భాషా పటిమ
మా రమణి సరదాలింకా చెబుతానన్నానుగా. ప్రాంతాలవారీ తెలుగు భాషయినా తేడాలొస్తాయండీ. అదే. మాటల్లోనే. మరి నా మాటల్లో అర్థం కాని అంతరార్థాలు.. మా రమణే చెప్పాలి. మేము మొదటి అంతస్తులో వుంటాము. మంచినీళ్ళు పట్టుకోవాలంటే తప్పనిసరిగా మోటారు వెయ్యవలసిందే. ఆ రోజు నీళ్ళ రోజు. మాకు వంటింటినానుకునే వంట సామాను పెట్టుకునే చిన్న యల్ ఆకారంలో గది, దానిలో సింక్, దానిలో నల్లాలు వగైరా. వంట చేసుకునే ప్రదేశానికి, ఆ సింక్‌కీ రెండు అడుగులే దూరం. సరే. కింద వాళ్ళు మోటారు వేశారు. “రమణీ ఆ నల్లా తిప్పు, మంచినీళ్ళొస్తాయి, పట్టు” అన్నానండీ. ఇంచక్కా రెండు చేతులూ కట్టుకుని వంటింట్లో స్టౌ గట్టు పైన వున్న అలమారలోని సామానంతా పరీక్షగా చూస్తోంది. కొంచెం సేపయ్యాక బిందెల చప్పుడు వినబడటం లేదని వెళ్తే ఇదీ సీను. నా భాష అర్ధం కాకపోయినా, మంచి నీళ్ళు పట్టు అన్నాకయినా నీళ్ళు వచ్చే పంపుని కనిబెట్టలేని మా రమణి మేధాశక్తికి అబ్బుర పడ్డాను. పైగా రెండు రోజులనించీ వాటన్నిటినీ వాడుతోంది కూడా! ఈ సీనేదో నేను హాస్యం కోసం కల్పించాననుకోకండి. దీనికి సాక్ష్యం బిత్తర పోయిన మా అమ్మాయే.
ఎటూ భాషా పటిమ గురించి వచ్చింది గనుక ఇంకొక్క మచ్చు తునక. ఆ రోజు పనేమి లేదని “ఫ్రిజ్ తుడమ్మా” అన్నాను. బాగానే తుడిచింది. ఇక్కడొక విషయం మీకు చెప్పాలి. మా రమణి ఇంతకు ముందు ఏ మహారాజుల ఇళ్ళల్లో పని చేసిందో నాకు తెలియదుగానీ తనకి మిగిలిన ఆహార పదార్థాలు మరో పూట తినటమనే కాన్సెప్ట్ అస్సలు నచ్చదు. అన్నం, పప్పు, కూర ఏది మిగిలినా చెత్త బుట్టలో పారేసేది. మరి మేమేమో వాటిని అట్టిపెట్టి తర్వాత పూట తినే అలవాటున్నవాళ్ళం. సాయంకాలం అన్నం పెడుతుంటే అడిగాను. పొద్దున్న కూర వుంది కదా. వేసెయ్యి అని. లేదు అన్నది. కూర కొంచెం ఎక్కువే వున్నది. తను తినలేదు. అందుకే “నువ్వు తిన్నావా సరిపోయిందా” అని అడిగాను. “లేదు. కొంచెం వుంటే పడేశాను” అన్నది. నాకే కాదు. మా ఆయనకీ కోపం వచ్చింది. “మా ఇంట్లో తినే వస్తువులు అలా పడెయ్యము. ఇంకో పూట తింటాము. మీరు తినరా” అని అడిగారు. “తినము” అని స్పష్టంగా చెప్పింది. “మేము పడేస్తాము. లేకపోతే ఎవరన్నా తినేవాళ్ళుంటే ఇచ్చేస్తాము” అన్నది. ఔరా మన దేశంలో పని చేసుకునేవాళ్ళు ఇంత వీర లెవల్లో బతుకుతున్నారా అని ఆశ్చర్యపోవటం మా వంతయింది.
ఇంతకీ మా రమణి వయసెంతో తెలుసా? 22 ఏళ్ళని సదరు సంస్ధవారూ, ఆ అమ్మాయీ చెప్పారు. నాకనుమానమే. ఇంకా చిన్నదే అయి వుంటుందని. వయసు గురించి ఎందుకు చెప్పానంటే.. ఆ వయసువాళ్ళు రాత్రిళ్ళు కూడా సాధారణంగా అన్నం తినటమే మాకు తెలుసు. మా వయసు వాళ్ళు ఈ మధ్య రాత్రిళ్ళు అన్నం తినటం మాని తేలిగ్గా ఏదనా ఫలహారం చేస్తున్నారు. రోజూ తనూ మాతో బాటు ఏది చేస్తే అదే తినేది. ఆ రోజు “మేము పళ్ళు తిని వుంటాము, నువ్వు అన్నం వండుకోమ్మా, పొద్దున్న కూర వుంది కదా తినచ్చు” అన్నాను. “నేను సాయంకాలం అన్నం తిననండీ” అన్నది. “మరెలా నీకొక్కదానికీ టిఫెన్ చేసుకుంటావా” అన్నాను. “లేదు, బయటనుంచి తెచ్చుకుంటాను” అన్నది. (మా ఇంటి చుట్టుపక్కల అన్ని రకాల దుకాణాలు వున్నాయి. చూసింది). నేనేమీ మాట్లాడలేదు. నిజం చెప్పద్దూ. బయట కొనుక్కొచ్చుకోవటానికి డబ్బులు ఇవ్వాలనిపించక ఇవ్వలేదు. బయటకెళ్ళి వుత్త చేతులతో వచ్చింది. అదేంటి ఏమీ తెచ్చుకోలేదంటే.. మేగీ తెచ్చుకుందామని వెళ్ళాను. పెద్ద పేకెట్లున్నాయి, ఒకటి వున్నది లేదు అన్నది. మాకు మేగీ అలవాటు లేదు. పోనీ ఏ ఉప్మానో చేసుకో అంటే వద్దన్నది.
అంతకు ముందూ ఒకసారి ఇలాగే చేసింది. ఏమైనా స్నేక్స్ తెచ్చుకుంటానని వెళ్ళి ఏమీ తెచ్చుకోకుండా వచ్చింది. ఏమైంది అంటే చాలా ఖరీదున్నాయి.. మిక్చర్ పావు కిలో వంద రూపాయలు చెప్పాడు అన్నది. నీకు పావు కిలో ఎందుకు వంద గ్రాములు తెచ్చుకోక పోయావా, లేకపోతే పక్క షాపులో చిప్స్ వగైరా పది రూపాయల పేకెట్లు కూడా వుంటాయి చూడలేదా అన్నాను. మాట్లాడలేదు. ఇప్పటికీ నాకర్థం కాని విషయం ఒకటే. ఆమె లెవల్‌కి అవి సరిపోవా లేకపోతే అవి కొనుక్కొచ్చుకోవటానికి డబ్బులివ్వని నా అర్థం కాని అయోమయమా!
సరే ఫ్రిజ్ తుడవటం దగ్గరనుంచీ ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్ళానంటే తినే వస్తువులను సునాయాసంగా పడేసే మా రమణి అలవాటు గురించి చెప్పటానికి. అది తెలిసిన దాన్నిగనుక.. “కవర్లవీ చాలా వున్నాయి. అక్కరలేనివి తీసేయి. పడేసే ముందు నాకు చూపించు..” అని నా జాగ్రత్త నేను పడ్డాను. దసరా తర్వాత మా చెల్లెళ్ళు మా వారిని చూడటానికి వస్తూ పండక్కి ఇంట్లో చేసుకున్న పిండి వంటలు తెచ్చారు. నేను, పిల్లలూ తింటామని. ఆ కవర్లున్నాయి ఫ్రిజ్‍లో.. చూపించింది. నా భాషా పటిమ.. “లోపల పడెయ్యి తర్వాత చూస్తాను..” అన్నానండీ. తర్వాత ఏదో చేస్తూ ఆ విషయం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏమన్నా తినాలనిపించి ఆ కవర్లుండాలి కదా తీసుకురా అన్నాను. “ఎక్కడున్నాయి. పడేశాను” అన్నది. “5, 6 రకాల స్వీట్స్ అలా ఎలా పడేశావు?” అన్నాను. “మీరు పడెయ్యమన్నారు కదా. పడేశాను” అన్నది కూల్ గా. నేను పడెయ్యమనటమేమిటి అని తవ్వకాలు మొదలు పెడితే కొంత సేపటికి నా మాటలు గుర్తొచ్చాయి.. లోపల పడెయ్యి తర్వాత చూస్తాను.. అని. పడెయ్యి తప్ప ఇంకేమీ వినబడలేదు ఆ అమ్మాయికి!!! మరి మీరు కూడా కొత్తవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని అర్థం అయింది కదా.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.