Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-34

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రహెతీహో
జీవన్ మీఠీ ప్యాస్ యే కహెతీహో

పాటల చిత్రీకరణలో నిరంతరం ఏదో ఒక కొత్తదనం సాధించాలని తపన పడే దర్శకులలో విజయ్ ఆనంద్ అగ్రగణ్యుడు. కొందరు  పాటల కోసం సందర్భాలు సృష్టిస్తారు. మరికొందరు, పాటలను స్క్రీన్ ప్లే లో ఒక అవిభాజ్యమైన అంగంగా మలుస్తారు. విజయ్ ఆనంద్ పై రెండు ప్రక్రియలలో నిష్ణాతుడు కావటమే కాదు, మామూలు, రొటీన్ పాటల సందర్భాలలోనూ పాట చిత్రీకరణకు ప్రత్యేకతను ఆపాదించి ‘అద్భుతం’ అనిపించగలడు. మామూలు సందర్భాల్లోని పాటలను కూడా మరపురాని మధురమైన దృశ్యాలుగా మలచగలడు. ఇందుకు చక్కని ఉదాహరణ ‘బ్లాక్‌మెయిల్’ సినిమా. రాజిందర్ క్రిషన్ చక్కని పదాలతో సున్నితమైన భావనలను పొదిగాడీ పాటలో. సందర్భోచితమైన సంగీతాన్ని జోడించారు సంగీత దర్శకులు కళ్యాణ్ జీ – ఆనంద్ జీ. అది కిశోర్ కుమార్ యుగం. ఆయన పలికిందల్లా అద్భుతమయిన గానం  అయ్యే కాలం. కాబట్టి కిశోర్ అత్యద్భుతంగా, రొమాన్స్ ఉట్టిపడేలా పాడేడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

‘బ్లాక్‌మెయిల్’ సినిమాలో నాయకుడు బిడియస్తుడు. నాయికకు మనసులో మాట చెప్పలేడు. చెప్పలేని మాటలన్నీ ఉత్తరాలుగా రాసుకుంటాడు. కానీ ఉత్తరాలు పంపడు. చివరికి ఒకరోజు ఆమెకీ విషయం చెప్పి ఉత్తరాలు ఆమె చేతిలో పెట్టి పరుగెత్తి వెళ్ళిపోతాడు.

ఆమె, తీరికగా ఆరుబయట పచ్చికబయలులో ఓ బెంచిమీద కూర్చుని ఉత్తరాలు చదవటం ప్రారంభిస్తుంది. పాట వస్తుందన్న సూచనగా ప్రిల్యూడ్ సంగీతం గిటార్ తంత్రులపై వినిపిస్తుంది.

సాధారణంగా ఉత్తరాల పాటల చిత్రీకరణకు కొన్ని పద్ధతులున్నాయి. ఉత్తరం తెరవగానే ఉత్తరం మధ్యలో హీరోనో, హీరోయినో కనిపిస్తారు. పాట పాడతారు.

‘బాబర్’ సినిమాలో రెండు పాటలుంటాయి. రఫీ, సుధా మల్హోత్రాలు పాడతారీ పాటలను. పాటలను రాసింది సాహిర్ లూధియాన్వీ. ఆమె ఉత్తరం ఒక పాట. ఉత్తరానికి సమాధానం ఇంకొక పాట. ‘పయామ్-ఎ-ఇష్క్ మొహబ్బత్ హమే పసంద్ నహీ‘ అని ఆమె ఉత్తరం రాస్తుంది. దాన్ని చదివేప్పుడు అతడికి ఉత్తరంలో ఆమె కనిపిస్తుంది. తరువాత అతడు ఉత్తరం చదువుతూంటే ఆమె ఉద్విగ్నతకు గురవటం చూపిస్తాడు. పాట చిత్రీకరణ కన్నా, సాహిర్ గేయం లోని భావాలు మురిపిస్తాయి.

ఈ పాటకు సమాధానంగా నాయకుడు ‘తుమ్ ఏక్ బార్ మొహబ్బత్ కా ఇంతెహాన్ తో లో‘ అంటూ ఉత్తరం రాస్తాడు. అది చదువుతూంటే ఆమెకు ఉత్తరంలో అతడు కనిపిస్తాడు. ఇక్కడ కూడా పాట చిత్రీకరణ కన్నా, పాటలో సాహిర్ ప్రదర్శించిన సున్నితమైన భావాలు అలరిస్తాయి. రఫీ గానం మంత్రముగ్ధులను చేస్తుంది. చిత్రీకరణలో ఎలాంటి ప్రత్యేకత లేకున్నా భావాలు, గానం పాటను ఆకర్షణీయం చేయటమే కాకుండా మరపురాని మధురగీతాలుగా నిలుపుతాయీ పాటలను.

‘బంజారిన్’ సినిమాలో లతా, ముకేశ్‌ల యుగళగీతం ‘చందారే మెరా పతియా లేజా‘ కూడా చిత్రీకరణ కన్నా పాట మాధుర్యం, లతా ముకేశ్‌ల గానం వల్లనే మరపురాని గీతంలా ఎదిగుతుంది.

‘సరస్వతీచంద్ర’ సినిమాలోని ‘ఫూల్ తుమ్హే భేజా హై ఖత్ మే‘ కూడా సాధారణ చిత్రీకరణ, కానీ, నూతన్ హావభావాలు, లతా ముకేశ్‍ల గానం, ఇందీవర్ రచన పాటను అత్యుత్తమ గీతంలా నిలుపుతాయి.

నిజానికి ఉత్తరాలు రాయటం మనకు కాళిదాసు ‘శాకుంతలం’ నుంచీ వుంది. 1943లో శాంతారాం ‘శకుంతల’ సినిమా నిర్మించాడు. దానిలో తొలి ఉత్తరం పాట ‘కమల్ హై మేరే సామ్నే’ పాటలో తామరాకుపై ఉత్తరం రాస్తూ పాడుతుంది నాయిక. ఈ కథనే మళ్ళీ 1961 ప్రాంతంలో ‘స్త్రీ’ సినిమాగా నిర్మించినప్పుడు ఈ సందర్భంలోనే ఉత్తరం రాస్తూ నాయిక ‘ఓ నిర్దయీ ప్రీతమ్’ అనే అద్భుతమయిన పాట పాడుతుంది. రెండు సందర్భాలలో కూడా చిత్రీకరణ కన్నా పాట బాణీ, గానం, రచనలు పాటలను ఉచ్చస్థాయిలో నిలుపుతాయి.

ఇంకొంచెం ముందుకు వస్తే మౌసమీ చటర్జీ ‘కచ్చే ధాగే’ సినిమాలో ‘హాయ్ హాయ్ ఎక్ లడ్కా ముఝ్కో ఖత్ లిఖ్తాహై’ అని ఒక అబ్బాయి తనకు ఉత్తరం రాస్తాడని నృత్యం చేస్తూ ఊరంతా పరుగిడుతూ చెప్తుంది.

రాజ్ కపూర్ సినిమా ‘ఆహ్’ ఒకరు రాసిన ఉత్తరం మరొకరు రాసినట్టు పొరపడి అసలు అమ్మాయిని విడిచి మరొకరిని ప్రేయసి అనుకునే ఉత్తరాల వల్ల కలిగిన అపార్ధాల సినిమా. ఈ సినిమాలో ఒక్క ఉత్తరం పాట కూడా లేదు. ఇప్పటి కాలంలో, ఇంటర్నెట్‌లో భార్యాభర్తలే మారు పేర్లతో ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించుకోవటం సంభవిస్తున్నది.  ‘ఆహ్’ సినిమాను శీర్షాసనం వేయించినది ‘మిత్ర్-మై ఫ్రెండ్’ అనే సినిమా.

‘లంచ్ బాక్స్’ సినిమాలో లంచ్ బాక్స్‌లో ఉత్తరాలు పంపుకుంటారు. ఇంకా ‘కబూతర్ జా జా జా’ అంటూ ‘మైనే ప్యార్ కియా’ సినిమాలో నాయిక పావురంతో ఉత్తరం పంపుతుంది. ‘అనార్కలి’ సినిమాలో ‘జిందగీ ప్యార్ కీ దో చార్ ఘడీ హోతీ హై’ అనే పాట నేపథ్యంలో వస్తూంటే, నాయికా నాయకులు పావురాళ్ళతో సందేశాలు పంపుకుంటూంటారు.

‘దేవర్’ సినిమా మొత్తం ఉత్తరాల వల్ల సృష్టించిన అపార్థాల ఆధారంగా సాగుతుంది. కానీ, ఉత్తరాల పాట లేదు సినిమాలో. ‘ఏక్ దూజే కే లియే’ సినిమాలో హీరో హీరోయిన్‌లు ఉత్తరాలు రాస్తూంటే ‘హమ్ తుమ్ దోనో జబ్ మిల్ జాయేంగే’ అన్న పాట నేపథ్యంలో వస్తూంటుంది. ‘నామ్’ సినిమాలో ‘చిట్టీ ఆయీరే’ పాట అయితే దేశాన్ని ఊపేసింది. పాటలోని భావాలు ప్రతి ఒక్కరి మనసునూ కరగించి కళ్ళు చెమర్చేట్టు చేశాయి. ‘బార్డర్‘ సినిమాలో’ సందేశే ఆతీహై‘ కూడా చిత్రీకరణ కన్నా, బాణీ, గేయ రచనలవల్ల హిట్ అయింది. అదీ సైనికుల పాట కావటంతో మరింతగా ప్రేక్షకులను స్పందింపచేసింది. ‘హకీకత్‘ సినిమాలో ఒక్క ఉత్తరం కూడా రాలేదని విలపిస్తూ పాడే పాట ‘ మై యే సొచ్ కర్‘, హిమాలయాల్లో దారి తప్పి విలపిస్తూ, తమ ఉత్తరాలు చదువుతూ తమవారు తమని గుర్తు చేసుకుంటారని భావిస్తూ పాడిన ‘ హోకె మజ్బూర్ ముఝే‘ పాటలు సందర్భాన్ని బట్టి, భావం, గానం ఆధారంగా ఈ నాటికీ శ్రోతలను అలరిస్తున్నాయి. ‘ఆఖ్రీఖత్’ సినిమా మొత్తం ఉత్తరం చుట్టూ తిరిగినా ఒక్క ఉత్తరం పాట లేదు.

‘ప్రేమ్ పూజారి‘ సినిమాలో పూలరంగుతో, హృదయమనే కలంతో, రోజూ ఉత్తరం రాస్తాననే అత్యంత అద్భుతమయిన కిశోర్ కుమార్ సూపర్ హిట్  పాట “ఫూలోంకె  రంగ్ సే, దిల్కీ కలంసే తుఝ్ కో లిఖే రోజ్ పాతీ” ఉంది. కానీ, అంత చెత్త చిత్రీకరణ అయినా, పాటలో నీరజ్ ప్రదర్శించిన రొమాన్స్, ఎస్డీ బర్మన్ బాణీ పాటను ఈనాటికే కాదు, ఏనాటికయినా సజీవంగా నిలుపుతాయి.

ఇంకా ‘ఆయెగీ జరూర్ చిట్టి మెరే నామ్ కీ’ (దుల్హన్), ‘హమ్ దోనో మిల్కే కాగజ్ కె దిల్ పే చిట్టీ లిఖేంగే’ (తుమ్హారీ కసమ్), ‘హమ్నే సనం కో ఖత్ లిఖా’ (శక్తి), ‘చిట్టీ న కొయీ సందేశ్’ (దుష్మన్) ఇలా ఉత్తరాల పాటలు ఎన్నెన్నో ఉన్నా ఆయా పాటల చిత్రీకరణలో ప్రత్యేకత కనబడదు. ఈ పాటలన్నీ చిత్రీకరణ కన్నా, బాణీ, గానం, ముఖ్యంగా గీత రచనపై ఆధారపడి హిట్ అయినవే.

‘కన్యాదాన్’ సినిమాలో ‘లిఖే జో ఖత్ తుఝే’ కూడా రఫీ గానం, నీరజ్ కవనం, శంకర్ జైకిషన్ సంగీతంపై ఆధారపడి సూపర్ హిట్ అయింది. ఈ పాటలో ‘లిఖే జో ఖత్ తుఝే/వో తేరీ యాద్ మే/హజారోం రంగ్ కే/నజారే బన్ గయి/సవేరా జబ్ హువా/తో ఫూల్ బన్ గయే/జో రాత్ ఆయీతో/సితారే బన్ గయే’ అన్న పల్లవి వింటూంటే, ‘దివిలోనా మల్లియలాయే/భువిలోనా తారకలాయే నీ నవ్వులే’ అన్న పంక్తులు గుర్తుకొస్తాయి.

ఇలా ఇంకా అనేక పాటలున్నాయి. కానీ, చిత్రీకరణ వల్ల కూడా అలరించిన పాటలంటే ‘సంగం’లో ‘యే మెరా ప్రేమ్ పత్ర్ పఢ్‌కర్’ మనసులో మెదలుతుంది. ఆ పాట ఒక సున్నిత భావనల దృశ్య కావ్యం.

‘పల్కోకి ఛాంవ్ మే’ సినిమాలో రాజేశ్ ఖన్నా పోస్ట్‌మేన్‌గా పాడిన పాట ‘డాకియా డాక్ లాయా’ పాట ఒకనాటి కాలంలో పోస్ట్‌మేన్ ఎలాగ జన జీవితాల్లో కలగలసిపోయాడో హృద్యంగా తెలుపుతుంది. పాట రచన ఎంత చక్కగా వుంటుందో, కిశోర్ కుమార్ గానం అంత అద్భుతంగా వుంటుంది. ఈ-మెయిల్ కాలం వారికి అస్సలు పరిచయంలేని విషయం ఇది. ఇలాంటి పాటలు చూస్తోంటే అనిపిస్తుంది, జీవితంలోని అమాయకత్వం, సున్నితత్వం, ప్రశాంతతలను మనం సాంకేతిక ప్రపంచంలో కోల్పో యామని.

‘కితాబ్’ సినిమాలో గుల్జార్ రాసిన చిన్న పిల్లల పాట ‘ఆ ఇ ఈ మాస్టర్ జీ కీ ఆగయి చిట్టీ, చిట్టీమే సే నిక్లీ బిల్లీ’ కూడా పాటతో పాటూ చిత్రీకరణ వల్ల కూడా అలరిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు పద్మిని, శివాంగీ కోల్హాపురీ, మాస్టర్ రాజు, మస్టర్ టిట్టూ వంటి బాలనటులు నటించిన ఈ పాట వింటూంటే ఎంత బాగుంటుందో, చూస్తూంటే ఇంకా బాగుంటుంది.

కానీ, ఈ పాటల చిత్రీకరణ ఒక ఎత్తు, ‘పల్ పల్ దిల్కే పాస్’ పాట చిత్రీకరణ ఒక ఎత్తు. ఉత్తరాలను చదవటం ఇంత  ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా చిత్రీకరించవచ్చని ఈ పాటను చూస్తే కానీ నమ్మకం కుదరదు.

పాట ఆరంభం మామూలుగానే వుంటుంది. ఆమె ఉత్తరాలు చదువుతూంటుంది. చేతిలోని ఉత్తరం గాలికెగిరి మొక్కలో చిక్కుకుంటుంది. ఉత్తరం నుంచి పాట వినిపిస్తూంటుంది, ‘పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రహెతీ హో’ అంటూ. ఆమె సంభ్రమాశ్చర్యాలతో ఉత్తరం వైపు చూస్తుంది.  ఒక పాటను ఆసక్తికరమైన కథగా చిత్రీకరణ ద్వారా మలచటం ఇక్కడినుంచే ఆరంభమవుతుంది.

ముందు ఉత్తరం చదువుతున్న నాయిక కళ్ళను క్లోజ్ అప్‌లో చూపిస్తాడు. తరువాత ఉత్తరాన్ని క్లోజ్ అప్‌లో చూపిస్తాడు. ఉత్తరంలో నాయికను ‘ప్రియ మిస్ మెహ్తా’ అని సంబోధిస్తాడు. తరువాత షాట్‌లో ‘ప్రియ ఆశా’ అని వుంటుంది. ఆ తరువాత ‘ఆశా’ అనీ, ‘మేరీ ఆశా’ అని సంబోధించటం స్పష్టంగా కనిపిస్తుంది. నేపథ్యంలో గిటార్ తంత్రులు మ్రోగటం ఆరంభమవుతుంది. అంటే, ఉత్తరాలను క్లోజ్ అప్ లో చూపుతూ మారుతున్న సంబోధన ద్వారా నాయకుడు నాయికను ఎంత సన్నిహితంగా భావిస్తున్నాడో ఒక్క పదం పలకకుండా చూపించేశాడన్నమాట దర్శకుడు. మళ్ళీ నాయిక కళ్ళను క్లోజ్ అప్‍లో చూపిస్తాడు. ఇప్పుడు కళ్ళల్లో కనిపించే భావం వేరే. మృదువయిన ప్రేమ భావన కనిపిస్తుంది. తరువాత దృశ్యంలో నాయిక లేచి నడుస్తూ ఉత్తరం చదువుతుంది. ఆమె ఉత్తరాన్ని పట్టుకుని చదివే విధానంలోనే ఆమె ఆనందం, ఆమోదం తెలుస్తాయి. నేపథ్య సంగీతం ఊపందుకుంటుంది. ఇప్పుడు రెండువైపులా నిలచిన పచ్చని చెట్ల నడుమ ఉత్తరాన్ని హృదయానికి హత్తుకున్న నాయిక కనిపిస్తుంది. అంటే, ఒక్క పది సెకనులలో ఆమె మనసులో కలిగిన భావనలను ప్రేక్షకుడికి చేరువ చేస్తాడన్నమాట. ఇదంతా కెమేరా కోణాల మార్పుతో చూపిస్తాడు.

తరువాత షాట్‌లో వయొలిన్లు ఉధృతమవుతూంటే, బెంచిపై ఉన్న ఉత్తరాలు ఎగిరిపోవటం క్లోజ్ అప్‌లో చూపిస్తాడు. సంగీతం లయకు తగ్గ దృశ్యాన్ని తెరపై చూపటంతో ప్రేక్షకుడూ ఆ లయకు స్పందిస్తాడు. ఊగుతాడు.

ఎగురుతున్న ఉత్తరాలను ఆమె పరుగున వెళ్ళి ఏరుతూంటే కెమేరా ఆమెను అనుసరిస్తుంది. ఆమె ఆశ్చర్యంగా చూస్తుంది. క్లోజ్ అప్‌లో ఆమెను చూపించి, ఆమె ఏం చూస్తున్నదో అన్న ఉత్కంఠను కలిగించి, చెట్టుకు ఇరుక్కున్న ఉత్తరాన్ని చూపుతాడు. దాన్నుంచి పాట వస్తూంటుంది. ఉత్తరం మీద ఇప్పుడు ‘ప్రియ ఆశా’ అన్న సంబోధన ఉంటుంది.

పాడుతున్న ఉత్తరాన్ని నాయిక సంభ్రమంగా చూస్తూంటుంది. ఆమె సంభ్రమాన్ని ఆమె ఆనందాన్ని చూపించేందుకు కెమేరాను ఆమె, ఉత్తరం చుట్టూ తిప్పుతాడు. విజయ్ ఆనంద్ పాటల చిత్రీకరణలో కెమేరా ఒక్క క్షణం నిశ్చలంగా వుండదు. కెమేరా నిశ్చలంగా వుంటే, తెరపై ఏదో ఒకటి జరుగుతూంటుంది. లేకపోతే కెమేరా కదలుతూ కథ చెప్తుంది. ఇప్పటికే పాట ప్రేక్షకుడిని అలరిస్తుంది.

నడుస్తూ ఉత్తరం చదువుతూన్న నాయిక కెమేరా వైపు నడుస్తూంటుంది. ఆమె ముఖంలో మారే భావనలను కెమేరా ప్రేక్షకుడికి దగ్గరనుంచి చూపిస్తుంది. లాంగ్ షాట్‌లో ఆమె ఉత్తరాలు పట్టుకుని ఇంట్లోకి వెళ్తుంది. కెమేరా ఆమెతో పాటూ నడుస్తుంది. ఇలా నిరంతరం ఏదో ఒకటి తెరపై జరుగుతూండటం వల్ల ప్రేక్షకుడు పాటతో మమేకం అవుతాడు. ఇక్కడ కథ ముందుకు సాగటంలేదన్న భావన దరిదాపులకు కూడా రాదు.

తరువాతి దృశ్యంలో నాయిక కుర్చీలో కూర్చుని ఉత్తరాలు చేతిలో పట్టుకుని ఉంటుంది. కెమేరా ఆమెను దూరం నుంచి చూసి ఆమె దగ్గరకు వెళ్తుంది. ఈ దృశ్యంలో నాయిక నిశ్చలంగా ఉంది. కెమేరా కదలుతోంది.

కుర్చీలో కూర్చుని మత్తుగా కళ్ళు మూతపడుతున్న నాయికను కెమేరా పలు కోణాల్లో చూపుతుంది. చేతిలో ఉన్న ఉత్తరాన్ని క్లోజ్ అప్‌లో చూపుతుంది. అంటే, క్షణ క్షణానికీ దృశ్యం మారుతుందన్నమాట. ఎందుకంటే, ఇంటర్‌ల్యూడ్ సంగీతం సమయంలో నాయిక నిశ్చలంగా ఉంటుంది కాబట్టి కెమేరా దృశ్యాన్ని మార్చి మార్చి చూపకపోతే ప్రేక్షకుడి ఆసక్తి సన్నగిల్లుతుంది.

ఇక్కడి నుంచీ పాట చిత్రీకరణ వేరే స్థాయికి మారిపోతుంది. మత్తుగా కళ్ళు మూసుకుంటూ, తెరుస్తూన్న నాయిక కళ్ళు మూతపడతాయి. కుర్చీ వెనుక నుంచి నాయకుడు ఆమె నుదిటి మీద ముద్దు పెడతాడు. ఉలిక్కిపడి లేస్తుంది నాయిక. ఇంతకాలం, ఉత్తరాల్లోంచి కనబడకుండా  పాడిన హీరో ఇప్పుడు ఆమె ఊహల్లో ప్రాణం పోసుకుని ఆమెతో దోబూచులాడుతూ పాడుతున్నాడన్నమాట.

ఆమె ఒక స్తంభం చాటున నిలబడి ఉత్తరం చదువుతూంటే, కెమేరా ఎదో రహస్యాన్ని చూపుతున్నట్టు, స్తంభం చుట్టూ తిరిగి ఆనందంగా ఉత్తరం చదువుతున్న ఆమెని క్లోజ్ అప్‌లో చూపిస్తుంది. మరో కోణంలో ఆమె తెర అంచున ఉంటే, ఉత్తరం తెర అంతా కనిపిస్తుంది. ఆమె ఉత్తరం దించగానే, వెనుక హీరో పాట పాడుతూ కనిపిస్తాడు. ఈ షాట్ ను ఊహించి ఇలా చిత్రీకరించటం మామూలువారికి సాధ్యం కాదు. ఇలాంటి టెక్నిక్ సాధారణంగా సస్పెన్స్ సినిమాల్లో వాడతారు. హీరోయిన్ కణతల దగ్గర తుపాకీ పెట్టి విలన్ ట్రిగ్గర్ నొక్కబోతాడు.’ఢాం’ అన్న శబ్దం వినిపిస్తుంది. ‘అదేంటి, హీరోయిన్ ని చంపేశాడా?’ అనుకుంటాడు ప్రేక్షకుడు. కానీ, నెమ్మదిగా విలన్ పడిపోతాడు. అతడి వెనుక పొగలు కక్కుతున్న తుపాకీ పట్టుకుని హీరో కనిపిస్తాడు.

హీరో ఆమెకు దగ్గరగా వచ్చి ప్రేమ కళ్ళలో ఉట్టిపడుతూండగా దృష్టి ఆమెపై నిలిపి పాడుతూంటాడు. ఆమె అతడి ఉత్తరం చదువుతూ ఆనందిస్తూంటుంది. అతడు ఆమె ఊహలో జీవం పోసుకుని కనిపిస్తున్నాడు. ఉత్తరంలో కనిపిస్తూ పాడే రోజులు పోయి, ఉత్తరం బయటకు వచ్చి పాడే రోజులు వచ్చేశాయన్నమాట.

ఇక్కడి నుంచీ ప్రతి ఒక్క పదం, భావం క్లోజ్ అప్ లతో అలరిస్తూ, మనల్ని ఒక సున్నితమైన శృంగార రసప్రపంచానికి తీసుకుపోతాయి. శృంగార సముద్రపుటలల శృంగాలపై తేలియాడింపచేస్తాయి.

ఇలా నాయకుడు ఊహాలోకంలో పాడుతూ కనిపించేందుకు దర్శకుడు ఆరంభంనుంచీ ప్రేక్షకుడిని మానసికంగా సిద్ధం చేస్తున్నాడు. ఆ తరువాత ఎన్నో సుందరమైన ఫ్రేమ్ లలో పాటను చిత్రీకరిస్తాడు. ఇక్కడినుంచీ ప్రేక్షకుడు పాటను చూస్తూ అనందిస్తూనే, నాయకుడు ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపిస్తాడోనని ఎదురుచూస్తూంటాడు. ఆనందిస్తాడు.

చెట్టు దగ్గర కూచుంటే, చెట్టు చాటునుంచి వచ్చి ముఖంలోకి చూస్తూ పాడుతూంటే, పక్కన మనిషేలేనట్టు నటించటం కష్టం. ఆమె ఉత్తరం చదువుతూ నడుస్తూంటే దారిలో అడ్డుగా నిలబడినవాడిని లేనట్టే చదువుతూ వెళ్ళటమూ కష్టమే. అందుకే, ఈ పాట చూడటం ఒక అద్భుతమైన అనుభవం. పాటలోని సున్నితమైన భావనలు హృదయాలను గిలిగింతలు పెడతాయి. స్పందింప చేస్తాయి.

కల్ తుఝ్ కో దేఖా థా, మైనె అప్నే ఆంగన్ మే
జైసే కహె రహీహో తుమ్ ముఝె బాంధ్‌లో బంధన్ మే..

చక్కని భావం. ప్రేమికుల మనోభావననల చక్కని ప్రదర్శన.

తుమ్ సోచోగీ క్యూం ఇత్నా, మై తుమ్సే ప్యార్ కరూన్,  తుమ్ సంఝోగీ దీవానా
మై భీ ఎక్‍రార్ కరూఁ
దీవానోఁ కీ యే బాతే దీవానే జాన్తే హై
జల్నే మే క్యా మజా హై పర్వానే జాన్తే హై
తుమ్ యూహీ జలాకర్ రహెనా, ఆ ఆకర్ ఖ్వాబోం మే..

ఇప్పుడు ఉత్తరాల అవసరం తీరింది. ఎదురుచూపులు, దూరాభారాల సమస్యలు లేకుండా వాట్స్ ఆప్‌లు, వీడియో కాల్‍లూ వచ్చేశాయి. ఇప్పటి తరానికి బహుశా, ఉత్తరాలు రాసుకోవటంలోని ఆనందం, ఉత్తరం కోసం ఎదురుచూపులలోని తీయని వేదన, ఉత్తరం చదివిన తరువాత ఎన్నిసార్లు చదివినా తనివి తీరని ఆనందం, అప్పుడే అయిపోయిందా ఉత్తరం అన్న బాధలు ఇప్పటి తరానికి తెలియవు. పెన్ ఫ్రెండ్‌షిప్ అన్న ఆలోచన ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ప్రేమలుగా రూపాంతరం చెందాయి. అయినా సరే, ఇప్పటికీ ఉత్తరాల పాటలు అలరిస్తాయి. ఆనందింప చేస్తాయి. అలా ఆనందింపచేసే పాటల్లో అత్యద్భుతమయిన చిత్రీకరణ ద్వారా అలరించే పాట ‘పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రహెతీ హో’.

(‘పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రహెతీ హో’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=viKdF7sp_cY)

(మళ్ళీ కలుద్దాం).

Exit mobile version