Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-36

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలినెను మది
యమహానగరి కలకత్తాపురి

కొన్ని పాటలుంటాయి, పాట పూర్తిగా వినక ముందే ఆరంభం ‘నోట్’ వినగానే నచ్చేస్తుంది. ‘ఇది సూపర్ హిట్ పాట’ అని అనిపిస్తుంది. అలాంటి పాటల్లో ఒకటి ‘యమహా నగరి’ పాట. ‘చూడాలని ఉంది’ సినిమా ఆరంభంలోనే వస్తుందీ పాట. సాధారణంగా సినిమా ఆరంభంలో వచ్చే పాటలు పాత్రల వ్యక్తిత్వ పరిచయ గీతాలయి ఉంటాయి. లేదా, కథను ముందుకు జరిపే గీతాలయి ఉంటాయి, కథ గురించి కాస్త చెప్పి. కానీ ఈ పాట అలాంటిది కాదు. సినిమా ఆరంభం కలకత్తాలో అవుతుంది. హీరో కలకత్తాకు వస్తాడు. ఉండటానికి ఇల్లు కావాలి. కానీ అడగటానికి భాష రాదు. అప్పుడు దారి పక్కన కూర్చుని గిటార్ తంత్రులను మీటుతాడు. పాట అందుకుంటాడు.

ఈ పాట రాసింది వేటూరి. పాడింది హరిహరన్. సంగీతం మణిశర్మ. ఈ ముగ్గురూ కలిసి ఒక అత్యంత సుందరము, ఆకర్షణీయమైన పాటను రూపొందించారు. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతాన్ని, పాశ్చాత్య సంగీతంతో మిళితం చేసి రూపొందించటం, ఆ పాటకు లేని చోట సైతం రాగాలు తీసి శాస్త్రీయం చేసే హరిహరన్‍తో పాడించటం బంగారానికి తావి అబ్బింది. ఇదంతా ఒక ఎత్తు, పాట చిత్రీకరణ ఒక ఎత్తు.

అది చిరంజీవి ఉచ్చదశలో ఉన్న కాలం. పట్టిందల్లా బంగారమయ్యే కాలం. అదీగాక, అప్పటికే ఒక ఇమేజ్ ఉన్నా, చక్కని కథా చిత్రాలలో నటిస్తున్న కాలం. అందుకే చిరంజీవి screen presence ఓ స్థాయిలో ఉంటుంది. ఉత్తమ స్థాయి కెమేరా పనితనంతో దృశ్యాలు శుభ్రంగా, అందంగా, చక్కటి రంగులతో అలరిస్తాయి.

మన సినిమాలలో నగరాలను వర్ణించే పాటలదొక కేటగిరీ. ఈ పాటలు ప్రధాన నగరాలను, వాటి గొప్పతనం, ప్రాధాన్యం వంటి వాటిని వివరిస్తాయి. ఈ పాటల వల్ల ప్రయోజనం ఏమిటంటే, పాటల ద్వారా ఆయా నగరాల్లో దర్శనీయ స్థలాలు, నగరాల చరిత్రలు మనకు గుర్తుంటాయి.

ఎమ్మెల్లే’ అనే పాత సినిమాలో ‘ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం’ అన్న పాటలో భాగ్యనగరం చరిత్ర తెలుస్తుంది.

అలనాడు వచ్చెనట మహంమారి
అల్లా దయ వల్ల ఆ పీడ పోయింది
ఆ గండం తప్పిందని గుర్తు నిలిపినారు
ఆ గుర్తే అందమైన చార్మినారు.

ఇది చార్మినార్ చరిత్ర చెప్తుంది.

ఇది పాడు పడిన గోలుకొండ కోట
శ్రీరాముడు కనుపించే తానీషాదీ తోట
భద్రాద్రి రామదాసు బందిఖానా
చూడండి ఇదిగో కోటలోనా..

ఇలాంటి పాటల వల్ల మనకు ఆయా స్థలాల చరిత్ర తెలుస్తుంది. గుర్తుండిపోతుంది.

(‘ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం’ పాటని యూట్యూబ్‍లో వినవచ్చు:
https://www.youtube.com/watch?v=uIPSj3-oE_k )

కోడె నాగు’ సినిమాలోని  ‘ఇదే చంద్రగిరి శౌర్యానికి గీచిన గిరి’ పాట కూడా ఈ కోవకు చెందుతుంది.

తిరుమల శ్రీవెంకటేశ చిర దర్శన వాంఛతో
ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము

ఈ పాట వల్ల చంద్రగిరి కోటను ఇమ్మడి నరసింహుడు నిర్మించాడని తెలుస్తుంది. మామూలుగా చరిత్ర పుస్తకాలలో ఎంత చదివినా గుర్తుండనిది పాటలో వినగానే గుర్తుంటుంది.

ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు
రాజనీతి రాటు దేలి రాయల గురువైనాడు

చంద్రగిరిలోనే తిమ్మరుసు పుట్టాడని తెలియటం మాత్రమే కాదు, గుర్తుండి పోతుంది.

(‘ఇదే చంద్రగిరి శౌర్యానికి గీచిన గిరి’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=Ih5rtkPmvxk )

శిలలపై శిల్పాలు చెక్కినారు’, ‘మహాబలిపురం భారతీయ కళాజగతికి గొప్ప గోపురం’ వంటి పాటలు కూడా చరిత్రను చెప్తాయి. ‘యమహా నగరి’ కూడా ఈ జాబితాలోనే చేరుతుంది. కలకత్తా నగరం గొప్పతనాన్ని అక్కడి వెలసిన సంస్కృతి సంప్రదాయాలను, మహాపురుషులను ప్రస్తావిస్తుంది పాట. ఇలాంటి పాటల చిత్రీకరణలో పాటలో ఏ విషయం  ప్రసక్తి వస్తే ఆ విషయాన్ని   పలు కోణాల్లో చూపిస్తే సరిపోతుంది.

కానీ ‘చూడాలని ఉంది’ సినిమా వచ్చే సమయానికి కాలం మారింది. సినిమా రూపు మారింది. హీరో ఇమేజ్ సినిమాను డామినేట్ చేయటం మొదలయింది. కాబట్టి చారిత్రిక కట్టడాలను, పర్యాటక స్థలాలను చూపిస్తూ హీరోనూ వాటి కన్నా ఎక్కువగా చూపించాల్సి ఉంటుంది. గతంలో హీరో ఎంత గొప్పవాడయినా పర్యాటక స్థలానికే ప్రాధాన్యం.

శిలలపై శిల్పాలు’ పాటలో అవసరమైనప్పుడు కట్టడాలను పెద్దగా, నాయికా నాయకులను లాంగ్ షాట్‌లో చిన్నగా చూపించారు. పాట పాడేది హీరో అయినా దృశ్యానికే ప్రాధాన్యం. ‘ఇదే చంద్రగిరి’ లోనూ అదే పరిస్థితి. కానీ ‘యమహా నగరి’లో చారిత్రిక కట్టడాల కన్నా చిరంజీవికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం కనిపిస్తుంది. అది కూడా పాట మరింతగా అలరించటానికి ఒక కారణం.

ఆరంభంలోని గిటార్ తంత్రులు మ్రోగటం తోటే పాట నచ్చేస్తుంది. మనసు దోచుకుటుందీ స్వరం. ఇక

సరిమాగరి సససనిదపపా
రిదానిదాప సాసనిదప మదపమరి

ఈ దృశ్యం తెరపై చిరంజీవి ఒక వైపు నుంచి క్లోజప్పులో చూపిస్తారు. తానే పాడుతున్నట్టు నటిస్తూ, ‘సససనిదపసా’ దగ్గరకు వచ్చే సరికి కళ్లు మూసుకుంటాడు తన్మయత్వం ప్రదర్శిస్తూ. చాలు పాట నచ్చేయటానికి ఆరంభం కాకముందే ఆకట్టుకుంటుంది పాట.

మళ్లీ ఇదే రిపీట్ చేసేసరికి అడవిలో లాంగ్ షాట్‌లో నించుని గిటార్ వాయిస్తూ కనిపిస్తాడు చిరంజీవి. ఒక చక్కని ‘ఫోటోగ్రాఫ్’ లాగా ఉంటుందీ దృశ్యం. ‘రిమదని’ అనేటప్పుడు నడుస్తూ చెట్ల మధ్యలోంచి వెళ్తుంటాడు. ఇది కూడా చక్కగా ఫ్రేమ్ చేశారు. ఇప్పటికీ పాట నచ్చేస్తుంది. అంటే ‘యమహా నగరి’ అని పాట ఆరంభించేలోగా మనసు దోచేస్తుందన్న మాట.

పోల్చటం కూడదు కానీ ‘పరదేశ్’ సినిమాలో ‘దో దిల్ మిల్ రహే హై’ అనే ఒక అద్భుతమైన పాట ఉంది. ఆ పాటలో ‘షారూఖ్ ఖాన్’ నటన ఎంత హస్యాస్పదంగా ఉంటుందో, ఈ పాటలో చిరంజీవి నటన అంత ఔచిత్యంగా ఉంటుంది. ‘చూడాలని ఉంది’ – ‘పర్‌దేశ్’ విడుదలైన తరువాత విడుదలయింది. ఆ పాట ప్రభావం సంగీత దర్శకుడిపై ఉందో, లేదో తెలియదు కానీ ‘గిటార్’ పట్టుకోవటం, నటనలను  చూస్తే పోల్చకుండా  ఉండలేము. చిరంజీవి వదనంలోని నిర్మలత్వం, తన్మయత్వం ‘షాహరుఖ్’లో కనబడదు.

(‘దో దిల్ మిల్ రహే హై’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=P_KMLTRyRQM )

‘యమహా నగరి’ అని పాట ఆరంభమవటానికి ముందు, కుప్పలాగా పడి ఉన్న ఆకులను కాలితో తన్నటం, క్లోజప్పులో చూపుతారు. వెంటనే లాంగ్ షాట్‌లో కూర్చుని గిటార్ వాయిస్తున్న చిరంజీవి పాట ఆరంభిస్తాడు. అద్భుతం అనిపిస్తుంది. హరిహరన్ స్వరంలో ఇది ఒక శాస్త్రీయ సంగీత ఆధారిత కీర్తన అనిపిస్తుంది.

తరువాత దృశ్యంలో చిరంజీవి ఓ మూల ఉంటే హుగ్లీ నది పైని హౌరా బ్రిడ్జ్ తీరమంతా కనిపిస్తుంది. ఇప్పటికే పాట అలరిస్తుంది. ఈ పాటలో హౌరా బ్రిడ్జి, హుగ్లీ నది, ప్రిన్సెస్ ఘాట్, దక్షిణేశ్వర కాళీ మందిరం, చౌరంఘీ లేన్, చోటెలాల్ ఘాట్, సెయింట్ జాన్ చర్చి, విక్టోరియా మెమోరియల్ వంటి స్థలాలను సందర్భోచితంగా అందంగా చూపిస్తారు. పాట రాసిన వేటూరి కలకత్తా ‘ఆత్మ’ ను పట్టుకున్నాడు.

నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే
ఆనందుడు చూసిన బాట, సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం
కదలిపోరా, ఒకరితో ఒకరిని, ముఖ పరిచయములు దొరకని క్షణాముల
బిజిబిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో

‘అద్భుతం’ అనిపిస్తుంది పాట వింటుంటే. కనబడే దృశ్యాలు, చిరంజీవి నటన ఒక ఎత్తైతే పాటలో పదాలు తమదైన ప్రత్యేక చైతన్యాన్ని సంతరించుకునే రీతిలో ఉపయోగించాడు వేటూరి. శతకోటి ప్రణామాలు కూడా తక్కువే అనిపిస్తాయి. పైగా, ఎక్కడా పదాడంబరం లేదు. అన్నీ మామూలుగా వాడే పదాలే. ‘బిజిబిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో, ముఖ పరిచయం దొరకని క్షణాలు..’ ఒక బిజీ నగరాన్ని కళ్ల ముందు నిలిపాడు. ‘గీతాంజలి పూసిన చోట’ అత్యద్భుతమైన ప్రయోగం. ‘హంస’ అంటే రామకృష్ణ పరమహంస, ‘ఆనందుడు’ అంటే వివేకానందుడు. వివేకానందుడు ‘యతిగీతి’ అనే గీతం రాశాడు. అందుకే ‘హంస పాడిన పాట’ అన్నాడు. ఎంత లోతైన అవగాహన ఉంటే ఒక్కముక్కలో అంత లోతైన భావం దట్టించగలడు. మళ్లీ శతకోటి కోటి సహస్ర ప్రణామాలు కూడా తక్కువే.

చరణాల మధ్యలో చిరంజీవి ఇమేజీ నృత్యాలు మైకేల్ జాక్సన్ స్థాయిలో లేకున్నా అతడిని తలపుకు తెస్తాయి. పాట బాణీకి తగ్గట్టు ‘బిజీ నగరం’ అన్నప్పుడు వాహనాల రష్ వేగంగా చూపంచటం బాగనిపిస్తుంది.

రెండవ చరణంలో ‘రోజంతా సూర్యుని క్రింద, రాత్రంతా రజనీగంధ సాగనీ’  మధుర భావనను కలిగిస్తుంది. దృశ్యాలు కూడా ఔచిత్యంగా ఉంటాయి.

శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట, కళలకు కొలువట
తిథులకు సెలవట, అతిథుల గొడవట
కలకట నగరపు కిటకిటలో..

అబ్బబ్బ.. ‘కలకట నగరపు కిటకిట’. అసలు వేటూరికి తగినంత గుర్తింపును మనం ఇవ్వటం లేదనిపిస్తుంది. వేటూరి పాటలు వింటుంటే హిందీ గేయ రచయిత ‘మజ్రూహ్ సుల్తాన్‌పురి’ గుర్తుకు వస్తాడు. వేటూరి లాగానే అల్లరి చిల్లరి పాటలు రాశాడు. అవకాశం ఉన్నప్పుడు అద్భుతమైన భావగీతాలు రాశాడు. అవసరం ఉన్నప్పుడు లోతైన తాత్విక గీతాలు రాశాడు ఆయన. దాదాసాహెబ్ అవార్డు వచ్చిన ఏకైక సినీగేయ రచయిత (గుల్జార్‌కు కూడా దాదాసాహెబ్ అవార్డు వచ్చింది కానీ ఆయన దర్శకుడు, సంభాషణ రచయిత, గేయ రచయిత). వేటూరికి అంత గౌరవం మనం ఇవ్వటం లేదు. మళ్లీ చివరి చరణంలో వందేమాతరం, కాళి, సత్యజిత్ రే, ఎస్డీ బర్మన్, థెరీసా లను స్మరిస్తూ మరింత పదాలతో ఆడుకున్న విధానం ఒక్క వేటూరికే సాధ్యం.

జనగణమనముల స్వరపద వనముల హృదయపు లయలను
శ్రుతి పరచిన ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో..

ఎక్కడా ఒక్క కఠిన పదం లేదు. కానీ అద్భుతమైన భావం. గ్రాంథిక పదాలను వాడటంలో గొప్ప లేదు. సామాన్య పదాలతో అసామాన్యమైన భావాన్ని అనన్య సామాన్యంగా ప్రదర్శించగల శక్తి ప్రదర్శించిన  సినీగేయ రచయిత వేటూరి. ఒక్కో పాటలో వాడిన ఒక్కొక్క పదానికి ఒక్కొక్క లక్ష ప్రణామాలు అర్పించినా సరిపోదు.

ఒక వంక ఆకర్షణీయమైన బాణీ, మరో వైపు చిరంజీవి ఆకర్షణ, ఇంకో వైపు, హరిహరన్ అద్భుతమైన గానం, మరో వైపు అందమైన దృశ్యాలు. వీటన్నిటిలో ఇమిడిపోయి కూడా తనదైన ప్రత్యేకతను నిలుపుకునే రీతిలో గేయ రచన చేయటం మాములు విషయం కాదు. అలాంటి అసాధారణమైన విషయాన్ని సాధారణం చేసిన గేయ రచయిత వేటూరి. వీరువురి సమష్టి సృజనాత్మక ప్రదర్శన అద్భుతమైన ఈ పాట. తెరపైనే కాదు, మాములుగా వింటున్నా అలరిస్తుందీ పాట.

ఇటీవలి కాలంలో ఇలాంటి పర్యాటక పాటలు అదృశ్యమైపోయాయి. ఒకప్పుడు ప్రయాణం ఇప్పటి అంత సులభం కాదు కాబట్టి ఇలాంటి పాటల ఆవశ్యకత ఉండేది. చరిత్ర తెలిసేది. సంస్కృతి సంప్రదాయాలు తెలిసేవి. కానీ ఇప్పుడు ప్రయాణం సలభం అవటంతో, చరిత్రపై దృష్టి తగ్గటంతో (చరిత్ర పై మరో రకమైన దృష్టి పెరిగింది) ఇప్పుడు విదేశీ దృశ్యాలు మన సినిమాల్లో అధికమౌతున్నాయి. మన వారు విదేశాలకు వెళ్లటం పెరిగిందిప్పుడు. దాంతో స్వదేశీ దృశ్యాలపై మోజు తగ్గింది.  ‘మగధీర’ సినిమాలో ‘పంచదార బొమ్మా’ పాటలో గోల్కొండ కోటని అందంగా చూపారు కానీ పాట అంతా ‘ప్రేమాలాపన’ తప్ప ‘గోల్కొండ’ గురించేమీ లేదు. అందుకే చిరంజీవి పాట ‘యమహా నగరి’ one of a kind పాటగా మిగిలిపోతుంది.

(‘యమహా నగరి కలకత్తా పురి’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=q2mt5XNgFVE )

(మళ్ళీ కలుద్దాం).

Exit mobile version