[శ్రీ రఘు శేషభట్టర్ గారు రచించిన ‘లిపి తడిసిన తరుణం’ అనే కవితా సంపుటిని విశ్లేషిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
రఘు శేషభట్టర్ గారు వృత్తిరీత్యా హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తూనే, ప్రవృత్తిగా సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు.
కవిగా రఘు గారిది ఓ విశిష్ట పంథా. బహుశా కవి కన్నా ముందు ఆయనొక తాత్త్వికుడేమో! అందుకే ఆయన రచనల్లో ఆర్ద్రత అధికంగా కనిపిస్తుంది. తనలోకి తాను చూసుకుంటూ రాసినట్టనిపించినా, చదువుతున్నప్పుడు అవి మన భావాలుగా, మన గురించి మనం అనుకునేవిగా అనిపిస్తాయి.
రఘు గారి కవిత్వం చాలా సున్నితత్వంతోనూ, చెమ్మతోనూ కూడి ఉంటుంది. పదాల ఎంపికలో ఆయన చూపే సౌకుమార్యం పాఠకుడిని ఇట్టే కట్టిపడేస్తుంది.
వారి వస్తు శిల్పం విషయానికి వస్తే, కేవలం భావానికే కాకుండా, కవితా నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతీకలు, ఉపమానాలను చాలా వినూత్నంగా ఉపయోగిస్తారు.
సమాజంలోని బాహ్య విషయాల కంటే, మనిషి లోపల జరిగే సంఘర్షణలు, జ్ఞాపకాలు, అనుభూతులకు ఆయన అక్షర రూపం ఇస్తారు. చాలా కవితలు ఆయన అంతరంగ మథనంలా అనిపిస్తాయి. వచన రచనల కంటే కవిత్వమే మనిషిలోని ఒత్తిడిని మంచులా కరిగిస్తుందని ఆయన నమ్ముతారు.
~
ఆయన దివంగత ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారిని తన గురువుగా, మార్గదర్శిగా భావిస్తారు. శేషేంద్ర గారి ప్రభావం ఆయన కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. మునిపల్లె రాజు, బుచ్చిబాబు వంటి హేమాహేమీల రచనలంటే ఆయనకు ఎంతో ఇష్టం.
~
ప్రచారం కోసం లేదా అవార్డుల కోసం కాకుండా, స్వచ్ఛమైన అనుభూతి కోసం కవిత్వం రాస్తారు. తానెందుకు రాస్తారో, ‘అనల్పం’ పుస్తకం ముందుమాటలో ఇలా రాసుకున్నారు: “కవిత్వం ఎవరెందుకు రాస్తారో తెలియదు కానీ, నేను మాత్రం రోజూవారీ కంపనాలకు లిపి తడిపి అద్దుతుంటాను.”
~
‘లిపి తడిసిన తరుణం’ వారి ఐదవ కవితా సంపుటి. ఈ పుస్తకాన్ని పాలపిట్ట ప్రచురణలు వారు 2012లో ప్రచురించారు. ఇది ఆయన కవితా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది. ‘లిపి తడిసిన తరుణం’ కవిలోని కవితాత్మక సౌందర్యాన్ని, భావుకతను ఉన్నత స్థాయిలో ఆవిష్కరించిన పుస్తకమని నేను భావిస్తాను.
“రఘు కావ్యాలు సౌందర్య శిఖర సానువులు, రసాత్మక భావాలు కపిల వర్ణ ధేనువులు. ఉబికే ఉపమవేణువులు. ఏ పాఠశాలలో శిక్షణ ఇచ్చాడో తెలియదు రఘు చేతిలో అక్షరాలు నక్షత్ర గుచ్ఛాలవుతాయి. అగ్నిజ్వాలలవుతాయి, ధృవతారలౌతాయి. పసిపాపలౌతాయి. గ్రీకు రాణుల్లా అయ్యారే అనిపిస్తాయి. సీతాకోకల్ని ఉంగరాలుగా తొడుక్కొని చీర రంగుల్ని అనువదించే ఇతడు ‘రాజ్యేనకిం’ అన్నంత రాజసంతో బతికే యువకుడు” అన్నారు డా. కలువగుంట రామమూర్తి ఈ పుస్తకం వెనుక అట్ట మీద బ్లర్బ్ లో.
~
ఈ పుస్తకం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు:
శీర్షిక విశిష్టత:
కవిత్వానికి ‘లిపి తడిసిన తరుణం’ అని పేరు పెట్టడమే ఒక గొప్ప భావుకత. లిపి తడవడమనేది సరికొత్త ఊహ అని తమ ముందుమాటలో యాకూబ్ గారు వ్యాఖ్యానించారు అక్షరాలు కేవలం చిహ్నాలు కాకుండా, ఒక అనుభూతిలో తడిసినప్పుడు కలిగే స్పందనలను ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది.
‘లిపి’ తడవడం అంటే అక్షరాలు భావోద్వేగంతో నిండిపోవడం అని అర్థం. కవిత్వం కేవలం మెదడు నుంచి కాకుండా మనసు లోతుల్లోంచి వచ్చిందని ఇది సూచిస్తుంది.
‘అనల్పం’ ముందుమాటలో ‘లిపి తడిపి అద్దటం’ గురించి ఇంతకు ముందు చెప్పినది ఈ కవితాసంపుటిలో పాఠకులకు అనుభవమవుతుంది.
భాషా సౌందర్యం:
ఈ పుస్తకంలోని కొన్ని పదబంధాలు వినూత్నంగా ఉన్నాయని అంటూ, “‘కంటి పరుపులు’, ‘తలల అరుగులు’, ‘చెరువులు చెంపలు’, ‘పెదవుల దొప్పలు’, ‘మాటల మైనాలు’, ‘ధాతువుల ఉండ’, ‘మాటల శీకాయ’ వంటివి ఆశ్చర్యం కలిగిస్తాయి” అని పేర్కొన్నారు యాకూబ్ గారు. రఘుగారి ఉపమానాలు చాలా వినూత్నంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇందుకు గొప్ప ఉదాహరణ ‘మనిషి’ అనే కవిత.
మనిషి
మనుషులు లోకానికి ఉపమానాలు
మైదానాలు ఉత్తరీయాలు
ధగధగలాడే పంచెలు ఎండలు
కంటి పాపలే ఉభయ సంధ్యలు
పొలాలు పచ్చని చీనాంబరాలు
ఇంద్రియాలు నీటి రంగులు
భాషలు ఆకాశాలు
ఋతువులు ఉద్వేగాలు
ఇప్పుడు లోకం పేరు మనిషి!
అద్భుతం కదూ!!
పద చిత్రాలు:
రఘు గారు ఈ పుస్తకంలో అనేక చిత్ర విచిత్రమైన పద చిత్రాలను ఆవిష్కరించారు. జ్ఞాపకాలు, విరహం, మరియు ప్రకృతిలోని మార్పులను ఆయన అత్యంత సున్నితంగా ఈ కవితల్లో పొందుపరిచారు.
~
“సుపరిచితమైన పదాలనే భిన్నంగా వాడుతూ కవిత రాయడం ఇతని కవితా నిర్మాణం మర్మం” అన్నారు యాకూబ్ తమ ముందుమాటలో.
ఈ వాక్యం ద్వారా ఈ సంపుటి లోని కవితలు ఎలా ఉండబోతున్నాయో కొద్దిగా అంచనా వేయగలుగుతాం.
‘పిలుపు’ కవితలో, “ఆ నిర్మానుష్య నిమిషాల పాయసాలు చాలు” అంటారు వేకువ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ. “పిపాప పూలై పూసే గొంతుల్ని/విందుకు రమ్మని పిలుస్తాయి” అనడంలో ఉదయపు ప్రకృతి ఆనందాల విందు అని చెప్పకనే చెప్పారు.
కోమలత్వాన్ని గుండెలోంచి ఎందుకు నెట్టాలి? అని ప్రశ్నించి, ఎలాంటి నవ్వు కావాలో ఒక కవితలో చెప్తారు.
ఫిబ్రవరి 2010లో ఆయన ‘ఇప్పుడు కావల్సింది..’ అనే కవితలో ఇలా రాశారు: “కానీ లోకానికి కావల్సింది/కిలోల కొద్దీ కలలు కనే రికామీ తలలు కాదు/రెండు కష్టించే చేతులు”. ఇది సార్వకాలీనం! సార్వజనీనం!!
“గుండె నీలో ఒలికే ఒక దీపం” అని అనడంలో మనషితనమంటే ఏమిటో చెప్తారు. నాలుగు పాదాల కవితే, కానీ ఎంతో అర్థమున్నదీ, ఎంతో వ్యాఖ్యానించదగ్గదీ!!
రఘు కవితా నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకున్నాం కదా, అందుకు ఉదాహరణ ఆయన కవితలోంచే ఇస్తాను – “కవనం కాదు దాని రూపం మీద/పంతాలు పోయే తాపసిని నేను.” అన్నారు ‘చిత్తర్వుల వల’ కవితలో. తాపసి అనే పద ప్రయోగం వల్ల, రూపం అంటే పొయెటిక్ స్ట్రక్చర్ అని అర్థమవుతుంది.
ఉద్యోగస్థులు, పిల్లలు, గృహిణులు అంతా ఆదివారం కోసం ఎదురుచూడడం మనకు తెలిసినదే. రోజూవారీ ఉరుకుల పరుగుల నుంచి కాస్త తెరిపిన పడడానికి ఆదివారం రావాలనుకుంటారు.. మరి ఆదివారం గురించి ఈ కవి ఏమన్నారో తెలుసా? “వారాంతాన్ని ఘుమ ఘుమగా/వార్చి తెచ్చే సంబరం” అట! ఎంత కమ్మటి పోలిక!!
ఈ కవి గొప్ప భావుకుడని అనుకున్నాం కదా, అందుకు ఉదాహరణ ‘ఉదయం’ అనే కవిత!
ఉదయం
వెలుగురేఖల కౌగిలి నుండి
పగలు పొగమంచులా జారి
చీకటి చూరుల్లోంచి
లోకం మరో పార్శ్వాన్ని
నీరెండ చేతులతో తడిమితే
అది ఉదయం!
వావ్! అనకుండా ఉండలేం కదా!!
కొన్ని కవితలకి పెట్టిన శీర్షికలు కూడా కవి భావుకత్వానికి అద్దం పడతాయి. ఉదా: నక్షత్రాలు పూస్తాయి, వాన చేరని వైనం, ఛాయాపులి వంటివి.
“బ్రతికే దారుల్లో గతుకులున్నప్పుడు/బతకటమే ఒక గమ్యం” అంటారో కవితలో. ఎంత లోతైన భావమో కదా!
ఈ పుస్తకం చదివిన పాఠకులు, క్లిష్టమైన పదజాలం కంటే, భావంలోని గాఢతకు కవి ప్రాముఖ్యతనిచ్చారని గ్రహిస్తారు.
‘లిపి తడిసిన తరుణం’ పుస్తకం గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే: “నిశ్శబ్దపు లోతుల్లో తడిసిన అక్షరాలకు భావాల ప్రాణం పోస్తూ, మౌనాన్ని కవిత్వంగా మార్చిన అద్భుతమైన కవితా సంపుటి.” అనవచ్చు.
చక్కని కవితలున్న పుస్తకాన్ని అందించినందుకు కవికి అభినందనలు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
