Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-28

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

‘పతివర్తా సీతామాయీ కో తూనే దియా బన్‌వాస్’

‘ఆవారా’ సినిమాలో అత్యంత కీలకమైన పాట ఇది. ఈ పాట ఆవారా సినిమా పాటల రికార్డులో ఒక పాటగా గుర్తింపు పొందలేదు. విడిగా పాటగా ఈ రికార్డు లభించదు.

సినిమాలో పాటల కోసం సందర్భాన్ని సృష్టించటంలో రాజ్ కపూర్ తరువాతనే ఇతరుల ప్రస్తావన తేవాల్సి ఉంటుంది. రాజ్ కపూర్ గొప్పతనం ఏమిటంటే, పాట కోసం ఆయన సందర్భాన్ని సృష్టించినట్టు కనబడదు. సందర్భమే పాట కోసం తపిస్తూ, వెతుక్కుంటూ వచ్చి పాటను పట్టుకున్నట్టుంటుంది. సందర్భంలో పాట ఎంతగా ఒదిగిపోతుందంటే, పాట కూడా సినిమా  ప్రవాహంలో ఒక భాగమై,  సినిమాలో ఒదిగిపోయి సినిమాను ముందుకు నడుపుతుంది. ఇతరుల సినిమాల్లో సందర్భం నుంచి పాటను వేరు చేసి చూడవచ్చు. రాజ్ కపూర్ సినిమాల్లో పాట- సినిమా వేర్వేరు కాదు. రెండూ అవిభాజ్యఅంగాలు సినిమాకు.

ఆ పాట తీసేస్తే ఆ సందర్భం పేలవమైపోతుంది. కథ గమనం కుంటుపడుతుంది. సినిమాలో పాట లేని లోపం స్పష్టంగా తెలుస్తుంది. అంటే పడుగులో పేకలా, సినిమాలో పాట మిళితమై ఒకటై పోతుందన్న మాట. ఇది ‘బర్సాత్’ సినిమాలో బీజ రూపంలో కనిపిస్తే, ‘ఆవారా’లో విశ్వరూపంలో ప్రదర్శితమవుతుంది.

‘బర్సాత్’, ‘ఆవారా’ సినిమాలలో రాజ్ కపూర్ సినిమా స్క్రిప్టులో ఎలాంటి సందర్భాలలో పాటలను ఇమిడ్చాడో ఆ సందర్భాలనేకం ఈనాటికీ సినీ కళాకారులు వాడుకుంటున్నారు. రాజ్ కపూర్ బాటలోనే నడుస్తున్నారు.

‘ఆవారా’ సినిమాలో పృథ్వీరాజ్  కపూర్ జడ్జి. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. ఓ దొంగ అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహ లాడుతూంటాడు. ఓ రోజు అతని భార్య నీలను ఎత్తుకుపోతాడు దొంగ. ఆమె గర్భవతి అని గ్రహించి తెచ్చి వదిలేస్తాడు. ఈ లోగా, అందరూ తలా ఓ మాటంటారు. ఆమె శీలాన్ని శంకిస్తారు. పృథ్వీరాజ్  కపూర్ ఆరంభంలో పట్టించుకోడు. కానీ కోర్టులో వాదించేప్పుడు ఇతరులు అతని భార్య నడవడి గురించి వ్యాఖ్యానించటం, అతడి జడ్జి ప్రమోషన్ – భార్య ప్రవర్తన పట్ల చెలరేగుతున్న దుర్వ్యాఖ్యల వల్ల ప్రమాదంలో పడటం వంటివి అతని ఆలోచన రీతి పై ప్రభావం చూపిస్తాయి. భార్యను అనుమానిస్తాడు. ఆమెని ఇంట్లోంచి పొమ్మంటాడు. వర్షం భోరుమని కురుస్తున్న రాత్రి,  ప్రసవానికి దగ్గరలో ఉన్న నిండు గర్భవతిని,  నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి బయటకు పంపేస్తాడు.

ఆ సందర్భంలో వస్తుందీ పాట.

‘పతివ్రత సీతామాతకు నువ్వు వనవాసం శిక్ష విధించావు’ అంటూ ఆరంభమవుతుంది. ప్రేక్షకుడికి సందర్భం సులువుగా అర్థమవుతుంది. పృథ్వీరాజ్ కపూర్ రాముడు. అతని భార్య సీత. అగ్నిప్రవేశం తరువాత కూడా మాములు మనిషి మాటకు స్పందించి గర్భవతి అయిన సీతను రాముడు అడవికి పంపించి వేశాడు. ‘తూనే దియా బన్‌వాస్’ అన్నది ఆరోపణ, ఫిర్యాదు. సినిమా సందర్భానికి అచ్చుగుద్దినట్టు సరిపోయింది. రామాయణంలోని ఓ ఘట్టాన్ని తెరపై జరుగుతున్న దానితో ముడిపెట్టి రెంటి నడుమ సంబంధం నిరూపిస్తూ ప్రేక్షకుల మనస్సులలో పాత్రల పట్ల అవగాహన, సానుభూతి కలిగించటమే కాదు, తెరపై జరుగుతున్న దానికి, పురాణ గాథతో సమానం చేసి మరుపురాని ముద్ర వేశాడు రాజ్ కపూర్. ఆ తరువాత కళాకారులు ఈనాటికీ ఈ పద్ధతిని పలు మార్పులతో, తమదైన ఆలోచన జోడించి ప్రదర్శిస్తున్నారు తప్ప, ఇంతకన్నా కొత్తగా ఏమీ చేయలేకపోవటం రాజ్ కపూర్ ప్రతిభకు అద్దం పడుతుంది.

‘వాగ్దానం’ సినిమాలో ‘శ్రీనగజాతనయం’ పాట చాలా ప్రాచుర్యం పొందింది. ‘ఫెళ్లుమనె విల్లు’ అన్నగానే గుంటలో దిగిన చక్రాన్ని హీరో బయటకు తోస్తాడు. ‘ఝల్లు మనియె జానకి దేహము’ అనగానే నాయిక పాత్రను చూపిస్తాడు. ఘటనకు పురాణ పోలిక వచ్చేసింది.

‘మిస్టర్ అండ్ మిసెస్ 55’లో గురుదత్ మనస్సు దెబ్బతింటుంది. నాయిక అతడిని విడిచి వెళ్లిపోతుంది. అప్పుడు దారి పక్కన ‘మేరీ దునియా లుట్ రహీ పై ఔర్ మై ఖామోష్ థా’ అని పాడుతుంటారు. వారికి గురుదత్ పరిస్థితి తెలియదు. కానీ వారి పాట గురుదత్ మానసిక స్థితిని ప్రేక్షకులకు చేరువ చేస్తుంది.

‘సీమ’ సినిమాలో నాయిక ఇల్లొదిలి పారిపోతుంది. ఆమెకు తిండి దొరకదు. ఆకలి వేస్తుంటుంది. దారిలో బిచ్చగాళ్లు పాడుతుంటారు. ‘హమే భీ దేదో సహారా కే బెసహారే హైఁ’ అంటూ పాడుతుంటారు. అందరూ పైసలు విసురుతుంటారు. ఒక నాణెం నాయిక దగ్గర పడుతుంది. వాళ్లు ఆ నాణాన్ని వెతుక్కుంటు వచ్చే లోగా ఆమె కాలితో నాణేన్ని కప్పేస్తుంది. ‘సతాయే భూక్ తో ఈమాన్ డగ్‌మగాతా హై’ అంటూ పాడతారు. ఆకలి ముందు నీతి నిజాయితీలు వీగిపోతాయని అర్థం.

‘స్వాతిముత్యం’ సినిమాలో సీతా కల్యాణం అవుతూంటుంది. నాయకుడు ఆ సందర్భంలో తాళి తీసి నాయికకు కట్టేస్తాడు.

విలన్ నాయికపై అత్యాచారం చేయాలని ప్రయత్నిస్తూంటాడు. దూరంగా గుడిలో రాక్షసుడిని అమ్మవారు వధించే గాథ చెప్తూంటారు. ఇక్కడ నాయిక విలన్ ను వధిస్తుంది. ఏకవీరలో భామనే సత్యభామనే అద్భుతమైన ప్రతీకాత్మకం.

ఇలాంటి అనేకానేక సందర్భాల పాటలకు ‘బీజం’ ‘ఆవారా’లో ‘పతివర్తా సీత’ పాట.

రాజ్ కపూర్‌పై నియోరియలిజం ప్రభావం ఉందంటారు. ‘బైసికిల్ థీవ్స్’ ప్రేరణ అంటారు. కానీ రాజ్ కపూర్‌దే, ఓ పాటలో చెప్పినట్టు ‘ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ’ అని పాట సృజన నిరూపిస్తుంది. ఇతర ఏ దేశానికి చెందిన సినిమా కూడా ఇలాంటి సందర్భాన్ని సృజించలేదు. అంతకు ముందు బ్రిటీష్ వారి సెన్సార్ కత్తెర నుంచి తప్పించుకుందుకు కళాకారులు దేశ స్వాతంత్ర పోరాటాన్ని, సాంఘిక సంస్కరణలను ప్రతీకాత్మకంగా ప్రతిబింబించే పౌరాణిక కథలను సినిమాలుగా తీశారు. కానీ పౌరాణిక గాథను సినిమాకు అన్వయించి, పాట రూపంలో సమాంతరంగా రెండు కథలను చెప్తూ వాటిని ముడివేసింది మొదటగా రాజ్ కపూర్.

ఇక్కడ ఈ సందర్భానికి కథను నడిపిన విధానం చెప్పుకోక తప్పదు. దర్శకుడిగా, రాజ్ కపూర్ ప్రతిభ తెలిసేది ఇక్కడే. రాజ్ కపూర్ సినిమాలలో కళాకారులెంత ప్రతిభావంతులయినా వారందరి అత్యుత్తమ కళాసృజనలో రాజ్ కపూర్ పాత్ర గణనీయం అన్నది నిర్వివాదాంశం. ‘కథ’ నిర్ణయం నుంచి స్క్రిప్ట్  రచన, పాటల రూపకల్పన, కెమెరా పనితనం, సెట్స్ నిర్మాణం ఒకటేమిటి ప్రతి రంగంలో రాజ్ కపూర్ హస్తం కనిపిస్తుంది.

‘బర్సాత్’ నుంచి రాజ్ కపూర్ సినిమాల్లో ప్రధానంగా గమనించాల్సింది ఒక దృశ్యాన్ని ‘ఫ్రేమ్’ చేయటం. వెలుగు నీడలతో, పెద్ద పెద్ద గదులతో దృశ్యాన్ని రసవత్తరం, భావస్ఫోరకం చేయటం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఆ కాలంలో ఇది నవీన పద్ధతి. కోర్టులో నర్గీస్, పృథ్వీరాజ్ కపూర్‌కు గతాన్ని గుర్తు చేస్తుంది.

‘నయ్యా తెరీ మజ్‌ధార్, హోషియార్
సూఝే ఆర్ నా పార్ హోషియార్’

పృధ్వీరాజ్ కపూర్, అతని భార్యతో బోటు షికారు చేస్తుంటే, కొందరు నావికులు ఈ పాట పాడుతుంటారు. ఆహ్లాదకరమైన దృశ్యం. అనందకరమైన సన్నివేశం. కానీ పాట ఎంతో తాత్వికమైనది.

‘డర్ కైసా రే ఖులా హువా ఆస్‍మాన్
సంభాల్‌కే మాఝీ, తేరీ నావ్ మే హై తూఫాన్
గెహ్రీ చంచల్ ధార్, హోషియార్’

‘భయమెందుకు అకాశం నిర్మలంగా ఉంది’ అంటాడు ఒక నావికుడు. ‘జాగ్రత్త, నీ పడవ తుఫానుకు ఎదురీదాల్సి వస్తుంది. చంచలము, లోతైన ప్రవాహం, జాగ్రత్త’ అంటాడు ఇంకో నావికుడు. రాబోయే ప్రమాదాన్ని, జరగబోయే ఘోరాన్ని సూచిస్తున్నది పాట.

పొంచి ఉన్న ప్రమాదం తెలియని జంట హాయిగా సౌందర్యాన్ని దర్శిస్తూ ఆనందిస్తున్నది. తుఫాను రాబోతున్నదని వారిని తెలియదు. ప్రేక్షకుడు గ్రహిస్తాడు.

ఈ పాట చిత్రీకరణ కూడా వెలుగు నీడల్లో సాగుతూ, ఆలాపనలో ఆనంద, విషాద, విహ్వల భావనలు కలగలసి ఒక రకమైన ‘సస్పెన్స్’ సృష్టిస్తాయి.

(‘నయ్యా తెరీ మజ్‌ధార్’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=iv8-P8B2NWY )

తరువాత దృశ్యంలో పృథ్వీరాజ్ కపూర్ భార్యను దొంగ అపహరిస్తాడు.

‘మూడ్ క్రియేషన్’ అద్భుతంగా జరిగింది. ఏదో జరుగుతుందని ప్రేక్షకుడు అనుమానిస్తుంటాడు. జరుగుతుంది.

తరువాత దృశ్యాలు చకచకా సాగుతాయి.

పృధ్వీరాజ్ కపూర్‌లో అనుమానం రావటం, కోర్టు దృశ్యాలు, ఇంటికి రాగానే భార్య పుట్టబోయే పిల్లవాడి కోసం ఊలు టోపీ తయారు చేయటం వంటి దృశ్యాలు సాగుతాయి. ఇక్కడ పృథ్వీరాజ్  కపూర్ పాత్రను అనుమానం దహించి వేస్తోందనేందుకు అతని భార్య ఊలు టోపీ పట్టుకున్న చేయి నీడలో అనుమానంగా అసహ్యంగా, క్రోధంగా, నేరభావనతో చూస్తున్న పృథ్వీరాజ్ కపూర్‌ను ‘ఫ్రేమ్’ చేస్తుంది కెమెరా. అద్భతం. ఈ ఒక్క దృశ్యం ‘ఫోటో’ చూపిస్తే చాలు పాత్రల మానసిక సంఘర్షణలు, ఉద్విగ్నతలు ఎవరికైనా తెలిసిపోతాయి.

తరువాత వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. “నాపై కోపంగా ఉందా?” అని అడుగుతుంది అతని భార్య. ‘ఏమీ లేద’ని వెళ్తుంటే పని వారెవరూ లేరని తెలుస్తుంది. అప్పడు అతని వదిన మాటలంటుంది అతడు అరుస్తాడు. ఆమె చేతిలో కుండ పడి పగులుతుంది. సింబాలిజం.

ఆ సందర్భంలో ఆమె అతని భార్య ‘దోషం’ ప్రసక్తి తెచ్చినప్పుడు అతడిని క్లోజప్పులో చూపిస్తూ, ఆమె మాటలంటూ వస్తన్నప్పుడు ట్రాలీ షాట్‌తో ఆమె అతడికి దగ్గరగా వచ్చేదాకా వెంబడించటం, అద్భుతమైన షాట్. ఆమె దూరం నుంచి అంటున్న మాటలు, ఇప్పుడు అతడి దగ్గరగా వచ్చాయని కెమెరా నిశ్శబ్దంగా చెప్తున్నట్టుంటుంది. అప్పుడామె రాముడు, సీత, అగ్నిపరీక్ష ప్రస్తావన తెస్తుంది. అప్పుడు పృథ్వీరాజ్ కెమెరా దగ్గర ఉంటాడు. వదిన వెనుక ఉంటుంది. పృథ్వీరాజ్ కపూర్ పాత్ర భావాలు ప్రేక్షకుడికి తెలుస్తుంటాయి.

కుండ పగిలినందుకు క్షమార్పణలడుగుతాడు. మట్టి కుండ పగిలినా ఏం కాదు కానీ స్త్రీ శీలం మాత్రం తిరిగి రాదంటుంది. అప్పుడు కెమెరా పృథ్వీరాజ్‌ను క్లోజప్పులో, ఆమెను వెళ్లిపోతూ చూపిస్తుంది. అతడి మానసిక స్థితి ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. రాజ్ కపూర్ పాత్రలతోనే కాదు, కెమెరాతోనూ మాట్లాడించగలడు. భావనలను ప్రేక్షకుడికి చేరువ చేయగలడు. ఆమె దూరం వెళ్తూంటే కెమేరా టాప్ యాంగిల్ షాట్‌కు వెళ్తూ పృథ్వీరాజ్‌ను కుంచిప చేయటం పరమాద్భుతమైన షాట్.

ఈ దృశ్యం పూర్తి కాగానే ఆకాశంలో మేఘాలు క్రమ్ముకుంటాయి. వర్షం సూచన వస్తుంది. ఇది భార్యను బయటకు పంపే సన్నివేశానికి స్వాభావికంగా దారి తీస్తుంది.

ఇక ఆమెను వెడలనడిపే సన్నివేశంలో నేపథ్య సంగీతం, కెమెరా కోణాలు, వెలుగు నీడలు, క్లోజప్పులు అద్భుతమైన సినీ కళా ప్రతిభ ప్రదర్శనకు మచ్చుతునకలు.

అందుకే ఆమెను బయటకు పొమ్మన్నప్పుడు హఠాత్తుగా రఫీ స్వరంలో ఆలాపన వినిపించినప్పుడు గుండె ఝల్లుమంటుంది.

నౌషాద్ కన్నా ముందే – రఫీ స్వరం వెళ్లగల ఎత్తులను, పలకగల భావాలను శంకర్ జైకిషన్ పలికించటం ఈ పాటలో స్పష్టంగా చూడవచ్చు. ‘నయ్య తెరీ మజ్‌ధార్’ లో కూడా రఫీ ఆలాపనను అద్భుతంగా వాడేరు శంకర్ జైకిషన్.

రఫీ ‘పతివర్త’ అంటాడు. ‘తూనే దియా’ దగ్గర విషాదాన్ని వణుకుతో పలికిస్తూ పాట వేగాన్ని తగ్గించి పాడతాడు. అద్భుతమైన గాన సంవిధానం ఇది.

‘పతివర్తా సీతామాయీ కో తూనే దియా బన్‌వాస్
క్యోం నా ఫటా ధర్తీ కా కలేజా క్యోం నా ఫటా ఆకాశ్..’

పాట చిత్రీకరణ గొప్పగా ఉంటుంది. వెలుగు నీడల్లో గది విషాదం గూడు కట్టినట్టు ఉంటుంది. ‘క్యోం నా ఫటా ధర్తీ కా కలేజా’ అన్నప్పుడు గాలికి తలుపు తెరచుకుంటుంది. అక్కడ రఫీ ‘కలేజా’ అంటూ ఆలాపన ఎలా తీస్తాడంటే, గడప దగ్గరే నిలబడి, తలుపు దాటి అడుగు వేయటం ఇష్టం లేక ఆగిపోయిన పాత్ర హృదయ భావనను తన స్వరం ప్రకటించేట్టు.

‘క్యోం నా ఫటా ఆకాశ్’ అనేసరికి నల్లటి అకాశాన్ని రెండుగా చీలుస్తూ విద్యులత కనిపిస్తుంది తెరపై.

‘జుల్మ్ సహే భారీ జనక్ దులారీ
జనక్ దులారీ రామ్ కీ ప్యారీ’

ఈ పంక్తులు వచ్చేసరికి తెరపై చీకటిలో ఒక్క ప్రాంతంలోనే వెలుతురుంటుంది. పరిసరాలు అస్పష్టంగా ఉంటాయి. పాత్ర కూడా నీడల్లానే కనిపిస్తుంది. నిజంగా తెరపై విషాదం గూడు కట్టుకుని ఉంటుంది. ఒంటరిగా నిండు గర్భవతి, ఎటు వెళ్లాలో గమ్యం లేని అనాథ ప్రయాణం.. ‘సీత ఎంత కష్టం అనుభవించిందో’ అన్న భావనను పాత్ర పరిస్థితి స్ఫురించే రీతిలో అనటం దృశ్యం స్థాయి పెంచుతుంది. ప్రేక్షకుడి హృదయం ద్రవిస్తుంది. కళ్లు చెమరుస్తాయి.

ఇప్పుడు తెలుస్తుంది పక్కనే ఎవరో భజన చేస్తున్నారని.

వెంటనే ఆలోచన వస్తుంది. ఏ జనాలయితే సీత కష్టానికి కన్నీరు కారుస్తున్నారో, వారే నిర్దాక్షిణ్యంగా ఈమెను దోషిని చేసి ఆమె ఇంటి బయట అడుగు పెట్టేందుకు కారణమయ్యారు. ద్వంద్వ ప్రవృత్తి మనస్సును అవేశమయం చేస్తుంది.

 పాటలో ఆలాపనలో మహిళ స్వరం వినపడటం మరింత గొప్ప ఎఫెక్ట్ ఇస్తుంది. ‘జనక్ దులారీ రామ్ కీ ప్యారీ’ అన్నప్పుడు చీకటిలో ఉన్న పృథ్వీరాజ్ కపూర్‍ని చూపిస్తుంది కెమెరా. అద్భుతం.

ఇక్కడ పృథ్వీ రాజ్ కపూర్ ముఖంలో బాధ, నేరభావన, క్రౌర్యం వంటి భావనలను చీకటి వెలుతుర్లు అద్భుతంగా చూపిస్తాయి.   మళ్లీ కట్ అయి గల్లీలో , భోరున కురిసే వర్షంలో నడవలేక నడుస్తూ తూలుతూ వెళ్తున్న అతని భార్యను చూపిస్తుంది. పెద్ద భవంతిలో, చీకటిలో నేర భావనతో ఒకరు, అతని ప్రేమ రూపం అయిన ఆమె ఒంటరిగా, వీధుల్లో, గమ్యం లేని స్థితిలో.. అద్భుతమైన స్క్రీన్‌ప్లే, చిత్రీకరణ ఇది. ఈ దృశ్యంలో గొడుగు వేసుకుని ఓ వ్యక్తి ఆమెని పట్టించుకోకుండా వెళ్తాడు. ‘ఏమిట’ని అడగడు. సమాజ నిర్దాక్షిణ్య ప్రవర్తనకు ప్రతీక ఇది.

‘గగన్ మహల్ కా రాజా దేఖో కైసా ఖేల్ దిఖాయే’ పాదం వచ్చేప్పుడు విశాలమైన గదిలో, నడుమ ఛాతీ వరకే చిన్నగా కనిపిస్తాడు పృథ్వీరాజ్ ‘లో యాంగిల్’ షాట్ ఇది.

దీన్లో విశాలమైన ఇంటిలో అతని ఒంటరితనాన్ని చూపించటం ప్రాధాన్యం. గాలికి ఊగే పరదాలు వెలుగు నీడల సందిగ్దాన్ని ప్రదర్శిస్తున్నాయి. మానవ మనస్తత్వాలలోని ద్వంద్వపు చీకటి వెలుగులు చూపిస్తాయి. అంతేకాదు, ప్రేక్షకుల దృష్టిలో పృథ్వీరాక్ కపూర్ పాత్ర కుచించుకుపోయిన భావన కలుగుతుంది/

పాటలో పదాలు గమనిస్తే వ్యంగ్యం ఉట్టి పడుతూంటుంది. ‘ఎలాంటి ఆట చూపిస్తున్నావయ్యా’ అంటున్నాడు.

మహిళ ఆక్రందన లాంటి అలాపన వచ్చినప్పుడు తెర మధ్యలో వంగి పడబోతున్న ఆమె కనిపిస్తుంది. భోరున వర్షం కురుస్తంటుంది. ఆమె చీకటిలో ఉన్నా, ఆమె ఏడుపు తెలుస్తుంటుంది. ఆలాపన అయ్యేసరికి మురికి కాలువ పక్కనే ఆమె పడిపోతుంది.

ఇప్పుడు భజన చేసేవారు అదే ‘గగన్ మహల్ కా రాజా దేఖో కైసా ఖేల్ దిఖాయే’ పాదం పాడతారు. కానీ పాటలో మెరుపులతో ధ్వని మారుతుంది. వ్యంగ్యం కన్నా విషాదం ఎక్కువగా ధ్వనిస్తుంది. భజన చేసే వారి క్లోజప్పులు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తాయి.

ఇంతలో నేలపై పడి కదలలేకపోతున్న ఆమె ఈ క్లోజప్పు తెరపై కనిపిస్తుంది. మురికి కాలవతో సహా.

‘సీప్ సే మోతీ గందే జల్ మే సుందర్ కమల్ ఖిలాయే’

‘సుందర్ కమల్  ఖిలాయే’ అవగానే పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. ప్రేక్షకులకు అర్థమయిపోతుంది. ఇప్పుడు ‘అజబ్ తెరీ లీలా హైఁ గిరిధారీ’ అని పాడతారు. పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంటుంది.

నేపథ్యంలో హై పిచ్‌లో రఫీ ఆలాపన వినిపిస్తుంటుంది. తెరపై చీకటిలో రాక్షసుడిలా విలన్ కనిపిస్తాడు. జడ్జికి శుభాకాంక్షలు చెప్తూ ‘ఈ మురికి కాలువలో మీ పిల్లవాడు జన్మించాడు’ అంటాడు వికృతంగా నవ్వుతూ. ‘మురికి కాలువ’ చాలా కీలకమైన ప్రసక్తి అని సినిమా చివర్లో తెలుస్తుంది. అయితే త్రేతాయుగంలో సీతను వాల్మీకి రక్షిస్తాడు. కలియుగంలో మురికి కాలువ వద్ద వారికి దొంగ అశ్రయమిస్తాడు.  అప్పుడు లవకుశులు రాముడితో తలపడ్డారు. కలియుగంలో పిల్లవాడు ఆవారా అయి, తండ్రిని దోషిగా నిలుపుతాడి. ఇదంతా ప్రేక్షకుడు సానుభూతితో అర్ధం చేసుకుంటాడు.  దటీజ్ రాజ్ కపూర్.

(‘పతివర్తా సీతామాయీ కో తూనే దియా బన్‌వాస్’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=qWwag-jpWQo )

(మళ్ళీ కలుద్దాం).

Exit mobile version