Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మా అమ్మ సూట్‌కేస్

[ఆంగ్లంలో బిశ్వబంధు మొహాపాత్ర రచించిన కథని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి.]

“రమేష్ నన్నసలు పట్టించుకోడు. వాడి పెళ్ళాం రీటా టైమ్ సరీగ అన్నమే పెట్టదు. నేనంటే ఇక్కడ అంత నిర్లక్ష్యం.” మా అమ్మ ఫిర్యాదులిలా మొదలవుతాయి. నా పేరు మొదటి ముద్దాయిగా వస్తుంది. ప్రతి సారీ నా తమ్ముడు నిఖిల్ అమ్మను చూడ్డానికి వచ్చినప్పుడల్లా అమ్మ తన బాధలు చెప్పుకుంటుంది. అలా చెప్తున్నప్పుడు అమ్మ గొంతులో కొంచెం వణుకు ఉన్నా, ఎన్నో నెలలనుంచి వాడితో వెళ్ళబోసుకోడానికే ఆ సంగతులన్నీ మూటగట్టి పెట్టుకున్నట్టు స్పష్టంగా కూడా ఉంటుంది.

నిఖిల్ మౌనంగా విన్నాడు. వాడి ముఖం నిస్సహాయంగా ముడుచుకుపోయినట్టుంది. నేను బయట నుంచుని ఉన్నాను. అన్నీ వింటూ. నా మనసు బరువెక్కింది. రీటా వంటగదిలో ఉంది. ఏమీ విననట్టు ఉన్నా, ప్రతీ మాటా ఆమె చెవినబడుతోందనీ, అది అమె గుండెను చీల్చేస్తోందనీ నాకు బాగా తెలుసు. ఆమె వీలైనంత బాగా అమ్మకు సేవ చేయాలనే చూస్తుంది. కానీ అదే మాత్రం గుర్తింపుకు రాదు. ఆమె కోసం ఎన్ని కప్పుల టీ చేసినా, ఆమె మోకాళ్ళకు ఎన్ని సార్లు మర్దనా చేసినా మా అమ్మకు ఆమె పట్ల సదభిప్రాయం లేదు.

“నిఖిల్! నీతో తీసుకెళ్ళరా నన్ను. నీ దగ్గర నాకు సంతోషంగా ఉంటుంది.” అంటుంటే అమ్మ గొంతు జీరబోయింది.

నేలచూపులు చూస్తూ నించున్నాను. ఈ మాటలన్నీ నాకు బాగా ఎఱుకే. నిఖిల్ వచ్చినప్పుడంతా ఇదే విధంగా వేడుకుంటుంది ఆమె. ప్రతీసారీ నిఖిల్ కర్తవ్యానికీ, పెళ్ళాం అభ్యంతరానికీ మధ్య నలిగి, “వచ్చే సారి. వచ్చే సారి నిన్ను నాతో తప్పకుండా తీసుకెళ్తానమ్మా” అంటూ అదే హామీ ఇస్తాడు.

అయినా, అలసిన అమ్మ కళ్ళలో ఆశ చమక్కుమనడం ప్రతీసారీ కనిపిస్తుంది. మలిగిపోయే వెలుగే అది, వచ్చేసారి అనేది ఎప్పుడూ రాదు కాబట్టి.

ఏటికేడు అమ్మ బలహీనపడుతూనే ఉంది. రక్తపోటు, కీళ్ళనొప్పులు, పంటినొప్పి ఇలా ఎన్నో ఆరోగ్యసమస్యలున్నాయామెకు. ఈమధ్య క్రమంగా పెరుగుతున్న చెవుడు వల్ల మాట్లాడడంలో మరీ చిరాకు. ఆమెను జాగ్రత్తగా చూసుకోడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ ఆమె అసంతృప్తి ఎప్పుడూ నీడలా తారట్లాడుతుంటుంది ఇల్లంతా. ముఖ్యంగా మా నాన్నగారి మరణం తర్వాత, విషయమేదైనా అమ్మ లోపల్లోపలే కుమిలిపోతుంటుంది.

మా అమ్మాయి దివ్య ఇక్కడున్నప్పుడు, ఆమెకు కొంచెం బాగుండేది. అవ్వ, మనవరాళ్ళ మధ్య మంచి అనుబంధం ఉండేది. దివ్య చుట్టుపక్కల ఉన్నప్పుడు అమ్మ చిన్నగా నవ్వేది, పెద్దగానూ నవ్వేది. తన జబ్బుల్ని కూడా మరిచిపోయేది తాత్కాలికంగా. అయితే ఆరునెల్ల కిందట దివ్య కాలేజ్ జాయిన్ కావడానికి వెళ్ళిపోయింది. అప్పట్నించీ మా యిల్లు మూగబోయింది. వెలుగేదో తగ్గినట్టైంది.

క్రితం సారి దివ్య వచ్చి మళ్ళీ హాస్టల్‌కు వెళ్ళేప్పుడు మా అమ్మ చిన్నపిల్లలా ఏడ్చింది. దివ్యను గట్టిగా కావలించుకుని, “వచ్చేసారి నీవు వచ్చేవేళకు నేను ఇక్కడ ఉంటానో లేదో” అంది. తర్వాత తన సూట్‌కేస్ తెరచి, మడచిపెట్టిన ఒక ఐదువందల రూపాయల నోటు తీసి దివ్య చేతిలో కుక్కింది. వాళ్ళిద్దరూ కావలించుకోవడం, అమ్మ వెక్కి వెక్కి ఏడవడం, దివ్య అమ్మను దగ్గరగా పొదువుకోవడం – ఈ దృశ్యమంతా కలిపి నా జీవితమంతటికీ ఎంతో మార్దవంగా, గుండెను పిండేసేదిగా నా మదిలో నాటుకుపోయింది.

తులసీపూర్ లోని మా యింటికి నిఖిల్ మూడునెల్లకొకసారి వస్తుంటాడు. అమ్మ వయసును, ఆరోగ్య స్థితిని గమనించి ఆందోళన పడుతుంటాడు. ఓపిగ్గా ఆమె బాధలన్నీ వింటాడు, డాక్టర్ దగ్గరికీ తీసుకెళ్తాడు. మందులు ఇప్పిస్తాడు. ఆమె చేతిలో కొంత డబ్బు కూడా పెడతాడు. కానీ అమ్మకు కొంచెం మార్పు కోసం వాడితో పాటు రూర్కెలా వెళ్ళాలని ఉంది. ఇక్కడ ఆమెకు చాలా అశాంతిగా ఉంటోంది.

అమ్మ మళ్ళీ అడిగింది, “నేను సూట్‌కేస్ సర్దుకోనా?”

“ఇప్పుడు కాదమ్మా. నేను ఆఫీసు టూర్ కోసం బయటూరుకు వెళ్ళాల్సి ఉంది. వచ్చేసారి వచ్చినప్పుడు, నాతో పాటు తీసుకెళ్తాను.” అని నిఖిల్ ప్రామిస్ చేశాడు. వాడి నిస్సహాయతను నేనర్థం చేసుకోగలను. వాడి పెళ్ళైన కొత్తలో అమ్మ వాడితో కలిసి ఉన్నప్పుడు, కొన్ని గొడవలు జరిగాయి. వాడి భార్య వర్ష అమ్మనెప్పుడూ గౌరవించలేదు. ఆమె అమ్మను పట్టించుకోనేలేదు. కొన్నిసార్లు మనసు తీవ్రంగా గాయపడేలా హేళన కూడా చేసింది. అలాగే చేదును మింగి కొన్ని నెలలు గడిపాక అభిమానం దెబ్బ తిని, కుంగిపోయి మా అమ్మ ఇక్కడ తులసీపూర్‌కే వచ్చేసింది. అప్పటినించి నిఖిల్‌కు అమ్మను మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళేందుకు ధైర్యం చాలనేలేదు.

కానీ ప్రతిసారీ ప్రామిస్ మాత్రం చేస్తాడు. దాంతో మా అమ్మకు ఎప్పటికప్పుడు ఆశ చిగురేస్తూనే ఉంటుంది.

ప్రతీసారి నిఖిల్ వెళ్ళిపోయాక ఆమె తన సూట్‌కేస్ సర్దుకోవడం మొదలుపెడుతుంది. తన చీరలన్నీ జాగ్రత్తగా మడత పెడుతుంది. తన మందులన్నీ తగినన్ని తెప్పించుకొంటుంది. తన ఉలెన్ శాలువా కూడా పెట్టుకుంది. ఇక ఆ సూట్‌కేస్ తన పరుపు పక్కనే పెట్టుకొని నిద్రపోతుంది. ప్రయాణానికి సిద్ధంగా.

సూట్‌కేస్ లో ఏదో సర్దుతూ అమ్మ కనిపించినప్పుడల్లా నా గొంతులో ఏదో పట్టేసినట్టుంటుంది. ఆ దృశ్యం చిన్ననాటి జ్ఞాపకాలను కదిలిస్తుంది. ప్రతీ వేసవిలో అదే సూట్‌కేస్ లో అమ్మ మా బట్టలను, ఇంకా అవసరమైన సామాన్లను సర్ది, మమ్మల్ల్ని ప్రతీ ఏడాది వాళ్ళ పుట్టింటికి అంటే మా తాతగారింటికి బారీపాడాకు తీసుకెళ్ళేది. అవి ఎంత సరదా రోజులనీ! మా కజిన్స్ అంతా వచ్చేవాళ్ళు. నవ్వులతో ముంగిలంతా నిండిపోయేది. మాకు కాళ్ళు నొప్పులు పుట్టే దాకా ఆడుతూనే ఉండేవాళ్ళం.

కాల ప్రవాహంలో ఆ రోజులన్నీ కొట్టుకుపోయాయి. మా అమ్మమ్మ, తాతగార్లు లోకం విడిచి ఏళ్ళు గడచిపోయాయి. తర్వాత క్రమంగా ఆ ఇల్లు ఖాళీ అయిపోయింది. తర్వాత కూలిపోయింది. అందరూ కలవడమూ తగ్గిపోయింది. మా నాన్నగారు కూడా కొన్నేళ్ళ క్రిందట కాలం చేశారు. అప్పటి నుంచీ మా అమ్మ లోకం ఈ తులసీపూర్ లోని మా ఇంటి నాలుగు గోడలకు పరిమితమైంది. ఆ గోడలకున్న ఒకే సంతోషపు కిటికీ దివ్య రాక మాత్రమే.

ఒక సారి నిఖిల్‍తో అన్నాను నేను. “ఎందుకు ప్రతిసారీ తీసుకెళ్తానని నమ్మబలకడం, నిలబెట్టుకోలేనని తెలిసినప్పుడు? నీవు నెరవేర్చలేని హామీలివ్వడం మానేయ్. అది ఆమెనింకా బాధపెడుతుంది.”

నిఖిల్ నిట్టూర్చాడు. “ఇంకేం చేయగలనన్నయ్యా? అసలే వీలు కాదంటే, ఆమె తట్టుకోలేదు. కుప్పకూలిపోతుంది. కనీసం ఈ విధంగానైనా ఆమెకొక ఆశ మిగిలి ఉంటుందని..” అన్నాడు.

నేనేం మాట్లాడలేదు. వాడి ఇబ్బంది నేను అర్థం చేసుకున్నాను. మేం ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యాము. పక్వత అలవడింది. చిన్న పిల్లల్లా కొట్లాడుకోవడం లేదింక. ఒకరి ఇబ్బందులు ఒకరు గుర్తించగలుగుతున్నాం. అయినా అదే చక్రం తిరుగుతూనే ఉంటుంది. హామీలు, ఆశలు, ఎదురుచూపులు, నిరాశలు.

అయినా, ప్రతిసారీ మా అమ్మ తన బట్టలు మడిచి సూట్‌కేస్ లో పెట్టుకోవడం చూసినప్పుడల్లా, ఏదో తెలీని బాధ.

“నిఖిల్ తీసుకెళ్ళడం జరిగే పని కాదు. నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఆమె మాత్రం ఎదురుచూస్తూ ఉంటుంది.” జీవం లేని నవ్వుతో అంటోంది రీటా.

***

ఈసారి మరింత ఎక్కువ కాలం ఎదురుచూడాల్సొచ్చింది. నిఖిల్ రావాల్సి ఉండింది కానీ రాలేదు. మా అమ్మ మాత్రం తన సూట్‌కేస్ సర్దుకుందెప్పుడో. గుమ్మం నుంచి చూపు మరల్చడం లేదు. ఆశనిరాశలలో ఆమె కళ్ళు వెలిగి ఆరుతున్నాయి.

అమ్మ అసహనంగా ఉందని తెలుస్తున్నా ఏమీ చేయలేక నిస్సహాయునిగా ఉండిపోయాను. నిఖిల్‌కు ఫోన్ చేసి కనుక్కుంటే వాడో వారం నుంచి జ్వరంలో ఉండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని తెలిసింది. వాడు కూడా అమ్మ గురించి అడిగాడు. రాలేకపోయినందుకు అపరాధభావనతో మాట్లాడాడు. ఇవన్నీ అమ్మకు చెప్పొద్దనీ, తన సుస్తీ విషయం తెలిస్తే అమ్మ దిగులు పడుతుందనీ అన్నాడు.

నేను నిఖిల్‌తో మాట్లాడానని అమ్మకు చెప్పాను. ఏదో అర్జెంట్ అసైన్‍మెంట్ ఉండడంతో రాలేకపోయాడని చెప్పాను. అమ్మేమీ పట్టించుకున్నట్టు కనబడలేదు. ఆమె చూపులు సర్దిపెట్టి బెడ్ మీదుంచిన సూట్‌కేస్ మీదే ఉన్నాయి. ఏదేమైనా ఆమెకు మాతో ఉండడం సంతోషంగా లేదనేది తెలిసిందే. మా నుండి ఎలాగైనా దూరంగా వెళ్ళి రూర్కెలాలోని నిఖిల్ ఇంట్లో ప్రశాంతంగా, సౌకర్యంగా సంతోషంగా ఉండాలనుకుంటోంది.

కొన్నేళ్ళుగా అమ్మ చాలా మౌనంగా మారిపోవడం గమనిస్తూనే ఉన్నాను. ఎక్కువేమీ మాట్లాడడం లేదు. ఊరికే కూర్చుని ఉంటుంది. తన లోకంలో తానే ఉంటుంది. బయటి లోకం గురించి ఏమీ పట్టనట్టుగా. కోపమూ కాదు. దుఃఖమూ కాదు. ఎవ్వరితో కలవకుండా, ఎంత బెంగలో ఉంటుందంటే ఆ తీరే ఎన్నో సంగతులు విప్పి చెప్తుంది. ఒకప్పుడు వారిపోసిన ఆత్మీయత, ఇప్పుడెలా తనకు దూరమైపోయిందో! అపరిచితమైన, బరువైన ఒక నిశ్శబ్దంలో తానెంతగా కూరుకుపోయిందో! తన కళ్ళ నిండా విషాదమే. సద్దే లేని, ఎవరినీ ఏమీ కోరని ఒక నిరంతర విషాదం. కదలని నీడలా.

కాలం గడిచే కొద్దీ ఆమె వడలిపోయి బలహీనమైంది కానీ లోలోపల పాషాణమైంది. ఆమె చూస్తుంది. వింటుంది కూడా బహుశా. కానీ మాట్లాడేది చాలా తక్కువ. ఆమె మౌనం ఒక గోడ కట్టినట్టుంటుంది. అది ఏదో కావాలని చేసింది కాదు, బహుశా నిరాశ వల్ల లేదా వేసిరిల్లిపోవడం వల్ల లేదా బయటకు రాని వేదన వల్ల అయ్యుండొచ్చు.

ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు అపరాధభావన కలుగుతుంటుంది. చాలా సార్లు నేనే వెళ్ళి మాట్లాడించాలని ప్రయత్నిస్తాను. ఏవో రెండు ముక్కల్లో జవాబిచ్చి ఊరుకుంటుంది. కానీ ఆమె ముఖంలో భావాలు ఎన్నో ఎన్నెన్నో చెప్తాయి. కొన్ని సార్లు అర్థమౌతుంది. కొన్ని సార్లు కాదు.

కొన్ని రోజులు గడిచాయి. మళ్ళీ అలాగే అమ్మతో నేనేదో పిచ్చాపాటి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. తను సర్ది ఉంచిన సూట్‌కేస్ ను చూస్తూ, “అమ్మా, ఇవన్నీ లోపల పెట్టేయొచ్చు కదా! నిఖిల్ ఇప్పడప్పట్లో రాలేకపోవచ్చు.” అన్నాను.

కొన్ని నిముషాలు మౌనంగా ఉంది అమ్మ. ఉన్నట్టుండి మాట్లాడింది. “రమేష్, నిజానికి నేనింక రూర్కెలా పోవాలనుకోవడం లేదు. నేను బారీపాడా వెళ్ళాలనుకుంటున్నాను. మా నాన్నగారింటికి.”

ఆమె మాటలు నన్ను పిడుగులా తాకాయి.

“అమ్మా,” గొణిగాను. “అక్కడేమీ లేదమ్మా. ఎవరూ ఉండడం లేదక్కడ. ఇల్లు కూడా కూలిపోయుంటుందీపాటికి.”

కానీ ఆమె నిర్ధారించుకున్నట్టుంది. “నాకోసారి చూడాలనుంది. నేను పుట్టిందక్కడే. నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ తాజాగా ఉన్నాయింకా.” అంది.

నాకేం చెప్పాలో తోచలేదు. బలవంతంగా నవ్వు తెచ్చుకొని, “సరే, ఎప్పుడైనా వెళ్దాం.” అన్నాను.

ఆ ‘ఎప్పుడైనా’ అవసరం రానేలేదు.

అదే రోజు రాత్రి అమ్మ వెళ్ళిపోయింది. నిద్రలోనే.

***

నిఖిల్ రావడం ఆలస్యమవడంతో తర్వాతి కార్యక్రమాలు ఆలస్యమయ్యాయి. వాడు పూర్తిగా కుంగిపోయినట్టు బాగా తెలుస్తోంది. అమ్మను తీసుకెళ్తాననే తన హామీ నిలబెట్టుకోలేకపోయాననే అపరాధభావన బాగా దెబ్బతీసింది. విపరీతంగా ఏడుస్తున్న దివ్యను ఓదార్చడం కూడా కష్టమైంది. తన ముడుచుకుపోయిన ముఖం, కళ్ళలో ఆగని కన్నీళ్ళ వల్ల ఎఱుపు, వాపు, పెదవుల్లో వణుకు, ముఖంలో విషాదం.

అన్ని కార్యక్రమాలు ముగిశాక, నేను అమ్మ గదిలో ఒంటరిగా కూర్చున్నాను. ఆమె సూట్‌కేస్ శాశ్వతంగా మూతపడిందిప్పుడు. కదలకుండా, మౌనంగా ఉంది అటు మూలన గదిలో. ఒక జీవితమంతటిని తనలో ఇముడ్చుకున్నట్టుగా. దాని మీదున్న తోలుగుడ్డ గడచిపోతున్న కాలం కింద నలిగి మునుపటికన్నా మెత్తబడింది. చేసిన ప్రయాణాల ప్రయాసకు, పోగేసుకున్న జ్ఞాపకాలకు, హత్తుకున్న క్షణాలకు గుర్తుగా, దాని చివరలు మొద్దుబారాయి. నిండుప్రేమ. త్యాగంతో కూడిన జీవితానికి, ఒంటరిగా అమె పోరాడిన అనేక మౌన పోరాటాలకు మూగసాక్షిగా నిలిచింది.

ఆంగ్లమూలం: బిశ్వబంధు మొహాపాత్ర
అనువాదం: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

Exit mobile version