Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-31

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్
రిక్షావాలా జిందాబాద్
మూడు చక్రములు గిరగిర తిరిగితే
మోటార్ కారు బలాదూర్

1960-70ల నడుమ హీరోకు ఉద్యోగం దొరకకపోతే రిక్షా తొక్కేవాడు. రిక్షా తొక్కటాన్ని అతి గ్లామరస్‍గా చూపేవారు. అందుకు పాట ఒక చక్కటి సాధనంగా ఉపయోగపడింది. రిక్షా త్రొక్కే పాటలు ఆకర్షణీయంగా ఉండేవి. పాటలో పనిలో  పనిగా నగరాలను చూపేవారు. ఆ కాలంలో రోడ్లు  ఇంతగా అభివృద్ధి చెందలేదు. వాహనాలు ఇంతగా వేగవంతం కావు. సమాజంలో ధనం ఇంతగా లేదు. సుఖం కోసం ఎంతయినా డబ్బు ఖర్చు చేసే మనస్తత్వం లేదు. ఉన్నది దాచాలనే పొదుపు ఆలోచనలు రాజ్యం ఏలుతుండేవి. కాబట్టి ప్రయాణాలు  వ్యాపార విలువను ఇంకా సంతరించుకోలేదు. అప్పుడు ‘నగరాలు’ ఎంతో గొప్పవిగా, అందని ఆకాశంలా  తోచేవి.ముఖ్యంగా, పల్లెల్లో వారికి నగరానికి వెళ్ళటమంటే విదేశీయానంలా వుండేది.  అందుకని పాటలలో నగరాలలోని ప్రసిద్ధ ప్రదేశాలను చూపటం ప్రజలను  ఆకర్షించటంలో ఎంతగానో తోడ్పడేది. అలా నగరాన్ని చూపటానికి ‘రిక్షా’ల పాటలు ఉపయోగపడేవి.  ‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్’ అలాంటి పాట.

‘మట్టిలో మాణిక్యం’ సినిమాలో హీరో పల్లె వదలి పట్నం వస్తాడు. పట్నం వచ్చి రిక్షా త్రొక్కుతాడు. రిక్షా ఉట్టిగా తొక్కితే అది ‘దో భీగా జమీన్’ లాంటి నిజానికి దగ్గరగా ఉండే సినిమా అవుతుంది. ఇది వినోదాత్మకమైన సినిమా. అందుకని రిక్షా తొక్కుతూ పాడతాడు. హైద రాబాదును చూపిస్తాడు.

అటు చూస్తే చార్‌మినారు
ఇటు చూస్తే జుమా మసీదు
ఆ వంక అసెంబ్లీ హాలు, ఈ వంక జూబ్లీ హాలు
తళతళ మెరిసే హుస్సేన్ సాగర్
దాటితే సికింద్రబాదూ..

(‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్’ పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=9_NVfUqcRqM )

రిక్షా త్రొక్కటం అన్నదాన్ని ఒక ఆహ్లాదకరమైన ‘సైట్ సీయింగ్’ చర్యలా భ్రమింపచేస్తుందీ పాట. నిజానికి ‘రిక్షా’ పాటల్లో ఏ పాట కూడా రిక్షా త్రొక్కటంలోని కష్టం ప్రస్తావించదు. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ సిద్ధాంతాన్ని పాటిస్తూ, ప్రపంచంలోని అన్ని ఉద్యోగాల్లో రిక్షా త్రొక్కటమే గొప్పది అన్న భావన కలిగించాలని ప్రయత్నిస్తాయి సినిమాల పాటలు.

రిక్షత్రొక్కే పాటల చిత్రీకరణ పెద్ద సమస్య కాదు. రిక్షా త్రొక్కటాన్ని క్లోస్ అప్ లోనూ, లాంగ్ షాటుల్లోనూ చూపాలి. మంచి కట్టడాలూ, భవనాలనూ చూపాలి. అంతే. నటుడు కూడా రిక్షా కదలకుండా ఉన్నా త్రొక్కుతున్నట్టు నటించాలి. చొట్టూ చూస్తున్నట్టు నటించాలి. అప్పుడప్పుడూ హాండిల్ వదలి, మళ్ళీ గబుక్కున పట్టుకున్నట్టు నటించాలి. ఇలాంటి పాటలను ఆకర్షణీయం చేయటంలో, సంగీతదర్శకుడు, గేయ రచయితల భాధ్యత అధికం. వారిమీదే ఇలాంటి పాటలు హిట్ అవటం ఆధారపడివుంటుంది.

1959లో విడుదలైన ‘చోటీ బహెన్’ సినిమాలో మహమూద్ పాత్ర రిక్షా తొక్కతూ పాడిన ‘మై రిక్షావాలా’ పాటను హిందీ సినిమాల్లో తొలి ‘రిక్షా’ పాటగా పరిగణిస్తారు.

మై రిక్షావాలా, మై రిక్షావాలా
హై చార్ కే బరాబర్, యే దో టాంగ్ వాలా
కహాఁ చలోగే బాబూ? కహాఁ చలోగే లాలా?
మై రిక్షావాలా..

రిక్షా తొక్కటాన్ని/లాగటాన్ని  ఎంతో ఆనందంగా అనుభవిస్తూ, జీవితాన్ని ఆనందంగా జీవిస్తూ, పాటలోనే తన ఒంటరితనాన్ని ప్రకటిస్తూ, చివరలో సామాజిక స్పృహను ప్రదర్శిస్తూ సాగుతుంది పాట. ఈ పాటలో ‘టూరిజం’ కన్నా పాత్ర వ్యక్తిత్వాన్ని ప్రదర్శించటం పైనే దృష్టి ఉంటుంది.

(‘మై రిక్షావాలా’ పాటను పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=1dO5cww0IMg )

ఇదే సినిమా తెలుగులో ‘ఆడపడుచుగా’ రూపొందించినప్పుడు హిందీలో మహమూద్ పాత్రను తెలుగులో పద్మనాభం ధరించాడు. రిక్షా తొక్కుతూ హిందీ పాటకు  ‘కొసరాజు’ చేసిన చక్కని అనువాద గీతాన్ని ఆలపించాడు ఘంటసాల గొంతులో.

రిక్షావాలాను నేను
పక్షిలాగా పోతాను
కాళ్లు మాత్రము రెండే అయినా
కదిలేనంటే ఆగను, చిన్న కారునయినా, కొట్టేస్తాను

ఈ పాటలో పాతకాలం నాటి మద్రాసును చూడవచ్చు. పద్మనాభం ఉత్సాహంగా రిక్షా తొక్కటం చూడవచ్చు.

రిక్షా తొక్కటాన్ని హిందీ సినిమాల్లో హాస్యగీతాలు, రోమాన్స్ పాటల కోసం కూడా వాడేరు. ‘లవ్ ఇన్ షిమ్లా’ సినిమాలో హీరో జాయ్ ముఖర్జీ, హీరోయిన్ ‘సాధన’ను రిక్షాలో కూర్చోబెట్టి రిక్షా లాగుతూ షిమ్లా మాల్ రోడ్డులో, పార్క్ లో తిప్పుతాడు. రొమాంటిక్ పాట పాడతాడు.

హసీనోం కీ సవారీ, హసీనోం కీ సవారీ
బడీ తక్దీర్ వాలి  హై రిక్షా హమారీ

ఆనందంగా, హాయిగా, రోమాన్స్ ఉట్టి పడుతూ సాగుతుంది పాట. పాట చివరిలో ఓ పాపను రిక్షాలో కూర్చో బెట్టి జాయ్, సాధనలు రిక్షా లాగుతారు.

(హసీనోం కీ సవారీ పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=W03zSZySjxA )

దిల్ తేరా దీవానా (1962) సినిమాలో

రిక్షే పె  మేరే తుమ్ ఆ భైఠే
అబ్ మేరా హునర్ దేఖో
దేతా హై మజే కైసే కైసే
అప్నా యె సఫర్ దేఖో

అని మహమూద్ పాడతాడు. పాట ఆరంభం, గాడిద ఓండ్రతో మొదలవుతుంది. పాట కామెడీ పాట.

(‘రిక్షే పె మెరే  తుమ్ ఆ భైఠే’ పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=JW8aEO32oF4 )

హిందీ సినిమాలో రిక్షా పాటలకు అధికంగా నటించిన ఘనత మహమూద్‌దే. ‘కువారా బాప్’ సినిమాలో రిక్షా త్రొక్కుతూ కిషోర్ కుమార్ గొంతులో పాట పాడతాడు, గుర్రంతో తనను పోల్చుకుంటాడు.

మై హు ఘోడా, యే హై గాడీ
మెరీ రిక్షా సబ్ సే నిరాలీ
నా గోరి హై నా యే కాలీ
ఘర్ తక్ పహుంచా దేనే వాలీ

పాట మధురంగా ఉంటుంది.

(‘మై హు ఘోడా’ పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=h3KFjqdas5U )

అయితే ఈ రిక్షా పాటలన్నిటిలో సామాజిక స్పృహను తప్పనిసరిగా ప్రదర్శిస్తారు. రిక్షా త్రొక్కటం వల్ల ఒనగూడే సామాజిక ప్రయోజనం, చేసే సామాజిక సేవలను ప్రస్తావిస్తూ రిక్షా త్రొక్కేవారి లోని మానవత్వం కూడా ప్రదర్శిస్తాయీ పాటలు.

ఉన్న వాడికి తింటే అరగదు
లేని వాడికి తిండే దొరగదు
పరుపులున్న పట్టదు నిదుర
కదరా నేలను గురకలు వినరా
హెచ్చుతగ్గులా తొలగే రోజూ ఎప్పుడొస్తుందో?  ఏమో?

రింజిం రింజిం హైదరబాద్, రిక్షావాలా జిందాబాద్!

రిక్షా తొక్కుతూ తాను గమనించిన విషయాలను గురించి పాడుతూ ‘సామాజిక  స్పృహ’తో సమాజంలో అన్యాయాన్ని ఎత్తి చూపిస్తాడు. పాట చివరలో హిందీ సినిమా ‘పహెచాన్’ లో హిట్ పాట ‘ బస్ యహీ అపరాధ్’ పాటలో ముకేశ్ చేసిన ఆలాపననూ చేసి పాటను మరింత ఆకర్షణీయం చేస్తాడు.

రాత్ దిన్ హర్ ఘడీ ఏక్ సవాల్ ఏక్ సవాల్
రోటీయాఁ కమ్ హై క్యూం
క్యూం హై అకాల్ క్యూం హై అకాల్
క్యూం దునియా మే కమీ హై, యే చోరీ కిస్ నే కీ హై
కహాఁ హై సారా మాల్ కహాఁ హై సారా మాల్  ( చోటీ బహెన్)

మహబూబ్ రిక్షా త్రొక్కుతూ వెళ్తుంటే ఆకలికి అడుక్కుంటున్న పిల్లలు కనిపిస్తారు. వారికి డబ్బులిస్తాడు. ఆ వెంటనే బిచ్చగాళ్లు అతడిని చుట్టు ముడతారు. వారిందరినీ తాను కష్టపడి రిక్షా తొక్కి సంపాదించిన డబ్బు పంచి, మళ్లీ సవారీని తీసుకుని పరుగెడతాడు. ఇంతలో, ప్రపంచంలో ఇన్ని వనరులు, ఇంత పంట ఉన్నా అందరికీ తిండి ఎందుకు దొరకటం లేదు?  ఎవరు దొంగించారీ రొట్టెలను, తిండిని? అని ప్రశ్నిస్తాడు.

హిందీ పాటకు దాదాపుగా అనువాదమైన ‘రిక్షావాలాను నేను’ పాటలో కూడా చివరి చరణంలో ఇలాంటి అర్థం వచ్చే పాట పాడతాడు.

రేయింబవళ్లు శ్రమ పడువాళ్ళకు పాడు తిండి కరువెందుకు?
ఈ రేషను బాధలు ఎందుకు?
పైన ఉన్న వాడెవడో వాడీ ప్రశ్నకు జవాబు చెప్పాలి
ఈ తేడాలేమిటో తేల్చాలి.

‘మై హు ఘోడా’ పాట చివరలో చెత్త దగ్గర తిండి కోసం వెతుకుతున్న పిల్లను చూస్తాడు రిక్షా తొక్కుతున్న మహమూద్.

హమ్ ఆజాద్ హై మిస్టర్, క్యా ఇన్సాన్ ఔర్ క్యా జాన్‌వర్
మేరే దేశ్ మే సారే బరాబర్, మేరే దేశ్ మే సారే బరాబర్
హ కుత్తా పె సోయె. మానవ్ కా ఘర్ తో రొయె
జిందగీ లగ్తీ హై జాలీ, హో జిందగీ లగ్తీ హై జాలీ

కాలం మారింది. రిక్షాలు హీరోలు త్రొక్కటం ప్రారంభించారు. పాట మారింది. రూపు మారింది. పాట రీతి మారింది, భావం మారింది. సినిమా కథ ప్రాధాన్యం, కథలో మనుషుల ప్రాధాన్యం తగ్గి ‘హీరోఇజమ్’, హీరో ఇమేజ్ ల ప్రాధాన్యం పెరిగింది. అందుకు తగ్గట్టుగానే సినిమాలో రిక్షా పాట తీరు మారింది.

రిక్షా తొక్కాలిరా, నా సామిరంగా
సైకిల్ రిక్షా తొక్కాలిరా
భూమికి బరువౌ  సోమరిపోతుల
ఎక్కించుకు పరుగెయ్యాలిరా

‘రామ్ రహీమ్’ సినిమాలో బాలకృష్ణ రిక్షా తొక్కుతూ, తోటి రిక్షా వాళ్ల గుంపుతో కలసి పాడే పాట ఇది. ఇందులో హీరోయిజం కనిపిస్తుంది. రిక్షా ఎక్కే వాళ్లు సోమరిపోతులన్న ఆలోచన పల్లవిలోనే కనిపిస్తుంది. ఆ సోమరిపోతుల వల్లనే తమ జీవిక గడుస్తుదన్న కనీస గ్రహింపు లేకుండా ‘హీరోయిజం’కు పెద్ద పీట వేయటం కనిపిస్తుందీ పాటలో. అయితే ఈ పాటలో  ఒకప్పటి కాకినాడను చూసే వీలు కలుగుతుంది. ఆనాటి శివాలయం, మసీదు, చర్చి స్కేర్, వ్యూ హోటల్,  క్రౌన్, కల్పన థియేటర్లు చూసే వీలు చిక్కుతుంది.

ఈ రోజుల్లో ఉద్యోగాలకు ఎందరి కాళ్లో పట్టాలి
మరి లంచాలెన్నో తట్టాలి
హరే రామ హరే రామ్
కాయకష్టము చేస్తే నోటికి నాలుగు వేళ్లూ అందేనూ
లేకుంటే పస్తుల బాధేనూ

(‘రిక్షా తొక్కాలిరా’ పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=yGWTCshNcHE )

అంటే ఇప్పటి స్వశక్త భారత్ ఆలోచన ఆనాడే మన హీరో ప్రకటించేశాడన్న మాట. ఉద్యోగాలకు వెళ్ళటం అంటే, ఊడిగం చేయటమే కాబట్టి స్వంత వ్యాపారం పెట్టుకోవాలి, ప్రభుత్వం పై ఆధారపడవద్దన్న ఆలోచనను ఆనాడే ప్రదర్శించారు మనకళాకారులు. ఇటీవలి కాలంలో ఒకడిక్రింద పనిచేసే ఉద్యోగం ఎంత పెద్దదయినా ఊడిగమే, దాని బదులు మిర్చీ బజ్జీ వ్యాపారంలో ఎంతో స్వేచ్చవున్నదన్నట్టు వస్తున్నాయి కథలు ఇప్పుడు. ఆ ఆలోచననే ఎప్పుడో ప్రదర్శించారు.

‘ఒరెయ్ రిక్షా’ సినిమాలోనయితే రిక్షా పాటలో రిక్షా తొక్కటాన్ని ఒక స్థాయిలో నిలపటమే కాదు, రిక్షా వారికి జరిగే అన్యాయాలకు సంబంధించిన సామాజిక స్పృహ పొంగి పొర్లుతుంది. రిక్షా త్రొక్కటం తిరుగుబాటు నిచ్చెన మెట్టన్న ఆలోచనను కలిగిస్తుంది.

‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షాకి పెట్రోలు
పెట్రోలు ధర పెరిగింది డిజీల్ ధర పెరిగింది
నా రక్తం ధర ఏమో రోజు రోజు తగ్గబట్టె’

రిక్షా విప్లవం కోరుతోంది పాట.

‘రిక్షా టైరు వోలె మన బ్రతుకులు అరిగిపోయె
చక్రాల్లో బాల్స్ వోలె మన గుండెలు కరిగిపోయే
మన కండలు నలిగి పోయి సీటు కింద దిండులాయే
రిక్షాలో అయిలోలె మన నెత్తురు ఒడిసి పోయే
ఎన్నాళ్లు ఈ బతుకులు మెతుకు లేని మన బతుకులు
బతుకు కొరకు బలిసినోళ్ల టైరు క్రింద తోసి తొక్కి’

మారుతున్న కాలానికి అద్దం పడతాయి రిక్షా పాటలు. సినిమాలలో మారుతున్న దృక్పథాన్ని, రూపాంతరం చెందుతున్న ఆలోచనలను ప్రతిబింబిస్తాయి రిక్షా పాటలు. పాటలను సృజించే సందర్భం మారలేదు. చిత్రీకరణలో మార్పు లేదు. మార్పు పాటల్లో ప్రదర్శించే భావంలో, ధోరణిలో వచ్చింది.

ఓ వైపు సినిమాల్లో సామాజిక విప్లవానికి రిక్షా త్రొక్కటం ప్రతీక అయితే, మరో వైపు మనుషుల్ని వదిలేసి హీరోయిజం దాటి స్టార్లు తొక్కినట్టు నడిచి, ఆడించినట్టు ఆడే రిక్షా పాటలు వచ్చేశాయి. ఒక్కడే రిక్షా  తొక్కుకుంటూ దేశ కాల పరిస్థితుల గురించి ఆలోచించే పాటలు పోయి,  హిరోల ఇమేజ్ లకు తగ్గట్టు నడిచే రిక్షా పాటలు వచ్చేశాయి.

‘హోలాంధ్రా సీడెడ్ నైజాం రిక్షాబాబులకు నమస్కారం. ఆదాబరజ్.. నమస్తే అన్నా, ఈ రిక్షావోడంటే ఎవడనుకుంటున్నారు, కండ బలం ఒంటి బలం కాలి బలం, కష్ట ఫలం లేదు భయం మాకు జయం’

దేవుడైనా జీవుడైన రిక్షావోడురా
భారతాన కృష్ణుడేమి చేసినాడురా
అకసాన సూరిబాబు రిక్షావోడురా
నైట్ రిక్షా చందమామ తొక్కుతాడురా
లోడ్ ఏస్కో దౌడే తీస్కో
శాలిబండ, గోలుకొండ, టాంకుబండు, గట్టుగుండు
పంజగుట్ట ఎర్రగట్ట 1234
చల్తీకా నాం గాడీ హై
చెమటోడిస్తే రోటీ హై
టీ ఓ చాయ్ ఎయరా భాయీ

(‘రిక్షావోడు’ సినిమాలోని ‘దేవుడైనా జీవుడైన రిక్షావోడురా’ పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=yGWTCshNcHE )

తెలుగు సినిమాలు ఆకర్షణీయంగా రూపొందించటంలో తమ వంతు పాత్ర పోషించిన రిక్షాల పాటలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి. నిత్య జీవితంలోంచి కూడా రిక్షాలు కనుమరుగయ్యాయి. కాబట్టి సినిమాల్లోంచి రిక్షాపాటలు అదృశ్యమవటంలో ఆశ్చర్యంలేదు.

ఒక తలపై రూమీ టోపీ
ఒక తలపై గాంధీ టోపీ
క్యా భాయ్ అంటాడొకడు
ఏమోయ్ అంటాడొకడు
మతాలు భాషలు వేరైనా
మనమంతా భాయీ భాయీ

రింజిం రింజిం హైదరబాద్

హీరో తొక్కే రిక్షా పాటను వ్యవస్థ పై వ్యాఖ్యగా మలచి హీరోతో చేదు నిజాలు చెప్పించినవి; బాధను. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, సామాజిక సమరసతకు. దర్పణం పడుతూ ఐకమత్యానికి, కలిసికట్టుగా పోరాడటానికి ప్రోత్సామిచ్చినవి రిక్షా పాటలు.

ఎన్ని రిక్షా పాటలు ఎన్నిన్ని రూపాలుగా రూపొందినా, 1959లో తెలుగులో వచ్చిన తొలి రిక్షా పాట ‘శభాష్ రాముడు’ సినిమాలోని ‘జయమ్ము నిశ్చయమ్మురా’ పాటను మించిన పాట అటు అర్ధంలోనూ, ఇటు దృశ్యపరంగానూ మరొకటి లేదనవచ్చు. ఎలాంటి ఆవేశాలు అన్యాయాల ఏడుపులు లేకుండా జీవితంలో అన్నిటినీ ఎదిరించి తలెత్తుకుని పోరాడుతూ ఆత్మ విశ్వాసంతో , ఆత్మ గౌరవంగా జీవించమని నేర్పే పాట అది. ఈ పాటలో కూడా  1959 నాటి హైదరాబాదును చూడవచ్చు.

గాఢాంధకారమలుముకున్న భీతి చెందకు
సందేహపడక వెల్గు చూసి సాగు ముందుకు
నిరాశ లోన జీవితాన్ని క్రుంగదీయకు

***

పరాభవమ్ము గల్గునంత పారిపోకుమోయ్
జయమ్ము నిమ్మరించుదాక పోరి గెల్వవోయ్
స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్.. నిల్వబెట్టవోయ్

***

విద్యార్థులంతా విజ్ఞానం సాధించాలి
విశాల దృష్టి తప్పకుండ బోధించాలి
పెద్దలను గౌరవించి పూజించాలి
జయమ్ము నిశ్చయంమ్మురా భయమ్ము లేదురా
భయమ్ము లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా.

(‘జయమ్ము నిశ్చయమ్మురా’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=YiU6LBiSN8k )

(మళ్ళీ కలుద్దాం).

Exit mobile version