[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనట మానవధర్మం
‘లక్ష్మీ నివాసం’ సినిమా పేరు వినగానే గుర్తుకు వచ్చే పాట ఇది. ఒక్కసారి విన్న తరువాత డబ్బును చూసినా, ఖర్చు పెడుతున్నా మనసులో మెదిలే పాట ఇది. ఒక పాటను సందర్భోచితంగా సృజించటం వల్ల సినిమా విలువను, అటు వ్యాపారపరంగా, ఇటు సమాజానికి ప్రయోజన కారకంగానూ ఇనుమడింప చేయటానికి చక్కటి ఉదాహరణ ఈ పాట.
ఒకప్పటి సినిమాల్లో మనుషులుండేవారు. వారికి మామూలు మనుషులకు ఉండే సమస్యలుండేవి. దాంతో పాటలను రచించటంలో మానవ జీవితంలోని సార్వజనీన స్పందనలు, ఆలోచనలు, మంచి మాటలు, జీవిత సత్యాలు అలవోకగా దొర్లేవి. అలాంటి పాటలు సినిమా సందర్భాన్ని, పరిధిని దాటి నిత్యజీవితంలొ తరతరాలకు మార్గదర్శనం చేస్తూ, సక్రమమైన దారి చూపే గీతాలుగా ఎదిగేవి. తద్వారా సినిమా, కళాకారులు ప్రజల హృదయాలలో చిరంజీవులుగా నిలుస్తారు.
‘లక్ష్మీనివాసం’ సినిమా కథ ఏ ఒక్కరి కథ అయినా కావచ్చు. ప్రేమ ధనం కోసం తప్ప మనిషి కోసం కాదన్న చేదు నిజాన్ని ఎత్తి చూపిస్తూ, ధనం కన్నా మానవ సంబంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఎంతో విలువైనవని చెప్పటం ఏ కాలానికైనా వర్తించే సత్యం. ఓ తండ్రి వ్యాపారంలో సర్వం కోల్పోతాడు. భార్యతో సహా పిల్లలు కూడా సుఖ జీవితానికి అలవాటు పడి డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే డబ్బు అహంకారులే. దాంతో పేదవాడయిన తండ్రిని పిల్లలు వదిలేస్తారు. భార్య మాత్రం పిల్లలు ఉంచుకోకపోతే గతిలేక భర్త వెంట వస్తుంది. ఇద్దరూ పేదరికంలో కొత్త జీవితం ప్రారంభిస్తారు.
అతడు మళ్లీ వ్యాపారం ఆరంభిస్తాడు. డబ్బు సంపాదించటం ప్రారంభిస్తాడు. ఆ సందర్భంలో జరిగిన దాన్ని తలచుకుంటూ, మానవ జీవితంలో ధనం ప్రాధాన్యాన్ని వివరిస్తూ మానవ సంబంధాలను నిర్దేశించే డబ్బును అర్థం చేసుకుంటూ ఇతరులకు తాను గ్రహించిన నిజాలను ప్రకటిస్తూ పాడే పాట ఇది. ‘ధనం మూలం ఇదం జగత్’ అన్న సత్యాన్ని ప్రకటించే గీతం . పాట రాసింది ఆరుద్ర.
‘ధనం మూలం ఇదం జగత్’ను ‘ధనమేరా అన్నింటికీ మూలం’ అన్నాడు. ఆరుద్ర వామపక్ష భావాల సమర్థకుడు. ప్రపంచంలో సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నమ్మేవాడు. కాబట్టి ‘ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం’ అన్నాడు. అది సందర్భానికి చక్కగా సరిపోయింది.
ఇలాంటి సందర్భాలలో పాటల చిత్రీకరణకు పెద్దగా కష్టపడనవసరం లేదు. తెరపై కనబడేది రెండే పాత్రలు. ఆ పాత్రలు డబ్బు సంపాదన ఆరంభించాయి. మానవ జీవితంలో, మానవ సంబంధాలలో డబ్బు విలువ తెలుసుకున్నాయి. తాము తెలుసుకున్న నిజాన్ని పాట రూపంలో చెప్తున్నాయి. కాబట్టి చిత్రీకరణలో పెద్దగా చమత్కారాలు లేకుండా, వారు పని చేస్తూన్నప్పుడు, డబ్బులు సంపాదిస్తున్నప్పుడు చూపిస్తూ, క్లోజప్పులు చూపిస్తే చాలు. ఎస్వీ రంగారావుకు సందర్భోచితంగా పాటకు తగ్గ భావాలు ప్రదర్శించటం వెన్నతో పెట్టిన విద్య. ఆయా సందర్భాలలో ఆయన భావాలను క్లోజప్పులో చూపించటం ద్వారా దృశ్యం చూసే ప్రేక్షకుడికి సన్నివేశాన్ని చేరువచేయవచ్చు.
అంజలీదేవి పాత్ర డబ్బు దాచి దైవ విగ్రహానికి ప్రదక్షిణ చేయటంతో పాట ఆరంభమవుతుంది. డబ్బు హుండీలో వేసి ప్రదక్షిణ ఆరంభించటం, అదే సమయానికి ‘ధనమేరా అన్నిటికీ మూలం’ అంటూ పాట ఆరంభమవటం, ఆ కాలంలో ఎలాంటి భావాలు కలిగించి ఉంటుందో కానీ ఈ కాలంలో డబ్బును బట్టి ‘దర్శనం’ లభించటం, డబ్బు లేని వారు ఎంత అధిక కాలం ఎదురు చూస్తే అంత ప్రఖ్యాతి ఆ దైవానికి లభించే కాలంలో భగవంతుడు సైతం భక్తుల డబ్బుకు ‘బందీ’ అన్న విచిత్రమైన వ్యంగ్య భావన కలుగుతుంది.
మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే
ధనవంతుడు, గుణవంతుడు, భగవంతుడురా!
ఈ చరణంలో ఎస్వీ రంగారావు ముఖంలో ప్రదర్శించే భావాలు, నటనలను గమనించాల్సి ఉంటుంది. గేయ రచనలో ఆరుద్ర చమత్కారం అనుభవించాల్సి ఉంటుంది. చిత్రీకరణ పరంగా గొప్ప చమత్కారాలు చేసేవీలులేని పాటల సందర్భాలలో నటన, గేయ రచన అత్యంత ప్రాధాన్యం వహిస్తాయి.
‘మానవుడే’ అంటూ ఆరంభించే సమయంలో పని చేస్తూ తల ఎత్తకుండా కళ్ళు దించుకుని తనలో తాను ఆలోచిస్తున్నట్టు నటిస్తాడు ఎస్వీరంగారావు. ‘దానికి తానే తెలియని దాసుడాయెరా’ అన్నప్పుడు తల ఎత్తి చూసి, వ్యంగ్యం ఉట్టిపడే చిరునవ్వుంటుంది ముఖంపై.
ధనం ప్రాకృతికం కాదు. మనిషి సృష్టించింది. ‘ధనం’ ఏ జీవికీ లేదు. ఉన్నది ఒక్క మానవుడికే. తెలివి, ఆలోచనల ఫలితం ఇది. నిజంగా ఆ చిరునవ్వు ఎన్ని రకాల ఆలోచనలను కలిగిస్తుందో? మనిషికి ఈ డబ్బు ప్రసక్తి లేకపోతే ఎన్నో సమస్యలు అదృశ్యమవుతాయి. ఆ సమస్యలన్నీ సృష్టించుకున్నది మనిషి. కానీ వాటి దుష్పలితాలకు భగవంతుడిని బాధ్యుడిని చేసి నిందిస్తాడు మనిషి. ఎస్వీ రంగారావు వ్యంగ్య పూరితమైన చిరునవ్వు ఫలితం ఇది. మనిషి మూర్ఖత్వాన్ని చూసి నవ్వుతున్నట్టుంది.
మళ్లీ ‘మానవుడే’ అన్నప్పుడు సెకన్లో ‘వెయ్యవ వంతు’ కళ్లెత్తి చూసి, దించి తన పనిలో పడతాడు. అద్భుతమైన సహజమైన నటన ఇది. నటనలో సహజ నటనను ‘method acting’ అంటూ రకరకాలుగా గొప్పగా చెప్తారు. కానీ ఎస్వీ రంగారావు ఏ కదలిక కూడా తెచ్చిపెట్టుకున్నట్టు ఉండదు. సహజంగా ఉంటుంది. ఇంతకు మించి సహజమైన నటన ఇంకెక్కడా లేదనిపిస్తుంది. రెండవసారి ‘దాసుడాయెరా’ అన్నప్పుడు కళ్లు మూసుకుని నవ్వుతాడు. ఈసారి నవ్వులో వ్యంగ్యం కాదు ‘విషాదం’ కనిపిస్తుంది. ఇదీ నటన అంటే. ఎక్కడా నటించినట్టు అనిపించదు.
కానీ రెండు మార్లు ఒకే పదాన్ని పలికితే, ఆ రెండు మార్లు ఆ పదాలు రెండు విభిన్నమైన భావాలు కలిగేట్టు చేయటం మామూలు నటన కాదు. అద్భుతమైన సహజమైన నటన. లతా మంగేష్కర్, రఫీ, ఘంటసాలలు ఒకే పదాన్ని ఉచ్చరించినప్పుడల్లా విభిన్న భావాలు కలిగేట్టు పలుకుతారు. దానిని నటనలో స్పురింపచేయటం ఇది.
మళ్లీ ‘అదుపులోన పెట్టిన వాడే’ అంటూ నవ్వే నవ్వులో అటు వ్యంగ్యం కనిపిస్తుంది, చిలిపితనం కనిపిస్తుంది. అది ఎవరికీ సాధ్యం కాదన్న నమ్మకంతో కూడిన ‘నవ్వు’ కనిపిస్తుంది. ఛాలెంజ్ కనిపిస్తుంది. నవ్వు, కనుబొమలు ఎగరేయటం, తల కదపటం ఇన్ని రకాల భావాలకు కారణం అవటం; ఎక్కడా వెనుక నుంచి ఎవరో పాడుతున్నారన్న భావన కలగకపోవటం అనాటి కళాకారుల గొప్పతనం. అందుకే పాటలు, కళాకారులు చిరంజీవులుగా మిగిలిపోయారు.
ఈ సందర్భంగా గేయ రచయిత చమత్కారాన్ని చెప్పుకోవాలి. ధనలక్ష్మిని అదుపులో పెట్టటం సామాన్యులకు వీలుపడదన్న భావన ఎస్వీ రంగారావు ప్రదర్శిస్తే, అది భగవంతుడికే వీలువుతుందన్న ఆలోచన పాటలో భావం ఇస్తుంది. లక్ష్మీదేవి వెంట అందరూ పరుగిడతారు . ఆమె ఎవరికీ అందదు. అందినా కరి మింగిన వెలగపండులా ఎలా చేజారిపోయిందో తెలియకుండా జారిపోతుంది. అలాంటి లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు పాదాలు ఒత్తుతూ పాద సేవ చేస్తుంది. ధనలక్ష్మిని అదుపులో పెట్టేవాడు అందుకే భగవంతుడు. మామూలు మానవ మాత్రుడికి అది సాధ్యం కాదన్న భావన పాటలో ధ్వనిస్తుంది, ఎస్వీ రంగారావు నటన ప్రదర్శిస్తుంది.
ఉన్న నాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేని నాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
అయ్యో! కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే!
ఈ చరణం ఆ కాలం కన్నా ఈ కాలానికి ఎక్కువ వర్తిస్తుంది. ‘పింక్ స్లిప్’లు, రిట్రెంచ్మెంట్లు, కంపెనీల మూసివేతలు, జాబ్ కట్టింగులు నిత్యకృత్యాలవుతున్న సమాజంలో ‘ఉన్ననాడు’ పొదుపు చేయటం, లేని నాడు ఒడలు వంచి కూడ బెట్టటం’కి మించిన దివ్యమైన సలహా మరొకటి లేదు. కానీ ఫాస్ట్ఫుడ్లా ఫాస్ట్ లివింగ్, వారాంతం నుంచి వారాంతానికి ఉండే బంధాల జీవితం గడిపే తరానికి మంచి మాటలెంత తలకెక్కుతాయో ఆలోచించాల్సిన విషయం. కానీ ‘మంచి చెప్పటం మన ధర్మం, వినటం వినకపోవటం వారి కర్మం’. ముఖ్యంగా, ఆ కాలంలో పొదుపు చేయమనేది ప్రభుత్వం. ఈ కాలంలో ఖర్చుపెట్టమంటోంది ప్రపంచం. ప్రపంచమొక విఇణిజ్యవేదిక అయిపోయి, వ్యక్తి కన్షూమర్, డబ్బుమూటగా మారిపోయిన కాలంలో, ఉన్ననాడు పొదుపుచేయటం అత్యంత ఆవశ్యకమయిన విషయం.
‘కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే’ కూడా ఈ తరానికి ఎంతో వర్తిస్తుంది. తల్లిదండ్రులిద్దరు కష్టపడి సంపాదించేది ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం. ఆ ఒక్కగానొక్క కొడుకుకి కష్టం తెలియదు. డబ్బు విలువ తెలియదు. బాధ్యత కూడా తెలియకపోతే.. ‘కొండలైనా కరిగిపోతాయి.’ ఎవరి సౌఖ్యంకోసం జీవితాంతం తల్లుతండ్రులు శ్రమ పడతారో, ఆ శ్రమ బూడిదలోపోసిన పన్నీరవుతుంది.
‘కూలిపోవు కాపురాలు’ కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఉద్యోగం లేని భర్తను భరించలేని భార్యలు, డబ్బు సంపాదననుబట్టి బంధం గట్టితనం ఆధారపడే బాంధవ్యాలు, డబ్బు ద్వారా లభించే సౌఖ్యాలే పరమావధిగా భావించే ముందుచూపులేని మనస్తత్వాలు, ‘నా డబ్బు, నీ డబ్బు’ లాంటి గొడవలు ఇప్పుడు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకడి స్కూటర్ మీద ఉండి, ఇంకో పెద్ద స్కూటర్ మీద ఇంకొకడు కనిపిస్తే, వీడిని వదలి వాడితో వెళ్ళమని బోధించే ప్రకటనలు, సినిమాలు, సమర్థించే కోర్టు తీర్పులు, ధనం నిర్దేశించే బంధాల బలహీనతలను, మానవ మానసిక దౌర్బల్యాలను రెచ్చగొట్టే సమాజానికి దర్పణం పడుతుంది. సినిమాలో కూడా ధనం లేని భర్తతో కన్నా కొడుకు, కూతుళ్ల దగ్గర ఉండేందుకు ఇష్టపడుతుంది అంజలీదేవి. వారు ఆమెని ఉంచుకోనేందుకు ఇష్టపడరు. వారు ఉంచుకోనేందుకు ఇష్టపడి ఉంటే కాపురం ధన లేమి వల్ల కూలిపోయి ఉండేది. ఈ విషాద గ్రహింపు. ‘ఇది తెలియకుంటే’ అనే దగ్గర క్లోజప్పులో అద్భుతంగా ప్రదర్శిస్తాడు ఎస్వీ రంగారావు. ఆ తరువాత ఊపిరి పీల్చి తల వంచి ‘ధనమేరా’ అని అందుకోవటం విషాదకరమైన నిజాన్ని గరళంలా భరించి, బంధానికి ప్రాధాన్యం ఇచ్చి నిర్వేదంతో ముందుకు సాగుతున్న భావనను కలిగిస్తుంది. తల ఊపు, కంటి చూపులో భావాలు పలికించటం ఎంతో గొప్పగా ప్రదర్శిస్తాడు ఎస్వీ రంగారావు.
తరువాత చరణంలో ఆరుద్ర తన సిద్ధాంతాన్ని, చక్కగా ప్రదర్శిస్తాడు సార్వజనీన భావనతో జత పరచి.
కూలివాని చెమటలో ధనమున్నది రా
పాలికాపు కండల్లో ధనమున్నది రా
శ్రమ జీవికి జగమంతా లక్ష్మీ నివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని ద్రోహం.
అంతా సిద్దాంతం చెప్పి చివరికి ‘సిరి రా మోకాలొడ్డకు’ అని చెప్తున్నాడు కవి. నిజానికి కూలివాడు శ్రమ ఎంత పడ్డా, వచ్చే ధనం పొట్ట నింపుకునేందుకు సరిపోదు. శ్రమ జీవికి తన జీవితం తప్ప మిగతా అంతా లక్ష్మీ నివాసంగా కనిపిస్తుంది. చెప్పుకునేందుకు చక్కగా ఉంటుందీ సిద్ధాంతం. అయితే చివరలో ‘డబ్బుని కాదనవద్దు, అది ద్రోహం’ అని పరస్పర విరుద్ధమైన భావనను ప్రదర్శించి మెప్పించాడు కవి. మన సినిమాల్లో ఒక పద్ధతి ప్రకారం డబ్బును సంపాదించటం నేరం అని చూపుతూ, పేదరికాన్ని ఎంతో గ్లామరస్ గా చూపిస్తారు. ఇది ఆనవాయితే. అందుకే, శ్రీదేవిని నిరసించవద్దని ప్రత్యేకంగా చెప్పాల్సివచ్చింది.
మూడవ చరణంలో గొప్పగా నటనకు ఆస్కారం లేదు. కష్టపడతూన్నట్టు నటించి చెమట తుడుచుకోవటం తప్ప.
నిజానికి ఈ సందర్భంలో భార్యాభర్తలిద్దరూ కష్టపడుతూ పని చేస్తున్న దృశ్యాలు కొన్ని చూపిస్తూ, సందర్భోచితమైన నేపథ్య సంగీతం ఇస్తే సరిపోతుంది. కానీ ఈ పాట పెట్టటం వల్ల దృశ్యం ఒక గాంభీర్యాన్ని సంతరించుకుంది. పాటలో సార్వజనీన భావాలు పలికిస్తూ ఏ తరానికి అయినా పనికొచ్చే నిజాలు చెప్పటం వల్ల పాట విలువ సినిమా పరిధి దాటి ఎదిగింది. పాట, దృశ్యం, మరుపురానివిగా మిగిలాయి.
‘ధనం’ పై సినిమాల్లో బోలెడన్ని పాటలు వచ్చాయి. ‘డబ్బుకు లోకం దాసోహం’ అనే సినిమా కూడా వచ్చింది. కానీ ఆరుద్ర రాసినదే ‘కొత్త అల్లుడు’ సినిమాలోని పాట ‘రూపాయి’ పాట పెదవులపై చిరునవ్వు తెప్పించే పాట.
రూపాయీ రూపాయీ రూపాయీ
నమో నమో శ్రీ రూపాయీ
నమోస్తుతే శ్రీ రూపాయీ
పాట మొత్తం నటుడు కృష్ణ మోటార్ సైకిల్ పై విన్యాసాలు చేస్తూ, చిరునవ్వులు చిందిస్తూ అలరిస్తాడు. బాలసుబ్రమణ్యం అతి వేగంగా ఉత్సాహంగా పాడిన ఈ పాట జనరల్ నాలెడ్జ్ పాట. చివరి చరణంలో వివిధ దేశాల కరెన్సీ పేర్లు చెప్తాడు. అయితే పాట చివరలో ఆరుద్ర చేసిన చమత్కారం మురిపిస్తుంది. ‘రూపాయి’ పదం అర్థం మార్చేస్తాడు.
ఓం శివరూపాయ రూపాయే
ఓం విష్ణురూపాయ రూపాయే
నమోనమో శ్రీ రూపాయి
నమోస్తుతే శ్రీ రూపాయి
రూపాయీ రూపాయీ రూపాయీ.
(‘ధనమేరా అన్నిటికీ మూలం’ పాటని యూట్యూబ్లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=ilyE8jAgjSc )
రూపాయీ రూపాయీ పాటను ఇక్కడ చూడవచ్చు
(మళ్ళీ కలుద్దాం).

