Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాట్లాడే ఒంటరి వీధి!

[ప్రసిద్ధ రచయిత్రి గీతాంజలి గారు రచించిన ‘మాట్లాడే ఒంటరి వీధి!’ అనే దీర్ఘ కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మాట్లాడే ఒంటరి వీధి! – A lone street speaks!

~

భళ్ళున తెల్లారింది!
ఉలిక్కి పడి వీధి నిద్ర లేచింది!
వీధికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నది!
వెయ్యి కళ్ళతో మనుషుల్ని చూస్తున్నది.
మనుషులు వెర్రిగా, పిచ్చిగా, భయంగా, పరుగులు పెట్టడాన్ని,
దుఃఖం దాచుకున్న మనుషులు కొందరు
వెర్రి నవ్వులు నవ్వుకుంటూ
తన గుండెల మీద నుంచి
పరిగెత్తడాన్ని వీధి విభ్రాంతిగా, అయోమయంగా చూస్తుంది!
తొందరగా లేపిన సూర్యుణ్ణి కసురుకుంటుంది కూడా!
*
సూర్యుడి కంటే ముందే తనని మనుషుల మాలిన్యాల నుంచి
శుభ్రం చేసిన సఫాయి తల్లి పాదాలకి నమస్కరిస్తుంది!
వాకిట్లో అల్లరి చేసే పిల్లలను అమ్మ మందలించినట్లు
సందడి చేసే మనుషులను కసురుకుంటుంది!
ఉదయం వెళ్ళిన మనుషులు గోధూళి వేళ
దేహాలు వేలాడేసుకుంటూ
ఇళ్ళకి తిరిగి వెళ్లడాన్ని
దిగులుగా చూస్తూ
ఒక చల్లని పిల్ల తెమ్మరను వాళ్ళ మీదుగా వీస్తుంది!
*
సూర్యుడు చీకటి చేసి వెళ్ళిపోయిన లోకాన్ని,
స్ట్రీట్ లైట్ల కళ్లేసుకుని వీధి విభ్రమంగా చూస్తుంది!
వెలుతురు చాలక చంద్రుణ్ణి, నక్షత్రాలను
ఆకాశం నుంచి కొంచెం కిందికి దించుతుతుంది!
*
అలసిన వీధి కాస్తా
అప్పటిదాకా పాడుకున్న పాటను ఆపేస్తుంది!
తీసిన పరుగును మానేసి
చాయ్ వాలా మసల బెడుతున్న
చాయ్ బండి ముందు ఆగుతుంది.
గాలిలొ తేలే చాయ్ పరిమళాన్ని
గుండెల నిండుగా శ్వాసిస్తుంది!
తీరిగ్గా సిమెంట్ చప్టా మీద కాలు మీద కాలేసుకుని
మెల్లిగా కప్పులో చాయ్ చప్పరిస్తూ
చాయానందానికి పరవశిస్తుంది!

ఎదురుగా హడావుడిగా వచ్చి పోయే
మనుషుల రంగస్థల నృత్యాల్ని
విలాసంగా, కొద్ది నొప్పితో కూడా
చూస్తూ కూర్చుంటుంది!
*
ఉన్నట్లుండి వీధికి విసుగొచ్చేస్తుంది!
వీధి, ఇది నేను కాదు అనుకుంటుంది!
తన పాదాల కింది రోడ్డు, మీది ఆకాశం,
చుక్కలు చంద్రుడు తనవి కానే కాదు అనుకుంటుంది
తన ముందు రంగులు మారే మనుషుల్ని చిరాగ్గా చూస్తుంది!
ఇదిగో ఈ మనుషులున్నారే..
శత్రువుల్లా తనని నిలువెల్లా
ఆక్రమించేశారు అనుకుంటుంది!
కర్ర తీసుకుని అందరినీ తరిమేసి
తనని ఖాళీ చేసుకోవాలని ఆశ పడుతుంది!
*
మళ్ళీ ఈ మనుషులకి తను తప్ప దిక్కెవరు అనుకుంటుందా.,
అంతే వాళ్ళ మీద అదాటున ప్రేమొచ్చేస్తుంది వీధికి!
వాళ్ళ వైపు లాలనగా, క్షమించమన్నట్లు చూస్తుంది!
*
తాపీగా వాళ్ళని గమనిస్తూంటుంది!
ఎన్నెన్ని కబుర్లు, అరుపులు, నవ్వులు,
పాటలు, గుసగుసలతో, తిట్లతో మనుషులంతా
వెక్కిళ్లు పడుతూ ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు!
కొంతమంది దాక్కుంటూ, వొదిగి వొదిగి నడుస్తూ ఉంటారు!
కొంతమంది బతుకు భారంతో ఈడుస్తూ,
కొందరు కలలు పగిలి ఏడుస్తూ
ఇంకొంతమంది కలలు అందుకోవడానికి
పరుగులు పెడుతూ ఉంటారు!
వాళ్ళ బరువు పాదాలతో వీధి దేహం చితికిపోతుంది!
వాళ్ళ దుఃఖంతో వీధి కళ్ళు నిండి కారిపోతుంటాయి!
వీధి నిశబ్దంగా కళ్ళు తుడుచుకుంటుంది!
*
చాలా సార్లు ఏమీ చేయలేక వీధి నిశబ్ద శ్రోతలా,
మౌన ప్రేక్షకురాలిలా మారిపోతుంది!
ఇక ఇలా కాదని వీధే
మనిషిలా మారిపోయి
మెల్లిగా నడుస్తూ,
ఈ మనుషులు తనని ఏం చేస్తున్నారో చూస్తుంటుంది!
పెత్తనం చేద్దామని
చలికాలపు కోటు వేసుకుని,
చేతి కర్రతో బయలుదేరుతుంది
*
ఒకాయన రేడియోలో
“ఫిర్ మిలోగే కభి ఇస్ బాత్ కా వాదా కర్లో”
అని మత్తెక్కించే రఫీ పాట పెడతాడు!
ఆ పాట కాస్తా గాల్లో తేరుతూ పక్కనే ఉన్న
మల్లె దుకాణంలో మల్లెల కుప్పలో మునిగి
మరింత పరిమళ భరితమైపోతూ ఉంటుంది!
*
ఇంకొకామె దుకాణం ముందు
మట్టి సుగంధం ఎగిసేలా
నీళ్ళు చల్లుతూ ఉంటుంది!
తలలో పూలు పూయించుకున్న
స్త్రీలు హడావుడిగా తిరుగుతుంటారు.
గుడి ఒకటి గణ గణమని
గంటలు మోగిస్తూ ఉంటుంది!
కూరగాయలు అమ్మేవాళ్ళు
నీళ్లు, రంగులూ, మాయలూ చల్లి
కొనిపించేస్తూ ఉంటారు!
*
దుకాణాల ముందు
రిటైరైపోయి రికామీగా
వృద్ధాప్యపు బుగులును మోస్తున్న
తలలు నెరిసి, కూర్చున్నవాళ్లు
తడి కళ్ళతో బాధలు వెళ్లబోసుకొంటున్నారు!
*
మందుల దుకాణం ముందు,
క్లినిక్‌ల ముందు దుఃఖ విషాదాలతో
కాళ్ళ, కీళ్ల నొప్పులతో
ఋతువులిచ్చిన జ్వరాలతో కాగుతూ
ముసలి వాళ్ళు, పడుచువాళ్ళు,
పిల్లలూ మూల్గుతూ పోతుంటారు!
*
డబ్బులు బాగా బలిసిన వాళ్ళు
కారు డిక్కీల నిండా నోట్ల కట్టలతో
సుతిమెత్తగా రహస్యానందాలతో పోతూ ఉంటారు!
ఇంకోడు పెళ్ళాన్ని తిడుతూ, ఈడ్చుకు పోతుంటాడు.
ఆమె ఘోల్లుమంటూ, ఏడుపు రాగాలతో
రేగిన జుట్టుతో, చెంపల మీద కన్నీటి చారికలతో
అతనితో ఈడవ బడుతూ ఉంటుంది.
ఆమె పెట్టే శాపనార్థాలు
ఆమె ఊరు చేరి పుట్టింటి తలుపులు బాదుతూ ఉంటాయి!
*
నీరసించిన వీధి కుక్కొకటి
కర్కశంగా రాయి విసిరిన
మనిషి దెబ్బలకి దీనంగా
గావుకేకలు వేస్తూ
ఆకలికి అన్నమేగా అడిగింది
అని రోదిస్తుంది!
*
అకాలపు మరణాన్ని
మోసుకుపోయే జనాజాల
మృత్యు రోదనలు వినలేక
దుఃఖంతో పక్కకి తప్పుకుంటుంది వీధి!
శవం నుంచి వచ్చే
మృత్యు వాసనని పీల్చలేక
దస్తీతో ముక్కు మూసుకుంటుంది వీధి!
*
మరో పక్క వేశ్యల దగ్గర రహస్యంగా
కామం తీర్చుకున్న దొంగ పాతివ్రత్యపు మొగుళ్ళు,
మధువు మైకంలో నిర్లక్ష్యం గానో, తన్మయత్వంతోనో
ఆరామ్‌గా గాల్లో సిగరెట్టు పొగలు
ఊదుతూ వదులుతూ నడుచుకుంటూ పోతుంటారు!
ప్రేమలో పడ్డ టీనేజీ పిల్లలు,
యవ్వనపు ఉషారును రోడ్ల మీద,
బండ్లమీద జోరుగా పరిగెత్తిస్తుంటారు!
భగ్న ప్రేమికులు నీరసంగా
వైన్ దుకాణాల ముందు తూగుతూ ఉంటారు!
*
బజ్జీలు, జిలేబీలు వేపేవాళ్ళు,
మక్కా కంకులు కాల్చేవాళ్ళు
ఆబగా తినేసే కస్టమర్లను చూస్తూ
నవ్వుకుంటూ ఉంటారు!
*
బండ్ల మీది కట్టెల పొయ్యి మీద,
మంటలు ఎగుస్తుంటే
జొన్న రొట్టెలు చేసే లంబాడా స్త్రీలు,
ఆ పొగా, రొట్టెల వాసనా
కౌగలించుకుని గాలికే నోరూరిస్తోంటే,
చుట్టూ తమ వంతు కోసం
ఆకలి కళ్లేసుకుని ఎదురు చూస్తుంటారు!
*
మరో పక్క మల్లె, గులాబీ చామంతి,
దవనాలని వేళ్ళ మధ్య చురుగ్గా అమ్మే
సుభద్ర పూల దుకాణం,
వీధిని మాయ చేసి ఆపేస్తుంది!
పూల సుగంధాన్ని
గుండె నిండా పీల్చుకుని
సుభద్రను వీడలేక, వీడలేక
వీధి మెల్లిగా ముందుకు జరుగుతుంది!
*
పండ్ల బాజారులో
రంగులతో మెరిసిపోయే
పండ్లు వీధికి నోరూరిస్తాయి!
రసాలూరె మిఠాయి దుకాణం
ముందు వీధి ఒక్కసారి ఆగిపోతుంది!
జేబులో పైసలు సరిచూసుకుంటూ
చిన్నబోయి వెళ్ళిపోతుంది!
*
బొమ్మల దుకాణం ముందు వీధి
చిన్నపిల్లాడై మారాము చేస్తుంది!
*
చెప్పుల దుకాణం ముందు నిలబడి
జత చెప్పులన్నా ఉంటే బాగుండు,
పాదాలు మురికి కాకుండా,
రాళ్ళూ ముళ్ళూ గుచ్చకుండా
చెప్పులకి పిన్నీసులు పెట్టుకునే
హరేక్ మాల్ ముసలి రామయ్యకు
ఇద్దును కదా అని ఆశ పడిపోతుంది.
*
వీధిలోకి తెరుచుకునే ఇళ్ల వాకిళ్లలో,
ఎవరి కోసమో ఎదురు చూసే
ముసలివాళ్ళను చూస్తూ
మీ పిల్లలు ఎటుపోయారమ్మా అని
వీధి ఆరా తీస్తుందా?
నొప్పీ, కన్నీళ్ళు కలిసిపోయి వాళ్ళ దేహాలు
నదులు కావడాన్ని చూసి తట్టుకోలేక
గాభరాగా పారిపోతుంది!
*
వీధి అలా మాట్లాడుతూ,
మనుషులంతా వెళ్ళిపోయేదాకా
అనాథలా సూఫీ రాగాల్ని గున్‌గునాయిస్తూ,
ఏదో తెలీని దుఃఖావేదనతో తిరుగుతూనే ఉంటుంది!
మనుషుల్ని ఆపి, ఆపి ఎందుకంత దుఃఖం అని
అడిగి అడిగీ వేసారిపోతుంది వీధి!
ఆఖరికి తన ప్రశ్నలకి జవాబే దొరక్క
చలికి వణికి, వేడికి కమిలి,
వర్షానికి తడిసి వీధి
రాత్రిలోకి ముడుచుకు పోతుంది!
*
అప్పటిదాకా మనుషులతో,
మనిషిలా మాట్లాడిన వీధి
మూగదై పోతుంది!
వీధి ఒంటరై పోతుంది!
ఆఖరికి తన దేహం మీద రాలిన
శరత్కాలపు ఎండుటాకులను,
ఎవరో అమ్మల కొప్పులలో పరిమళించి,
వాడిపోయి జారిపోయిన మల్లెమాలలను
కౌగలించుకుని పడుకుంటుంది వీధి!

Exit mobile version