బాల అందమైన ఎనిమిదేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.
బాల – బాబాయి పెళ్లి
ఆ రోజు ఆదివారం.
బాల కనబడటం లేదు చాలా సేపటి నుంచి అని అమ్మ పెరట్లోకి వచ్చింది.
బాల కాళ్ళు చాపుకుని పాదాల మధ్య అద్దం పెట్టుకుని, పక్కన నూని సీసా పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకుంటోంది. చాతకాక జుట్టు పిచ్చుక గూడులా అవుతోంది.
అమ్మకి నవ్వు వచ్చింది. “నేను వేస్తా రావే” అంది.
బాల అడ్డంగా తలూపింది.
దీనికి ఈ అద్దం పిచ్చి ఏమిటో? అనుకుంది అమ్మ.
సాధారణంగా ఆడపిల్లలకి అద్దం అంటే ఇష్టం ఉంటుంది. బాలకి అలాగే అద్దమంటే ఇష్టం. కానీ ఈ మధ్య అది ఒక పిచ్చిలా ఎక్కువయ్యింది. ఇంట్లో ఉంటే అద్దం వదలదు. ఇంట్లో జనం ఎక్కువ కాబట్టి బాల చేతిలో అంతసేపు అద్దముంటే కష్టం. ఒకసారి బ్రతిమాలి, ఒకసారి కోప్పడి, ఒక్కోసారి ఏదైనా ఆశ చూపి తీసుకోవలసి వచ్చేది.
బాలకి అద్దం మీద ఈ మోజుకి ఇంకో కారణం ఉంది.
బాల వాళ్ళ ఇంటికి ఒక చాకలి ఉన్నాడు. అతనికి ఒక డ్రై క్లీనింగ్ షాప్ కూడా ఉంది. అందుకని అప్పుడప్పుడు బట్టలు తేవడం ఆలస్యం చేసేవాడు.
అలాంటప్పుడు త్వరగా తెమ్మని చెప్పటానికి ఎవరైనా వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో బాలను వెంట తీసుకెళ్ళేవాళ్ళు. లేకుంటే బాలే వెంటపడేది. వదలదు.
ఒకసారి నాన్నతో వెళ్ళింది. వీళ్ళు వెళ్ళేటప్పటికి అతను గోడవైపు తిప్పి ఉన్న బల్లపై ఇస్త్రీ చేస్తూ కనిపించాడు.
వెనక్కి తిరక్కుండానే నాన్నని సంబోధిస్తూ ఈ రోజు తెస్తానని చెప్పాడు. నాన్నకి ఆశ్చర్యం వేసింది.
తరువాత అర్థమయ్యింది
ఆ గోడకి పెద్ద అద్దముంది. అందులోకి చూసుకుంటూ ఇస్త్రీ చేసేవాడు. ఎవరైనా వచ్చినా వెనక్కి తిరిగేవాడు కాదు. అందులోకి చూసుంటూనే సమాధానం చెప్పేవాడు.
మొదట్లో ఎవరొచ్చారో వెనక్కి చూడకుండా సరిగ్గా వచ్చిన వాళ్ళని సంబోధిస్తూ ఎలా మాట్లాడుతున్నాడా అని సందేహం కలిగేది. తరువాత అద్దంలో చూసి మాట్లాడుతున్నాడని అర్థమయ్యింది. ఆ విషయం ఇంటిలో ఆడవాళ్ళకు చెప్పి నవ్వుకున్నారు.
అయితే బాలకి మాత్రం అతని పధ్ధతి చాలా నచ్చి౦ది. అందుకని తను కూడా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర స్టూల్ మీద కూర్చుని అద్దంలో చూసుకుంటూ హోం వర్క్ చేసుకునేది.
ఎవరైనా పిలిస్తే అందులో చూస్తూ సమాధానం చెప్పేది. అన్నం తప్ప (నాయనమ్మ ఊరుకోదు కాబట్టి) మిగతా పాలు, ఫలహారం అన్నీ అక్కడే చేసేది.
అందరూ నవ్వుకున్నప్పుడు నవ్వుకునేవారు. మందలించినప్పుడు మందలించేవారు.
ఒకరోజు బయట పిల్లలు ఆడుతున్న క్రికెట్ బాల్ అద్దాల కిటికీ లోంచి దూసుకొచ్చి అద్దానికి తగిలి, కిటికీ అద్దం, డ్రెస్సింగ్ టేబుల్ అద్దం రెండూ పగిలి పోయాయి.
ఆ రోజు బాలని ఓదార్చటం ఎవరి తరం కాలేదు. దాని ఏడుపు ఆపటానికి ఇంటిలో మగవాళ్ళు గడ్డం చేసికోవటానికి వాడే చిన్న అద్దం చేతిలో పెట్టారు.
బాలకి అది నచ్చకున్నా అప్పటికి ఇంకోటి లేదు కాబట్టి ఊరుకుంది.
అప్పటినుంచి మొదలయ్యింది అసలు సమస్య.
బాల అద్దం వదలడు. ఎవ్వరికీ ఇవ్వదు. చిన్నగా ఉండటం తోటి బాగ్‌లో పెట్టుకుని స్కూల్‍కి పట్టుకు పోతూండేది అప్పుడప్పుడు.
డ్రెస్సింగ్ టేబుల్ బాగు చేయించటానికి ఇచ్చిన వడ్రంగి ఊరు వెళ్ళటం తోటి ఆలస్యమవుతుందని నాన్న చెప్పాడు.
ఇప్పటి లాగా ఒకటికి రెండు వస్తువులు కొనే అలవాటు ఆ రోజుల్లో లేదు. వచ్చినప్పుడు వస్తుంది చిన్నది ఉంది కదా అనుకునే వాళ్ళు.
కానీ అది బాల చేతుల్లో చిక్కి పోయిందని అందరికీ అర్థమయ్యింది.
ఆ రోజు నాయమ్మా చెల్లెలు మనవడి భార్య కాపురానికి వచ్చింది. చూడటానికి రమ్మని చెప్పింది చెల్లెలు సారే పంచుతూ.
అందరూ ఒక్కసారి వెడితే కష్టమని ముందు పెద్దావిడ కదా అని ముందు బాలమ్మ గారిని వెళ్ళమన్నారు. పొద్దున్న పూజ, మడి అని సాయంత్రం బయలుదేరింది నాయనమ్మ.
నాయనమ్మ వెడుతూ బాలని తోడు తీసుకెళ్ళింది. అసలు ఎవరు బయటికి వెళ్ళినా బాలని వాళ్ళు పిలవటమో లేదా బాల వెంటబడటమో జరుగుతుంది.
బాల ఆనందంగా తిరిగివచ్చింది. వచ్చేసరికి మగవాళ్ళు అందరూ వచ్చేసారు. అసలు తండ్రిని చూడగానే చంక ఎక్కే బాల బాబాయి దగ్గరకు వెళ్ళింది.
“బాబాయి నువ్వు ఎవరినైనా ప్రేమించావా” అడిగింది సీరియస్‌గా.
బాబాయి తెల్లబోయి “ఎందుకే?” అన్నాడు.
“ముందు చెప్పు” అంది.
“లేదు” అన్నాడు తేరుకుని నవ్వుతూ.
“అయితే నాన్నా, బాబాయికి వెంటనే పెళ్లి చేసేయి” అంది తండ్రి దగ్గరకు వచ్చి.
“ఎందుకే? అయినా బాబాయి చదువు పూర్తి కావాలిగా” అన్నాడు నాన్న కూడా నవ్వుతూ.
“కాదు చేసీయ్” అంది గునుస్తూ, హఠం చేస్తున్నట్లు.
“ఏమిటి అర్జెంట్, చెప్పు ముందు” అడిగాడు నవ్వుతూ.
నాయనమ్మ చెప్పింది – చెల్లెలు మనవడి పెళ్ళాము సారెలోమంచి, పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చిందట. అది చూసి బాల మురిసిపోయి వదలకపోతుంటే నాయనమ్మ చెల్లెలు “మీ బాబాయికి (అంటే ఆఖరువానికి) పెళ్ళయితే మీ పిన్ని కూడా తెస్తుందిలేవే” అందిట. అప్పుడు బాలమ్మ గారు నవ్వుతూ “వాడు మనకా అవకాశం ఇస్తే. ఎవరినీ ప్రేమించానని పెళ్లి చేసేసుకుని రాకపోతే” అందిట.
అప్పుడప్పుడే ప్రేమ వివాహాలు మొదలయ్యి తల్లి తండ్రుల గుండెల్లో గుబుళ్ళు మొదలయ్యాయి.
అప్పటినుంచి బాలమ్మ గారిని “బాబాయి పెళ్ళెప్పుడు నాన్నమ్మా” అని బాల దారి మొత్తం అడుగుతుంటే దాని నస భరించలేక “బాబాయినే అడుగు, లేకపోతే మీ నాన్న నడుగు” అందిట.
అదీ సంగతి అంది.
“దీన్ని నాకేందుకమ్మా అంటించావు” మొత్తుకున్నాడు బాబాయి.
పాపం బాబాయ్. వెంటనే చదువు పూర్తి చేసుకుని పెళ్లయినా చేసికోవాలి. లేకుంటే డ్రెస్సింగ్ టేబుల్ అయినా కొనిపెట్టాలి.
కానీ ఆ రెండు అతని చేతుల్లో లేవుగా! పాపం బాబాయ్.
శ్రీమతి ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు ప్రముఖ రచయిత్రి, కవయిత్రి. ముఖ్యముగా బాల సాహితీవేత్త. వీరు కేంద్ర ప్రభుత్వ శాఖ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.
సుబ్బలక్ష్మి గారి కథలు మహారాష్ట్ర వారి టెక్స్ట్ బుక్స్‌లో, తెలుగు వాచకములలో 7 వ, 9వ తరగతులకు పాఠ్యాంశములుగా (lessons) తీసుకొనబడినవి.
వీరు భారత్ భాషా భూషణ్, లేడీ లెజెండ్, సాహిత్య శ్రీ, ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ, సావిత్రి బాయ్ పూలే స్త్రీ శక్తి అవార్డులు, బాల సాహితీ రత్న, బాలసాహిత్య శిరోమణి మొదలయిన అనేక బిరుదులు పొందారు. వీరి కొన్ని కథలు తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్లలో అనువాదం చేయబడినవి. ఆకెళ్ల అసోసియేషన్, బాలగోకులం సంస్థలు స్థాపించి, రచయితలను,బాలలను గౌరవించి, ప్రోత్సహిస్తున్నారు.
రేడియోలో బాలల, కార్మికుల, స్త్రీల కార్యక్రమాల్లో రచించి పాల్గొంటారు.