సెర్గెయెవ్నా వెళ్లిపోవడానికి హడావుడి చేసింది.
“నేను వెళ్లిపోతుండటం మంచి విషయం. ఇదంతా నా తలరాత,” అన్నదామె.
ఒక బగ్గీలో అతడూ ఆమే రోజంతా నగరంలో తిరిగి, స్టేషన్ చేరుకున్నారు. ఆమె రైలు కంపార్ట్‌మెంట్‌లో కూర్చుంది. రెండవ గంట మోగినప్పుడు, “నిన్ను మరోసారి చూడనీ. ఆc, అలా, అదీ” అన్నది.
ఆమె కన్నీళ్లు కార్చలేదు కానీ జబ్బుపడ్డదానిలా చాలా దిగులుగా కనిపించింది. ముఖం వణికింది.
“నిన్ను నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. నిన్ను తల్చుకుంటాను. దేవుడు నిన్ను ఆశీర్వదించనీ. నువ్వు సంతోషంగా ఉండాలి. నా గురించిన చెడ్డ జ్ఞాపకాలను పెట్టుకోవద్దు. మనం శాశ్వతంగా విడిపోతున్నాం. అలానే జరగాలి. ఎందుకంటే మనం అసలు కలుసుకోవాల్సిందే కాదు. సరే, దేవుడు నీతో ఉండనీ.”
రైలు త్వరగా కదిలింది. దాని వెలుగులు కనిపించలేదు. ఒక నిమిషం తర్వాత చప్పుడు వినపడటం కూడా ఆగిపోయింది. మధురమైన ఆ ఆవేశాన్ని, ఉన్మాదాన్ని తొందరగా ముంగించడం కోసం అన్నీ కలిసి కుట్ర చేశాయనిపించింది గురోవ్‌కు. అతడు ప్లాట్‌ఫామ్ మీద ఒంటరిగా మిగిలిపోయి చీకట్లోకి చూస్తూ మిడతల శబ్దాన్నీ, టెలిఫోన్ తీగల చప్పుడునూ విన్నాడు. తను అప్పుడే నిద్ర లేచినట్టనిపించిందతనికి. తన జీవితంలో మరొక సాహసకార్యం జరిగిందనీ, అది కూడా ముగిసి దాని తాలూకు జ్ఞాపకం తప్ప మరేమీ మిగలలేదనీ అనుకున్నాడతడు.
..అతడు చలించిపోయి దుఃఖాన్ని, కొంచెం పశ్చాత్తాపాన్ని అనుభవించాడు. తను ఇంకెప్పుడూ కలుసుకోబోని ఈ యువతి తనతో సంతోషంగా లేదని అనుకున్నాడు. అతడు ఆమెతో ప్రేమగా ఉన్నాడు కానీ అతని వాలకంలో, కంఠస్వరంలో, లాలనలో ఒకింత వ్యంగ్యం, ఆనందాన్ని పొందిన మనిషి యొక్క అనుగ్రహం ఉండినై. పైగా ఆతని వయసు ఆమె వయసుకు రెండు రెట్లు. అన్ని వేళలా ఆమె అతనిపట్ల కరుణను చూపింది. చాలా ఉన్నతంగా, అసాధారణంగా ప్రవర్తించింది. బహుశా అతడు ఆమెకు వాస్తవంలోకన్న భిన్నంగా కనిపించి ఉంటాడు. కాబట్టి ఆ విధంగా చూస్తే అతడు అనాలోచితంగా ఆమెను మోసగించాడు.
స్టేషన్లో శరదృతువుకు సంబంధించిన పరిమళం నిండింది. అది చల్లని సాయంత్రం.
‘నేను మళ్లీ బతుకుతెరువులో పడిపోయి అభివృద్ధిని సాధించాలి. ఇప్పటికే ఆలస్యమైంది,’ అనుకున్నాడు గురోవ్.
3
మాస్కోలో ఇంటిదగ్గర ఎప్పటి చలికాలం లాగానే ఉంది పరిస్థితి. పొద్దున్నే స్టవ్‌లు వెలిగించడమనే మామూలు పరిస్థితి కొనసాగింది. పిల్లలు బడికి వెళ్లేముందు ఉదయపు ఉపాహారం తింటుంటే ఇంకా చీకటిగానే ఉంటోంది. కొద్దిసేపటి కోసం దీపం వెలిగించడం జరుగుతోంది. మంచు కురవడం మొదలైంది. చలికాలపు మొదటి రోజున మంచు కురిసినప్పుడు భూమ్మీదా ఇళ్ల పైకప్పుల మీదా కురిసిన తెల్లని మంచును చూస్తుంటే, చల్లని శుభ్రమైన గాలిని పీలుస్తుంటే తొలియవ్వనం గుర్తుకు వస్తుంది. నిమ్మ, భోజపత్ర వృక్షాల మీద తెల్లని మంచు కురిసి చూడటానికి ముచ్చటగా ఉంది. అవి తమాల వృక్షాలకన్న, తాళవృక్షాలకన్న మన మనసుకు దగ్గరగా ఉంటాయి. అవి ఉండగా సముద్రం గురించి, పర్వాతాల గురించి ఆలోచించం.
మాస్కోలో పుట్టిన గురోవ్ మంచు కురిసే ఒక రోజు యాల్టానుండి తిరిగి వచ్చాడు. ఒక శనివారం నాడు సాయంత్రం ఉన్నికోటు, చేతితొడుగులు ధరించి పెట్రోవ్కా వీధిలో నడుస్తూ చర్చిగంటలను విన్నప్పుడు, యాల్టాలో గడిపిన రోజుల, చూసిన ప్రదేశాల ఆనందమంతా కోల్పోయాడు. మెల్లమెల్లగా అతడు మాస్కో జీవితంలో ఒదిగిపోయాడు. రోజూ మూడు వార్తాపత్రికలను ఆబగా చదివాడు. మాస్కో నుండి వెలువడే పత్రికలను చదవకూడదని తను నిర్ణయించుకున్నట్టు ప్రకటించాడు. రెస్టారెంట్లకు, క్లబ్బులకు, డిన్నర్ పార్టీలకు, వేడుకలకు పోవాలని ఆరాటపడ్డాడు. పేరొందిన న్యాయవాదులతో, కళాకారులతో గడపడం, డాక్టర్స్ క్లబ్‌లో ఒక ప్రొఫెసర్‌తో పేకాట ఆడటం అతనికి ఆనందాన్నిచ్చాయి. ఒక ప్లేటు చేపలకూరనూ, క్యాబేజీనీ తినగలిగేంత ఆకలి మామూలైపోయిందతనికి.
ఒక నెల తర్వాత ఆనా సెర్గెయెవ్నా రూపం తన మనసులో మసకగా ఉన్నట్టు, అది ఇతర స్త్రీల రూపాలలాగా అప్పుడప్పుడు కలలో కనపడుతున్నట్టు గ్రహించాడు. కానీ మరింత కాలం గడిచి అసలైన చలికాలం వచ్చాక ఆనా సెర్గెయెవ్నా జ్ఞాపకం బలపడి, ఆమెను అంతకు ముందరి రోజే చూసిన అనుభూతిని పొందాడు. సాయంత్రం పాఠాలు చదువుకునే తన పిల్లల మాటలు రీడింగ్ రూం లోంచి వినపడినప్పుడు, లేదా రెస్టారెంట్లో ఒక పాటను గానీ వాద్యసంగీతాన్ని గానీ విన్నప్పుడు, లేక చిమ్నీలోంచి చప్పుడు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ప్రతి సంఘటన అతని మదిలో మెదిలింది. కరకట్ట దగ్గర జరిగిన సంఘటనలు, ఉదయం వేళ కొండలమీద కమ్ముకున్న పొగమంచు, తియడోషియా నుండి ఓడ రావటం, ఆనాను తను పెట్టుకున్న ముద్దులు – అన్నీ అతడు తన గదిలో తిరుగుతూ ఆ సంఘటనలన్నింటినీ గుర్తు చేసుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు. తర్వాత అతని జ్ఞాపకాలు కలల్లోకి బదిలీ అయ్యాయి. జరగబోయేదాంట్లో గతం కలిసిపోయినట్టనిపించింది. ఆనా సెర్గెయెవ్నా అతని కలల్లోకి రాలేదు కానీ, జ్ఞాపకాలు ప్రతిచోటా అతడిని నీడలలాగా వెంటాడాయి. కళ్లు మూసుకున్నప్పుడు ఆమె తన పక్కనే ఉన్నట్టనిపించింది. ఆమె అప్పటికంటె ఎక్కువ ఆకర్షణీయంగా, లేతగా, మరింత పడుచుదనంతో కనపడింది. తను కూడా యాల్టాలో ఉన్నప్పటికంటె సన్నగా అయినట్టు ఊహించుకున్నాడు. సాయంత్రపు వేళల్లో ఆమె పుస్తకాల అరల్లోంచి, ఫైర్ ప్లేస్ లోంచి, గదిమూలల్లోంచి తొంగిచూసిన అనుభూతిని పొందాడు. ఆమె శ్వాసను, దుస్తుల గరగరలను విన్నాడు. రోడ్డుమీద నడుస్తున్నప్పుడు ఆమె పోలికలున్న స్త్రీలకోసం వెతికాడు.
తన జ్ఞాపకాలను ఎవరికైనా చెప్పుకోవాలనే తీవ్రమైన కోరిక అతణ్ని వేధించింది. కానీ సొంతయింట్లో ప్రేమ గురించి మాట్లాడటం సాధ్యం కాదు. బయట కూడా సొంత విషయాలను చెప్పుకోదగినవాళ్లెవరూ లేరతనికి. తన ఇంటి కిరాయిదారులతో గాని, బ్యాంకులోని సహోద్యోగులతో గాని చెప్పుకోలేడు. అయినా ఏమని చెప్పుకోగలడు? అప్పుడు తను ప్రేమలో పడ్డాడా? ఆనా సెర్గెయెవ్నాతో తనకు గల సంబంధాలలో ఏదైనా మనోజ్ఞమైనది, కవితాత్మకమైనది, ఉన్నతీకరించేది, లేదా కనీసం ఆసక్తికరమైనది ఉందా? ప్రేమ గురించి, స్త్రీల గురించి చూచాయగా మాట్లాడటం తప్ప వేరే ఏమీ లేదు. వాటిగురించి మాట్లాడితే అసలు విషయమేమిటో ఎవరికీ అర్థం కాదు. అతని భార్య మాత్రం తన నల్లని కనుబొమలను ముడివేస్తూ, “ఆడవాళ్లను సమ్మోహనపరిచే అందమైన పురుషుని పాత్ర నీకు నప్పదు డిమిత్రీ,” అంటుంది.
ఒక సాయంత్రం ఒక అధికారితో పాటు డాక్టర్స్ క్లబ్ లోంచి బయటికి వస్తున్నాడు. ఆ అధికారి డిమిత్రీకి పేకాట మిత్రుడు. అతనికి చెప్పుకోవాలనే కోరికను అణచుకోలేకపోయాడు గురోవ్.
“యాల్టాలో ఒక అందమైన స్త్రీతో నాకు కలిగిన పరిచయం గురించి తెలుసుకోవాలి నువ్వు,” అన్నాడు.
తన గుర్రపుబగ్గీలో కూర్చోబోతున్న ఆ అధికారి తలను తిప్పి, “కొద్దిసేపటి క్రితం మనం తిన్న చేపలకూరలో కారం ఎక్కువైంది,” అన్నాడు.
ఆ మాటలు గురోవ్‌కు కోపం తెప్పించాయి. అవి కల్మషమైనవిగా, తన పరువును తగ్గించేవిగా తోచాయి. ఎటువంటి ఘోరమైన అలవాట్లు గల మనుషులు వీళ్లు, అనుకున్నాడు.
ఆ రాత్రంతా గురోవ్ నిద్ర పోలేదు. చాలా కోపంగా ఉన్నాడు. మరుసటిరోజంతా తలనొప్పితో బాధ పడ్డాడు. తర్వాతి రోజు కూడా నిద్ర రాలేదు. పడకమీద కూర్చొని ఆలోచనలో మునిగిపోయాడు, లేదా గదిలో అటూయిటూ పచార్లు చేశాడు. తన పిల్లల మీద, బ్యాంకు మీద విసుగు కలిగింది. ఎక్కడికైనా పోవాలని గానీ, దేనిగురించైనా మాట్లాడాలని గానీ అనిపించలేదతనికి.
డిసెంబరు సెలవులలో అతడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఒక యువ మిత్రునికి సహాయం చేయడంలో భాగంగా పీటర్స్‌బర్గ్‌కు వెళ్తున్నానని భార్యకు చెప్పి, స– కు బయలుదేరాడు. సరిగ్గా దేనికోసం అన్నది అతనికే కచ్చితంగా తెలియదు. ఆనా సెర్గెయెవ్నాను కలిసి ఆమెతో మాట్లాడాలని అతని కోరిక.
అతడు స– చేరేసరికి ఉదయమైంది. ఒక హోటల్లోని మంచిగదిని తీసుకున్నాడు. దాని నేల బూడిదరంగు గల చక్కని మిలిటరీ గుడ్డతో కప్పబడి ఉంది. దుమ్ముతో కూడుకున్న ఒక బల్లమీద పెన్ స్టాండ్, గుర్రం మీద కూర్చున్న ఒక వ్యక్తి బొమ్మ ఉన్నాయి. ఆ బొమ్మ చేతులు, తల విరిగిపోయాయి. హోటల్లోని కూలీ ఒకడు ఆనా సెర్గెయెవ్నా భర్తకు సంబంధించిన సమాచారమిచ్చాడు. ఫొన్ డిడెరిట్స్ పాత గోంట్ చార్నీ వీధిలోని సొంత ఇంట్లో ఉంటున్నాడనీ, అతడు ధనవంతుడనీ, అతని ఇల్లు హోటల్‌కు దగ్గరే అనీ, సొంత గుర్రాలు తదితర హంగులతో ఘనంగా జీవిస్తున్నాడనీ చెప్పాడు. పట్టణంలోని ప్రతివ్యక్తికి అతడు తెలుసని కూడా చెప్పాడు. ఆ కూలీ ఆ పేరును డ్రిడిరిట్స్ అని పలికాడు.
గురోవ్ ఆలస్యం చేయకుండా ఆ వీధికి పోయి, ఆ యిల్లును దూరంనుంచి చూశాడు. ఆ యింటి ముందర మేకులు కొట్టిన ఒక చెక్కప్రహరీ ఉంది. దాన్నీ ఇంటి కిటికీలనూ చూసి, ‘ఇటువంటి ప్రహరీని చూసి ఎవడైనా పారిపోతాడు,’ అనుకున్నాడు.
మనసులో ఇలా అనుకున్నాడతడు: ఇవాళ సెలవురోజు కనుక ఆమె భర్త ఇంట్లోనే ఉండవచ్చు. లోపలికి పోయి ఆమెకు ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించడం యుక్తిరాహిత్యమే అవుతుంది. ఒకవేళ తను చీటీ రాసి లోపలికి పంపితే అది ఆమె భర్త చేతుల్లో పడి, ప్రణాళిక అంతా చెడిపోవచ్చు.
అదృష్టాన్ని నమ్ముకోవడం మంచిదే అని నిశ్చయించుకొని ప్రహరీ దాకా పోయి, అవకాశం కోసం వేచివున్నాడు. ఒక బిచ్చగాడు గేట్లోంచి లోపలికి పోవడం, లోపలినుంచి కుక్కలు పరుగెత్తి రావడం చూశాడు. ఒక గంట తర్వాత పియానో శబ్దం లీలగా, అస్పష్టంగా వినిపించింది. బహుశా ఆనా సెర్గెయెవ్నా పియానో వాయిస్తుండవచ్చు. ముందరి ద్వారం ఎకాయెకిన తెరుచుకుని ఒక ముసలావిడ, ఆమె వెనుక తనకు ముందే పరిచయమున్న తెల్లని పామరేనియన్ కుక్కపిల్ల రావడం గమనించాడు. గురోవ్ కుక్కపిల్లను పిలవాలనుకున్నాడు కానీ అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఉద్వేగంలో ఆ కుక్కపిల్ల పేరు మరిచిపోయాడు.
అతడు అటూయిటూ పచార్లు చేస్తూ ఆ ప్రహరీని మరింతగా అసహ్యించుకున్నాడు. ఆనా సెర్గెయెవ్నా తనను మరిచిపోయి వేరే ఎవరితోనో సమయం గడుపుతుండవచ్చుననీ, వయసులో ఉన్న స్త్రీ ఎవరైనా అలా చేయడం సహజమనీ, ఎందుకంటే ఉదయంనుంచి సాయంత్రం వరకు ఆ మాయదారి పాపిష్ఠి గోడను చూడటం తప్ప ఆమెకు వేరే పనేముంటుంది అనుకున్నాడు. అతడు హోటల్‌కు పోయి, ఏం చేయాలో తెలియక చాలాసేపు సోఫా మీద కూర్చున్నాడు. తర్వాత భోజనం చేసి చాలాసేపు కునుకు తీశాడు.
మేలుకున్నాక నల్లని కిటికీలను చూస్తూ, ‘ఇదెంత తెలివిలేనితనం, నన్నెంతగా వేధిస్తోంది,’ అనుకున్నాడు. అప్పటికే సాయంత్రమైంది. ‘ఎందుకో గాని ఇక్కడ నాకు బాగా నిద్ర పట్టింది. రాత్రి ఏం చేయాలి?’ అనుకున్నాడు.
ఆస్పత్రులలో కనిపించే చౌకరకపు బూడిదరంగు దుప్పటి కప్పివున్న పడకమీద కూర్చుని, చిరాకుతో తనను తాను ఇలా తిట్టుకున్నాడు: ‘‘కుక్కపిల్ల గల ఒక యువతి’ కోసం ఇంత సాహసం చేస్తున్నావు. పెద్ద కష్టం తెచ్చిపెట్టుకున్నావు.’
మరునాటి ఉదయం స్టేషన్‌లో పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ఒక పోస్టర్ అతడి దృష్టిని ఆకర్షించింది. ఒక జపనీస్ గాయన కళాకారిణి మొదటిసారిగా పాటకచేరీ ఇవ్వబోతోంది. అతడు ఆ కార్యక్రమానికి పోయాడు.
ఆనా సెర్గెయెవ్నా ఆ కచేరీకి రావచ్చుననుకున్నాడు.
ఆ ప్రదర్శనశాల జనంతో నిండిపోయింది. అన్ని స్థానీయ ప్రదర్శనశాలల లాగానే షాండెలియర్‌కు పైన పొగమంచు పేరుకుంది. గ్యాలరీ గోలగోలగా, అస్తిమితంగా ఉంది. మొదటి వరుసలో షోకులరాయుళ్లు చేతులు వెనుకకు కట్టుకొని నిలబడి ఉన్నారు. గవర్నర్ బాక్స్‌లో గవర్నర్ కూతురు మఫ్లర్ లాంటిది చుట్టుకొని మొదటి సీటులో కూచుంది. గవర్నరేమో తన చేతులు మాత్రమే కనిపించేలా పరదా వెనుక దాక్కుని కూర్చున్నాడు. వాద్యకారులు వాద్యపరికరాలను శ్రుతి చేసుకునేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. స్టేజిమీద తెర కొంచెం కదిలింది. శ్రోతలు వస్తూ సీట్లలో కూర్చుటున్నారు. గురోవ్ ప్రతిఒక్కరినీ ఆత్రుతగా చూశాడు.
ఆనా సెర్గెయెవ్నా కూడా వచ్చింది. ఆమె మూడవ వరుసలో కూర్చుంది. ప్రపంచంలో తనకు అత్యంత విలువైన, ప్రాణప్రదమైన ఆమె చవకైన కళ్లద్దాలను చేతిలో పట్టుకుని అలా స్థానిక అలగాజనంలో కూర్చోవడం అతని హృదయం కుచించుకుపోయేలా చేసింది. తక్కువరకం వాద్యకళాకారులు దరిద్రమైన వైలిన్ల మీద వాయిస్తుంటే అక్కడ ఆనా ఎంత అందంగా ఉంది అనుకున్నాడు, స్వప్నావస్థను అనుభవిస్తూ.
సైడ్ లాకులతో ఎత్తుగా, వంగినట్టుగా ఉన్న ఒక యువకుడు ఆనాతో పాటు వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. అతడు తరచుగా తలను ముందుకు వంచుతున్నాడు. అతడే ఆమె భర్త అయివుండాలి. యాల్టాలో ఆమె తన మనసు కోపంతో నిండిపోయినప్పుడు అతడినే చప్రాసీగా పేర్కొంది. నిజంగానే అతని ఎత్తైన శరీరం, సైడ్ లాకులు, తలమీది చిన్నభాగం మీద బట్టతల – ఇవన్నీ చప్రాసీలు చూపే వినయాన్ని సూచిస్తున్నాయి. అతని నవ్వు అదోలా ఉంది. గుండీ ఉండే కాజాలో ఒక బ్యాడ్జి ఉంది. దానిమీద ఒక నంబరులాంటి అక్షరాలు రాసి ఉన్నాయి.
సిగరెట్ తాగడం కోసం మొదటి విరామ సమయంలో ఆమె భర్త బయటికి పోయాడు. ఆమె తన సీటులోనే ఉంది. గురోవ్ ఆమె దగగ్గరికి పోయి, వణుకుతున్న కంఠంతో, బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో “నమస్తే” అన్నాడు.
అతడిని చూడగానే ఆమె ముఖం పాలిపోయింది. తర్వాత భయంగా, నమ్మలేనట్టుగా చూసిందతడిని. చేతిలోని కళ్లద్దాలను అదిమి పట్టింది. స్పృహ తప్పిపోకుండా ఆమె ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. ఇద్దరూ కొంచెం సేపు మౌనంగా ఉన్నారు. ఆమె కూర్చునే ఉంది. ఆమె పరిస్థితిని గమనించి అతడు పక్కనే నిలబడ్డాడు. పక్కసీట్లో కూర్చునే ధైర్యం చేయలేదు. వాద్యకారులు తమ వైలిన్లను, ఫ్లూట్లను మళ్లీ శ్రుతి చేసుకుంటున్నారు. ఒక్కసారిగా అతనికి భయం కలిగింది. శ్రోతలందరూ తమవైపే చూస్తున్నట్టు అనిపించింది. వెంటనే ఆమె ద్వారం దగ్గరికి పోయింది. అతడు ఆమెను అనుసరించాడు. ఇద్దరూ అచేతనంగా కారిడార్లలో నడుస్తూ మెట్లమీద నడిచారు. రకరకాల వృత్తులకు సంబంధించిన మనుషులు బ్యాడ్జిలతో వాళ్ల కళ్లముందు కదిలారు. ఉన్నికోట్లు తొడుక్కున్న స్త్రీలు కనిపించారు. గాలితరగలు వారిమీద ప్రసరిస్తూ పొగాకు వాసనను రేపాయి. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో గురోవ్ ఇలా అనుకున్నాడు: ‘దేవుడా, ఈ ఆర్కెస్ట్రా, ఈ జనం వీళ్లంతా ఎందుకొచ్చారిక్కడికి?’
తను యాల్టాలో ఆనాకు వీడ్కోలు పలుకుతుంటే ఆనాడు అంతా ముగిసిపోయిందనీ, భవిష్యత్తులో ఆమె ఇక కలవదనీ తను అనుకున్న సంగతిని జ్ఞాపకం చేసుకున్నాడతడు. కానీ పూర్తిగా ముగియాలంటే ఇంకా ఎంత కాలం పడుతుంది అనే ఊహ మెదిలింది అతనిలో.
చీకటిగా ఉన్న మెట్లదారి మీంచి పోతుంటే ‘ఆంఫిథియేటర్ కు దారి’ అనే బోర్డు కనపడింది.
“నన్నెంతగా భయపెట్టావు నువ్వు! ఆ భయానికి నేను సగం చచ్చిపోయాను. ఎందుకొచ్చావిక్కడికి? ఎందుకు?” అన్నది ఆనా, అణచుకుంటున్న శ్వాసతో. ఆమె ముఖం ఇంకా పాలిపోయే ఉంది.
“కానీ నన్నర్థం చేసుకో ఆనా. అర్థం చేసుకోవాలని నిన్ను ఆత్రుతగా కోరుకుంటున్నాను.”
ఆమె అతడిని భయంగా, వేడుకోలుగా, ప్రేమగా చూసింది. అతని రూపురేఖలను తన మదిలో స్పష్టంగా భద్రపరచుకోవాలని చాలా పరీక్షగా చూసింది.
అతడిని పట్టించుకోకుండా ఇలా అన్నది: “నేను చాలా దుఃఖంతో ఉన్నాను. ఎప్పుడూ నీ గురించే ఆలోచించాను, నిన్ను గురించిన ఆలోచనలలోనే బతికాను. నిన్ను మరిచిపోవాలని కూడా అనుకున్నాను. కానీ ఎందుకు, నువ్వెందుకిలా వచ్చావు?”
మెట్లదారిలో మధ్యన చదరంగా ఉండే స్థలంలో ఇద్దరు బడిపిల్లలు సిగరెట్ తాగుతూ పైనుంచి వీళ్లను చూస్తున్నారు. కానీ గురోవ్ ఆ సంగతిని లెక్కచేయలేదు. అతడు ఆనాను దగ్గరికి లాక్కుని ఆమె ముఖాన్నీ చెక్కిళ్లనూ చేతులనూ ముద్దు పెట్టుకున్నాడు.
“ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? అని భయంతో అరుస్తూ అతణ్ని తోసింది ఆమె. “మనం పిచ్చివాళ్లమయ్యాం. వెళ్లిపో. తక్షణమే వెళ్లిపో. నిన్ను అమితంగా వేడుకుంటున్నాను.”
కిందనుండి ఎవరో మెట్లమీదుగా వస్తున్నారు.
“నువ్వు వెళ్లిపోవాలి. వింటున్నావా డిమిత్రిచ్? నేను మాస్కోకు వచ్చి నిన్ను కలుస్తాను. నేనెప్పుడూ సంతోషంగా లేను. నా పరిస్థితి ఇప్పుడు ఘోరంగా ఉంది. నేనెప్పుడూ సంతోషంగా ఉండలేను. ఎప్పుడంటే ఎప్పుడూ. నన్నింకా బాధ పెట్టకు. మాస్కోకు వస్తానని వాగ్దానం చేస్తున్నాను. కానీ ఇప్పుడు మనం విడిపోదాం. నా మంచి, ప్రియమైన, విలువైన, ఇష్టసఖుడా. ఇప్పుడు మనం విడిపోవాలి.”
ఆమె అతని అరచేయిని నొక్కి వడివడిగా మెట్లు దిగడం మొదలు పెట్టింది. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసింది. ఆమె కన్నుల్లో నిజమైన దుఃఖాన్ని చూశాడు గురోవ్. అతడు కొంచెం సేపు అక్కడే నిలబడి ఆమె మాటల్ని విని, అంతా సద్దు మణిగాక తన కోటును తీసుకొని వెళ్లిపోయాడు.
4
ఆనా సెర్గెయెవ్నా మాస్కోకు రావడం మొదలు పెట్టింది. రెండుమూడు నెలలకొకసారి ఆమె స– ను వదిలిపెట్టి మాస్కోకు పోయింది. అక్కడి ఒక స్పెషలిస్టు డాక్టరుకు చూపించుకోవడం కోసం పోవాలని భర్తకు చెప్పింది. ఆమె భర్త ఆ మాటలను సగం నమ్మాడు, సగం నమ్మలేదు. మాస్కోలో ఆమె ప్రతిసారి స్లావియాన్స్కీ బజార్ హోటల్లో బస చేసింది. రాగానే వెంటనే గురోవ్ కు సమాచారం పంపుతుంది. గురోవ్ పోయి ఆమెను కలుస్తాడు. మాస్కోలో ఎవ్వరికీ ఈ విషయం తెలియదు.
ఒక చలికాలపు ఉదయం వేళ అలానే పోయాడు. ఆ హోటలు అతని కూతురు బడికి పోయే తోవలోనే ఉంది కనుక, ఆమెను బడిలో వదిలేందుకు తనతో తీసుకొని పోయాడు. మంచుతునకలు కురుస్తున్నాయి.
“వాతవరణపు ఉష్ణోగ్రత నీరు గడ్డకట్టేదానికి మూడు డిగ్రీలు పైననే ఉంది. అయినా మంచు కురుస్తోంది చూడు. పైపైన మాత్రమే మంచు కరుగుతోంది. గాలిలో చాలా పైన వేడిమి వేరేవిధంగా ఉంది,” అన్నాడు గురోవ్ తన కూతురుతో.
“నాన్నా, ఈ చలికాలంలో మంచుతుఫానులు ఎందుకు లేవు?” అని అడిగింది అతని కూతురు. అతడు దాని గురించి వివరించాడు.
నిజాన్ని దాచేందుకు అతడు ఒక ముసుగులో దాక్కున్నాడు. ఉదాహరణకు, బ్యాంకులో అతని పని, క్లబ్బులో అతని వాదనలు, ‘తక్కువరకం జాతి’ గురించిన మాటలు, భార్యతో ఫంక్షన్లకు పోవడం. అతని వ్యక్తిగత జీవితం గోప్యత మీద అధారితమై ఉంది. మనుషుల వ్యక్తిగత గోప్యతకు విలువ ఇవ్వాలన్నది అతని అభిప్రాయం.
కూతురును బడిలో దిగబెట్టిన తర్వాత అతడు స్లావిన్స్కీ బజారుకు పోయాడు. తన ఉన్నికోటును మెట్లదగ్గరి స్టాండుకు తగిలించి మెట్లమీదుగా పైకి పోయి, గది తలుపును మెల్లగా తట్టాడు. ఆనా సెర్గెయెవ్నా ప్రయాణం వలన బాగా అలసిపోయి ఉంది. గురోవ్ కు ఇష్టమైన బూడిదరంగు డ్రెస్ తొడుక్కొని అతనికోసం వేచిచూస్తోంది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. అతడిని చూసింది, కానీ నవ్వలేదు. అతడింకా పూర్తిగా లోపలికి రాకముందే పోయి అతని ఛాతీ మీద పడిపోయింది, కొన్ని సంవత్సాలనుండి ఒకరినొకరు కలవలేదా అన్నట్టు. వాళ్లు నిదానంగా చాలా సేపు ముద్దు పెట్టుకున్నారు.
“నీకక్కడ ఎలా ఉంది? ఏం వార్తలున్నాయి?”
“ఆగు, చెప్తాను. నేను మాట్లాడలేకపోతున్నాను.”
ఆమె మాట్లాడలేకపోతోంది. ఏడుస్తోంది. పక్కకు జరిగి ముఖాన్ని కర్చీఫ్‌తో తుడుచుకుంది.
ఆమె మనసారా ఏడ్వనీ. నేను కూర్చుండి వేచివుంటాను అనుకుని, కుర్చీలో కూర్చున్నాడు గురోవ్.
తర్వాత హోటలు కిచెన్‌కు ఫోన్ చేసి తనకోసం టీ తెప్పించుకున్నాడు. అతడు టీ తాగుతుంటే ఆమె కిటికీ దగ్గర నిలబడి వీపును అతనివైపు పెట్టింది. జీవితం ఎంత దుర్భరంగా మారిందో తల్చుకుంటూ ఎంతో భావోద్వేగంతో ఏడుస్తోందామె. తాము ప్రపంచం నుండి దాక్కుంటూ దొంగతనంగా కలుసుకుంటున్నామనీ, కాబట్టి తమ బతుకులు నాశనం అయ్యాయనీ అన్నది ఆమె.
“ఇక ఆపు,” అన్నాడు గురోవ్.
తమ ప్రేమవ్యవహారం తొందరగా ముగిసేట్టు లేదని అనిపించిందతనికి. ఆమెకు అతడు బాగా దగ్గరయ్యాడు. ఆమె అతణ్ని ఆరాధిస్తోంది. తమ ప్రేమ వ్యవహారం ఏదో ఒకరోజు ఆగిపోవాలని చెప్పడం అతడు ఊహించలేకపోతున్నాడు. పైగా అలా చెప్తే ఆమె నమ్మేట్టు లేదు.
దగ్గరికి పోయి చేతులతో ఆమెను పట్టుకున్నాడు గురోవ్. ప్రేమగా, ఉల్లాసకరంగా ఏదైనా చెప్పాలనుకున్నాడు. అప్పుడు తనను తాను అద్దంలో చూసుకున్నాడు.
అతని తలవెంట్రుకలు నెరిసిపోవడం మొదలైంది. గత కొన్ని సంవత్సరాలలో తన వయసు బాగా పెరిగిందనుకున్నాడు. అది అతనికి విచిత్రంగా తోచింది. ఆమె భుజాలు వెచ్చగా ఉన్నాయి కానీ వణుకుతున్నాయి. ఆమె పట్ల అతనికి సహానుభూతి కలిగింది. ఈమె ఎందుకు నన్నింతగా ప్రేమిస్తోంది, అనుకున్నాడు. అతడు స్త్రీలకు ఎప్పుడూ భిన్నంగా కనపడతాడు. వాళ్లు కూడా నిజమైన అతడిని కాక వాళ్లు ఊహించుకున్న పురుషుడిని అతనిలో చూస్తారు. తర్వాత ఆ విషయాన్ని గమనించినా అతడిని అలానే ప్రేమిస్తారు. వారిలో ఒక్కరు సైతం అతనితో సంతృప్తిగా లేరు. కాలం గడిచిపోయింది. అతడు వాళ్లను పరిచయం చేసుకుని, వ్యవహారం నడిపి విడిపోయాడు. కానీ ఎవర్నీ పూర్తిగా నిజంగా ప్రేమించలేదు. అతనికి వాళ్లపట్ల ఉన్నది వేరే ఏదైనా కావచ్చునేమో కానీ నిజమైన ప్రేమ మాత్రం కాదు.
ఇప్పుడు అతని తలవెంట్రుకలు నెరిసిపోయిన తర్వాత, జీవితంలో మొదటిసారిగా నిజమైన ప్రేమలో పడ్డాడతడు.
ఆనా సెర్గెయెవ్నా, గురోవ్ ఇద్దరూ ఒకే రకానికి చెందిన మనుషులలాగా, భార్యాభర్తలలాగా, సౌజన్యం నిండిన స్నేహితులలాగా ప్రేమించుకున్నారు. విధి తమను అలా ప్రేమించుకునేలా చేసిందని భావించారు. తనకు భార్య ఎందుకు ఉన్నదని గురోవ్, తనకు ఎందుకు భర్త ఉన్నాడని ఆనా చింతించారు. తాము వేర్వేరు పంజరాల్లో బలవంతంగా బంధింపబడిన జంటపక్షులమని భావించారు. గతంలో వారు చేసిన సిగ్గుపడవలసిన విషయాల గురించి ఒకరినొకరు క్షమించుకున్నారు.ఈ ప్రేమ తమను మార్చిందని ఇద్దరూ భావించారు.
గతంలో తాను దిగులుగా ఉన్నప్పుడు గురోవ్ తన మనసుకు తట్టిన వాదాలు చేసుకొని ఉపశమనం పొందాడు. కానీ ఇప్పుడు ఏ వాదనా చేసుకోవాలనిపించలేదతనికి. అతని మనసులో అచ్చమైన సహానుభూతి చోటు చేసుకుంది. తను నిజాయితీగా, నెనరుతో బతకాలనుకున్నాడు.
“ఏడవకు నా ప్రియతమా. ఇప్పటికే నువ్వు చాలా ఏడ్చావు. ఇక చాలు. ఇక మనం మాట్లాడుకుందాం. ఏదైనా ఒక ప్రణాళికను ఆలోచిద్దాం.”
తర్వాత వాళ్లిద్దరు ఒకరి సలహాలను ఒకరికి చెప్పుకుంటూ చాలా సమయం గడిపారు. గోప్యతను, మోసాన్ని, రెండు వేర్వేరు ఊళ్లలో ఉంటూ చాలా రోజులదాకా ఒకరినొకరు చూసుకునే దురవస్థను ఎలా తప్పించుకోవాలి, అని చర్చించుకున్నారు. ఈ భరించలేని బంధాన్ని ఎలా తట్టుకోవాలి, ఎలా నిభాయించుకోవాలి, అని పరామర్శించుకున్నారు.
తన తలను పట్టుకొని “ఎలా? ఎలా? ఎలా?” అన్నాడు గురోవ్.
త్వరలోనే ఒక పరిష్కారం దొరుకుతుందని, తర్వాత కొత్త, అద్భుతమైన జీవితం మొదలవుతుందని అనిపించింది వాళ్లకు. చేయాల్సింది ఆచరించాల్సింది ఇంకా ఎంతో ఉందనీ, దాని అత్యంత క్లిష్టమైన భాగం అప్పుడప్పుడే మొదలవుతున్నదనీ అనుకున్నారు.
*
రష్యన్ మూలం: ఆంతోన్ చెహోవ్
ఆంగ్లం నుండి అనువాదం: ఎలనాగ
వృత్తిరీత్యా వైద్యులైన శ్రీ ఎలనాగ (డాక్టర్ నాగరాజు సురేంద్ర) ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త. కవిగా, భాషావేత్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా సుప్రసిద్ధులు.
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత. తెలుగులోనూ, ఆంగ్లంలోనూ రచనలు చేసే ఎలనాగ గారు సుమారు 40 గ్రంథాలు వెలువరించారు.
‘ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫ్లైస్’, ‘ఇంప్రెషన్-ఇమేజెస్’, ‘మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్’ మొదలైనవి ఆయన తెలుగు నుండి ఆంగ్లంలోకి తెచ్చిన కవితా సంపుటాలు.
వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు వంటి సుప్రసిద్ధ తెలుగు రచయితల కథలను, నవలలను ఆయన ఆంగ్లంలోకి తీసుకువచ్చారు. వివిధ దేశాల సాహిత్యాన్ని కూడా ఆయన తెలుగు పాఠకులకు అందించారు. వాటిలో ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు ఉన్నాయి.
వివిధ దేశాల కథల అనువాద గ్రంథం ‘కథాతోరణం’ వెలువరించారు. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథాన్ని ‘గాలిబ్ నాటి కాలం’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చారు.
