Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

లోకాంతర సాక్ష్యం

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘లోకాంతర సాక్ష్యం’. రచన జి.వి. కళ్యాణ శ్రీనివాస్.]

లోకాంతర సాక్ష్యం (Testimony Beyond Worlds)

“కౌసల్యా సుప్రజా రామా.. పూర్వ సంధ్యా..” వెంకటేశ్వర సుప్రభాతం వస్తోంది ఎఫ్.ఎం. రేడియోలో.

‘భక్తి ఎఫ్.ఎం.’ సుజాతకు ఇష్టమైన రేడియో స్టేషన్.

స్నానం చేయగానే సుప్రభాతం వింటూ కాఫీ చేసి భర్తకు ఇచ్చి తాను తాగి పూజకు ఉపక్రమిస్తుంది దినచర్యగా.

సుజాతకు భక్తి ఎక్కువే కానీ మూఢ భక్తి లేదు. ఇప్పడు ఆమె వంటగదిలో ఉంది. భర్తకు కాఫీ ఇవ్వలిసిన పనీ లేదు. అయన రెండు నెలల క్రితం ఫోటో లోకి తన మకాం మార్చాడు.

 మాసికాలు అవుతున్నాయి. రేపే అయన రెండో మాసికం. మనసు ఒక్కసారి దిగుల్లోకి వెళ్ళింది. మళ్ళీ మనసు దిటవు చేసుకుంటూ సుప్రభాతం మీదకు ధ్యాస మరలచింది.

కిటికీలోనించి లేత ఎండా ఆమె ముక్కు మీద, బొట్టులేని నుదుటిమీద పడుతూ అక్కడ చర్మం బంగారంలా మెరుస్తోంది. స్తబ్ధంగా వేడి కాఫీని గ్లాస్ లోకి వంపుకుని ఒక గుక్క తాగి, ముందుగదిలోకి వచ్చింది సుజాత.

రేడియో వాల్యూమ్ తగ్గించించి సుజాత.

పైన ఉన్న మూడు గదుల్లోని రెండు గదుల్లో ఇద్దరు కొడుకులు కుటుంబాలతో నిద్రలో ఉన్నారు, మూడో బెడ్ రూమ్‌లో కూతురు అల్లుడు కూడా ఉన్నారు. ఈ శబ్దం వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదని అనుకుంది సుజాత. నాలుగు బెడ్ రూమ్‌లు ఉన్న డ్యూప్లెక్స్ హౌస్ అది. ముగ్గురు పిల్లలు కుటుంబాలతో విదేశాల్లోనే వుంటున్నారు. చిన్న కొడుకు రాహుల్, పెద్దకొడుకు అనిరుధ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌లో పని చేస్తున్నారు. అల్లుడు లండన్‌లో గవర్నమెంట్ విభాగంలో జాబ్ చేస్తున్నాడు. కూతురు హోం-మేకేర్‌గా ఉండిపోయింది.

కూతురు వెళ్లి దాపు పది ఏళ్ళు అయ్యింది. సుజాత తన 55వ ఏట తన భర్తను కోల్పోయింది. రాజారావుకు 60. గుండె నొప్పితో హఠాత్తుగా ఒక తెల్లవారుజామున ప్రాణం పోయింది.

నిద్రలేపుదాము అని భర్తను తట్టి లేపే అప్పుడు చల్లగా తగిలిన ఆయన బుగ్గలు గమనించి డాక్టర్ శంకర్ అన్నయ్యకు కబురుపెట్టింది. శంకర్ గారు వచ్చి రాజారావు పోయిన విషయం చెప్పి పిల్లలకు తనే కబురు పెట్టాడు. హడావిడిగా వచ్చారు పిల్లలు. డాక్టర్ శంకర్ ఇప్పుడు కూతురు దగ్గిరకు అమెరికా వెళ్ళాడు. అదిగో అలా గత రెండు నెలలుగా పిల్లలు ఇండియా లోనే ఉండిపోయారు. ఎల్లుండి రెండో మాసికం అయ్యాక ప్రయాణం పెట్టుకున్నారు. కాని సుజాత అభ్యర్థన మేరకు మరో నెల రోజులు ఉందాము అని నిర్ణయించుకున్నారు. మగపిల్లలు, కోడళ్ళవి సాఫ్ట్‌వేర్ జాబ్‌లు కనుక ఇండియా నుండి పని చేయటానికి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఒప్పుకున్నారు. అల్లుడు మాత్రం గవర్నమెంట్ జాబ్ కనుక వెళ్లి పోతున్నాడు. కూతురు ఒక నెల ఉంటాను అన్నది.

కాలింగ్ బెల్ మోగటంతో ఈ లోకం లోకి వచ్చింది సుజాత.

‘ఇంత పోదున్నే ఎవరు?’ అనుకుంది. పాలతను పొద్దున్నే పాల పాకెట్లు ఇచ్చి వెళ్లిపోయాడు. గోడ గడియారంలో టైం వంక చూసింది 6:30. మరి ఇప్పుడు ఎవరు!! ఇంత పొద్దునే!! ఎవరబ్బా? అనుకుంది సుజాత.

మళ్ళీ మోగింది కాలింగ్ బెల్. ఈసారి ఆపకుండా కొడుతున్నారు ఎవరో?!

ఒక్కఉదుటన లేచి.. పిల్లలు లేస్తారేమో అని మేడ మీదకు పైకి చూస్తూ గబా గబా.. మెయిన్ డోర్ వైపు నడిచింది సుజాత.

డోర్ బోల్ట్ తీస్తూ.. ఎవరబ్బా అనుకుంటూ డోర్ తీసింది సుజాత.

డోర్ తీస్తూనే  చూసిన దృశ్యం సుజాతకు ఒక్కసారి వెన్నులో వణుకు పుట్టించింది.

ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అయ్యాయి. తెరచిన నోరు అలానే ఉండిపోయింది.

“ఎంతసేపు కొట్టాలి కాలింగ్ బెల్?! తలుపు తీయటానికి ఇంత సేపా..?” అన్న మాట వినపడింది.

అక్కడక్కడా పసుపు మరకలతో ఉన్న పైజామా లాల్చీలో, నెరసిన జుట్టుతో, మాసిన పలుచని గెడ్డంతో, చెదిరిన క్రాఫ్‌తో ఉన్నాడు ఆ వ్యక్తి.

కళ్ళలో అద్భుతమైన వెలుగు కనపడుతోంది. మాసిన బట్టల్లో ఉన్నా, ఏదో మధురమైన సుగంధం అతని నుండి వస్తోంది. నుదుటన సన్నని మడతలు అతని వయసును తెలియ పరుస్తున్నాయి. చిరాకును సూచిస్తున్నట్టుగా అతని కనుబొమ్మలు కొద్దగా వంగి వున్నాయి.

“ఇంకా నిద్రపోతున్నావా? తలుపు తీయటానికి ఇంతసేపా?” విసుగ్గా అంటూ లోపలకు నెట్టుకున్నట్టు వచ్చాడు.

భర్త రాజారావును చూసి సుజాత స్థాణువులా ఉండిపోయింది.

సుజాత మానసిక సంఘర్షణలో ఉంది. ఆవిడకు ఏమి పాలుపోవటం లేదు. తిరిగి వచ్చిన భర్తను చూసి సంతోషించాలా? మనిషి కాదు మరేదో అనుకుని భయపడాలా తెలీని స్థితి. ఒకేసారి రెండు విరుద్ధమైన భావనలు లేదా నమ్మకాల మధ్య సంఘర్షణ.

ఈ పరిస్థితిని మానసిక శాస్త్రములో ‘Cognitive Dissonance & The Uncanny’, ‘కాగ్నిటివ్ డిసోనెన్స్ అండ్ ద అన్‍కానీ’ అంటారు. ఇప్పుడు సుజాత అదే స్థితి లో ఉంది.

“మీ నాన్నగారు వచ్చారు రా.. క్రింద ఉన్నారు” అని చెప్పింది, పైకి వెళ్ళి పెద్ద కొడుకుతో.

తండ్రి మరణం వల్ల తల్లికి పిచ్చెక్కిందేమో అన్నట్టు చూసాడు పెద్దకొడుకు అనిరుధ్.

“నాన్నగారు రావటం ఏమిటమ్మా? నీకేమన్నా పిచ్చి పట్టిందా?!” లోపల భార్య పిల్లలు ఇంకా పడుకుని ఉన్నారు అని తెలిసి ఆశ్చర్యం, విసుగుతో ఉన్న స్వరంతో అన్నాడు అనిరుధ్.

అతను తన బెడ్రూమ్ తలుపు దగ్గరకు వేసి గుమ్మం దగ్గిర నిలపడి సుజాతతో మాట్లాడుతున్నాడు.

“నిజం రా.., ఇప్పుడే ఆయనకు కాఫీ ఇచ్చి, అయన తాగుతుంటే పైకి వచ్చి మిమ్మల్ని లేపుదాం అని ఇలా వచ్చా.”

సహజంగా అమ్మ కిందనుండి ఫోన్ చేసి పిలుస్తుంది. అలాంటిది తాను అలా పైకి వచ్చి చెప్పటం అనిరుధ్‌కు ఒకింత కంగారు వేసింది.

“అదేంటమ్మా అలా అంటావు?! ఆయన కాలి బూడిద అయ్యేముందు, కపాల మోక్షం కూడా నేను విన్నానుగా!” అనిరుధ్ కంఠంలో విసుగుతో కూడిన ఆశ్చర్యం వినపడుతోంది.

“కాశీలో ఆయన భస్మం గంగానదిలో కలిపికా, అదే గంగ ఒడ్డున పిండ తర్పణం మర్చిపోయావా?!” తల్లిని చిత్రంగా చూస్తూ అన్నాడు అనిరుధ్.

“నువ్వు కిందకు పద నేను వాడిని తీసుకుని వస్తా” అన్నాడు అనిరుధ్.

రాజారావు ఎప్పుడు కుర్చునట్టే హుందాగా కాలు మీద కాలు వేసుకుని సోఫా కుర్చీని కాఫీ తాగుతున్నాడు. కాలు కాలిన పిల్లిలా అనిరుధ్, రాహుల్ కిందకు వచ్చారు, కొద్ది దూరంలో వాళ్ళ బావగారు ముకుంద్ నిలబడి మామగారిని చిత్రంగా గమనిస్తున్నాడు.

కూతురు, కోడళ్లు, వాళ్ళ వాళ్ళ పిల్లలతో మెట్ల మీద నిలబడి ఉన్నారు భయంగా.

“ఏమిరా ఎప్పుడు వచ్చావు?”

“అరే రాహుల్ ఏమిటి అలా కాలు కాలిన పిల్లిలా?”

“అదేమిటి అల్లుడు ఎందుకలా దూరంగా నిలబడటం? రండి, ఇలా వచ్చి కూర్చోండి!!” అంటూ రాజారావు ముగ్గురుని పలకరించాడు.

“కోడళ్ళు లేచారా?, మనవడు, మనవరాళ్లు ఏరి?” అడిగాడు రాజారావు.

“నమస్తే మామయ్యా” అందరు ఒక్కసారిగా పోలో మని కిందకు వచ్చారు. వాళ్ళు అందరికీ చాలా అయోమయంగా ఉంది.

ఆయన మామూలుగా ఉన్నారు. ఇదివరకటి గంభీరత్వం చెక్కు చెదరకుండా అలానే స్పష్టంగా ఆయనలో కనిపిస్తోంది.

పిల్లలు బెదురూ బెదురుగా ఆయనకు దగ్గరగా సోపాలో కూర్చోబోతే తల్లులు వారిస్తున్నారు.

“అసలు మీరు ఎలా వచ్చారు నాన్నా?”

అయన వస్తున్నపుడు కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఆ ఊరివాళ్ళు గుర్తు పట్టారా? వాళ్ళు ఎవరన్నా అయన రాక గమనించి ఆయన్ని అనుసరించి ఇంటిదాకా వచ్చారా? అన్న అనుమానంతో వీధీ వైపు ఉన్న కిటికీ లోనించి చూస్తూ అడిగాడు చిన్న కొడుకు రాహుల్.

అతని ధైర్యానికి, అడిగిన ప్రశ్నకు ఒక్కపాటుగా ఉలిక్కిపడ్డారు అందరు.

రాహుల్ ఎప్పుడూ అంతే గభాలున మనసులో ఏది ఉంటే అది అడిగేస్తాడు. వెనుకా ముందు చూసుకోడు.

“అంటే మీరు..” ఏదో చెప్పబోయింది సుజాత.

సుజాత నుదిటిన కాసంత బొట్టు ఎర్రగా మెరుస్తుండటం అందరూ గమనించారు.

“నేను పోయాను, మళ్ళీ ఎలా వచ్చాను? అని మీ అందరి ప్రశ్న. మీకే కాదు నాకూ  అది ప్రశ్నయే?!” అన్నాడు రాజారావు.

చిన్న కొడుకు రాహుల్ పక్క గదిలోకి మొబైల్ తీసుకుని వెళ్లడం, అక్కడున్న ఎవరూ గమనించలేదు.

“నేను కళ్ళు తెరిచేసరికి మన ఊరి శ్మశానంలో ఉన్న రావి చెట్టు కింద ఉన్నాను. అప్పుడు శ్మశానం అంతా చల్లగా అయిపోయింది, నా మీద ఒక్కసారిగా జల్లులా వాన పడింది. నా బట్టలు తడిసిపోయాయి. కానీ ఈ పసుపు, కుంకుమ మరకలు పూర్తిగా పోలేదు. దూరంగా ఒక ఆరడుగుల ఎత్తుతో, బలంగా ఉన్న యువకుడు, నా దగ్గిరకు వచ్చాడు, ఒక తేజో స్వరూపంలా ఉన్నాడు. అతని నుండి ఏదో ఒకరకమైన సుగంధమైన సువాసన వస్తోంది. అతని గొంతుక ఒకరకమైన బొంగురు కాదు, అదో మాదిరిగా ఉంది. ఆ క్షణంలో నాకు భయం వేయలేదు. ఇప్పుడు తలచుకుంటే అదోలా ఉంది” రాజారావు చెపుతున్నాడు.

“నువ్వు రెండు నెలల క్రితం చనిపోయావు. నువ్వు ఇంటికి వెళ్ళు అని ఆదేశిస్తున్నట్టు నాతో అన్నాడు. నేను రోడ్డు మీదుగా కాకూండా అలా తోటలలో నించి ఇంటి ముందరకు వచ్చాను” రాజారావు చెప్పటం పూర్తి చేసాడు. ఆయన ఇంకా ఏదో దాస్తునట్టు మాత్రం తెలుస్తున్నది. దాదాపు అంతా నిజమైనప్పటికీ.

సుజాత మనసు కొద్దిగా కుదుటపడింది. కాని లోపల భయం గానే ఉంది.

అయన రావటమే చిత్రం అనుకుంటే, ఇప్పుడు వారందరి ముందు ఉన్న పెద్ద సమస్య, ఈ విషయం బయట అందరికి చెప్పటం ఎలా అని?

“మౌనంగా ఉండిపోదాము ఇంటికి ఎవరన్నా వస్తే చెపుదాము” అన్నాడు అనిరుధ్.

“పంతులుగారు రెండో తద్దినం పెట్టక్కరలేదు, బతికున్న వాళ్లకు తద్దినం పెట్టరు అని అన్నారు” అన్నాడు రాహుల్.

“అసలు నాన్న వచ్చారని పంతులు గారికి ఎలా తెలుసు?”, చెల్లి రమణి రాహుల్ ని అడిగింది.

“నేనే చెప్పాను” అన్నాడు రాహుల్.

“మీ నోట్లో ఏది నానదు, అందుకే మీకు ఆఫీస్‌లో ప్రమోషన్ కూడా రానిది, ఎప్పుడు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసిరాదు” సందర్భం ఐనా ఒక అసందర్భ ఉదాహరణ లేవనెత్తింది రాహుల్ భార్య. తన అసహనాన్ని ఆ విధంగా వెళ్లగక్కింది.

ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. రాజారావు కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నాడు అనిరుధ్.

“నాన్న నువ్వు లేకపోతే ఎంత కష్టం అనిపించింది అంటే, నేనెలా బ్రతుకుతాను అనుకున్నాను” అన్నాడు. రాజారావుకు తెలుసు అనిరుధ్‌కు తానూ అంటే ఎంత ప్రేమో. పెద్దకొడుకన్నా రాజారావుకు విపరీతమైన ప్రేమ.

“అది కాదు అన్నా, నాన్న లేరు అనుకున్న క్షణాన ఈ భూమి మొత్తం చీలిపోతే బాగుండు అనుకున్నాను. అసలు నాన్న లేని రేపును ఎలా ఉహించాలో అర్థం కాలేదు” అన్నాడు రాహుల్.

నిజమే వాడికి ఏమి తెలియని అమాయకుడు. ఎన్నో సార్లు తానూ సుజాత అనుకునే వాళ్ళు, ఈ అమాయకుడు ఎలా బతుకుతాడో అని. అమెరికా పంపించే అప్పుడు ఆడపిల్లను పుట్టింటికి పంపే అప్పుడు ఎలా పంపుతారో అలా.. వంద మాటలు చెప్పి, అప్పటికే ఉన్న అనిరుధ్‌కు తమ్ముడు జాగ్రత్త రా అని చెప్పటం రాజారావుకు గుర్తుకు వచ్చింది.

“మనిద్దరి సంగతి సరే. అమ్మ పరిస్థితి చూడాలి. ఆమెకు నాన్న తప్ప బయట ప్రపంచమే తెలియదు”, ఆయన లేని జీవితం అమ్మ బతకదేమోనని అనుకున్న అనిరుధ్ అన్నాడు.

కొడుకు మాటలకు – రాజారావుకు, సుజాతకు ఇద్దరికీ కన్నీళ్లు వచ్చాయి. భార్య తల మీద చేయి వేసి ఆమె కళ్ళలోకి చూసాడు. స్వచ్ఛమైన ప్రేమ తప్ప మరేమి కనపడలేదు రాజారావుకు.

కూతురు రమణి, తండ్రిని చూసి భోరున ఏడ్చేసింది. ఆ దృశ్యానికి రాజారావుకు కడుపులో చెయ్యిపెట్టి కెలికినట్టు అయ్యింది. కోడళ్ళు ఇద్దరు కళ్ళు తుడుచుకోవటం చూసి చాల దుఃఖం వచ్చింది రాజారావుకు. మనవడు, మనవరాళ్లు అందరు దగ్గరగా ఉండగా – మనసులో అనుకున్నాడు రాజారావు – ‘ఈ కుటుంబాన్నా నేను వదిలి వెళ్లిపోయింది’ అని.

***

పొరుగువాళ్ళు, బంధువులు “రాజారావు గారు తిరిగి వచ్చారు” అని ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు.

పంతులు గారి కొడుకు లోకల్ జర్నలిస్ట్. ఇతర మీడియాతో కలిసి మీటింగ్ పెట్టాడు. ఈ సంఘటనను తానే మొదట అందించాడు కనుక ఇతర జర్నలిస్టుల ముందు, తన పత్రికా సంస్థ లోనూ తానే హీరో ఇప్పుడు.

తన పత్రికలో ఆ రోజు హెడ్డింగ్ ‘మరణించిన వ్యక్తి తిరిగి వచ్చాడు!’ అని వేశాడు. విషయం చిలవలు పలవలుగా వ్రాసాడు. తాను ఈ విషయాన్నీ బాగా వాడుకుంటున్నాడు. కొడుకు ప్రయోజకుడు అయ్యాడని తెగ సంబరపడిపోతున్నాడు పంతులు గారు.

హైదరాబాద్ ఫోన్ చేసి టీవీ మీడియాను పిలిపించాడు. అదిగో ఆ మీటింగ్ ఇప్పుడు అక్కడ జరుగుతోంది.

మీటింగ్‌కు ముందు, కొందరు ఆడవాళ్లు రాజారావుకు హారతి ఇచ్చారు. దాదాపు ఇరవై ముప్పై కొబ్బరికాయలు పగిలాయి భక్తిగా. కొబ్బరికాయలు కొడుతున్నపుడు, పెంకులు తగలకుండా రాజారావు చాలా జాగ్రత్త పడవలసి వచ్చింది.

“ఇది మా కుటుంబ విషయం” అని ఎంత వారించినా మీటింగ్ పెట్టక మానలేదు.

“రాజారావుగారు, మీరు రెండు నెలల క్రితం మరణించారు అని రికార్డులు ఉన్నాయి. మళ్లీ ఎలా వచ్చారో చెప్పగలరా?”

రాజారావు జరిగిన విషయం, తన అనుభవం అన్ని విషయాలు చెప్పాడు.

శ్మశానంలో కనపడిన యువకుడు, ఆధ్యాత్మిక సువాసన, తిరిగి రావటం అన్నీ, ఏదీ వదలకుండా అన్నీ పూస గుచ్చినట్టు చెప్పాడు.

“మీరు చెప్పిన యువకుడు ఎవరు? ఆయన దేవదూతా? లేక సాధారణ వ్యక్తా? ఆయనను మళ్లీ చూడగలరా?”

రాజారావు తాను మళ్ళీ క్రితం సమాధానమే చెప్పాడు .

“నేను చూసిన అతను సాధారణ వ్యక్తిలా లేడు, కానీ మనలానే పైజామా, లాల్చీ లాంటి బట్టలు వేసుకుని ఉన్నాడు.”

“బట్టలు ఏ రంగులో ఉన్నాయి?” ఒక జర్నలిస్ట్ తెలివిగా అడిగాను అన్న భావన కనిపిస్తోంది అతని ప్రవర్తనలో.

“తెల్లగా ఉన్నాయి. బాగా నలిగి ఉన్నాయి బట్టలు” అన్నాడు రాజారావు.

అందరిలో రాజారావు అంటే భక్తి, భయం రెండు కనిపిస్తున్నాయి.

“డాక్టర్లు చెబుతున్నారు, ఇది హల్యూసినేషన్ కావచ్చు. మీరు దానికి ఏమంటారు?”

రాజారావు మౌనంగా తల ఊపాడు, కాదు అన్నట్టు. “నన్ను చూస్తున్నారుగా” అన్నాడు.

“మీ అనుభవం ద్వారా సమాజానికి మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?”

“ఏమి లేదు. జరిగింది, మీరు అడిగిన దానికి సమాధానం చెపుతున్నాను. సందేశాలు ఏముంటాయి?” అన్నాడు రాజారావు.

“మీరు నిజంగానే చనిపోయారా? లేక ఏదో వైద్యపరమైన పొరపాటు జరిగిందా?”

రాజారావుకు చాల ఇబ్బందిగా ఉంది. ఏమి సమాధానం చెప్పలేదు. మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు.

ఈ ఇంటర్వ్యూ తరువాత కొందరు భక్తులు ‘అద్భుతం’ అంటున్నారు. మరికొందరు ‘కుటుంబం నాటకం’ అనుకున్నారు.

కానీ ఒకటి మాత్రం నిజం రాజారావు ఇంకా ఏదో దాస్తున్నారు అనిపిస్తోంది ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి.

***

శ్మశానంలో అర్ధరాత్రి నిశ్శబ్దం కమ్ముకుంది. పెద్ద రావిచెట్ల క్రింద ఎండిన ఆకులు గాలి తాకిడికి కదులుతూ చిత్రమైన శబ్దాన్ని చేస్తున్నాయి. ఆకాశంలో చంద్రుడు పలుచని మబ్బుల వెనుక మాసిపోయిన అద్దంలా కనిపిస్తున్నాడు. తెల్లని కొంగలు లాంటి పక్షులు అప్పుడప్పుడు ఆకాశంలో ఉత్తర దిక్కుగా ఎగరటం ఆ చంద్రకాంతిలో కనిపిస్తున్నాయి. దూరంలో మిగిలిన చితి పొగ ఇంకా వాసన వెదజల్లుతూనే ఉంది. ఆ చుట్టూ కుక్కల అరుపులు, వదిలిన పిండాలను తిన్నాక, ఆ పిండాల తాలూకా వాటికి కనిపిస్తున్న ఆత్మల వల్లనో, మరే కారణం గానో అవి గట్టిగా మొరుగుతున్నాయి. రాత్రి పిట్టల అరుపులు కలసి ఆ వాతావరణాన్ని మరింత భయానకంగా మారుస్తున్నాయి. ఎక్కడో ఒక మూలలో మట్టి దీపం ఇంకా వెలుగుతోంది. గాలిలో బూడిద, గంధం, పాత పూల వాసనలు కలసి అజ్ఞాత భీతిని రేకెత్తిస్తున్నాయి. రాజారావు కూలిన రాళ్ల సమాధి మీద కూర్చుని, ఆ యువకుడి కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇప్పుడు అతని మనసు చాల బరువుగా, ఆ శ్మశాన వాతావరణంకు సమానంగా ఉంది. అప్పటికి తను వచ్చి గంటన్నర అయ్యింది. పై గుడ్డతో ముఖం తుడుచుకున్నాడు. అప్పడు వచ్చింది వెలుగు.

ఆకాశం నుండి ఆ వెలుగు ఒక శబ్దం లేని మెరుపులాంటి కాంతి పుంజం నేలను తాకింది. ఆ మధ్యలో నుండి తెల్లని పైజామా లాల్చీతో ఉన్న ఒక యువకుడు తనవైపు రావటం గమనించాడు. బలిష్టమైన దేహం, అతని నుండి సుగంధ పరిమళం అద్భుతంగా ఆ పరిసరాలకు వ్యాపిస్తోంది. అదే సువాసన. మూడు నెలల క్రితం తాను ఆస్వాదించిన సువాసన.

కానీ ఇప్పుడు ఇతను మునుపు చూసినట్టుగా నలిగిన బట్టలతో లేడు. ధవళ కాంతితో అద్భుతమైన మెరుపుతో ఉన్నాడు.

దగ్గరికి వస్తూనే, “అప్పుడే వచ్చావేమిటి?, మరో మూడు నెలలు ఉందిగా నీ ఆయువు” అన్నాడు. మళ్ళీ తనే, “ఐనా నీకు తెలుసుగా ఒక్కసారే నన్ను పిలవగలవు, నువ్వు భూమి మీదకు తిరిగి వచ్చిన దగ్గిరనుంచి” అన్నాడు.

“తెలుసు. ఇక మీద నిన్ను పిలిచే పరిస్థితి రాకూడదు అని కోరుకుంటున్నాను” అన్నాడు రాజారావు.

“అసలు ఏమయింది?” అడిగాడు ఆ యువకుడు.

“నీకు తెలియనిదేముంది? నువ్వు దేవుడివేగా?” నిష్ఠురంగా ధ్వనించింది రాజారావు కంఠం. “నీకు తెలియకపోవటం ఉంటుందా ఈ లోకంలో..” మళ్ళీ తనే అన్నాడు.

***

కుటుంబం అంతా హాలు మధ్యలో చేరారు. ఇక అమెరికాకు, రాజారావు పిల్లలిద్దరూ వాళ్ళ ఫ్యామిలీ తో బయలుదేరాలి అని అనుకుంటున్నారు. అల్లుడు మధ్యలో ఒకసారి యూకే వెళ్లి వచ్చాడు. కూతురుని కూడా తీసుకుపోవాలి అని అనుకుంటున్నాడు. అక్కడ తనకు వంటకు ఇబ్బందిగా ఉంది అని.

ఇవన్నీ ఒక ఎత్తు ఐతే అసలు విషయం మరొకటి ఉంది.

“ఇంతకూ ఇల్లు అమ్ముతాను అన్నావు?” ముకుంద్ అనిరుధ్‌ను ఉద్దేశించి అడిగాడు.

“ఎక్కడ? ఈయన తిరిగి వస్తాడని అనుకున్నామా? కరెక్ట్‌గా ఇల్లు అమ్మి, వచ్చిన దాన్ని ముగ్గురం పంచుకుందామని అనుకునే లోగా ఈయన ఊడిపడ్డాడు. పోనీ వచ్చినవాడు, చచ్చినవాడిలాగా కనపడకుండా ఇంట్లో ఉండకుండా, వీధిలోకి పోయి వూరంతా తిరుగుతాడు. ఇల్లు నా తండ్రి ఇచ్చిందని, అమ్మటానికి వీల్లేదని అంటాడు. పోనీ బతికి వచ్చాడు కదా, కాస్త శక్తులు ఉన్నవాడిలాగా బిహేవ్ చేయచ్చుకదా? లేదు, తనకు ఏ శక్తులు లేవు అని ఊరంతా చెపుతున్నాడు. ఈయన మళ్ళీ ఎప్పుడు పోవాలి? ఈసారి గనుక ఫోన్ చేస్తే ఇలా పోయాడని మాత్రం నమ్మి రాను. పోయిన ఒక నెలకో, రెండు నెలలకో వస్తాను. గ్యారెంటీ లేనప్పుడు ఎందుకు కట్ట కట్టుకుని రావటం? డబ్బులు, టైం రెండు వేస్ట్.” అని,

“అది సరే ఇంతకూ నువ్వు ఆ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ల్యాబ్‌తో మాట్లాడవా, ఫైనల్ రిపోర్ట్ వచ్చిందా?” అడిగాడు రాహుల్‌ను.

“Genex Life Sciences ప్రధానంగా రిజెనరేషన్ అండ్ రీ-బర్త్ మీద రీసెర్చ్ చేస్తారు. ప్రధానంగా చనిపోయి తిరిగి వచ్చిన నాన్న మీద ఈ ప్రయోగాలు గత మూడు నెలలుగా జరుగుతున్నాయి. మరణానంతరం మనిషి శరీరంలో జరిగే మార్పులను ఉపయోగించి కొత్త చికిత్సలు కనుగొనడం. ప్రాజెక్ట్ కోడ్: ‘Project Phoenix’. రీసెర్చ్‌లో భాగంగా జరుగుతోంది.” రాహుల్ చెపుతున్నాడు..

“మామూలు మనుషుల అవయవాల అంతర్జాతీయ ధరలు

అవయవం  సగటు ధర (USD) సుమారు (₹)
కిడ్నీ  $100,000  ₹80 లక్షలు
హృదయం  $250,000  ₹2 కోట్లు
ఊపిరితిత్తులు  $150,000  ₹1.2 కోట్లు
లివర్ భాగం  $150,000  ₹1.2 కోట్లు
కంటి కార్నియా  $20,000  ₹16 లక్షలు
అరుదైన రక్త నమూనా  $5,000 – $10,000 ₹4–8 లక్షలు

నాన్న మీద అవయవాలపై టెస్టులు, బ్లడ్ సాంపుల్స్, DNA మార్పులు, రీ-జనరేషన్ ట్రయల్స్ అన్ని ప్రతి రెండు రోజులకు ఆయనకు జరుగుతున్నాయి. అన్నిటికీ సంబంధిచిన ఆయన కన్సెంట్ ఆయనే ఇచ్చినట్టు మొత్తం సంతకాలు ఆయనతోనే పెట్టించాము కూడా. ఇక గొడవలేదు. ఇవన్నీ కూడా ఆయనకు చెప్పకుండా జరుగుతున్నాయి. కేవలం అవి ‘నువ్వు తిరిగి బతికావు కనుక గవర్నమెంట్ సలహా మీదా చేస్తున్నాము’ అని చెప్పాను. నమ్మారు.

ఒక్కసారి రిజల్ట్స్ వచ్చాక ఆయన్ని పూర్తిగా ఆ ల్యాబ్ కు ఇచ్చేస్తా. వాళ్ళు పూర్తిగా పాడైన అవయవాలకు ఈయన అవయవాల నుండి జెనరేట్ చేసిన సెల్స్ ఎక్కించటం వల్ల అవి అద్భుతం తయారవుతాయి. చనిపోయి తిరిగి వచ్చిన ఈయన అవయవాల ధర లేదా దాని ద్వారా తయారయిన సెల్స్ ఎక్కవ ధర పలుకుతాయి. అంతే కాదు,.” ఇంకా ఏదో చెప్పటానికి కొన్నిక్షణాలు వ్యవధి తీసుకున్నాడు రాహుల్.

“కాస్త ఆగండి, ఆయన పేరున 15 కోట్లకు ఒక కంపెనీ ఇన్సూరెన్స్ కూడా చేసింది. అదే పూర్తిగా ఆ డబ్బు మనకు లీగల్‍గా రావటం కొరకు ఆయన్ని ఆ ల్యాబ్‌కే ఇస్తున్నాం. ఆయన పోగానే ఆర్గాన్స్ మీద, ఇన్సూరెన్స్ ద్వారా మనకు ఇంకో రకంగా చాల డబ్బు వస్తుంది. ఆయన తిరిగి బ్రతికినందువల్ల, ఆయన రక్తంలో ‘Regeneration markers’ ఉన్నాయా అని టెస్టులలో కొంత తేలింది. రక్తంలో ప్రత్యేకమైన ప్రోటీన్లు లేదా ఆటో-హీలింగ్ సెల్స్ ఉండటం ల్యాబ్‌లో గమనించారు” చెప్పటం మధ్యలో మళ్ళీ ఆపాడు రాహుల్.

“ఆయన అవయవాలను తీసి రీసెర్చ్ చేస్తే, ‘మరణం తర్వాత కూడా పనిచేసే కణజాలాలు’ (Tissues) ఉన్నాయని తెలుస్తోంది. ఆ కణాలను, ప్రపంచంలో ఆత్యంత ధనవంతులకు ఇస్తారు. మనకు దానిమీద 35% ఇస్తారు వాళ్లకు వచ్చిన రెవెన్యూలో.”

రాహుల్ చెపుతున్నంత సేపు కుటుంబం మొత్త విప్పారిన నేత్రాలతో, సంతోషంగా వింటున్నారు. అనిరుధ్‌కు, ముకుంద్‌కు కూడా ముందే ఇవన్నీ తెలుసు. అక్కడ వాళ్ళు కేవలం లెక్కలు మాట్లాడుకుంటున్నారు.

సుజాత ముఖం గమనించిన అనిరుధ్, “అమ్మా! ఆలోచించు, నాన్న ఇంటి మీద అప్పు తప్ప ఏమి మిగిల్చాడు? ఇన్నేళ్లు మేము అమెరికాలో సంపాదించింది  కూడా ఏముంది? కనీసం ఇప్పుడైనా ఆయన ఇలా ఉపయోగ పడుతున్నాడు. అడ్మన్డ్ హిల్లెర్ నిన్ననే కాల్ చేసాడు, ఈ అవయవాలను ప్రత్యేక VIP పేషెంట్స్‌కి, బిలియనీర్లకీ, పొలిటికల్ లీడర్లకీ అమెరికాలో అమ్మాలని ప్లాన్ జరుగుతోంది. అది మరొక ప్లాన్. అప్పుడు మనకు డబ్బు డాలర్లలో ఇస్తారు” అన్నాడు.

రాహుల్‍ను ఇప్పుడు కుటుంబం మొత్తం ఆరాధనగా చూస్తున్నారు.

డబ్బు అనే అగ్నిజ్వాల ముందు బలహీనతలు, లోపాలు, పాపాలు అన్నీ క్షణాల్లో దహనమైపోతాయి. డబ్బు చేతిలో ఉన్నవాడు, తన దోషాలన్నీ ఆ డబ్బుతో కడిగి పునీతుడై ప్రపంచానికి అద్భుతమైన వ్యక్తిగా కనబడతాడు. ప్రపంచం కూడా అతడిని అదే అద్దం, ‘డబ్బు అనే అద్దం’ లోనించి మాత్రమే చూస్తుంది.

అక్కడ కూడా అదే జరుగుతోంది..

రాహుల్ తొందరపడి మాట్లాడే వ్యక్తిలా, పెద్ద వ్యవహారం తెలియని వ్యక్తిలా కనపడటం లేదు అక్కడ ఎవరికీ!! ఒక ఆంతర్జాతీయ వ్యాపారిలా కనపడుతున్నాడు.

సుజాత ముఖ కవళికలు గమనించి, పెద్ద కొడుకు అనిరుధ్ అన్నాడు .

“అమ్మా, ఎక్కవ ఆలోచించకు. ఏమి చేస్తాం చెప్పు? మేము ఇక్కడ ఉండలేము. అయన పోతే ఇన్సూరెన్స్ డబ్బుతో, ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో ముగ్గురం సొంత ఇళ్లకు అడ్వాన్స్ ఇద్దామని అనుకున్నాము. అయన చేసిన అప్పులు తీర్చి, ఏమన్నా మిగిలితే మేము పంచుకుందాం, ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. అయన బతికి అన్ని ప్లాన్‌లను తలకిందులు చేసాడు. నిన్ను మాతో తీసుకుని పోతాము. ఇప్పుడు అటు ఇటు కానీ పరిస్థితి. చూద్దాం ఆ ల్యాబ్ వాళ్ళతో అగ్రిమెంట్ ప్రకారం అయన అవయవాలు వాళ్లకు రాసి ఇచ్చాం. ఆయన మీద ప్రతి రోజు జరుగుతున్న టెస్టులు ఆయనకు తెలియవు. కేవలం బతికి వెనక్కు రావటం వల్ల, ఏమన్నా వైరస్ ఉందేమో అని టెస్ట్ చేస్తున్నారు అని ఆయను నమ్మించాను” అనిరుధ్ చెప్పుకుంటూ పోతున్నాడు.

“ఐతే ఎలా అయన సహజంగా పోతేనే మీకు ఆర్గాన్ హ్యాండోవర్ చేసే పరిస్థితి కదా?” అడిగింది సుజాత. “ఆయన చూస్తే చాల ఆరోగ్యంగా ఉన్నారు” అంది.

“అలా ఏమి లేదమ్మా, అయన ఏదైనా కారణంగా చనిపోయినా పర్వాలేదుట. ల్యాబ్ వాళ్ళు చెప్పారు.”

“దానికి ల్యాబ్ వాళ్ళతో మాట్లాడి ఒక ప్లాన్ వేశాము. చెపుతాను” అన్నాడు ముకుంద్.

ఏమిటి అన్నట్టు చూసారు అందరూ.

“Krait అనేది ఒక జాతి స్నేక్. ఈ పాము కుడితే నొప్పి కూడా తెలియదు. అసలు కుట్టినట్టు కూడా తెలిసిరాదు. అదిగో ఆ పామును వాడాలి అనుకుంటున్నాం. సైలెంట్‌గా చనిపోతారు. ఊళ్ళోవాళ్ళకు అనుమానం రాదు. పూర్తిగా ల్యాబ్ చేతిలో ఉంది కనుక అది పెద్ద ప్రాబ్లెమ్ కూడా కాదు. చనిపోయి, టాక్సిన్ వల్ల ఇతర ఆర్గాన్స్ దెబ్బ తినకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.”

“అలానా? అప్పుడు ఈ పాములు గోల ఎందుకు? డైరెక్ట్‌గా ఇంజక్షన్ ఇవ్వవచ్చుగా?” కూతురు అన్నది.

“అలా కాదు, ఇంజక్షన్ కన్నా పాము బెటరట. ఒకవేళ చివరి క్షణంలో ఏదన్నా ఇబ్బంది వస్తే పామును సాకుగా చూపించవచ్చు అన్నారు. ఆయన పోయాక, అయన పేరున గుడి కట్టించి వదిలేస్తే, జనాలు భజన చేసుకుంటూ బతికేస్తారు. ఆ గుడికి కూడా చందాలు వాళ్ళ దగ్గర నుండే వసూలు చేసికోవచ్చు కూడా.”

అల్లుడి మాటలకూ సరే అన్నారు. కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా, బానే ఉన్నట్టు అనిపించింది సుజాతకు. సరే అన్నట్టు తలాడించింది సుజాత.

“మా అమ్మ మంచిది” అన్నది కూతురు రమణి. కోడళ్ళు ఇద్దరు వంత పాడారు.

***

“ఇవన్నీ నీకెలా తెలుసు?” చిరునవ్వుతో అడిగాడు ఆ యువకుడు. అతని ముఖం – అన్నీ ముందే తెలిసినవాడిలా – కొంటెగా ఉన్నది. దేదీప్యమానమైన కాంతి అతని చుట్టూ లీలగా కనపడుతోంది.

ఇదేమి పట్టని రాజారావు గద్గద స్వరంతో అన్నాడు – “నా పిల్లలు నా గురించి ఇలా అనుకుంటారు అని ఉహిచలేదు.”

కొమ్మలన్ని విరిగిపోయి ఉన్న మానులా ఉన్నాడు రాజారావు. ఎన్నో ఏళ్ళు గూడు కట్టుకున్న నమ్మకం ఒక్కసారి కూకటివేళ్ళతో కూలిపోతే ఉండే బాధ అది.

“నా కొడుకులు, కూతురు, అల్లుడు..” ఏదో చెప్పాలన్నా, అతని గొంతుక దుఃఖంతో పూడుకుపోయింది.

తిరిగి అడిగాడు ఆ యువకుడు.

“నాకు తెలుసు, కానీ నీ నోటా వినాలి అని”. మళ్ళీ కొంటెతనం.

ఆ కొంటెతనం వెనుక ఏదో అద్భుతమైన విషయం దాగుందని రాజారావుకు తెలియదు.

“ఇవన్నీ నీకు ఎలా తెలుసు?”

మధుర వాక్సుధా మందార మకరందమయ్యాయి ఆ మాటలు.

అప్పుడవి ‘సౌమ్యాధికార మాధుర్య స్వరములు’.

రాజారావు చిన్నగా చెప్పటం మొదలు పెట్టాడు.

“నేను, పొరుగూరు వెళ్ళొచ్చి, కాళ్ళు కడుక్కుని, పెరట్లో నించి లోపలి వచ్చి పక్క గదిలో కూర్చున్నానన్న విషయం తెలియక, నా కుటుంబం అంత కూడి మాట్లాడుతున్నప్పుడు విన్నాను. సంధ్య వెలుగులో వాళ్ళు నన్ను గమనించలేదు. వాళ్ళ మాటలు నాకు ఆ నిశబ్ద సాయంత్రం పూట.. నన్ను గొడ్డలితో నరికితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అన్నిటికన్నా బాధాకరం, నా భార్య వాళ్ళ తప్పును సమర్థిస్తున్నటు ప్రవర్తించటం. నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది. వాళ్ళ దగ్గిరకు వెళ్లకుండా – తిన్నగా నీ కోసం వచ్చాను. గంటన్నర నుండి నీ కోసం నిరీక్షణ..” రాజారావు చెప్పుకుంటూ పోతున్నాడు.

ఇవన్నీ తెలిసినట్టు చిత్రంగా చూసాడు ఆ యువకుడు.

“నువ్వు నా ప్రపంచం లోకి వచ్చిన అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకునే తరుణం వచ్చింది.” అన్నాడు.

ఆ యువకుడు రాజారావు నుదిటిని బొటనవ్రేలితో తాకాడు.

రాజారావు అద్భుతమైన అనుభూతికి లోనయ్యాడు. తాను, తనతోపాటు పరిసరాలు గిరగిరా తిరుగుతున్న అనుభూతి..

రాజారావు చీకటిలో నడుస్తూ ఒక ‘మహద్ భయానక’ ప్రాంగణానికి చేరుకున్నాడు. అక్కడ రెండు మహాద్వారాలు కనిపించాయి. ఒకటి వెలుగుతో నిండిన స్వర్గద్వారం. మరొకటి నలుపు మసిబారిన గోడలతో ఉన్న నరకద్వారం. ‘మహద్ భయానక’ ప్రాంగణ మధ్యలో ఒక విచారణ మందిరం ఉంది.

అది నరక ద్వారం వైపుకు లేదు, స్వర్గ ద్వారం వైపుకు లేదు. మధ్యలో ఉంది. ఆ మందిరంలో ఒక పక్క ఎత్తైన సింహాసనం ఒకటి ఉన్నది.

ఒక తేజోవంతమైన కాంతి పుంజం అక్కడ ఒక ముద్దలా ఉన్నది. మరే ఇతర ఆకారం లేదు. రాజారావుకు ఇప్పడు రాగ ద్వేషాలు, భయ, భావాలూ కలగటం లేదు. ఒక రకమైన ట్రాన్స్‌లో ఉన్నాడు. తెలుస్తోంది.

తాను అక్కడకు రావటం, తనలో తనే అనుకున్నాడు.. ‘ఏమిటీ అసలు ఇది? తనకు ఏ భావం కలగడం లేదు.’

ద్వారాల ముందు అనేకమంది దేవదూతలు, యమదూతలు నిలబడి ఉన్నారు. ఎవరో కొంతమంది తన ముందు నుండి ఒక ఇరవై మూడు ఏళ్ల యువకుని స్వర్గ ద్వారం వైపు తీసుకు పోతున్నారు.

ఇప్పుడు తనవంతు అన్నట్టు అక్కడున్న ఒక దేవదూత చెప్పాడు.

రాజారావు “ఎక్కడికి వెళ్లాలి? స్వర్గమా? నరకమా?” అని తేజోవంతమైన ఆ కాంతి పుంజాన్ని అడిగాడు.

ఒక పక్క నిలబడిన తెల్లగా మెరుస్తున్న బట్టలు ధరించిన దేవదూతలు, మరో పక్క నలుపు తెలుపు కలసిన బట్టలు ధరించిన అందమైన యమదూతలు ఉన్నారు.

ఒక విషయం రాజారావుకు అర్థమయ్యింది. తన గురించి పూర్తి వివరాలు అక్కడ చర్చిస్తారు అని. సమవర్తి దానిని విని తీర్పు ఇస్తాడు అని.

“ఆయన నిజాయితీగా జీవించాడు. కుటుంబానికి కష్టాల్లో నిలబడ్డాడు. సమాజంలో ఆయనను గౌరవించారు. స్వర్గం దిశగా తీసుకెళ్లాలి.”

కాంతి స్వరూపంలో ఉన్న ‘పితృపతి’ వింటున్నట్టు గమనించి, “కానీ ఆయనకు కూడా లోపాలు ఉన్నాయి. ఆర్థిక లోభం, పిల్లలతో కొన్నిసార్లు కఠినత, ఇతనివల్ల కొందరికి అన్యాయం జరిగింది. జీతం తీసుకుని ఉద్యోగం కూడా సరిగా చెయ్యలేదు. నరకానికి వెళ్లక తప్పదు.” దూతలు అన్నారు.

రాజారావును మధ్యలో నిలబెట్టి విచారణ మొదలుపెట్టారు.

చాలాసేపు జరిగిన చర్చ తరువాత చివరకు తాను నరకానికి వెళ్ళాలని అర్థమయ్యింది రాజారావుకు.

సత్య సింహాసనం మీద ఉన్న తేజోవంతమైన కాంతిలో ఏ మార్పు లేదు.

“రాజారావు, నువ్వు చెప్పాలిసినది ఏమన్నా ఉన్నదా?” అన్నది ఓ స్వరం. అది విన్న రాజారావు,

“స్వర్గం, నరకం రెండూ మీరు ఇచ్చే ఫలితాలు. కానీ నేను ఇప్పటివరకు చేసిన జీవితం పూర్తి అవగాహన లేకుండా గడిపాను. మీ వాదన విన్నాక నా స్వీయ గౌరవం గురించి, నేను ప్రయాణం చేసే దారుల గురించి, తప్పొప్పుల గురించి నాకు తెలిసాయి. నా మనసు ఎప్పటికీ ప్రశ్నించేది ‘నేను ఎవరు? నా జీవన ప్రయోజనం ఏమిటి?’ అని. నాకు ఇంకా జ్ఞానం కావాలి. తప్పులు ఒప్పుకుంటున్నాను. మీరు నాకు శిక్ష వేయవచ్చు కానీ ఆ తప్పులను సరిచేసే ‘వివేకం’ నాకింకా రాలేదు. స్వర్గానికి వెళ్లాలంటే నాకు జ్ఞానం అవసరం. నరకానికి వెళ్ళడం కంటే ఆ జ్ఞానాన్ని నేర్చుకుని ముందుకు వెళ్లడం మేలు. మీరు నన్ను శిక్షిస్తే, అది నన్ను మార్చదు. కానీ మీరు నాకు ‘జ్ఞానం’ ఇస్తే నేను మారుతాను. మారిన తర్వాత నరకానికి వెళ్తాను, అలా వెళ్ళటమన్నది నాకు తృప్తి నిస్తుంది. అసంతృప్తితో నరకానికి వెళ్ళటం కన్నా సంతృప్తితో వెళ్ళటం మంచిదని నా అభిప్రాయం” రాజారావు నిజాయితీతో కూడిన తర్కంతో అడుగుతున్నాడు.

ఆ వాక్యాలు విన్న వెంటనే ఆ ప్రాంగణంలో నిశ్శబ్దం కమ్ముకుంది.

సత్య సింహాసనం నుండి ఏమి ఆజ్ఞ వస్తుందా? అని వాళ్ళు ఆలోచిస్తున్నారు.

సత్య సింహాసనం మీదనున్న ఆ అద్భుత కాంతి పుంజం నుండి కొన్ని మధుర వాక్యాలు వెలువడ్డాయి.

“రాజారావూ, నీ మాటలు ‘మధుర వాక్సుధా మందార మకరంద స్వరములు’. నిజమైన తీర్పు శిక్ష కాదు, నీకు అవకాశం ఇవ్వటమే. నువ్వు అడిగిన జ్ఞానమే నీకు అవసరం. స్వర్గానికి వచ్చే ముందు ఆత్మవిశ్వాసం, వివేకం, సత్యాన్వేషణతో కూడిన జ్ఞానం అవసరం. అలానే నరకానికి వెళ్లే ముందు ‘అజ్ఞానం’, ‘బంధనాలు’ విడదీయాలి. ఏది ఎందుకు అని విపులత రావాలి. కాబట్టి నీకు మరో ఆరు నెలల జీవితం ఇస్తున్నాను. ఈ సమయంలో నువ్వు ఒకసారి మాత్రమే దేవదూత రూపంలో వచ్చే ఆ యువకుణ్ణి కలుస్తావు.

అదే నీ జ్ఞాన యాత్రకు తాళం చెవి. ఆ ఒక్కసారే ఆయనను పిలిచే జ్ఞానం వస్తుంది. ఆయన ఇచ్చే జ్ఞాన సూత్రాలు తెలుసుకున్నాక, వాటితోనే నీ మోక్ష ద్వారం తెరుచుకుంటుంది. అప్పటివరకు నీకు కొంత తెలుస్తూ ఉంటుంది. కానీ పూర్తిగా నువ్వు ఎక్కడనుండి వచ్చావో అన్నది మధ్య మధ్య మరపుతో ఉంటుంది.”

ఆ తీర్పుతో రెండు ద్వారాలు మూసుకుపోయాయి. రాజారావు తన శరీరంలోకి తిరిగి వచ్చాడు.

ఆయన కళ్ళు తెరుచుకున్నప్పుడు మళ్ళీ శ్మశానంలోని రావిచెట్టు కింద కళ్ళు తెరిచాడు.

రాజారావు చెపుతున్నంత సేపు, చిరునవ్వుతో వింటున్న ఆ యువకుడు.. రాజారావుతో అన్నాడు “ఇప్పుడు నీకు గుర్తుకు వచ్చాయి కదా? అసలు నువ్వు ఎందుకు వచ్చావూ? అన్నది. నీవు కేవలం నా దగ్గరకీ రమ్మని చెప్పిన విషయం తప్ప ఎందుకు వస్తున్నది మరచి పోయావు. అందుకే నీకు గుర్తు చేశాను.

నీవు అనుకున్నావు, జ్ఞానంలో పరిపూర్ణతకు నీ ఇంట్లో జరిగిన అనుభవాలు ఒక ఎత్తు ఐతే, నువ్వు తెలుసుకోవలసినవి ఆరు సూత్రాలు నీకు చెపుతాను విను.

ఒకటి: స్వాత్మబోధం (Self-Realization)

ఆత్మను తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మనిషి తన మేధస్సు, తర్కం మీద ఆధారపడాలి. నిజానికి నీ కుటుంబంలో అందరు నీ మీద ప్రేమ వల్లే నిన్ను అభిమానిస్తున్నారు, ఇష్టపడుతున్నారు అనుకున్నావు. తార్కికంగా ఆలోచిస్తే, నువ్వు ఉపయోగపడకపోతే నీ గురించి ఆలోచించే అవసరం ఆ కుటుంబానికి ఉండదు. నిజం ఏమిటి అనేది తెలుసుకోవటం జ్ఞానం. దానికి తర్కంతో ఆలోచించటం తోడ్పడుతుంది.

రెండు: ధర్మబద్ధ స్వార్థం (Rational selfishness)

ధర్మం రక్షతి రక్షితః. నిజమైన స్వార్థం ధర్మబద్ధంగా ఉంటే సమాజాన్నీ కాపాడుతుంది. స్వార్థం పాపం కాదు; అది సృజనాత్మక శక్తి. నువ్వు ధర్మబద్ధమైన స్వార్ధంగా ఆలోచించటం లేదు అంటే నీకు ఉన్నతి, అభివృద్ధి ఉండదు.

మూడు: కర్మ బలం (Power of Action)

కర్మణ్యేవాధికారస్తే. ఫలితంపై కాకుండా కర్మపై దృష్టి పెట్టాలి. ఉత్పాదక కర్మ, సృష్టి అదే మనిషి విలువను నిర్ధారిస్తుంది. ఉత్పత్తి చేస్తున్నంత సేపు ఫలితం మీద దృష్టి పెడితే సరిగా కర్మ నిర్వహించలేవు.

నాలుగు: సత్యాన్వేషణ (Pursuit of Truth)

సత్యమేవ జయతే. సత్యమే గెలుస్తుంది. అబద్ధం, భ్రమ మీద జీవితం నిర్మించరాదు. నువ్వు నీతో కలిపి అందరిది ప్రేమే, స్వార్థం లేదు అని నమ్మతే అది అబద్ధం. ఆ అబద్ధం మీద బంధాలు నిలబడవు. ఇవి తెలిసి కూడా నువ్వు తామరాకు మీద నీటి బొట్టు మీద ఉన్నట్టు జీవించటమే సత్యాన్వేషణ.

ఐదు: స్వాతంత్ర్యం (Freedom & Independence)

మోక్షం అంటే బంధనాల నుండి విముక్తి. బానిసత్వం లేదా ఇతరుల నియంత్రణలో జీవితం వృథా. నీకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా, సంతోషంగా జీవించటమే నిజమైన జీవనం, జీవితం.

ఆరు: ఆనంద స్ఫూర్తి (Joyful Existence)

ఆనందో బ్రహ్మేతి. బ్రహ్మమే ఆనందం. The purpose of life is man’s own happiness. ఎన్ని చేసినా, ఎన్ని చూసినా, ఎంత కష్టం అనుకున్నా, ఏది ఏమైనా అనందం ఫైనల్ డెస్టినేషన్.”

చెప్పటం పూర్తి చేసాడు ఆ యువకుడు.

రాజారావు ఇప్పుడు ఒక జ్వలజ్జ్వలిత శక్తి రూపుడై నిలిచాడు. ఆ క్షణంలో ఆకాశాన్నంటిన మెరుపు ఒక్కసారిగా విరబూసింది. చుట్టూ ఉన్న ప్రకృతి తన స్వరూపాన్ని విడిచి, ఒక అపారమైన ఆధ్యాత్మిక మాయాజాలంలో మునిగిపోయింది. మంచు మేఘములు పరచుకున్నట్టు శ్వేతావరణం వ్యాపించి, మూలమై వీస్తున్న మారుత గంధం, జంజామరాల రాగం! వృక్షములన్ని భక్తిప్రణామములలో తలవంచినట్టుగా వంగిపోయాయి. ఆకాశం నుండి జ్యోతిర్మయమైన ఒక కాంతి రేఖ, భూమిని ఆకాశంతో కలిపిన మహోత్కృష్ట తేజోనాడివలె ప్రసరించింది.

ఆ జ్యోతిరేఖ రాజారావు శిరస్సుపై ప్రసరించగానే అతని శరీరం అంతా కాంతి కిరణాలతో నిండి పోయింది. తేజోవలయములు, జ్యోతిబిందువులు అతని దేహమంతా విరజిల్లుతూ ఒక ప్రకాశోద్భాసిత దివ్యవలయం సృష్టించాయి.

ఆ కాంతి తరంగములతో ఏకమై, రాజారావు ఆ జ్వలజ్వలిత కాంతి పుంజముతో ఊర్ధ్వలోకాలకు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభించాడు.

Exit mobile version