Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాట తెచ్చిన తంటా

[శ్రీపార్థి గారు రాసిన ‘మాట తెచ్చిన తంటా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

పెళ్లికి వెళ్లే హడావిడిలో వుంది పంకజం. పెళ్లి సమయం మించిపోతుందన్న తొందరలో మసక చీకటిగా వున్న పడక గదిలోకి వెళ్లింది. నగల కోసం బట్టల కోసం అలంకరణ సామాగ్రి కోసం గదంతా హడావిడిగా తిరగసాగింది. గదిలో రాత్రి జుట్టుకు పెట్టుకొన్న కొబ్బరినూనే డబ్బా నుండి కారిన నూనె గచ్చు మీద ఇంత మందం పేరుకుపోయి వుంది, చూసుకోకుండా దాని మీద కాలేసి అమాంతం దబాలున జారిపడింది పంకజం. కుడి కాలు మడమ దగ్గర సన్నగా చీరుకుపోయి లోపలి నుండి నొప్పి పుట్టసాగింది. తనకు తానుగా లేవడం కష్టమయ్యి కాసేపు అక్కడే కూలబడింది.

సాయం కోసం ఇంట్లో ఇంకో మనిషి లేకపోవడంతో ఓపిక తెచ్చుకొని మెల్లిగా తనకు తానుగా లేచి కుంటుకుంటూ ఇంటి గుమ్మం ముందు వరకు వచ్చి చూడసాగింది. ఎంతసేపటికి ఎవరూ ఆ వేపు రాకపోవడంతో అక్కడే గడప పక్కన కూచొని ఓపిగ్గా ఎదురు చూడసాగింది. కాని కాలు మడమ నొప్పి మాత్రం కుదురుగా కూర్చోనివ్వడం లేదు. అప్పుడే దూరంగా నడుచుకుంటూ వస్తున్న ‘డుమ్మెడు’ కనిపించాడు. ‘అసలే వీడు వట్టి ఎడ్డి మాలోకం, వీడికి చెప్పాలా వద్దా’ అని ఆలోచిస్తుండగానే డుమ్మెడు తన ముందు వరకు వచ్చేసాడు.

“ఒరే డుమ్మె! ఇలా రా మాట.”

“అత్తా! నాపేరు ‘డుమ్మెడు’ కాదు, శ్రీనివాసు” అన్నాడు ఉక్రోషంతో నత్తి నత్తిగా.

“సరే లేరా, పక్కింటి కాంతమ్మ పిన్నిగారు లేరు, ఆవిడ పెళ్లింట్లో వున్నారు, నువ్వు త్వరగా వెళ్లి ‘పంకజం అత్త కాలు జారి పడిపోయింది, ఉన్న ఫలంగా ఇంటికి రమ్మనమంద’ని చెప్పు. సరేనా.”

“నువ్వు అంత తొందరగా చెపితే నాకు అర్థం కాదు, మళ్లీ చెప్పు.”

“పంకజం అత్త.. కాలు జారింది.. పడిపోయింది.. ఉన్న ఫలంగా.. మా ఇంటికి రమ్మన్నానని చెప్పు” అంటూ మెల్లగా అక్షరం అక్షరం విడదీసి చెప్పింది.

“సరే! నేనూ అక్కడికే వెళ్తున్నాను. చెప్తాలే, ఎవరికి కాంతమ్మ గారికే కదా.”

“కాంతమ్మ గారికే చెప్పు.. తొందరగా రమ్మను.. వెళ్లు.”

***

పంకజం తెలివైన అమ్మాయి, చదువుకున్నది, చూడ్డానికి పొడవుకు తగ్గ లావుగా వుండి, తన అందమంతా కళ్లలోనే వుంటుంది, రంగు కాస్త చామనచాయగా వున్నా రూపం మాత్రం చూపు తిప్పుకోలేనంతగా వుంటుంది. ఆమె రూపలావణ్యాన్ని చూసే ఆమె భర్త ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

పంకజానికి ఆత్మవిశ్వాసం ఎక్కువ, ముక్కుసూటితనం, ముందు వెనకల మాటలో తేడా లేకుండా ఉండడంతో గ్రామంలో ఆమె పట్ల ప్రేమ కురిపించేవారు ఉన్నారు, ఈర్షాసూయలు కలిగిన వారు ఉన్నారు.

భర్తకు ఎయిర్‌ఫోర్సులో ఉద్యోగం అవడం వలన పెళ్లైన నెలకే అతడు ఉద్యోగంలో చేరిపోయాడు. ఆరు నెలలుగా సెలవు దొరకక పంకజం దగ్గరకు రాలేకపోయాడు. తనకు భర్త దగ్గరకు వెళ్లడానికి కుదరలేదు.

***

డుమ్మెడు తీరిగ్గా నడుచుకుంటూ పెళ్లి జరుగుతున్న ఇంటికెళ్లాడు. అక్కడ పెళ్లింట బంధువులతో కోలాహలంగా వుంది. బాజాభజంత్రీలు జమాయింపుగా మోగుతున్నాయి. డుమ్మెడు కాంతమ్మ కోసం ఇల్లంతా వెతకసాగాడు. పంకజం ఎదురింట్లో వుండే శేషమ్మ, కాంతమ్మ ఇద్దరు వంట గదిలో ఒక పక్కగా లెక్కతో లడ్డూలను డబ్బాల్లోకి సర్దుతూ కనిపించారు.

“యేంట్రా ఇలా వచ్చావు” అంటూ పలకరించింది కాంతమ్మ.

“నీకోసమే”

“యేమిటో”

“పంకజం అత్త.. కాలు జారిందంట.. పడిపోయిందంట ఉన్న ఫలంగా.. నిన్ను రమ్మని చెప్పింది” అన్నాడు బొంగురు గొంతుతో,

వెంటనే, వున్న పని పక్కన పడేసి ఆదుర్దాతో ఇంటి దారి పట్టింది కాంతమ్మ.

“పంకజం కాలు జారింది” అనే మాట గింగిర్లు తిరుగుతూ శేషమ్మ చెవిని బలంగా తాకింది, “పడిపోయింది” అనే మాట ఆమె చెవిని సోకకుండ భజంత్రీల శబ్దంలో కలిసిపోయింది.

“నీతో ఎవరు చెప్పార్రా?” అంటూ డుమ్మెడి చెవి దగ్గర బిగ్గరగా అడిగింది శేషమ్మ చేతిలో వున్న లడ్డూల్లో ఒక లడ్డును వాడి షర్టు జేబులో పెడుతూ.

“పంకజం అత్తే” అన్నాడు శేషమ్మ చెవి దగ్గర, మోగుతున్న భజంత్రీల శబ్దానికి చేతి వేళ్లను రెండు చెవిల్లో గట్టిగా నొక్కి పట్టుకొని.

ఈ మాట విన్న శేషమ్మ చేతిలో వున్న లడ్డూలను డబ్బాలో గిరాటేసి ఇంట్లోకి పరిగెత్తింది.

హమ్మయ్య చెప్పేసాం, వచ్చిన పని అయిపోయిందన్నట్టుగా భోజనాల గుంపులో దూరిపోయాడు డుమ్మెడు.

తీరిగ్గా కూచుని ఆకు వక్కలను పళ్ల మధ్యనేసి ఇసురుతున్న ముసలి ముతకల మధ్య చేరి ఈ మాటను వారి చెవుల్లో ఊదిపారేసింది శేషమ్మ.

విన్న ఆ చెవులు ఊరుకున్నాయా, ఆగమేఘాల మీద ఇంకో పది చెవిల్లోకి దూర్చాయి. విషయం అవ్వల నుండి తాతలకు చేరింది. అట్నుండి పెళ్లి ఇల్లు గుప్పుమంది. ఆ మాటకు వెనకా ముందు ఆరాలు తీయకుండానే ‘పంకజం కాలు జారింది’ అనే మాట ఖాయం చేసింది ఆ కాకుల గుంపు.

ఈ మాట సాయంత్రాని కల్లా గ్రామం మొత్తం గత్తరయింది. కాని ఈ విషయం ఇంట్లో వున్న పంకజానికి మాత్రం తెలియరాలేదు.

తెల్లవారేసరికల్లా పక్క గ్రామంలో వున్నపంకజం తల్లిదండ్రులకు పంకజం కాలు జారిందనే మాట కాకితో కబురు పోయింది.

ఈ మాట విన్న మరుక్షణం వారు దిగాలుపడ్డ పక్షుల్లా పంకజం ఇంట్లో వాలిపోయారు.

తండ్రి చేతులు పిసుక్కోవడం, తల్లి ముక్కు చీదడం మొదలు పెట్టారు.

“యేంటే నా తల్లి, ఇలా చేసావు? అని ఏడుపు మొదలుపెట్టింది పంకజం తల్లి.

“అవునమ్మా కాలు జారింది, అవునూ మీకెలా తెలుసు?”

“నాకేంటి ఊరంతా గుప్పు మంటేనూ?”

“అవునా..”

“సిగ్గుండాలి, ఎవడా తలకు మాసినోడు, గప్‌చుప్‌గా వెళ్లి తీయించేద్దాం.”

“యేంటి నా కాలా, ఇంత దానికే కాలు తీసేస్తారా?”

“కాలేంటే?”

“మరి తీయించేదేంటి?”

“నీ కడుపు”

“కాలంటే కడుపంటది, అసలేమైంది మీకు?”

“కడుపొస్తే కాలంటావేంటే?”

“కడుపు లేదు కాకరకాయ లేదు, కాలుజారి కిందపడ్డాను, చిన్న దెబ్బ తాకింది అంతే..”

“ఓయమ్మో! ఇదెక్కడి తంటానే, పంకజం కాలు జారింది, కడుపొచ్చిందని ఊరంతా గుప్పుమంది.”

‘అవునా, కాలుజారి పడిపోయి చిన్నదెబ్బ తగిలితే ఇంత తతంగం జరిగిందా’ అంటూ ఆశ్చర్యపోయింది పంకజం

***

“ఒరే తిక్కలోడ.. నిన్న కాంతమ్మ పిన్నికి ఏం చెప్పావు?”

“ఏముంది, పంకజం అత్త కాలు జారింది.. ఉన్న ఫలంగా రమ్మన్నదని చెప్పాను.”

“ఒరే సచ్చినోడ, అలా చెప్పావా, నువ్వు చెప్పినపుడు అక్కడెవరున్నారు?”

“కాంతమ్మతో పాటు ఎదురింటి శేషమ్మగారున్నారు.”

“నువ్వు చెప్పిందంతా వినిందా?”

“ఓ.., మరోసారి కూడా అడిగింది.”

“మరి నువ్వెం చెప్పావు?”

“అదే చెప్పాను.”

“ఇంకెవరికి అలా చెప్పకు, సరే నువ్వెళ్లు.”

“ఊరంతా చేసింది ఈ ఎదురింటి శేషమ్మే. నీకు దానికి జరిగిన గొడవను మనసులో పెట్టుకొని ఈ అపవాదు నీమీదేసింది. ఒక్క మాటను పట్టుకొని చూసావా, ఎంత పని చేసిందో. సమయానికి అల్లుడు గారు కూడా ఊళ్లో లేరు. ఎలాగే! ఈ అపవాదు తుడుచుకోవడం?”

“ఉండమ్మా నన్నాలోచించుకోని!”

“ఇంతకి కాంతమ్మేది కనపడదే?”

“లేదమ్మా. కూతురికి బాలేదని కబురొస్తే నిన్న సాయంత్రమే ఊరెళ్లింది.”

***

పంకజం ఇంటి ముందు అంబులెన్సు ఆగి ఉంది. కాలుకు పెద్ద కట్టుతో స్ట్రెచ్చరుపై పంకజాన్ని తీసుకొచ్చి అంబులెన్సులో పడుకోబెట్టారు. ఊరంతా వారి ఇంటి ముందు గుమిగూడారు. అందులో శేషమ్మ కూడా వుంది. పంకజం తల్లి తండ్రి కూడా ఎక్కారు అంబులెన్సు.

చేతి సైగలతో శేషమ్మను దగ్గరగా పిలిచి – “అత్తా, కాలుజారి పడిపోయాను, పట్నం వెలుతున్నాను ఆసుపత్రికి, ఇల్లు చూస్తూ ఉండు, కాలు నొప్పి తగ్గగానే వచ్చేస్తాను” అంది పంకజం నీరసం నటిస్తూ.

తల అడ్డం నిలువుగా వూపింది శేషమ్మ

పట్నంలో తన అక్కయ్యగారిల్లు చేరింది పంకజం. తన భర్తను సెలవు పెట్టించి ఉన్నఫలంగా అక్కడికే రప్పించింది. పట్నంలో చూడాల్సిన వన్ని చూసింది, తినాల్సిన వన్ని తిన్నది. తిరగాల్సిన గుళ్లు గోపురాలు అన్ని తిరిగింది. తీరిగ్గా నెల రోజులకు తల్లిదండ్రలతో మళ్లీ ఊరు చేరింది

“ఎంత మంచి ఉపాయం ఆలోచించావే తల్లి, లేదంటే ఏమి లేనిదానికి ఈ అపవాదు జీవిత కాలం మోయాల్సివచ్చేది” అంది తల్లి.

“జాగ్రత్తగా ఉండమ్మా” అంటూ ఊరెళ్లిపోయారు తల్లిదండ్రులు.

Exit mobile version