[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
గత వారం ‘మానవుడే మహనీయుడు’ అన్న ‘బాల భారతం’ సినిమాలోని పాట గురించి రాసిన వ్యాసం అధిక సంఖ్యలో పాఠకులను విశేషంగా ఆకర్షించటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇంకా ఆనందింపచేసే రీతిలో రచించాలన్న ఉత్సాహాన్ని పెంచింది. ప్రోత్సాహాన్నిచ్చింది.
అయితే ఒక వ్యాఖ్య ఆలోచింప చేసింది.
వ్యాస రచనను మొచ్చుకుంటూ “ఈ గీతం తన గీతాన్ని అనుసరించి ఆరుద్ర రాశారు అన్న శ్రీశ్రీ గారి అభియోగం గురించి రాసి ఉంటే బాగుండేది.. కనీసం ఒక్క వాక్యం అయినా” అని వ్యాఖ్యానించారు.
నిజానికి, ఈ వ్యాఖ్యకు సమాధానం ఈ రెండవ భాగం. నిడివి ఎక్కువ అవుతుందని ఒక వ్యాసాన్ని రెండు భాగాలుగా ప్రచురించటం వల్ల ‘గాంధారి గర్వభంగం’ ప్రస్తావన రెండవ భాగంలోకి వచ్చింది. అందుకని ఆ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ రెండవ భాగం ఆరంభిస్తున్నాము.
– సంపాదకులు
***
“ధర్తీ కీ షాన్ తూ హై
మను కీ సంతాన్
తేరీ ముఠియోం మే బంద్ తూఫాన్ రే
తేరే మనుష్య్ దూత్ తూ బడా మహాన్ హై
భూల్ మత్
మనుష్య్ తూ బడా మహాన్ హై”
1958లో హిందీలో ‘గజ గౌరీ’ అన్న ఒక పౌరాణిక సినిమా విడుదలయింది. ఆ కాలంలో ఎంతో సంచలనం సృష్టించింది. ప్రజాదరణ పొందింది.
వందమంది సంతానం తయారు చేసిన ఏనుగు బొమ్మతో ‘గజ గౌరి’ వ్రతం చేస్తుంది గాంధారి. అది చూసి తాను సరిగ్గా వ్రతం చేయలేకపోతున్నానని దుఃఖిస్తుంది కుంతి. ఆమె దుఃఖాన్ని ఉపశమింప చేసేందుకు అర్జునుడు స్వర్గానికి బాణాలతో నిచ్చెన వేస్తాడు. ఆ నిచ్చెన ఎక్కుతూ భీముడు స్వర్గం చేరి ఐరావతం తెస్తాడు. ఆ సందర్భంలో వస్తుందీ మన్నాడే పాడిన పాట. అత్యంత ప్రతిభావంతుడయిన సంగీత దర్శకుడు ‘సుధీర్ ఫడ్కే’ ఈ పాటను స్వరపరిచారు. ఈ పాటను రాసింది భరత్ వ్యాస్.
ఆ కాలంలో పౌరాణిక సినిమాల పాటలంటే భరత్ వ్యాస్ పేరు వెంటనే వినిపించేది. స్వచ్చమైన, శుభ్రమైన హిందీ పదాలను, ఉచ్చస్థాయి భాషను వాడుతూ, ఒక్క ఉర్దూ పదం, ఫార్సీ పదం దొర్లకుండా గీతాలను రచిస్తాడు భరత్ వ్యాస్. భారతీయ పురాణాలు, సంస్కృతి, సంప్రదాయాల పట్ల భరత్ వ్యాస్‌కు అధికమైన భక్తి. కవి ప్రదీప్ అప్పుడప్పుడు సర్వసాధారణంగా జనజీవితంలో భాగమైపోయిన వతన్, షహీద్ వంటి పదాలను వాడతాడు కానీ భరత్ వ్యాస్ శుద్ధ సంస్కారి హిందీ పదాల వాడకంతో ఏ మాత్రం రాజీ పడడు.
హిందీ సినిమాలో ఈ సన్నివేశం సరిగ్గా తెలుగులో ‘బాలభారతం’లో లాంటి సన్నివేశమే.
‘బాల భారతం’ సినిమా స్వతంత్ర సినిమా. ‘గజ గౌరి’లోని పౌరాణిక కథకు కౌరవులు, పాండవుల సన్నివేశాలను జోడించి తీసిన సినిమా. సందర్భోచితంగా పాటలను స్వతంత్రమైన రీతిలో వాడుతూ తీసిన సినిమా. హిందీ సినిమా ఆరంభం ఆర్యదేవుడయిన సూర్య దేవుడి ప్రార్ధనతో ఆరంభమవుతుంది. బాల భారతం సినిమా’ నారాయణ నీ లీల నవరస భరితం’ అనే మధురమైన గీతంతో ఆరంభమవుతుంది. కౌరవ పాండవ జనం పాటలోనే అయిపోతుంది. పతాక సన్నివేశం మాత్రం రెండు సినిమాలలో ఒకటే. భీముడు నిచ్చెన ఎక్కుతూ స్వర్గానికి వెళ్ళటం, నేపథ్యంలో మానవుడి గొప్పతనాన్ని వివరిస్తూ పాట వినిపించటం. కానీ ‘హిందీ’ సినిమాలో భరత్ వ్యాస్ రాసిన పాటలోని ప్రధానాంశాలను ఆధారం చేసుకుని మానవుడి ఔన్నత్యాన్ని ప్రస్ఫుటం చేస్తూ తెలుగులో ఆరుద్ర స్వతంత్రంగా రచించిన పాట ‘మానవుడే మహనీయుడు’.
‘మనుష్య్ తూ బడా మహాన్ హై’ అంటే ‘మానవుడా నువ్వెంతో మాహనుభావుడివి, గొప్పవాడివి’ అని అర్థం. దీన్ని ఆరుద్ర ‘మానవుడే మహనీయుడు’ అన్న పల్లవితో మొదటి పాదంగా తీసుకున్నాడు. అనువాదాలకు ఆరుద్ర పెట్టింది పేరు. ‘ఆహ్’ సినిమాను తెలుగులో ‘ప్రేమ లేఖలు’గా డబ్బింగ్ చేసినప్పుడు శంకర్ జైకిషన్ బాణీలకు హిందీ పాటల భావం చెడకుండా అద్భుతంగా రాశాడు ఆరుద్ర. మధ్యలో తనదైన ఆలోచనలను చొప్పించాడు.
‘పాడు జీవితమూ యవ్వనమూ’ తెలుగులో . హిందీలో ‘ఛోటీసీ యే జిందగానీ రే’. ‘సున్తె తే థే నామ్ హమ్’ తెలుగులో ‘నీ పేరు విన్న’ అయింది. ‘రాజాకి ఆయేగీ బారాత్’ అన్న హిందీ పాట తెలుగులో’ పందిట్లో పెళ్ళవుతున్నాదీ’ గా మారింది. ఇలా రాయటం ఆరుద్రకు వెన్నతో పెట్టిన విద్య.
హిందీ పాటలో ‘ధర్తీ కీ షాన్ హై తూ’ తెలుగులో ‘జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడే’ అయింది. అంటే హిందీ పల్లవిలో మొదటి పాదం తెలుగు పాటలో మొదటి చరణంలో చివరి పాదం అయిదన్న మాట. అంటే, హిందీ పాట భావాన్ని తీసుకుని, ఆ భావాన్ని ఆకళింపు చేసుకుని సందర్భంలో ఒదిగేట్టు భావాన్ని ప్రదర్శించాడన్న మాట ఆరుద్ర. అందుకే ఇది హిందీ పాట సందర్భాన్ని పోలి ఉన్న సందర్భం ఉన్న పాటే అయినా, ‘బాల భారతం’ పూర్తిగా స్వతంత్ర నిర్మాణం కాబట్టి, పాటను కూడా స్వతంత్ర గీతంగా రచించాడు ఆరుద్ర.
అయితే, హిందీలో ‘గజ గౌరీ’ ఎంతగా ప్రజలను అలరించిందంటే , తెలుగులోకి ఈ సినిమా 1959లో ‘డబ్’ అయింది. ‘డబ్బింగ్’ సినిమా అంటే కేవలం మాటల భాష మారుతుంది. సినిమా మొత్తం కేవలం సంభాషణల తర్జుమా మాత్రమే ఉంటుంది. నిజానికి ఇలా డబ్బింగ్ సినిమాకు మాటలు, పాటలు రాయటం చాలా కష్టం. ఎందుకంటే, ప్రతి భాషకూ తనదైన ప్రత్యేకమైన ఉచ్చారణ పద్ధతి ఉంటుంది. లయ ఉంటుంది. ఒక భాష నుంచి మరో భాషలోకి తర్జుమా చేసేటప్పుడు సంభాషణ రచయితగానీ గేయ రచయితగానీ మూల భాష లయను గ్రహించాలి. పెదిమల కదలికలకు అనుగుణంగా ధ్వనించే మాటలు రాయాలి. ‘లాంగ్ షాట్’లలో ఎలా రాసినా సరిపోతుంది. కానీ, క్లోజప్పులలో పెదిమలు ఓ రకంగా కదలుతుంటే, మాటలింకో రకంగా ధ్వనిస్తుంటే చూసే ప్రేక్షకుడు సినిమా నుంచి విముఖుడవుతాడు. అందుకని అనువాదం ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా, పెదిమలు కలిసి పలకాల్సిన ‘ప, బ, మ’ వంటి పదాలున్నప్పుడు, అవే పదాలు రావాల్సి ఉంటుంది. పైగా ఇది ‘కత్తి మీద సాము కన్నా కఠినం’. మూలం భావం చెడకూడదు.
‘గజ గౌరీ’ తెలుగులోకి ‘గాంధారి గర్వభంగం’గా డబ్బింగ్ అయింది. తెలుగులో రచించింది శ్రీశ్రీ. సంగీత దర్శకత్వం వహించింది ఘంటసాల. ‘మానవుడే మహనీయుడు’ పాట సన్నివేశమే. కానీ హిందీ పాటను అనుసరించి రాయాల్సి ఉంటుంది. అయితే, ‘మనుష్య్ తూ బడా మహాన్ పై’ పాట నేపథ్యంలో వచ్చే పాట. కాబట్టి, పెదిమల కదలికలతో పాటలో పదాలు సరిపోవాలన్న నియమం ఉండదు. దాంతో, హిందీ పాట భావాన్ని, బాణీని అనుసరిస్తూ స్వతంత్ర రచన చేసే వీలు లభిస్తుంది అనువదించే వారికి. అందుకే శ్రీశ్రీ తెలుగు పాటలో హిందీ పాట భావాన్ని అనుసరిస్తూ కూడా తెలుగులో స్వతంత్ర రచన అనిపించేట్టు పాటను రచించాడు.
“పదునాలుగు లోకముల ఎదురే లేదే
పదునాలుగు లోకముల
ఎదురన్నది లేదుగా
మానవుడే సర్వశక్తి ధాముడు కాదా.
మనుష్యుడిల మహానుభావుడే చూడగ”
‘మనుష్య్ తూ బడా మహాన్ హై’ ను శ్రీశ్రీ ‘మానవుడే సర్వశక్తి ధాముడు కదా’ అంటే ఆరుద్ర ‘మానవుడే మహనీయుడు’ అన్నాడు. ఒకే ఆలోచనను ముగ్గురు కవులు మూడు విభిన్నమైన రీతులలో వ్యక్తిపరచారు.
‘హిందీ’లో ‘భూమికే అలంకారం నీవు. మనువు సంతానము.. నీ గుప్పిట్లో తుఫానులు ఇమిడి ఉన్నాయి. నువ్వు మరవకు నువ్వు గొప్పవాడివి’ అన్న భావాన్ని శ్రీశ్రీ అనుసరించలేదు. ‘పదునాలుగు లోకాల్లో ఎదురు లేదు. ఎదురన్నది లేదు’ అని మనిషి సర్వ శక్తి ధాముడన్నాడు. అనువాదంలో పెదిమకదలికల బంధనాలు లేవు కాబట్టి ఆరుద్ర ‘మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మహనీయుడు’ అన్నాడు.
సూర్యుడు ఒక్కడే, ఒక్కొక్కరికి ఒక్కక్క పోలిక తోచేట్టు, ఒకే సందర్భం ఒకో కవిలో ఒకో రకమైన స్పందనకు కారణమయింది. ఎవరూ ఎవరినీ అనుసరించలేదు. అనుకరించలేదు. సందర్భాన్ని అనుసరిస్తూ స్వతంత్ర రచనలు చేశారు.
‘కవి దృష్టి’ ఆయన సందర్భాన్ని అర్థం చేసుకునే విధానంపై ప్రభావం చూపిస్తుందనేందుకు ఈ హిందీ పాట, రెండు తెలుగు పాటలు చక్కని ఉదాహరణలు. ‘భరత్ వ్యాస్’ జాతీయ భావాలు సమృద్ధిగా కల కవి. భారతీయతకు ఆయన పెద్ద పీట వేస్తాడు. అందుకే ‘మను కే సంతాన్’ అన్నాడు. భారతీయ ధర్మం ప్రకారం మనుషులందరూ మనువు సంతానం. అప్పటికింకా సమాజంలో పాండిత్యం కానీ , మెదళ్లు కానీ కలుషితం కాలేదు. అందుకని కవి హృదయం అర్థం చేసుకున్నారు. ‘భూల్ మత్ తూ బడా మహాన్ హై’ అన్నాడు. అంటే, మనిషి తన గొప్పతనాన్ని మరవకూడదు. సృష్టిలో తన ఔన్యత్యాన్ని శక్తిని మరవకూడదు అని నొక్కి చెప్తున్నాడు. ఎందుకంటే, అప్పటికే భారతీయులు తమ భారతీయతను విస్మరిస్తున్నారు. తమ అసలు గొప్పతనాన్ని విస్మృతిలోకి నెట్టేస్తున్నారు.
శ్రీశ్రీ వామపక్ష భావజాలం గురించి చెప్పనవసరం లేదు. అందుకని ఆయన ‘మానవుడే సర్వశక్తి ధాముడు’ అన్నాడు. ఆరుద్రలో మానవ కేంద్రవాదం అధికంగా కనిపిస్తుంది. అందుకని ఆయన ‘శక్తియుతుడు, యుక్తిపరుడు’ అన్నాడు.
“తూ జో చాహే పర్వత్ పహోడోం కో ఫోడ్ దే
తూ జో చాహే నదియోం కె రుఖ్ కో భీ మోడ్ దే
తూ జో చాహే మాటీ సే అమృత్ నిచోడ్ దే
తూ జో చాహే ధర్తీ కో అంబర్ సే జోడ్ దే
అమర్ తేరే ప్రాణ్ అన్
మిలా తుఝుకో వరదాన్
తేరీ ఆత్మా మే స్వయం భగవాన్ హై రే
మనుష్య్ తూ బడా మహాన్ హై రే..”
ఇది హిందీలో భరత్ వ్యాస్ భావన. మనిషి పర్వతాలను దాటతాడు. నదుల దారి మళ్లిస్తాడు. మట్టి నుండి అమృతం పిండుతాడు. ఆకాశాన్ని భూమిని ఏకం చేయగలడు. మనిషి ఆత్మలో స్వయంగా భగవంతుడున్నాడు. భారతీయ తత్వచింతనను గుప్పించాడు.
“మానవుడే తలచినచో
గిరులు నెగుర వేయడా
మానవుడే తలచినచో
నదుల గతులు మార్చడా
మానవుడే తలచినచో భూమ్యాకాశాలనే
ఏకంబుగా చేయగల సేతువు నిర్మించడా
మానవుడే నోయ్
మానవుడే నోయ్ సురాసుర కిన్నెర గంధర్వుల
గర్వమణచ గలిగినట్టి ధీరుడోయ్”
మానవుడిలో భగవంతుడున్నాడని ఒప్పుకోవటం శ్రీశ్రీకి కుదరదు. అందుకని సురాసుర కిన్నర గంధర్వుల గర్వం అణచగలిగే ధీరుడని దేవతలపై మానవుడి అధిక్యాన్ని నిరూపించాడు. మిగతా అంతా హిందీలోని మూల భావాన్ని ఉన్నదున్నట్టు ప్రదర్శించాడు. ఇదే చరణంలో ఆరుద్ర ‘మంచిని తల పెట్టినచో మనిషికడ్డు లేదని’ చెప్పి ‘ప్రేరణ దైవానిదైనా సాధించేది నరుడే’ అని దైవం ప్రేరణను మానవుడి గొప్పతనాన్ని తన ఆలోచనతో రాజీ పడకుండా ప్రదర్శించాడు.
“నైనోం మే జ్వాలా తేరీ
గతి మే భోచల్ తేరీ
ఛాతీ మే ఛుపా మహాకాల్ హై
పృధివీ కే లాల్ తేరీ
హిమగిరి సా భాగ్ తేరీ
భృకుటి మే తాండవ్ కా తాల్ హై
నిజ్ కో తూ జాన్
జరా శక్తి పహచాన్
తేరీ వాణీ మే యుగ్ కా ఆహ్వన్ హై రే”
మానవుడి గొప్పతనాన్ని వివరించేందుకు లోతైన పోలికను పౌరాణిక ప్రతీకలను వాడేడు భరత్ వ్యాస్.
“నయనమ్ముల రాగముతో,
హృదయమ్మున స్నేహముతో
మానవుడే సృష్టి కలంకారము
స్వేచ్ఛా స్వాతంత్ర్య మహా దీక్షా సాధన వీరుడే
మానవుడే యుగ భవన ద్వారము
మానవుడేనోయ్
మానవుడేనోయి ధరా మండలమున స్వర్గమునే
స్థాపించగ జాలినట్టి వీరుడోయి”
హిందీ పాటతో సంబంధం లేని భావము. పూర్తిగా తన సిద్ధాంతాన్ని ప్రదర్శించాడు శ్రీశ్రీ.
“ధర్తి కా వీర్ తు హై
అగ్ని కా ధీర్ తూ జో
చాహేతో కాల్ కో భీ థామ్ లే
ప్రలయ్ రుకే పశుతా కా శీశ్ ఝుకే
తు జో అగర్ హిమ్మత్ సే కామ్ లే
గురుసా మతిమాన్ పవన్ సా తూ గతిమాన్
తేరీ నభ్ సే భీ ఊంచీ ఉడాన్ హై రే
మనుష్య్ తూ బడా మహాన్ హై..”
మానవుడి గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ, ‘తేరీ నభ్ సే భీ ఊంచీ ఉడాన్ హై’ అన్నాడు. దీన్నీ శ్రీశ్రీ అందుకున్నాడు. తనదైన సైద్ధాంతిక దృష్టితో ప్రదర్శించాడు. హిందీ పాట మానవుడి గొప్పతనాన్ని భారతీయ ధార్మిక ప్రతీకలతో చెప్పింది. శ్రీశ్రీ ఇందుకు భిన్నమైన ఆలోచనను ప్రదర్శించాడు. ‘మనిషే దేవుడు’ అన్నాడు.
“గ్రహ నక్షత్రాల నడుమ
క్రమ్మిన చీకట్ల నడుమ
మానవుడే కాంతి కిరణ దీపము
ప్రణయ సుధాధారలతో, ప్రళయ విషజ్వాలలతో
మానవుడే పరమాత్ముని రూపము మానవుడే నోయ్
మానవుడే నోయి జరామరణములను దాటి సదా
అమరకీర్తి నందగలుగు ధీరుడోయ్”
‘కాలాగ్ని స్తంభింపచేయగలవు, పాపాలకు ప్రళయం లాటి వాడివి, పశువు శీర్షాన్ని వంచగలవు’ వంటి భావాలను భరత్ వ్యాస్ హిందీలో ప్రదర్శించాడు. తెలుగులో ‘మానవుడే కాంతి కిరణదీపము’ అంటూ ఓ వైపు సుధాధారలు, మరో వైపు విషజ్వాలలతో మనిషే పరమాత్మని రూపము అంటున్నాడు శ్రీశ్రీ.
శ్రీశ్రీ బాణీకి తగ్గ పదాలను కూర్చాడు. సందర్భానికి తగ్గ భావాలను ప్రదర్శించాడు. కానీ వాటిని తన దృక్కోణంలో ప్రదర్శించాడు.
అందుకే అటు హిందీ పాటనూ, దాని అనువాదాన్ని బాల భారతంలోని ‘మానవుడే మహనీయుడు’ పాటతో పోలిస్తే ‘మానవుడే మహనీయుడు’ పాటదే పై చేయిగా నిలుస్తుంది. చరణానికి రెండు పాదాలతో అతి లోతైన భావాన్ని ఆ పాదాలలో పొందుపరుస్తూ సందర్భానికి తాత్విక రంగులద్దాడు ఆరుద్ర.
హిందీలో సుధీర్ ఫడ్కే బాణీని ప్రేరణగా తీసుకుని ఎస్. రాజేశ్వరరావు పూర్తిగా భిన్నమయిన పాటను రూపొందించాడు. 1959లోని ఘంటసాల గొంతుకూ, 1972లోని ఘంటసాల గొంతుకూ నడుమ కనిపించే తేడాని అద్భుతంగా వాడుకున్నాడు ఎస్. రాజేశ్వరరావు.
‘గజ గౌరీ’ సినిమా ఆ కాలంలో సూపర్ హిట్‌గా నిలచింది. కానీ అత్యంత ప్రఖ్యాతి పొందిన ప్రభాత్ నిర్మాణ సంస్థ చివరి సినిమా ఇది. దాంతో ఈ సినిమా రీళ్లు కూడా అదృశ్యమైపోయాయి. ఇప్పుడీ సినిమా పాటల రికార్డులున్నాయి తప్ప సినిమా లేదు. సినిమా చూడాలంటే తెలుగు సినిమా ‘గాంధారీ గర్వభంగం’ చూడాలి, హిందీ పాటలు వింటూ.
(‘ధర్తీ కీ షాన్ తూ హై’ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు:
https://www.youtube.com/watch?v=edZA4tKA3TQ )
గమనిస్తే, పాత సినిమా చిత్రీకరణను అనుసరిస్తూనే కొత్త పోకడలు పోయింది ‘బాల భారతం’ సినిమా. పాత సినిమాలో మెట్లెక్కుతున్న భీముడి నీడకూ ‘బాల భారతం’లో నీడకూ తేడా ఉంటుంది. సన్నివేశాన్ని మరింత రక్తికట్టించేందుకు మెట్లెక్కడం పలు కోణాల్లో చూపించి, ఉద్విగ్నతను కలిగిస్తుంది ‘బాల భారతం’. అంటే పాత సినిమా ప్రేరణగా తీసుకుని సరికొత్త రూపం ఇచ్చారన్న మాట. ఇది ఒక తరం నుండి ప్రేరణ పొందిన మరో తరం మరో అడుగు సృజనాత్మకంగా ముందుకు వేయటం లాంటిది. ప్రపంచవ్యాప్తంగా ఇలా నూతన తరాలు, పాత తరాలను ప్రేరణగా తీసుకుని వారి సృజనకు తమ స్వజనతో మెరుగులు దిద్దాలన్న ప్రయ్తత్నం కనిపిస్తుంది.
‘దేవదాసు’ సినిమా అన్ని భాషలలో ఉంది. తెలుగులో రెండు సార్లు, హిందీలో మూడు సార్లు విభిన్న రూపాలు ధరించింది. ఇది అభివృద్ధి రీతి. ఒక తరం నుండి జ్యోతి అందుకుని మరో తరం మరిన్ని జ్యోతులను వెలిగించి జగతిని మరింత శోభాయమానం చేస్తుంది.
PS:
‘పాడవోయి భారతీయుడా’ అన్న పుస్తకంలో తన పాటల గురించి రాస్తూ శ్రీశ్రీ ఈ పాటను కూడా ప్రస్తావించాడు.
“ఈ మధ్య ‘గాంధారి గర్వభంగం’ కథనే తీసుకుని ‘బాల భారతం’ అనే చిత్రం వచ్చింది. అందులో నా పాటను అనుకరిస్తూ ఒక పాట వచ్చింది” అన్నాడు శ్రీశ్రీ (పేజీ 32).
అయితే ఆరుద్ర పాట శ్రీశ్రీ పాటకు మాత్రమే కాదు భరత్ వ్యాస్ పాటకు కూడా అనుకరణ కాదు. సందర్భం అదే కాబట్టి, బహుశా హిందీ పాటనుంచి ప్రేరణ పొందాడని అనుకోవచ్చు. పైగా శ్రీశ్రీ, భరత్ వ్యాస్ భావాన్ని తన ధోరణిలో ప్రదర్శించాడు. తనదైన మరో ధోరణిలో భరత్ వ్యాస్ భావాన్ని ఆరుద్ర ప్రదర్శించాడు. కాబట్టి ఆరుద్ర, శ్రీశ్రీని అనుసరించాడని శ్రీశ్రీ స్వయంగా అన్నా, పాఠకులు పై వ్యాసంలో మూడు పాటల విశ్లేషణను గమనించి, తమంతట తామే నిర్ణించుకోవాలని మనవి.
– సంపాదకులు.
(‘పదునాలుగు లోకముల ఎదురే లేదే’ పాట విడిగా యూట్యూబ్‌లో లేదు, ‘గాంధారి గర్వభంగం’ సినిమాని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=WitIlRTJfc4 )
(మళ్ళీ కలుద్దాం)
