Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-22

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

కానరార కైలాస నివాస, బాలేందు ధరా జటాధర హరా
భక్తి జాల పరిపాల దయాళ హిమశైలసుతా ప్రేమలోల..

 

ఎన్టీరామారావు ప్రథమంగా దర్శకత్వం వహించిన సినిమా ‘సీతారామకల్యాణం’. ఈ సినిమాలో ఈ పాట చిత్రీకరణ ఈనాటికీ చర్చనీయాంశం.

‘భూకైలాస్’ సినిమాలో ఇలాంటి సందర్భాలలో పాటల్లో నటించిన అనుభవం ఉంది ఎన్టీరామారావుకు. దర్శకులు, గేయ రచయితలు, కెమెరా దర్శకుడు, స్క్రిప్ట్ రచయితలు కూర్చుని చర్చిస్తూ పాటలను రూపొందించటం ఎన్టీరామారావుకు తెలుసు. ఆ కాలంలో నటీనటులు కూడా పాటల రూపకల్పన కోసం జరిగే చర్చలలో పాల్గొనేవారు. ముఖ్యంగా, పాటల ద్వారా వారికొక ఇమేజ్ ఏర్పడటంతో, పాటల విషయంలో నటీనటులు ఎంతో శ్రద్ధను కనబరచేవారు. ఈ పాటకు దర్శకుడు ఎన్టీరామారావే కావటం, నటుడూ ఆయనే కావటం కూడా ఈ పాట మరపురాని మధురమైన భక్తిగీతంగా ఎదగటంలో తోడ్పడింది.

పాటకు సన్నివేశం చక్కగా కురిరింది. శివుడు పార్వతి నృత్యం చేస్తుంటారు. రావణుడు వారి దర్శనం కోరతాడు. సరైన సమయం కాదని నంది అడ్డుపడతాడు. అహంకారి రావణుడికి కోపం వస్తుంది. శివుడి దర్శనం అభ్యర్థిస్తానంటాడు. ప్రార్థిస్తాడు పాట ద్వారా. తాండవంలో నిమగ్నుడైన శివుడు పట్టించుకోడు.

నంది రావణుడిని అపహాస్యం చేస్తాడు. అతడి అహం దెబ్బతింటుంది. కైలాసాన్ని లంకకు తీసుకు పోతానంటాడు. కైలాస పర్వతాన్ని కదిలిస్తాడు. ఆ బరువుకి క్రింద పడి నలిగిపోతాడు. అతడి భక్తిని మెచ్చి శివుడు ప్రత్యక్షమౌతాడు. సినిమాలో స్పృహ కోల్పోయిన రావణుడు తన కాలిని స్పృశించినట్టనిపించి శివుడు నిజం తెలుసుకున్నట్టు చూపించారు.

పురాణ కథనం ప్రకారం శివుడు బొటనవేలితో నొక్కటం వల్ల కైలాసం బరువు క్రింద నలిగి ఆర్తనాదాలు చేస్తాడు రావణుడు. శివ తాండవ స్తోత్రం పాడతడు. మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు.

మరో కథనం ప్రకారం తన దగ్గర ఉన్న డోలు వాయిస్తూ, శివ తాండవ స్తోత్రం పాడుతూ కైలాసగిరి అధిరోహిస్తుంటాడు రావణుడు. అతడి పాటతో తన్మయుడైపోయాడు శివుడు. కానీ పార్వతి మూడవ మనిషి రాకకు ఆగ్రహిస్తుంది. శివుడిని తన్మయత్వం నుండి బయటకు తీసుకు వస్తుంది. శిఖరానికి చేరిన రావణుడిని కాలితో శివుడు క్రిందకు తోస్తాడు. కైలాసం దక్షిణంవైపు నుంచి క్రిందకు దొర్లుతాడు రావణుడు.

ఆ సమయంలో ఢమరుకం కూడా దొర్లుతూ క్రింద దక్షిణం వైపు గీత గీస్తుంది. అందుకే కైలాసగిరి దక్షిణం వైపు పైనుండి క్రింది వరకు చీలికలా కంపిస్తుందని అంటారు.

ఈ పురాణ కథలలో దేన్ని తీసుకున్నా రావణుడి ఇమేజ్ దెబ్బతింటుంది. శివుడు బొటనవేలితో నొక్కగానే కైలాసం క్రిందపడి ఆర్తనాదాలు చేసినా, పైనుంచి క్రిందకి దొర్లుతూ పడ్దా బాగుండదు. అందుకని కైలాసం క్రింద నలుగుతున్న రావణుడి ఆత్మ  అలా లోపలకు వెళ్లి శివుడి పాదాలను ప్రణమిల్లినట్టు చూపించారు సినిమాలో.

ఈ పాట కైలాస ద్వారం వద్ద చిత్రీకరించాలి. కాబట్టి ‘భూకైలాస్’ సినిమాలో లాగా ప్రకృతిని చిత్రీకరణలో భాగం చేసే వీలు లేదు. కాబట్టి రావణుడి అహంకారం, శివదర్శనం కాకపోవటంతో మారుతున్న అతని భావాలు, తరుగుతున్న అహంకారం వంటి వాటిని నటుడి నటనలో, పాట బాణీలో, పదాల వాడకంలో చూపించాల్సి ఉంటుంది. ప్రకృతి సహాయం ఉండదు.

ఈ పాటను సంగీత దర్శకుడు గాలిపెంచల నరసింహారావు శుద్ధ శాస్త్రీయ శంకరాభరణం రాగంలో రూపొందించాడు. ఈ పాటను శంకరాభరణం రాగ  సాధనకు వాడుకునేంతగా సినిమా పరిధిలో ఎంత శాస్త్రీయంగా రూపొందించవచ్చో, అంత శాస్త్రీయంగా రూపొందించారు.( మరో కథనం ప్రకారం ఈ పాటను ఎస్ఱాజేశ్వర రావు రూపొందించాడు. కానీ, తరువాత ఆయన సినిమాను వదలుకోవటంతో సంగీత దర్శకుడు మారేడు.)

శంకరాభరణం రాగం శివుడికి ఇష్టమైన రాగంగా భావిస్తారు. ఈ రాగాన్ని ‘ధీర శంకరాభరణం’ అంటారు. శివుడికి అలంకారం లాంటి రాగం. ఇందులో అనేక గమకాలు ఉండటం వల్ల ‘సర్వ గమక మానిక రక్తి రాగం’ అంటారు. ఈ రాగ గానం వల్ల శ్రేయస్సు కలుగుతుందని, వైద్యలక్షణాలు కల గానమనీ అంటారు. పాటను ఈ రాగంలో రూపొందించాలని నిర్ణయించటంతో సగం విజయం సాధ్యమైనట్టే.

పాట మొత్తం సంబోధన ప్రధానంగా సాగుతుంది. మొదటి చరణంలో అభ్యర్థన కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా వెంటనే దర్శనం ఇమ్మన్న వేడుకోలు కనిపిస్తుంది. వేడుకోలులో కాస్త ‘అహం’ కూడా కనిపిస్తుంది.

నిన్ను చూడ మది కోరితిరా
నీ సన్నిధానమున చేరితిరా
కన్నడ సేయక కన్నులు చల్లగ..
మన్నన సేయర గిరిజా రమణా..

దీన్లో ‘కన్నడ సేయక’ అన్న పదం ‘బెట్టు చేయక’ అనే అర్థాన్నిస్తుంది. పాట అధికంగా ఎన్టీరామారావు క్లోజప్పులు, పాయింట్ ఆఫ్ వ్యూ షాట్‌లలో సాగుతుంది. రామారావు అభినయం సందర్భోచితంగా, భావోద్దీపితంగా ఉంటుంది.

పల్లవి పాడగానే రావణాసురుడి వదనం కైలాసంలో నృత్యం చేస్తున్న శివపార్వతులపై డిజాల్వ్ అవుతుంది శివ పార్వతుల నృత్యం, శాంతంగా, రమ్యంగా ఉంటుంది.

సంగీతం కూడా ఆహ్లాదకరంగా, రమ్యంగా ఉంటుంది.

తాండవం పలు రకాలు. తాండవం లోని రకాల గురించి భావప్రకాశ లోనూ, నందికేశ్వరుడి అభినయ దర్పణం లోనూ వివరణలున్నాయి. శివతాండవంలో ప్రధానంగా  ఊర్థ్వ తాండవం, త్రిపుర తాండరం, గౌరీ తాండవం, సంధ్యా తాండవం అనే రకాలను   ప్రస్తావిస్తారు.

శివుడి తాండవ నృత్యాన్ని’ ఊర్థ్వ తాండవం’ అంటారు. శివుడు గౌరీదేవి కలసి చేసే తాండవం ‘గౌరీ తాండవం’. సంధ్యా సమయంలో చేసేది ‘సంధ్యా తాండవం’. ఇవి కాక, వేగంగా ఎగురుతూ, బీభత్సంగా చేసే తాండవం ‘ఉచ్చండ తాండవం’. ‘ప్రచండ తాండవం’లో వేగంగా ఎగిరి దూకటం ఉంటుంది. ‘ప్రేరణ’ తాండవం అధికంగా పురుషులు చేస్తారు. ఇలా పలు రకాల తాండవాలను సందర్భోచింతంగా ఈ పాటలో ప్రదర్శిస్తారు. మారుతున్న ‘మూడ్’ని బట్టి సంగీతం మారుతుంది, నృత్యం మారుతుంది. గమనించవలసిన అంశం ఇది. ఆ కాలంలో కళాకారులు ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా, శాస్త్రాల  తెలివిడితో ఔచిత్యాన్ని పాటిస్తూ రూపొందించేవారో ఈ పాటలో చరణాల నడుమ వచ్చే శివ పార్వతుల నృత్యాన్ని గమనిస్తే తెలుస్తుంది.

‘నిన్ను చూడ మది కోరితిరా’ చరణంలో కూడా అభ్యర్థన ఉంటుంది. రామారావు వదనంలో కాస్త అహంకారం, అతిశయం, అభ్యర్ధనలు కనిపిస్తాయి. ఘంటసాల స్వరం కూడా భక్తిని నింపుకుని కూడా ఈ భావనలను ప్రదర్శిస్తుంది. రెండవ చరణం వచ్చే సరికి పాట ‘టోన్’ మారుతుంది. పదాలు మారుతాయి. కాస్త అసహనం, కాస్త తొందర, చిరాకు కనిపిస్తాయి. భాష కూడా మారుతుంది.

సర్ప భూషితాంగా కందర్ప దర్ప భంగా భవ
పాపనాశ పార్వతీ మనోహర
హే మహేశ వ్యోమహేశ త్రిపుర హర..

అభ్యర్థన వేగవంతమయింది. అంటే అభ్యర్ధన తీవ్రత పెరిగింది. పిల్లవాడు ఏదో అడుగుతాడు. తండ్రి పట్టించుకోడు. అప్పుడు గట్టిగా అరచి కోపంగా చెప్తాడు. అది, ఈ చరణంలో కనిపిస్తుంది. మొదటి చరణంలోని సారళ్యం ఈ చరణంలోని పదాడంబరంలా మారింది. దాంతో ఉద్వేగం పెరుగుతుంది.  ఉద్విజ్ఞ్నతను  పెంచుతుంది నేపధ్యంలో వినిపించే తబలా.  గమనిస్తే,  శివుడి నృత్యం కూడా మారుతుంది. ఉద్వేగ భరితమవుతుంది. ఆ ఉద్వేగానికి తోడునిస్తుంది సంగీతం. ‘సర్పభూషితాంగా, కందర్ప దర్ప భంగా’ వంటి పదాల చివరలో వినిపించే తబలా ధ్వనులు అద్భుతంగా ఉంటాయి. ఆ గతిని ‘తిరికిట’ అంటారు. ఇది పాటకు ఉద్వేగపుటానందానిస్తుంది. ‘ఇదిగో శివుడు వచ్చేస్తున్నాడన్న’ భావన కలిగిస్తుంది.

తరువాత పాదం వేగంగా పాడేప్పుడు కెమెరా కూడా వేగంగా కదులుతూ రామారావు క్లోజప్పుకు వస్తుంది. ఇది కూడా పాట వల్ల కలిగే ఉద్వేగాన్ని పెంచుతుంది. మళ్లీ ‘కాన రార’ అని ఆరంబించేప్పుడు దూరం నుంచి ‘ట్రాలీ షాట్’ లో దగ్గరగా వస్తుంది. కానీ ఇంతకు ముందరి వేగం ఉండదు. నెమ్మదిగా వస్తుంది. చరణంలోని ఆవేశం మళ్లీ పల్లవి దగ్గరకు వచ్చేసరికి ఆలోచనగా మారుతోందన్న దాన్ని కెమెరా ప్రదర్శిస్తుంది.

పాట పూర్తయ్యేసరికి నంది నవ్వుతాడు. రావణిడికి ఆగ్రహం వస్తుంది. కైలాసాన్ని లంకకు తీసుకు పోతానంటాడు. ఇక్కడి నుంచి పాట ‘శివతాండవ స్తోత్రం’ గా మారుతుంది. నృత్యం మారుతుంది. సంగీతం మారుతుంది. ఘంటసాల పాడే విధానం మారుతుంది. స్వరం మారుతుంది. ఎన్టీరామారావు నటన మారుతుంది. కెమెరా కదలికలు  మ్తారతాయి.  పాట స్వరూపమే మారిపోతుంది.

‘ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే’ అనేప్పుడు ఎన్టీరామారావు తల పైకెత్తి ఎగరేసి ‘లంకకు కైలాసాన్ని తీసుకుపోతాను’ అనటంలో రావణాసురుడి వ్యక్తిత్వం తెలుస్తుంది. కోరినది కావాలి. అడిగినది ఇవ్వాలి. కావాల్సింది దక్కాలి. మానవుడైనా దేవుడైనా ఇంతే.. నాటకాలలో నటించటం వల్ల సంభాషణలు పలకటంలో గొప్ప శిక్షణ లభిస్తుంది. ఎలాగైతే శాస్త్రీయ సంగీతం తెలిసిన గాయకులకు, తెలియని గాయకులకు తేడా ఉంటుందో, అలాగే నాటకానుభవం ఉన్న నటులకు, లేని నటులకు తేడా తెలిసిపోతుంది. ఒక్కొక్క సంభాషణను పలకటం, పాట మొత్తం కలిగించే ప్రభావాన్ని మించి ఉంటుంది. రెండవ చరణంలోని వేగం, ఉద్వేగం, ఆవేశం అన్నీ ఈ సంభాషణ పలకటానికిక ప్రాతిపదికను ఏర్పాటు చేస్తాయి.

వెంటనే కైలాసాన్ని పెకిలించే పనిని ప్రారంభిస్తాడు. శివతాండవ స్తోత్రం పాడతాడు. శివతాండవ స్తోత్రం మొత్తం 14 శ్లోకాలుంటాయి. వాటన్నింటినీ సినిమాలో వాడలేదు. 11, 10, 9 శ్లోకాలను ఇదే వరసలో వాడేరు సినిమాలో.

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్।

‘లంకాద్వీపానికి తరలిచుకుపోతాను’ అనగానే కెమెరా కోణం మారుతుంది. రావణాసురుడు రెండు కాళ్లు దూరం పెట్టి రెండు చేతులు బలంగా బిగించి, కాస్త తల పైకెత్తి, పైకి చూస్తూ స్తోత్రం ఆరంభిస్తాడు. కెమెరా పై ఏంగిల్ షాట్ నుంచి క్రిందకు దిగి వస్తుంది. ఘంటసాల స్వరం ఆవేశభరితం. ఎన్టీరామారావు నుంచోటం, పదాలు పలకటం, ముఖంలో భావాలు సర్వం ‘రౌద్రభరితం’.

‘హహ్యవాట్’ అంటుటే సంగీతం వచ్చేలోగా వంగి కైలాసాన్ని చేతులతో కదలించే ప్రయత్నిస్తాడు.

ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః॥

ఇక్కడ గొప్ప నటన తెలుస్తుంది. ‘ధిమిధిమి’ అంటున్నప్పుడు రామారావు తల లయకు అనుకుణంగా ఊగుతుంది. ఇక బరువైన వస్తువును ఊపిరి బిగబట్టి కదల్చాలని ప్రయత్నిస్తున్నట్టనిపిస్తుంది. స్తోత్ర లయ, ఆవేశం, ఉద్వేగం, సర్వం నటనలో కనిపిస్తాయి. ఘంటసాల స్వరంలో కనిపిస్తాయి. తెరపై అన్నీ కలగలసి సాక్షాత్కరించి ప్రేక్షకుడిని ఆ భావనలు అనుభవింపచేస్తాయి. ‘తుంగ మంగళ’ వరకూ చూపిన కోణం మార్చి ‘ధ్వనిక్రమ’ దగ్గర పక్క నుంచి చూపిస్తుంది కెమెరా. దాంతో రావణ పాత్ర ఒత్తిడి, ఉపయోగిస్తున్న బలం, ఆవేశం, క్రోధం సర్వం ప్రేక్షకుడికి ప్రస్ఫుటమవుతాయి. ‘ప్ర’ అన్న పదం పరిసేప్పుడు రామారావు తలను ఎంత తీవ్రంగా కదుపుతాడంటే చూసే వారికి ఆవేశం వస్తుంది. నిజంగా తానే ఆ బరువు ఎత్తుతున్న భావనను అనుభవిస్తాడు. చివరలో ‘తాండవ శివః’ అనటంలో ధిక్కారం కనిపిస్తుంది. ఘంటసాల ఉచ్చారణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ‘శివః’ లో ‘హ’ స్పష్టంగా తెలుస్తుంది. ‘హ’ అన్నప్పుడు రామారావు కళ్లలో క్రోధం, చిన్న తడి ఛాయతో పాటు ‘ఇంకా దర్శనం కాలేదు, ఇది కదలేదు’ అన్న విభ్రమ కనిపిస్తుంది. తన తల కదలికతో శివతాండవ స్తోత్రం లయను జత చేస్తూ భావాలు ప్రదర్శించటం గమనించవచ్చు.

‘ఓం నమః శివాయ’ అనే సమయానికి మళ్లీ కోణం మారుతుంది. రావణుడు కెమెరా వైపు చూస్తుంటాడు. ఆ వదనంలో ప్రతిఫలించే భావాలు, ఘంటసాల స్వరం ధ్వనించే భావాలను ద్విగుణీకృతం చేస్తాయి. ‘శివాయ’ అంటున్నప్పుడు రామారావు వదనంలో బరువును మోస్తున్నట్టు ముఖాన్ని ఒక సెకనులో వందో వంతు సేపు ప్రతిబింబింపచేస్తాడు. నిజంగా కైలాసాన్ని కదిలించే ప్రయత్నం చేస్తున్న భావవను అనుభవిస్తాడు ప్రేక్షకుడు. నటన అంటే ఇది. నిజానికి అక్కడ కొండ లేదు. దాన్ని కదిలించటం లేదు. అంతా సెట్. రామారావు నటిస్తున్నాడు. కానీ పాట, సంగీతం, కెమెరా, నటన అనే కలగలసి భ్రమను ‘నిజం’ అనిపింపచేస్తాయి. అదీ కళ! భ్రమను నిజమని భ్రమింప చేయటం! ఈ సమయంలో రామారావు వదనాన్ని క్లోజప్పులో చూసిన వారెవరూ అది ‘అబద్ధం’ అని అనలేరు.

తరువాత శంఖధ్వనులప్పుడు గొప్ప నటనను ప్రదర్శిస్తాడు రామారావు. నృత్యం మారింది. నంది వెక్కిరింతగా నవ్వుతాడు. రావణుడి కోపం పెరుగుతుంది. భుజం ఆసరాగా కైలాసాన్ని కదిలిస్తాడు. వెనుక శివతాండవ బాణీ మారుతుంది. నంది ఆశ్చర్యపోతాడు. కాస్త భయం కనిపిస్తుంది.

అగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతమ్।

ఇప్పుడు రావణుడి వదనంలో భావం మారుతుంది. నటన మారుతుంది. కెమెరా క్లోజప్పుకు వస్తుంది. నిజంగా పర్వతాన్ని కదలిస్తున్న భావన, బరువును పళ్ల బిగుస్తున్న భావన కనిపిస్తుంది. ఒక్క సెకను బరువు భరించలేనన్నట్టు తల పైకెత్తుతాడు. అద్భుతం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నటనకు సహజత్వం ఆపాదిస్తాయి. ఎంత రావణాసురుడయినా, వెయ్యి మందిని చొక్కా నలగకుండా కొట్టి, వంద కార్లను చిటికెన వేలితో తన్ని దూరం విసిరే మన సూపర్ హీరోల్లా ప్రవర్తించలేదు. అందుకే ఆనాటి పాత్రలు అంత సహజంగా ఉండి ప్రేక్షకుల మనస్సులలో స్థిరపడ్డాయి.

స్మరాంతకం పురాంతకం భావాంతకం మఖాంతకం
గజాంతకాంధ కాంతకం తమంతకాతకం భజే॥

అద్భుతం! పాట వినాలా, ఘంటసాల స్వరం పలికే భావాలు అనుభవించాలా! స్తోత్రంలో పదాల సౌందర్యం, లయను అనుభవించాలా, రామారావు నటను అనుభవించాలా.. అన్నీ కలగలసి సృష్టిస్తున్న మాయాజాలంలో మధురాన్ని అనుభవించాలా తెలియక ఉబ్బితబ్బిబ్బవుతాడు ప్రేక్షకుడు. ఏది ఎన్ని సార్లు అనుభవించినా తనివి తీరదు. అందుకే ఎన్ని మార్లు చూస్తే అన్ని మార్లు ఆనందించటమే, కాక అంత వరకూ గమనించని కొత్త అద్భుతాలు తెలుస్తుంటాయి. మళ్లీ చూడాలనిపిస్తుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అది పాత సినిమాలకు, పాటలకు, కొత్త సినిమాలకు పాటలకూ తేడా.

ఇప్పుడు శివతాండవ లయ మారుతుంది. నెమ్మదిగా రౌద్రం ప్రవేశిస్తుంటుంది. మంచు కురటవం మొదలయింది.

ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచ కాలిమప్రభా-
-విలంబికంఠ కందలీరుచి ప్రబద్ధకంధరమ్।

ఇప్పుడు కెమెరా కొండను భుజాలకెత్తుకుంటున్న రావణాసురుడిని చూపిస్తుంది.

స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే॥

స్మరచ్ఛిదం అనేప్పుడు కెమెరా మరీ క్లోజప్పుకు వచ్చి రామారావు నుదుటిని చూపిస్తుంది. నెమ్మదిగా ఆయన పర్వతాన్ని భుజాల అధారంగా పైకి ఎత్తటం చూపుతుంది. పాట ఉద్వేగం పెరుగుతుంది. ఘంటసాల పాటడంలో బరువును ఎత్తుకున్న తొందర, వేగం, ధ్వనిస్తాయి. ‘పిచ్’ పైకి వెళ్తుంటుంది చివరలో చేతులతో కష్టపడి మ్రోయటం కనిపిస్తుంది. బాణీ మారుతుంది. నృత్యం మారుతుంది. ఉద్వేగం ఉద్విగ్నతలు నృత్యంలో, సంగీతంలో, కెమెరా కదలికల్లో కనిపిస్తాయి. కైలాసం కదలుతుంటుంది. లయ తప్పుతుంటుంది. శివుడికి అగ్రహం కలుగుతుంటుంది.

ఇప్పుడు వస్తుంది ఎంతో చర్చించిన ‘షాట్’. క్రోధంతో చూస్తున్న శివుడి వదనంపై డిజాల్వ్ అవుతుంది. దశ శిరస్సులపై కైలాసాన్ని ఎత్తి వేస్తున్న రావణాసురుడు కనిపిస్తాడు. ఆ కాలం సాంకేతిక పరిజ్ఞానంతో పోలిస్తే అత్యద్భుతమే కాదు పరమాద్భతమైన షాట్ ఇది. ‘Masked shot’ కు అత్యద్భుతమైన నమునా ఈ షాట్.

తెరపై రావణాసురుడు చేతులు రెండు వెపుల సాచి తల పై పర్వతాన్ని బాలెన్స్ చేస్తూ కనిపిస్తాడు. ఒకో వదనం ఒకో భావాన్ని వ్యక్త పరుస్తుంటుంది. అన్నీ బరువును మోస్తున్న భావననిస్తాయి. కళ్లు పైకి చూస్తుంటాయి. కొన్ని పక్కుకు చూస్తుంటాయి. కానీ ఏ ఒక్క వదనంలో మరో వదనం ప్రదర్శించే భావం ఉండదు.

‘మాస్క్ షాట్’ అంటే తనకవసరమైనంత మేరకే వస్తువులకు చూపిస్తూ మిగతా అంతా కనబడకుండా చేయటం. ఈ ‘షాట్’ కోసం రామారావు వదనాన్ని పది వేర్వేరు మూడ్ లలో షూట్ చేసి, ఒక్కక్కటిగా ఒక్క తలను జోడిస్తూ, వాటి పై కైలాసంను ప్రతిష్ఠించారు. ఇదంతా పూర్తయే వరకూ చేతులు సాచి, ఒకే రకమైన ఫోజులో రామారావు నిలబడాల్సి ఉంటుంది. ఇప్పుడయితే కంప్యూటర్లు వచ్చాయి. అవి లేని కాలంలో అంతా మాన్యువల్‌గా చేయాలి. అది జరిగినంత సేపూ కొన్ని గంటలు, (కొందరు 20 గంటలు అంటారు) అలాగే కదలకుండా నిలబడి ఉండాలి. రామారావు అలాగే నిలబడ్డారు. ఈ ఒక్క దృశ్యం చాలు ఆనాటి కళాకారులకు వేల వేల నమస్కారాలు చేసేందుకు. అనిర్వచనీయం, అద్భుతం, అద్వితీయం, అమేయం.

ఆ తరువాత ఒక్కో వదనం ‘ఓం నమశివాయ’ అని అరుస్తూ అదృశ్యమవటం మరో గొప్ప దృశ్యం. ఒకో అరుపుకూ కేంద్రంలో ఉన్న వదనంలో బరువు పెరుగుతూ, భరించలేకపోతున్న భావన కనిపిస్తుంటుంది. చివరికి శివుడు బొటనవ్రేలితో నేలను నొక్కటంతో బరువు భరించలేక కైలాసం క్రింద పడతాడు రావణుడు.

క్లోజప్పులో, జాలి గొలుపుతూ, అహంకారం నశించి అభ్యర్ధన, వేడుకోలు ఉట్టి పుడుతుండగా పద్యం పాడతాడు. ‘కరుణ గానవయ్య కైలాసగిరి నివాస’ అని రెండోసారి హై పిచ్‌లో అన్నప్పుడు అనంతాకాశం, ఆకాశం వైపు చేయి సాచిన రావణుడు గొప్ప షాట్.

‘ఈ జీవితం నీకే సమర్పిస్తాను’ అంటూ ప్రేవులు తీసి రుద్రవీణలా మలచి వాయించటం ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.

పురాణంలో కండరాలలోని ‘ఫైబర్’ను తీగలుగా మలుస్తాడు. సినిమాలో ప్రేవులను తీగలుగా మలుస్తాడు. ఇప్పుడు అది కుదరదని తెలిసినా, రామారావు బాధను వదనంలో ప్రతిఫలించటం, కెమెరా కోణాలు, సంగీతం, నెమ్మదిగా ప్రాణాలు పోతూ శక్తి ఉడిగిపోతున్నట్టు నటన, సర్వం ఈ దృశ్యాన్ని నమ్మదగ్గ దృశ్యంగా మలుస్తాయి.

ప్రపంచ వ్యాప్తంగా తరచి చూసినా కనబడదు ఇలాంటి అద్భుతమైన పాట, సన్నివేశ సృష్టీకరణ, చిత్రీకరణ. అందుకే తెలుగు పౌరాణిక సినిమాలకు సాటి వచ్చే మరో భాష చిత్రం లేదనటం అతిశయోక్తి కాదు. ఈ 14 నిమిషాల దృశ్యం చాలు, ప్రపంచ సినిమాలన్నీ దిగదుడుపు అనటానికి (మనం ఇంకా మాయాబజార్ ప్రస్తావించుకోలేదు).

ఆ కాలంలో తెలుగు సినిమాలు ప్రపంచ సినిమాలతో పోటీ పడగలగటమే కాదు అగ్రస్థానంలో నిలచే శక్తి ఉన్నవి. అప్పుడు మన సినిమాలంటే మనకు చులకన. ఇప్పుడు ప్రపంచం కుగ్రామం అయింది. మన సినిమాలు ప్రపంచం నలుమూలలా ప్రదర్శించే వీలుంది. దేశ విదేశాలల్లో మన ‘సినిమా సాఫ్ట్ పవర్’ ఉచ్చస్థాయిలో ఉంది. కానీ మన సినిమాలను సినిమాలు అని ధైర్యంగా అనలేని పరిస్థితులున్నాయి.

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః।
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః॥

చంద్రుని తలపై కిరీటంగా కలవాడు, ఎర్రని సర్పమాలలతో కేశాలను బిగించి ముడివేసిన వాడు, ఇంద్రాది దేవతల తలలలోని పువ్వుల పుప్పొడిలో ధూళిధూసరమైన ఉన్న నల్లని పాదపీఠము కలవాడు అయిన పరమేశ్వరుడు మాకు తరగని సిరులు కరుణించగాక.

ఓం నమః శివాయ.

(‘కానరార’ పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=9JMMK12lKTc )

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version